54 - శిశుపాలాదులను ఓడించి శ్రీకృష్ణుడు రుక్మిణిని పరిణయమాడుట

శ్రీశుక ఉవాచ

ఇతి సర్వే సుసంరబ్దా వాహానారుహ్య దంశితాః

 స్వైస్స్వైర్బలైః పరిక్రాంతి అన్వీయుధ్ధృతకార్ముకః

            శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా ఆ రాజులకు చాల కోపము వచ్చెను. వారు కవచములను ధరించి, ధనుస్సులను చేతబట్టి, వాహనములనెక్కి, తమ తమ సైన్యములు చుట్టువారి రాగా, శ్రీకృష్ణుని వెనుకనుండి తరిమిరి..

తానాపతత ఆలోక్య యాదవానీకయూథపాః

 తస్థుస్తత్సంముఖా రాజన్ విస్ఫూర్జ్య స్వధనూంషి తే

 రాఓ పరీక్షిన్మహారాజా! వారు తమ మీదకు వచ్చుటను ఆ యాదవ సైన్యముల అధ్యక్షులు చూచి తమ ధనుస్సులను టంకారము చేసి నిలిచి వారిని ఎదుర్కొనిరి.  

అశ్వపృష్ఠే గజస్కంధే రథోపస్థే చ కోవిదాః

 ముముచుశ్శరవర్షాణి మేఘా అద్రిష్వపో యథా

యుద్దనిపుణులగు ఆ రాజులు గుర్రములపై, ఏనుగుల పై, రథములలో ఉన్న యాదవుల పై బాణముల వర్షములను, మేఘములు కొండల పై జలములను వలె, కురిపించిరి.

పత్యుర్బలం శరాసారైశ్చన్నం వీక్ష్య సుమధ్యమా

సవ్రీడమైక్షత్తద్వంక్త్రం భయవిహ్వలలోచనా

భర్తయగు శ్రీకృష్ణుని సైన్యము బాణముల ధారలతో కప్పివేయబడుటను చూచి - రుక్మిణి కన్నులు భయముతో వ్యాకులమయ్యెను. ఆమె సిగ్గు పడుతూ ఆయన ముఖమును చూచెను.

ప్రహస్య భగవానాహ మా స్మ భైర్వామలోచనే

వినంక్ష్యత్యధునైవైతత్తావ కైశ్శాత్రవం బలమ్

 శ్రీకృష్ణ భగవానుడు నవ్వి యిట్లనెను -- ఓ అందమైన కన్నులదానా! భయపడకుము.  ఇప్పుడే నీ పొరలు (మేము) ఈ శత్రు సైన్యమును మట్టుబెట్టగలరు.

తేషాం తద్విక్రమం వీరా గదసంకర్షణాదయః

 అమృష్యమాణా నారాచైర్జఘ్నుర్హయగజాన్ రథాన్

 గదుడు, బలరాముడు, సాత్యకి మొదలగు వీరులు జరాసంధాదుల ఆ పరాక్రమమును సహించ రైరి. వారు గుర్రములు, ఏనుగులు, రథములపై యుద్ధము చేయువారిని వాడి బాణములతో కొట్టిరి.

పేతుశ్శిరాంసి రథినమశ్వినాం గజినాం భువి

 సకుండలకీరీటాని సోష్ణీషాణి చ కోటిశః

 రథికుల, గుర్రపు రౌతుల, ఏనుగుల పై యుద్ధము చేయువారల తలలు కోట్లాదిగా నేల పై కూలినవి. ఆ తలలకు కుండలములు, కిరీటములు, తలపొగలు ఉండెను.

హస్తాస్సొసిగదేష్వాసాః కరభా ఊరవోఽoఘ్రయః

 అశ్వాశ్వతరనాగోష్ట్రఖరమర్త్యశిరాంసి చ

 కత్తులు, గదలు, ధనుస్సులతో కూడిన చేతులు, ముంజేతులు, తొడలు, కాళ్లు నేలపై పడినవి. గుర్రములు, కంచర గాడిదలు, గాడిదలు, ఏనుగులు, ఒంటేలు, మనుష్యులు అనువాటి తలలు కూడ నేల గూలినవి.

