భాగవత మహా పురాణము
71 - శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థమునకు విచ్చేయుట
శ్రీశుక ఉవాచ ।
ఇత్యుదీరితమాకర్ణ్య దేవర్షేరుద్ధవోఽబ్రవీత్ ।
సభ్యానాం మతమాజ్ఞాయ కృష్ణస్య చ మహామతిః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- గొప్ప బుద్ధిశాలియగు ఉద్ధవుడు దేవర్షియగు నారదుని ఈ వచనములను విని, సభ్యుల అభిప్రాయమును, శ్రీకృష్ణుని అభిప్రాయమును కూడ తెలుసుకొని ఇట్లు పలికెను.
ఉద్ధవ ఉవాచ ।
యదుక్తమృషిణా దేవ సాచివ్యం యక్ష్యతస్త్వయా ।
కార్యం పైతృష్వసేయస్య రక్షా చ శరణైషిణామ్ ॥
ఉద్ధవుడిట్లు పలికెను -- దేవా! మీ తండ్రిగారి సోదరి కొడుకు ధర్మరాజు చేయబోయే యాగమునకు సాహాయ్యము చేయవలెనని నారద మహర్షి
చెప్పిన మాటను తమరు పాటించి, శరణు కోరువారిని రక్షించదగును.
యష్టవ్యం రాజసూయేన దిక్చక్రజయినా విభో ।
అతో జరాసుతజయ ఉభయార్థో మతో మమ ॥
ఓ ప్రభూ! దిక్కుల మండలమును జయించి రాజసూయయాగమును చేయవలెను. కావున, జరాసంధుని జయించుట వలన రెండు ప్రయోజనములు (రాజసూయమును చేయుట, బందీలను రక్షించుట) సిద్ధించునని నా అభిప్రాయము.
అస్మాకం చ మహానర్థో హ్యేతేనైవ భవిష్యతి ॥
యశశ్చ తవ గోవింద రాజ్ఞో బద్ధాన్ విముంచతః ॥
ఇట్లు చేయుటచే మనకు కూడ గొప్ప ప్రయోజనము కలుగగలదు. ఓ గోవిందా! బందీలైన రాజులను విడిపించిన కీర్తి కూడ నీకు కలుగును.
స వై దుర్విషహో రాజా నాగాయుతసమో బలే ।
బలినామపి చాన్యేషాం భీమం సమబలం వినా ॥
ఆ జరాసంధ మహారాజు బలములో పది వేల ఏనుగులతో సమానుడు. ఆతనితో సమానమగు బలము గల భీముని మినహాయించి, మిగిలిన బలశాలురు కూడ ఆతనిని ఎదుర్కొని నిలబడలేరు. ఇది నిశ్చయము.
ద్వైరథే స తు జేతవ్యో మా శతాక్షౌహిణీయుతః ।
బ్రహ్మణ్యోఽభ్యర్థితో విప్రైర్న ప్రత్యాఖ్యాతి కర్హిచిత్ ॥
ఆ జరాసంధుని ద్వంద్వయుద్ధములో జయించవలెనే గాని, ఆతడు వంద అక్షౌహిణీలతో కూడియుండ జయించ శక్యము కాదు. ఆతడు బ్రాహ్మణభక్తుడు. ఏ కాలమునందైనా వేదవేత్తల కోరికను తిరస్కరించడు.
బ్రహ్మవేషధరో గత్వా తం భిక్షేత వృకోదరః ।
హనిష్యతి న సందేహో ద్వైరథే తవ సన్నిధౌ ॥
భీముడు బ్రాహ్మణవేషమును దాల్చి వెళ్లి కోరవలేను. నీ సన్నిధిలో ద్వంద్వయుద్ధములో భీముడాతనిని నిస్సందేహముగా సంహరించగలడు.
నిమిత్తం పరమీశస్య విశ్వసర్గనిరోధయోః ।
హిరణ్యగర్భశ్శర్వశ్చ కాలస్యారూపిణస్తవ ॥
జగత్తుయొక్క సృష్టికి బ్రహ్మదేవుడు, ప్రళయమునకు రుద్రుడు కేవలము నిమిత్తము మాత్రమే. వాస్తవములో రూపము లేని నీవే కాలరూపుడవై సర్వమును శాసించుచున్నావు.
