భాగవత మహా పురాణము
56 - స్యమంతకమణి వృత్తాంతము
శ్రీశుక ఉవాచ ।
సత్రాజితస్స్వతనయాం కృష్ణాయ కృతకిల్బిషః ।
సమంతకేన మణినా స్వయముద్యమ్య దత్తవాన్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- శ్రీకృష్ణుని యెడల అపరాధము చేసిన సత్రాజిత్తు స్వయముగా ప్రయత్నము చేసి తన కుమార్తెను సమంతకమనే మణితో సహా ఆయనకిచ్చి వివాహము చేసెను.
రాజోవాచ ।
సత్రాజితః కిమకరోద్బ్రహ్మన్ కృష్ణస్య కిల్బిషమ్ ।
సమంతకః కుతస్తస్య కస్మాద్దత్తా సుతా హరేః ॥
రాజు ఇట్లు పలి కెను --- ఓ మహర్షీ! సత్రాజిత్తు శ్రీకృష్ణుని యెడల చేసిన అపరాధమెట్టిది? ఆతనికి స్యమంతకమణి ఎక్కడిది? ఆయన శ్రీకృష్ణభగవానునకు కుమార్తెనిచ్చి వివాహము చేయుటకు కారణమేమి?
శ్రీశుక ఉవాచ ।
ఆసీత్సత్రాజితస్సూర్యో భక్తస్య పరమస్సఖా ।
ప్రీతస్తస్మై మణిం ప్రాదాత్సూర్యస్తుష్టస్స్యమంతకమ్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సత్రాజిత్తు గొప్ప సూర్యభక్తుడు. సూర్యునికి కూడ ఆయనంటే ప్రీతి. ఆయన భక్తికి సంతోషించి సూర్యుడాయనకు సమంతక మణిని ఇచ్చెను.
స తం బిభ్రన్మణిం కంఠే భ్రాజమానో యథా రవిః ।
ప్రవిష్ణో ద్వారకాం రాజం స్తేజసా నొపలక్షితః ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఆతడా మణిని మెడలో దాల్చి సూర్యుడు వలె ప్రకాశిస్తూ ద్వారకకు వచ్చెను. తేజస్సు కారణముగా జనులాతనిని కన్నెత్తి చూడ (గుర్తించ) లేకపోయిరి.
తం విలోక్య జనా దూరాత్తేజసా ముష్టదృష్టయః ।
దీవ్యతేఽక్షైర్భగవతే శశంసుస్సూర్యశంకితాః ॥
జనులాయనను దూరమునుండి చూచినని తలపోసిరి. ఎందుకంటే, ఆయన తేజస్సు వారి చూపును అపహరించెను. వారు పాచికలాడుచున్న శ్రీకృష్ణ భగవానునకు విన్నవించిరి.
నారాయణ నమస్తేఽస్తు శంఖచక్రగదాధర ।
దామోదరారవిందాక్ష గోవింద యదునందన ॥
ఓ నారాయణా! నీవు శంఖచక్రగదాధారివి. నిన్ను యశోద త్రాటితో నడుమునందు కట్టివేసెను. గోవిందా! పద్మములవంటి కన్నులు గల నీవు యదువంశమునానందింప జేయుచున్నావు. నీకు నమస్కారమగు గాక!
ఏష ఆయాతి సవితా త్వాం దిదృక్షుర్జగత్పతే ।
ముష్ణన్ గభస్తిచక్రేణ నృణాం చక్షూంషి తిగ్మగుః ॥
ఓ జగన్నాథా! వాడి కిరణములు గల ఈ సూర్యుడు నిన్ను చూడగోరి వచ్చుచున్నాడు. ఆయన కాంతి మండలము జనుల కన్నులకు మిరుమిట్లు గొల్పి చూడ లేకుండా చేయుచున్నది.
నన్వన్విచ్ఛంతి తే మార్గం త్రిలోక్యాం విబుధర్షభాః ।
జ్ఞాత్వాఽద్య గూఢం యదుషు ద్రష్టుం త్వాం యాత్యజః ప్రభో ॥
ఓ ప్రభూ! గొప్ప గొప్ప దేవతలు కూడ ముల్లోకములలో నిన్ను పొందే ఉపాయమును గురించి అన్వేషించెదరు సుమా! నీవు యాదవులలో రహస్యముగా ఉన్నావని తెలిసి నిన్ను చూచుటకై సూర్యుడు వస్తున్నాడు.