హన్యమానబలానీకా వృష్టిభిర్జయకాంక్షిభిః

 రాజానో విముఖా జగ్ముర్జరాసంధపురస్సరాః

            జయమును కోరే యాదవులు జరాసంధుడు, శిశుపాలుడు మొదలుగా గల రాజుల సైన్యసమూహములను సంహరింప జొచ్చిరి. అపుడా రాజులు వెనుదిరిగి వెళ్లిపోయిరి..

శిశుపాలం సమభ్యేత్య హృతదారమీవాతురమ్

నష్టత్విషం గతోత్సాహం శుష్యద్వదనమబ్రువన్

            శిశుపాలుడు భార్యను పోగొట్టుకున్నవాడు వలే దుఃఖితుడై యుండెను. ఆతనిలో కాంతి గాని, ఉత్సాహము గాని లేవు. ముఖములో రక్తము లేకుండెను. ఆ రాజులు ఆతని వద్దకు వచ్చి ఇట్లు పలికిరి.

భో భోః పురుష శార్దూల దౌర్మనస్యమిదం త్యజ

న ప్రియాప్రియయో రాజన్నిష్ఠా దేహిషు దృశ్యతే

            ఓయీ రాజా! నీవు మానవులలో శ్రేష్ఠుడవు. ఈ నిరుత్సాహమును విడిచి పెట్టుము. ప్రాణుల జీవితములలో సుఖము గాని, దుఃఖము గాని స్థిరముగా ఉండవని అందరికీ అనుభవమే.

యథా దారుమయీ యోషిన్నృత్యతే కుహ కేచ్ఛయా

ఏవమీశ్వరతంత్రోఽయమీహతే సుఖదుఃఖయోః

            చెక్కతో చేసిన యువతి బొమ్మ దానినాడించేవాని ఇచ్చకు తగ్గట్లుగా నాట్యమాడును. అదే విధముగా ఈశ్వరునకు వశవర్తి యైన జీవుడు కూడా సుఖదుఃఖముల విషయములో (అస్వతంత్రుడై) ప్రవర్తిల్లును.

శారేస్సప్తదశాహం వై సంయుగాని పరాజితః

 త్రయోవింశతిభి స్సైన్యైర్జీగ్య ఏకమహం పరమ్

నేనైతే ఇరవై మూడు అక్షౌహిణీల సైన్యముతో శూరవంశీయుడగు శ్రీ కృష్ణుని పై పది హేడు పర్యాయములు దండెత్తి ఓడిపోతిని. కాని, నేను ఒక్క యుద్ధమును జయించితిని (అని జరాసంధుడు ఓదార్చెను).

తథాఽప్యహం న శోచామి న ఫ్రహృష్యామి కర్హిచిత్

కాలేన దైవయుక్తేన జానన్ విద్రావితం జగత్

అయినప్పటికీ, నేనే కాలమునందైననూ దుఃఖమును గాని, హర్షమును గానీ పొందను. ఎందుకంటే, ప్రారబ్దముచే ప్రవర్తిల్ల జేయబడే కాలము జగత్తును క్షోభ పెట్టుచుండునని నాకు తెలియును.

అధునాఽపి వయం సర్వే వీరయూథపయూథపాః

 పరాజితాః ఫల్గుతంత్రైర్యదుభిః కృష్ణ పాలితైః

యాదవుల సైన్యము చిన్నదే. కాని వారిని శ్రీకృష్ణుడు రక్షిస్తున్నాడు. మనమందరము వీరులము, సేనానాయకులకు కూడ నాయకులము. అయినప్పటికీ, వారు మనలను ఓడించినారు.

రిపవో జిగ్యురధునా కాల ఆత్మానుసారిణీ

తదా వయం విజేష్యామో యదా కాలః ప్రదక్షిణః

 కాలము తమకు అనుకూలించుటచే ఈ నాడు శత్రువులు జయించినారు. కాలము అనుకూలమైనప్పుడు మనము జయించగలము.

