53  - శ్రీకృష్ణుడు రుక్మిణిని రక్షించుట

శ్రీశుక ఉవాచ

వైదర్బ్యాస్స తు సందేశం నిశమ్య యదునందనః

ప్రగృహ్య పాణినా పాణిం ప్రహసన్నిదమబ్రవీత్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- యాదవవంశనందనుడగు ఆ శ్రీకృష్ణుడు విదర్భరాజకుమారియగు రుక్మిణియొక్క సందేశమును విని నవ్వెను. ఆయన ఆ బ్రాహ్మణుని చేతిని చేతితో పట్టుకొని ఇట్లనెను.  

శ్రీభగవానువాచ

తథాహమపి తచ్చితో నిద్రాం చ న లభే నిశి

వేదాహం రుక్మిణా ద్వేషాన్మమోద్వాహో నివారితః

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఆమెకు వలేనే నాకు కూడా ఆమెయందే మనస్సు లగ్నమై రాత్రి నిద్ర కూడ పట్టుట లేదు. రుక్మినాయందలి ద్వేషము వలన రుక్మిణికి నాతో వివాహము కాకుండా అడ్డు పడినాడని నాకు తెలుసు.

తామానయిష్య ఉన్మథ్య రాజన్యాపసదాన్ మృధే

మత్పరామనవద్యాంగీ మేధసోఽగ్నిశిఖామివ

శిశుపాలాదులు క్షత్రియాధములు. వారిని యుద్ధములో పరాభవించి గొప్ప సుందరియగు ఆ రుక్మిణిని, కట్టెనుండి అగ్నిజ్వాలను వలె, తీసుకు వచ్చెదను. ఆమె నన్నే శరణు వేడినది.

శ్రీశుక ఉవాచ

ఉద్వాహర్క్షం చ విజ్ఞాయ రుక్మిణ్యా మధుసూదనః

రథస్సంయుజ్యతామాశు దారు కేత్యాహ సారథిమ్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- మధువును సంహరించిన శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణి యొక్క వివాహ నక్షత్రము (రెండు రోజుల పిదప) ను గురించి తెలుసుకొని, ఓ దారుకా! వెంటనే రథమును సిద్దము చేయుము, అని సారథితో పలికెను.

స చాశ్వై శ్శైవ్యసుగ్రీవమేఘపుష్పబలాహ కైః

యుక్తం రథముపానీయ తస్థౌ ప్రాంజలిరగ్రతః

శైవ్య సుగ్రీవ మేఘపుష్ప బలాహకములనే గుర్రములతో పూన్చిన రథమును ఆ సారథి దగ్గరగా తెచ్చి, దోసిలి యొగ్గి ఎదుట నిలబడెను.

ఆరుహ్య స్యందనం శౌరిర్ద్విజమారోప్య తూర్జ గైః

ఆనర్తాదేకరాత్రేణ విదర్భానగమద్ధయైః

శూరపుత్రుడగు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుని రథమెక్కించి తాను ఎక్కెను. వేగముగా నడిచే గుర్రములు లాగగా వారా రథముపై ఒక్క రాత్రి గడచు సరికి ఆనర్త దేశమునుండి విదర్భదేశమును చేరుకొనిరి.

రాజా స కుండినపతిః పుత్ర స్నేహవశం గతః

 శిశుపాలాయ స్వాం కన్యాం దాస్యన్ కర్మాణ్యకారయత్

కుండినపురమునకు ప్రభువగు ఆ భీష్మక మహారాజు పుత్రునియందలి ప్రేమచే పరవశుడాయెను. ఆయన తన కుమార్తెయగు రుక్మిణిని శిశుపాలునకు ఇచ్చి వివాహము చేయబోవువాడై, ఏర్పాట్లను చేయించెను.

