36 - వృషభాసురుని ఉద్ధారము - కంసుడు అక్రూరుని గోకులమునకు పంపుట

శ్రీశుక ఉవాచ

అథ తర్హ్యాగతో గోష్ఠ మరిప్టో వృషభాసురః మహీం మహాకకుత్కాయః కంపయన్ ఖురవిక్షతామ్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను  ---  శ్రీకృష్ణుడు గోకులములో ప్రవేశించిన తరువాత అప్పుడు గోకులమునకు అరిష్టుడనే రాక్షసుడు వచ్చెను. ఆతడు పెద్ద మూపురముతో కూడిన దేహము గల ఎద్దు రూపములో నుండెను. ఆ ఎద్దు డెక్కలతో భూమిని పగులగొడుతూంటే భూమి కంపించెను.

రంభమాణః ఖరతరం పదా చ విలిఖన్మ హీమ్ ఉద్యమ్య పుచ్ఛం వప్రాణి విషాణాగ్రేణ చోద్ధరన్

ఆ రాక్షసుడు కర్కశముగా రంకెలు వేస్తూ, కాలితో నేలను రాసి దుమ్ము రేగగొడుతూ, తోకను పైకెత్తి కొమ్ము కొనతో మట్టి పెళ్లలను పైకి ఎతి విసిరెను.

కించిత్కించిచ్ఛకృన్ముంచన్ మూత్రయన్ స్తబ్ధలోచనః యస్య నిర్హ్రాది తేనాంగ నిష్ఠురేణ గవాం నృణామ్

పతంత్యకాలతో గర్భాస్స్రవంతి స్మ భయేన వై ! నిర్విశంతి ఘనా యస్య కకుద్యచలశంకయా

ఓ పరీక్షిన్మహారాజా! నిశ్చలమగు కన్నులు గల ఆ ఎద్దు కొంచెము కొంచెము పేడను వేస్తూ మూత్రమును పోయుచుండెను. అది వేసే భయంకరమగు రంకెలకు ఆవుల కే గాక, మానవస్త్రీలకు కూడ గర్భములు ప్రసవసమయము రాకుండానే స్రవించును, లేదా పడిపోవును. వాని మూపురమునందు పర్వతమనే భ్రాంతిచే మేఘములు ఆగుచున్నవి.

తం తీక్ ష్ణ శృంగముద్వీక్ష్య గోప్యో గోపాశ్చ తత్రసుః పశవో దుద్రువుర్భీతా రాజన్ సంత్యజ్య గోకులమ్

ఓ పరీక్షిన్మహారాజా! వాడి కొమ్ములు గల ఆ ఎద్దును చూచి గోపికలు మాత్రమే గాక గోపాలకులు కూడ భయపడిరి. పశువులు భయపడి గోకులమును విడిచి పెట్టి పరుగులు తీసినవి.

కృష్ణ కృష్ణేతి తే సర్వే గోవిందం శరణం యయుః భగవానపి తద్వీక్ష్య గోకులం భయవిద్రుతమ్ మా భైష్టేతి గిరాఽఽశ్వాస్య వృషాసురముపాహ్వయత్ గోపాలైః పశుభిర్మంద త్రాసితైః కిమసత్తమ

వారందరు ఓ శ్రీకృష్ణా! ఓ శ్రీకృష్ణా! అంటూ గోవిందుని శరణు జొచ్చిరి. శ్రీకృష్ణ భగవానుడు కూడ గోకులము భయముతో పరుగులు తీయుచుండుటను గాంచి, భయపడకుడు అని వారికి ధైర్యమును చెప్పెను. అప్పుడాయన ఆ వృషభాసురుని సవాలు చేసి తన వద్దకు పిలుస్తూ ఇట్లు పలికెను ఓరీ జడుడా! నీవు పరమదుష్టుడవు. గోపాలకులను, పశువులను భయ పెట్టి ప్రయోజనమేమున్నది?

బలదర్పహాఽహం దుష్టానాం త్వద్విధానాం దురాత్మనామ్ ఇత్యాస్ఫోట్యాచ్యుతోఽరిష్టం తలశబ్దేన కోపయన్

నీవంటి దుర్బుద్ధులగు దుష్టులకు బలము వలన కలిగే గర్వమును నేను అడంచెదను, అని పలికి శ్రీకృష్ణ భగవానుడు జబ్బ చరచి చప్పట్లను కొట్టి ఆ అరిష్టాసురునకు కోపమును కలిగించెను.