ఏవం ప్రబోధితో మిత్రైశ్చైద్యోఽగాత్సానుగః పురమ్

 హతశేషాః పున స్తేఽపి యయుస్స్వం స్వం పురం నృపాః

            మిత్రులీ విధముగా , నచ్చజెప్పగా, చేదిదేశ రాజకుమారుడగు శిశుపాలుడు అనుచరులతో కూడి తన నగరమునకు వెళ్లాను. సంహరించ బడగా మిగిలిన ఆ రాజులు కూడ తమ తమ నగరములకు వెళ్లిరి.

రుక్మీ తు రాక్షసోద్వాహం కృష్ణ ద్విడసహన్ స్వసుః

 పృష్ఠతోఽన్వగమత్కృష్ణ మక్షౌ హీణ్యా వృతో బలీ

            బలశాలియగు రుక్మి కైతే శ్రీకృష్ణునియందు ద్వేషము. చెల్లెలిని శ్రీకృష్ణుడపహరించి వివాహమాడుటనాతడు సహించలేకపోయేను. ఆతడు అక్షౌహిణీ సైన్యము వెంట రాగా ఆయనను వెనుకనుండి తరిమెను.

రుక్మ్యమర్షీ సుసంరబ్దశ్శృణ్వతాం సర్వభూభుజామ్

 ప్రతిజజ్ఞే మహాబాహుర్దంశితస్సశరాసనః

 రుక్మి గొప్ప బలశాలియే. కాని, ఆతనికి సహనము లేదు, కోపము యెక్కువ. ఆతడు కవచమును వేసుకొని, ధనుస్సును చేతబట్టి, రాజులందరు వినుచుండగా ప్రతిజ్ఞ చేసెను.

అహత్వా సమరే కృష్ణ మప్రత్యూహ్య చ రుక్మిణీమ్

 కుండినం న ప్రవేక్ష్యామి సత్య మేతద్బ్రవీమి వః

 యుద్దములో శ్రీకృష్ణుని సంహరించి రుక్మిణిని వెనుకకు తీసుకు వచ్చెదను. అట్లు చేయలేని పక్షములో నేను కుండిన నగరమును ప్రవేశించను. నేను మీకీ మాటను యథార్థముగా చెప్పుచున్నాను.

ఇత్యుక్త్వా రథమారుహ్య సారథిం ప్రాహ సత్వరః

 చోదయాశ్వాన్ యతః కృష్ణస్తస్య మే సంయుగం భవేత్

            రుక్మి ఇట్లు పలికి వేగముగా రథమునెక్కి సారథితో నిట్లనెను -- కృష్ణుడున్నచోటికి గుర్రములను తోలుము. నాకు, ఆయనకు యుద్ధము జరుగనున్నది.

అద్యాహం నిశితైర్బాణైర్గోపాలస్య సుదుర్మతేః

 నే ష్యే వీర్యమదం యేన స్వసా మే ప్రసభం హృతా

మిక్కిలి దుష్టబుద్దియగు శ్రీకృష్ణుడు నా చెల్లెలిని బలాత్కారముగా తీసుకువెళ్లినాడు. నేనీనాడు వాడి బాణములతో వానికి పరాక్రమము వలన కలిగిన గర్వమును దూరము చేసెదను.

వికత్థమానః కుమతిరీశ్వరస్యాప్రమాణవిత్

రథేనై కేన గోవిందం తిష్ఠ తిష్ఠేత్యథాహ్వయత్

సర్వసమర్థుడగు శ్రీకృష్ణుని ప్రభావము తెలియని దుర్బుద్ధియగు రుక్మి గొప్పలు చెప్పుకొనెను. ఆతడా తరువాత ఒకే రథముతో శ్రీకృష్ణుని వెంబడించి, నిలు నిలుమంటూ యుద్ధమునకు కాలు దువ్వెను.

ధనుర్వికృష్య సుదృఢం జఘ్నే కృష్ణం త్రిభిశ్శ రైః

 ఆహ చాత్ర క్షణం తీష్ఠ యదూనాం కులపాంసన

  ఆతడు ధనుస్సును గట్టిగా లాగి శ్రీకృష్ణుని మూడు బాణములతో కొట్టి, ఇట్లు పలికెను -- ఓయీ! నీవు యాదవవంశమునకు కళంకమవు. ఇచట క్షణకాలము నిలుము.

