49 - అక్రూరుడు హస్తినాపురమునకు వెళ్లుట

శ్రీశుక ఉవాచ

స గత్వా హాస్తినపురం పౌరవేంద్రయశోంఽకితమ్

దదర్శ తత్రాంబికేయం సభీష్మం విదురం పృథామ్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆ అక్రూరుడు హస్తినాపురమునకు వెళ్లెను. అక్కడి ప్రతి వస్తువు పురువంశీయులగు మహారాజుల కీర్తికి అద్దము పట్టుచుండెను. అచట ఆయన అంబిక పుత్రుడగు ధృతరాష్ట్రుని, భీష్ముని, విదురుని, కుంతిని చూచెను.

సహపుత్రం చ బాహ్లీకం భారద్వాజం సగౌతమమ్

కర్ణం సుయోధనం ద్రోణిం పాండవాన్ సుహృదోఽపరాన్

            ఆయన అచట బాహ్లీకుని, ఆయన పుత్రుడగు సోమదత్తుని, కృపాచార్యుని, భరద్వాజుని పుత్రుడగు ద్రోణుని, ఆయన పుత్రుడగు అశ్వత్థామను, కర్ణుని, దుర్యోధనుని, పాండవులను, ఇతర ప్రియబంధువులను చూచెను.

యథావదుపసంగమ్య బంధుభిర్గాందినీసుతః

సంపృష్ట స్తైస్సుహృద్వారాం స్వయం చాపృచ్ఛదవ్యయమ్

గాందిని పుత్రుడగు అక్రూరుడు బంధువులను యథోచితముగా కలుసుకొనెను. వారాయనను బంధువుల క్షేమసమాచారమును అడిగి తెలుసుకొనిరి. ఆయన కూడ వారి క్షేమమునడిగి తెలుసుకొనెను.

ఉవాస కతి చిన్మాసాన్ రాజ్ఞో వృత్తవివిత్సయా

దుష్ప్రజస్యాల్పసారస్య ఖలచ్ఛందానువర్తినః

ధృతరాష్ట్ర మహారాజు పుత్రులు దుష్టులు. ఆయన మనోబలము తక్కువ. కావుననే, ఆయన ఆ దుష్టుల ఇష్టమునకు అనుకూలముగా నడుచుకొనును. ఆయన ప్రవృత్తిని తెలియగోరి అక్రూరుడు అచట కొన్ని మాసములు నివసించెను.

తేజ ఓజో బలం వీర్యం ప్రశ్రయాదీంశ్చ సద్గుణాన్

ప్రజాఽనురాగం పార్ధేషున సహద్భిశ్చికీర్షితమ్

కృతం చ ధార్తరాష్ట్రైర్యధరదానాద్య పేశలమ్

ఆచక్యౌ సర్వమేవాస్మై పృథా విదుర ఏవ చ

పాండవులయందు తేజస్సు, శస్త్ర నైపుణ్యము, బలము, పరాక్రమము, వినయము, దయ మొదలగు సద్గుణములు గలవు. ప్రజలకు వారిపై అనురాగము గలదు. దీనిని ధృతరాష్ట్రుని పుత్రులగు దుర్యోధనాదులు సహించ లేకపోయిరి. వారు పాండవుల పై విషప్రయోగము మొదలగు కుట్రలను పన్నిరి. ఇంకనూ వారిపై కుట్రలను పన్నుతూనే ఉన్నారు. ఈ వివరములనన్నింటినీ కుంతి, విదురుడు అక్రూరునకు వివరించి చెప్పిరి.

పృథా తు భ్రాతరం ప్రాప్తమక్రూరముపసృత్య తమ్

ఉవాచ జన్మనిలయం స్మరంత్యశ్రుకలేక్షణా

కుంతి వచ్చిన తన సోదరుడగు ఆ అక్రూరుని వద్దకు వెళ్లెను. ఆమెకు పుట్టిల్లు గుర్తుకు వచ్చి కళ్లు నీళ్లతో నిండెను. ఆమె ఆయనతో నిట్లనెను.

అపి స్మరంతి నస్సౌమ్య పితరౌ భ్రాతరశ్చ మే

భగిన్యో భ్రాతృపుత్రాశ్చ జామయస్సఖ్య ఏవ చ

ఓ ప్రియదర్శనా! నా తల్లిదండ్రులకు (శూరుడు, ఆయన భార్య), సోదరులకు, అప్పచెల్లెళ్లకు, సోదరుల పుత్రులకు, దేవకి మొదలైన కులస్త్రీలకు , చెలికత్తెలకు మేము గుర్తు ఉన్నామా?