గాయంతి తే విశదకర్మ గృహేషు దేవ్యో
రాజ్ఞాం స్వశత్రువధమాత్మవిమోక్షణం చ ।
గోప్యశ్చ కుంజరపతేర్జనకాత్మజాయాః
పిత్రోశ్చ లబ్ధశరణా మునయో వయం చ ॥
జరాసంధునిచే బంధించబడిన రాజుల గృహములలో రాణులు నీవు తమ శత్రువును వధించి తమ ప్రియులను విముక్తులను చేసెదవని నీ స్వచ్ఛమగు కీర్తిని గానము చేయుచున్నారు. గోపికలు తమను నీవు శంఖచూడునినుండి విముక్తులను చేయుటను, నిన్ను శరణు వేడిన మేము నీవు నీ తల్లిదండ్రులగు దేవకీవసుదేవులను చెరనుండి విడిపించుటను, మహర్షులు గజేంద్రమోక్షమును, జానకిని చెరనుండి విడిపించుటను గురించి గానము చేయుచున్నారు.
జరాసంధవధః కృష్ణ భూర్యర్థాయోపకల్పతే ।
ప్రాయః పాకవిపాకేన తవ చాభిమతః క్రతుః ॥
ఓ శ్రీకృష్ణా! జరాసంధుని వధించుట వలన చాల గొప్ప ప్రయోజనములు సిద్ధించును. బహుశః జరాసంధుని పాపకర్మ పండుటచే, రాజుల పుణ్యకర్మ పరిపక్వమగుటచే నీవు కూడ యజ్ఞమునిష్టపడుచున్నావు.
శ్రీశుక ఉవాచ ।
ఇత్యుద్ధవవచో రాజన్ సర్వతోభద్రమచ్యుతమ్ ।
దేవర్షిర్యదువృద్ధాశ్చ కృష్ణశ్చ ప్రత్యపూజయన్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! ఉద్ధవుని ఈ వచనము అన్ని విధములుగా కల్యాణమును చేయును. ఆ వచనమును పాటించినచో ఫలము చేజారిపోదు. ఆతని సలహాను నారద మహర్షి, యాదవవృద్ధులు మాత్రమే గాక, శ్రీకృష్ణుడు కూడ కొనియాడిరి.
అథారిశత్ప్రయాణాయ భగవాన్ దేవకీసుతః ।
భృత్యాన్ దారుకజైత్రాదీననుజ్ఞాప్య గురూన్ విభుః ॥
తరువాత దేవకీనందనుడు, సర్వసమర్థుడు అగు శ్రీకృష్ణ భగవానుడు పెద్దల అనుమతి తీసుకొనెను. అపుడాయన దారుకుడు, జైత్రుడు, ప్రబలుడు మొదలగు సైనికులను ప్రయాణమునకు ఆదేశించెను.
నిర్గమయ్యావరోధాన్ స్వాన్ ససుతాన్ సపరిచ్ఛదాన్ ।
సంకర్షణమనుజ్ఞాప్య యదురాజం చ శత్రుహన్ ।
సూతోపనీతం స్వరథమారుహద్గరుడధ్వజమ్ ॥
శత్రువులను జయించిన ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు బలరాముని వద్ద, యాదవప్రభుడగు ఉగ్రసేనుని వద్ద అనుమతి తీసుకొనెను. పుత్రులను, అంతఃపురస్త్రీలను సామగ్రితో సహా ముందు పంపించెను. తరువాత ఆయన సారథి తీసుకువచ్చిన తన రథమునెక్కెను. ఆ రథముపై గరుడధ్వజము రాజిల్లెను.
తతో రథద్విపభటసాధినాయకైః కరాలయా పరివృత ఆత్మసేనయా, మృదంగభేర్యానకశంఖగోముఖైః ప్రఘోష ఘోషితకకుభో నిరాక్రమత్।
తరువాత శ్రీకృష్ణుడు తన సేన చుట్టువారి రాగా బయల్దేరెను. రథములు, ఏనుగులు, గుర్రములు, పదాతులతో కూడిన ఆ సేనను నాయకులు నడిపించగా మిక్కిలి భయమును గొల్పెను. మద్దెళ్లు, భేరీలు, తప్పెటలు, శంఖములు, కొమ్ము బూరాల ధ్వనులతో దిక్కులు దద్దరిల్లెను.