కుత్ర యాసి స్వసారం మే ముషిత్వా ధ్వాం క్షవద్దవిః

హరి ష్యేఽద్య మదం మంద మయినః కూట యోధినః

ఓరీ మందుడా! హోమద్రవ్యమును కాకి వలె నా చెల్లెలిని అపహరించి ఎచటకు వెళ్లెదవు? నీవు మాయావివి, కపటయుద్ధము చేసెదవు. నేనీనాడు నీ గర్వమునడంచెదను.

యావన్న మే హతో బాణైశ్శయీథా ముంచ దారికామ్

స్మయన్ కృష్ణో ధనుశ్ఛిత్వా షడ్భిర్వివ్యాధ రుక్మిణమ్

 ఎంతలో నా బాణములచే కొట్టబడి నీవు నేల గూలెదవో, ఆ లోపులోనే కన్యను విడువుము, అని (రుక్మి పలి కెను). శ్రీకృష్ణుడు నవ్వుతూ ఆరు బాణములతో వాని ధనుస్సును విరుగకొట్టి వానిని కూడ కొట్టి పీడించెను.

అష్టభిశ్చతురో వాహాన్ ద్వాభ్యాం సూతం ధ్వజం త్రిభిః

 స చాన్యద్ధనురాదాయ కృష్ణం వివ్యాధ పంచభిః

శ్రీకృష్ణుడు ఎనిమిది బాణములతో నాలుగు గుర్రములను, రెండింటితో సారథిని, మూడింటితో జెండాను కొట్టగా, ఆ రుక్మి కూడ ఇంకో ధనుస్సును తీసుకొని ఆయనను ఐదు బాణములతో కొట్టెను.

తెస్తాడితశ్శరౌ ఘైస్తు చిచ్ఛేద ధనురచ్యుతః

 పునరన్యదుపాదత్త తదప్యచ్ఛినదవ్యయః  

ఆ బాణముల గుంపులచే కొట్టబడిన శ్రీకృష్ణ భగవానుడైతే వాని ధనుస్సును (బాణముతో) విరుగకొట్టెను. ఆతడు మరల ఇంకో ధనుస్సును తీసుకోగా, వినాశము లేని భగవానుడు దానిని కూడ విరుగకొట్టెను.

పరిఘం పట్టిశం శూలం చర్మా సీ శక్తితోమరౌ

యద్యదాయుధమాదత్త తత్సర్వం సోఽచ్ఛినద్ధరిః

ఇనుప గుదియ, అడ్డ కత్తి, శూలము, డాలు, కత్తి, శక్తి, చిల్లకోల మొదలైన ఏయే ఆయుధములను రుక్మీ తీసుకోనేనో, వాటినన్నింటినీ ఆ శ్రీకృష్ణ భగవానుడు (బాణములతో) విరుగకొట్టెను.

తతో రథాదవప్లుత్య ఖడ్గపాణిర్జిఘాంసయా

 కృష్ణ మభ్యద్రవత్క్రుద్ధః పతంగ ఇవ పావకమ్  

తరువాత రుక్మి కోపించి చేతిలో కత్తితో రథమునుండి క్రిందకు దుమికి, శ్రీకృష్ణుని సంహరించే కోరికతో, మిడత అగ్నిలోకి వలె, ఆయనకు అభిముఖముగా పరుగెత్తెను.

తస్య చాపతతః ఖడ్గం తిలశశ్చర్మ చేషుభిః

 ఛిత్త్వాఽసిమాదదే తిగ్మం రుక్మిణం హంతుముద్యతః  

శ్రీకృష్ణుడు మీదకు దుముకుచున్న ఆ రుక్మియొక్క కత్తిని, డాలును బాణమలతో నుగ్గు నుగ్గుగా విరుగకొట్టెను. ఆయన వానిని సంహరించుటకు సంసిద్దుడై పదునైన కత్తిని చేతిలోనికి తీసుకొనెను.

దృష్ట్వా భ్రాతృవధోద్యోగం రుక్మిణీ భయవిహ్వలా

 పతిత్వా పాదయోర్భర్తురువాచ కరుణం సతీ

            భర్త తన అన్నను సంహరించుటకు సిద్దపడుటను చూచి పతివ్రతయగు రుక్మిణి భయముతో కంగారు పడెను. ఆమె భర్త పాదములపై పడి దీనముగా ఇట్లు పలికెను.

