భాగవత మహా పురాణము
86 - సుభద్రాహరణ వృత్తాంతము - శ్రీకృష్ణుడు బహులాశ్వ శ్రుతదేవుల పూజలనందుకొనుట
రాజోవాచ !
బ్రహ్మన్ వేదితుమిచ్ఛామస్స్వసారం రామకృష్ణ యోః ।
యథోపయేమే విజయో యా మమాసీత్పితామహీ ॥
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! బలరామ శ్రీకృష్ణుల సోదరియగు సుభద్రను అర్జునుడే విధముగా వివాహమాడెనో తెలియగోరుచున్నాను. ఆమె నాకు నాయనమ్మ అగును.
శ్రీశుక ఉవాచ :
అర్జునస్తీర్థయాత్రాయాం పర్యటన్నవనీం ప్రభుః ।
గతః ప్రభాసమశృణోన్మాతులేయీం స ఆత్మనః ॥
దుర్యోధనాయ రామస్తాం దాస్యతీతి న చాప రే ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- అర్జునుడు గొప్ప సమర్థుడు. ఆయన తీర్థయాత్రలో భాగముగా భూమిని పర్యటిస్తూ ప్రభాసక్షేత్రమునకు వెళ్లాను. తన మేనమామయగు వసుదేవుని కుమార్తె సుభద్రను బలరాముడు దుర్యోధనునకిచ్చి వివాహము చేయబోవుచున్నాడని, ఆమెను ఆతనికిచ్చుట ఇతరులైన శ్రీకృష్ణాదులకు అంగీకారము కాదనియు వినెను.
తల్లిప్పుస్స యతిర్భూత్వా త్రిదండీ ద్వారకామగాత్ ॥
తత్ర వై వార్షికాన్ మాసానవాత్సీత్స్వా ర్థసాధకః ।
పౌరైస్సభాజితోఽభీక్ ష్ణం రామేణాజనతా చ సః ॥
ఆమెను పొందగోరి అర్జునుడు త్రిదండి సన్న్యాసీ వేషముతో ద్వారకకు వెళ్లాను. అర్జునునకు తన ప్రయోజనమును సాధించుకొనుట బాగా తెలియును. పురజనులు, ఈ సంగతి తెలియని బలరాముడు కూడ ఆయనను అధికముగా సమ్మానించిరి. ఆయన అచటనే వర్షకాలము నాల్గు నెలలు నివసించెను.
ఏకదా గృహమనీయ ఆతిథ్యేన నిమంత్ర్యతమ్ ।
శ్రద్ధయోపహృతం భైక్ష్యం బలేన బుభుజే కిల ॥
ఒకనాడు బలరాముడు అతిథి సత్కారము నిమిత్తమై ఆ అర్జునుని ఆహ్వానించి ఇంటికి తీసుకువచ్చి భిక్షాన్నమును సమర్పించెను. అర్జునుడు దానిని భుజించెను.
సోఽపశ్యత్తత్ర మహతీం కన్యాం వీరమనోహరామ్ ।
ప్రీత్యుత్ఫుల్లేక్షణస్తస్యాం భావక్షుబ్ధం మనో దధే ॥
ఆతనికక్కడ వీరుల మనస్సును దోచే యుక్తవయస్సు వచ్చిన కన్య కనబడెను. ఆయన కన్నులు ప్రేమతో వికసించి మనస్సు ప్రేమచే విచలితమాయేను.
సాఽపి తం చకమే వీక్ష్య నారీణాం హృదయంగమమ్ ।
హసంతీ వ్రీడితాపాంగీ తన్న్యస్తహృదయేక్షణా ॥
ఆమె నవ్వుతూ సిగ్గుతో ప్రక్క చూపులు చూస్తూ చూపులను, మనస్సును ఆయనకు సమర్పించివేసెను. స్త్రీలకు మనోహరుడైన ఆ. అర్జునుని చూచి ఆమె కూడ ఇష్టపడెను.
తాం పరం సమనుధ్యాయన్నంతరం ప్రేప్సురర్జునః ।
న లేభే శం భ్రమచ్చిత్తః కామేనాతిబలీయసా ॥
అర్జునుడు ఆమెను మాత్రమే ధ్యానించుచుండెను. ఆమెను హరించే అవకాశము కొరకు ఆతడు ఎదురుచూచుచుండెను. మీక్కిలి దృఢమైన ప్రేమచే ఆతని మనస్సు భ్రమించెను. ఆతనికి మనశ్శాంతి కరువాయెను.
