77 - శాల్వుని ఉద్ధారము

శ్రీశుక ఉవాచ

స తూపస్పృశ్య సలిలం దంశీతో ధృతకార్ముకః

నయ మాం ద్యుమతః పార్శ్వం వీర స్యేత్యాహ సారథిమ్

శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ఆ ప్రద్యుమ్నుడైతే నీటిని త్రాగి కవచము వేసుకొని ధనుస్సు పట్టుకొని సారథితో నిట్లనెను -- నన్ను వీరుడగు ద్యుమంతుని సమీపమునకు తీసుకుపొమ్ము.

విధమంతం స్వసైన్యాని ద్యుమంతం రుక్మిణీసుతః

ప్రతిహృత్య ప్రత్యవిధ్యన్నారాచైరష్ఠభిస్మయన్

రుక్మిణి పుత్రుడగు ప్రద్యుమ్నుడు తన సైన్యములను చెదరగొట్టుచున్న ద్యుమంతుని అడ్డుకొని, చిరునవ్వుతో ఎనిమిది బాణములను వేసి కొట్టెను.

చతుర్భిశ్చతురో వాహాన్ సూతమే కేన చాహనత్

ద్వాభ్యాం ధనుశ్చ కేతుం చ శ రేణాన్యేన వై శిరః

ఆయన నాలుగు బాణములతో నాలుగు గుర్రములను, ఒక్కొక్క బాణముతో సారథిని, ధనుస్సును, ధ్వజమును కూడ కొట్టి, మరియొక బాణముతో తలను ఊడగొట్టెను. (వెరసి యెనిమిది).

గదసాత్యకిసాంబాద్యా జఘ్నుస్సౌభపతేర్బలమ్

పేతుస్సముద్ర సౌభేయాస్సర్వే సంఛన్నకంధరాః

గదుడు, సాత్యకి, సాంబుడు, చారుదేష్ణుడు మొదలైనవారు సౌభవిమానప్రభుడగు శాల్వుని సైన్యమును మట్టుబెట్టిరి. సౌభమునందలివారు మెడలు తెగి సముద్రమునందు పడిరి.

ఏవం యదూనాం శాల్వానాం నిఘ్నతామీతరేతరమ్

యుద్ధం ప్రాణవరాత్రం తదభూత్తుములముల్బణమ్

ఈ విధముగా పరస్పరము సంహరించుకొనుచున్న యాదవులకు, శాల్వపక్షీయులకు ఆ భయంకరమైన దొమ్మి యుద్ధము ఇరవై ఏడు రోజులు జరిగెను.

ఇంద్రప్రస్థం గతః కృష్ణ ఆహూతో ధర్మసూనునా

రాజసూయేఽథ నిర్వృత్తే శిశుపాలే చ సంస్థితే

కురువృద్దాననుజ్ఞాప్య మునీంశ్చ ససుతాం పృథామ్

నిమిత్తాన్యతి ఘోరాణి పశ్యన్ ద్వారవతీం యయౌ

ధర్మరాజు ఆహ్వానమునందుకొని శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థమునకు వెళ్లాను. అచట రాజసూయము జరిగెను. దానిలో శిశుపాలుడు వధించబడెను. తరువాత ఆయన కురువంశములోని పెద్దలు, మహర్షులు, పాండవులు, కుంతల వద్ద సెలవు తీసుకొని ద్వారకకు వెళ్లాను. ఆపుడాయనకు ఘోరములైన శకునములు కనబడెను.

ఆహ చాహమిహాయాత ఆర్యమిశ్రాభీసంగతః

రాజన్యాశ్చైద్యపక్షీయా నూనం హన్యుః పురీం మమ

ఆయన తనలో ఇట్లు - తలపోసెను నేను పూజనీయులగు అన్నగారితో కూడి ఈ హస్తినాపురమునకు వచ్చితిని. చేదిరాజగు శిశుపాలుని పక్షమునకు చెందినవారు నిశ్చయముగా నా ద్వారకకు నష్టము కలిగించియుందురు.

వీక్ష్య తత్కదనం స్వానాం నిరూప్య పురరక్షణమ్

సౌభం చ శాల్వరాజం చ దారుకం ప్రాహ కేశవః

శ్రీకృష్ణ భగవానుడు తన వారు చేయుచున్న ఆ యుద్దమును, సౌభవిమానమును, శాల్వరాజును చూచెను. ఆయన బలరాముని నగరరక్షణకు నియోగించి, సారథియగు దారుకునితో నిట్లనెను.