యోగేశ్వరాప్రమేయాత్మన్ దేవదేవ జగత్పతే

 హంతుం నార్హసి కల్యాణ భ్రాతరం మే మహాభుజ

            ఓ మంగళస్వరూపా! యోగులకు ప్రభుడవగు నీ స్వరూపమును తెలియుట అసంభవము. దేవతలకు ప్రభుడవగు నీవు జగత్తును పాలించే దవు. నీ భుజబలము గొప్పది. నీవు నా అన్నను సంహరించుట తగదు.

శ్రీశుక ఉవాచ

 తయా పరిత్రాసవికంపీతాంగయా శుచాఽవశుష్యన్ముఖరుద్ధకంఠయా

కాతర్యవిస్రంసిత హేమమాలయా గృహీతపాదః కరుణో న్యవర్తత

శ్రీ శుక మహర్షి ఇట్లు పలి కెను --- ఆ రుక్మిణి అవయవములు భయము వలన విశేషముగా కంపించెను. దుఃఖముచే ఆమె ముఖములో రక్తము లేకుండెను. ఆమే కంఠము గద్గదమాయెను. ఆదుర్గాచే బంగరు మాల. జారిపోవుచుండగా ఆమె ఆయన పాదములను పట్టుకొనెను. దయాళువగు శ్రీకృష్ణుడు రుక్మియొక్క వధ నుండి విరమించెను.

చైలేన బద్ధ్వా తమసాధుకారిణం స శ్మశ్రు కేశం ప్రవపన్వ్యరూపయత్,

తావన్మమర్ధుః పరసైన్యమద్భుతం యదుప్రవీరా నలినీం యథా గజాః.

ఆ శ్రీకృష్ణుడు అపరాధియగు రుక్మిని వస్త్రముతో కట్టివేసి మీసమును గెడ్డమును గొరిగి వికృతరూపునిగా చేసెను. అంతలో యాదవవీరులు శత్రువుల సైన్యమును, ఏనుగులు సరస్సును వలే, ఆశ్చర్యము కలిగే వీధముగా కలిచి వేసిరి.

కృష్ణాంతికముపప్రజ్య దదృశుస్తత్ర రుక్మిణమ్

 తథాభూతం హతప్రాయం దృష్ట్వా సంకర్షణో విభుః

 విముచ్య బద్ధం కరుణో భగవాన్ కృష్ణమబ్రవీత్

 వారందరు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి బంధించబడిన రుక్మిని చూచిరి. ఆతడు ఆ విధముగా వికృతరూపుడై చచ్చినవానితో సమానముగా నుండెను. సర్వసమర్థుడు, దయాళువు అగు బలరామ భగవానుడు వానిని విడిపించి, శ్రీకృష్ణునితో నిట్లనెను.

అసాధ్విదం త్వయా కృష్ణ కృతమస్మజ్జుగుప్సితమ్

వపనం శ్మశ్రు కేశానాం వైరూప్యం సుహృదో వధః

            ఓ శ్రీకృష్ణా! నీవు చేసిన ఈ పని మంచిది కాదు. ఇది మనము ఏవగించుకునే పని. బంధువును గెడ్డమును, మీసమును గొరిగి, విరూపునిగా చేయుట ఒక విధముగా వానిని చంపుటయే.

మైవాస్మాన్ సాధ్యసూయేథా భ్రాతుర్వైరూప్యచింతయా

సుఖదుఃఖదో న చాన్యోఽస్తి యతస్స్వకృతభుక్ పుమాన్

 ఓ సాధ్వీ! రుక్మిణీ! నీ సోదరుని విరూపుని చేసినారని మాయందు తప్పును ఎన్నకుము.మనిషికి సుఖదుఃఖములను మరియొకడు ఈయడు. ఎందుకంటే, జీవుడు తన కర్మల ఫలమునే అనుభవించును.