పురం సమృష్టసంసిక్తమార్గరథ్యాచతుష్పథమ్

చిత్రధ్వజపతాకాభిస్తోరడైస్సమలంకృతమ్

ఆ నగరములోని దారులు, రాజమార్గములు, కూడళ్లను తుడిచి నీళ్లను చల్లిరి. నగరమును రంగు రంగుల టెక్కెములతో, పతాకలతో, తోరణములతో బాగుగా అలంకరించిరి.

స్రగ్గంధమాల్యాభర జైర్విరజోకంబరభూషితైః

జుష్టం స్త్రీపురుషైశ్రీమద్గృహెరగురుధూపితైః

ఆ నగరమునందలి స్త్రీలు, పురుషులు పుష్పమాలలను, పూలను, సుగంధద్రవ్యములను, ఆభరణములను కలిగియుండిరి. అచటి గృహములు సంపన్నములై అగరు ధూపమును కలిగియుండెను.

పితృన్ దేవాన్ సమభ్యర్చ్య విప్రాంశ్చ విధివన్నృప

భోజయిత్వా యథాన్యాయం వాచయామాస మంగలమ్

ఆయన పితృదేవతలను, దేవతలను చక్కగా యథావిధిగా పూజించి, వేదవేత్తలను భుజింపజేసి, నియమానుసారముగా పుణ్యాహవాచనమును చేయించెను.

సుస్నాతాం సుదతీం కన్యాం కృతకౌతుకమంగలామ్

అహతాంశుకయుగ్మేన భూషితాం భూషణోత్తమైః

అందమైన పలువరుసలు గల రుక్మిణీ చక్కగా స్నానము చేసెను. ఆ కన్య చేతులకు మంగళము కొరకై రక్షలను కట్టిరి. ఆమెను కొత్త వస్త్రముల జంటతో, గొప్ప ఆభరణములతో అలంకరించిరి.

చక్రుస్సామర్గ్యజుర్మంతైర్వధ్వా రక్షాం ద్విజోత్తమాః

పురోహితోఽథర్వవిద్వై జుహావ గ్రహశాంతయే

బ్రాహ్మణోత్తములు పెళ్లికూతురునకు ఋగ్వేద యజుర్వేద సామవేదమంత్రములతో రక్షను కట్టిరి. అథర్వవేదపండితుడైన పురోహితుడు గ్రహముల శాంతి కొరకు హోమమును చేసెను.

 హిరణ్యరూప్యవాసాంసి తిలాంశ్చ గుడమిశ్రితాన్

ప్రాదాద్ధేనూశ్చ విప్రేభ్యో రాజా విధివిధాం వరః

దానవిధి తెలిసిన వారిలో శ్రేష్ఠుడగు ఆ రాజు వేదవేత్తలకు బంగారము, వెండి, వస్త్రములు, బెల్లము కలిపిన నువ్వులు, పాలిచ్చే ఆవులు అనువాటిని దానము చేసెను.

ఏవం చేదిపతీ రాజా దమ ఘోషస్సుతాయ వై

కారయామాస మంత్రజ్ఞైస్సర్వమభ్యుదయోచితమ్

ఇదే విధముగా చేదిదేశప్రభుడగు దమ ఘోష మహారాజు కూడ తన పుత్రుడగు శిశుపాలుని కొరకు వివాహమునకు యోగ్యమైన (నాందీశ్రాద్ధాది) మంగళకర్మలనన్నింటినీ మంత్రవేత్తలచే చేయించెను.

మదచ్యుద్భిర్గజానీకైస్స్యందనైర్హేమమాలిభిః

పత్త్యశ్వసంకులైసెన్యైః పరీతః కుండినం యయౌ

మదమును స్రవించే ఏనుగులు, బంగరు మాలలు గల రథములు, పదాతులు, గుర్రములు అనువాటిచే వ్యాపించబడిన సైన్యములు చుట్లువారి రాగా ఆయన కుండిననగరమునకు పయనమయ్యెను.