భ్రాత్రేయో భగవాన్ కృష్ణ శ్శరణ్యో భక్తవత్సలః

పైతృష్వ సేయాన్ స్మరతి రామశ్చాంబురు హేక్షణః

నా సోదరుడగు వసుదేవుని పుత్రుడగు శ్రీకృష్ణ భగవానుడు భక్తులయందు మిక్కుటమగు ప్రేమ గలవాడు. పొందదగినవాడు. ఆయన, పద్మమువంటి కన్నులు గల బలరాముడు అత్తనగు నా పుత్రులను స్మరించెదరా?

సపత్నమధ్యే శోచంతీం వృకాణాం హరిణీమివ

సాంత్వయిష్యతి మాం వాక్యైః పితృహీనాంశ్చ బాలకాన్

తోడేళ్ల మధ్యలోనున్న లేడి వలె, నేను శత్రువుల మధ్యలో చిక్కుకొని దుఃఖిస్తున్నాను. నన్ను, తండ్రి లేని పుత్రులను ఆయన అనునయవాక్యములతో ఓదార్చునా?

కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన

ప్రపన్నాం పాహి గోవింద శిశుభిశ్చావసీదతీమ్

ఓ శ్రీకృష్ణా! ఓ శ్రీకృష్ణా! నీవు మహాయోగివి, సకలప్రాణుల ఆత్మవు, జగత్తును పాలించువాడవు. ఓ గోవిందా! నేను పిల్లలతో కేశపడుతూ నిన్ను శరణు జొచ్చినాను. నన్ను రక్షించుము.

నాన్యత్తవ పదాంభోజాతృశ్యామి శరణం నృణామ్

బిభ్యతాం మృత్యుసంసారాదీశ్వరస్యాపవర్గికాత్

మానవులు మృత్యువుతో కూడిన సంసారమునకు భయపడుచుందురు. వారికి రక్షణనిచ్చేది ఈశ్వరుడవగు నీయొక్క మోక్ష ప్రదమగు పాదపద్మముకంటె మరియొకటి నాకు కానరాదు.

సమః కృష్ణాయ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే

యోగేశ్వరాయ యోగాయ త్వామహం శరణం గతా

శ్రీకృష్ణుడు గుణసంస్పర్శ లేని పరబ్రహ్మ, పరమాత్మ. ఆయన మాయాశక్తికి అధీశ్వరుడు, జ్ఞానఘనుడు. ఓ శ్రీకృష్ణా! నేను నిన్ను శరణు వేడుచున్నాను.

శ్రీశుక ఉవాచ

ఇత్యనుస్మృత్య స్వజనం కృష్ణం చ జగదీశ్వరమ్

ప్రారుదద్దుఃఖితా రాజన్ భవతాం ప్రపితామహీ

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! మీ తాత తల్లి ఈ విధముగా తన వారిని, జగన్నాథుడగు శ్రీకృష్ణుని కూడ గుర్తు చేసుకొని దుఃఖితురాలై బిగ్గరగా రోదించెను.

 సమదుఃఖసుఖోఽక్రూరో విదురశ్చ మహాయశాః

సాంత్వయామాసతుః కుంతీం తత్పుత్రోత్పత్తి హేతుభిః

కుంతీ సుఖమే అక్రూరుని సుఖము. ఆమె దుఃఖము ఆయనకు కూడ దుఃఖమే. ఆయన గొప్ప కీర్తి గల విదురునితో గూడి కుంతిని, ఆమె పుత్రుల జన్మకు హేతువులైన దేవతల మహిమను ప్రస్తావించి ఓదార్చెను.

యాస్యన్ రాజానమభ్యేత్య విషమం పుత్రలాలసమ్

అవదత్సుహృదాం మధ్యే బంధుభిస్సౌహృదోదితమ్

అక్రూరుడు తిరిగి వెళ్లబోవువాడై ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లెను. ఆ రాజునకు పుత్రలాలస మెండు. ఆయనకు పాండవుల యెడల పుత్రులతో సమానమైన ప్రేమ లేదు. అక్రూరుడు బంధువుల మధ్యలోనున్న రాజుతో, బంధువులైన శ్రీకృష్ణాదులు ప్రేమతో చెప్పిన మాటలను చెప్పెను.