నృవాజికాంచనశిబికాభిరచ్యుతం
సహాత్మజాః పతిమను సువ్రతా యయుః ।
వరాంబరాభరణవిలేపనస్రజః
సుసంవృతా నృభిరసిచర్మపాణిభిః ॥
రుక్మిణి మొదలగు పతివ్రతలు తమ సంతానముతో బాటుగా బంగరు శిబికలపై భర్తయగు శ్రీకృష్ణ భగవానుని వెంట వెళ్లిరి. ఆ శిబికలను వేగముగా నడిచే జనులు మోసిరి. శ్రేష్ఠమైన వస్త్రములు, ఆభరణములు, అంగరాగములు, మాలలు అనువాటిని ధరించిన ఆ యువతులను కత్తి, డాలు చేతులయందు పట్టుకున్న భటులు సమర్థముగా రక్షించుచుండిరి.
నర్దోష్ట్రగోమహిషఖరాశ్వతర్యనః-
కరేణుభిః పరిజనవారయోషితః ।
స్వలంకృతాః కటకుటికంబలాంబరా-
ద్యుపస్కరా యయురధియుజ్య సర్వతః ॥
పరిచారికలు, వేశ్యాంగనలు చక్కగా అలంకరించుకొని అన్ని రకముల ప్రయాణసాధనములపై వెళ్లిరి. వారు మనుష్యులు మోసే పల్లకీలపై, ఎద్దులు దున్నలు గాడిదలు కంచరగాడిదలు లాగే బళ్లపై, ఏనుగుల అంబారీలపై వెళ్లిరి. వారు చాప డేరాలను, కంబళ్లను, వస్త్రములు, పాత్రలు మొదలైన సామగ్రిని గట్టిగా కట్టుకొని వెళ్లిరి.
బలం బృహద్ధ్వజపటఛత్రచామరైర్వరాయుధాభరణకిరీటవర్మభిః,
దివాఽoశుభిస్తుములరవం బభౌ రవేర్యథాఽర్ణవః క్షుభితతిమింగిలోర్మిభిః.
సంకీర్ణమైన ధ్వనులు గల శ్రీకృష్ణ సైన్యములో పెద్ద జెండాల వస్త్రములు, గొడుగులు, వింజామరలు, శ్రేష్ఠమైన ఆయుధములు, ఆభరణములు, కిరీటములు, కవచములు అనునవి సూర్యకిరణములు పడి ప్రకాశించినవి. అప్పుడా సైన్యము తిమింగిలములతో, కెరటములతో కల్లోలముగానుండే సముద్రమును పోలెను.
అథో మునిర్యదుపతినా సభాజితః
ప్రణమ్య తం హృది విదధద్విహాయసా ।
నిశమ్య తద్వ్యవసితమాహృతార్హణో
ముకుందసందర్శననిర్వృతేంద్రియః ॥
యాదవప్రభుడు, మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణ భగవానుని దర్శనముచే నారద మహర్షియొక్క ఇంద్రియములు సంతుష్టములాయెను. ఆయన శ్రీకృష్ణునిచే సమర్పించబడిన పూజాద్రవ్యములను స్వీకరించి ఆయన చేసిన సత్కారమును పొందెను. రాజసూయమునకు వెళ్లవలెననే ఆయన నిశ్చయమును విని, తరువాత ఆ మహర్షి ఆయనకు నమస్కరించి ఆయననే హృదయములో ధ్యానిస్తూ ఆకాశమార్గమున వెళ్లెను.
రాజదూతమువాచేదం భగవాన్ ప్రీణయన్ గిరా ।
మా భైష్ట దూత భద్రం వో ఘాతయిష్యామి మాగధమ్ ॥
శ్రీకృష్ణ భగవానుడు రాజుల దూతకు ప్రీతిని కలిగిస్తూ ఇట్లు పలికెను -- ఓ దూతా! భయపడకుడు. మీకు మంగళమగు గాక! నేను మగధరాజగు జరాసంధుని వధింప జేయగలను.
