89 - భృగువు త్రిమూర్తులను పరీక్షించుట - శ్రీకృష్ణుడు మరణించిన బ్రాహ్మణ బాలకులను మరల బ్రదికించుట

శ్రీశుక ఉవాచ

సరస్వత్యాస్తటే రాజన్నృషయస్సత్రమాసత

వితర్కస్సమభూత్తేషాం త్రిష్వధీ శేషు కో మహాన్

  శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను - పరీక్షిన్మహారాజా! మహర్షులు సరస్వతీ నదీతీరమునందు సత్రయాగమును చేసిరి. అప్పుడు వారిలో, ముగ్గురు జగన్నాథులలో గొప్పవారు ఎవరు? అనే విషయమై వివాదము కలిగెను.

తస్య జిజ్ఞాసయా తే వై భృగుం బ్రహ్మసుతం నృప

తజ్ జ్ఞప్త్యై ప్రేషయామాసుస్సోఽభ్యగాద్బ్రహ్మణస్సభామ్

ఓ పరీక్షిన్మహారాజా! వారికి ఎవరు గొప్పయో తెలియాలనే కోరిక కలిగెను. వారి మహత్త్వమునరయుటకై వారు బ్రహ్మదేవుని పుత్రుడగు భృగువును పంపించిరి. ఆ భృగువు బ్రహ్మదేవుని సభకు వెళ్ళెను.

న తస్మై ప్రహ్వణం స్తోత్రం చక్రే సత్త్వపరీక్షయా

తస్మై చుక్రోధ భగవాన్ ప్రజ్వలన్ స్వేన తేజసా

బ్రహ్మదేవుని సత్త్వగుణమును పరీక్షించుటకై భృగువు ఆయనకు నమస్కారమును గాని, స్తోత్రమును గాని చేయలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు తన తేజస్సుతో మండి పడుతూ భృగువుపై కోపించెను.

స ఆత్మన్యుత్థితం మన్యుమాత్మజాయాత్మనా ప్రభుః

అశీశమద్యథా వహ్నిం స్వయోన్యా వారిణాఽఽత్మభూః

అగ్నిని అగ్నినుండే పుట్టిన నీటితో చల్లారునట్లు చేయుదురు. అదే విధముగా, స్వయంభువుడగు ఆ బ్రహ్మదేవుడు వివేకబుద్ధిచే మనస్సులో తన పుత్రుడగు భృగువుపై పుట్టిన కోపమును శమింప జేసెను.

తతః కైలాసమగమత్స తం దేవో మహేశ్వరః

పరిరబ్ధుం సమారభే ఉత్థాయ భ్రాతరం ముదా

తరువాత ఆ భృగువు కైలాసమునకు వెళ్లాను. మహేశ్వర దేవుడానంద ముతో లేచి నిలబడి తమ్ముడు భృగువును కౌగిలించుటకుద్యుక్తుడాయెను.

నైచ్చత్త్వమస్యుత్పథగ ఇతి దేవశ్చుకోప హ

శూలముద్యమ్య తం హంతుమారేభే తిగ్మలోచనః

నీవు మర్యాదలనుల్లంఘించువాడవు, అంటూ భృగువు శివప్రీభుని కౌగిలికి ఇష్ట పడ లేదు. కోపముతో కన్నులు ఎరుపెక్కిన శివుడు శూలమును పైకెత్తి ఆ భృగువును సంహరించుటకుద్యుక్తుడాయెను.

పతిత్వా పాదయోర్దేవీ సాంత్వయామాస తం గిరా

అథో జగామ వైకుంఠం యత్ర దేవో జనార్దనః

పార్వతీదేవి ఆ శివుని పాదములపై పడి అనునయవాక్యములతో శాంతింపజేసెను. తరువాత భృగువు దుష్టజనశిక్షకుడగు శ్రీహరి దేవుడు ఉండే వైకుంఠమునకు వెళ్లాను.

శయానం శ్రియ ఉత్సంగే పదా వక్షస్యతాడయత్

తత ఉత్థాయ భగవాన్ సహ లక్ష్మ్యా సతాం గతిః

  లక్ష్మీదేవి ఒడిలో పరుండియున్న శ్రీహరిని భృగువు కాలితో వక్షఃస్థలము పై తన్నెను. సత్పురుషులచే ఆత్మరూపముగా పొందబడే శ్రీహరి భగవానుడు అప్పుడు లక్ష్మీదేవితో సహా లేచి నిలబడెను.

