భాగవత మహా పురాణము
7 - శకటాసుర సంహారము - తృణావర్తుని ఉద్ధారము
రాజోవాచ ।
యేన యేనావతారేణ భగవాన్ హరిరీశ్వరః ।
కరోతి కర్ణరమ్యాణి మనోజ్ఞాని చ నః ప్రభో ॥
పరీక్షిన్మహారాజు ఇట్లు పలి కెను -- ఓ ప్రభూ! జగన్నియామకుడగు శ్రీహరి భగవానుడు ఏయే అవతారములతో చెవులకు ఇంపైన లీలలను చేయునో, అవి మాకు మనోహరములే.
యచ్ఛృణ్వతోఽపైత్యరతిర్వితృష్ణా సత్త్వం చ శుద్ధ్యత్యతిరేణ పుంసః।
భక్తిర్హరౌ తత్పురుషే చ సఖ్యం తదేవ హారం వద మన్య సే చేత్ ॥
శ్రీహరి లీలలను శ్రవణము చేసే వ్యక్తికి మనస్సునందలి గ్లాని (అందువలననే) మనస్సు శీఘ్రముగా శుద్ధమగును. ఇంతేగాక, శ్రీహరియందు భక్తి, శ్రీహరి భక్తులతో మైత్రి కలుగును. నేను యోగ్యుడనని తమరు భావించే పక్షములో, మనోహరమైన అట్టి శ్రీహరి గాథనే చెప్పుడు.
అథాన్యదపి కృష్ణస్య తోకాచరితమద్బుతమ్ ।
మానుషం లోకమాసాద్య తజ్జాతిమనురుంధతః ॥
శ్రీకృష్ణుడు మానవునిగా జన్మించి మానవుల జీవన శైలినే అనుకరిస్తూ చేసిన మరియొక ఆశ్చర్యకరమగు బాలచేష్ఠను కూడ చెప్పడు.
శ్రీశుక ఉవాచ ।
కదాచిదౌత్థానికకౌతుకాప్లవే జన్మర్ క్షయోగే సమవేతయోషితామ్ । వాదిత్రగీతద్విజమంత్రవాచకైశ్చకార సూనోరభి షేచనం సతీ ॥
శ్రీ శుక మహర్షి ఇట్లు పలి కెను --- బాలకృష్ణుడు పరుండి తిరగబడే సామర్థ్యమును పొందిన రోజు జన్మనక్షత్రము (రోహిణి) కూడ కలిసి వచ్చెను. ఆనాడు అభిషేకించే ఉత్సవమును తల పెట్టగా, యువతులు సమావేశమైరి. వారి మధ్యలో యశోద పుత్రునకు అభిషేకమును చేయగా, వేదవేత్తలు మంత్రములను పఠించిరి. వాటికి వాద్య ఘోష, పాటలు తోడయ్యెను.
నందస్య పత్నీ కృతమజ్జనాదికం విప్రైః కృతస్వస్త్యయనం సుపూజితైః।
అన్నాద్యవాసస్స్రగభీష్ట ధేనుభిస్సంజాతనిద్రాక్షమశీశయచ్ఛనైః ॥
బాలకృష్ణుని స్నానము, అలంకారము మొదలైనవి పూర్తి అయ్యెను. వేదవేత్తలకు భుజించదగిన ఆహారమును, వస్త్రములను, మాలలను, నచ్చిన ఆవులను ఇచ్చి సత్కరించగా, వారు రక్షాబంధనము మొదలైనవి పూర్తి చేసిరి. బాలకృష్ణుని కళ్లలో నిద్ర వ్య క్తము కాజోచ్చెను. అప్పుడు నందుని భార్యయగు యశోద మెల్లగా పిల్లవానిని పరుండబెట్టెను.