శ్రీశుక ఉవాచ ।
నిశమ్య బాలవచనం ప్రహస్యాంబుజలోచనః ।
ప్రాహ నాసౌ రవిర్దేవస్సత్రాజిన్మణినా జ్వలన్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- పద్మములవంటి కన్నులు గల శ్రీకృష్ణుడు అమాయకులగు ఆ జనుల మాటను విని నవ్వి, ఇట్లు చెప్పెను -- ఈతడు సూర్యభగవానుడు కాడు; మణితో ప్రకాశించుచున్న సత్రాజిత్తు.
సత్రాజిత్స్వగృహం శ్రీమత్కృతకౌతుకమంగలమ్ ।
ప్రవిశ్య దేవసదనే మణిం విప్రైర్న్యవేశయత్ ॥
సత్రాజిత్తు రాకను పురస్కరించుకొని ఆతని ఇంటిలో మంగళోత్సవము చేయబడెను. ఆయన శోభాయుక్తమైన స్వగృహములో ప్రవేశించి, దేవుని పూజామందిరములో వేదవేత్తలచే స్యమంతకమణిని స్థాపింపజేసెను.
దినే దినే స్వర్ణభారానష్టౌ స సృజతి ప్రభో ।
దుర్భిక్షమార్యరిష్టాని సర్పాధివ్యాధయోఽశుభాః ।
న సంతి మాయినస్తత్ర యత్రా స్తేఽభ్యర్చితో మణిః ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఆ స్యమంతకమణి ప్రతిదినము ఎనిమిది బారువుల బంగారమును ఉత్పన్నము చేయును. దానిని ఎక్కడ స్థాపించి పూజిస్తారో అక్కడ కరువు, మారకరోగములు, గ్రహపీడలు, పాములు, మనోవ్యాధులు, రోగములు, అమంగళములు, చోరులు ఉండరు.
స యాచితో మణిం క్వాపి యదురాజాయ శౌరిణా ।
నైపొర్థకాముకః ప్రాధాద్యాచ్ఞాభంగమతర్కయన్ ॥
ఒకప్పుడు శూరవంశీయుడగు శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఆ మణిని యాదవప్రభుడగు ఉగ్రసేనుని కొరకు ఇండని కోరెను. ఆయన కోరికకు భంగమును కలిగించకూడదనే వివేకము ధనలోభియగు సత్రాజిత్తునకు లేకుండెను. ఆతడా కోరికను మన్నించనే లేదు.
తమేకదా మణీం కంఠే ప్రతిముచ్య మహప్రభమ
ప్ర సేనో హయమారుహ్య మృగయాం వ్యచరద్వనే ॥
ఒకనాడు ప్రసేనుడు (సత్రాజిత్తు సోదరుడు) గొప్ప కాంతి గల ఆ మణిని మెడలో కట్టుకొని గుర్రమెక్కి అడవిలో వేటాడుతూ సంచరించెను.
ప్రసేనం సహయం హత్వా మణిమాచ్చిద్య కేసరీ ॥
గిరిం విశన్ జాంబవతా నిహతో మణిమిచ్ఛతా ॥
ఒక సింహము ప్ర సేనుని, గుర్రమును చంపి ఆ మణిని లాగుకొని కొండ ఎక్కుతూంటే, ఆ మణిని కోరి జాంబవంతుడు దానిని చం పెను.
సోఽపీ చక్రే కుమారస్య మణిం క్రీడనకం బిలే ।
అపశ్యన్ భ్రాతరం భ్రాతా సత్రాజిత్పర్యతప్యత ॥
ఆ జాంబవంతుడున్నూ మణిని గుహలో తన పిల్లవానికి ఆటవస్తువుగా చే సెను. అన్నగారు సత్రాజిత్తు తన తమ్ముడు కానరాకుండుటచే చాల దుఃఖమును పొందెను.