మహత్యాం దేవయాత్రాయాం రథస్థాం దుర్గనిర్గతామ్ ।
జహారానుమతః పిత్రో: కృష్ణస్య చ మహారథః ॥
సుభద్ర . తల్లిదండ్రులగు దేవకీవసుదేవులకు, శ్రీకృష్ణునకు కూడ అర్జునుడు సుభద్రను వివాహమాడుట అంగీకారము. సుభద్ర దేవయాత్ర సందర్భముగా దుర్గమునుండి బయటకు వచ్చెను. గొప్ప రథికుడగు అర్జునుడు రథమునందున్న ఆమెను తీసుకువెళ్లాను.
రథస్థో ధనురాదాయ శూరాంశ్చారుంధతో భటాన్ ।
విద్రావ్య క్రోశతాం స్వానాం స్వభాగం మృగరాడివ ॥
రథమునందున్న అర్జునుడు ధనుస్సు పట్టుకొని, అన్ని వైపులనుండియు అడ్డు పడుచున్న శూరులైన భటులను పారద్రోలేను. సుభద్ర బంధువులు ఆక్రోశించుచుండగా ఆతడు, సింహము తన భాగమును వలే, సుభద్రను తీసుకువెళ్లాను.
తచ్ఛ్రుత్వా క్షుభితో రామః పర్వణీవ మహాఽర్ణవః ।
గృహీతపాదః కృష్ణేన సుహృద్భిశ్చాన్వశామ్యత ॥
ఆ విషయమును విని బలరాముడు, పూర్ణిమనాడు మహాసముద్రము వలె, కల్లోలపడెను. శ్రీకృష్ణుడు, బంధువులు కూడ ఆయన కాళ్లు పట్టుకొని శాంతింపజేసిరి.
ప్రాహిణోత్పారిబర్హాణి వరవధ్వోర్ముదా బలః।
మహాధనోపస్కరేభరథాశ్వనరయోషితః ॥
బలరాముడు ఆనందముతో వధూవరులగు సుభద్రార్జునులకు చాల ధనమును, సామగ్రిని, ఏనుగులను, రథములను, గుర్రములను, పరిచారకులను, పరిచారికలను పెళ్లికానుకగా పంపెను.
శ్రీశుక ఉవాచ !
కృష్ణ స్యాసిద్ద్విజశ్రేష్ఠశ్శ్రుతదేవ ఇతి శ్రుతః ।
కృష్ణైకభక్త్యా పూర్ణార్థశ్శాంతః కవిరలంపటః ॥
శ్రీకృష్ణునకు శ్రుతదేవుడని ప్రసిద్ధి గాంచిన బ్రాహ్మణశ్రేష్ఠుడు భక్తుడుగా నుండెను. శ్రీకృష్ణునియందలి ఏకాంతభక్తిచే పూర్ణ మైన మనోరథములు గల ఆయన శాంతుడు, వివేకి, విషయభోగములయందు ఆసక్తి లేనివాడు.
స ఉవాస విదేహేషు మిథిలాయాం గృహాశ్రమీ । అనీహయాఽఽవగతాహార్యనిర్వర్తితనిజక్రియః ॥
విదేహదేశములోని మిథిలానగరమునందు ఆ గృహస్థుడు నివసించెను. ఆయన అప్రయత్నముగా లభించిన ఆహారముతో జీవికను నడిపెడివాడు.
యాత్రామాత్రం త్వహరహర్దైవాదుపనమత్యుత ।
నాధికం తావతా తుష్టః క్రియాశ్చక్రే యథోచితాః ॥
ప్రారబ్దము వలన ఆయనకు ప్రతిదినము దేహయాత్రకు మాత్రము తప్పనిసరిగా లభించెడిది. కాని, అధికము వచ్చెడిది కాదు. ఆయన లభించినదానితో సంతోషిస్తూ యోగ్యములైన కర్మలను (అతిథి సత్కారము ఇత్యాది) చేసెడివాడు.
తథా తద్రాష్ట్రపాలోఽoగ బహులాశ్వ ఇతి శ్రుతః ।
మైథిలో నిరహంమాన ఉభావప్యచ్యుతప్రియౌ ॥
ఓ పరీక్షిన్మహారాజా! అదే విధముగా, ఆ దేశమును పాలించే జనకవంశీయుడగు రాజు, బహులాశ్వుడని ప్రసిద్ది జెందినవాడు, అహం కారము లేనివాడు. వీరిద్దరు కూడ శ్రీకృష్ణ భగవానుని ప్రీతికి పాత్రులు.