ఔత్థానికౌత్సుక్యమనా మనస్వినీ సమాగతాన్ పూజయతీ వ్రజోకసః,
నైవాశృణోద్వై రుదితం సుతస్య సా రుదన్ స్తనార్థీ చరణావుదక్షిపత్।
పిల్లవాడు తిరగబడ్డప్పుడు చేసే ఉత్సవమునందలి ఉత్సాహముతో మనస్సు నిండిపోగా, పెద్ద మనస్సు గల ఆ యశోద విచ్చేసిన గోకులవాసులకు సత్కారములను చేయుచుండెను. ఆమెకు తన పుత్రుని ఏడ్పు సుతరాము వినబడనే లేదు. పాలను కోరి ఏడ్చుచున్న బాలకృష్ణుడు రెండు కాళ్లతో పైకీ తన్నెను.
అధశ్శయానస్య శిశోరనోఽల్పకద్రవాలమృద్వంఘిహతం వ్యవర్తత । విధ్వస్తనానారసకుప్యభాజనం వ్యత్యస్తచక్రాక్షవిభిన్నకూబరమ్ ॥
బండి క్రింద కట్టిన ఊయలలో పరున్న బాలకృష్ణుడు చిగుళ్లవలే మెత్త నైన బుల్లి కాళ్లతో తన్నగా బండి తిరగబడెను. దానియందు కంచు-ఇత్తడి పాత్రలలోని అనేకములైన ద్రవాహారములు నేలపాలయ్యెను. చక్రములు, ఇరుసు తల్లక్రిందులై కూబరము (నోగ) విరిగెను.
దృష్ట్వా యశోదాప్రముఖా ప్రజస్త్రీయ
ఔత్థానికే కర్మణి యాస్సమాగతాః ।
నందాదయశ్చాద్బుతదర్శనాకులాః
కథం స్వయం వై శకటం విపర్యగాత్ ॥
పిల్లవాడు తిరగబడ్డప్పుడు చేసే ఉత్సవమునకు విచ్చేసిన గోకుల స్త్రీలతో కూడిన యశోద, నందుడు మొదలగువారు కూడ ఆ అద్భుతమును చూచి కంగారు పడిరి. బండి తనంత తాను ఎల్లా తిరగబడింది? (అని వారు ఆశ్చర్యపడిరి).
ఊచురవ్యవసీతమతీన్ గోపాన్ గోపీశ్చ బాలకాః ।
రుదతానేన పాదేన క్షిప్తమేతన్న సంశయః ॥
గోపాలకులకు, గోపికలకు బండి తిరగబడిన కారణంకనూ నిర్ధారణ కాలేదు. వారితో పిల్లలు ఇట్లు చెప్పిరి -- ఈ బాలకృష్ణుడు ఏడుస్తూ కాలితో తన్ని దీనిని తల్లక్రిందులు చేసినాడు. దీనిలో సందేహము లేదు.
న తే శ్రద్దధిరే గోపా బాలభాషితమిత్యుత ।
అప్రమేయం బలం తస్య బాలకస్య న తే విదుః ॥
పిల్లలు అల్లాగే చెప్తారు, అది సంభవమా? అంటూ గోపాలకులు వారి మాటలను నమ్మలేదు. అది యుక్తమే. ఆ బాలకృష్ణుని ఊహకందని శక్తి గురించి వారికి తెలియదు.
రుదంతం సుతమాదాయ యశోదా గ్రహశంకీతా ।
కృతస్వస్త్యయనం విప్రైస్సూ క్తైః స్తనమయయత్ ॥
పిల్లవానికి గాలి సోకినదని శంకించిన యశోద ఏడుస్తున్న బాలకృష్ణుని తీసుకొని పాలను తావించెను. వేదవేత్తలు (గ్రహములను దూరము చేసే) సూక్తములను పఠించి పిల్లవానికి మంగళవాచనమును చేసిరి.
పూర్వవత్ స్థాపితం గోపైర్బలిభిస్సపరిచ్చదమ్ ।
విప్రా హుత్వాఽర్చయాంచక్రుర్ధధ్యక్షతకుశాంబుభిః ॥
గోపాలకులు బండికి భాగములనమర్చి ఇదివరలో వలెనే పెరుగు మొదలైన ఉపహారములనుంచి సిద్ధము చేసిరి. వేదవేత్తలు హోమము చేసి పెరుగు, అక్షతలు, దర్భలు, జలములతో బండిని (ఈశ్వరుని) పూజించిరి.