రథం ప్రాపయ మే సూత శాల్వస్యాంతికమాశు వై

సంభ్రమస్తే న కర్తవ్యో మాయావీ సౌభరాడయమ్

ఓ సారథీ! నా రథమును శీఘ్రమే నిశ్చయముగా శాల్వుని వద్దకు నడుపుము. నీవు భయపడవద్దు. సౌభవిమానాధిపతియగు ఈ శాల్వుడు మాయావి.

ఇత్యుక్తశ్చోదయామాస రథమార్థాయ దారుకః

విశంతం దదృశుస్సర్వే స్వే పరే చారుణానుజమ్

ఆయన ఇట్లు పలుకగా, దారుకుడు రథమునెక్కి యుద్ధభూమిలోనికి నడి పెను. ధ్వజము పైనుండే అరుణుని సోదరుడగు గరుడుని చూచి శ్రీకృష్ణ పక్షీయులు, శాల్వపక్షీయులు అందరు శ్రీకృష్ణుని గుర్తించిరి.

శాల్వశ్చ కృష్ణమాలోక్య హతప్రాయబలేశ్వరః

పాహరత్కృష్ణసూతాయ శక్తిం భీమరవాం మృధే

శాల్వుని సైన్యము ఇంచుమించు నష్ట మైనది. ఆతడు కూడ యుద్ధములో శ్రీకృష్ణుని చూచేను. ఆతడు శ్రీకృష్ణుని సారథిపై భయమును గొల్పే శబ్దమును చేయుచున్న బల్లెమును విసి రెను.

తామాపతంతీం నభసి మహోల్కామివ రంహసా

భాసయంతీం దిశశ్శౌరిస్సాయకైశ్శతధాఽచ్ఛినత్

ఆకాశమునందు పెద్ద ఉలవలె దిక్కులను ప్రకాశింపజేస్తూ మీద వచ్చి పడుచున్న ఆ బల్లెమును కృష్ణుడు బాణములతో వంద ముక్కలు చేసెను.

తం చ షోడశభిర్విద్ధ్వా బాణైస్సాభం చ ఖే భ్రమత్

అవిధ్యచ్ఛరసందోహైః ఖం సూర్య ఇవ రశ్మిభిః

ఆయన ఆ శాల్వుని కూడ పదహారు బాణములతో కొట్టెను. సూర్యుడు ఆకాశమును కిరణములతో నింపునట్లుగా ఆయన బాణముల గుంపులతో ఆకాశములో తిరుగుచున్న సౌభవిమానమును కొట్టెను.

శాల్వశ్శౌరేస్తు దోస్సవ్యం సశార్జం శార్ఙధన్వనః

బిభేద న్యపతద్ధస్తోచ్ఛార్జ్గమాసీత్తదద్భుతమ్

శాల్వుడైతే శార్ఙమనే ధనుస్సు గల శ్రీకృష్ణుని ధనుస్సుతో కూడిన ఎడమ చేతిని బాణముతో కొట్టగా, ధనుస్సు చేతినుండి క్రింద పడెను. ఆ ఘటన ఆశ్చర్యమును కలిగించెను.

హాహాకారో మహానాసీద్భూతానాం తత్ర పశ్యతామ్

వినద్య సౌభరాడుచ్చేరిదమాహ జనార్ధనమ్

అచట యుద్ధమును తిలకించుచున్న ప్రాణులు పెద్ద హాహాకారమును చేసిరి. సౌభవిమానమునకు ప్రభుడగు శాల్వుడు బిగ్గరగా సింహనాదమును చేసి, దుష్టజనశిక్షకుడగు శ్రీకృష్ణునితో నిట్లనెను.