తయోః ప్రసన్నో భగవాన్ దారుకేణాహృతం రథమ్ ।
ఆరుహ్య సాకం మునిభిర్విదేహాన్ ప్రయయౌ ప్రభుః ॥
సర్వసమర్థుడగు శ్రీకృష్ణ భగవానుడు వారిద్దరిపై ప్రసన్నుడాయెను. ఆయన మహర్షులతో గూడి, దారుకుడు తెచ్చిన రథమునెక్కి, విదేహదేశమునకు పయనమాయెను.
నారదో వామదేవోఽత్రిః కృష్ణో రామోఽసితోఽరుణిః ।
అహం బృహస్పతిః కణ్వో మైత్రేయశ్చ్యవనాదయః ॥
నారదుడు, వామదేవుడు, అత్రి, వ్యాసుడు, పరశురాముడు, అసితుడు, అరుణుడు, నేను (శుకమహర్షి), బృహస్పతి, కణ్వుడు, మైత్రేయుడు, చ్యవనుడు మొదలైన మహర్షులు ఆయనతో పాటు ఉండిరి.
తత్ర తత్ర తమాయాంతం పౌరా జానపద నృప ।
ఉపతస్థుస్సార్ఘ్యహస్తా గ్రహైస్సూర్యమివోదితమ్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! అక్కడక్కడ పురజనులు, పల్లెవాసులు చేతులలో పూజాసామగ్రిని పట్టుకొని, వచ్చుచున్న ఆ శ్రీకృష్ణునకు, గ్రహములతో సహా ఉదయించిన సూర్యుని వలె, నమస్కరించిరి.
ఆనర్తధన్వకురుజాంగలకంకమత్స్య-
పాంచాలకుంతిమధుకేకయకోసలార్జాః ।
అన్యే చ తన్ముఖసరోజముద్రహాస-
స్నిగ్ధక్షణం నృప పపుర్దృశిభిర్నృనార్యః ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఆనర్త ధన్వ కురుజాంగల కంక మత్స్య పాంచాల కుంతి మధు కేకయ కోసల అర్ణ దేశములకు చెందినవారు ఇతరులు పురుషులు స్త్రీలు కూడ ఆయనయొక్క పద్మమువంటి ముఖమును కళ్లతో పానము చేసిరి. ఆయన ముఖము పై ఔదార్యముతో కూడిన నవ్వు, ప్రేమతో నిండిన చూపులు గలవు.
తేభ్యస్స్వవీక్షణవినష్టతమిస్రదృగ్భ్యః
క్షేమం త్రిలోకగురురర్థదృశం చ యచ్చన్ ।
శృణ్వన్ దిగంతధవలం స్వయశోఽశుభఘ్నం
గీతం సురైర్నభిరగాచ్ఛనకైర్విదేహాన్ ॥
ముల్లోకములకు తండ్రియగు శ్రీకృష్ణ భగవానుడు మెల్లగా విదేహదేశ మునకు వెళ్లాను. ఆయనను చూచుటచే జనుల బుద్దియందలి అజ్ఞానము నశించి అభయము కలుగుచుండెను. పది దిక్కులయందు వ్యాపించిన ఆయనయొక్క స్వచ్చమైన కీర్తిని దేవతలు, మానవులు గానము చేయుచుండగా ఆయన వినుచుండెను. ఆ కీర్తి అశుభములను పోగొట్టును.
తేఽచ్యుతం ప్రాప్తమాకర్ణ్య పౌరా జానపద నృప ।
అభీయుర్ముదితాస్తస్మై గృహీతార్హణపాణయః ॥
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ భగవానుడు వచ్చినాడని విని ఆ పురజనులు, పల్లెవాసులు ఆనందముతో ఆయన కొరకు పూజాసామగ్రులను చేతులలో పట్టుకొని ఎదురేగిరి.
దృష్ట్వా త ఉత్తమశ్లోకం ప్రీత్యుత్ఫుల్లాననాశయాః ।
కైర్ధృతాంజలిభిర్నేముశ్శ్రుతపూర్వాంస్తథా మునీన్ ॥
పవిత్రకీర్తియగు శ్రీకృష్ణ భగవానుని చూచి వారి ముఖములు, హృదయములు ఆనందముతో వికసించెను. వారు చేతులు జోడించి తలలు వంచి ఆయనకు, మహర్షులకు కూడ నమస్కరించిరి. ఆ మహర్షుల గురించి వారిదివరలో వినియుంటిరి.