అక్రూర ఉవాచ

భో భో వైచిత్రవీర్య త్వం కురూణాం కీర్తివర్ధన

భ్రాతర్యుపరతే పాండావధునాఽఽసనమాస్థితః

అక్రూరుడిట్లు పలికెను --- ఓయీ! ఓయీ! ధృతరాష్ట్రా! విచిత్రవీర్యుని పుత్రుడవగు నీవు కురువంశీయుల కీర్తిని వర్దిల్ల జేసెదవు. నీ తమ్ముడు పాండువు మరణించిన పిదప నీవు ఇప్పుడు ఇప్పుడు సింహాసనమును అధిష్ఠించితివి.

ధర్మేణ పాలయన్నుర్వీం ప్రజాశ్శీలేన రంజయన్

వర్తమానస్సమస్స్వేషు శ్రేయః కీర్తిమవాప్స్యసి

నీవు ధర్మముగా భూమిని పాలిస్తూ, సచ్ఛీలముతో జనులను రంజిల్ల జేస్తూ, బంధువులయందు సమబుద్ధి కలిగి ఉన్నచో, సద్గతిని కీర్తిని పొందగలవు.

అన్యథా త్వాచరంల్లోకే గర్హితో యాస్యసే తమః

తస్మాత్సమత్వే వర్తస్వ పాండవేష్వాత్మజేషు చ

దీనికి భిన్నముగా నీవు విరుద్ధముగా చేసినచో, జనులు నిన్ను నిందించుటయే గాక, నీవు నరకమును పొందెదవు. కావున, నీవు నీ పుత్రులయందు, పాండుపుత్రులయందు సమానముగా వ్యవహరించుము.

నేహ చాత్యంతసంవాసః కరిచిత్కేనచిత్సహ

రాజన్ - స్వేనాపి దేహేన కిము జాయాఽఽత్మజాదిభిః

ఓ రాజా! ఈ లోకములో ఎవడైననూ ఎప్పుడైననూ దేనితోనైననూ, తన దేహముతోనైననూ, నిత్యము కలిసియుండుట సంభవము కాదు. భార్య, పిల్లలు, బంధువులు మొదలగువారితో నిత్యసంవాసము అసంభవమని వేరుగా చెప్పవలయునా? (చెప్పనక్కర లేదు).

ఏకః ప్రసూయతే జంతురేక ఏవ ప్రలీయతే

ఎకోఽనుభుంక్తే సుకృతమేక ఏవ చ దుష్కృతమ్

జీవుడు ఒంటరిగా పుట్టి, ఒంటరిగానే పుణ్యపాపములననుభవించి, ఒంటరిగానే గిట్టును.

అధర్మోపచితం విత్తం హరంత్యన్యేఽకల్ప మేధసః

సంభోజనీయాపదే శైర్జలానీవ జలౌకసః

నీటిలో నివసించే ప్రాణుల సర్వస్వమైన నీటిని ఆ నీటిలో నివసించే ఇతరప్రాణులు త్రాగివేయును. అదే విధముగా, మూర్ఖుడు అధర్మముతో ధనమును ప్రోగు చేయును. మేము నీకు పోషించదగినవారము అని కబుర్లను చెప్పి ఇతరులు వాని ధనమును లాగుకొనెదరు.

పుష్ణాతి యానధర్మేణ స్వబుద్ధ్యా తమపండితమ్

తేఽకృతార్థం ప్రహిణ్వంతి ప్రాణా రాయస్సుతాదయః

అవివేకి ప్రాణములను, సంపదలను, పుత్రాదులను తనవనే భావనతో అధర్మమును చేసి పోషించును. వాడు జీవితములో ఆత్మజ్ఞానము లేక అకృతార్థుడుగనే మిగిలిపోవును. ఆ ప్రాణములు, సంపదలు, పుత్రాదులు కూడ వానిని పరిత్యజించును.

స్వయం కిల్బిషమాదాయ తైస్త్య క్తో నార్థకోవిదః

అసిద్ధార్థో విశత్యంధం స్వధర్మవిముఖస్తమః

అవివేక తన ధర్మమునందు రుచిని కోల్పోయి పురుషార్థపరిజ్ఞానము లేనివారై పురుషార్థమునుండి జారిపోవును. అట్టివాడు పుత్రాదులచే పరిత్యజించబడినవాడై పాపమును మూట గట్టుకొని దుఃఖముతో నిండిన నరకములో పడిపోవును.

