19 - శ్రీకృష్ణుడు గోవులను గోపాలకులను దావాగ్నినుండి రక్షించుట

 శ్రీశుక ఉవాచ

క్రీడాఽఽసక్తేషు గో పేషు తధావో దూరచారిణీః

 స్వైరం చరంత్యో వివిశుస్తృణలోభేన గహ్వరమ్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- గోపాలకులు ఆటలలో నిమగ్నులై యుండగా యథేచ్చగా మేయుచున్న వారి గోవులు గడ్డిచే ఆకర్షితములై చాల దూరము వెళ్లి, దట్టని అడవిని ప్రవేశించినవి.

అజా గావో మహిష్యశ్చ నిర్విశంత్యో వనాద్వనమ్

ఇషీ కాటవీం నిర్వివిశుః క్రందంత్యో దావతర్షితాః

మేకలు, గోవులు, గేదెలు ఒక అడవినుండి మరియొక అడవిలోనికి వెళూ, రెల్లు గడ్డి ఉన్న అడవిలోనికి ప్రవేశించినవి. అవి వేసవి తాపముచే దప్పిక గొని ఆక్రోశించుచుండెను.

తేఽపశ్యంతః పశూన్ గోపాః కృష్ణరామాదయస్తదా

శ్రీకృష్ణుడు, బలరాముడు, సుదాముడు మొదలుగా గల ఆ గోపాలకులకు పశువులు కనబడలేదు. వారు ఆటలలో మునిగినందుకు పశ్చాత్తాపపడిరి. అప్పుడు వెదికిననూ వారికి పశువుల జాడ తెలియలేదు.

తృణైస్తత్ఖురదచ్చిన్నైర్గోష్పదైరంకితైర్గవాయ్

 మార్గమన్వగమన్ సర్వే నష్టాజీవ్యా విచేతసః

 వారికి ఆ పశువులే బ్రదుకు దెరువు. అవి కనబడకపోవుట వలన వారి చిత్తములు వ్యాకులమయ్యేమ. గోవులు సేవించిన గడ్డి మైదానములలో గడ్డి పరకలు వాటి డెక్కలచే, దంతములచే త్రింపబడి యుండును. ఆ గడ్డిని బట్టి, వాటి డెక్కల గుర్తులను బట్టి దారిని తెలుసుకుంటూ ఆ దారి వెంబడి వారు వెళ్లిరి.

ముంజాటవ్యాం భ్రష్టమార్గం క్రందమానం స్వగోధనమ్

సంప్రాప్య తృషితాశ్శ్రాంతాస్తతస్తే సన్న్యవర్తయన్

 రెల్లు గడ్డి దట్టముగానున్న అడవిలో వారి పశుసంపద దారి తప్పి ఆక్రోశించుచుండెను. వారా గోవులను కనుగొనిరి. వారు కూడ. అలసి దప్పికతో నుండిరి. వారా గోవులను ఆ అడవినుండి వెనుకకు మళ్లించిరి.

తా ఆహూతా భగవతా మేఘగంభీరయా గిరా

 స్వనామ్నాం నినదం శ్రుత్వా ప్రతినేదుః ప్రహర్షితాః

శ్రీకృష్ణ భగవానుడు మేఘగర్జనవంటి గంభీరమగు స్వరముతో ఆ ఆవులను పిలిచేను. తమ పేర్లను వింటూనే. అవి మహానందమును పొంది, అంబారవముతో బదులు చెప్పినవి.

తతస్సమంతాద్వనధూమకేతుః

యదృచ్చయాఽభూత్ క్షయకృద్వనౌకసామ్

 సమీరితసారథినోల్బణోల్ము కైః

విలేలిహానః స్థిరజంగమాన్ మహాన్

అప్పుడు అనుకోకుండా (ఈశ్వరేచ్ఛచే) పెద్ద కార్చిచ్చు ఆవిర్భవించెను. అది భయంకరమగు కొరివిలతో కదిలే మరియు కదలని  ప్రాణులను అధికముగా మ్రింగివేస్తూ అడవిలోని ప్రాణులను అన్ని వైపులనుండియు వినాశము చేయజొచ్చెను. ఆ అగ్నికి వాయువు తోడై ప్రేరేపించెను.

