78 - దంతవక్త్ర విదూరథుల ఉద్దారము

శ్రీశుక ఉవాచ

శిశుపాలస్య శాల్వస్య పౌండ్రకస్యాపి దుర్మతిః

పరలోకగతానాం చ కుర్వన్ పారోక్ష్యసౌహృదమ్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- దుర్బుద్ధియగు దంతవక్తూడు పరలోకమును పొందిన శిశుపాల శాల్వ పౌండ్రకుల యెడల వారి పరోక్షములో మైత్రిని నెరపుచుండెను.

ఏకః పదాతిస్సంక్రుద్ధో గదాపాణిః ప్రకంపయన్

పద్భ్యామిమాం మహారాజ మహాసత్త్వో వ్యదృశ్యత

ఓ పరీక్షిన్మహారాజా! గొప్ప బలము గల దంతవక్తూడు బాగా కోపించి ఒక్కడే పాదచారియై చేతిలో గదతో (ద్వారకలో) ప్రత్యక్షమయ్యెను. ఆతడు నడుస్తూంటే భూమి కంపించెను.

తం తథాఽఽయాంతమాలోక్య గదామాదాయ సత్వరః

అవప్లుత్య రథాత్కృష్ణ స్సింధుం వేలేవ ప్రత్యధాత్  

ఆ విధముగా వచ్చుచున్న దంతవక్తని శ్రీకృష్ణుడు చూచెను. ఆయన వేగముగా గదను తీసుకొని రథమునుండి క్రిందకు దుమికి, చెలియలి కట్ట సముద్రమును వలె, వానిని నిలువరించెను.

గదాముద్యమ్య కారూషో ముకుందం ప్రాహ దుర్మదః

దిష్ట్యా దిష్ట్యా భవానద్య మమ దృష్టిపథం గతః   

మిక్కిలి గర్వించియున్న కరూషదేశాధిపతియగు దంతవక్తుడు గదను పైకెత్తి శ్రీకృష్ణ భగవానునితో నిట్లెనెను --- మహానందము! ఈ నాటికి నీవు నా కంట బడితివి.

త్వం మాతులేయో నః కృష్ణ మిత్రధ్రుజ్మాం జిఘాంససి

అతస్త్వాం గదయా మంద హని ష్యే వజ్రకల్పయా

ఓ కృష్ణా! నీవు మాకు మేనమామ కొడుకువి. కాని, నీవు నా మిత్రులకు ద్రోహము చేసి, నన్ను చంప గోరుచున్నావు. ఓ మూర్ఖ! కావుననే, నేను వజ్రమును పోలిన గదతో నిన్ను సంహరించగలను.

తర్హ్యానృణ్యము పైమ్యజ్ఞ మిత్రాణాం మిత్రవత్సలః

బంధురూపమరిం హత్వా వ్యాధిం దేహచరం యథా

ఓ అజ్ఞానీ! దేహమునందు సంచరించే వ్యాధి వలె, నీవు బంధు రూపములో నున్న శత్రువు. మిత్రులయందు నాకు ప్రీతి మెండు. నేను నిన్ను సంహరించి, ఆ విధముగా మిత్రుల ఋణమును తీర్చుకొనెదను.

ఏవం రూక్షైస్తుదన్ వాక్యైః కృష్ణం తోత్త్రైరివ ద్వీపమ్

గదయాఽతాడయన్మూర్ద్ని సింహవద్వ్యనదచ్చ సః

ఆతడీ విధముగా శ్రీకృష్ణుని పరుషవచనములతో, అంకుశము మొదలగువాటితో ఏనుగును వలె, బాధ పెడుతూ తల పై. గదతో కొట్టి సింహము వలె నాదమును కూడ, చేసెను.

గదయ్యాఽభిహతోఽప్యాజౌ న చచాల యదూద్వహః

కృష్ణోఽపి తమహన్ గుర్వ్యా కౌమోదక్యా స్తనాంతరే  

యదువంశ శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుడు యుద్ధములో గదచే కొట్టబడిననూ చలించకుండా, బరువైన కౌమోదకీ గదతో వానిని వక్షఃస్థలము పై కొట్టెను.