తం వై విదర్బాధిపతిస్సమభ్యేత్యాభిపూజ్య చ

నివేశయామాస ముదా కల్పితాన్యనివేశనే

విదర్భరాజగు భీష్మకుడైతే ఆ దమ ఘోషునకు ఎదు రేగి ఆనందముతో సమ్మానించి, ముందే ఏర్పాటు చేసిన మహలులో విడిది చేయించెను.

తత్ర శాల్వో జరాసంధో దంతవక్త్రో విదూరథః

ఆజగ్ముశ్చైద్యపక్షీయాః పౌండ్రకార్యాస్సహస్రశః

కృష్ణ రామద్విషో యత్తాః కన్యాం చైద్యాయ సాధితుమ్

శాల్వుడు, జరాసంధుడు, దంతవక్తూడు, విదూరథుడు, పౌండ్రకుడు మొదలుగా గల వేలాది మంది చేదిదేశనాయకుడగు శిశుపాలుని పక్షమునకు చెందినవారు. వారు శ్రీకృష్ణ బలరాములను ద్వేషింతురు. వారందరు పెళ్లి కూతురగు రుక్మిణీకి శిశుపాలునితో వివాహమును సాధించుటకై యుద్ధమునకు సన్నద్ధులై ఆ కుండిననగరమునకు వచ్చిరి.

యద్యాగత్య హరేత్కృష్ణో రామాద్యైర్యదుభిర్వృతః

యోత్స్యామ్సంహతాస్తేన ఇతి నిశ్చితమానసొః

ఆజగ్మురూభుజస్సర్వే సమగ్రబలవాహనాః

ఒకచో శ్రీకృష్ణుడు బలరాముడు-సాత్యకి మొదలైన యాదవులతో కూడి వచ్చి రుక్మిణిని కొనిపోయే పక్షములో, ఒక్కటిగా అయి ఆయనతో యుద్ధము చేసెదము, అని ఆ రాజులందరు మనస్సులో నిశ్చయించు కొనిరి. వారు సంపూర్ణ మైన సైన్యముతో, వాహనములతో విచ్చేసిరి.

శ్రుత్వైతద్భగవాన్ రామో విపక్షీయనృపోద్యమమ్

కృష్ణం వైకం గతం హర్తుం కన్యాం కలహశంకితః

శత్రుపక్షీయులగు రాజుల ఈ సైన్యసన్నాహమును గురించి, శ్రీకృష్ణుడు పెళ్లికూతురును కొనిపోవుటకై ఒంటరిగా వెళ్లుటను గురించి విని, బలరామ భగవానునకు యుద్ధము వచ్చుననే శంక కలిగెను.

బలేన మహతా సార్ధం భ్రాతృస్నేహపరిప్లుతః

త్వరితః కుండినం ప్రాగాద్గజాశ్వరథపత్తిభిః

తమ్మునియందలి ప్రేమ బలరాముని ముంచెత్తెను. ఆయన ఏనుగులు, గుర్రములు, రథములు, పదాతులు గల పెద్ద సైన్యము తోడు రాగా వేగముగా కుండిన నగరమును చేరెను.

భీష్మకన్యా వరారోహా కాంక్షంత్యాగమనం హరేః

ప్రత్యాపత్తిమపశ్యంతీ ద్విజస్యాచింతయత్తదా

భీష్మకుని కుమార్తెయగు రుక్మిణి సుందరి. ఆమె శ్రీకృష్ణుని రాకను కోరుచుండెను. తాను పంపిన బ్రాహ్మణుడు ఇంకనూ తిరిగి రాలేదు. అప్పుడామె ఇట్లు తలపో సెను.

అహో త్రియామాంతరిత ఉద్వాహో మేఽల్పరాధసః

నాగచ్ఛత్యరవిందాన్తో నాహం వేద్మ్యత కారణమ్

సోకపి నావర్తతేకద్యాపి మత్సందేశహరో ద్విజః

అయ్యో! అల్పభాగ్యురాలగు నా వివాహమునకు ఇంక మూడు జాముల వ్యవధి మాత్రమే గలదు. పద్మములవంటి కన్నులు గల శ్రీకృష్ణుడింకనూ రాలేదు. ఆయన రాకుండుటకు కారణము నాకు తెలియదు. నా సందేశమును కొనిపోయిన బ్రాహ్మణుడైననూ ఈ నాటికి కూడ తిరిగి రాలేదు.