ప్రాయః కృష్ణేన నిహతో మణిగ్రీవో వనం గతః ।
భ్రాతా మతి తచ్ఛ్రుత్వా కర్ణే కర్ణేఽజపన్ జనాః ॥
నా తమ్ముడు మణిని మెడలో పెట్టుకొని అడవికి వెళ్లినాడు. వానిని బహుశః శ్రీకృష్ణుడే చంపి ఉండును, అని ఆ సత్రాజిత్తు అనెను. ఆ మాటను విని జనులు ప్రతివాని చెవిలో గుసగుసలాడిరి.
భగవాంస్తదుపశ్రుత్య దుర్యశో లిప్తమాత్మని ।
మార్ ష్టుం ప్రసేనపదవీమన్వపద్యత నాగరైః ॥
శ్రీకృష్ణ భగవానుడు తన పై చల్లబడిన ఆ బురద (అపకీర్తి) ను గురించి వినేను. ఆయన దానిని తుడిచివేయుటకై కొందరు పురజనులతో కూడి ప్రసేనుని ఆచూకీని వెదుక్కుంటూ అడవికి వెళ్లాను.
హతం ప్ర సేనమశ్వం చ వీక్ష్య కేసరిణా వనే ।
తం చాద్రిపృష్ఠే నిహతమృక్షణ దదృశుర్జనాః ॥
అడవిలో సింహముచే చంపబడిన ప్రసేనుని, వాని గుర్రమును జనులు చూచిరి. ఆ తరువాత కొండ శిఖరము పై జాంబవంతునిచే చంపబడిన ఆ సింహమును కూడ జనులు చూచిరి.
ఋక్షరాజబిలం భీమమంధేన తమసాఽఽవృతమ్ ।
ఏకో ఏవేశ భగవానవస్థాప్య బహిః ప్రజాః ॥
జాంబవంతుని గుహ కళ్లు పొడుచుకున్నా కానరాని చీకటితో నిండి భయమును గొల్పుచుండెను. శ్రీకృష్ణ భగవానుడు జనులను బయట నిలబెట్టి తానొక్కడే ఆ గుహలో ప్రవేశించేను.
తత్ర దృష్ట్వా మణిశ్రేష్ఠం బాలక్రీడనకం కృతమ్ ।
హర్తుం కృతమతిస్తస్మిన్నవత స్థేఽర్భకాంతికే ॥
ఆ గుహలో పిల్లవానికి ఆటవస్తువుగా చేయబడిన ఆ గొప్ప మణిని ఆయన చూచెను. దానిని తీసుకొని నిశ్చయించి, ఆయన పిల్లవాని దగ్గరకు వెళ్లి నిలబడెను.
తమపూర్వం నరం దృష్ట్వా ధాత్రీ చుక్రోశ భీతవత్ ।
తచ్ఛ్రుత్వాఽభ్యద్రవత్క్రుద్ధోజాంబవాన్ బలినాం వరః ॥
ఇదివరలో ఎన్నడూ చూడని ఆ మనిషిని చూచి దాది భయపడినది వలె అరిచెను. బలవంతులలో శ్రేష్ఠుడగు జాంబవంతుడు ఆ అరుపు విని కోపించి పరుగెత్తుకు వచ్చెను.
స వై భగవతా తేన యుయుధ స్వామినాఽఽత్మనః ।
పురుషం ప్రాకృతం మత్వా కుపితో నానుభావవిత్ ॥
ఆ జాంబవంతుడు కోపించిన కారణముగా, (రామావతారములో) తన ప్రభువగు శ్రీకృష్ణ భగవానుని ప్రభావమును గుర్తించలేకపోయెను. ఆయన మామూలు మనిషి అని తలచి, ఆతడాయనతో యుద్దమునకు దిగెను.
ద్వంద్వయుద్దం సుతుములముభయోర్విజిగీషతోః ।
ఆయుధాశ్మద్రుమైర్దోర్భిః క్రవ్యార్థే శ్యేనయోరివ ॥
ఒకరినొకరు జయించగోరే వారిద్దరు, మాంసము కొరకు డేగలవలె, మిక్కిలి సంకులమైన ద్వంద్వయుద్ధమును చేసిరి. ఆయుధములతో ప్రారంభ మైన ఆ యుద్ధము రాళ్లతో, చెట్లతో, భుజములతో కొనసాగెను.