స్వతల్పాదవరుహ్యాథ ననామ శిరసా మునిమ్

ఆహ తే స్వాగతం బ్రహ్మన్నిషీదాత్రాసనే క్షణమ్

ఆజానతామాగతాన్ వః క్షంతుమర్హథ నః ప్రభో

అప్పుడు శ్రీహరి తన శయ్య పైనుండి దిగి భృగు మహర్షికి తల వంచి నమస్కరించి ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! తమరికి స్వాగతము. ఈ ఆసనముపై క్షణకాలము కూర్చుండుడు. ఓ ప్రభూ! మీ రాకను మేము గమనించలేదు. మమ్ములను తమరు క్షమించ దగును.

అతీవ కోమలౌ తాత చరణౌతే మహామునే

ఇత్యుక్త్వా విప్రచరణౌ మర్దయన్ స్వేన పాణినా

ఓ తండ్రీ! మహరీ! నీ పాదములు మిక్కిలి సుకుమారములు అని పలికి శ్రీహరి తన చేతితో ఆ మహర్షి పాదములను నొక్కెను.

పునీహి సహలోకం మాం లోకపాలాంశ్చ మద్దతాన్

పాదోదకేన భవతస్తీర్థానాం తీర్థకారిణా

నీ పాదజలము గంగాది తీర్థములకు పావనము చేసే శక్తినిచ్చును. దానితో నన్ను, నా వైకుంఠలోకమును, నాయందున్న లోకపాలకులను కూడ పవిత్రము చేయుము

అద్యాహం భగవంల్లక్ష్మ్యా ఆసమేకాంతభాజనమ్

వత్స్యత్యురసి మే భూతిర్భవత్పాదహతాంహసః

ఓ పూజనీయా! ఈనాడు నేను లక్ష్మీదేవికి ఏకాంతమగు ఆశ్రయమునైతిని. తమరి పాదముయొక్క స్పర్శ నాలోని దోషములను నశింపజేసినది. లక్ష్మీదేవి నా వక్షఃస్థలము పై నిత్యనివాసము చేయగలదు.

శ్రీశుక ఉవాచ !

ఏవం బ్రువాణే వైకుం ఠే భృగుస్తన్మంద్రయా గిరా

నిర్వృతస్తర్పితస్తూష్ణీం భక్త్యుత్కంఠోఽశ్రులోచనః

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను -- శ్రీహరి ఇట్లు పలుకుచుండగా ఆయన యొక్క మధురమైన వాక్కుచే భృగుమహర్షికి సుఖము, తృప్తి కలిగెను. ఆయన భక్తిచే విహ్వలుడై, కన్నుల నీరు నిండగా, మిన్నకుండెను.

పునశ్చ సత్రమావ్రజ్య మునీనాం బ్రహ్మవాదినామ్

స్వానుభూతమ శేషేణ రాజన్ భృగురవర్ణయత్

ఓ పరీక్షిన్మహారాజా! భృగుమహర్షి సత్రయాగమునకు తిరిగి వచ్చి, వేద వేత్తలగు మహర్షులకు తన అనుభవమును నిశ్శేషముగా వర్ణించెను.

తన్నిశమ్యాథ మునయో విస్మితా ముక్తసంశయాః

భూయాంసం శ్రద్దధుర్విష్ణుం యతశ్శాంతిర్యతోఽభయమ్

ఆ వృత్తాంతమును విని మహర్షులు అప్పుడు చకితులైరి. వారి సంశయములు తొలగిపోయేను. శ్రీహరియే గొప్పవాడని వారు విశ్వసించిరి. శ్రీహరి వలననే శాంతి, అభయము సిద్ధించును.

ధర్మస్సాక్షాద్యతో జ్ఞానం వైరాగ్యం చ తదన్వితమ్

ఐశ్వర్యం చాష్టధా యస్మాద్యశశ్చాత్మమలాపహమ్

శ్రీహరి వలన ధర్మము, సాక్షాత్కారరూపమైన జ్ఞానము, ఆ జ్ఞానముతో కూడిన వైరాగ్యము, అణిమాద్యషైశ్వర్యములు కలుగును. శ్రీహరి కీర్తి అంతఃకరణమాలిన్యమును పోనాడును.

మునీనాం న్యస్తదండానాం శాంతానాం సమచేతసామ్

అకించనానాం సాధూనాం యమాహుః పరమాం గతిమ్

భూతహింసను, సర్వస్వమును విడిచి పెట్టి శాంతులై సమచిత్తులై పరోపకారమును చేసే మహర్షులు పొందే మోక్షఫలము ఆ శ్రీహరియేనని చేప్పెదరు.

సత్త్వం యస్య ప్రియా మూర్తిర్బ్రాహ్మణాస్త్విష్ట దేవతాః

భజంత్యనాశిష శ్శాంతా యం వా నిపుణబుద్ధయః

శ్రీహరికి సత్త్వప్రధానమగు మూర్తి ప్రియము. ఆయనకు బ్రాహ్మణులే ఇష్ట దైవము. ఆయనను నిష్కాములు, శాంతులు, వివేకపూర్ణమగు బుద్ధి గలవారు అగు సాధకులు భజించెదరు.

