52 - రుక్మిణి శ్రీకృష్ణునకు రహస్య సందేశమును పంపుట

శ్రీశుక ఉవాచ

ఇత్తం సోఽనుగృహీతోవంగ కృష్ణేనేక్ష్వాకునందనః

తం పరిక్రమ్య సన్నమ్య నిశ్చక్రామ గుహాముఖాత్

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- ఓ పరీక్షిన్మహారాజా! ఇక్ష్వాకువంశమును ఆనందింపజేసే ఆ ముచుకుందుని శ్రీకృష్ణుడు ఈ విధముగా అనుగ్రహించెను. అప్పుడాయన శ్రీకృష్ణునకు ప్రదక్షిణ నమస్కారములను చేసి గుహయొక్క ముఖమునుండి నిష్క్రమించెను.

స వీక్ష్య క్షుల్లకాన్ మర్త్యాన్ పశూన్ వీరుద్వనస్పతీన్

మత్వా కలియుగం ప్రాప్తం జగామ దిశముత్తరామ్

ఆయన చిన్న చిన్న మనుష్యులను, పశువులను, లతలను, చెట్లను చూచి కలియుగము వచ్చినదని గ్రహించి ఉత్తరదిక్కునకు వెళ్లెను.

తపశ్శ్రద్దాయుతో ధీరో నిస్సంగో ముక్తసంశయః

సమాధాయ మనః కృష్ణే ప్రావిశద్గంధమాదనమ్

ఆయన తపస్సునందు శ్రద్ధ, వివేకము, అనాసక్తి గలవాడై, సందేహములను విడిచి పెట్టి మనస్సును శ్రీకృష్ణునిపై ఏకాగ్రము చేసి గంధమాదన పర్వతమును చేరుకొనెను.

బదర్యాశ్రమమాసాద్య నరనారాయణాలయమ్ సర్వద్వంద్వసహశ్శాంతస్తపసాఽఽరాధయద్ధరిమ్

ఆయన నరనారాయణుల నిలయమైన బదరికాశ్రమమును చేరి, శీతోష్ణాది సకలద్వంద్వములను సహిస్తూ శాంతుడై తపస్సుతో శ్రీహరిని ఆరాధించెను.

భగవాన్ పునరావ్రజః పురీం యవనవేష్టితామ్

హత్వా మ్లేచ్ఛబలం నిన్యే తదీయం ద్వారకాం ధనమ్

శ్రీకృష్ణ భగవానుడు మథురా నగరమునకు తిరిగి వచ్చి, ఆ నగరమును చుట్టువారియున్న మ్లేచ్చుల సైన్యమును సంహరించెను. ఆయన వారి సంపదను ద్వారకకు తీసుకు వెళ్లెను.

నీయమానే ధనే గోభిర్నృభిశ్చాచ్యుతచోదితైః

ఆజగామ జరాసంధస్త్రయోవింశత్యనీకపః

శ్రీకృష్ణుడు పురమాయించిన వ్యక్తులు ఆ సంపదను ఎద్దులపై తీసుకు వెళ్లుచుండిరి. ఇంతలో ఇరవై మూడు సైన్యముల నాయకుడై జరాసంధుడు వచ్చెను.

విలోక్య వేగరభసం రిపు సైన్యస్య మాధవౌ

మనుష్యచేష్టామాపన్నౌ రాజన్ దుదువతుర్ద్రుతమ్

ఓ పరీక్షిన్మహారాజా! శత్రు సైన్యముయొక్క అధికమగు వేగమును మధువంశీయులగు బలరామకృష్ణులు చూచిరి. వారు మానవుల చేష్టను స్వీకరించి (లీలగా అనుకరిస్తూ) వేగముగా పలాయనము చిత్తగించిరి.

విహాయ విత్తం ప్రచురమభీతా భీరుభీతవత్

పద్భ్యాం పద్మపలాశాభ్యాం చేరతుర్బహుయోజనమ్

బలరామకృష్ణులు భయమునెరుగరు. కాని, వారు చాల భయపడిన వారు వలె ఆ అధికమగు ధనమును విడిచి పెట్టి, పద్మముల వలె కోమలములైన కాళ్లతో నడుస్తూ చాల మైళ్ల దూరము పారిపోయిరి.