స్వానుగ్రహాయ సంప్రాప్తం మన్వానౌ తం జగద్గురుమ్ ।
మైథిలశ్శ్రుతదేవశ్చ పాదయోః పేతతుః ప్రభోః ॥
జగత్తునకు తండ్రియగు ఆ శ్రీకృష్ణ భగవానుడు తమను అనుగ్రహించుటకై వచ్చినాడని తెలిసి మిథిలానరేశుడగు బహులాశ్వుడు, శ్రుతదేవుడు కూడ ఆ ప్రభుని పాదములపై పడిరి.
న్యమంత్రయేతాం దాశార్హమాతిథ్యేన సహ ద్విజైః ।
మైథిలశ్శ్రుతదేవశ్చ యుగపత్సంహతాంజలీ ॥
మిథిలానరేశుడగు బహులాశ్వుడు, శ్రుతదేవుడు కూడ ఒకే సారి దోసిలియొగ్గ దశార్హవంశీయుడగు శ్రీకృష్ణుని, మహర్షులతో బాటుగా, ఆతిథ్యమునకు ఆహ్వానించిరి.
భగవాంస్తదభిప్రేత్య ద్వయోః ప్రీయచికీర్షియా ।
ఉభయోరావిశద్గేహముభాభ్యాం తదలక్షితః ॥
వారి ఆ ఆహ్వానమునంగీకరించి శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరికి ప్రీతిని కలిగించ గోరెను. ఆయన వారికి తెలియకుండా ఇద్దరి యింటిని రెండు వేర్వేరు రూపములతో ప్రవేశించెను.
శ్రోతుమప్యసతాం దూరాన్ జనకస్స్వగృహాగతాన్ !
ఆనీతేష్వాసనాగ్ర్యేషు సుఖాసీనాన్మహామనాః ॥
ప్రవృద్ధభక్త్యా ఉద్ధర్షహృదయాస్రావిలేక్షణః ।
నత్వా తదంఘ్రీన్ ప్రక్షాల్య తదపో లోకపావనీః ॥
సకుటుంబో వహన్మూర్ధ్నా పూజయాంచక్ర ఈశ్వరాన్ । గంధమాల్యాంబరాకల్పధూపదీపార్ఘ్యగోవృషైః ॥
శ్రీకృష్ణుడు, ఆ మహర్షులు దుష్టులకు కూతవేటు దూరములో . నుండెదరు. తన గృహమునకు వచ్చిన వారికి పెద్ద మనస్సు గల జనకుడు శ్రేష్ఠ మగు ఆసనములను సమర్పించెను. వారు సుఖముగా కూర్చుండగా ఆయనకు భక్తి బాగా వర్ధిల్లి హృదయములో ఆనందోద్రేకము కలిగి, కళ్లు నీటితో నిండిపోయెను. ఆయన వారికి నమస్కరించి పాదములను కడిగి పరివారముతో సహా, జనులను పవిత్రము చేసే ఆ నీటిని తలపై చల్లుకొనెను. ఆ మహాత్ములను ఆయన గంధము, మాలలు, వస్త్రములు, భూషణములు, ధూపము, దీపము, ఇతరపూజాసామగ్రి, ఆవు, ఎద్దులనిచ్చి పూజించెను.
వాచా మధురయా ప్రీణన్నిదమాహాన్నతర్పితాన్ ।
పొదావంకగతౌ విష్ణోస్సంస్పృశఞ్ఛ్న కైర్ముదా ॥
ఆహారముతో సంతృప్తి జెందిన వారికి ఆ రాజు మధురమగు వాక్కుతో కూడ ప్రీతిని కలిగించెను. ఆయన శ్రీకృష్ణ భగవానుని పాదములను ఒడిలో ఉంచుకొని ఆనందముతో మెల్లగా నొక్కెను.
రాజోవాచ !
భవాన్ హి సర్వభూతానామాత్మా సాక్షీ స్వదృగ్ విభో ।
అథ నస్త్వత్పదాంభోజం స్మరతాం దర్శనం గతః ॥
బహులాశ్వమహారాజు ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! నీవు నిశ్చయముగా సకలప్రాణులలో మనస్సాక్షివగు సాక్షి చైతన్యమవు, ఆత్మస్వరూపుడవు. కావుననే, నిన్ను స్మరించే మాకు దర్శనమిచ్చినావు.