బంధుర్వధార్హదోషోఽపి న బంధోర్వధమర్హతి

త్యాజ్య స్స్వే నైవ దోషేణ హతః కిం హన్యతే పునః

            బంధువు వధించదగిన తప్పే చేసినా, బంధువు బంధువును సంహరించరాదు. బంధువును విడిచి పెట్టవలెను. ఎందుకంటే, వాడు తన తప్పు చేతనే చంపబడినాడు. వానిని మరల వధించవలెనా? (కూడదు).

క్షత్రియాణామయం ధర్మః ప్రజాపతివినిర్మితః

భ్రాతాఽపి భ్రాతరం హన్యాద్యేన ఘోరతరస్తతః

 క్షత్రియులకీ ధర్మమును ప్రజాపతి ఏర్పాటు చేసినాడు. దాని ప్రకారముగా సోదరుని సోదరుడే సంహరించవచ్చును. కాబట్టి ఈ క్షత్రియధర్మము మిక్కిలి ఘోరమైనది.

రాజ్యస్య భూమేర్విత్తస్య స్త్రీయో మానస్య తేజసః

 మానినోఽన్యస్య వా హేతోశ్శ్రీమదాంధాః క్షిపంతి హి

            దురభిమానులు ధనగర్వముచే వివేకజ్ఞానమును కోల్పోయి రాజ్యము, భూమి, ధనము, స్త్రీ, అభిమానము, అవమానమును సహించకుండుట ఇత్యాది కారణములతో (బంధువునైననూ) తిరస్కారము చేసెదరు. ఇది నిశ్చయము.

తవేయం విషమా బుద్ధిస్సర్వభూతేషు దుర్హ్రదామ్

యన్మన్య సే సదా భద్రం సుహృదాం భద్రమజ్ఞవత్

 ఓ రుక్మిణీ! నీ సోదరులు సకలప్రాణులయందు దుర్బుద్ధిని కలిగియున్నారు. కాని నీవు అజ్ఞాని వలె వారికి ఎల్లవేళలా మంగళమే. కలగాలని తలపోయుచున్నావు. ఈ నీ తలంపు సరైనది కాదు. బంధువుల కైనా చేసిన తప్పుకి శిక్షను వేయుటయే మంగళము.

ఆత్మమోహో నృణామేష కల్ప్యతే దేవమాయయా

 సుహృద్దుర్హృదుదాసీన ఇతి దేహాత్మమానినామ్

దేహమే ఆత్మ అని తలపోసే జనులకు విష్ణుమాయ మిత్ర-శత్రు-ఉదాసీనులు అనే ఈ బుద్దిమోహమును కలిగించుచున్నది.

ఏక ఏవ పరో హ్యాత్మా సర్వేషామపి దేహినామ్

నానేవ గృహ్యతే మూఢైర్యథా జ్యోతిర్యథా నభః

ఎందుకంటే, సకలప్రాణులకు కూడ ఆత్మ, ప్రకాశించే సూర్యాదులు వలె, ఆకాశము వలే, ఒక్కటియే. అది ప్రకృతికి అతీతము. అజ్ఞానులు ఆత్మలు అనేకమా అన్నట్లు తలపోయుదురు.

దేహ ఆద్యంతవానేష ద్రవ్యప్రాణగుణాత్మకః

 ఆత్మన్యవిద్యయా క్లుప్తస్సంసారయతి దేహినమ్  

పంచభూతములు, పంచప్రాణములు, పంచతన్మాత్రలు, మూడు గుణముల సమాహారమైన ఈ దేహము పుట్టుక, మరణము గలది. అజ్ఞానముచే ఈ దేహము ఆత్మయందు ఆరోపించబడి (ఆత్మగా గ్రహించబడి) దేహధారిని సంసారిని చేయుచున్నది.

నాత్మనోఽన్యేన సంయోగో వియోగశ్చాసతస్పతి

 తద్ధేతుత్వాత్తత్ప్రసిద్దేర్దృగ్రూపాభ్యాం యథా రవేః

ఓ సాధ్వీ! చూపు-రూపముల ఉనికి, ప్రసిద్ది (తెలియుట) సూర్యుని వలననే. అయిననూ, సూర్యుడు వాటికంటే విలక్షణుడే. అదే విధముగా, దేహముయొక్క ఉనికి, ప్రకాశము ఆత్మమూలకములే. కాని, ఆత్మ దేహముకంటే విలక్షణము. ఆత్మకు మిథ్యాభూతములైన దేహాదులతో యథార్థ మైన సంయోగము గాని, వియోగము గాని లేవు.