ఇత్యుక్తః ప్రస్థితో దూతో యథావదవదన్నృపాన్ ।
తేఽపి సందర్శనం శౌరేః ప్రత్యైక్షన్ యన్ముముక్షవః ॥
ఇట్లు చెప్పబడిన దూత వెనుకకు వెళ్లి రాజులకు ఉన్నది ఉన్నట్లుగా చేప్పెను. వారు తమను కారాగారమునుండి విడిపించుననే ఆశతో శ్రీకృష్ణుని దర్శనమునకు ఎదురు చూచిరి.
ఆనర్తసౌవీరమరూంస్తీ ర్త్వా వినశనం హరిః ।
గిరీన్నదీరతీయాయ పురగ్రామవ్రజాకరాన్ ॥
శ్రీకృష్ణ భగవానుడు కొండలను, నదులను, నగరములను, గ్రామములను, గొల్లపల్లెలను, గనులను దాటుకుంటూ ఆనర్త సౌవీర మరు దేశములను, కురుక్షేత్రమును అతిక్రమించెను.
తతో దృషద్వతీం తీర్త్వా ముకుందోఽథ సరస్వతీమ్ ।
పంచాలానథ మత్స్యాంశ్చ శక్రప్రస్థమథాగమత్ ॥
మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుడు క్రమముగా దృషద్వతీనదిని, సరస్వతీ నదిని, పంచాల మత్స్యదేశములను దాటి ఇంద్రప్రస్థమును చేరెను.
తముపాగతమాకర్ణ్య ప్రీతో దుర్దర్శనం నృణామ్ ।
అజాతశత్రుర్నిరగాత్సోపాధ్యాయస్సుహృద్వృతః ॥
మానవులకు శ్రీకృష్ణుని దర్శనము దుర్లభము. ఆయన వచ్చినాడని విని శత్రువులు లేని ధర్మరాజు ఆనందముతో ఆచార్యులను, బంధువులను వెంట బెట్టుకొని నగరము బయటకు ఎదురేగెను.
గీతవాదిత్రఘోషేణ బ్రహ్మఘోషేణ భూయసా ।
అభ్యయాత్స హృషీకేశం ప్రాణాః ప్రాణమివాదృతః ॥
ఆదరము గల ఆ ధర్మరాజు, ఇంద్రియములు ముఖ్యప్రాణమునకు వలె, ఇంద్రియాధిపతియగు శ్రీకృష్ణ భగవానునకు ఎదురేగెను. అధికమగు గానవాద్యముల ఘోష, వేదధ్వని ఆయన వెంట ఉండెను.
దృష్ట్వా విక్లిన్నహృదయః కృష్ణం స్నేహేన పాండవః ।
చిరాద్దృష్టం ప్రియతమం సస్వజేఽథ పునః పునః ॥
మిక్కిలి ప్రియుడగు శ్రీకృష్ణుడు ధర్మరాజునకు చాల కాలమునకు కనబడెను. ఆయనను చూచి ధర్మరాజు హృదయము ప్రేమతో ఆర్ద్రమాయెను. ఆయనను ధర్మరాజు మరల మరల కౌగిలించుకొనెను.
దోర్భ్యాం పరిష్వజ్య రమాఽమలాలయం
ముకుందగాత్రం నృపతిర్హతాశుభః ।
లేభే పరాం నిర్వృతిమశ్రులోచనో
హృష్యత్తనుర్విస్మృతలోకవిభ్రమః ॥
శ్రీకృష్ణ భగవానుని స్వచ్ఛమగు దేహము లక్ష్మీదేవికి నిలయము. ఆయనను కౌగిలించుటచే ధర్మరాజుయొక్క అశుభములు తొలగిపోయెను. ఆయన కన్నులు నీటితో నిండి శరీరము గగుర్పాటును చెందెను. ఆయన లోకవ్యవహారమును విస్మరించి నిరతిశయమగు ఆనందమును పొందెను.
తం మాతులేయం పరిరభ్య నిర్వృతో
భీమస్స్మయన్ ప్రేమజవాకులేంద్రియః ।
యమౌ కిరీటీ చ సుహృత్తమం ముదా
ప్రవృద్ధబాష్పాః పరిరేభిరేఽచ్యుతమ్ ॥
భీముని ఇంద్రియములు ప్రేమయొక్క వేగముచే తొట్రుపాటు జెందెను. ఆయన నవ్వుతూ మేనమామ కొడుకగు శ్రీకృష్ణుని కౌగిలించి ఆనందించెను. కవలలగు నకుల సహదేవులకు, అర్జునునకు కూడ ప్రేమతో కన్నీళ్లు ముంచుకు వచ్చెను. వారు మిక్కిలి ప్రియమగు బంధువైన శ్రీకృష్ణభగవానుని ఆనందముతో కౌగిలించిరి.