పలాయమానౌ తౌ దృష్ట్వా మాగధః ప్రహసన్ బలీ

అన్వధావద్రథానీ కైరీశయోరప్రమాణవిత్

సర్వసమర్థులగు బలరామకృష్ణుల ప్రభావము మగధప్రభుడగు జరా సంధునకు తెలియదు. వారిద్దరు పారిపోవుచుండుటను గాంచి బలశాలి యగు ఆతడు విరగబడి నవ్వీ, రథికుల సైన్యములతో వెంట తరిమేను.

ప్రద్రుత్య దూరం సంశ్రాంతౌ తుంగమారుహతాం గిరిమ్

ప్రవర్షణాఖ్యం భగవాన్నిత్యదా యత్ర వర్షతి

దూరము పరుగెత్తి బలరామకృష్ణులు బాగా అలసిపోయిరి. వారు ప్రవర్షణము (ఎక్కువ వర్షము గలది) అనే ఎత్తైన పర్వతమునెక్కిరి. అచట ఇంద్రదేవుడు సర్వకాలములలో వర్షించును.

గిరౌ నిలీనావాజ్ఞాయ నాధిగమ్య పదం నృప

 దదాహ గిరి మేధోభిస్సమంతాదగ్నిముత్సృజన్

ఓ పరీక్షిన్మహారాజా! పర్వతము పై వారిద్దరు దోరుకున్న చోటును, వారి కాలీ గురుతులను కూడ జరాసంధుడు కనుగొనలేకపోయెను. అపుడాతడు పర్వతము చుట్టూ కట్టెలను పేర్చి నిప్పు పెట్టి కాల్చెను.

తత ఉత్పత్య తరసా దహ్యమానతటాదుభౌ

దశైకయోజనోత్తుంగాన్ని పేతతురధో భువి

పదకొండు యోజనముల నిడివి గల ఆ పర్వతము యొక్క ప్రాంతభాగములు దహించబడుచుండెను. అపుడు పర్వతమునుండి వేగముగా పైకెగిరి క్రింద నేల పైకీ దుమికిరి.

అలక్ష్యమాణౌ రిపుణా సానుగేన యదూత్తమౌ

స్వపురం పునరాయతే సముద్రపరిఖాం నృప

ఓ పరీక్షిన్మహారాజా! యాదవశ్రేష్ఠులగు బలరామకృష్ణులు శత్రువగు జరాసంధునికి, వాని అనుచరులకు కనబడకుండా ద్వారకానగరమునకు తిరిగి వచ్చిరి. ఆ నగరమునకు సముద్రమే అగడ్త.

సోఽపీ దగ్దావితి మృషా మవ్వానో బల కేశవౌ

బలమాకృష్య సుమహన్మగధాన్మాగధో యయౌ

మగధదేశప్రభుడగు ఆ జరాసంధుడు కూడ బలరామకృష్ణులు దహించబడినారని తప్పుగా తలపోసెను. ఆతడు మిక్కిలి పెద్దదైన తన సైన్యమును మళ్లించుకొని మగధదేశమునకు వెళ్లిపోయేను.

ఆనర్తాధిపతిశీమాన్ రైవతో రేవతీం సుతామ్

బ్రహ్మణా చోదితః ప్రాదాద్బలాయేతి పురోదితమ్

రేవతుని పుత్రుడగు కకుద్మి ఆనర్తదేశాధిపతి, శ్రీమంతుడు. ఆయన బ్రహ్మదేవుని ప్రోత్సాహముచే తన కుమార్తెయగు రేవతిని బలరామున కిచ్చి వివాహము చేసెనని ఇదివరలో (9 వ స్కంధము) చెప్పడమైనది.

భగవానపి గోవింద ఉపయేమే కురూద్వహ

వైదర్భీం భీష్మకసుతాం శ్రియో మాత్రాం స్వయంవరే

ప్రమథ్య తరసా రాజ్ఞశ్శాల్వాదీంశ్చైద్యపక్షగాన్

పశ్యతాం సర్వలోకానాం తార్క్ష్యపుత్రస్సుధామివ

కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ భగవానుడు కూడ  సకలజనులు చూచుచుండగా చేదిదేశాధిపతియగు శిశుపాలుని పక్షమునకు చెందిన శాల్వుడు, దంతవక్తుడు మొదలగు రాజులను తన బలముచే పరాభవించెను. అపుడాయస, కశ్యపుని పుత్రుడగు గరుడుడు అమృతమును పొందినట్లుగా, స్వయంవరమునందు రుక్మిణిని వివాహమాడెను. భీష్మకుని కుమార్తెయగు రుక్మిణి లక్ష్మీదేవి అవతారము.