త్రివిధాకృతయస్తస్య రాక్షసా అసురాస్సురాః

గుణిన్యా మాయయా సృష్టాస్సత్త్వం తత్తీర్థసాధనమ్

ఆ శ్రీహరికి సత్త్వరజస్తమోగుణాత్మికయగు మాయాశక్తిచే రాక్షసులు (క్రూరస్వభావులు, తామసులు), అసురులు (భోగపరాయణులు, రాజసులు), దేవతలు (చిన్మయులు, సాత్త్వికులు) అనే మూడు రూపములు సృష్టించబడినవి. ఆయనయొక్క సత్త్వగుణప్రధానమగు మూర్తి పురుషార్థ హేతువు.

శ్రీశుక ఉవాచ

ఏవం సారస్వతా విప్రా నృణాం సంశయనుత్తయే

పురుషస్య పదాంభోజ సేవయా తద్గతిం గతాః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సరస్వతీనదీతీరవాసులగు వేదవేత్తలు ఈ విధముగా మానవుల సంశయమును నివారణ చేసిరి. వారు పూర్ణుడగు శ్రీహరియొక్క పద్మములవంటి పాదములను సేవించి ఆయన స్వరూపమును పొందిరి.

సూత ఉవాచ

ఇత్యేతన్మునితనయాస్యపద్మగంధ

పీయూషం భవభయభిత్పరస్య పుంసః

సుశ్లోకం శ్రవణపుటైః పిబత్యభీక్ ష్ణిం

పాంథోఽధ్వభ్రమణపరిశ్రమం జహాతి

సూతమహర్షి ఇట్లు పలి కెను --- పురుషోత్తమునియొక్క మహిమ సంసారభయమును పోగొట్టునది, కొనియాడదగినది. వ్యాసపుత్రుడగు శుకమహర్షియొక్క ముఖపద్మమునుండి జాలువారే ఆ మహిమ పరిమళభరితమైన అమృతమువంటిది. సంసారయాత్ర చేసే సాధకుడు దానిని మరల మరల చెవులనే దొప్పలతో పానము చేసినచో, సంసారమునందు తిరుగుటచే కలిగే శ్రమ దూరమగును.

శ్రీశుక ఉవాచ

ఏకదా ద్వారవత్యాం తు విప్రపత్న్యాః కుమారకః

జాతమాత్రో భువం స్పృష్ట్వా మమార కిల భారత

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఒకప్పుడు ద్వారకానగరములో ఒక బ్రాహ్మణపత్నికి ప్రసవమాయెను. శిశువు పుట్టి నేలపై పడుటతోడనే మరణించెను.

 విప్రో గృహీత్వా మృతకం రాజద్వార్యుపధాయ సః

ఇదం ప్రోవాచ విలపన్నాతురో దీనమానసః

వ్యాకులమైన చిత్తము గల ఆ బ్రాహ్మణుడు ఏడ్చుచుండెను. దీనమైన మనస్సు గల ఆతడు మరణించిన శిశువును తీసుకువెళ్లి రాజద్వారము వద్ద పెట్టి ఇట్లు పలి కెను.

బ్రహ్మద్విషశ్శఠధియో లుబ్ధస్య విషయాత్మనః

 క్షత్రబంధోః కర్మదోషాత్పంచత్వం మే గతోఽర్భకః

ఈ రాజు బ్రాహ్మణులను ద్వేషించే అధముడు. ఈతని బుద్ధి మోసపూరితము. ఈ లోభి మనస్సు భోగములయందు లగ్న మై యున్నది. వీని కర్మయందలి దోషము వలన నా పిల్లవాడు మరణించెను.

హింసావిహారం నృపతిం దుశ్శీలమజితేంద్రియమ్

ప్రజా భజంత్యస్సీదంతి దరిద్రా నిత్యదుఃఖితాః

రాజు చేడు శీలము గలవాడై హింసయందు విహరిస్తూ ఇంద్రియజయము లేనివాడైనచో, అట్టి రాజును సేవించే ప్రజలు దరిద్రులై నిత్యము దుఃఖములననుభవిస్తూ ఇడుముల పాలగుదురు.

ఏవం ద్వితీయం విప్రర్షిస్తృతీయం త్వేవమేవ చ

విసృజ్య స నృపద్వారి తాం గాథాం సమగాయత

వేదవేత్తయగు ఆ మహర్షియొక్క రెండవ, మూడవ శిశువులు కూడ ఇదే విధముగా మరణించగా, ఆయన రాజద్వారము వద్ద మృతశిశువును ఉంచి, అదే విధముగా బిగ్గరగా పలికెను.