అపి మయ్యనవద్యాత్మా దృష్ట్వా కించిజ్జుగుపితమ్

మత్పాణిగ్రహణే నూనం నాయాతి హీ కృతోద్యమః

శ్రీకృష్ణుని మనస్సు నిర్దుష్టమైనది. ఆయన ప్రయత్నమును చేసి నన్ను వివాహమాడుటకై వచ్చుట లేదు. ఆయన నిశ్చయముగా నాలో ఏవగించుకొనదగిన దోష మును దేనినో చూచియుండును.

దుర్బగాయా న మే ధాతా నానుకూలో మహేశ్వరః

దేవీ వా విముఖా గౌరీ రుద్రాణీ గిరిజా సతీ

దురదృష్టవంతురాలనగు నాకు విధాత, మహేశ్వరుడు అనుకూలురు కారా? రుద్రుని పత్ని, పర్వతపుత్రి, సతీదేవి అగు గౌరీదేవి నా యెడల - అప్రసన్నురాలా యేమి?

ఏవం చింతయతీ బాలా గోవిందహృతమానసా

న్యమీలయత కాలజ్ఞా నేత్రే చాశ్రుకలాఽఽకులే

 పెళ్లికూతురగు రుక్మిణియొక్క మనస్సును శ్రీకృష్ణుడు దోచెను. ఆమె ఈ విధముగా తలపోస్తూ ఇంకనూ సమయమున్నదని తెలిసి, కన్నీటితో నిండిన కన్నులను మూసుకొనెను.

ఏవం వధ్వాః ప్రతీక్షంత్యా గోవిందాగమనం నృప

వామ ఊరుర్భుజో నేత్రమస్ఫురన్ ప్రియభాషిణః

ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగ -- పెళ్లికూతురగు రుక్మిణి శ్రీకృష్ణుని రాకకై ఎదురు చూచుచుండగా, ఆమె ఎడమ తొడ, చేయి, కన్ను అదిరి రాబోయే శుభమును సూచించినవి.

అథ కృష్ణవినిర్దిష్టస్స ఏవ ద్వీజసత్తమః

అంతఃపురచరీం దేవీం రాజపుత్రీం దదర్శ హ

తరువాత శ్రీకృష్ణునిచే పంపబడిన ఆ బ్రాహ్మణోత్తముడే అంతఃపురము నందు సంచరిస్తూ ప్రకాశిస్తున్న రాజపుత్రియగు రుక్మిణిని చూచెను.

 సా తం ప్రహృష్టవదనమవ్యగ్రాత్మగతిం సతీ

ఆలక్ష్య లక్షణాభిజ్ఞా సమపృచ్ఛచ్ఛుచిస్మితా

హర్షముతో నిండిన ఆ బ్రాహ్మణుని నడకలో తొట్రుపాటు లేదు. ఆయనను చూచి పుణ్యాత్మురాలగు రుక్మిణి లక్షణములను గుర్తు పట్టెను. ఆమే స్వచ్చమగు చిరునగవుతో ప్రశ్నించెను.

తస్యా ఆవేదయతాప్తం శశంస యదునందనమ్

ఉక్తం చ సత్యవచనమాత్మోపనయనం ప్రతి

యదునందనుడగు శ్రీకృష్ణుడు వచ్చినాడనియు, ఆయన రుక్మిణిని తీసుకువెళ్లేదనని చెప్పిన యథార్థమగు వచనమును కూడ ఆ బ్రాహ్మణుడు రుక్మిణికి విన్నవించి, శ్రీకృష్ణుని స్తుతించెను.