రాజోవాచ

భగవాన్ భీష్మకసుతాం రుక్మిణీం రుచిరాననామ్

రాక్ష సేన విధానేన ఉపయేమ ఇతి శ్రుతమ్

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- శ్రీకృష్ణ భగవానుడు భీష్మకుని కుమార్తె, అందమగు ముఖము గలది అగు రుక్మిణిని రాక్షసవిధానము (యుద్ధములో శత్రువులను జయించి) చే వివాహమాడెనని వినియున్నాను.

భగషఞ్చ్రోతుమిచ్ఛామి కృష్ణ స్యామితతేజసః

యథా మాగధశాల్వాదీన్ జిత్వా కన్యాముపాహరత్

పూజనీయుడవగు ఓ శుకమహర్షీ! శ్రీకృష్ణుడు అమితమగు తేజస్సు గలవాడు. ఆయన మగధదేశప్రభుడగు జరాసంధుడు, శాల్వుడు, దంతవక్తుడు మొదలగువారిని జయించి కన్యయగు రుక్మిణిని తీసుకుపోయిన వృత్తాంతమును విన గోరుచున్నాను.

బ్రహ్మన్ కృష్ణ కథాః పుణ్యా మాధ్వీర్లోకమలాపహాః

కో ను తృప్యేత శృణ్వానశ్శ్రుతజ్ఞో నిత్యనూతనాః

ఓ శుకమహర్షీ! శ్రీకృష్ణుని గాథలు పావనములు, తియ్యనివి, జనుల పాపములను పోగొట్టునవి, నిత్యనూతనములు. విద్యల మర్మము తెలిసినవాడెవ్వాడు వాటిని వింటూ తృప్తిని జెందును? (చెందడు).

శ్రీశుక ఉవాచ

రాజాఽఽసీదీష్మకో నామ విదర్బాధిపతిర్మహాన్

తస్య పంచాభవన్ పుత్రాః కన్యకా చ వరాననా

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- విదర్బదేశమును భీష్మకుడని ప్రసిద్ది చెందిన గొప్ప రాజు పాలించెను. ఆయనకు ఐదుగురు కొడుకులు, ఒక అమ్మాయి కలిగిరి. ఆమె గొప్ప సుందరి.

రుక్మ్యగ్రజో రుక్మరథో రుక్మబాహురనంతరః

రుక్మకేశో రుక్మమాలీ రుక్మిణ్యేషాం స్వసా సతీ

పెద్ద కొడుకు రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహుడు, రుక్మకేశుడు, రుక్మమాలి తరువాతి వారు. ఉత్తమురాలగు రుక్మిణి వారి సోదరి.

సోపశ్రుత్య ముకుందస్య రూపవీర్యగుణశ్రియః

గృహాగతైర్గీయమానాస్త్రం మేనే సదృశం పతిమ్

ఇంటికి వచ్చినవారు మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని అందమును, పరాక్రమమును, గుణములను, సంపదను గానము చేయుచుండగా ఆమె దగ్గరగానుండి వినెను. ఆమె ఆయనయే తనకు తగిన భర్తయని తలచెను.

తాం బుద్ధిలక్షణాదార్యరూపశీలగుణాశ్రయామ్

కృష్ణశ్చ సదృశీం భార్యాం సముద్వోడుం మనో దధే

తెలివితేటలు, సౌభాగ్యచిహ్నములు, దాతృత్వము, అందము, సచ్చీలము, సద్గుణములు అనువాటికి ఆమె నిధి. ఆమె తనకు తగిన భార్య అని, ఆమెను వివాహమాడవలెననియు శ్రీకృష్ణుడు కూడ నిశ్చయించెను.

బంధూనామిచ్ఛతాం దాతుం కృష్ణాయ భగినీం నృప

తతో నివార్య కృష్ణద్విడ్రుక్మీ చైద్యమమన్యత

ఓ పరీక్షిన్మహారాజా! రుక్మిణిని శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేయాలని బంధువుల ఆకాంక్ష. శ్రీకృష్ణుని ద్వేషించే రుక్మి వారి ఆకాంక్ష నిరాదరణ చేసెను. సోదరిని శ్రీకృష్ణునకు కాకుండా చేదిదేశాధిపతియగు శిశుపాలునకిచ్చి వివాహము చేయాలని ఆతని సంకల్పము.