తామర్జున ఉపశ్రుత్య కర్హిచిత్కేశవాంతికే

పరేతే నవమే బాలే బ్రాహ్మణం సమభాషత

ఒకనాడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని వద్దనుండెను. అప్పుడు మరల ఆ బ్రాహ్మణుని తొమ్మిదవ పిల్లవాడు మరణించెను. ఆ బ్రాహ్మణుడు పలికిన పలుకులను అర్జునుడు విని ఆయనతో నిట్లనెను.

కిం స్విద్బ్రహ్మంస్త్వన్నివాసే ఇహ నాస్తి ధనుర్ధరః

రాజన్యబంధు రేతే వై బ్రాహ్మణాస్సత్ర ఆసతే

ఓ మహర్షీ! నీవు నివసించే ఈ ద్వారకయందు ధనుస్సు పట్టిన అధమ క్షత్రియుడు కూడ లేడా యేమి? ఈ యదువంశక్షత్రియులు బ్రాహ్మ ణులుగా మారి పాలనను విడిచి యాగములో కూర్చుండినారు కాబోలు!

ధనదారాత్మజాపృక్తా యత్ర శోచంతి బ్రాహ్మణాః

తే వై రాజన్యవే షేణ నటా జీవంత్యసుంభరాః

ఏ రాజ్యమునందైతే బ్రాహ్మణులు ధనమును, భార్యను, సంతానమును కోల్పోయి దుఃఖించెదరో, ఆ పొలకులు రాజు వేషములోనున్న నటులు, వారు రాజ్యాధికారముతో పొట్ట పోసుకొని జీవించువారు మాత్రమే.

అహం ప్రజా వాం భగవన్ రక్షి ష్యే దీనయోరిహ

అనిస్తీర్ణ ప్రతిజ్ఞాఽగ్నిం ప్రవే క్ష్యే హతకల్మషః

ఓ పూజనీయా! దీనులగు మీ దంపతుల పిల్లలను నేను ఇప్పుడు ఇక్కడ రక్షించెదను. ప్రతి నెరవేర్చకపోయినచో, నేను అగ్నిలో ప్రవేశించెదను. దానిచే, నా పాపములన్నియు నశించగలవు.

బ్రాహ్మణ ఉవాచ !

సంకర్షణే వాసుదేవః ప్రద్యుమ్నో ధన్వినాం వరః

అనిరుద్ధోఽప్రతిరథో న త్రాతుం శక్నువంతి యత్

బ్రాహ్మణుడిట్లు పలి కెను --- బలరాముడు, శ్రీకృష్ణుడు, ధనుర్ధారులలో శ్రేష్ఠుడగు ప్రద్యుమ్నుడు, సమ ఉజ్జీ లేని అనిరుద్దుడు నా సంతానమును కాపాడలేకపోయిరి.

తత్కథం ను భవాన్ కర్మ దుష్కరం జగదీశ్వ రైః

చికీర్షసి త్వం బాలిశ్యాత్తన్న శ్రద్దధ్మ హే వయమ్

జగన్నాథులు చేయలేకపోయిన ఆ పనిని నీవు ఎట్లు చేసెదవు? నీవు తెలివి తక్కువదనముచే ఆ పనిని చేయగోరుచున్నావు. నిన్ను మేము విశ్వసించము.

అర్జున ఉవాచ !

నాహం సంకర్షణో బ్రహ్మన్న కృష్ణః కార్ ష్ణి రేవ చ

అహం వా అర్జునో నామ గాండీవం యస్య వై ధనుః

అర్జునుడిట్లు పలికెను --- ఓ బ్రాహ్మణుడా! నేను బలరాముడను గాని, శ్రీకృష్ణుడను గాని, ఆయన పుత్రుడగు ప్రద్యుమ్నుడను గాని కాను. నేను అర్జునుడని ప్రసిద్ధి చెందినవాడను. నా ధనుస్సైతే గాండీవము.

మాఽవమంస్థా మమ బ్రహ్మన్ వీర్యంత్ర్యంబకతోషణమ్

మృత్యుం విజిత్య ప్రధాన ఆనే ష్యే తే ప్రజాం ప్రభో

ఓ బ్రాహ్మణా! ముక్కంటిని సంతోష పెట్టిన నా పరాక్రమమునవమానించకుము. ఓ ప్రభూ! నేను యుద్దములో యమధర్మరాజును జయించి నీ సంతానమును తీసుకురాగలను.