అర్జునేన పరిష్వక్తో యమాభ్యామభివాదితః ।
బ్రాహ్మణేభ్యో నమస్కృత్య వృద్ధేభ్యశ్చ యథాఽర్హతః ॥
శ్రీకృష్ణుని అర్జునుడు కౌగిలించగా, నకుల సహదేవులు నమస్కరించిరి. ఆయన బ్రాహ్మణులకు, పెద్దలకు వారి యోగ్యతకు తగ్గట్లుగా నమస్కరించెను.
మానితో మానయామాస కురుసృజంయకైకయాన్ ।
సూతమాగధగంధర్వా వందినశ్చోపమంత్రిణః ॥
మృదంగశంఖపటహవీణాపణవగోముఖైః ।
బ్రాహ్మణాశ్చారవిందాక్షం తుష్టువుర్ననృతుర్జగుః ॥
శ్రీకృష్ణుడు కురు-సృంజయ- కేకయదేశముల రాజులను సమ్మానించగా, వారాయనను సమ్మానించిరి. సూతులు, మాగధులు, వందులు, బ్రాహ్మణులు పద్మములవంటి కన్నులు గల శ్రీకృష్ణుని స్తుతించిరి. గంధర్వులు, విదూషకులు మద్దెళ్లను, శంఖములను, తప్పెటలను, వీణలను, ఉడుక్కములను, కొమ్ము బూరాలను వాయిస్తూ పాడి నాట్యమాడిరి.
ఏవం సుహృద్భిః పర్యస్తః పుణ్యశ్లోకశిఖామణిః ।
సంస్తూయమానో భగవాన్ వివేశాలంకృతం పురమ్ ॥
పావనము చేసే కీర్తి గలవారిలో శ్రీకృష్ణుడు ప్రప్రథముడు. బంధువులీ విధముగా చుట్టువారి స్తుతించుచుండగా ఆయన అలంకరించబడిన నగరమును ప్రవేశించెను.
సంసిక్తవర్త్మ కరిణాం మదగంధతోయైః
చిత్రధ్వజైః కనకతోరణపూర్ణకుంభైః ।
మృష్టాత్మభిర్నవదుకూలవిభూషణస్రగ్-
గంధైర్నృభిర్యువతిభిశ్చ విరాజమానమ్ ॥
ఆ నగరములో ఏనుగుల మదగంధముచే వ్యాప్తమైన వీథులలో నీళ్లు చల్లబడెను. రంగు రంగుల జెండాలు, బంగరు తోరణములు, పూర్ణకుంభములతో ఆ నగరము అధికముగా రాజిల్లెను. పరిపుష్టములైన దేహములు గల అచటి స్త్రీపురుషులు కొత్త వస్త్రములను, అలంకారములను, మాలలను, పరిమళద్రవ్యములను ధరించియుండిరి.
ఉద్దీప్తదీపబలిభిః ప్రతిసద్మ జాల-
నిర్యాతధూపరుచిరం విలసత్పతికమ్ ।
మూర్ధన్యహేమకలశై రజతోరుశృంగైః
జుష్టం దదర్శ భవనైః కురురాజధామ ॥
శ్రీకృష్ణుడు కురురాజగు ధర్మరాజుయొక్క అంతఃపురమును చూచెను. జెండాలతో ప్రకాశించే ఆ అంతఃపురమునందు ప్రతి గృహము దీపములతో, పుష్పాదులతో అధికముగా ప్రకాశించెను. ఆ అంతఃపురమునందలి భవనముల పైభాగమునందు వెండితో చేసిన పెద్ద పీఠములపై బంగరు కలశములు ఉండెను. కిటికీల గుండా బయల్వెడలే ధూపములతో ఆ భవనములు ప్రకాశించెను.