తదవేత్యాసితాంగీ వైదర్భీ దుర్మనా భృశమ్

విచింత్యాప్తం ద్విజం కంచిత్కృష్ణాయ ప్రాహిణోద్ద్రుతమ్

విదర్భరాజకుమారియగు రుక్మిణీ సుందరి. ఆమె చూపు నల్లనయ్య పై ఉండెను. రుక్మి తలంపు తెలిసి ఆమె మనస్సు చాల చేడిపోయెను. ఆమె ఆలోచించి ఆప్తుడైన ఒకానొక బాపని వెంటనే శ్రీకృష్ణుని వద్దకు పంపెను.

ద్వారకాం స సమభ్యేత్య ప్రతీహారైః ప్రవేశితః

అపశ్యదాద్యం పురుష మాసీనం కాంచనసనే

ఆ బ్రాహ్మణుడు ద్వారకానగరమును చేరెను. ద్వారపాలకులు ఆయనను లోపలికి ప్రవేశ పెట్టిరి. బంగరు సింహాసనముపై కూర్చున్న జగత్కారణుడగు పురుషోత్తముడు ఆయనకు కనబడెను.

దృష్ట్వా బ్రహ్మణ్యదేవస్తమవరుహ్య నిజాసనాత్

ఉపవేశ్యార్హయాంచక్రే యథాఽఽత్మానం దివౌకసః

శ్రీకృష్ణుడు బ్రాహ్మణభక్తులలో అగ్రేసరుడు. ఆయన ఆ బ్రాహ్మణుని చూడగానే తన ఆసనమునుండి దిగి వచ్చి ఆయనను కూర్చుండబెట్టెను. ఆయన తనను స్వర్గలోకవాసులగు దేవతలు పూజించే విధముగా, ఆ బ్రాహ్మణుని పూజించెను.

తం భుక్తవంతం విశ్రాంతముపగమ్య సతాం గతిః

పాణినాఽభిమృశన్ పాదావవ్యగ్రస్తమపృచ్ఛత

ఆ బ్రాహ్మణుడు భుజించి విశ్రాంతి తీసుకొనెను. సత్పురుషులకు శరణు అగు శ్రీకృష్ణుడు ఆయన వద్దకు వచ్చి చేతితో కాళ్లను కంగారు పడకుండా మెల్లగా నొక్కుతూ ఇట్లు ప్రశ్నించెను.

కచ్చిద్ద్విజవరశ్రేష్ఠ ధర్మస్తే వృద్ధసంమతః

వర్తతే నాతికృచ్ఛ్రేణ సంతుష్ట మనసస్సదా

ఓ బ్రాహ్మణశిరోమణీ! ఎక్కువ కష్ట పడకుండా లభించినదానితో తమరి మనస్సు ఎల్లప్పుడు సంతోషపడును. పెద్దలకు సమ్మతమైన ధర్మమును తమరు తేలికగా ఆచరించగల్గుతున్నారా?

సంతుష్టో యర్హి వర్ణేత బ్రాహ్మణో యేన కేనచిత్

అహ్యమానస్స్వాద్ధర్మాత హ్యస్యాఖిల కామధుక్

ఎందుకంటే, ఎప్పుడైతే బ్రాహ్మణుడు ఏదో ఒకదానితో సంతోషపడి తన ధర్మమునుండి జారిపోకుండా జీవించునో, అప్పుడా ధర్మము వీనికి సకలకామనలను సంపాదించి పెట్టును. ఆ బ్రాహ్మణుడీ జగత్తునకు సకలకామనలను సంపాదించి పెట్టును.

అసంతుషోసకృల్లో కానాప్నోత్యపి సురేశ్వరః

ఆకించనోఽపి సంతుష్ట శ్శేతే సర్వాంగవిజ్వరః

దేవేంద్రుడైననూ సంతోషము లేనివాడై మరల మరల లోకములను తిరగవలసియుండును. ఏమీ లేనివాడైననూ సంతోషము గలవాడై అవయవములయందే విధమైన తాపము లేకుండా సుఖముగా నుండును.

విప్రాన్ స్వలాభసంతుష్టాన్ సాధూన్ భూతసుహృత్తమన్

నిరహంకారిణశ్శాంతాన్ నమ స్యే శిరసాఽసకృత్

తనంత తానుగా లభించినదానితో సంతోషించి, సదాచారనిష్టులై ప్రాణులకు మిక్కిలి హితమును చేస్తూ, అహంకారము లేకుండా శాంతులై ఉండే వేద వేత్తలకు నేను పలుమార్లు తల వంచి నమస్కరించుచున్నాను.