ఏవం విశ్రాంభితో విప్రః ఫాల్గునేన పరంతప

జగామ స్వగృహం ప్రీతః పార్థవీర్యం నిశామయన్

శత్రువులను తపింపజేసే పరీక్షిన్మహారాజా! అర్జునుడీ విధముగా ఆ బ్రాహ్మణునకు నమ్మకము కలిగించెను. ఆయన సంతోషిస్తూ తన యింటికి వెళ్లాను. ఆయన అర్జునుని పరాక్రమమును గురించి వినుచుండెను.

ప్రసూతికాల ఆసన్నే భార్యాయా ద్విజసత్తమః

పాహి పాహి ప్రజాం మృత్యోరిత్యాహార్జునమాతురః

భార్యకు ప్రసూతి కాలము వచ్చెను. ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు దుఃఖముతో కంగారు పడుతూ, సంతానమును మృత్యువునుండి కాపాడుము, కాపాడుము, అని అర్జునునితో చెప్పెను.

స ఉపస్పృశ్య శుచ్యంభో నమస్కృత్య మహేశ్వరమ్

దివ్యాన్యస్త్రాణి సంస్మృత్య సజ్యం గాండీవమాదదే

ఆ అర్జునుడు స్వచ్చమైన నీటిని త్రాగి, మహేశ్వరునకు నమస్కరించి, దేవతలిచ్చిన అస్త్రములను స్మరించి, నారిత్రాడు తగిల్చిన గాండీవమును తీసుకోనెను.

న్యరుణత్సూతికాగారం శరైర్నానాఽస్త్రయోజితైః

తిర్యగూర్ధ్వమధః పార్థశ్చకార శరపంజరమ్

అర్జునుడు అనేకములైన అస్త్రములను సంధానము చేసిన బాణములతో ప్రసవగృహమును చుట్టూ కట్టివేసెను. అడ్డముగా, పైన, క్రింద బాణముల పంజరమును చేసెను.

తతః కుమారస్సంజాతో విప్రపత్న్యా రుదన్ముహుః

సద్యోఽదర్శనమా పేదే సశరీరో విహాయసా

తరువాత బ్రాహ్మణుని భార్య పిల్లవాడిని కనెను. ఆ పిల్లవాడు మరల మరల యేడుస్తూనే వెంటనే ఆకాశమార్గము గుండా శరీరముతో సహా కనబడకుండా పోయెను.

తదాఽఽహ విప్రో విజయం వినిందన్ కృష్ణసన్నిధౌ

మౌడ్యం పశ్యత మే యోఽహం శ్రద్దదే క్లీబకత్థనమ్

అప్పుడు బ్రాహ్మణుడు అర్జునుని శ్రీకృష్ణుని సన్నిధిలోనే నిందిస్తూ ఇట్లు పలి కెను --- నా మూర్ఖత్వమును చూడుడు. నపుంసకుని బడాయి కబుర్లను నేను నమ్మితిని.

న ప్రద్యుమ్నో నానిరుద్ధో న రామో న చ కేశవః

యస్య శేకుః పరిత్రాతుం కోఽన్యస్తదవితేశ్వరః

ప్రద్యుమ్నుడు, అనిరుద్దుడు, బలరాముడు, శ్రీకృష్ణ భగవానుడు కూడ నా సంతానమును రక్షించలేకపోయినారు. అట్టి స్థితిలో రక్షించగల మొనగాడు ఎవడు ఉండును? (ఉండడు).

ధిగర్జునం మృషావాదం ధీగాత్మశ్లాఘినో ధనుః

దైవోపసృష్ఠం యో మౌఢ్యాదానినీషతి దుర్మతిః

అసత్యమును పలికే అర్జునునకు, తన గొప్పలు చెప్పుకునే అర్జునుని ధనుస్సునకు నింద యగుగాక! అర్జునుడు దుర్బుద్ధి, మూర్ఖుడు. కావుననే, దైవము తీసుకుపోయిన నా సంతానమును తీసుకురా గోరుచున్నాడు.

ఏవం శపతి విప్రర్షౌ విద్యామాస్థాయ ఫాల్గునః

యయౌ సంయమనీమాశు యత్రాస్తే భగవాన్ యమః

వేద వేత్తయగు మహర్షి ఈ విధముగా . తిట్టుచుండెను. అర్జునుడు యోగవిద్యనాశ్రయించి వెంటనే యమభగవానుడు నివసించే సంయమనీ నగరమునకు వెళ్లాను.

విప్రాపత్యమచక్షాణస్తత ఐంద్రీమగాత్పురీమ్

ఆగ్నేయీం నైరృతీం సౌమ్యాం వాయవ్యాం వారుణీమథ

రసాతలం నాకపృష్ఠం ధిష్ణ్యాన్యన్యాన్యుదాయుధః

అక్కడ అర్జునునకు బ్రాహ్మణుని పుత్రుడు కనబడలేదు. ఆయన " శస్త్రధారియై అక్కడనుండి ఇంద్ర-అగ్ని-నిరృతి-సోమ-వాయు-వరుణ దేవతల పురములకు, పాతాళమునకు, స్వర్గముయొక్క పైభాగమునకు, ఇతరములగు యక్షపురి మొదలైన ధామములకు వెళ్లాను.