స్వవచస్తదృతం కర్తుమస్మద్దృగ్గోచరో భవాన్ ।
యదాత్థైకాంతభక్తాన్మే నానంతశ్ర్శీరజఃప్రియః ॥
నాకు అనన్యభక్తునికంటే సంకర్షణుడు గాని, లక్ష్మీదేవి గాని, బ్రహ్మదేవుడు గాని ఎక్కువ ప్రియులు కాదు అని నీవు చెప్పితివి. నీ ఆ మాటను సత్యము చేయుటకై నీవు మాకు దర్శనమిచ్చితివి.
కో ను త్వచ్చరణాంభోజమేవంవిద్విసృజేత్పుమాన్ ।
నిష్కించనానాం శాంతానాం మునీనాం యస్త్వమాత్మదః ॥
సర్వస్వమును విడిచి పెట్టి శాంతముగా ఉండే మునులకు నీవు నిన్నే సమర్పించెదవు. ఈ సత్యమును తెలుసుకున్న ఏ వ్యక్తి నీ పద్మమువంటి పాదమును విడిచి పెట్టును?
యోఽవతీర్య యదోర్వం శే నృణాం సంసరతామిహ ।
యశో వితేనే తచ్ఛాంత్యై త్రైలోక్యవృజినాపహమ్ ॥
నీవు యదువంశములో అవతరించి ముల్లోకముల పాపమును పోగొట్టే నీ కీర్తిని విస్తరింపజేసితివి. నీ కీర్తి ఈ లోకములో సంసారబద్దులైన జనులకు సంసారమునుపశమింప జేయును.
నమస్తుభ్యం భగవతే కృష్ణాయాకుంఠమేధ సే ।
నారాయణాయ ఋషయే సుశాంతం తప ఈయు షే ॥
ఓ శ్రీకృష్ణ భగవానుడా! మొక్కవోని విజ్ఞానశక్తి గల నీకు నమస్కారము. నీవు నారాయణ మహర్షి వై మిక్కిలి శాంతమగు తపస్సును చేసితివి.
దినాని కతిచిద్భూమన్ గృహాన్నో నివస ద్విజైః ।
సమేతః పాదరజసా పునీహీదం నిమేః కులమ్ ॥
ఓ పరబ్రహ్మా! మహర్షులతో కూడినవాడవై కొన్ని రోజులు మా ఇంటిలో నివసించి, పాదధూళితో నిమియొక్క వంశమును పవిత్రము చేయుము.
ఇత్యుపామంత్రితో రాజ్ఞా భగవాంల్లోకభావనః ।
ఉవాస కుర్వన్ కల్యాణం మిథిలానరయోషితామ్ ॥
ప్రాణులను కాపాడే శ్రీకృష్ణ భగవానుడు బహులాశ్వమహారాజుచే ఈ విధముగా ఆహ్వానించబడి అక్కడే నివసిస్తూ మిథిలా నగరమునందలి స్త్రీపురుషులకు మంగళమును చేసెను.
శ్రుతదేవోఽచ్యుతం ప్రాప్తం స్వగృహాన్ జనకో యథా ।
నత్వా మునీన్ సుసంహృష్టో ధున్వన్ వాసోననర్హ హ ॥
బహులాశ్వుడు లాగానే శ్రుతదేవుడు కూడ తన ఇంటికి వచ్చిన శ్రీకృష్ణ భగవానునకు, మహర్షులకు నమస్కరించి మహానందముతో వస్త్రమును చుట్టూ తిప్పుతూ నాట్యము చేసెను.
తృణపీఠబృసీ ష్వేతానానీతేషూపవేశ్య సః ।
స్వాగతేనాభినంద్యాంఘ్రీన్ సభార్యోపఽవనిజే ముదా ॥
ఆ శ్రుతదేవుడు భార్యతో గూడి తుంగచాపలను, పీటలను, దర్భా సనములను తెచ్చి వాటిపై వారిని కూర్చుండబెట్టెను. ఆయన స్వాగత వచనములతో వారిని అభినందించి, ఆనందముతో పాదములను కడిగెను.