గదానిర్భిన్నహృదయ ఉద్వమన్ రుధిరం ముఖాత్

ప్రసార్య కేశబాహ్వంఘ్రీన్ ధరణ్యాం న్యపతద్వ్యసుః

దంతవక్తుని హృదయము గద దెబ్బకు పగిలి ఆతడు నోటిగుండా రక్తమును గ్రక్కుతూ జుట్టు విరబోసుకొని, చేతులను కాళ్లను చాచి నేల పై పడి మరణించెను.

తతసూక్ష్మతరం జ్యోతిః కృష్ణమాశదద్బుతమ్

పశ్యతాం సర్వభూతానాం యథా చైద్యవధే నృప

ఓ పరీక్షిన్మహారాజా! తరువాత మిక్కిలి సూక్ష్మమైన అద్భుతతేజస్సు, చేదిరాజగు శిశుపాలుని వధ సందర్భములో వలెనే, సకలప్రాణులు చూచుచుండగా శ్రీకృష్ణునియందు ప్రవేశించెను.

విదూరథస్తు తద్భ్రాతా భ్రాతృశోకపరిప్లుతః

ఆగచ్ఛదసిచర్మభ్యాముచ్ఛ్వసంస్తజ్జిఘాంసయా

వాని సోదరుడు విదూరథుడు. ఆతడు తన సోదరుని వధచే శోకసముద్రములో మునిగిపోయెను. ఆతడు కత్తి డాలు పట్టుకొని నిట్టూర్పులు విడుస్తూ శ్రీకృష్ణుని వధించాలనే కోరికతో వచ్చెను.

తస్య చాపతతః కృష్ణశ్చక్రేణ క్షుర నేమినా

శిరో జహార రాజేంద్ర సకిరీటం సకుండలమ్

ఓ పరీక్షిన్మహారాజా! ఆ విదూరథుడు కుండలములను, కిరీటమును దాల్చి శ్రీకృష్ణుని మీదకు వచ్చుచుండగా, ఆయన పదునైన ధారగల చక్రముతో వాని తలను కూడ నరికివే సెను.

ఏవం సౌభం చ శాల్వం చ దంతవక్త్రం సహానుజమ్

హత్వా దుర్విషహానన్యైరీడితస్సురమానవైః

సౌభవిమానముతో కూడిన శాల్వుడు, దంతవక్తడు, వాని సోదరుడగు విదూరథుడు అను వీరిని ఇతరులు సుతరాము సహించలేరు. వీరిని సంహరించి శ్రీకృష్ణుడు దేవతల, మానవుల ప్రశంసలనందుకొనెను.

మునిభిస్సిద్ధగంధర్వైర్వద్యాధరమహోరగైః

అప్సరోభిః పితృగణైర్యక్షైః కిన్నరచారణైః

ఉపగీయమానవిజయః కుసుమైరభివర్షితః

వృతశ్చ వృష్ణివరైర్వివేశాలంకృతాం పురీమ్

మహర్షులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మహానాగులు, అప్స రసలు, పితృదేవతల గణములు, యక్షులు, కిన్నరులు, చారణులు శ్రీకృ ష్ణుని విజయమును కీర్తించి పూలను వర్షించిరి. యాదవశ్రేష్ఠులు చుట్టువారి రాగా ఆయన అలంకరించబడిన ద్వారకానగరమును ప్రవేశించెను.

ఏవం యోగేశ్వరః కృష్ణో భగవాన్ జగదీశ్వరః

ఈయతే పశుదృషీనాం నిర్జితో జయతీతి సః

శ్రీకృష్ణ భగవానుడు యోగులకు ప్రభువు, జగత్తునకు శాసకుడు. పశువుల వంటి అజ్ఞానుల దృష్టిలో ఆయన జయించబడినాడని కనబడును. కాని, ఆయన సర్వోత్కృష్టుడుగనే యున్నాడు.

శ్రుత్వా యుద్ధోద్యమం రామః కురూణాం సహ పాండవైః

తీర్థాభిషేకవ్యాజేన మధ్యస్థః ప్రయయౌ కిల

కౌరవపాండవుల యుద్ధసన్నాహమును గురించి విని బలరాముడు ఉదాసీనుడుగా నుండెను. ఆయన పుణ్యనదులయందు స్నానమనే మిషతో పయనమయ్యెను.