యేఽసూయాఽనృతదం భేర్ష్యాహింసామానవివర్జితాః ।
న తేషాం సత్యశీలానామాశిషో విఫలాః కృతాః ॥
అసూయ (ఇతరుల గుణములను దోషములుగా చూచుట), అసత్యము, డాంబీకము, ఈర్ష్య (ఇతరుల ఉన్నతిని ఓర్వలేకుండుట), హింస, గర్వము లేని సత్యస్వభావులగు వేదవేత్తలు చేసే ఆశీర్వచనములు నిష్పలములు కావు.
ఇతి బాలకమాదాయ సామర్గ్యజురుపాకృతైః ।
జలైః పవిత్రౌషధిభిరభిషిచ్య ద్విజోత్తమైః ॥
వాచయిత్వా స్వస్త్యయనం నందగోపస్సమాహితః ।
హుత్వా చాగ్నిం ద్విజాతిభ్యః ప్రాదాదన్నం మహాగుణమ్ ॥
ఈ విధముగా నిశ్చయించుకొని నందగోపుడు బాలకృష్ణుని తీసుకొని బ్రాహ్మణోత్తములచే అభిషేకము చేయించెను. పవిత్రమగు ఓషధులు కలిపిన ఆ ఆభిషేకజలములు సామవేద-ఋగ్వేద-యజుర్వేదమంత్రములచే అభిమంత్రించబడినవి. తరువాత పుణ్యాహవాచనమును చేయించి, హోమమును కూడ చేసి, బ్రాహ్మణులకు గొప్ప రుచి గల ఆహారమును సమర్పించెను.
గావస్సర్వగుణోపేతా వాసస్స్రగ్రుక్మమాలినీః ।
ఆత్మజాభ్యుదయార్థాయ ప్రాదాత్రే చాన్వయుంజత ॥
ఆయన పుత్రుని క్షేమము కొరకై అన్ని మంచి లక్షణములతో గూడిన ఆవులను వస్త్రములు, పుష్పమాలలు, బంగరు మాలతో సహా ఇచ్చెను. ఆ వేదవేత్తలు ఆశీర్వచనములను పలికిరి.
విప్రా మంత్రవిదో యుక్తా స్తైర్యాః ప్రోక్తాస్తథాఽఽశిషః ।
తా నిష్ఫలా భవిష్యంతి న కదాచిదపి స్పుటమ్ ॥
మంత్రవిదులైన వేదవేత్తలు ఇంద్రియనిగ్రహమును కలిగియుందురు. వారు చేసిన ఆశీస్సులు అటులనే ఫలించును. అవి ఎన్నటికీ నిష్ఫలములు కావనేది తెలిసిన విషయమే.
ఏకదాఽఽరోహమారూఢం లాలయంతీ సుతం సతీ ।
గరిమాణం శిశోర్వోడుం న సేహే గిరికూటవత్ ॥
ఒకనాడు బాలకృష్ణుడు తల్లి యశోదాదేవి ఒడిలోనికి చేరెను. ఆమె ఆ పుత్రుని లాలిస్తూండగా, హఠాత్తుగా ఆమెకు పిల్లవాడు పర్వతశిఖరము వలె బరువుగా దోచేను. ఆమె ఆ బరువును మోయలేకపోయెను.
భూమౌ నిధాయ తం గోపీ విస్మితా భారపీడితా ।
మహాపురుషమాదధ్యౌ జగతామాస కర్మసు ॥
గోపికయగు యశోద ఆశ్చర్యపడి బరువుచే పీడను పొంది ఆ బాలకృష్ణుని నేల పై ఉంచెను. ఆమె పురుషోత్తముని ధ్యానించి సంసారమునకు చెందిన కర్మలలో నిమగ్నురాలయ్యెను.