తమాగతం సమాజ్ఞాయ వైదర్బీ హృష్టమానసా

న పశ్యంతీ బ్రాహ్మణాయ ప్రియమన్యన్ననామ సా

శ్రీకృష్ణుడు వచ్చేడని తెలిసి విదర్భరాజపుత్రి మహానందమును పొందెను. ఆ బ్రాహ్మణునకు ఇష్ట మైన మరొకదానిని దేనిని ఈయవలెనో తెలియక ఆమె ఆయనకు నమస్కరించెను.

ప్రాప్తౌ శ్రుత్వా స్వదుహితురుద్వాహ ప్రేక్షజోత్సుకౌ

అభ్యయాత్తూర్యఘో షేణ రామకృష్ణా సమర్హణైః

బలరామ శ్రీకృష్ణులు తన కుమార్తెయొక్క వివాహమును చూడాలనే ఉత్సాహముతో వచ్చినారని విని, భీష్మక మహారాజు ఉపహారములను తీసుకొని వాద్యముల ధ్వనితో వారికి యెదు రేగెను.

మధుపర్కముపానీయ వాసాంసి విరజాంసి సః

ఉపాయనాన్యభీష్టాని వీధివత్సమపూజయత్

ఆయన మధురద్రవ్యములను, నిర్మలమైన వస్త్రములను, అభీష్టము లైన ఉపహారములను తీసుకువచ్చి యథావిధిగా చక్కగా పూజించేను.

తయోర్నివేశనం శ్రీమదుపకల్ప్య మహామతిః

ససైన్యయోస్సానుగయోరాతిథ్యం విదధే యథా

గొప్ప బుద్ధిశాలియగు ఆ భీష్మకుడు వారిద్దరికి, వారి సైన్యమునకు, వారి అనుచరులకు శోభాయుక్త మైన నివాసమునేర్పాటు చేసి యథావిధిగా అతిథిమర్యాదలను చేసెను.

ఏవం రాజ్ఞాం సమేతానాం యథావీర్యం యథావయః

యథాబలం యథావిత్తం సర్వైః కామైసమర్హయత్

ఆయన ఈ విధముగా సమావేశమైన రాజులకు వారి వారి పరాక్రమము, వయస్సు, సైన్యము, సంపదలకు తగ్గట్లుగా సకలములైన భోగ్యములతో గొప్ప మర్యాద చేసెను.

కృష్ణ మాగతమాకర్ణ్య విదర్భపురవాసినః

ఆగత్య నేత్రాంజలిభిః పపుస్తన్ముఖపంకజమ్

శ్రీకృష్ణుడు వచ్చినాడని విని కుండిననగరవాసులు వచ్చి ఆయనయొక్క పద్మమువంటి ముఖమును కళ్లతో తనివి తీరా చూచిరి.

అస్యైవ భార్యా భవితుమ్ రుక్మిణ్యర్హతి నాపరా

అసావప్యనవద్యాత్మా భైష్మ్యాస్సముచితః పతిః

ఈయనకు భార్య అగుటకు తగిన యువతి రుక్మిణియే గాని మరియొకరు కాదు. దేహమునందు, మనస్సునందు దోషములు లేని ఈయన కూడ భీష్మకపుత్రికయగు రుక్మిణికి బాగా తగిన భర్త.

కించిత్సుచరితం యన్న సేన తుష్టస్త్రీలోకకృత్

అనుగృహ్ణతు గృహ్ణతు వైదర్భ్యాః పాణిమచ్యుతః

మనమేదైనా కొంచెము పుణ్యకర్మలను చేసి ఉన్నట్లైతే, దానితో ముల్లోకముల సృష్టికర్త ప్రీతి జెంది అనుగ్రహించు గాక! విదర్భరాజపుత్రిని శ్రీకృష్ణ భగవానుడు వివాహమాడు గాక!

