భాగవత మహా పురాణము
80 - కుచేలోపాఖ్యానము - శ్రీకృష్ణుడు సుదాముని స్వాగతించుట
రాజోవాచ ।
భగవన్ యాని చాన్యానీ ముకుందస్య మహాఽఽత్మనః ।
వీర్యాణ్యనంతవీర్యస్య శ్రోతుమిచ్చామ హే ప్రభో ॥
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- పూజనీయుడవగు ఓ మహర్షీ! మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుడు అనంతమైన శక్తి గల మహాత్ముడు. ఓ ప్రభూ! ఆయన మహిమను సూచించే లీలలు ఇంకనూ ఏవి గలవో, వాటిని మేము వినగోరుచున్నాము.
కో ను శ్రుత్వాసకృద్బ్రహ్మన్నుత్తమశ్లోకసత్కథాః ।
వీరమేత విశేషజ్ఞో విషణ్ణః కామమార్గ ణైః ॥
ఓ మహర్షీ! కామనలనే బాణములచే విషాదమును పొంది వివేకమును తెలుసుకున్న ఎవ్వాడు శ్రీహరియొక్క కల్యాణకరగాథలనుండి విమించును? (ఎవ్వడైననూ విరమించడు). అట్టివాడు పవిత్రకీర్తియగు శ్రీహరియొక్క గాథలను పలుమార్లు వినును.
సా వాగ్యయా తస్య గుణాన్ గృణీతే కరౌ చ తత్కర్మకరౌ మనశ్చ ।
స్మరేద్వసంతం స్థిరజంగమేషు శృణోతి తత్పుణ్యకథాస కర్ణః ॥
ఆ శ్రీహరి గుణములను స్తుతించే వాక్కే వాక్కు. ఆయన కొరకు కర్మలను చేసే చేతులే చేతులు. స్థావరజంగమములగు , ప్రాణులలో ఆత్మరూపుడై నివసించే ఆ శ్రీహరిని స్మరించే మన స్సే మనస్సు. ఆయనయొక్క పావనగాథలను వినే చెవులే చెవులు.
శిరస్తు తస్యోభయలింగమానమేత్తదేవ యత్పశ్యతి తద్ది చక్షుః ।
అంగాని విష్ణోరథ తజ్జనానాం పాదోదకం యాని భజంతి నిత్యమ్ ॥
ఆ శ్రీహరికి ప్రతిమ మొదలైనది కదలని రూపము, భక్తులు కదిలే రూపము. ఈ రెండు రూపములకు నమస్కరించే తలయే తల. ఈ రెండు రూపములను చూచే కన్నులే కన్నులు. మరియు శ్రీహరియొక్క, ఆయన భక్తుల యొక్క పాదోదకమును సేవించే అవయవములే అవయవములు.
సూత ఉవాచ ।
విష్ణురాతేన సంపృష్ణో భగవాన్ బాదరాయణిః ।
వాసుదేవే భగవతి నిమగ్నహృదయ్యోఽబ్రవీత్ ॥
సూత మహర్షి ఇట్లు పలికెను --- పరీక్షిత్తు ప్రశ్నను విని పూజనీయుడు, వ్యాసపుత్రుడు అగు శుకుని హృదయము వాసుదేవ భగవానునియందు నిమగ్నమయ్యెను. ఆయన యిట్లు పలికెను.
శ్రీశుక ఉవాచ ।
కృష్ణస్యాసీత్సఖా కశ్చిద్భ్రాహ్మణో బ్రహ్మవిత్తమః ।
విరక్త ఇంద్రియార్ధేషు ప్రశాంతాత్మా జితేంద్రియః ॥
శ్రీశుక మహర్షి పలికెను - కృష్ణునకు ఒక బ్రాహ్మణమిత్రుడు ఉండెను. బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడగు ఆతడు ఇంద్రియభోగములయందు విరక్తుడై, ఇంద్రియములను జయించి ప్రసన్నమగు మనస్సు కలిగియుండెను.
యదృచ్చయోపపన్నేన వర్తమానో గృహాశ్రమీ ।
తస్య భార్యా కుచైలస్య క్షుత్ క్షామా చ తథావిధా ॥
గృహస్థుడైన ఆ సుదాముడు అనుకోకుండా ఈశ్వరేచ్చచే లభించిన దానితో జీవికను గడుపుచుండెను. చివికిన వస్త్రములను ధరించే ఆయన భార్య ఆకలికి కృశించియుండును. ఆమె కూడ ఆయననే పోలియుండును.
