76 - యాదవులకు శాల్వునితో యుద్ధము

శ్రీశుక ఉవాచ

అథాన్యదపి కృష్ణస్య శృణు కర్మాద్భుతం నృప

క్రీడానరశరీరస్య యథా సౌభపతిర్హతః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! రాజసూయ వృత్తాంతమును విన్న పిదప, లీలకై మానవరూపముతో అవతరించిన శ్రీకృష్ణ భగవానుని మరియొక లీలను గురించి కూడ వినుము. ఆయన సౌభమనే విమానమునకు ప్రభువగు శాల్వుని వధించెను.

శిశుపాలసఖశ్శాల్వో రుక్మిణ్యుద్వాహ ఆగతః

యదుభిర్నిర్జితస్సంఖ్యే జరాసంధాదయస్తథా

శాల్వుడు శిశుపాలుని మిత్రుడు. రుక్మిణి వివాహానికి ఆతడు వచ్చి యుద్ధములో జరాసంధుడు, దంతవక్తుడు మొదలగువారితో బాటుగా యాదవుల చేతిలో పరాజయము పాలైనాడు.

శాల్వః ప్రతిజ్ఞామకరోచ్ఛృణ్వతాం సర్వభూభుజామ్

అయాదవీం క్ష్మాం కరిష్యే పౌరుషం మమ పశ్యత

రాజులందరు వినుచుండగా శాల్వుడిట్లు ప్రతిజ్ఞ చేసెను -- ఈ భూమిపై యాదవులు లేకుండా చేసెదను. నా పౌరుషమును చూడుడు.

ఇతి మూఢః ప్రతిజ్ఞాయ దేవం పశుపతిం ప్రభుమ్

ఆరాధయామాస నృప పొంగుముష్టిం సకృద్గ్రసన్

ఓ పరీక్షిన్మహారాజా! మూర్ఖుడగు ఆ శాల్వుడు ఈ విధముగా ప్రతిజ్ఞ చేసి, దినములో ఒక్కసారి గుప్పెడు బూడిదను మాత్రమే తిని, సర్వశక్తిమంతుడు, ప్రాణులకు పాలకుడు అగు శివుని ఆరాధించెను.

సంవత్సరాంతే భగవానాశుతోష ఉమాపతిః

వరేణ చ్ఛందయామాస శాల్వం శరణమాగతమ్

పార్వతీపతియగు శివభగవానుడు తొందరగా సంతోషించే దైవము. సంవత్సరము తరువాత ఆయన తనను శరణు జొచ్చిన శాల్వుని వరమును కోరుమని ప్రేరితుని చే సెను.

దేవాసురమనుష్యాణాం గంధర్వోరగరక్షసామ్

అభేద్యం కామగం వవే స యానం వృష్టిభీషణమ్  

యథేచ్చగా సంచరిస్తూ దేవతలు, అసురులు, మానవులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు ఛేదించలేనిదై యాదవులకు హడలు పుట్టించే విమానము (ఎగిరే నగరము) ను ఆతడు వరముగా కోరేను.

తథేతి గిరీశాదిష్టో మయః పరపురంజయః

పురం నిర్మాయ శాల్వాయ ప్రాదాత్సౌభమయస్మయమ్

            కైలాసవాసియగు శివుడు సరేనని శత్రునగరములను జయించే మయుని ఆదేశించెను. ఆయన సౌభమనే లోహమయమైన (ఎగిరే) పురమును నిర్మించి శాల్వునకిచ్చెను.

స లబ్ద్వా కామగం యానం తమోధామ దురాసదమ్

యయౌ ద్వారవతీం శాల్వో వైరం వృష్టికృతం స్మరన్  

చీకటికి నిలయమై సమీపించుట శక్యము కానిదై యథేచ్చగా సంచరించే విమానము ఆ శాల్వునకు లభించేను. ఆతడు ఇదివరలో యాదవులతో కలిగిన వైరమును స్మరిస్తూ ద్వారకకు వెళ్లాను.