తమాపతంతం పరితో దవాగ్నిం

 గోపాశ్చ గావః ప్రసమీక్ష్య భీతాః

 ఊచుశ్చ కృష్ణం సబలం ప్రపన్నా

యథా హరిం మృత్యుభయార్దితా జనాః

 ఆ కార్చిచ్చు చుట్టుకుంటూ మీదకు వచ్చుచుండెను. దానిని చూచి గోపాలకులు, గోవులు కూడ భయపడిపోయిరి. ఆ గోపాలకులు బలరామునితో కూడియున్న శ్రీకృష్ణుని, మరణమునకు భయపడి పీడితులైన జనులు శ్రీహరిని వలే, శరణు వేడి పలికిరి.

కృష్ణ కృష్ణ మహావీర హే రామామితవిక్రమ

 దావాగ్నినా దహ్యమానాన్ ప్రపన్నాంస్త్రాతుమర్హసి

ఓ శ్రీకృష్ణా! శ్రీకృష్ణా! నీవు గొప్ప వీరుడవు. ఓ బలరామా! నీ పరాక్రమమునకు హద్దులు లేవు. మేము కార్చిచ్చుచే కాల్చివేయబడుతూ శరణు వేడుచున్నాము. మమ్ములను నీవు కాపాడ తగుదువు.

 నూనం త్వద్బాంధవాః కృష్ణ న చార్హంత్యవసీదితుమ్

వయం హి సర్వధర్మజ్ఞ త్వన్నాథాస్త్వత్పరాయణాః

ఓ శ్రీకృష్ణా! నీకు సకలధర్మములు తెలియును. నీ బందుగులమగు మేము నశించ వలసిన వారము కాము. ఇది నిశ్చయము. ఎందుకంటే, మాకు రక్షకుడవు, పరమగతివి నీవే.

శ్రీశుక ఉవాచ

వచో నిశమ్య కృపణం బంధూనాం భగవాన్ హరిః

 నిమీలయత మా భైష్ట లోచనానీత్యభాషత

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ప్రియమిత్రుల దీనమైన మాటను విన్న శ్రీకృష్ణ భగవానుడు - భయపడకుడు, కళ్లను మూసుకొనుడు -- అని పలికెను.

తథేతి మీలితా క్షేషు భగవానగ్నిముల్బణమ్

 పీత్వా ముఖేన తాన్ కృచ్ఛ్రాద్యోగాధీశో వ్యమోచయత్

వారు సరే అని కళ్లను మూసుకొనిరి. యోగసిద్దులకధీశ్వరుడగు శ్రీకృష్ణ భగవానుడు భయమును గొల్పే అగ్నిని నోటితో త్రాగి వారిని ఆపదనుండి విడిపించెను.

తతశ్చ తేఽక్షీణ్యున్మీల్య పునరాండీరమాపితాః

నిశామ్య విస్మితా ఆసన్నాత్మానం గాశ్చ మోచితాః

తరువాత వారు కళ్లను తెరచి చూచుసరికి మరల భాండీరమనే మర్రి వద్దకు చేర్చబడిరి. తాము, గోవులు - కూడ కార్చిచ్చునుండి విముక్తలగుటను గాంచి వారు ఆశ్చర్యచకితులైరి.

కృష్ణస్య యోగవీర్యం తద్యోగమాయానుభావితమ్

 దావాగ్నేరాత్మనః క్షేమం వీక్ష్య తే మేని రేకమరమ్

శ్రీకృష్ణుడు యోగమాయచే వారిని కార్చిచ్చునుండి కాపాడెను. ఆయనయొక్క ఆ యోగశక్తిని చూచి వారు ఆయన దేవతయని తలచిరి.

గాస్సన్నివర్త్య సాయాహ్నే సహరామో జనార్దనః

వేణుం విరణయన్ గోష్ఠమగాద్గో పైరభిష్టుతః

దుష్టజనశిక్షకుడగు శ్రీకృష్ణుడు బలరామునితో గూడి సాయంకాలము గోవులను వెనుకకు మళ్లించి గోకులమునకు వెళ్లాను. ఆయన దారిలో పిల్లనగ్రోవి పై వివిధస్వరములను పలికిస్తూ ఉంటే చుట్టూ ఉన్న గోపాలకులు ఆయనను స్తుతించిరి.

గోపీనాం పరమానంద ఆసీద్గోవిందదర్శనే

క్షణం యుగశతమీవ యాసాం యేన విన్యాభవత్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

పూర్వార్థే ఏకోనవింశోఽధ్యాయః

 గోవులను పాలించే శ్రీకృష్ణుని చూడగానే గోపికలకు మహానందము కలిగెను. ఆయన లేకుండా వారికి క్షణము వంద యుగముల వలె నుండెను.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో శ్రీకృష్ణుడు గోగోపాలకులను దావాగ్నినుండి రక్షించుటను వర్ణించే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది(19).