పతివ్రతా పతిం ప్రాహ మ్లాయతా వదనేన సా ।
దరిద్రా సీదమానా సా వేపమానాఽభిగమ్య చ ॥
దారిద్యముచే వ్యాకులమైన చిత్తము గల ఆ పతివ్రత ముఖములో రక్తము లేదు. ఆమె వణుకుతూ భర్తకు ఎదురుగా వచ్చి ఇట్లు పలికెను.
నను బ్రహ్మన్ భగవతస్సఖా సాక్షాచ్ఛ్రియః పతిః ।
బ్రహ్మణ్యశ్చ శరణ్యశ్చ భగవాన్ సాత్వతర్షభః ॥
ఓ పూజనీయా! పూజనీయులగు తమరి మిత్రుడు యాదవశ్రేష్ఠుడగు శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా లక్ష్మీదేవికి భర్త. బ్రాహ్మణభక్తి గల ఆయన శరణాగతులకు రక్షకుడు గదా!
తము పైహి మహాభాగ సాధూనాం చ పరాయణమ్ ।
దాస్యతి ద్రవిణం భూరి సీదతే తే కుటుంబినే ॥
ఓ మహాత్మా! ఆయన సజ్జనులకు సర్వోత్కృష్టమగు ఆశ్రయము. తమరు ఆయన వద్దకు వెళ్లుడు. కుటుంబీకుడవై కష్టపడుచున్న తమరికి ఆయన అధికమగు ధనమునీయగలడు.
ఆస్తేఽధునా ద్వారవత్యాం భోజవృష్ణ్యంధకేశ్వరః ।
స్మరతః పాదకమలమాత్మానమపీ యచ్చతి ।
కిం న్వర్థకామాన్ భజతో నాత్యభీష్టాఞ్జగద్గురుః ॥
భోజ-వృష్టి-అంధకవంశముల యాదవులకు ప్రభుడగు శ్రీకృష్ణుడు జగత్తునకు తండ్రి. ఆయన ఇప్పుడు ద్వారకానగరమునందున్నాడు. ఆయనయొక్క కలువవంటి పాదమును స్మరించువానికి ఆయన తనను కూడ ఇచ్చివేయును. భజించువానికి మిక్కిలి అభీష్టములు కాని అర్థకామములనిచ్చునని వేరుగా చెప్పవలయునా?
స ఏవం భార్యయా విప్రో బహుశః ప్రార్థితో మృదు ।
అయం హి పరమో లాభ ఉత్తమశ్లోకదర్శనమ్ ॥
ఆ బ్రాహ్మణుని భార్య ఈ తీరున పలుమార్లు మెత్తగా ప్రార్థించెను. ఉత్త మమగు కీర్తి గల శ్రీకృష్ణుని దర్శనమే గొప్ప లాభమని ఆయన తలచెను.
ఇతి సంచింత్య మనసా గమనాయ మతిం దధే ।
అప్యస్త్యుపాయనం కించిద్గృహే కల్యాణి దీయతామ్ ॥
ఆయన ఈ విధముగా మనస్సులో బాగా ఆలోచించి వెళ్లుటకే నిశ్చయించుకొనెను. ఓ కల్యాణీ! ఇంటిలో బహుమతి ఈయదగ్గది ఏదైనా ఉందా? ఉంటే ఇమ్ము (అని భార్యను అడిగెను).
యాచిత్వా చతురో ముష్టీన్ విప్రాన్ పృథుకతండులాన్ ।
చైలఖండేన తాన్ బద్ధ్వా భర్త్రే ప్రాదాదుపాయనమ్ ॥
ఆమె బ్రాహ్మణగృహములలో యాచించి నాలుగు పిడికిళ్ల అటుకులను సంపాదించి, వాటిని గుడ్డ ముక్కలో కట్టి బహుమతిగా ఇచ్చుటకై భర్తకు ఇచ్చెను.
స తానాదాయ విప్రాగ్యః ప్రయయౌ ద్వారకాం కిల ।
కృష్ణసందర్శనం మహ్యం కథం స్యాదితి చింతయన్ ॥
బ్రాహ్మణశ్రేష్ఠుడగు ఆ సుదాముడు వాటిని తీసుకొని, నాకు శ్రీకృష్ణుని దర్శనమెట్లు కలుగునో? అని ఆలోచిస్తూ ద్వారకకు పయనమయ్యెను.