తస్మాల్లో కమిమం రాజన్ స్వప్నమాయామనోరథమ్

వీక్ష్యాయమ్యాత్మనాఽఽత్మానం సమశ్శాంతో భవ ప్రభో

ఓ రాజా! నీవు సర్వసమర్ధుడవు. ఈ లోకము కల, ఇంద్రజాలము, మనస్సు యొక్క విలాస అని తెలుసుకొసుము. నీవు నీ మనస్సును వశము చేసుకొని సమచిత్తుడవు, శాంతుడవు కమ్ము.

ధృతరాష్ట్ర ఉవాచ

యథా వదతి కల్యాణీం వాచం దానపతే భవాన్ !

తథాఽనయా స తృప్యామి మర్త్యః ప్రాప్య యథాఽమృతమ్

ధృతరాష్ట్రుడిట్లు పలికెను --- ఓ అక్రూరా! నీవు మథురలో అన్నదానమును చేసిన పుణ్యాత్ముడవు. మరణించబోవు మానవునకు అమృతము దొరికినచో, వానికి దానిపై చాలు అనే భావన కలుగదు. అదే విధముగా, నీవు చెప్పిన కల్యాణకరమగు వచనములపై నాకు చాలు అనే భావన కలుగుట లేదు.

తథాఽపి పి సూనృతా సౌమ్య హృది న స్థీయతే చలే

పుత్రానురాగవిషమే విద్యుత్సౌదామనీ యథా

ఓ ప్రియదర్శనా! నీ వచనము సత్యము. అయిననూ పుత్రునియందలి ఆసక్తిచే విషమము మరియు చంచలము అగు నా హృదయమునందు, మేఘమునందలి మెరుపు వలె, నిలబడుట లేదు.

ఈశ్వరస్య విధిం కో ను విధునోత్యన్యథా పుమాన్

భూమేర్భారావతారాయ యోఽవతీర్ణో యదోః కులే

ఈశ్వరుని నిర్ణయమును విధముగా చేయగల మొనగాడెవడు? (ఎవ్వడూ లేడు). అట్టి ఈశ్వరుడు భూమి యొక్క భారమును తగ్గించుటకై యదువంశమునందు అవతరించి యున్నాడు.

యో దుర్విమర్శపథయా నిజమాయయేదం

సృష్ట్వా గుణాన్ విభజతే తదనుప్రవిష్టః

తస్మై నమో దురవబోధవిహారతంత్ర -  

సంసారచక్రగతయే పరమేశ్వరాయ

పరమేశ్వరుని మాయాశక్తి యొక్క మార్గము ఊహకు అందదు. ఆ ఈశ్వరుడు ఆ మాయాశక్తితో ఈ జగత్తును సృష్టించి, తరువాత దానియందు అంతర్యామిగా ప్రవేశించి, సత్త్వరజస్తమోగుణముల మేళవింపుతో వైవిధ్యమును కలుగజేయును. సంసారమనే చక్రము యొక్క భ్రమణమునకు ముఖ్య కారణము ఆ పరమేశ్వరుని లీలయే. ఆ లీల యొక్క స్వరూపము మస్తిష్కమునకు అందేది కాదు. అట్టి పరమేశ్వరుని కొరకు నమస్కారము.

శ్రీశుక ఉవాచ

ఇత్యభిప్రేత్య నృపతేరభిప్రాయం స యాదవః

 సుహృద్బిస్సమనుజ్ఞాతః పునర్యదుపురీమగాత్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- యదువంశీయుడగు అక్రూరుడు ఈ విధముగా , ధృతరాష్ట్ర మహారాజు యొక్క అభిప్రాయమును తెలుసుకొనెను. ఆయన బంధువుల వద్ద సెలవు తీసుకొని మరల మథురానగరమునకు వెళ్లెను.

శశంస రామకృష్ణాభ్యాం ధృతరాష్ట్ర విచేష్టితమ్

పాండవాన్ ప్రతి కౌరవ్య యదర్థం ప్రేషి తస్స్వయమ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

పూర్వార్ధే ఏకోనపంచాశోఽధ్యాయః

దశమ స్కంధ పూర్వార్ధస్సమాప్తః

కురువంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! అక్రూరుడు పాండవుల యెడల ధృతరాష్ట్రుని ప్రవృత్తిని బలరామ శ్రీకృష్ణులకు చెప్పెను. ఆయన పంపబడినది. దాని కొరకే గదా!

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో అక్రూరుడు హస్తినాపురమునకు వెళ్లుటను వర్ణించే నలుబది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (49).

దశమ స్కంధ పూర్వార్ధము ముగిసినది.

హరిః ఓమ్, తత్సత్, శ్రీకృష్ణార్పణమస్తు.