తదంభసా మహాభాగ ఆత్మానం సగృహాన్వయమ్ ।
స్నాపయాంచక్ర ఉద్ధర్షో లబ్ధసర్వమనోరథః ॥
గొప్ప సౌభాగ్యము గల ఆ శ్రుతదేవుడు ఆ నీటిని తనపై, ఇంటిలో, కుటుంబములోనివారిపై చల్లి మహానందమును పొందెను. ఆయన మనోరథములన్నియు ఈడేరెను.
ఫలార్హణోశీరశివామృతాంబుభిర్మృదా సురభ్యా తులసీకుశాంబుజైః,
ఆరాధయామాస యథోపపన్నయా సపర్యయా సత్త్వవివర్ధనాంధసా!
ఆయన పళ్లు, పూజాద్రవ్యములు, వట్టివ్రేళ్లతో చల్లనైన అమృతమువంటి జలములు, పరిమళము గల మట్టి, తులసి, దర్భలు, పద్మములతో, సత్త్వగుణమును వర్ధిల్లజేసే ఆహారముతో, తేలికగా లభించే పూజాసామగ్రితో వారిని ఆరాధించెను.
స తర్కయామాస కుతో మమాన్వభూత్
గృహాంధకూపే పతితస్య సంగమః ।
యస్సర్వతీర్థాస్పదపాదరేణుభిః
కృష్ణేన చాస్యాత్మనికేతభూసురైః ॥
ఇల్లు అనే చీకటి నూతిలో పడియున్న నాకు శ్రీకృష్ణునితో, మరియు ఆయన స్వరూపమునకు నివాసమైన మహర్షులతో సమాగమము కలిగెను.
ఈ మహర్షుల పాదధూళియందు సకలతీర్థములు నివాసముండును. ఇట్టి సమాగమము నాకెట్లు కలిగినదో? అని ఆ శ్రుతదేవుడు తలపోసెను.
సూపవిష్టాన్ కృతాతిథ్యాన్ శ్రుతదేవ ఉపస్థితః ।
సభార్యస్వజనాపత్య ఉవాచాంఘ్ర్యభిమర్శనః ॥
శ్రుతదేవుడు భార్య, పిల్లలు, బంధువులతో గూడి వారికి అతిథిసత్కారమును చేసెను. వారు విశ్రాంతిగా కూర్చున్నప్పుడు దగ్గరగా కూర్చుండి వారికి పాదములను నొక్కుతూ ఆయన ఇట్లు పలికెను.
శ్రుతదేవ ఉవాచ ।
నాద్య నో దర్శనం ప్రాప్తః పరం పరమపూరుషః ।
యర్హీదం శక్తిభిస్సృష్ట్వా ప్రవిష్టో హ్యాత్మసత్తయా ॥
శ్రుతదేవుడిట్లు పలి కెను --- పురుషోత్తముడవగు నీవు మాకు ఈనాడు మాత్రమే దర్శనమీయలేదు. ఎందుకంటే, ఎప్పుడైతే నీవీ జగత్తును నీ శక్తులతో సృష్టించి సత్తాస్ఫూర్తిరూపముగా ప్రవేశించినావో, అప్పుడే దర్శనమిచ్చినావు.
యథా శయానః పురుషో మనసైవాత్మమాయయా ।
సృష్ట్వా లోకం పరం స్వాప్నమనువిశ్యావభాసతే ॥
అదెల్లాగంటే, నిద్రిస్తున్న వ్యక్తి తన అజ్ఞానమునకు వశుడై మనస్సులో జాగ్రదావస్థకంటే విలక్షణమైన మరియొక స్వప్నప్రపంచమును సృష్టించి, దాని సత్తాస్ఫూర్తులుగా తానే ప్రవేశించి తాను అనేకముగా భాసించును.
శృణ్వతాం గదతాం శశ్వదర్చతాం త్వాభివందతామ్ ।
నృణాం సంవదతామంతర్హృది భాస్యమలాత్మనామ్ ॥
సర్వదా నీ గురించి శ్రవణము చేస్తూ, కీర్తిస్తూ, పూజిస్తూ, నమస్కరిస్తూ, చర్చిస్తూ ఉండే స్వచ్చమైన అంతఃకరణము గల వ్యక్తులకు నీవు హృదయము లోపల ప్రకాశించుచున్నావు..
హృదిస్టోఽప్యతిదూరస్థః కర్మవిక్షిప్తచేతసామ్ ।
ఆత్మశక్తిభిరగ్రాహ్యాఽప్యంత్యు పేతగుణాత్మనామ్ ॥
కర్మలచే చెల్లాచెదరైన మనస్సు గలవారలకు నీవు హృదయమునందే ఉన్నా చాల దూరములోనున్నావు. మనస్సుయొక్క వృత్తులతో నిన్ను తెలియుట శక్యము కాదు. అయినా, సంస్కృతమైన మనస్సు గలవారలకు నీవు దగ్గరలో (ఆత్మరూపముగా ) ఉన్నావు.