సఖ్యురం సే భుజాభోగం ప్రసార్యావస్థితో హరిః సోఽప్యేవం కోపితోఽరిష్టః ఖురేణావనిముల్లిఖన్

ఉద్యత్పుచ్ఛభ్రమన్మేఘః క్రుద్ధః కృష్ణ ముపాద్రవత్

శ్రీకృష్ణ భగవానుడు పాము పడగవంటి తన భుజమును ఒక మిత్రుని భుజముపై వేసి నిలబడెను. ఈ విధముగా శ్రీకృష్ణుడు కోపమును కలిగించగా, అరిష్టాసురుడు చాల కోపించెను. ఆతడు కాలి గిట్టతో నేలను తవ్వుతూ, తోకను పైకెత్తి దానితో మేఘములను గిర గిర త్రిప్పెను. వాడు శ్రీకృష్ణుని మీదకు ఉరికెను.

అగ్రన్యస్తవిషాణాగ్రః స్తబ్ధాసృగ్లోచనోఽచ్యుతమ్ కటాఽఽక్షిప్యాద్రవత్తూర్ణమింద్రముక్తోఽశనిర్యథా

నిశ్చలమైన రక్తమువంటి కన్నులు గల ఆ రాక్షసుడు తన కొమ్ముల కొనలను ముందుకు ఉంచెను. వాడు శ్రీకృష్ణ భగవానుని అడ్డముగా చూస్తూ, ఇంద్రుడు విడిచి పెట్టిన వజ్రము వలె, వెంటనే మీదకు ఉరికెను.

గృహీత్వా శృంగయోస్తం వా అష్టాదశ పదాని సః

ప్రత్యపోవాహ భగవాన్ గజః ప్రతిగజం యథా

ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ అరిష్టాసురుని కొమ్ములను రెండింటినీ పట్టుకొని, ఏనుగు తన ప్రతిస్పర్ధియగు ఏనుగును వలె, వెనుకకు పదునెనిమిది అడుగుల దూరము గట్టిగా త్రోసి పడగొట్టెను.

సోఽపవిద్ధో భగవతా పునరుత్థాయ సత్వరః

ఆపతత్స్విన్నసర్వాంగో నిశ్శ్వసన్ క్రోధమూర్ఛితః

శ్రీకృష్ణ భగవానుడు క్రింద పడగొట్టగా ఆ రాక్షసుడు మరల వేగముగా పైకి లేచెను. వాడు కోపావిష్టుడై నిట్టూర్పులను విడుస్తూ మీదకు వచ్చెను. వాని అవయవములన్నియు చెమటతో తడిసెను. తమాపతంతం స నిగృహ్య శృంగయోః పదా సమాక్రమ్య నిపాత్య భూతలే!

నిష్పీడయామాస యథాఽఽర్ద్రమంబరం

కృత్త్వా విషాణేన జఘాన సోఽపతత్

మీదకు ఉరుకుచున్న ఆ రాక్షసుని శ్రీకృష్ణుడు రెండు కొమ్ములయందు గట్టిగా పట్టుకొనెను. వానిని ఆయన నేలపై పడగొట్టి కాలితో గట్టిగా తొక్కి పెట్టెను. తడి బట్టను పిండినట్లుగా ఆయన వానిని పిండి వాని కొమ్మును ఊడబెరకి దానితో వానిని పొడువగా, వాడు నేల గూలెను. మీదకు ఉరుకుచున్న ఆ రాక్షసుని శ్రీ కృష్టుడు రెండు కొమ్ములయందు గట్టిగా పట్టుకొనెను. వానిని ఆయను నేలపై పడకొట్టి కాలితో గట్టిగా తొక్కిపెట్టెను. తడి బట్టను పిండినట్లుగా ఆయన వానిని పిండి వాని కొమ్మును ఊడబెరకి దానితో వానిని పొదువగా, వాడు నేల గూలెను.

అసృగ్వమన్మూత్రశకృత్సముత్సృజన్ క్షి పంశ్చ పాదాననవస్థితేక్షణః

జగామ కృచ్ఛ్రం నిరృతేరథ క్షయం పుష్పైః కిరంతో హరిమీడిరే సురాః

ఆ రాక్షసుడు రక్తమును గ్రక్కుతూ మూత్రమును పేడను అధికముగా విడిచి పెడ్తూ కాళ్లను కూడ కొట్టుకొనుచుండెను. వాని చూపులో నిలకడ లేకుండెను. వాడు కష్టపడుతూ మృత్యుదేవత ఒడిని చేరెను. తరువాత దేవతలు పూలవానలను కురిపించి శ్రీకృష్ణ భగవానుని స్తుతించిరి.