జన్మాదయస్తు దేహస్య విక్రియా సాత్మనః క్వచిత్

 కలానామివ నైవేందోర్మృతిర్హ్యస్య కుహూరివ

వృద్ధిక్షయములు కళలకే గాని చంద్రునకు లేవు. అదే విధముగా, పుట్టుక, ఉండుట, పెరుగుట, పరిణామమును చెందుట, క్షీణించుట, నశించుట అనే వికారములైతే దేహమున కే గాని, ఆత్మకు ఏనాడైననూ లేవు. కళల అంతము చంద్రునకే అమాపొస్యయా యన్నట్లు వ్యవహా రము. అదే విధముగా దేహము యొక్క మృతి ఆత్మ పై ఆరోపించబడును.

యథా శయాన ఆత్మానం విషయాన్ ఫలమేవ చ

 అనుభుంక్తేఽప్యసత్యర్థే తథాఽఽప్నోత్యబుదో భవమ్

నిద్రించే వ్యక్తి స్వప్నములో యథార్థమగు వస్తువులు లేకున్నా దేహమును, భోగ్యములను, వాటి భోగమును కూడ అనుభవించును. అదే విధముగా, అజ్ఞాని కూడ సంసారముననుభవించును.

తస్మాదజ్ఞానజం శోకమాత్మశోషవిమోహనమ్

 తత్త్వజ్ఞానేన నిర్హృత్య స్వస్థా భవ శుచిస్మితే  

స్వచ్చమగు చిరునగవు గల ఓ రుక్మిణీ! శోకము అజ్ఞానమునుండి పుట్టి అంతఃకరణమును కృశింపజేసి మోహ పెట్టును. కాబట్టి నీవు ఆత్మతత్త్వము నెరింగి ఆ శోకమును పారద్రోలి శాంతమగు చిత్తమును కలిగియుండుము.

శ్రీశుక ఉవాచ

 ఏవం భగవతా తన్వీ రామేణ ప్రతిబోధితా

 వైమనస్యం పరిత్యజ్య మనో బుద్ధ్యా సమాదధే

            శ్రీ శుక మహర్షి ఇట్లు పలి కెను --- బలరామ భగవానుడిట్లు ఉపదేశించగా, సుందరియగు రుక్మిణి శోకమును విడిచి వివేకబుద్దితో మనస్సును ప్రసన్నము చేసుకొనెను.

ప్రాణావశేష ఉత్సృష్టో ద్విడ్భిర్హతబలప్రభః

స్మరన్ విరూపకరణం వితథాత్మమనోరథః  

శత్రువులు రుక్మియొక్క బలమును, కాంతిని విధ్వస్తము చేసి ప్రాణములను మాత్రమే మిగిల్చి విడిచి పెట్టినారు. ఆతడు తాను వికృతరూపునిగా చేయబడిన విషయమును గుర్తు చేసుకొనుచుండెను. ఆతని మనోరథములు వ్యర్థమాయెను.

చక్రే భోజకటం నామ నివాసాయ మహత్పురమ్

 అహత్వా దుర్మతిం కృష్ణ మప్రత్యూహ్య యవీయసీమ్

కుండినం న ప్రవేక్ష్యామీత్యు క్త్వా తత్రావసద్రుషా

                        ఆతడు భోజకటము (భోజుని శపథము) అని ప్రసిద్ధి గాంచిన పెద్ద నగరమును నివాసముకొరకు నిర్మించుకొనెను. శ్రీకృష్ణుని సంహరించకుండా, చెల్లెలిని వెనుకకు తీసుకురాకుండా కుండిననగరమును ప్రవేశించను, అని చెప్పి ఆతడు రోషముతో అక్కడనే నివసించెను.

భగవాన్ భీష్మకసుతామేవం నిర్జిత్య భూమిపాన్

పురమానీయ విధివదుపయేమే కురూద్వహ

కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ భగవానుడీ విధముగా రాజులను జయించి, భీష్మకుని పుత్రియగు రుక్మిణీని ద్వారకా నగరమునకు తీసుకువచ్చి, యథావిధిగా వివాహమాడెను.