నిరుద్ద్య సేనయా శాల్వో మహత్యా భరతర్షభ

పురీం బభంజోపవనాన్యుద్యానాని చ సర్వశః

సగోపురాణి ద్వారాణి ప్రాసాదాట్టాలతోలికాః

విహారాన్ స విమానాగ్యాన్ని పేతుశ్శస్త్రవృష్టయః

శిలా ద్రుమాశ్చాశనయస్సర్పా ఆసారశర్కరాః

భరతవంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆ శాల్వుడు పెద్ద సేనతో ద్వారకానగరమును ముట్టడించి, నగరము చుట్టూ ఉండే అడవులను, నగరములోని ఉద్యానములను, గోపురములను, నగరద్వారములను,భవనములను, బురుజులను, గోడలను, క్రీడాస్థానములను అన్నింటినీ భగ్నము చేయజొచ్చెను. ఆ గొప్ప విమానమునుండి ఆయుధములు, రాళ్లు, చెట్లు, పిడుగులు, పాములు, వడగళ్లు ధారలుగా వర్షించెను.

ప్రచండశ్చక్రవాతోఽభూద్రజసాఽఽచ్ఛాదితా దిశః

ఇత్యర్ధ్యమానా సౌభేన కృష్ణస్య నగరీ భృశమ్

నాభ్యపద్యత శం రాజంస్త్రీపు రేణ యథా మహీ

భయంకరమగు సుడిగాలి వీచి దిక్కులన్నీ దుమ్ముతో కప్పివేయబడెను. ఓ రాజా! త్రిపురములు భూగోళమును వలె, సౌభమనే విమానము శ్రీకృష్ణుని ద్వారకానగరమునీ విధముగా పీడించుచుండగా, అక్కడ ఎవరి కైననూ శాంతి లభించలేదు.

ప్రద్యుమ్నో భగవాన్ వీక్ష్య బాధ్యమానా నిజాః ప్రజాః

మా భైష్టేత్యభ్యధాద్వీరో రథారూఢ మహాయశాః

గొప్ప కీర్తి గల ప్రద్యుమ్న భగవానుడు వీరుడు. తన ప్రజలు పీడించ బడుచుండుటను గాంచి ఆయన రథమెక్కి, భయపడకుడు, అని పలికెను.

సాత్యకిశ్చారుదేష్ణశ్చ సాంబోఽక్రూరస్సహానుజః

హార్దిక్యో భానువిందశ్చ గదశ్చ శుకసారణా

అపరే చ మ హేష్వాసా రథయూథపయూథపాః

నిర్యయుర్దంశితా గుప్తా రథేభాశ్వపదాతిభిః     

సాత్యకి, చారుదేష్ణుడు, సాంబుడు, అక్రూరుడు, ఆతని సోదరులు, హార్దిక్యుడు, భానువిందుడు, గదుడు, శుకుడు, సారణుడు మరియు ఇతరులు గొప్ప ధనుర్దారులు, రథనాయకులకు నాయకులు. వారు కవచమును వేసుకొని బయల్వెడలిరి. రథములు, ఏనుగులు, గుర్రములు, పదాతులతో కూడిన సైన్యము వారికి రక్షణగా వచ్చెను.

తతః ప్రవవృతే యుద్ధం శాల్వానాం యదుభిస్సహ

యథాఽసురాణాం విబుధౌస్తుములం లోమహర్షణమ్

తరువాత శాల్వుని సైన్యమునకు యాదవులతో, రాక్షసులకు దేవతలతో వలె, గగుర్పాటును కలిగించే దొమ్మి యుద్ధము జరిగెను.

తాశ్చ సౌభపతేరాయా దివ్యాస్త్రై రుక్మిణీసుతః

క్షణేన నాశయామాస వైశం తమ ఇవోష్ణ గుః

రుక్మిణి యొక్క పుత్రుడగు ప్రద్యుమ్నుడు సౌభమనే విమానమునకు అధిపతియగు శాల్వుని ఆ మాయలనైతే, ఉష్ణ కిరణుడగు సూర్యుడు రాత్రియొక్క చీకట్లను వలె, క్షణకాలములో నశింపజేసెను.