తతోఽలబ్దద్విజసుతో హ్యనిస్తీర్ణ ప్రతిశ్రుతః

అగ్నిం వివిక్షుః కృష్ణేన ప్రత్యుక్తః ప్రతి షేధతా

అర్జునునకు బ్రాహ్మణుని పుత్రుడు లభించలేదు. ఆయన తాను చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకొనలేకపోయెను. అప్పుడాయన అగ్నిలో ప్రవేశించ గోరగా, శ్రీకృష్ణుడు వద్దని నివారిస్తూ ఇట్లు పలి కెను.

దర్శయే ద్విజసూనూం స్తే మాఽవజ్ఞాత్మానమాత్మనా

యే తే నః కీర్తిం విమలాం మనుష్యాః స్థాపయిష్యంతి

నీకు బ్రాహ్మణుని పుత్రులను చూపించెదను. నిన్ను నీవే అవమానించుకోనకుము. ఏ మానవులు నిన్ను తిట్టినారో, వారే మనకు స్వచ్ఛమైన కీర్తిని నిలబెట్టగలరు.

ఇతి సంభాష్య భగవానర్జునేన సహేశ్వరః

దివ్యం స్వరథమాస్థాయ ప్రతీచీం దిశమావిశత్

సర్వశక్తిమంతుడగు శ్రీకృష్ణుడీ విధముగా పలికి, అర్జునునితో కలిసి తన ప్రకాశించే రథమునెక్కి పడమటి దిక్కును ప్రవేశించెను.

సప్త ద్వీపాన్ సప్త సింధూన్ సప్తసప్తగిరీనథ

లోకాలోకం తథాఽతీత్య వివేశ సుమహత్తమః

ఏడేసి మర్యాదపర్వతములుండే ఏడు ద్వీపములను, ఏడు సముద్రములను, తరువాత లోకాలోకపర్వతమును కూడ దాటి, వారు చాల దట్టని చీకటిని ప్రవేశించిరి.

తత్రాశ్వాశ్శైబ్యసుగ్రీవమేఘపుష్పబలాహకాః

తమసి భ్రష్టగతయో బభూవుర్భరతర్షభ

            భరతవంశీయులలో శ్రేష్ఠుడవగు ఓ రాజా! శైబ్యము, సుగ్రీవము, మేఘ పుష్పము, బలాహకము అనే గుర్రములు ఆ చీకటిలో దారి తప్పినవి.

తాన్ దృష్ట్వా భగవాన్ కృష్ణో మహాయోగేశ్వరేశ్వరః

సహస్రాదిత్యసంకాశం స్వచక్రం ప్రాహిణోత్పురః

శ్రీకృష్ణ భగవానుడు యోగేశ్వరులగు సనకాదులకు కూడ పరమేశ్వరుడు. గుర్రములు దారి తప్పుటను గాంచిన ఆయన వేయి సూర్యుల కాంతి గల తన చక్రమును ముందు పం పెను.

తమస్సు ఘోరం గహనం కృతం మహద్

విదారయద్భూరితరేణ రోచిషా

మనోజవం నిర్వివిశే సుదర్శనం

గుణచ్యుతో రామశరో యథా చమూః

ప్రవేశింప శక్యము కాకుండా సృష్టికర్తచే చేయబడిన ఆ చీకటి మిక్కిలి భయమును గొల్పుచుండెను. మనోవేగము గల సుదర్శనచక్రము అంతకంటే పెద్ద కాంతితో చీల్చి వేస్తూ, రాముని ధనుస్సు నుండి విడిచి పెట్టబడిన బాణము సైన్యములను వలే, ఆ చీకటిని ప్రవేశించెను.

ద్వారేణ చక్రానుపథేన తత్తమఃపరం పరం జ్యోతిరనంతపారమ్

సమశ్నువానం ప్రసమీక్ష్య ఫాల్గునః ప్రతాడితాక్షో పిదధేఽక్షిణీ ఉభే

చక్రము ఆ చీకటిలో ఏర్పరచిన దారి గుండా ఆ చీకటికీ ఆవలనుండే తేజస్సును వారు చేరిరి. సర్వాతిశాయియగు ఆ తేజస్సు అంతమయ్యే హద్దు ఏదీ లేదు. సర్వమును వ్యాపించియున్న ఆ తేజస్సుచే కళ్లలో పొడిచినట్లు కాగా అర్జునుడు రెండు కళ్లను మూసుకొనెను.