తదా మహోత్సవో నౄణాం యదుపుర్యాం గృహే గృహే

 అభూదనన్యభావానాం కృష్ణే యదుపతౌ నృప

ఓ పరీక్షిన్మహారాజా! యాదవుల నగరియగు ద్వారకయందు ప్రతి ఇంట్లో జనులకు శ్రీకృష్ణునిపై నిష్కపటమగు ప్రేమ. అప్పుడు వారందరు పెద్ద ఉత్సవమును చేసుకొనిరి.

నరా నార్యశ్చ ముదితాః ప్రమృష్ణమణికుండలాః పారిబర్హముపాజహ్రుర్వరయోశ్చిత్రవాససోః

 స్వచ్చమగు మణులు పొదిగిన కుండలములను దాల్చిన స్త్రీలు, పురుషులు కూడ ఆనందముతో ఆ కొత్త దంపతులకు బహుమతులనిచ్చిరి. ఆ దంపతులు రంగు రంగుల వస్త్రములను ధరించిరి.

సా వృష్టి పుర్యుత్తభితేంద్ర కేతుభిర్విచిత్రమాల్యాంబరరత్నతోరణైః

బభౌ ప్రతీద్వార్యుపక్లుప్తమంగలైరాపూర్ణకుంభాగురుధూపదీప కైః

 యాదవుల నగరమగు ఆ ద్వారక బాగా ఎత్తున ఎగురవేయబడిన పంచవన్నెల జెండాలతో, రంగు రంగుల పుష్పమాలలతో, వస్త్రములతో, రత్నాల తోరణాలతో ప్రకాశించెను. అచట ప్రతి ద్వారమునందు మంగళద్రవ్యముల కడవలు పూర్తిగా నీరు నింపి ఏర్పాటు చేయబడినవి. వాటి చుట్టూ అగురు ధూపములు, దీపములు పెట్టబడినవి.

సిక్తమార్గా మదచ్యుద్బిరాహూతప్రేష్ఠ భూభుజామ్

 గజైర్ద్వాస్సు పరామృష్టరంభాపూగోపశోభితా

ద్వారకలోని మార్గములలో నీటిని చల్లిరి. ఆహ్వానమునందుకొని విచ్చేసిన రాజుల ఏనుగులు మదమును స్రవిస్తూ, ద్వారములయందు అలంకరించబడిన అరటి, పోక చెట్లను స్పృశించుచుండెను.

కురుసృంజయకైకేయవిదర్భయదుకుంతయః

 మిథో ముముదిరే తస్మిన్ సంభ్రమాత్పరిధావతామ్

ఆ నగరమునందు కురుసృంజయ కైకేయవిదర్భయదుకుంతివంశముల వారు ఇటునటు కంగారుగా తిరుగుతూ పరస్పరము కలిసి ఆనందించిరి. .

రుక్మిణ్యా హరణం శ్రుత్వా గీయమానం తతస్తతః

 రాజానో రాజకన్యాశ్చ బభూవుర్భృశవిస్మీతాః

 రుక్మిణిని శ్రీకృష్ణుడు తీసుకొని వెళ్లినాడని జనులు అక్కడక్కడ కీర్తించుచుండగా విని రాజులు, రాజకన్యలు కూడ చాల ఆశ్చర్యపడిరి.

ద్వారకాయామభూద్రాజన్మహాఽఽమోదః పురౌకసామ్

రుక్మిణ్యా రమయో పేతం దృష్ట్వా కృష్ణం శ్రియః పతిమ్

 ఇతి శ్రీమద్బాగవతపురాణే దశమస్కంధే చతుఃపంచాశత్త మోఽధ్యాయః

ఓ పరీక్షిన్మహారాజా! లక్ష్మీపతి శ్రీకృష్ణుడు కాగా, లక్ష్మియే రుక్మిణి ఆయేను. ద్వారకయందు వారిద్దరి కలయికను చూచి నగరవాసులు మహానందమును పొందిరి. శ్రీమద్భాగవత దశమస్కంధము ఏబది నాల్గవ అధ్యాయము ముగిసినది.