ప్రాప్తం నిశమ్య నరలోచనపానపాత్రం
ఔత్సుక్యవిశ్లథితకేశదుకూలబంధాః ।
సద్యో విసృజ్య గృహకర్మ పతీంశ్చ తల్పే
ద్రష్టుం యయుర్యువతయస్స్మ నరేంద్రమార్గే ॥
శ్రీకృష్ణుని ఆనాటి మానవులు ప్రేమతో నిండిన కళ్లతో చూచెడివారు. ఆయన రాజమార్గములో వెళ్లుచున్నాడని విని యువతులు ఇంటి పనిని, మరికొందరు శయ్యలపై భర్తలను కూడ వెంటనే విడిచి చూచుటకు వెళ్లిరి. ఉత్కంఠచే వారి జుట్టు కొప్పులు, కోక ముడులు జారిపోవుచుండెను.
తస్మిన్ సుసంకుల ఇభాశ్వరథద్విపద్భిః ।
కృష్ణం సభార్యముపలభ్య గృహాధిరూఢాః ।
నార్యో వికీర్య కుసుమైర్మనసోపగుహ్య ।
సుస్వాగతం విదధురుత్స్మయవీక్షితేన ॥
ఏనుగులు, గుర్రములు, రథములు, పదాతులతో రాజమార్గము చాల రద్దీగానుండెను. యువతులు ఇళ్ల పై భాగములమీద యెక్కి భార్యలతో కూడియున్న శ్రీకృష్ణుని చూచిరి. వారాయన పై పూలను చల్లి మనస్సులో కౌగలించుకొని ఆదరముతో నిండిన చూపులతో సుస్వాగతము పలికిరి.
ఊచుః స్త్రీయః పథి నిరీక్ష్య ముకుందపత్నీః
తారా యథోడుపసహాః కీమకార్యమూభిః ।
యచ్చక్షుషాం పురుషమౌలిరుదరహాస
లీలావలోకకలయోత్సవమాతనోతి ॥
స్త్రీలు మార్గములో చంద్రునితో కూడిన తారలను పోలిన శ్రీకృష్ణ భగవానుని భార్యలను చూచి ఇట్లు పలికిరి -- వీరు ఏమి పుణ్యమును చేసిరో? పురుషోత్తముడు ఔదార్యయుక్తమైన చిరునవ్వుతో, విలాసపు చూపుయొక్క లేశముతో వీరి కళ్లకు సుఖమును విస్తరింపజేయును.
తత్ర తత్రోపసంగమ్య పౌరా మంగలపాణయః ।
చక్రుస్సపర్యాం కృష్ణాయ శ్రేణీముఖ్యా హతైనసః ॥
అక్కడక్కడ పౌరులు, శిల్పజీవులు' చేతులలో మంగళద్రవ్యములతో దగ్గరకు వచ్చి శ్రీకృష్ణుని పూజించిరి. దానిచే వారి పాపములు నశించెను.
అంతఃపురజనైః ప్రీత్యా ముకుందః పుల్లలోచనః ।
ససంభ్రమైరభ్యు పేతః ప్రొవిశద్రాజమందిరమ్ ॥
అంతఃపురస్త్రీలు కంగారు పడుతూ ప్రేమచే విప్పారిన కన్నులు గలవారై శ్రీకృష్ణ భగవానుని ఎదురు వచ్చి సత్కరించిరి. అప్పుడాయన రాజమందిరమును ప్రవేశించెను.
పృథా విలోక్య భ్రాత్రేయం కృష్ణం త్రిభువనేశ్వరమ్ ।
ప్రేతాత్మోత్థాయ పర్యంకాత్సస్నుషా పరిషస్వజే ॥
కోడలు ద్రౌపదితో కూడియున్న కుంతి సోదరుని పుత్రుని చూచి మనస్సులో ఆనందించెను. ఆమె శయ్యపైనుండి లేచి ముల్లోకములకు ప్రభువగు శ్రీకృష్ణుని కౌగిలించుకొనెను.
గోవిందం గృహమనీయ దేవదేవేశమాదృతః ।
పూజాయాం నావీదత్కృత్యం ప్రమోదోపహతో నృపః ॥
దేవతలకు ప్రభువులగు బ్రహ్మాదులకు కూడ ప్రభుడగు శ్రీకృష్ణ భగవానుని ధర్మరాజు ఇంటికి దోడ్కొని వచ్చెను. కాని, ఆయన అతిశయిం చిన ఆనందముచే పరవశుడై పూజాక్రమమునైననూ తెలియకుండెను.