ఏవం కకుద్మినం హత్వా స్తూయమానస్స్వజాతిభిః

వివేశ గోష్ఠం సబలో గోపీనాం నయనోత్సవః

శ్రీకృష్ణుడీ విధముగా పెద్ద మూపురము గల వృషభాసురుని సంహరించెను, గోపాలకులు ఆయనను ప్రశంసించిరి. గోపికలకు కన్నుల పండువయగు గోవిందుడు బలరామునితో గోకులమును ప్రవేశించెను.

ఆరిష్టే నిహతే దైత్యే కృష్ణే నాద్భుతకర్మణా

కంసాయాథాహ భగవాన్ నారదో దేవదర్శనః

ఆశ్చర్యకరమగు లీలలను చేసే శ్రీకృష్ణుడు అరిష్టాసురుని వధించెను. అప్పుడు దేవర్షియగు నారద భగవానుడు కంసునితో ఈ క్రింది విధముగా చెప్పేను. నారదుడు తాను దేవుని దర్శించుటయే గాక, భక్తులకు కూడ దేవుని దర్శింపజేయును.

యశోదాయాస్సుతాం కన్యాం దేవక్యాః కృష్ణమేవ చ

రామం చ రోహిణీపుత్రం వసుదేవేన బిభ్యతా

న్యస్తా స్వమిత్రే నందే వై యాభ్యాం తే పురుషా హతాః

నిశమ్య తద్భోజపతిః కోపాత్ప్రచలితేంద్రియః

యశోదకు పుట్టినది ఆడపిల్లయే గాని కృష్ణుడు కాదనియు, కృష్ణుడు దేవకి పుత్రుడనియు, రోహిణి యొక్క పుత్రుడు బలరాముడనియు, వారిద్దరిని నీకు భయపడిన వసుదేవుడు తన మిత్రుడగు నందుని వద్ద దాచినాడనియు, వారిద్దరే నీ అనుచరులను సంహరించినారనియు నారదుడు చెప్పెను. ఆ విషయమును విన్న భోజదేశాధిపతియగు కంసునకు ఇంద్రియములు, మనస్సు వ్యాకులమయ్యెను.

నిశాతమసిమాదత్త వసుదేవజిఘాంసయా

నివారితో నారదేన తత్సుతౌ మృత్యుమాత్మనః

జ్ఞాత్వా లోహమయైః పాశైర్బబంధ సహ భార్యయా

 ప్రతియాతే తు దేవర్షౌ కంస ఆభాష్య కేశినమ్  

ప్రేషయమాస హన్యేతాం భవతా రామకేశవౌ

కంసుడు వసుదేవుని చంపగోరి వాడి కత్తిని తీసుకోగా, నారద మహర్షి అడ్డుకొనెను. బలరామకృష్ణులు తనకు మృత్యువు అని తెలిసిన కంసుడు వసుదేవుని దేవకితో సహా సంకెళ్లతో బంధించెను. దేవర్షి నారదుడు తిరిగి వెళ్లెను. అప్పుడు కంసుడు కేశిని పిలిపించి, నీవు బలరామకృష్ణులను సంహరించుమని పంపించెను.

తతో ముష్టి కచాణూరశలతో శలకాదికాన్

అమాత్యాన్ హస్తిపాంశ్చైవ సమాహూయాహ భోజరాట్

భోభో నిశమ్యతామేతద్వీరచాణూరముష్టికౌ

కేశ పంపిన తరువాత భోజదేశప్రభుడగు కంసుడు, ముష్టికుడు, చాణూరుడు, శలుడు, శలుడు, తోశలుడు మొదలగు మల్లులను, మంత్రులను, మావటీండ్రను కూడ పిలిపించి ఇట్లు పలికెను - -  ఓయీ! ముష్టికా! ఓయీ! చాణూరా! మీరిద్దరు వీరులు. మీరు నా మాటను వినుడు.

నందవ్రజే కిలాసాతే సుతావానకదుందుభేః

రామకృష్ణా తతో మహ్యం మృత్యుః కిల నిదర్శితః

వసుదేవుని పుత్రులగు బలరామకృష్ణులు నందుని గోకులములో ఉన్నారు. సుమా! వారిద్దరి వలననే నాకు మరణము వచ్చునని ఆకాశవాణి చెప్పినది గదా!

భవద్భ్యామిహ సంప్రాప్తౌ హన్యేతాం మల్లలీలయా

మంచాః క్రియంతాం వివిధా మల్లరంగపరిశ్రితాః

పౌరా జానపదాస్సర్వే పశ్యంతు స్వైరసంయుగమ్

బలరామకృష్ణులిద్దరు ఇచటకు వచ్చినప్పుడు మీరిద్దరు వారిని మల్లక్రీడలో సంహరించుడు. మల్లయుద్ధరంగమునందు చుట్టూ పలురకముల ఎత్తైన ఆసనములను ఏర్పాటు చేయుడు. సగర వ్రజలు, పల్లెవాసులు యథేచ్ఛగా జరిగే మల్లయుద్ధమును చూచెదరు గాక!