ఏవం ప్రేమకలాబద్ధా వదంతి స్మ పురౌకసః

కన్యా చాంతఃపురాతాదాద్భటైర్గుప్తాంబికాఽఽలయమ్

అతిశయించిన ప్రేమ చే కట్టి వేయబడిన కుండినపురజనులు ఈ విధముగా చెప్పుకొనిరి. ఇంతలో రక్షభటులు చుట్టువారి రాగా పెళ్లికూతురు రుక్మిణి అంతఃపురమునుండి దేవి ఆలయమునకు వెళ్లెను.

పద్బ్యాం వినిర్యయా ద్రష్టుం భవాన్యాః పాదపల్లవమ్

సా చానుధ్యాయతీ సమ్యజ్ముకుందచరణాంబుజమ్

ఆ రుక్మిణియైతే మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని పద్మమువంటి పాదమును ఏకాగ్రముగా ధ్యానించుచుండెను. ఆమే చిగురుటాకువంటి గౌరీదేవి పాదమును దర్శించుటకై కాలి నడకన బయటకు వచ్చెను.

యతవాఙ్మాతృభిస్సార్ధం సఖీభిః పరివారితా

గుప్తా రాజభటైశ్శూ రైస్సన్నద్దైరుద్యతాయుదైః

మృదంగశంఖపణవాస్తూర్యభేర్యశ్చ జఘ్నీరే

రుక్మిణి తల్లులతో కూడి చెలికత్తెలు చుట్టువారి రాగా మౌనముగా నడచుచుండెను. శూరులగు రాజభటులు - కవచములను దాల్చి ఆయుధములను సిద్దముగా పట్టుకొని ఆమెను రక్షించు చుండిరి. మద్దెళ్లు, శంఖములు, తప్పెట్లు, వాద్యములు, భేరీలు అనువాటిని మ్రోగించిరి.

 నానోపహారబలిభిర్వారముఖ్యాస్సహస్రశః

సగ్గంధవస్త్రాభరణైర్ద్విజపత్న్యస్వలంకృతాః

గాయంతశ్చ స్తువంతశ్చ గాయకా వాద్యవాదకాః

పరివార్య వధూం జగ్ముస్సూతమాగధవందినః

గొప్ప వారాంగనలు పెద్ద సంఖ్యలో పలు రకముల ఉపహారములతో నైవేద్యములతో నడిచిరి. మాలలు, గంధము, వస్త్రములు, ఆభరణము లతో అలంకరించుకున్న బ్రాహ్మణపత్నులు తోడు నడిచిరి. గాయకులు గానము చేయుచుండగా, సూతులు మాగధులు వందులు స్తోత్ర పాఠములను చేయుచుండిరి. వీరందరు పెళ్లికూతురుని చుట్టువారి వెళ్లిరి.

ఆసాద్య దేవీసదనం ధోతపాదకరాంబుజా

ఉపస్పృశ్య శుచిశ్శాంతా ప్రవి వేశాంబికాకంతీకమ్

ఆమె గౌరీదేవి ఆలయమును చేరి పద్మములవంటి కాళ్లను, చేతులను కడుగుకొని ఆచమనము చేసి శుచి ఆయెను. అపుడామె ఏకాగ్రచిత్తయై జగన్మాత సన్నిధిని ప్రవేశించెను.

తాం వై ప్రవయసో బాలాం విధిజ్ఞా విప్రయోషితః

భవానీం వందయాంచక్రుర్బవపత్నీం భవాన్వితామ్

పెద్ద వయస్సు గల బ్రాహ్మణపత్నులు విధివిధానము తెలిసినవారు. వారు ఆ పెళ్లికూతురుచే శివుని అర్ధాంగియగు గౌరీదేవికి, శివునకు నమస్కారమును చేయించిరి.

నమ స్యే త్వాంబికేఽభీక్ష్ణం స్వసంతానయుతాం శివామ్

భూయాత్పతి ర్మే భగవాన్ కృష్ణస్తదనుమోదతామ్

ఓ జగన్మాతా! గణేశునితో కుమారస్వామితో కూడియున్న నీకు పలుమార్లు నమస్కరించుచున్నాను. నీవు మంగళములనిచ్చెదవు. నాకు శ్రీకృష్ణ భగవానుడు భర్తయగుగాక! నా ఆ కోర్కెను అనుమోదించుము.