ఆసీత్తదష్టావింశాహమితరేతరముష్టిభిః ।
వజ్రని ష్పేషపరుషై రవిశ్రమమహర్నిశమ్ ॥
వారు ఒకరినొకరు పిడుగుపాటువంటి పిడిగుద్దులతో కొట్టుకుంటూ రాత్రింబగళ్లు విశ్రాంతి లేకుండా ఇరవై ఎనిమిది రోజులు యుద్ధము చేసిరి.
కృష్ణ ముష్టివినిష్పాతనిష్పిష్టాంగోరుబంధనః ।
క్షీణసత్త్వస్స్విన్నగాత్రస్తమాహాతీవ విస్మితః ॥
శ్రీకృష్ణుని పిడిగుద్దులచే జాంబవంతుని అవయవములు, కీళ్లు నుగ్గు నుగ్గు ఆయెను. ఆతనికి బలము క్షీణించి, దేహము చెమటతో తడిసి ముద్దాయెను. ఆతడు చాల ఆశ్చర్యపడి శ్రీకృష్ణునితో నిట్లనెను.
జానే త్వాం సర్వభూతానాం ప్రాణ ఓజస్సహో బలమ్ ।
విష్ణుo పురాణపురుషం ప్రభవిష్ణుమధీశ్వరమ్ ॥
సకలప్రాణులలోని ప్రాణశక్తి, ఇంద్రియ శక్తి, మనశ్శక్తి, దేహశక్తి నీవే. సకలజగత్తును సృష్టించి పాలించే సర్వసమర్థుడగు విష్ణువు నీవేనని నేను గుర్తు పట్టుచున్నాను. పూర్ణ బ్రహ్మవు నీవే.
త్వం హి విశ్వసృజాం స్రష్టా సృజ్యానామపి యచ్చ సత్ ।
కాలః కలయతామీశః పర ఆత్మా తథాఽఽత్మనామ్ ॥
జగత్తును సృష్టించే ప్రజాపతులను సృష్టించేది నీవే. సృష్టించబడే పంచభూతములు మొదలగువాటి సత్త యేది గలదో అది నీవే. కాలస్వరూపుడవగు నీవు ఇంద్రాదిప్రభువులను కూడ శాసించెదవు. జీవుల అంతరతమమగు ఆత్మవు నీవే..
య స్యేషదుత్కలితరోషకటాక్షమోక్షైః
వర్ష్మాదిశత్ క్షుభితనక్రతిమింగిలోఽభ్ధిః ।
సేతుః కృతస్స్వయశ ఉజ్జ్వలితా చ లంకా
రక్షశ్శిరాంసి భువి పేతురషుక్షతాని ॥
కొంచెము పైకి వచ్చిన కోపముతో నీవు చూసిన చూపులకు సముద్రములోని మొసళ్లు, తిమింగిలములు క్షోభిల్లగా, సముద్రుడు దారిని ఇచ్చెను. దానిపై కట్టిన సేతువు నీ కీర్తిని చాటుచునే యున్నది. నీవు లంకను నాశము చేసితివి. నీ బాణములచే కొట్టబడిన రాక్షసుల తలలు నేల గూలినవి.
ఇతి విజ్ఞాతవిజ్ఞానమృక్షరాజానమచ్యుతః।
వ్యాజహార మహారాజ భగవాన్ దేవకీసుతః ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుని స్వరూపమును జాంబవంతుడు గుర్తించెను. దేవకీసుతుడగు అచ్యుతుడాయనతో నిట్లనెను.
అభిమృశ్యారవిందాక్షః పాణినా శంకరేణ తమ్ ।
కృపయా పరయా భక్తం ప్రేమగంభీరయా గిరా ॥
పద్మములవంటి కన్నులు గల శ్రీకృష్ణుడు గొప్ప దయతో తన సుఖకరమైన చేతితో భక్తు డైన ఆ జాంబవంతుని దేహమును స్పృశించి,ప్రేమతో గంభీరమైన వాక్కుతో నిట్లనెను.
మణి హేతోరిహ ప్రాప్తా వయమృక్షపతే బిలమ్ ।
మిథ్యాఽభిశాపం ప్రమృజనాత్మనో మణినాఽమునా ॥
ఓ జాంబవంతా! నేను మణి కొరకై ఈ గుహకు వచ్చితిని. నేనీ మణితో నాకు కలిగిన అసత్యమగు అపవాదును తుడిచివే సెదను.