స్నాత్వా ప్రభాసే సంతర్ప్య దేవర్షిపితృమానవాన్

సరస్వతీం ప్రతిసోతం యయౌ బ్రాహ్మణసంవృతః

బలరాముడు బ్రాహ్మణులతో కూడి ప్రభాస క్షేత్రములో స్నానము చేసి, దేవతలకు పితృదేవతలకు మహర్షులకు తర్పణములనిచ్చి, జనులకు భోజనాదులచే తృప్తిని కలిగించెను. తరువాత ఆయన ప్రవాహమునకు అభిముఖముగా సరస్వతీనది ఉధమస్థానమునకు వెళ్లెను.

పృథూదకం బిందుపరస్త్రీతకూపం సుదర్శనమ్

విశాలం బ్రహ్మతీర్థం చ చక్రం ప్రాచీం సరస్వతీమ్

ఆయన పృథూదకము, బిందుసరస్సు, త్రితకూపము, సుదర్శనతీర్థము, విశాలతీర్థము, బ్రహ్మతీర్థము, చక్రతీర్థము, తూర్పుగా ప్రవహించే సరస్వతీనది అనే తీర్థములను సందర్శించెను.

యమునామను యాన్యేవ గంగామను చ భారత

జగామ నైమిషం యత్ర ఋషయస్సత్రమాసతే

భరతవంశీయుడవగు పరీక్షిన్మహారాజా! యమునాగంగానదుల తీరము నందలి క్షేత్రములను, నైమిష క్షేత్రమును కూడ బలరాముడు దర్శించెను. నైమిషములో అప్పుడు మహర్షులు సత్రయాగమును చేయుచుండిరి.

తమాగతమభిప్రేత్య మునయో దీర్ఘసత్రిణః

అభినంద్య యథాన్యాయం ప్రణమ్యోత్థాయ చర్చయన్

దీర్ఘమగు సత్రయాగమును చేయుచున్న మహర్షులు ఆ బలరాముడు వచ్చినాడని తెలిసి లేచి నమస్కరించి వచ్చినందులకు అభినందించి ఆయనకు యథోచితమగు సత్కారమును కూడ చేసిరి.

సోఽర్చితస్సపరీవారః కృతాసనపరిగ్రహః

రోమహర్షణమాసీనం మహర్షేశ్శిష్యమైక్షత

పరిజనులతో కూడియున్న ఆ బలరాముడు సత్కారములనందుకొని ఆసనముపై కూర్చుండెను. అపుడు వ్యాసమహర్షి శిష్యుడగు రోమహర్షణుడు కూర్చుని యుండగా ఆయన చూచెను.

అప్రత్యుత్థాయినం సూతమకృతప్రహ్వణాంజలిమ్

అధ్యాసీనం చ తాన్ విప్రాంశ్చుకోపోదీక్ష్య మాధవః

సూతజాతికి చెందిన రోమహర్షణుడు లేచి ఎదు రేగలేదు, చేతులొగ్గి నమస్కరించలేదు. పైగా, ఆయన ఆ వేదవేత్తలకంటే ఎత్తైన ఆసనముపై కూర్చుండెను. ఆయనను చూచి బలరాముడు కోపించెను.

కస్మాదసావిమాన్ విప్రానధ్యాసే ప్రతిలోమజః

ధర్మపాలాంస్తథైవాస్మాన్ వధమర్హతి దుర్మతిః

అశాస్త్రీయమగు కలయికచే పుట్టిన ఈ దుర్బుద్ధి ధర్మరక్షకులగు ఈ వేదవేత్తలకంటే, మాకంటె కూడ ఎత్తైన ఆసనముపై కూర్చుండుటకు కారణమేమి? ఈతడు వధించ దగినవాడు.

ఋ షేర్భగవతో భూత్వా శిష్యోఽధీత్య బహూని చ

సేతిహాసపురాణాని ధర్మశాస్త్రాణి సర్వశః

ఈయన పూజనీయుడగు వ్యాసమహర్షికి శిష్యుడై అనేకములగు ధర్మ శాస్త్రములను, ఇతిహాసములను, పురాణములను అన్నింటినీ చదివెను.