అద్భిర్గంధాక్ష తైర్దూపైర్వాసస్స్రఙ్మాల్యభూషణైః

నానోపహారబలిభిః ప్రదీపావలిభిః పృథక్

విప్రస్త్రీయః పతిమతీస్తథా తైస్సమపూజయత్

లవణాపూపతాంబూలకంఠసూత్రఫలేక్షుభిః

జలములు, గంధము, అక్షతలు, ధూపములు, వస్త్రములు, పుష్పమాలలు, రత్నాల మాలలు, అలంకారములు, పలు రకముల ఉపహారములు, నైవేద్యములు, దీపపు వరుసలు అనువాటితో రుక్మిణి భవానీని, శివుని వేర్వేరుగా పూజించెను. అదే విధముగా ఆమె ఆ ద్రవ్యములతో మరియు ఉప్పు, అప్పములు, తాంబూలము, కంఠహారములు, పళ్లు, చెరుకు ముక్కలు అనువాటితో భర్త ఉన్న బ్రాహ్మణస్త్రీలను చక్కగా పూజించెను.

తస్యై స్త్రీయస్తాః ప్రదదు శ్శేషాం యుయుజురాశిషః

 తాభ్యో దేవ్యై నమశ్చక్రే శేషాం చ జగృహే వధూః

ఆ బ్రాహ్మణస్త్రీలు పెళ్లి కూతురికి ప్రసాదమునిచ్చి ఆశీర్వదించిరి. ఆమె వారికి, గౌరీదేవికి నమస్కరించి ప్రసాదమును స్వీకరించెను.

మునివ్రతమథ త్యక్త్వా నిశ్చక్రామాంబికాగృహాత్

 ప్రగృహ్య పాణినా భృత్యాం రత్నముద్రోపశోభినా

తరువాత ఆమె మౌనవ్రతమును విడిచి రత్నాంగుళీయకముతో శోభిల్లే చేతితో పరిచారికను పట్టుకొని గౌరి ఆలయమునుండి బయటకు వచ్చెను.

తాం దేవమాయామివ వీరమోహినీం

సుమధ్యమాం కుండలమండితాననామ్

 శ్యామాం నితంబార్పితరత్నమేఖలాం

వ్యంజత్స్తనీం కుంతలశంకితేక్షణామ్

శుచిస్మితాం బింబఫలాధరద్యుతిశోణాయమానద్విజకుందకుడ్మలామ్

 పదా చలంతీం కలహంసగామినీం శింజత్కలానూపురధామశోభినా

విలోక్య వీరా ముముహుస్సమాగతా

యశస్వినస్తత్కృతహృచ్ఛయార్దితాః

ఆ సుందరి శ్రీహరి మాయవలే వీరులను మోహ పెట్టెను. చక్కని నడుము, కుండలములచే అలంకరించబడిన మోము, నడుమునందు కట్టబడిన రత్నాల మొలనూలు అనువాటితో ఆమె శోభిల్లెను. ఆమె స్తనములు యౌవనమును ప్రకటించుచుండ, చూపులు ముంగురుల కారణముగా చంచలములాయెను. స్వచ్చమగు చిరునగవు గల ఆమె క్రింది పెదవి దొండపండు వలె నుండెను. దాని కాంతిచే మల్లె మొగ్గలవంటి దంతములు ఎర్రనగుచుండెను. ధ్వనిస్తూ ప్రకాశించే అందెల కాంతితో శోభిల్లే పొదములతో ఆమె రాజహంస వలే నడచుచుండగా, అచటకు వచ్చియున్న కీర్తిమంతులగు వీరులు చూచిరి. ఆమెను చూడగానే కలిగిన కామనచే పీడించబడిన ఆ వీరులు మోహమును పొందిరి.