దైత్యో నామ్నా తృణావర్తః కంసభృత్యః ప్రణోదితః ।
చక్రవాతస్వరూపేణ జహారాసీనమర్భకమ్ ॥
కంసుడు తన సేవకుడైన తృణావర్తుడనే రాక్షసుని పంపెను. ఆతడు పెద్ద సుడిగాలి రూపముతో కూర్చుని ఉన్న బాలకృష్ణుని ఎత్తుకు పోయెను.
గోకులం సర్వమావృణ్వన్ముష్ణంశ్చక్షూంషి రేణుభిః ।
ఈరయన్ సుమహా ఘోరశబ్ధేన ప్రదిశో దిశః ॥
ఆ సుడిగాలి గోకులమునంతనూ కప్పివేసెను. దుమ్ముకణములతో జనుల కన్నులు మూసుకుపోయెను. మిక్కిలి భయమును గొల్పే శబ్దముతో దిక్కులు, విదిక్కులు ప్రతిధ్వనించెను.
ముహూర్తమభవద్గోష్ఠం రజసా తమసాఽఽవృతమ్ ।
సుతం యశోదా నాపశ్యత్తస్మిన్న్యస్తవతీ యతః ॥
గోకులము ఇంచుమించు గంట సేపు దుమ్ముతో చీకటితో కప్పివేయబడెను. యశోద ఎక్కడనైతే కూర్చుండబెట్టెనో అక్కడ పుత్రుడు కనబడలేదు.
నాపశ్యత్కశ్చనాత్మానం పరం చాపి విమోహితః ।
తృణావర్తనిసృష్ఠాభిశ్శర్కరాభిరుపద్రుతః ॥
తృణావర్తుడు విసిరిన ఇసుక రేణువులచే ఉద్విగ్ను డై వ్యామోహితుడైన ఏ ఒక్క డైననూ తనను గాని, ఇతరుని గానీ చూడలేకపోయెను.
ఇతి ఖరపవనచక్రపాంసువర్షే సుతపదవీమబలాఽవిలక్ష్య మాతా, అతికరుణమనుస్మరంత్యశోచద్భువి పతితా మృతవత్సకా యథా గౌః ।
ఈ విధముగా తీక్ష్ణమైన సుడిగాలి వర్షించిన దుమ్ములో పుత్రుని జాడ తల్లి యశోదకు కానరాలేదు. నిస్సహాయురాలగు ఆమె నిరంతరముగా కృష్ణునే స్మరిస్తూ నేలపై పడి, లేగదూడ మరణించిన ఆవు వలె, అతిదీనముగా శోకించెను.
రుదితమనునిశమ్య తత్ర గోప్యో భృశమనుతప్తధియోఽశ్రుపూర్ణముఖ్యః। రురుదురనుపలభ్య నందసూనుం పవన ఉపారతంసువర్షవేగే ॥
తరువాత గాలి. తగ్గి దుమ్ము వర్షముయొక్క వేగము శాంతించెను. గోపికలు ఆ నందుని ఇంటియందు ఏడ్పును వినిరి. నందపుత్రుడగు బాలకృష్ణుని కానరాక వారి మనస్సులు మిక్కుటమగు తాపమును పొందెను. వారు కన్నీళ్లు నిండిన ముఖములు గలవారై ఏడ్చిరి.
తృణావర్తశ్శాంతరయో వాత్యారూపధరో హరన్ ।
కృష్ణం నభోగతో గంతుం నాశక్నోద్భూరిభారభృత్ ॥
సుడిగాలి రూపమును దాల్చి బాలకృష్ణుని ఎత్తుకొని పోయిన. తృణావర్తుడు ఆకాశమును చేరెను. కాని, మోయుచున్న బరువు పెద్దదగుట వలన ఆతని వేగము తగ్గి ముందుకు వెళ్లే శక్తిని కోల్పోయేను.
తమశ్మానం మన్యమాన ఆత్మనో గురువత్తయా ।
గలే గృహీత ఉత్స్రష్ఠుం నాశక్నోదద్భుతార్భకమ్ ॥
ఆ విడ్డూరపు పిల్లవాడు తృణావర్తుని కంటే ఎక్కువ బరువు ఉండెను. ఆ పిల్లవాడు వానికి బండరాయి వలె అనిపించేను. బాలకృష్ణుడు వానిని మెడ పట్టుకొనగా, వాడు విడిపించుకొనలేకపోయెను.