త్రీణి గుల్మాన్యతీయాయ తిస్రః కక్షాశ్చ స ద్విజః ।
ఆ బ్రాహ్మణుడు మూడు రాజమార్గములను (సేనానివేశములను), మూడు ప్రహరీలను కూడ దాటి ముందుకు వెళ్లాను.
విప్రోఽగమ్యాంధవృషీనాం గృహేష్వచ్యుతధర్మిణమ్ ॥
గృహం ద్వ్యష్ట సహస్రాణాం మహిషీణాం హరేర్ద్విజః ।
వివేశైకతమం శ్రీమదహ్మానందం గతో యథా ॥
అంధకవృష్టివంశీయులగు యాదవులు శ్రీకృష్ణ భగవానుని ఆరాధకులు. వారి గృహములను చేరుట దుర్ఘటము. వారి గృహములకు, పదహారు వేల శ్రీకృష్ణుని భార్యల గృహములకు మధ్యలో శ్రీకృష్ణుని (రుక్మిణి) గృహము గలదు. వేదవేత్త యైన ఆ బ్రాహ్మణుడు ఆ గృహములనన్నింటినీ దాటుకొని శోభాయుక్తమగు ఆ గృహములోనికి ప్రవేశించి, బ్రహ్మానందమును పొందినవాడు వలె ఆయెను.
తం విలోక్యాచ్యుతో దూరాత్ప్రియాపర్యంకమాస్థితః ।
సహసోత్థాయ చాభ్యత్య దోర్భ్యాం పర్యగ్రహీన్ముదా ॥
ప్రియురాలగు రుక్మిణియొక్క శయ్య ను అధిష్టించియున్న శ్రీకృష్ణ భగవానుడు ఆయనను దూరమునుండి చూచెను. ఆయన వెంటనే లేచి నిలబడి ఎదు రేగి ఆనందముతో రెండు చేతులను చాచి కౌగిలించుకొనెను.
సఖ్యుః ప్రియస్య విప్రర్షేరంగసంగాతినిర్వృతః ।
ప్రీతో వ్యముంచదబ్బిందూన్నేత్రాభ్యాం పుష్కరేక్షణః ॥
వేదవేత్త, జ్ఞాని అగు సుదాముడు శ్రీకృష్ణుని ప్రియమిత్రుడు. ఆతని రాకకు ప్రీతుడైన శ్రీకృష్ణుడాతని. శరీరముతోడి స్పర్శ వలన మహానంద మును పొంది పద్మములవంటి కన్నులనుండి ఆనందాశ్రువులను విడిచెను.
అథోపవేశ్య పర్యంకే స్వయం సఖ్యుస్సమర్హణమ్ ।
ఉపహృత్యావనిజ్యాస్య పాదౌ పాదావనేజనీ ॥
అగ్రహీచ్చిరసా రాజన్ భగవాంల్లోకపావనః ।
వ్యలింపద్దివ్యగంధేన చందనాగురుకుంకుమైః ॥
ఓ పరీక్షిన్మహారాజా! తరువాత లోకములను పవిత్రము చేసే శ్రీకృష్ణ భగవానుడు ఆయనను శయ్య పై కూర్చుండబెట్టి, స్వయముగా పూజకు సామగ్రిని తెచ్చి, ఆ మిత్రుని పాదములను కడిగి, ఆ నీటిని తలపై చల్లుకొని, దివ్యమగు పరిమళద్రవ్యములను, గంధమును, అగురును, కుంకుమను ఆయనకు అలదేను.
ధూ పైసురభిభిర్మిత్రం ప్రదీపావలిభిర్ముదా ।
అర్చిత్వాఽఽవేద్య తాంబూలం గాం చ స్వాగతమబ్రవీత్ ॥
శ్రీకృష్ణుడు మిత్రుని పరిమళభరితములైన ధూపములతో, దీపముల పంక్తులతో పూజించి, తాంబూలమును గోవును కూడ సమర్పించి, స్వాగతమును పలికెను.