పితృష్వసుర్గురుస్త్రీణాం కృష్ణశ్చక్రేకభివాదనమ్ ।
స్వయం చ కృష్ణయా రాజన్ భగిన్యా చాభివందితః ॥
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు తన తండ్రి సోదరియగు కుంతికి, పెద్దల భార్యలకు నమస్కారము చేసెను. సోదరి సుభద్ర, ద్రౌపది కూడ ఆయనకు నమస్కరించిరి.
శ్వశ్వా సంచోదితా కృష్ణా కృష్ణపత్నీశ్చ సర్వశః ।
ఆనర్చ రుక్మిణీం సత్యాం భద్రాం జాంబవతీం తథా ॥
కాలిందీం మిత్రవిందాం చ శైబ్యాం నాగ్నజితీం సతీమ్ ।
అన్యాశాభ్యాగతా యాస్తు వాససజ్మండనాదిభిః ॥
రుక్మిణి, సత్యభామ, భద్ర, జాంబవతి, కాలింది, మిత్రవింద, లక్ష్మణ, పతివ్రత మరియు నగ్నజిత్తు కుమార్తె అగు సత్య అనే శ్రీకృష్ణుని భార్యలనందరిని, మరియు అచటకు విచ్చేసిన ఇతరస్త్రీలను కూడ, అత్తగారగు కుంతి ప్రేరేపించగా ద్రౌపది వస్త్రములు, పుష్పమాలలు, అలంకారములు, తాంబూలము మొదలగువాటితో సత్కరించెను.
సుఖం నివాసయామాస ధర్మరాజో జనార్ధనమ్ ।
ససైన్యం సానుగామాత్యం (భార్యం చ నవం నవమ్ ॥
దుష్ట జనశిక్షకుడగు శ్రీకృష్ణ భగవానునకు, ఆయన సైన్యమునకు, అనుచరులకు, మంత్రులకు, భార్యలకు కూడ ధర్మరాజు ప్రతిదినము కొత్త కొత్త ఏర్పాట్లతో సుఖమగు నివాసమును కల్పించెను.
తర్పయిత్వా ఖాండవేన వహ్నిం ఫాల్గునసంయుతః ।
మోచయిత్వా మయం యేన రాజే దివ్యా సభా కృతా ॥
శ్రీకృష్ణుడు అర్జునునితో కూడి ఖాండవవనమును సమర్పించి అగ్నిదేవునకు తృప్తి కలిగించెను. మయుని అగ్నినుండి విడిపించగా, ఆయన ప్రకాశించే సభను నిర్మించి ధర్మరాజునకు సమర్పించెను.
ఉవాస కతిన్మాసాన్ రాజ్ఞః ప్రియచికీర్షయా ।
విహరన్ రథమారుహ్య ఫాల్గునేన భటైర్వృతః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే
ఉత్తరార్దే ఏకసప్తతితమోఽధ్యాయః ॥
శ్రీకృష్ణుడు ధర్మరాజునకు ప్రీతిని కలిగించగోరి అక్కడనే కొన్ని నెలలు నిరంతరముగా నివసించెను. ఆయన సేవకులు వెంట రాగా అర్జునునితో కలిసి రథమునెక్కి విహరిస్తూ కాలమును గడిపెను,
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో
శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థమునకు విచ్చేయుటను వర్ణించే
డెబ్బది ఒకటవ అధ్యాయము ముగిసినది (71).
* * * * *
Summary of chapter 71 of the Bhāgavata Mahā Purana is as follows:
Faced with the choice between attacking Jarāsandha and attending Yudhishṭhira's Rājasūya Yajna, Śrī Kṛshṇa consulted His wise minister Uddhava. Uddhava advised that both objectives could be accomplished simultaneously: by traveling to Indraprastha for the Rājasūya Yajna, Kṛshṇa could guide Bhīma to challenge Jarāsandha in single combat, thereby liberating the captive kings without launching a massive war. Pleased with Uddhava's counsel, Kṛshṇa dispatched the royal envoy with assurances to the captive kings and embarked on a grand procession to Indraprastha alongside His queens, army, and ministers. King Yudhishṭhira, Bhīma, Arjuna, Nakula, and Sahadeva welcomed Kṛshṇa with tearful embraces, entering the city amidst grand public celebrations.