యత్త్వయా మూఢ నస్సఖ్యుర్భ్రాతుర్భార్యా హృతేక్షతామ్

ప్రమత్తస్స సభామధ్యే త్వయా వ్యాపాదితస్సఖా

ఓ మూర్ఖ! రుక్మిణి మా మిత్రుడు, అన్న అగు శిశుపాలునకు భార్య కావలసియుండగా, నీవామేను మేము చూచుచుండగనే లెక్క చేయకుండా అపహరించితివి. పైగా, ఆ మా మిత్రుడు యుద్ధమునకు సంసిద్ధుడై లేని సమయములో, సభ మధ్యలో నీవాతనిని సంహరించితివి. అందువలన ---

తం త్వాఽద్య నిశితైర్భాణైరపరాజితమానినమ్

నయామ్యపునరావృత్తం యది తిష్టేర్మమాగ్రతః

నాకు పరాజయము లేదని గర్వించే అట్టి (మిత్రహాంతకుడవైన) నిన్ను ఇప్పుడు -- నీవు నా యెదుట నిలబడే పక్షములో -- వాడి బాణములతో తిరిగి రాని స్థానము (మృత్యువు) నకు పంపెదను.

శ్రీభగవానువాచ

వృథా త్వం కత్థసే మంద న పశ్యస్యంతి కేఽకంతకమ్

పౌరుషం దర్శయంతి స్మ శూరా న బహుభాషిణః  

ఓ మూడా! నీవు వ్యర్థముగా వదరుచున్నావు. దగ్గరలోనున్న మృత్యువును చూడకున్నావు. శూరులు పురుషకారమును చూ పేద రే గాని, అధికప్రసంగమును చేయరు.

ఇత్యు క్త్వా భగవాఞ్చాల్వం గదయా భీమవేగయా

తతాడ జత్రౌ సంరబ్ధస్స చకం పే వమన్నసృక్

శ్రీకృష్ణ భగవానుడు కోపముతో నిట్లు పలికి భయంకరమగు వేగము గల గదతో శాల్వుని కొంకులపై కొట్టగా, ఆతడు రక్తమును క్రక్కుకుంటూ వణికిపోయెను.

గదాయాం సన్నివృత్తాయాం శాల్వస్త్వంతరధీయత

తతో ముహూర్త ఆగత్య పురుషశ్శిరసాఽచ్యుతమ్

దేవక్యా ప్రహిత్వోఽస్మీతి నత్వా ప్రాహ వచో రుదన్

గద తిరిగి శ్రీకృష్ణుని వద్దకు రాగా, శాల్వుడైతే అంతర్ధానమాయెను. తరువాత రెండు ఘడియల సమయము గడిచేను. అంతలో ఒక వ్యక్తి వచ్చి శ్రీకృష్ణ భగవానునకు తల వంచి నమస్కరించి ఏడుస్తూ ఇట్లు పలికెను -- నన్ను దేవకీ దేవి పంపినది.

కృష్ణ కృష్ణ మహాబాహో పీతా తే పితృవత్సల

బద్ధ్వాఽ పనీతశ్శాల్వేన సౌని కేన యథా పశుః

ఓ శ్రీకృష్ణా! శ్రీకృష్ణా! నీవు గొప్ప భుజశక్తి, తండ్రియందు అధికమగు ప్రేమ గలవాడవు. శాల్వుడు నీ తండ్రిని కట్టి, కసాయి పశువును వలె, లాగుకొని వెళ్లినాడు.

నిశమ్య విప్రియం కృష్ణో మానుషీం ప్రకృతిం గతః

విమనస్కో ఘృణీ స్నేహాద్బభాషే ప్రాకృతో యథా

ఆ అప్రియవార్తను విని శ్రీకృష్ణుడు ప్రేమ కారణముగా మానవుల స్వభావమును పొందెను. వసుదేవునిపై దయచే ఆయన మనస్సు చెడిపోయేను. ఆయన ప్రాకృతమానవుడు వోలే ఇట్లు పలి కెను.

కథం రామమసంభ్రాంతం జిత్వాఽజేయం సురాసురైః

శాల్వేనాల్పీయసా నీతః పితా మే బలవాన్ విధిః  

బలరాముడు అజాగ్రత్తనేరుగడు. ఆయనను దేవతలు, రాక్షసులు కూడ జయించలేరు. మిక్కిలి అల్పుడగు శాల్వుడు ఆయనను ఎట్లు జయించి నా తండ్రిని చెరబట్టినాడు? విధి బలీయము.

ఇతి బ్రువాణే గోవిందే సౌభరాట్ ప్రత్యుపస్థితః

వసుదేవమివానీయ కృష్ణం చేదమువాచ సః

శ్రీకృష్ణుడీ విధముగా పలుకుచుండగనే సౌభవిమానమునకు ప్రభుడగు శాల్వుడు ఆవిర్భవించెను. ఆతడు వసుదేవుని పోలినవానిని తీసుకువచ్చి శ్రీకృష్ణునితో నిట్లు పలికెను.