మహామాత్ర త్వయా భద్ర రంగద్వార్యుపనీయతామ్

ద్విపః కువలయాపీడో జహి తేన మమాహితౌ

ఓ మావటీ! నాకు హితమును చేసేది నీవే. నీవు కువలయాపీడమనే ఏనుగును మల్లరంగద్వారము వద్దకు తీసుకు రమ్ము. దానితో నా శత్రువులగు బలరామకృష్ణులిద్దరిని సంహరించుము.

ఆరభ్యతాం ధనుర్యాగశ్చతుర్దశ్యాం యథావిధి

విశసంతు పశూన్మేధ్యాన్ భూతరాజాయ మీఢు షే

చతుర్దశినాడు ధనుస్సు అనే (శత్రువుపై విజయమునిచ్చే) యాగమును యథావిధిగా ఆరంభించుడు. కోరికలను వర్షించే భూతనాథుడగు భైరవుని కొరకు పవిత్రములైన పశువులను బలి యిండు.

ఇత్యాజ్ఞాప్యార్థతంత్రజ్ఞ ఆహూయ యదుపుంగవమ్

గృహీత్వా పాణినా పాణిం తతోఽక్రూరమువాచ హ

కంసుడు స్వార్థసంపాదనములో పండితుడు. ఆతడు ఈ విధముగా వారిని ఆజ్ఞాపించి తరువాత యాదవశ్రేష్ఠుడగు అక్రూరుని పిలిచెను. ఆయన చేతిని తన చేతితో పట్టుకొని, కంసుడు ఆయనతో నిట్లనెను.

భో భో దానపతే మహ్యం క్రియతాం మైత్రమాదృతః

నాన్యస్త్వత్తో హితతమో విద్యతే భోజవృష్టిషు

ఓయీ! ఓయీ! అక్రూరా! నీవు ఉదారులలో శ్రేష్ఠుడవు. నాకు నీవు మిత్రుడు చేసే ఉపకారమును ఆదరముతో చేయవలెను. భోజవృష్టి వంశీయులలో నీకంటె ఎక్కువ హితమును కోరువాడు మరియొకడు లేడు.

అతస్త్వామాశ్రితస్సౌమ్య కార్యగౌరవ సాధనమ్

యథేంద్రో విష్ణుమాశ్రిత్య స్వార్థ మధ్యగమద్విభుః

కావుననే, ఏ విధముగానైతే ఇంద్రుడు సర్వసమర్థుడే అయినా, విష్ణువు నాశ్రయించి తన రాజ్యమును తిరిగి పొందెనో, అదే విధముగా, నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. నీవు పనిని గొప్పగా సాధించి పెట్టెదవు.

గచ్ఛ నందవ్రజం తత్ర సుతావానకదుందుభేః

ఆసాతే తావిహానేన రథేనానయ మా చిరమ్

నందుని గోకులమునకు వెళ్లుము. అచట వసుదేవుని పుత్రులిద్దరు ఉన్నారు. వారిని ఈ రథము పై ఇచటకు తీసుకు రమ్ము విలంబము, వద్దు.

నిసృష్టః కిల మే మృత్యుర్దేవైర్వైకుంఠసంశ్రయైః

తావానయ సమం గో పైర్నందాద్యైస్సాభ్యుపాయనైః  

విష్ణువు ఆశ్రయముగా గల దేవతలు వారిద్దరిని నాకు మరణ హేతువు లుగా నిర్దేశించిరట గదా! వారిద్దరిని తీసుకు రమ్ము. వారితో బాటుగా నందుడు. మొదలగు గోసాకులను కూడ కానుకలనిచ్చి తీసుకు రమ్ము.

ఘాతయిష్య ఇహానీతౌ కాలకల్పేన హస్తినా

యది ముక్తౌ తతో మల్లైర్ఘాతయే వైద్యుతోపమైః

ఇచటకు తీసుకు రాబడిన వారిద్దరిని మృత్యువుతో సమానమైన ఏనుగుచే చంపించెదను. ఒకచో వారు ఏనుగును తప్పించుకున్నచో, పిడుగులపంటి ముల్లులచే వారిని చంపించెదను.