నమోఽస్తు తేఽధ్యాత్మవిదాం పరాత్మనే
అనాత్మనే స్వాత్మవిభక్తమృత్యవే ।
సకారణాకారణలింగమీయు షే
స్వమాయయాఽసంవృతరుద్ధదృష్ట యే ॥
నీవు ఆత్మజ్ఞానులకు అంతరతమమగు ఆత్మవు. కాని, దేహాభిమానికి నీవు నీ నుండి మృత్యువును పంపెదవు. మహత్తత్త్వము మొదలైన కారణతత్త్వములు, అవ్యక్తమాయాశక్తి నీకు ఉపాధులు. మాయాశక్తి నీకు ఆవరకము కాకున్ననూ, సంసారుల వివేకదృష్టిని కప్పివేయును. అట్టి నీకు నమస్కారము.
స త్వం శాధి స్వభృత్యాన్నః కిం దేవ కరవామ హే ।
ఏతదంతో నృణాం క్లేశో యద్భవానక్షిగోచరః ॥
ఓ దేవా! అట్టి (మాయాశక్తిని శాసించే) నీవు నీ సేవకులమగు మమ్ము ఆదేశించుము. మేము ఏమి చేయవలెను? మానవులకు ఏ క్షణములో నీవు కంటబడేదవో, అదే క్షణములో దుఃఖములు అంతమగును.
శ్రీశుక ఉవాచ ।
తదుక్తమిత్యుపాకర్ణ్య భగవాన్ ప్రణతార్తిహా ।
గృహీత్వా పాణినా పాణిం ప్రహసంస్తమువాచ హ ॥
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రుతదేవుడు చెప్పిన ఈ మాటను విని, ప్రణమిల్లినవారి దుఃఖములను బాపే శ్రీకృష్ణ భగవానుడు చేతితో చేతిని పట్టుకొని నవ్వుతూ ఆయనతో నిట్లనెను.
శ్రీభగవానువాచ ।
బ్రహ్మంస్తేఽనుగ్రహార్థాయ సంప్రాప్తాన్ విద్ధ్యమూన్ మునీన్ ।
సంచరంతి మయా లోకాన్ పునంతః పాదరేణుభిః ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- ఓ మహాత్మా! ఈ మహర్షులు నిన్ను అనుగ్రహించుటకే వచ్చినారని తెలియుము. వీరు నన్ను హృదయ ములో నిలిపి సంచరిస్తూ పాదధూళితో జనులను పవిత్రము చేయుదురు.
దేవాః క్షేత్రాణి తీర్థాని దర్శనస్పర్శనార్చనైః ।
శనైః పునంతి కాలేన తదప్యర్హత్తమేక్షయా ॥
దేవతలు, క్షేత్రములు, తీర్థములు చూచి స్పృశించి అర్చించినచో మెల్లగా చాల కాలమునకు పవిత్రము చేయును. వాటి పావన శక్తి కూడ మహాత్ముల దృష్టి చేతనే వాటికి వచ్చినది. కాని, మహాత్ములను చూచినంత మాత్రాన మానవుడు పవిత్రుడగును.
బ్రాహ్మణో జన్మనా శ్రేయాన్ సర్వేషాం ప్రాణినామిహ ।
తపసా విద్యయా తుష్ట్యా కిము మత్కలయా యుతః ॥
ఈ లోకములోనీ సకలప్రాణులలో బ్రాహ్మణుడు పుట్టుకచే, తపస్సుచే, విద్యచే, సంతోషముచే శ్రేష్ఠుడు. నా ఉపాసన కూడ గల బ్రాహ్మణుడు శ్రేష్ఠుడని వేరుగా చెప్పవలయునా?
న బ్రాహ్మణాన్మే దయితం రూపమేతచ్చతుర్భుజమ్ ।
సర్వవేదమయో విప్రస్సర్వదేవమయో హ్యహమ్ ॥
ఈ నాల్గు భుజముల రూపము నాకు బ్రాహ్మణునికంటే ఎక్కువ ప్రియమైనది కాదు. ఎందుకంటే, బ్రాహ్మణుడు సకలవేదరూపుడు కాగా, నేను సకలదేవతారూపుడను.