కుచైలం మలినం క్షామం ద్విజం ధమనిసంతతమ్ ।
దేవీ పర్యచరత్సాక్షాచ్చామరవ్యజనేన వై ॥
చివికిన వస్త్రములను దాల్చిన ఆ బ్రాహ్మణుడు మురికిగా, శరీరమంతా నరములేనా యన్నట్లు కృశించియుండెను. సాక్షాత్తు రుక్మిణీదేవి ఆయనకు వింజామరలు వీస్తూ పరిచర్య చేసెను.
అంతఃపురజనో దృష్ట్వా కృష్ణే నామలకీర్తినా ।
విస్మితోఽభూదతిప్రీత్యా అవధూతం సభాజితమ్ ॥
స్వచ్చమగు కీర్తి గల శ్రీకృష్ణుడు మలినవేషధారియగు బ్రాహ్మణుని మహానందముతో సత్కరించుటను చూచిన అంతఃపురజనులు చకితులైరి.
కిమనేన కృతం పుణ్యమవధూతేన భిక్షుణా ।
శ్రియా హీనేన లోకేఽస్మిన్ గర్హితేనాధమేన చ ॥
మలినవేషమును దాల్చిన ఈ బికారి వద్ద సంపద సున్న. ఈ లోకము లోని జనులు ఏవగించుకొనే ఈ అధముడు ఏమి పుణ్యమును చేసినాడో?
యోఽసౌ త్రిలోకగురుణా శ్రీనివా సేన సంభృతః ।
పర్యంకస్థాం శ్రియం హిత్వా పరిష్వ క్తోఽగ్రజో యథా ॥
ఎందుకంటే, ముల్లోకములకు గురువగు శ్రీకృష్ణ భగవానుడు శయ్య పైనున్న రుక్మిణీ (లక్ష్మీ) దేవిని విడిచి పెట్టి, అన్నగారిని వలె, ఈయనను కౌగిలించుకొనినాడు.
కథయాంచక్రతుర్గాథాః పూర్వా గురుకులే సతోః ।
ఆత్మనోర్లలితా రాజన్ కరౌ గృహ్య పరస్పరమ్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! వారిద్దరు ఒకరినొకరు చేతులను పట్టుకొని, తాము పూర్వము గురుకులములో ఉంటూండగా ఘటిల్లిన మనోహరములైన వృత్తాంతములను చెప్పుకొనిరి.
శ్రీభగవానువాచ ।
అపీ బ్రహ్మ గురుకులాద్భవతా లబ్ధదక్షిణాత్ ।
సమావృత్తేన ధర్మజ్ఞ భార్యోథా సదృశీ న వా ॥
శ్రీకృష్ణ భగవానుడు పలికెను – మహాత్మా! నీకు ధర్మము తెలియును. నీవు గురువునకు దక్షిణ ఇచ్చి గురుకులమునుండి ఇంటికి వచ్చి స్నాతక వ్రతమును చేసి యోగ్యమగు యువతిని వివాహమాడితివా? లేదా?
ప్రాయో గృహేషు తే చిత్తమకామవిహతం తథా ।
నైజాతిప్రియ సే విద్వన్ ధనేషు విదితం హి మే ॥
ఓ విద్వాంసుడా! గృహస్థుడవైననూ నీ మనస్సు ఇతరులకు వలె తరుచుగా కామనలచే ఆకర్షించబడదు. పైగా, నీవు సంపదల విషయ ములో అధికమగు సంతోషమును పొందుట లేదని నాకు తెలియును.
కేచితుర్వంతి కర్మాణి కామైరహతచేతసః ।
త్యజంతః ప్రకృతీర్దైవీర్యథోఽహం లోకసంగ్రహమ్ ॥
నేను లోకమునకు ఆదర్శముగానుండుటకై కర్మలను చేయుదును. అదే విధముగా, కొందరు కామనల ఆకర్షణ లేకుండా ఈశ్వరీయప్రకృతియొక్క కార్యములగు వాసనలను విడిచి పెట్టి కర్మలను చేయుదురు.
కచ్చిద్గురుకులే వాసం బ్రహ్మన్ స్మరసీ నౌ యతః ।
ద్విజో విజ్ఞాయ విజ్ఞేయం తమసః పారమశ్నుతే ॥
ఓ మహాత్మా! గురుకులములో మనిద్దరి నివాసము నీకు గుర్తున్నదా? ఉపనీతుడు గురుకులములో నివసిస్తూ, తెలియదగిన ధర్మాదులను తెలుసుకొని అజ్ఞానమునతిక్రమించి మోక్షమును పొందును.