వివ్యాధ పంచవింశత్యా స్వర్ణపుంఖైర యోముఖైః

శాల్వస్య ధ్వజినీపాలం శరైస్సన్నతపర్వభిః

బంగరు తోక, లోహపు కొన, నునుపైన కణుపులు గల ఇరవై ఐదు బాణములతో ప్రద్యుమ్నుడు శాల్వుని సేనాయకుని కొట్టెను.

శతేనాతాడయచ్చాల్వమే కైకేనాథ సైనికాన్

దశభిర్దశభిర్నేతృన్ వాహనాని త్రిభిస్త్రిభిః

తరువాత శాల్వుని వంద, సైనికులను ఒక్కొక్కటి, సారథులను పదేసి, రథములను మూడేసి బాణములతో కొట్టెను.

తదద్బుతం మహత్కర్మ ప్రద్యుమ్నస్య మహాత్మనః

దృష్ట్వా తం పూజయామాసుస్సర్వే స్వపర సైనికాః  

మహామనస్వియగు ప్రద్యుమ్నుడు చేసిన ఆ గొప్ప అద్భుతకార్య మును చూచి రెండు పక్షముల సైనికులు అందరు ఆయనను కొనియాడిరి.

బహురూ పైకరూపం తద్దృశ్యతే న చ దృశ్యతే

మాయామయం మయకృతం దుర్విభావ్యం పరైరభూత్

మయునిచే మాయలను నింపీ చేయబడిన ఆ విమానము ఒకప్పుడు ఒకే రూపమును, మరియొకప్పుడు అనేకరూపములను కలిగియుండెను. ఒకప్పుడు కనబడి మరియొకప్పుడు మాయమయ్యే ఆ విమానము శత్రువుల ఊహకైననూ అందకుండెను.

క్వచిద్భూమౌ క్వచిద్వ్యోమ్ని గిరిమూర్డ్నీ జలే క్వచిత్

అలాతచక్రవద్భ్రామ్యత్సౌభం తద్దురవస్థితమ్

ఆ సౌభమనే విమానము కొరివి చక్రము వలె గిర గిర తిరుగుతూ ఒక ప్పుడు నేల పై, ఒకప్పుడు ఆకాశములో, మరియొకసారి పర్వతశిఖరము పై, ఇంకో సమయములో నీటిలో, ఎక్కడైననూ నిలకడ లేకుండ నుండెను.

యత్ర యత్రోపలక్ష్యేత ససౌభస్సహసైనికః

శాల్వస్తతస్తతోకముంచన్ శరాన్ సాత్వతయూథపొః

శాల్వుడు, వాని సైనికులు, సౌభవిమానము ఎక్కడెక్కడ కొంచెమైనా కనబడునో, అక్కడక్కడ యాదవ సేనానాయకులు బాణములను విడిచిరి.

శరైరగ్న్యర్కసంస్పర్శైరాశీవిష దురాసదైః

పీడ్యమానపురానీకశ్శాల్వోకముహ్యత్ప రేరితైః

యాదవులు ప్రయోగించిన బాణములు అగ్నిసూర్యులవలె మండుతూ విషసర్పములు వలె సహించ శక్యము కాకుండెను. వాటిచే శాల్వుని విమానము, సైన్యము కూడ పీడింపబడుటయే గాక, ఆతడు మూర్ఛిల్లెను.

శాల్వానీకపశస్త్రాఘైర్వృష్టి వీరా భృశార్దితాః

న తత్యజూ రణం స్వం స్వం లోకద్వయజిగీషవః

యాదవవీరులు గెలిస్తే ఇహమును, మరణిస్తే పరమును జయించాలనే ఆకాంక్ష గలవారు. శాల్వుని సేనాపతులు ఆయుధముల సమూహములతో పీడించిననూ వారు తమ తమ యుద్ధ క్షేత్రమును విడిచి పెట్టలేదు.

శాల్వామాత్యో ద్యుమాన్నామ ప్రద్యుమ్నం ప్రాక్ ప్రపీడితః

ఆసాద్య గదయా మౌర్వ్యా వ్యాహత్య వ్యనదద్బలీ

ద్యుమంతుడని ప్రసిద్ధి గాంచిన శాల్వుని అమాత్యుడు బలశాలి. వానిని ప్రద్యుమ్నుడు ముందుగా చాల పీడించేను. ఆతడు ఆయనను సమీపించి లోహపు గదతో కొట్టి సింహనాదము చేసెను.