తయోర్నిహత యోస్తప్తాన్ వసుదేవపురోగమాన్

తద్బంధూన్నిహనిష్యామి వృష్ఠి భోజదశార్హకాన్

వారిద్దరు మరణించగా వారి బంధువులు, వృష్టిభోజదశార్హవంశములకు చెందిన వసుదేవుడు మొదలగువారు దుఃఖితులగుదురు. వారిని కూడ సంహరించెదను. వారిద్దరు మరణించగా వారి బంధువులు, వృష్ణిభోజదశార్హవంశములకు చెందిన వసుదేవుడు మెదలగువారు దుఃఖితులగుదురు. వారిని కూడ సంహరించెదను.

ఉగ్రసేనం చ పితరం స్థవిరం రాజ్యకాముకమ్

తద్భ్రాతరం దేవకం చ యే చాన్యే విద్విషో మమ

నా తండ్రి ఉగ్రసేనుడు ముదుసలియైనా రాజ్యమునందు కోరిక గలవాడు. ఆయనను, ఆయన సోదరుడగు దేవకుని, ఇంకా నన్ను ద్వేషించే ఇతర శత్రువులెవరు గలరో వారిని కూడ సంహరించెదను.

తతశ్చైషా మహీ మిత్ర భవిత్రీ నష్ట కంటకా

జరాసంధో మమ గురుర్ద్వివిదో దయితస్సఖా

ఓ మిత్రమా! తరువాతనైతే ఈ రాజ్యము ముళ్లవంటి శత్రువులు లేనిది యగును. నాకు జరాసంధుడు గురువు, ద్వివిదుడు ప్రియమిత్రుడు.

శంబరో నరకో బాణో మయ్యేవ కృతసౌహృదాః

తైరహం సురపక్షీయాన్ హత్వా భోక్ష్యే మహీం నృపాన్  

శంబరుడు, నరకుడు, బాణుడు నాయందే ప్రేమ గలవారు. వారితో నేను దేవతల పక్షమునకు చెందిన రాజులను చంపి భూసామ్రాజ్యముననుభవించెదను.

ఏతజ్ జ్ఞాత్వాఽఽసయ క్షిప్రం రామకృష్ణావిహార్భకౌ

ధనుర్మఖ నిరీక్షాఽర్థం ద్రష్టుం యదుపురశ్రియమ్  

ఈ రహస్యము నీకు తెలిసినది. నీవు బలరామకృష్ణులనే బుడతల నిచటకు తీసుకు రమ్ము. ధనుర్యాగమును, యాదవుల నగరమైన మథుర యొక్క సంపదను చూచుట కొరకు, అని మాత్రమే చెప్పుము.

అక్రూర ఉవాచ

రాజన్ మనీషితం సమ్య క్తవ స్వావద్యమార్జనమ్  

సిద్ధ్య సిద్ధ్యోస్సమం కుర్యాద్దైవం హి ఫలసాధనమ్  

అక్రూరుడిట్లు పలికెను ---  ఓ రాజా! మరణమును తప్పించుకొనే ఉపాయమును నీవు బాగానే విచారించినావు. కాని, మనము కార్యము సిద్ధించుట, సిద్ధించకపోవుట అనే రెండు పరిస్థితులను సమచిత్తముతో స్వీకరించవలెను. ఏలయన, కార్యసిద్ధి దైవాధీనము.

మనోరథాన్ కరోత్యుచ్చైర్జనో దైవహతానపి

యుజ్యతే హర్షశోకాభ్యాం తథాఽప్యాజ్ఞాం కరోమి తే

మానవుడు పెద్ద పెద్ద కోరికలను కోరును; దైవముచే తిరస్కరించబడే కోరికలను కూడ కోరును. కోరిక సిద్ధిస్తే హర్షమును, సిద్ధించకపోతే శోకమును పొందును. అయిననూ, నేను నీ ఆదేశమును పాటించెదను.

శ్రీశుక ఉవాచ ।

ఏవమాదిశ్య చాక్రూరం మంత్రిణశ్చ విసృజ్య సః

ప్రవివేశ గృహం కంసస్తథాఽక్రూరస్స్వమాలయమ్  

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే షట్త్రింశోఽధ్యాయః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కంసుడు అక్రూరునకు, మంత్రులకు కూడ ఆ విధముగా ఆదేశములనిచ్చి వారికి వెళ్లుటకు అనుమతినిచ్చి తాను ప్రాసాదమును ప్రవేశించెను. అక్రూరుడు తన గృహమునకు చేరుకొనెను.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము పూర్వార్ధములో

వృషభాసురుని ఉద్ధారమును, కంసుడు అక్రూరుని గోకులమునకు

పంపుటను వర్ణించే ముప్పది ఆరవ అధ్యాయము ముగిసినది (36).