గలగ్రహణనిశ్చేష్ఠో దైత్యో నిర్గతలోచనః ।
అవ్యక్తరావో నపతత్సహభాలో వ్యసుర్వ్రజే ॥
మెడయందు పట్టుకొనుటచే ఆ రాక్షసుని చేష్టలు ఉడిగి కళ్లు పైకి ఉబి కెను. వాని నోటినుండి ధ్వని వచ్చుట లేదు. వాడు ప్రాణములు పోయి పిల్లవానితో సహా గోకులములో క్రింద బడెను.
తమంతరిక్షాత్పత్తం శిలాయాం విశీర్ణసర్వావయవం కరాలమ్ ।
పురం యథా రుద్రశరేణ విద్ధం స్త్రియో రుదత్యో దదృశుస్సమేతాః॥
రుద్రుని బాణముచే కొట్టబడిన త్రిపురము వలె ఆ రాక్షసుడు ఆకసమునుండి రాతిపై పడెను. వాని అవయవములన్నియు నుగ్గు నుగ్గా భయమును గొల్పెను. ఏడ్చుచున్న గోపికలు గుమిగూడి వానిని చూచిరి.
ప్రాదాయ మాత్రే ప్రతిహృత్య విస్మితాః
కృష్ణం చ తస్యోరసీ లంబమానమ్ ।
తం స్వస్తిమంతం పురుషాదనీతం
విహాయసా మృత్యుముఖాత్ప్రముక్తమ్ ।
గోప్యశ్చ గోపాః కిల నందముఖ్యా
లబ్ధ్వ పునః ప్రాపురతీవ మోదమ్ ॥
ఆ రాక్షసుని వక్షఃస్థలము పై వ్రేలాడుతున్న బాలకృష్ణుని చకితులైన గోపికలు తీసుకొని తల్లి యశోదకు అప్పజెప్పిరి. నరమాంసభక్షకుడగు రాక్షసుడు ఆకాశమార్గము గుండా ఎత్తుకొనిపోగా బాలకృష్ణుడు క్షేమముగనే ఉండెను. మృత్యువు నోటినుండి విముక్తు డైన ఆ బాలకృష్ణుని తిరిగి పొంది గోపికలు, నందుడు మొదలుగా గల గోపాలకులు కూడ అతిశయించిన ఆనందమును పొందిరి.
అహో బతాత్యద్బుతమేష రక్షసా ।
బాలో నివృత్తిం గమితోఽభ్యగాత్పునః ।
హింస్రస్స్వపాపేన విహింసితః ఖలః
సాధుస్సమత్వేన భయాద్విముచ్యతే ॥
ఆశ్చర్యము! ఆహా! గొప్ప అద్బుతము! రాక్షసుని చేతిలో మృత్యువు వాత పడిన ఈ బుడతడు మరల ఎదురుగా వచ్చినాడు. హింసించే ఆ దుష్టుడు తన పాపముచేతనే మృత్యువు వాత పడినాడు. సత్పురుషునకు వాని సమదృష్టియే భయమునుండి విముక్తిని కలిగించును.
కిం నస్తపశ్చర్ణమధోక్షజార్చనం
పూర్తేష్టదత్తముత భూతసౌహృదమ్ ।
యత్సంప రేతః పునరేవ బాలకో
దిష్ట్యా స్వబంధూనణయన్నుపస్థితః ॥
మనము ఏమి తపస్సును చేసితిమి? లేక, ఇంద్రియగోచరము కాని శ్రీహరిని ఆరాధించితిమా? నూతులు త్రవ్వించుట మొదలగు సమాజహితకార్యములను చేసితిమా? యజ్ఞయాగాదులను చేసితిమా? దానములను చేసితిమా? లేక ప్రాణులపై దయను . చూపితిమా? ఎందుకంటే, మరణించిన పిల్లవాడు మరల తన బంధువులను హర్షింపజేస్తూ మన ముందున్నాడు. ఇది పరమమంగళము.