ప్రద్యుమ్నం గదయా శీర్ణవక్షఃస్థలమరిందమమ్

అపోవాహ రణాత్సూతో ధర్మవిద్దారుకాత్మజః

దారుకుని పుత్రుడే శత్రుసంహారకుడగు ప్రద్యుమ్నుని సారధి. ఆతనికి యుద్ధధర్మము తెలియును. గదచే ప్రద్యుమ్నుని వక్షఃస్థలము పగులగా, ఆతడాయనను యుద్ధక్షేత్రమునుండి దూరముగా తీసుకుపోయేను.

లబ్ధసంజ్ఞో ముహూర్తేన కార్ ష్టిసారథిమబ్రవీత్

అహో అసాధ్విదం సూత యద్రణాన్మేఽపసర్పణమ్

శ్రీకృష్ణ పుత్రుడగు ప్రద్యుమ్నుడు ఘడియ కాలములో తెలివిని పొందెను. ఆతడు సారథితో నిట్లనెను – అయ్యో! ఓ సారథీ! నన్ను యుద్ధభూమినుండి దూరముగా తీసుకుపోవుట అనేది తప్పు.

న యదూనాం కులే జాతశ్శ్రూయతే రణవీచ్యుతః

వినా మత్ క్లీబచిత్తేన సూతేన ప్రాప్తకిల్బిషాత్

నేను తప్ప యాదవుల కులములో పుట్టినవాడు యుద్దమునుండి దూరమైనట్లుగా ఎన్నడూ వినలేదు. సారథి పిరికి మనస్సు వాడగుట వలన నాకీ దోషము (అపకీర్తి) ప్రాప్తించినది.

కిం ను వక్ష్యేఽభిసంగమ్య పితరౌ రామకేశవౌ

యుద్ధాత్సమగపక్రాంతః పృష్ణస్తత్రాత్మనః క్షమమ్

యుద్ధమునుండి క్షేమముగా కొనిరాబడిన నేను తండ్రులగు బలరామ శ్రీకృష్ణుల వద్దకు వెళ్లినప్పుడు, వారు నన్ను ప్రశ్నిస్తే, నాకు యోగ్యమైన ఉత్తరమును ఏమని చెప్పను?

వ్యక్తం మే కథయిష్యంతి హసంత్యో భ్రాతృజామయః

క్లైబ్యం కథం కథం వీర తవాన్యైః కథ్యతాం మృధే

నా సోదరుల భార్యలు నవ్వుతూ నిశ్చితముగా నాతో ఇట్లు పలుకగలరు -- ఓ వీరా! యుద్ధములో శత్రువుల యెదుట నీవు నపుంసకుడ వేట్టైతివి? చెప్పుము, చెప్పుము.

సారథిరువాచ

ధర్మం విజానతాఽఽయుష్మన్ కృతమేతన్మయా విభో

సూతః కృచ్ఛగతం రక్షే ద్రథినం సారథిం రథీ

సారథి ఇట్లు పలికెను --- ఓ చిరంజీవీ! ధర్మము తెలిస్తే నేనీ పనిని చేసితిని. నీవు సమర్థుడవు. ఆపదలోనున్న రథికుని సారథి, సారథిని రథికుడు రక్షించవలెను.

ఏతద్విదిత్వా తు భవాన్ మయాఽపోవాహితో రణాత్

ఉపసృష్టః పరేణేతి మూర్ఛితో గదయా హతః  

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే ఉత్తరార్ధే షట్సప్తతితమోఽధ్యాయః

శత్రువు నిన్ను గదతో కొట్టగా నీవు మూర్చిల్లి పీడను పొందితివి. ఈ విషయమును గుర్తించియే నేను నిన్ను యుద్ధరంగమునుండి దూరముగా తీసుకుపోతిని.

శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో యాదవులకు శాల్వునితో యుద్ధమును వర్ణించే డెబ్బది ఆరవ అధ్యాయము ముగిసినది (76).