తతః ప్రవిష్టస్సలిలం నభస్వతా

బలీయ సైజద్బృహదూర్మిభూషణమ్

తత్రాద్భుతం వై భవనం ద్యుమత్తమం

భౌజన్మణిస్తంభసహస్రశోభితమ్

ఆ చీకటికి ఆవల రథము జలాశయములో ప్రవేశించేను. మిక్కిలి బలమైన గాలిచే పైకి లేచిన పెద్ద కెరటములే ఆ జలాశయమునకు అలంకారములాయెను. ఆ జలాశయములో అచ్చెరువును గొలిపే పెద్ద భవనము ఉండెను. అతీశయముగా ప్రకాశించే ఆ భవనమునందు వెలిగిపోయే మణులతో పొదిగిన స్తంభములు వేయి ఉండెను.

తస్మిన్మహాభీమమనంతమద్బుతం సహస్రమూర్ధన్యఫణామణిద్యుభిః

విభ్రాజమానం ద్విగుణోల్బణేక్షణం సితాచలాభం శితికంఠజిహ్వమ్

ఆ జలాశయమునందు వారు చాల భయమును, విస్మయమును గొల్పే అనంతుని చూచిరి. ఆయనయొక్క వేయి తలలయందలి పడగలలో మణులు ప్రకాశించుచుండెను. రెండు వేల కన్నులు భయంకరముగా నుండెను. తెల్లని కొండ వలె ప్రకాశించే ఆ అనంతుడు నల్లని కంఠములను, నాలుకలను కలిగియుండెను.

దదర్శ తద్బోగసుఖాసనం విభుం

మహాఽనుభావం పురుషోత్తమోత్తమమ్

సాంద్రాంబుదాభం సుపిశంగవాససం

ప్రసన్నవక్త్రం రుచిరాయతేక్షణమ్

సర్వవ్యాపకుడు, సర్వాతిశాయి అగు పురుషోత్తమ భగవానుడు మంచి పచ్చని వస్త్రమును దాల్చి ఆ అనంతుని పడగలనే సుఖకరమగు ఆసనముపై కూర్చుండెను. గొప్ప మహిమ గల ఆయన దట్టని మేఘము వలె ప్రకాశించేను. అందమైన నిడివి కన్నులు గల ఆయన ముఖము ప్రసన్నముగా నుండెను.

మహామణివ్రాతకీరీటకుండల

ప్రభాపరిక్షిప్తసహస్రకుంతలమ్

ప్రలంబచార్వష్ట భుజం సకౌస్తుభం

శ్రీవత్సలక్ష్మం వనమాలయా వృతమ్

గొప్ప మణుల సమూహములు పొదిగిన కిరీటము, కుండలముల కాంతులచే వేలాది ముంగురులు అంతటా వెలిగిపోవుచుండెను. ఆయన పొడవాటి అందమైన ఎనిమిది భుజములు కలిగియుండెను. ఆయన మేడలో కౌస్తుభ మాణిక్యమును, వక్షఃస్థలము పై శ్రీవత్సమనే చిహ్నమును, వనమాలను కలిగియుండెను.

సునందనందప్రముఖైస్స్వపార్ష దైః 

చక్రాదిభిర్మూర్తిధరైర్నిజాయుధైః

పుష్ట్యా శ్రీయా కీర్త్యజయాఽఖిలర్ద్ధిభిః 

నిషేవ్యమాణం పరమేష్ఠినాం పతిమ్

బ్రహ్మాది లోకపాలకులకు ప్రభుడగు ఆ నారాయణుని సునందుడు-నందుడు మొదలగు పార్షదులు, పుష్టి-శ్రీ-కీర్తి-మాయ అనే శక్తులు, చక్రము-గద మొదలగు ఆయుధములు, అణిమ మొదలైన అష్ట సిద్ధులు రూపు దాల్చి సేవించుచుండెను.

వవంద ఆత్మానమనంతమచ్యుతో

జిష్ణుశ్చ తద్దర్శనజాతసాధ్వసః

తావాహ భూమా పరమేష్ఠి నాం ప్రభుః

బద్ధాంజలీ సస్మితమూర్జయా గిరా

శ్రీకృష్ణ భగవానుడు తన రూపమే అయిన అనంతునకు నమస్కరించెను. ఆయనను చూచుటచే భయము కలిగిన అర్జునుడు కూడ నమస్కరించెను. బ్రహ్మాది లోకపాలకులకు ప్రభుడు, సర్వస్వరూపుడు అగు పురుషోత్తముడు దోసిలి యొగ్గిన వారిద్దరిని ఉద్దేశించి చిరునవ్వుతో గంభీరమగు వాక్కుతో నిట్లనెను.