కచ్చిద్వః కుశలం బ్రహ్మన్ రాజతో యస్య హి ప్రజాః

సుఖం వసంతి విషయే పాల్యమానాస్స మే ప్రియః

ఓ బ్రాహ్మణా! మీకు రాజు వలన సుఖము కలుగుచున్నదా? ఏ దేశములోనైతే పాలించబడే ప్రజలు సుఖముగా జీవించెదరో, ఆ రాజు నాకు నిశ్చయముగా ప్రీతిపాత్రుడగును.

యతస్త్వమాగతో దుర్గం నిస్తీర్యేహ యదిచ్చయా

సర్వం నో బ్రూహ్యగుహ్యం చేత్కిం కార్యం కరవామ తే

తమరు దేనిని కోరి ఎక్కడనుండి ఇక్కడకు తరింప కష్టమైన సముద్రమును దాటి వచ్చిరో, ఆ సర్వమును నాకు -- రహస్యము కానిచో -- చెప్పడు. నేను మీకు ఏమి పనిని చేసి పెట్టవలెను?

ఏవం సంపృష్టసంప్రశ్నో బ్రాహ్మణః పరమేష్ఠినా

లీలాగృహీతదే హేన తస్మై సర్వమవర్ణయత్

లీల నిమిత్తముగా శ్రీకృష్ణుడై అవతరించిన పరమేశ్వరుడీ విధముగా అడుగదగిన ప్రశ్నలను అడుగగా, ఆ బ్రాహ్మణుడు ఆయనకు విషయమునంతనూ వివరించి చెప్పెను.

రుక్మిణ్యువాచ

శ్రుత్వా గుణాన్ భువనసుందర శృణ్వతాం తే

నిర్విశ్య కర్ణవివరై ర్హరతోవంగ తాపమ్

రూపం దృశాం దృశీమతామఖిలార్థలాభం

త్వయ్యచ్యుతావిశతి చిత్తమపత్రం మే

రుక్మిణి ఇట్లు పలికెను --- ఓ అచ్యుతా! నీవు త్రిలోకసుందరుడవు. నీ గుణములు వినువారల హృదయములో చెవి రంధ్రముల గుండా ప్రవేశించి తాపమును పోగొట్టు నని విన్నాను. చూపు గలవారి కళ్లకు నిన్ను చూచుట సకలపురుషార్థ ప్రాప్తియని విన్నాను. నా మనస్సు సిగ్గు విడిచి నిన్ను ప్రేమించుచున్నది.

కా త్వా ముకుంద మహతీ కులశీలరూప

విద్యావయోద్రవిణధామభిరాత్మతుల్యమ్

ధీరా పతిం కులవతీ న వృణీత కన్యా

కాలే నృసింహ నరలోకమనోఽభిరామమ్

ఓ శ్రీకృష్ణా! మోక్ష ప్రదాతవు నీవు మానవులలో శ్రేష్ఠుడవు. కులము, శీలము, రూపము, విద్య, వయస్సు, సంపద, తేజస్సు అనువాటిలో నీకు నీవే సాటి. మానవలో కముయొక్క మనస్సులకు నీవు ఆహ్లాదమును కలిగిం చెదవు. సద్గుణసంపన్న, ధైర్యము గలది, కులస్తీ అగు ఏ కన్య యుక్త వయస్సు వచ్చినప్పుడు నిన్ను వరించకుండును? (నిన్నే వరించును).

తన్మే భవాన్ ఖలు వృతః పతిరంగ జాయాం

ఆత్మార్పితశ్చ భవత్వోత్ర విభో విధేహి

మా వీరభాగమభిమర్శతు చైద్య ఆరాద్

గోమాయువన్మృగపతేర్బలిమంబుజాక్ష

ఓ ప్రభూ! కాబట్టి నేను నిన్నే భర్తగా వరించి నా దేహేంద్రియాదులను కూడ నీకే సమర్పించినాను. నీవిచటకు విచ్చేసి నన్ను నీ భార్యగా చేసుకొనుము. పద్మములవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! నేను వీరుడవగు నీ దానను. మృగరాజగు సింహము యొక్క భాగమును నక్క వలే, చేదిదేశాధిపతియగు శిశుపాలుడు దగ్గరకు వచ్చి నన్ను స్పృశించరాదు.