స వై సత్కర్మణాం సాక్షార్ట్విజాతేరిహ సంభవః ।
ఆద్యోంఽగ యత్రాశ్రమీణాం యథాఽహం జ్ఞానదో గురుః ॥
ఓయీ! ఈ లోకములో జన్మనిచ్చిన తండ్రి మొదటి గురువు. ఉపనయనమైన పిదప సత్కర్మల సంస్కారమునిచ్చే వేదాధ్యాపకుడు రెండవ గురువు. ఆశ్రమములవారికి ఆత్మజ్ఞానమునుపదేశించువాడు మూడవ గురువు. వీరు నేను వలే పూజనీయులు.
నన్వర్థకోవిదా బ్రహ్మన్ వర్ణాశ్రమవతామిహ ।
యే మయా గురుణా వాచా తరంత్యంజో భవార్ణవమ్ ॥
ఓ మహాత్మా! ఎవరైతే గురురూపములోనున్న నా ఉపదేశముచే సంసారమనే సముద్రమును దాటివే సెదరో, వారు వర్ణాశ్రమముల వారిలో పరమార్థము బాగా తెలిసినవారు సుమా!
నాహమిజ్యాప్రజాతిభ్యాం తపసోపశమేన వా ।
తు ష్యేయం సర్వభూతాత్మా గురుశుశ్రూషయా యథా ॥
సకలప్రాణుల ఆత్మ యైన నేను గురుశుశ్రూష చే సంతోషించినట్లుగా యజ్ఞముచే గాని, సంతానము (గృహస్థధర్మము) చే గాని, తపస్సుచే గాని, సర్వమునుండి ఉపసంహారము (సన్న్యాసధర్మము) చే గాని సంతోషించను.
అపి నస్స్మర్యతే బ్రహ్మన్ వృత్తం నివసతాం గురౌ ।
గురుదారైనోదితానామింధనానయనే క్వచిత్ ॥
ఓ మహాత్మా! మనము గురువుగారివద్ద నివసిస్తుండగా జరిగిన ఘటన నీకు గుర్తున్నదా? ఒకనాడు గురువుగారి భార్య మనలను పొయ్యిలోకి కట్టెలను తెమ్మని నియోగించెను.
ప్రవిష్టానాం మహాఽరణ్యమపర్తౌ సుమహద్ద్విజ ।
వాతవర్షమభూతీవ్రమ్ నిష్ఠురాః స్తనయిత్నవః ॥
ఓయీ బ్రాహ్మణా! మనము పెద్ద అడవిని ప్రవేశించితిమి. అప్పుడు వర్షాకాలము పోయి శీతకాలము వచ్చెను. కాని, అప్పుడు చాల పెద్ద సహించ శక్యము కాని గాలివాన వచ్చెను. మేఘములు కఠోరముగా గర్జించేను.
సూర్యశ్చాస్తం గతస్తావత్తమసా చావృతా దిశః ।
నిమ్నం కూలం జలమయం న ప్రాజ్ఞాయత కించన ॥
అంతలో సూర్యుడస్తమించి దిక్కులు చీకటిచే ఆవరించబడెను. అంతా జలమయమై ఎత్తుపల్లములు తెలియకుండెను.
వయం భృశం తత్ర మహాఽనిలాంబుభిః
నిహన్యమానా ముహురంబుసంప్లవే ।
దిశోఽవిదంతోఽథ పరస్పరం వనే
గృహీతహస్తాః పరిబభ్రమాతురాః ॥
ఆ అడవిలో పెద్ద గాలివానచే గట్టిగా కొట్టబడు చున్న మనము జలప్రళయములో దిక్కు తోచక ఒకరినొకరు చేతులు పట్టుకొని వ్యాకుల మనస్కులమై పలుమార్లు పరిభ్రమించితిమి.
ఏతద్విదిత్వా ఉదితే రవో సాందీపనిర్గురుః ।
అన్వేషమాణో నశ్శిష్యానాచార్యోఽపశ్యదాతురాన్ ॥
మన గురువగు సాందీపని ఆచార్యుడు ఈ సంగతి తెలిసి సూర్యుడుదయించగానే మనలను వెదుకుతూ బయలుదేరెను. ఆపదలో నున్న మనలను ఆయన కనుగొనెను.