ఏష తే జనితా తాతో యధర్థమిహ జీవసి

వధి ష్యే వీక్షత స్తేజముమీశ శ్చత్పాహి బాలిశ

ఓ మూర్ఖా! ఈతడు నీకు జన్మనిచ్చిన తండ్రి. నీవు ఈయన కొరకే ఈ లోకములో జీవించుచున్నావు. నీవు చూచుచుండగనే నేను ఈయనను సంహరించెదను. శక్తి ఉన్నవాడవైనచో, కాపాడుము.

ఏవం నిర్భర్త్స్య మాయావీ ఖడ్గేనానకదుందుభేః

ఉత్కృత్య శిర ఆదాయ ఖస్థం సౌభం సమావిశత్

మాయావియగు శాల్వుడు శ్రీకృష్ణుని ఈ విధముగా నీరసించి, కత్తితో వసుదేవుని తలను నరికి, దానిని తీసుకొని ఆకాశమునందున్న సౌభవిమానమును ప్రవేశించెను.

తతో ముహూర్తం ప్రకృతావుపప్లుతః

స్వబోధ ఆస్తే స్వజనానుషంగతః

మహాఽనుభావస్తదబుద్ధ్యదాసురీం

మాయాం స శాల్వప్రసృతాం మయోదితామ్

శ్రీకృష్ణుడు స్వయంసిద్ధ జ్ఞానస్వరూపుడు. కాని, తనవారియందలి ఆసక్తిచే ఆయన రెండు ఘడియల కాలము ప్రకృతికార్యమగు దేహభావమునందు మునిగి యుండెను. కాని, ఆ మహానుభావుడు అది శాల్వునిచే ప్రసరింపజేయబడిన అసురుల మాయయని గుర్తించెను. ఆ మాయ మయుడు నేర్పినది.

న తత్ర దూతం న పీతుః కలేవరం 

ప్రబుద్ధ ఆజౌ సమపశ్యదచ్యుతః

స్వాప్నం యథా చాంబరచారిణం రిపుం

సౌభస్థమాలోక్య నిహంతుముద్యతః

స్వప్నములో కనబడిన వస్తువులు నిద్ర లేచేక కనబడవు. అదే విధముగా, శ్రీకృష్ణ భగవానుడు తన సహజస్థితిని పొంది చూడగా అక్కడ యుద్ధభూమిలో దేవకీ పంపిన దూత గాని, తండ్రి మొండెము గాని కనబడ లేదు. కాని, ఆకాశములో సంచరిస్తూ సౌభమనే విమానమునందు శత్రువు శాల్వుడు కనబడెను. అపుడాయన వానిని వధించుటకు ఉద్యుక్తుడాయెను.

ఏవం వదంతి రాజర్షే ఋషయః కే చ నాన్వితాః

యత్స్వవాచో విరుధ్యత నూనం తే న స్మరంత్యుత

ఓ పరీక్షిన్మహారాజా! నీవు రాజువే గాక ఋషివి కూడా. పూర్వాపరవిచారము లేని కొందరు మహర్షులు ఈ పైన చెప్పిన విధముగా వర్ణించుచున్నారు. కాని, వారు తమ వచనములలోని విరోధమును గుర్తించలేకున్నారు సుమా! ఇది నిశ్చయము.

క్వ శోకమోహౌ స్నేహోవా భయం వా యేఽజ్ఞసంభవాః

క్వ చాఖండితవిజ్ఞానజ్ఞానైశ్వర్యస్త్వఖండితః

అజ్ఞానులయందు ఉదయించే శోకము, మోహము, ఆసక్తి, భయము ఎక్కడ? ఖండితము కాని జ్ఞానము (శాస్త్రార్థపరిజ్ఞానము), విజ్ఞానము (అనుభవము), ఈశ్వరభావము గల పూర్ఖుడగు శ్రీకృష్ణ భగవానుడెక్కడ?