పూర్తేష్ట దత్తనియమవ్రతదేవవిప్ర -

గుర్వర్చనాకదిభిరలం భగవాన్ పరేశః

ఆరాధితో యది గదాగ్రజ ఏత్య పాణిం

గృహ్లాతు మే న దమ ఘోషసుతాదయోఽన్యే

నూతులు త్రవ్వించుట మొదలగు సేవా కార్యములు, యజ్ఞయాగాది కర్మలు, దానములు, నియమములు, వ్రతములు, దేవతలను బ్రాహ్మణులను గురువులను పూజించుట, తీర్థస్నానము మొదలగువాటి ద్వారా నేను ప్రకృతికి ప్రభువగు భగవానుని ఆరాధించి యున్నచో, గదుని , సోదరుడగు శ్రీకృష్ణుడు వచ్చి నన్ను వివాహమాడు గాక! దమఘోషుని పుత్రుడగు శిశుపాలుడు, శాల్వుడు మొదలగువారు నన్ను స్పృశించరాదు.

శ్వోభావిని త్వమజితోద్వహనే విదర్భాన్

గుప్తస్సమేత్య పృతనాపతిభిః పరీతః

నిర్మథ్య వైద్యమగధేంద్రబలం ప్రసహ్య 

మాం రక్ష సేన విధినోద్వహ వీర్యశుల్కామ్

ఓ శ్రీకృష్ణా! నీకు పరాజయము లేదు. నా పెళ్లికి ముహూర్తము రేపు సేనాధ్యక్షులు చుట్టువారి రాగా నీవు రహస్యముగా విదర్బదేశమునకు రమ్ము. చేదిరాజగు శిశుపాలుని, మగధరాజగు జరాసంధుని, వారి సైన్యములను పరాభవించుము. పరాక్రమమే నాకు కట్నము. నన్ను బలాత్కారముగా తీసుకుపోయి రాక్షసవిధి ( పెద్దల అభిమతమును త్రోసిపుచ్చి బలప్రదర్శనతో చేసుకునే పెళ్లి) చే వివాహమాడుము.

అంతఃపురాంతరచరీమనిహత్య బంధూన్

త్వాముద్వ హే కథమితి ప్రవదామ్యుపాయమ్

పూర్వేద్యురస్తి మహతీ కులదేవియాత్రా

యస్యాం బహిర్నవవధూల్గిరిజాము పేయాత్

బంధువులను సంహరించకుండా అంతఃపురములో సంచరించే నిన్ను నేను యెట్లు వివాహమాడవలెను? అని అంటావేమో! ఉపాయమును చెప్పెదను. ముందు రోజు కొత్త పెళ్లికూతురు కులదేవి దర్శనమునకై వెళ్లును. ఈ యాత్ర చాల గొప్పది. ఈ సందర్భములో కొత్త పెళ్లి కూతురు అంతఃపురము బయటకు వచ్చి పార్వతీదేవి దర్శనమునకు వెళ్లును.

యస్యాంఘ్రపంకజరజస్స్నపనం మహాంతో

 వాంఛంత్యుమాపతిరివాత్మతమోఽపహత్యై

యర్హ్యంబుజాక్ష న లభేయ భవత్ప్రసాదం

జహ్యామసూన్ వ్రతకృశాన్ శతజన్మభిస్స్యా త్

పద్మములవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! మహాత్ములు తమ అజ్ఞానమును పోగొట్టుకొనుటకై ఉమాపతియగు శివుడు వలె నీ పద్మములవంటి పాదముల ధూళితో స్నానమును కోరెదరు. అట్టి నీ అనుగ్రహము నాకు లభించని పక్షములో నేను ప్రాణములను విడిచెదను. నా ప్రాణములు వ్రతోపవాసముచే చిక్కియే యున్నవి. ఈ జన్మలో కాకున్ననూ, నీ అనుగ్రహము నాకు వంద జన్మలచేనైననూ కలుగు గాక!

బ్రాహ్మణ ఉవాచ

ఇత్యేతే గుహ్యసందేశా యదుదేవ మహఽఽహృతాః

విమృశ్య కర్తుం యచ్చా క్రియతాం తదనంతరమ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

ఉత్తరార్ధే ద్విపంచాశత్తమోధ్యాయః

బ్రాహ్మణుడిట్లు పలికెను --- ఓ యాదవప్రభూ! నేను తీసుకువచ్చిన ఈ విధమైన ఈ రహస్యసందేశములను తమరు విచారించి, ఈ విషయములో ఏది కర్తవ్యమో దానిని వెనువెంటనే అమలు చేయుడు.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో రుక్మిణి శ్రీకృష్ణునకు రహస్యసందేశమును పంపుటను వర్ణించే ఏబది రెండవ అధ్యాయము ముగిసినది (52).