ఇత్యు క్తస్స్వాం దుహితరం కన్యాం జాంబవతీం ముదా ।
అర్హణార్థం స మణినా కృష్ణాయోపజహార హ ॥
శ్రీకృష్ణుడిట్లు పలుకగా, ఆ జాంబవంతుడు ఆయనను పూజించుటకై మణితో బాటుగా తన పెళ్లి కాని కుమార్తెయగు జాంబవతిని ఆనందముతో సమర్పించెనట.
అదృష్ట్వా నిర్గమం శారేః ప్రవిష్టస్య బిలం జనాః ।
ప్రతీక్ష్య ద్వాదశాహాని దుఃఖితాస్స్వపురం యయుః ॥
జనులు పన్నెండు రోజులు వేచి చూచినా గుహలో ప్రవేశించిన శ్రీకృష్ణుడు బయటకు రాలేదు. అప్పుడు వారు దుఃఖితులై తమ నగరమునకు తిరిగి వెళ్లిరి.
నిశమ్య దేవకీ దేవీ రుక్మిణ్యానకదుందుభిః ।
సుహృదో జ్ఞాతయోఽశోచన్ బిలాత్కృష్టమనిర్గతమ్ ॥
శ్రీకృష్ణుడు గుహనుండి బయటకు రాలేదని విని దేవకీదేవి, రుక్మిణి, వసుదేవుడు, మిత్రులు, బంధువులు దుఃఖించిరి.
సత్రాజితం శపంతస్తే దుఃఖితా ద్వారకౌకసః ।
ఉపతస్థుర్మహామాయాం దుర్గాం కృష్ణోపలబ్ధయే ॥
దుఃఖితులైన ఆ ద్వారకానగరవాసులు సత్రాజిత్తును తిట్టిపోసిరి. వారు జగత్కారణమగు మాయాశక్తి యైన దుర్గాదేవిని, శ్రీకృష్ణుడు శీఘ్రముగా తిరిగి రావాలని ప్రార్థించిరి.
తేషాం తు దేవ్యుపస్థానాత్ప్రత్యాదిష్టాశిషా స చ ।
ప్రాదుర్బభూవ సిద్ధార్థస్సదారో హర్షయన్ హరిః ॥
వారు దేవిని ప్రార్థించగా ఆమె ఆశీస్సులనిచ్చెను. దానిచే ఆ శ్రీకృష్ణ భగవానుడు సిద్ధించిన ప్రయోజనము (అపవాదును తుడిచివేయుట) గలవాడై భార్యయగు జాంబవతితో సహా వారికి కనబడెను. వారు చాల ఆనందించిరి.
ఉపలభ్య హృషీ కేశం మృతం పునరివాగతమ్ ।
సహ పత్న్యా మణిగ్రీవం సర్వే జాతమహోత్సవాః ॥
ఇంద్రియాధిపతియగు శ్రీకృష్ణ భగవానుడు మరణించినవాడు తిరిగి వచ్చినాడా యన్నట్లు వారికి మెడలో మణితో భార్యతో సహా కనబడెను. వారందరు గొప్ప ఉత్సవమును చేసుకొనిరి..
సత్రాజితం సమాహూయ సభాయాం రాజసన్నిధౌ ।
ప్రాప్తిం చాఖ్యాయ భగవాన్మణిం తస్మై న్యవేదయత్ ॥
శ్రీకృష్ణ భగవానుడు ఉగ్ర సేన మహారాజు సన్నిధిలో సభకి సత్రాజిత్తుని ఆహ్వానించి, మణి దొరికిన విధమును చెప్పి, ఆయనకు సమర్పించెను.
స చాతివ్రేడితో రత్నం గృహీత్వాఽవాజ్ముఖస్తతః ।
అనుతప్యమానో భవనమగమత్స్వేన పాప్మనా ॥
ఆ సత్రాజిత్తైతే శ్రీకృష్ణుని వద్దనుండీ మణిని తీసుకొని చాల సిగ్గు పడి తన తప్పునకు పశ్చాత్తాపపడూ తల వంచుకొని తన మహలుకు వెళ్లాను.