దుష్ప్రజ్ఞా అవిదిత్వైవమవజానంత్యసూయవః ।
గురుం మాం వీప్రమాత్మానమర్చాఽఽదవిజ్యదృష్టయః ॥
దుర్బుద్దులు ఈ విధముగా తెలుసుకోకుండా దోషములను వెదికెదరు. ప్రతిమ, తీర్థము మొదలైనవి మాత్రమే పూజనీయములనే భావనతో వారు ఆత్మరూపుడు, పూజనీయుడు, నా స్వరూపుడు అగు బ్రాహ్మణుని అవమానించేదరు.
చరాచరమిదం విశ్వం భావా యే చాస్య హేతవః ।
మద్రూపాణీతి చేతస్యాధత్తే విప్రో మదీక్షయా ॥
బ్రాహ్మణుడు సర్వమునందు నన్నే చూచును. స్థావరజంగమా త్మకమగు ఈ జగత్తు, దానికి కారణములగు మహత్తత్త్వము మొదలైనవి నా రూపములేనని ఆతడు మనస్సులో అనుసంధానము చేయును.
తస్మాద్బ్రహ్మఋషీనేతాన్ బ్రహ్మన్ మచ్ఛ్రద్దయాఽర్చయ ।
ఏవం చేదర్చితోఽస్మ్యద్ధా నాన్యథా భూరిభూతిభిః ॥
ఓ మహాత్మా! కావున, ఈ మహర్షులను నాయందు చూపే శ్రద్ధతో పూజించుము. అట్లైనచో, సాక్షాత్తుగా నన్నే అర్చించినట్లగును. లేనిచో, పుష్కలమైన ఉపచారములను చేసినా నన్ను పూజించినట్లు కాదు.
శ్రీశుక ఉవాచ !
స ఇత్తం ప్రభుణాఽఽదిష్టస్సహకృష్ణాన్ ద్విజోత్తమాన్ ।
ఆరాధ్యైకాత్మభావేన మైథిలశ్చాప సద్గతిమ్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణ ప్రభునిచే ఈ విధముగా ఆదేశించబడిన ఆ శ్రుతదేవుడు, మిథిలాధిపతియగు బహులాశ్వుడు కూడ శ్రీకృష్ణుని, ఆ గొప్ప మహర్షులను ఒకే ఆత్మ అనే భావముతో ఆరాధించి, సత్పురుషుల గతి (మోక్షము) ని పొందిరి.
ఏవం స్వభక్తయో రాజన్ భగవాన్ భక్తభక్తిమాన్ ।
ఉషిత్వాఽఽదిశ్య సన్మార్గం పునర్ద్వారవతీమగాత్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే
ఉత్తరార్ధే షడశీతితమోఽధ్యాయః ॥
ఓ పరీక్షిన్మహారాజా! భక్తులయందు ప్రేమ గల శ్రీకృష్ణ భగవానుడీ విధముగా భక్తులిద్దరి వద్ద నివసించి, వారికి సాధుపురుషుల మార్గమునుపదేశించి, మరల ద్వారకా నగరమునకు తిరిగి వచ్చెను.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో
సుభద్రాహరణ వృత్తాంతమును, శ్రీకృష్ణుడు బహులాశ్వ శ్రుతదేవుల
పూజలనందుకొనుటనువర్ణించే
ఎనుబది ఆరవ అధ్యాయము ముగిసినది (86).
* * * * *
Summary of chapter 86 of the Bhāgavata Mahā Purana is as follows:
Arjuna traveled on pilgrimage to Prabhāsa, where he met Lord Balarāma and saw Kṛshṇa's sister, Subhadrā. Falling deeply in love with her, Arjuna sought Kṛshṇa's advice. Kṛshṇa advised Arjuna to kidnap Subhadrā according to the Kshatriya hero custom during a public festival, as Balarāma planned to marry her to Duryodhana. Arjuna drove his chariot into the festival, lifted Subhadrā onto his chariot, and sped away, defeating the pursuing Kaurava guards. Balarāma was initially enraged, but Kṛshṇa pacified Him, and Balarāma joyfully celebrated their marriage. Later, Śrī Kṛshṇa expanded Himself into two identical forms to visit two devoted souls simultaneously in Mithilā: King Bahulāśva and an impoverished brāhmaṇa named Śrutadeva, accepting their simple offerings of fruit and water with equal love.