అహో హే పుత్రకా యూయమస్మదర్థేఽతిదుఃఖితాః ।
ఆత్మా వై ప్రాణినాం పేష్ఠస్తమనాదృత్య మత్పరాః ॥
అయ్యో! ఓ పుత్రులారా! మీరు మా కొరకై చాల దుఃఖమును సహించినారు. ప్రాణులకు తమ దేహము, ప్రాణము చాల ప్రియమైనవి. మీరు వాటిని కూడ లెక్క పెట్టకుండా నా సేవయందు నిమగ్న మైనారు.
ఏతదేవ హి సచ్చిష్యైః కర్తవ్యం గురునిష్కృతమ్ ।
యద్వై విశుద్ధభావేన సర్వార్థాత్మాఽర్పణం గురౌ ॥
ఏలయన, శిష్యుడు నిష్కటమగు ప్రేమతో సకలపదార్థములను, దేహమును కూడ గురువునకు సమర్పించవలెను. మంచి శిష్యులు గురువునకు నిశ్చయముగా ఇట్టి సేవను చేయవలెను.
తుష్టోఽహం భో ద్విజశ్రేష్ఠిస్సత్యాస్సంతు మనోరథాః ।
ఛందాంస్యయాతయామాని భవంత్విహ పరత్ర చ ॥
నాయనలారా! బ్రహ్మచారులలో మీరు శ్రేష్ఠులు. మీకు మనోరథములు సత్యమగుగాక! మీరు అధ్యయనము చేసిన మంత్రములు ఇహపర ములలో తొలగిపోని సారము గలవి (ఫలమునిచ్చే శక్తి గలవి) అగుగాక!
ఇత్థంవిధాన్యనేకాని వసతాం గురువేశ్మసు ।
గురోరనుగ్రహేణేవ పుమాన్ పూర్ణః ప్రశాంతయే ॥
గురువుయొక్క గృహమునందు నివసించిన మనకు ఇటువంటి అనేకములగు అనుభవములు కలిగినవి. గురువు యొక్క అనుగ్రహముచే మాత్రమే మానవుడు పూర్ణుడై ప్రశాంతిని పొందును.
బ్రాహ్మణ ఉవాచ ।
కిమస్మాభిరనిర్వృత్తం దేవదేవ జగద్గురో ।
భవతా సత్యకామేన యేషాం వాసో గురావభూత్ ॥
సుదాముడిట్లు పలికెను --- ఓ దేవాధిదేవా! నీవు జగత్తునకు తండ్రివి. సత్యసంకల్పుడవగు నీతో గూడి మేము గురుకులవాసమును చేసితిమి. అట్టి మాకు పొందబడనిది ఏమి ఉండును?(ఏమీ లేదు).
యస్య చ్చందోమయం బ్రహ్మ దేహ ఆవపనం విభో ।
శ్రేయసాం తస్య గురుషు వాస్వోత్యంతవిడంబనమ్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే
ఉత్తరార్ధ అశీతితమోఽధ్యాయః ॥
ఓ ప్రభూ! కల్యాణములకు నిలయమగు శబ్ద (వేదరూపమగు) బ్రహ్మ నీకు దేహము. అట్టి నీవు గురుకులవాసము చేయుట కేవలము మానవులననుకరించే లీల మాత్రమే.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో కుచేలోపాఖ్యానములో శ్రీకృష్ణుడు సుదాముని స్వాగతించుటను వర్ణించే ఎనుబదియవ అధ్యాయము ముగిసినది (80).
Summary of chapter 80 of the Bhāgavata Mahā Purana is as follows:
This chapter records the moving history of Sudāmā Vipra, a poor brāhmaṇa classmate of Śrī Kṛshṇa from the gurukula of Sāndīpani Muni. Living in dire poverty with his devoted wife, Sudāmā spent his days absorbed in Vedic study and devotional contemplation. Prompted by his wife, who begged him to visit his childhood friend in Dvārakā to seek relief from starvation, Sudāmā agreed to go, carrying nothing more than a small knot of chipped rice (*Chiḍvā*) wrapped in a torn cloth as a humble gift. Upon his arrival at Kṛshṇa's palace, Svayam Bhagavān Śrī Kṛshṇa received the destitute brāhmaṇa with imperial honors, washing Sudāmā's tired feet with His own hands and seating him upon His royal bed.