యత్పాద సేవోర్జితయాఽఽత్మవిద్యయా

హిన్వంతనాద్యాత్మవిపర్యయగ్రహమ్

లభంత ఆత్మీయమనంతమైశ్వరం

కుతో ను మోహః పరమస్య సద్గతేః

శ్రీకృష్ణ భగవానుని పాదముల సేవచే ఆత్మజ్ఞానము వర్ధిల్లి సాధకులు అనాదియైన ఆత్మ-అనాత్మ-అవివేకమనే పిశాచమును పారద్రోలెదరు. వారు ఆ ఈశ్వరుని కాలాతీతమగు ఆత్మనుగా సాక్షాత్కరించుకొనెదరు. సత్పురుషులచే పొందబడే ఆ పరమాత్మకు మోహమెక్కడిది?

తం శస్త్రపూగైః ప్రహరంతమోజసా

శాల్వం శరైశ్శౌరిరమోఘవిక్రమః

విద్ద్వాఽచ్చినద్వర్మ ధనుశ్శిరోమణిం

సౌభం చ శత్రోర్గదయా రురోజ హ

శాల్వుడు ఆయుధముల గుంపులతో బలముగా కొట్టుచుండెను. ఆత నిని మొక్కవోని పరాక్రమము గల శ్రీకృష్ణుడు బాణములతో కొట్టి కవచ మును, ధనుస్సును, తల పైనుండే మణిని కూడ ఛిన్నాభిన్నము చేసెను. ఆయన ఆ శత్రువుయొక్క సౌభవిమానమును గదతో పగులగొట్టెను.

తత్కృష్ణహస్తేరితయా విచూర్ణితం

పపాత తోయే గదయా సహస్రధా

విసృజ్య తద్భూతలమాస్థితో గదాం

ఉద్యమ్య శాల్వోఽచ్యుతమభ్యగాద్ద్రుతమ్

శ్రీకృష్ణుడు తన చేతినుండి ప్రయోగించిన గద ఆ విమానమును వేయి ముక్కలుగా చూర్ణము చేయగా, అది నీటిలో పడిపోయేను. శాల్వుడు దానిని వదిలి పెట్టి నేల పైకి దిగెను. ఆతడు గదను పైకెత్తి వేగముగా శ్రీకృష్ణ భగవానుని పైకి దూసుకు వెళ్లెను.

ఆధావతస్సగదం తస్య బాహుం 

భల్లేన ఛిత్త్వాఽథ రథాంగమద్బుతమ్

వధాయ శాల్వస్య లయార్కసన్నిభం

బిభ్రద్బభౌ సార్క ఇవోదయాచలః

మీదకు దూసుకువచ్చుచున్న ఆ శాల్వుని గదతో కూడిన చేతిని శ్రీకృష్ణుడు బల్లెమువంటి బాణముతో నరి కెను. అపుడాయన వానిని వధించుటకై ప్రళయకాలమునందలి సూర్యుని పోలియున్న చక్రమును చేతిలోనికి తీసుకోనెను. అచ్చెరువును గొలిపే ఆ చక్రముతో ఆయన, సూర్యునితో కూడియున్న ఉదయపర్వతము వలె ప్రకాశించెను.

జహార తేనైవ శిరస్పకుండలం

కిరీటయుక్తం పురుషాయినో హరిః

వజ్రేణ వృత్రస్య యథా పురందరో

బభూవ హా హేతి వచస్తదా నృణామ్

శ్రీకృష్ణ భగవానుడు అదే చక్రముతో, ఇంద్రుడు వజ్రముతో వృత్రా. సురుని తలను వలె, కిరీటకుండలములతో కూడిన మహామాయావియగు శాల్వుని తలను నరికెను. అప్పుడు జనులు హాహాకారములను చేసిరి.

తస్మిన్నిపతితే పాపే సౌభే చ గదయా హతే

నేదుర్దుందుభయో రాజన్ దీవి దేవగణేరితాః

సఖినామపచితిం కుర్వన్ దంతవక్త్రో రుషాఽభ్యగాత్

ఇతి శ్రీమద్భాగవతమహాపురాణే దశమస్కంధే సప్తసప్తతితమోఽధ్యాయః

ఓ పరీక్షిన్మహారాజా! పాపియగు ఆ శాల్వుడు నేలగూలెను. వాని సౌభమనే విమానము కూడ గదచే చూర్ణము చేయబడెను. అంతరిక్షములో దేవగణములు భేరీలను మ్రోగించిరి. మిత్రుల పగను తీర్చుటకై దంతవక్త్రుడు వచ్చెను.

శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్దములో శాల్వుని ఉద్ధారమును వర్ణించే డెబ్బది ఏడవ అధ్యాయము ముగిసినది (77).