యాం వీక్ష్య తే నృపతయస్తదుదారహాస

వ్రీడాఽవలోకహృత చేతస ఉజ్ఘితాస్త్రాః

 పేతుః క్షితౌ గజరథాశ్వగతా విమూఢా

యాత్రాచ్ఛలేన హరయేఽర్పయతీం స్వశోభామ్

            ఆమె ఉత్సవయాత్ర అనే మిషతో తన సౌందర్యమును శ్రీకృష్ణ భగవానుని కొరకు సమర్పించుచుండెను. రాజుల మనస్సులు ఆమె యొక్క సుఖకరమైన నవ్వుచే, సిగ్గుతో కూడిన చూపులచే దోచివేయబడినవి. ఏనుగులు, గుర్రములు, రథముల పైనున్న ఆ రాజులు ఆమెను చూచి మోహితులై ఆయుధములను విడిచి పెట్టి నేల పై పడిరి.

సెవం శనైశ్చలయతీ చలపద్మకోశౌ

ప్రాప్తిం తదా భగవతః ప్రసమీక్షమాణా

ఉత్సార్య వామకరజైరలకానపాంగైః

ప్రాప్తాన్ ప్రియైక్షత నృపాన్ దదృశేఽచ్యుతం సా

ఆమె ఈ విధముగా పద్మపు మొగ్గలవంటి కాళ్లతో మెల్లగా అడుగులు వేస్తూ శ్రీకృష్ణ భగవానుని రాకకై ఎదురు చూచుచుండెను. ఆమె ఎడమ చేతి గోళ్లతో ముంగురులను సవరిస్తూ సిగ్గుతో కడగంటి చూపులతో, వచ్చి నేలగూలియున్న రాజులను చూచెను. అప్పుడామెకు శ్రీకృష్ణ భగవానుడు కనబడెను.

తాం రాజకన్యాం రథమారురుక్షతీం

 జహార కృష్ణో ద్విషతాం సమీక్షతామ్

రథం సమారోప్య సుపర్ణలక్షణం

రాజన్యచక్రం పరిభూయ మాధవః

ఆ రాజపుత్రి రథము నెక్కబోవుచుండగా లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుడు గరుడుడు ధ్వజమునందు గల రథము పై ఆమెనెక్కించి తీసుకొని వెళ్లాను. ఆయన తనను చూచుచున్న శత్రువులను లెక్క చేయలేదు. ఈ విధముగా ఆయన రాజుల మండలమును తిరస్కరించెను.

 తతో యయౌ రామపురోగమైశ్శ నైస్సృగాలమధ్యాదివ భాగహృద్ధరిః

సింహము తన భాగమును తీసుకొని తోడేళ్ల మధ్యనుండి వెళ్లినట్లుగా, శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు మొదలగువారితో గూడి అక్కడనుండి తాపీగా వెళ్లాను.

తం మానినస్స్వొభిభవం యశఃక్షయం పరే జరాసంధవశాన సేహిరే

 అహో ధిగస్మాన్యశ ఆత్తధన్వనాం గో పైర్హృతం కేసరిణం మృగైరివ

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

ఉత్తరార్ధే త్రిపంచాశత్తమోఽధ్యాయః

             జరాసంధుని చెప్పుచేతలలో ఉంటూ అహంకరించిన శత్రువులకు ఆ రుక్మిణీహరణము పెద్ద పరాభవమయ్యెను. వారికి ఆ అపకీర్తి సహింప రానిదాయెను. . వారు ఇట్లు తలపోసిరి -- అయ్యో! మనకు నింద యగుగాక! ధనుర్ధారులమగు మన కీర్తిని గోపాలకులు, సింహముల కీర్తిని లేళ్లు వలె, అపహరించిరి.

శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో

శ్రీకృష్ణుడు రుక్మిణిని కొనిపోవుటను వర్ణించే

ఏబది మూడవ అధ్యాయము ముగిసినది.