దృష్ట్వాఽద్భుతాని బహుశో నందగోపో బృహద్వనే ।
వసుదేవవచో భూయో మానయామాస విస్మితః ॥
నందగోపుడు మహావనములో పలు విధములైన అద్బుతములను చూచి చకితుడై, మరల వసుదేవుని మాటను మెచ్చుకొనెను.
ఏకధాఽర్బకమాదాయ స్వాంకమారోప్య భామినీ ।
ప్రస్తుతం పాయయామాస స్తనం స్నేహపరిప్లుతా ॥
ఒకనాడు తేజస్వినియగు యశోదాదేవి బాలకృష్ణుని తీసుకొని ఒడిలో కూర్చుండబెట్టుకొనెను. ఆమె హృదయము ప్రేమచే ముంచెత్తబడెను. ఆమె పాలను స్రవించుచున్న స్తనమును వానిచే త్రావించెను.
పీతప్రాయస్య జననీ సా తస్య రుచిరస్మితమ్ ।
ముఖం లాలయతీ రాజఞ్జృంభతో దదృశే ఇదమ్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! బాలకృష్ణుడు పాలు త్రాగుట ఇంచుమించు పూర్తి అయ్యెను. తల్లి యశోద ప్రకాశించే చిరునవ్వు గల వాని ముఖమును ముద్దాడెను. ఆవులించిన కృష్ణుని నోటిలో ఆమె ఈ జగత్తును చూచెను.
ఖం రోదసీ జ్యోతిరనీకమాశాసూర్యేందువహ్నిశ్వసనాంబుధీంశ్చ । ద్వీపాన్నగాంస్తద్దుహితూర్వనాని భూతాని యాని స్థిరజంగమాని ॥
ఆకాశమును, ద్యులోకమును, భూలోకమును, నక్షత్రముల గుంపును, దిక్కులను, సూర్యుని, చంద్రుని, అగ్నిని, వాయువును, సముద్రములను, ద్వీపములను, పర్వతములను, వాటినుండి పుట్టే నదులను, అడవులను, కదిలే మరియు కదలని ప్రాణులను కూడ ఆమె చూచెను.
సా వీక్ష్య విశ్వం సహసా రాజన్ సంజాతవేపథుః ।
సమ్మీల్య మృగశాబక్షీ నేత్రే ఆసీతువిస్మితా ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్థే సప్తమోఽఽధ్యాయః ॥
ఓ పరీక్షిన్మహారాజా! లేడి కూన కన్నులవంటి కన్నులు గల ఆ యశోదకు అకస్మాత్తుగా జగత్తును చూడగానే వణుకు పుట్టెను. ఆమె మిక్కిలి ఆశ్చర్యమును పొంది రెండు కళ్లను గట్టిగా మూసుకొని యుండెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో శకటాసుర సంహారమును, తృణావర్తుని ఉద్ధారమును వర్ణించే ఏడవ అధ్యాయము ముగిసినది (7).
Summary of chapter 7 of the Bhāgavata Mahā Purana is as follows:
When infant Kṛshṇa reached three months of age, Yaśodā celebrated His first turning-over ceremony (*Utthāna-utsava*). Placing the sleeping infant beneath a heavy wooden handcart loaded with brass vessels, Yaśodā became occupied with entertaining guests. When Kṛshṇa awoke and cried for milk, He playfully kicked His tiny feet upward. The soft touch of His foot struck the handcart, causing the massive wooden vehicle to shatter, flipping upside down and scattering vessels everywhere. Shortly thereafter, the demon Tṛṇāvarta, dispatched by Kaṁsa in the form of a blinding whirlwind, picked up infant Kṛshṇa and carried Him miles into the upper sky, blinding Gokula with dust. Kṛshṇa became immeasurably heavy in the demon's arms, grabbing Tṛṇāvarta's neck with a chokehold that suffocated the demon, causing him to crash dead upon the rocks below while Kṛshṇa played unharmed on his chest.