అదాంతస్యావినీతస్య వృథా పండితమానినః

న గుణాయ భవంతి స్మ నట సేవాజితాత్మనః

ఈతడు ఉద్దండుడు, వినయము లేనివాడు, వ్యర్థముగా పండితుడనని విర్రవీగువాడు. మనోజయము లేని ఈతని విద్య, నటుని చేష్టలు వలె, అభినయమే గాని, ప్రయోజనకారి కాదు.

ఏతదర్థో హి లో కేఽస్మిన్నవతారో మయా కృతః

వధ్యా మే ధర్మధ్వజిన స్తే హి పాతకీనోఽధికాః

ఎందుకంటే, నేనీ లోకములో ఈ దుష్టశిక్షణము కొరకే అవతరించితిని. ధర్మమునాచరించకున్నా పైకి కపటముగా ధర్మమును ప్రకటించువారిని నేను వధించెదను. ఏలయన, వారు అధికపాపులు.

ఏతావదుక్త్వా భగవాన్ నివృత్తాఽసద్వధాదపి

భావిత్వాత్తం కుశాగ్రేణ కరస్థేనాహనతభుః

సర్వసమర్థుడగు బలరాముడు తీర్థయాత్ర కారణముగా దుష్టసంహా రమునుండి విరమించుకొనెను. అయినా, అది అట్లు జరుగవలసియున్నది. కావుననే, ఆయన చేతియందలి దర్భ కొనతో ఆయనను సంహరించెను.

హా హేతి వాదినస్సర్వే మునయః ఖిన్నమానసాః

ఊచుస్సంకర్షణం దేవమధర్మస్తే కృతః ప్రభో

మహర్షులందరి మనస్సులు ఖేదముతో నిండెను. వారు అయ్యో! అయ్యో! అంటూ బలరామదేవునితో నిట్లనిరి -- ఓ ప్రభూ! నీవు అధర్మమును చేసితివి.

అస్య బ్రహ్మాఽఽసనం దత్తమస్మాభిర్యదునందన

ఆయుశ్చాత్మాక్లమం తావద్యావత్సత్రం సమాప్యతే

యాదవవంశమునానందింపజేసే ఓ బలరామా! మేము సత్రయాగము పూర్తి అయ్యే వరకు ఈయనకు బ్రాహ్మణునకు యోగ్యమైన ఆసనమును, దేహమునకు అలుపు యెరుగని ఆయుష్షును ఇచ్చియున్నాము.

అజానశైవాచరితస్త్వయా బ్రహ్మవదో యథా

యోగేశ్వరస్య భవతో నామ్నాయోఽపి నియామకః

నీవు తెలియక బ్రాహ్మణవధను చేసినట్లే చేసినావు. యోగులకు ప్రభుడవగు నీవు వేదానుశాసనమునకు అతీతుడవు.

యద్యేతద్బ్రహ్మహత్యాయాః పావనం లోకపావన

చరిష్యతి భవాంల్లోకసంగ్రహ్యోఽనన్యచోదితః  

జనులను పావనము చేసే ఓ బలరామా! నిన్ను శాసించే ఇతరము లేదు. అయినా, నీవే స్వయముగా ఈ బ్రహ్మహత్యకు ప్రాయశ్చిత్తము చేసి శుద్ధి చేసుకున్నచో, అది జనులకు ఆదర్శము అగును.

శ్రీభగవానువాచ

కరి ష్యే వధనిర్వేశం లోకానుగ్రహకామ్యయా

నియమః ప్రథమే కల్పే యావాన్ స తు విధీయతామ్

శ్రీబలరామ భగవానుడిట్లు పలికెను --- ఆదర్శమును చూపించుట ద్వారా జనులను అనుగ్రహించవలెననే కోరికతో నేను బ్రహ్మహత్యకు ప్రాయశ్చిత్తమును చేయగలను. ముఖ్యపక్షములో ఎట్టి ప్రాయశ్చిత్త నియమము గలదో, దానినే తమరు ఉపదేశించుడు (నేను చేసెదను).

దీర్ఘమాయుర్బతైతస్య సత్త్వమింద్రియమేవ చ

ఆశాసితం యత్తద్భ్రూత సాధయే యోగమాయయా

అంతేగాక, ఈయనకు దీరాయుర్దాయమును, బలమును, ఇంద్రియపాటవమును కూడ దేనిని మీరు అపేక్షించెదరో చెప్పడు. నేను యోగమాయచే ఆ సర్వమును సంపన్నము చేసెదను.

ఋషయ ఊచుః

అస్త్రస్య తవ వీర్యస్య మృత్యోరస్మాకమేవ చ

యథా భవేద్వచస్సత్యం తథా రామ విధీయతామ్

మహర్షులిట్లు పలికిరి --- ఓ బలరామా! నీవు ప్రయోగించిన అస్త్రము, నీ ప్రభావము, ఈతని మరణము వ్యర్థము కారాదు (అస్త్రవీర్యము అమోఘమగుట, మృతుడు తిరిగి బ్రదుకకుండుట). మరియు, మా మాట (ఈయనకు ఇచ్చిన వరము) కూడ సత్యము కావలెను. మీరు అట్టి ఉపాయమును చేయుడు.

శ్రీభగవానువాచ

ఆత్మా వై పుత్ర ఉత్పన్న ఇతి వేదానుశాసనమ్

తస్మాదస్య భవేద్వక్తి ఆయురింద్రియసత్త్వవాన్

శ్రీబలరామ భగవానుడిట్లు చెప్పెను --- వ్యక్తి తానే పుత్రుడై పుట్టునని వేదము బోధించుచున్నది. కాబట్టి, ఈయన పుత్రుడు ప్రవక్తయగును. ఆతనికి ఆయుష్టు, ఇంద్రియపాటవము, శరీరబలము ఉండును.

కిం వః కామో మునిశ్రేష్ఠ బ్రూతాహం కరవాణ్యథ

అజానతస్త్వపచితిం యథా మే చింత్యతాం బుధాః  

ఓ మహర్షులారా! మీరు గొప్ప విద్వాంసులు. మీ కోరిక యేమియో చెప్పడు. నేను వెంటనే తీర్చెదను. నాకు ప్రాయశ్చిత్తము గురించి తెలి యదు. మీరు విచారణ చేసి యథార్థమగు ప్రాయశ్చిత్తమును చెప్పడు.

ఋషయ ఊచుః

ఇల్వలస్య సుతో ఘోరో బల్వలో నామ దానవః

స దూషయతి నస్సత్రమేత్య పర్వణి పర్వణి

మహర్షులు ఇట్లు చెప్పిరి --- ఇల్వలుని పుత్రుడు బల్వలుడని ప్రసిద్ధి గాంచెను. ఆ భయంకరుడగు రాక్షసుడు ప్రతి పూర్ణిమకు, అమావాస్యకు వచ్చి సత్రయాగమును చెడగొట్టుచున్నాడు.

తం పాపం జహి దాశార్హ తన్నశ్శుశ్రూషణం పరమ్ పూయశోణితవిణ్మూత్రసురామాంసాభివర్షిణమ్

దశార్హవంశీయుడవగు ఓ బలరామా! ఆ పాపి చీము, రక్తము, మలమూత్రములు, మద్యమాంసములను (అగ్నియందు) వర్షింపజేయును. వానిని నీవు వధించుము. అదియే మాకు గొప్ప సేవ కాగలదు.

తతశ్చ భారతం వర్షం పరీత్య సుసమాహితః

చరిత్వా ద్వాదశ మాసాంస్తీర్థస్నాయీ విశుద్ధ్య సే

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే ఉత్తరార్ధే అష్టసప్తతితమోఽధ్యాయః

తరువాత నీవు మిక్కిలి ఏకాగ్రమగు చిత్తముతో పన్నెండు మాసములు నిరంతరముగా తీర్థములయందు స్నానమును చేస్తూ సంచరించుము. భారతఖండమును పరిక్రమణ చేసి నీవు శుద్ధిని పొందగలవు.

శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో దంతవక్త్ర విదూరథుల ఉద్గారమును వర్ణించే డెబ్బది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (78).