సోఽనుధ్యాయంస్తదేవాఘం బలవద్విగ్రహాకులః ।
కథం మృజామ్యాత్మరజః ప్రసీదేద్వాఽరచ్యుతః కథమ్ ॥
బలవంతులగు యాదవులతోడి విరోధము వలన ఆ సత్రాజిత్తు మనస్సు వ్యాకులమాయెను. ఆయన తన ఆ అపరాధమును గురించియే తలపోయుచుండెను. నా తప్పును ఏ విధముగా తుడిచివేయవలెను? శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నుడయ్యే విధమెది? అని చింతిల్లెను.
కిం కృత్వా సాధు మహ్యం స్యాన్న శ పేద్వా జనో యథా ।
అదీర్ఘదర్శనం క్షుద్రం మూడం ద్రవిణలోలుపమ్ ॥
నేను ముందు చూపు లేని అవివేకిని, ధనమునందు లోభము గల అల్పుడను. నేను ఏమి చేసినచో, నాకు మంగళము కలుగును? జనము నన్ను తిట్టకుందురు?
దాస్యే దుహితరం తస్మై స్త్రీరత్నం రత్నమేవ చ ।
ఉపాయోఽయం సమీచీనస్తస్య శాంతిర్న చాన్యథా ॥
ఆయనకు స్త్రీలలో రత్న మైన కుమార్తెను, స్యమంతకమణిని కూడ ఇచ్చెదను. ఇదియే చక్కని ఉపాయము. ఇట్లు చేయనిచో, నా అపరాధమును ఇంకో విధముగా తుడిచివేయుట సంభవము కానే కాదు.
ఏవం వ్యవసీతో బుద్ద్యా సత్రాజిత్స్వసుతాం శుభామ్ ।
మణిం చ స్వయముద్యమ్య కృష్ణాయోపజహార హ ॥
సత్రాజిత్తు తన మనస్సులో ఈ విధముగా నిశ్చయించుకొని తనంత తానే పూనుకొని (వసుదేవాదులను సంప్రదించి) కల్యాణియగు కుమార్తె సత్యభామను, సమంతకమణిని కూడ శ్రీకృష్ణునకు సమర్పించెను.
తాం సత్యభామాం భగవానుపయేమే యథావిధి।
బహుభిర్యాచిత్రం శీలరూపౌదార్యగుణాన్వితామ్ ॥
ఆ సత్యభామను వివాహము చేసుకొనవలెనని ఇదివరలో (కృతవర్మ మొదలగువారు) చాలమంది ఉవ్విళ్లూరిరి. సచ్ఛీలము, అందము, పెద్ద మనసు అనే గుణములను కలిగియున్న ఆమెను శ్రీకృష్ణ భగవానుడు యథావిధిగా వివాహము చేసుకొనెను.
భగవానాహ న మణిం ప్రతీచ్చామో వయం నృప ॥
తవాస్తాం దేవభక్తస్య వయం చ ఫలభాగినః ॥
ఇతి శ్రీమద్బాగవతే మహాపురాణే దశమస్కంధే
ఉత్తరార్ధే షట్పంచాశత్తమోఽధ్యాయః ॥
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను - నేను స్యమంతకమును తీసుకోను. సూర్యదేవుని భక్తుడవగు తమరివద్దనే అది ఉండవలెను. కాని, దాని - ఫలము (బంగారము) మాకు లభించుచునే యుండును.
శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో స్యమంతక
వృత్తాంతమును వర్ణించే ఏబది ఆరవ అధ్యాయము ముగిసినది .
Summary of chapter 56 of the Bhāgavata Mahā Purana is as follows:
A prominent Vṛshṇi citizen named Satrājit performed severe worship of the sun god Vivasvān, who presented him with the magical Syamantaka jewel, which produced eight bhāras (approx. 170 pounds) of pure gold daily and protected its surroundings from famine and disease. When Śrī Kṛshṇa suggested that the jewel be given to King Ugrasena for the public good, Satrājit refused out of greed. Shortly thereafter, Satrājit's brother Prasena wore the jewel into the forest on a hunt, where he was killed by a lion. The lion was then killed by the mighty bear king Jāmbavān, who took the jewel into his mountain cave to give to his child. When Prasena failed to return, Satrājit falsely accused Śrī Kṛshṇa of murdering his brother to steal the jewel.