ద్విజాత్మజా మే యువయోర్దిదృక్షుణా

మయోపనీతా భువి ధర్మగుప్తయే

కలాఽవతీర్ణావవనేర్భరాసురాన్

హత్వేహ భూయస్త్వరయేతమంతి మే

మీ యిద్దరినీ చూడగోరి నేను బ్రాహ్మణుని పుత్రులను తీసుకువచ్చినాను. భూలోకమునందు ధర్మరక్షణకై మీరిద్దరు నా అంశచే అవతరించినారు. భూమికి బరువైన రాక్షసులను సంహరించి ఇచట నా సమీపమునకు మీరిద్దరు తొందరగా మరలి రండు.

పూర్ణకామావపి యువాం నరనారాయణావృషీ

ధర్మమాచరతాం స్థిత్యై ఋషభౌ లోకసంగ్రహమ్

మీరిద్దరు గొప్ప మహర్షులైన నరనారాయణులు. మీరు ఆప్తకాములే అయినా, లోకరక్షణకై జనులకు ఆదర్శముగా ధర్మమును ఆచరించుడు.

ఇత్యాదిష్టౌ భగవతా తౌ కృష్ణౌ పరమేష్ఠినా

ఓమిత్యానమ్య భూమానమాదాయ ద్విజదారకాన్  న్యవర్తతాం స్వకం ధామ సంప్రహృష్ణౌ యథాగతమ్

విప్రాయ దదతుః పుత్రాన్ యథారూపం యథావయః

పరమేశ్వరుడైన పురుషోత్తమ భగవానునిచే ఈ విధముగా ఆదేశించబడిన ఆ శ్రీకృష్ణార్జునులు అటులనే అని పలికి ఆయనకు ప్రణమి ల్లిరి. అప్పుడు వారు బ్రాహ్మణపుత్రులను తీసుకొని వెళ్లిన దారినే తమ స్థానము (ద్వారక) నకు మరలి వచ్చిరి. వారు బ్రాహ్మణునకు పుత్రులను సమర్పించిరి. ఆ పిల్లవాండ్ల వయస్సు, రూపములలో తేడా ఏమీ లేదు.

నిశామ్య వైష్ణవం ధామ పార్థః పరమవిస్మితః

యత్కించిత్పౌరుషం పుంసాం మేనే కృష్ణానుకం పితమ్

శ్రీహరియొక్క వైకుంఠధామమును చూచి అర్జునునకు అత్యాశ్చర్యము కలిగెను. మానవులలో ఏ కొంచెము పురుషకారము ఉన్నా, అది శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహము మాత్రమేనని ఆతడు తలపో సెను.

ఇతీదృశాన్యనేకాని వీర్యాణీహ ప్రదర్శయన్

బుభుజే విషయాన్ గ్రామ్యానీజే చాత్యూర్జి తైర్మ ఖైః

శ్రీకృష్ణ భగవానుడీ విధముగా ఈ లోకములో ఇటువంటి అనేకములగు పరాక్రమములను ప్రదర్శించెను. ఆయన లౌకికములైన భోగములను భోగించుటయే గాక, మిక్కిలి సమృద్ధములగు యజ్ఞములతో పరమేశ్వరునారాధించెను.

ప్రవవర్షాఖిలాన్ కామాన్ ప్రజాసు బ్రాహ్మణాదిషు

యథాకాలం యథైవేంద్రో భగవాంచ్ఛ్రైష్ఠ్యమాస్థితః

శ్రేష్ఠమగు గృహస్థధర్మాచరణ గల శ్రీకృష్ణ భగవానుడు, సకాలములో ఇంద్రుడు వర్షించినట్లుగా, ఆయా కాలములలో బ్రాహ్మణులు మొదలైన ప్రజలకు సకలములైన కామనలను అధికముగా పూర్ణము చేసెను.

హత్వా నృపానధర్మిష్ఠాన్ ఘాతయిత్వాఽర్జునాదిభిః

అంజసా వర్తయామాస ధర్మం ధర్మసుతాదిభిః ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

ఉత్తరార్ధే ఏకోననవతితమోఽధ్యాయః

శ్రీకృష్ణ భగవానుడు అధర్మాత్ములగు రాజులలో కొందరిని తాను సంహరించెను. ఆయన ఇతరులను అర్జునుడు, భీముడు మొదలగువారిచే సంహరింపజేసెను. ఆయన ధర్మరాజు, ఉగ్రసేనుడు మొదలగువారిచే ధర్మమును తేలికగా అనుష్ఠింపజేసెను.

శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో భృగువు త్రిమూర్తులను పరీక్షించుటను, శ్రీకృష్ణుడు మరణించిన బ్రాహ్మణ బాలకులను మరల బ్రదికించుటను వర్ణించే ఎనుబది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది .