58 - శ్రీకృష్ణుడు కాలింది మొదలగువారిని పరిణయమాడుట

శ్రీశుక ఉవాచ

 ఏకదా పాండవాన్ ద్రష్టుం ప్రతీతాన్ పురుషోత్తమః

 ఇంద్రప్రస్థం గతశ్శ్రీమాన్ యుయుధానాదిభిర్వృతః

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- అతిశయించిన శోభ గల శ్రీకృష్ణ భగ వానుడు ఒకనాడు యుయుధానుడు, సాత్యకి మొదలగువారి చుట్టువారి రాగా, లోకప్రఖ్యాతులైన పాండవులను చూచుటకు ఇంద్రప్రస్థము వెళ్లాను.

దృష్ట్వా తమాగతం పార్థా ముకుందమఖిలేశ్వరమ్

ఉత్తస్థుర్యుగపద్వీరాః ప్రాణా ముఖ్యమివాగతమ్

దేహములోనికి ముఖ్యప్రాణము రాగానే కన్ను మొదలగు ఐదు ఇంద్రియములు చేతనములగును. అదే విధముగా మోక్ష ప్రదాత, సర్వేశ్వరుడు అగు శ్రీకృష్ణుడు వచ్చుచుండుటను గాంచి వీరులగు కుంతీపుత్రులు ఒక్కసారిగా లేచి నిలబడిరి.

పరిష్వజ్యొచ్యుతం వీరా అంగసంగహతైనసః

 సానురాగస్మితం వక్త్రం వీక్ష్య తస్య ముదం యయుః

వీరులగు పాండవులు శ్రీకృష్ణుని కౌగిలించిరి. ఆయన దేహముయొక్క స్పర్శచే వారి దోష (దుఃఖ) ములు దూరమయ్యెను. ప్రేమ నిండిన చిరు నవ్వుతో కూడిన ఆయన ముఖమును చూచి వారు ఆనందమును పొందిరి.

యుధిష్ఠిరస్య భీమస్య కృత్వా పాదాభివందనమ్

 ఫాల్గునం పరిరభ్యాథ యమాభ్యాం చాభివందితః

శ్రీకృష్ణుడు ధర్మరాజభీముల పాదములను నమస్కరించి అర్జునుని కౌగిలించగా, నకుల సహదేవులు ఆయనకు నమస్కరించిరి.

పరమాసన ఆసీనం కృష్ణా కృష్ణ మనిందితా

 నవోడా వ్రీడితా కించిచ్ఛనైరేత్యాభ్యవందన

            శ్రేష్ఠమగు ఆసనముపై కూర్చున్న శ్రీకృష్ణుని, కొత్తగా పెళ్లి అయి కొంచెము సిగ్గు పడుతున్న ద్రౌపది మెల్లగా వచ్చి నమస్కరించెను.

తథైవ సాత్యకిః పార్థైః పూజితశ్చాభివందితః

 నిషసాదాసనేఽన్యే చ పూజితాః పర్యుపాసత

అదే విధముగా, పాండవులు సాత్యకిని, పూజించి నమస్కరించి, ఇతరులను కూడ పూజించిరి. వారు చుట్టూ ఆసనములలో కూర్చుండిరి.

పృథాం సమాగత్య కృతాభివాదనః

తయాఽతీహార్ధార్ద్రదృశాఽభిరంభితః

ఆపృష్ట వాంస్తాం కుశలం సహస్నుషాం

పితృష్వసారం పరిపృష్ట బాంధవః

ప్రశ్నించబడిన బంధువులు గలవాడు. .

శ్రీకృష్ణుడు కుంతిని కలిసి నమస్కరించెను. ఆమె అతిశయించిన ప్రేమచే కన్నులలో నీళ్లు నిండగా కౌగిలించి, బంధువుల క్షేమమును గురించి ప్రశ్నించెను. తన తండ్రి సోదరియగు ఆమెను, ఆమె కోడలు అగు ద్రౌపదిని కూడ శ్రీకృష్ణుడు కుశలమును అడిగి తెలుసుకొనెను.

తమాహ ప్రేమవైక్లబ్యరుద్దకంఠాశ్రులోచనా

 స్మరంతీ తాన్ బహూన్ క్లేశాన్ క్లేశాపాయాత్మదర్శనమ్  

ఆయా కష్టములు గుర్తుకు రాగా కుంతి కన్నులలో నీరు నిండెను. ప్రేమ వలని కంగారుచే ఆమె కంఠము బొంగురు వోయెను. తన దర్శనమునిచ్చి కష్టములను బాపే ఆ శ్రీకృష్ణునితో ఆమె యిట్లనెను.

తదైవ కుశలం నోఽభూత్సనాథాస్తే కృతా వయమ్

జ్ఞాతీన్నస్స్మరతా కృష్ణ భ్రాతా మే ప్రేషితస్త్వయా

 ఓ శ్రీకృష్ణా! ఎప్పుడైతే నీవు బంధువులమగు మమ్ములను స్మరించి నా సోదరుడగు అక్రూరుని (క్షేమమునరయుటకై) పంపితివో, అప్పుడే మేము క్షేమము గలవారమైతిమి. మాకు నీవు నాథుడవైతివి,

న తేఽస్తి స్వపరభ్రాంతిర్విశ్వస్య సుహృదాత్మనః

 తథాఽపి స్మరతాం శశ్వత్ క్లేశాన్ హంసి హృది స్థితః

            నీవు జగత్తునకు హితకారివి, ఆత్మస్వరూపుడవు. నీకు నావారు, పరాయివారు అనే భ్రాంతి లేదు. అయినప్పటికీ, నిన్ను స్మరించువారల హృదయములో నీవు ఎల్లవేళలా ఉండి ఇడుముల బా పెదవు.

యుధిష్ఠిర ఉవాచ

కిం న ఆచరితం శ్రేయో న వేదాహమధీశ్వర

యోగేశ్వరాణాం దుర్ధర్శో యన్నో దృష్టః కుమేధసామ్

 ధర్మరాజు ఇట్లు పలి కెను --- ఓ సర్వేశ్వరా! మేమేమి పుణ్యమును చేసితిమో నాకు తెలియకున్నది. ఎందుకంటే, గొప్ప యోగులకు కూడ దర్శించుట కష్టమైన నీవు భోగపరాయణులమగు మాకు దర్శనమిచ్చితివి.

ఇతి వై వార్షికాన్ మాసాన్ రాజ్ఞా సోఽభ్యర్థితస్సుఖమ్ జనయన్నయనానందమింద్రప్రస్థౌకసాం విభుః

 ధర్మరాజు ఈ విధముగా కోరగా, సర్వసమర్థుడగు శ్రీకృష్ణుడు వర్షకాలము నాల్గు మాసములు పూర్తిగా అక్కడనే గడి పెను. ఆయన ఇంద్రప్రస్థవాసుల కళ్లకు ఆనందమును కలిగించెను.

ఏకదా రథమారుహ్య విజయో వానరధ్వజమ్

 గాండీవం ధనురాదాయ తూణౌ చాక్షయసాయకౌ

సాకం కృష్ణేన సన్నద్ధో విహర్తుం విపినం వనమ్

 బహవ్యాలమృగాకీర్ణం ప్రావిశత్పరవీరహా

శత్రువీరులను సంహరించే అర్జునుడు ఒకనాడు కవచమును వేసుకొని శ్రీకృష్ణునితో గూడి రథమునెక్కి విహరించుటకై అడవిలో ప్రవేశించెను. ఆయన గాండీవధనుస్సును, తరిగిపోని అంబుల పొదులను కూడ తీసుకొని వెళ్లాను. ఆయన రథము పై ధ్వజమునందు కపిచిహ్నము ఉండును. ఆ గహనమైన అడవి అనేకక్రూరమృగములతో నిండియుండెను.

తత్రావిధ్యచ్చ రైర్వ్యాఘ్రాన్ సూకరాన్మహిషాన్ రురూన్

 శరభాన్ గవయాన్ ఖడ్గాన్ హరిణాఞ్ఛశశల్ల కాన్

ఆతడా అడవిలో పెద్ద పులులు, అడవి పందులు, అడవి దున్నలు, దుప్పులు, మీగండ్ల మెకములు, గురుపోతులు, ఖడ్గమృగములు, జింకలు, కుందేళ్లు, ఏదుపందులు అనువాటిని వేటాడెను.

తాన్నిన్యుః కింకరా రాజ్ఞే మేధ్యాన్ పర్వణ్యుపాగతే

తృటరీతః పరిశ్రాంతో బీభత్సుర్యమునామగాత్

పర్వ (యజ్ఞ) కాలము సంప్రాప్తము కాగా, సేవకులా పశువులలో కర్మకు యోగ్యమైన వాటిని ధర్మరాజుగారి వద్దకు చేర్చిరి. అలిసిపోయిన అర్జునుడు. అధికమగు దప్పిక గలవాడై యమునానదికి వెళ్లాను.

తత్రోపస్పృశ్య విశదం పీత్వా వారి మహారథౌ

కృష్ణౌ దదృశతుః కన్యాం చరంతీం చారుదర్శనామ్

మహారథికులగు శ్రీకృష్ణార్జునులా యమునలో స్నానమాడి మంచి నీరు త్రాగి, అక్కడ సంచరించుచున్న సుందరరూపిణియగు కన్యను చూచిరి. .

తామాసాద్య వరారోహాం సుద్విజాం రుచిరాననామ్

 పప్రచ్ఛ ప్రేషితస్సఖ్యా ఫాల్గునః ప్రమదోత్తమామ్

ఆ ఉత్తమయువతి గొప్ప సుందరి. ఆమె అందమైన మోము చక్కని దంతములతో ప్రకాశించెను. శ్రీకృష్ణుడు పంపగా అర్జునుడు ఆమె వద్దకు వెళ్లి ఇట్లు ప్రశ్నించెను.

కా త్వం కస్యాసి సుశ్రోణి కుతోఽసి కిం చికీర్షసి

 మన్యే త్వాం పతిమిచ్చంతీం సర్వం కథయ శోభనే

ఓ సుందరీ! నీవేవతెవు? ఎవరిదానవు? ఎక్కడనుండి వచ్చితివి? ఓ కల్యాణీ! ఏమి చేయగోరుచున్నావు? నీవు భర్తను కోరుచున్నావని నాకు అనిపిస్తోంది. సర్వమును చెప్పుము.

కాలింద్యువాచ

అహం దేవస్య సవితుర్దుహితా పతిమచ్చతీ

విష్ణుం వరేణ్యం వరదం తపః పరమమాస్థితా

కాలింది ఇట్లు పలికెను ... నేను సూర్యదేవుని కుమార్తెను. సర్వోత్తముడు, వరములనిచ్చువాడు అగు శ్రీహరిని భర్తగా పొందాలనే కోరికతో నేను కఠోరమగు తపస్సును చేయుచున్నాను.

నాన్యం పతిం వృణే వీర తమృతే శ్రీని కేతనమ్

తుష్యతాం మే స భగవాన్ ముకుందోఽనాథసంశ్రయః

ఓ వీరుడా! లక్ష్మీదేవికి నివాసస్థానమగు ఆ శ్రీహరిని తక్క నేను మరియొకనిని భర్తగా కోరను. మోక్ష ప్రదాత, అనాథలకు ఆశ్రయము ఆగు ఆ శ్రీహరి భగవానుడు నా యెడల ప్రీతిని జెందుగాక!

కాలిందీతి సమాఖ్యాతా వసామి యమునాజలే

 నిర్మితే భవనే పిత్రా యావదచ్యుతదర్శనమ్

నన్ను కాలింది అంటారు. నేను యమునానదిలో మా తండ్రిచే నిర్మించ బడిన భవనములో శ్రీహరి దర్శనమయ్యేంతవరకు నివసించుచున్నాను.

తథాఽవదద్దుడా కేశో వాసుదేవాయ సోఽపి తామ్

 రథమార్యో తద్విద్వాన్ ధర్మరాజముపాగమత్

నిద్రను నిర్జించిన అర్జునుడు ఆమె చెప్పిన విషయమును యథాతథముగా శ్రీకృష్ణునకు చెప్పెను. ఈ సంగతి శ్రీకృష్ణునకు ముందే తెలియును. ఆయన ఆమెను రథమెక్కించి ధర్మరాజు వద్దకు వెళ్లాను.

యదైవ కృష్ణస్సందిష్టః పార్థానాం పరమాద్బుతమ్

 కారయామాస నగరం విచిత్రం విశ్వకర్మణా

ఇదివరలో పాండవులు శ్రీకృష్ణునకు ఒక విన్నపమును చేసిరి. వెంటనే ఆయన విశ్వకర్మచే రంగు రంగుల నగరము (ఇంద్రప్రస్థములో భాగము) ను నిర్మింపజేసెను. ఆ నగరము గొప్ప ఆశ్చర్యమును కలిగించెను.

భగవాంస్తత్ర నివసన్ స్వానాం ప్రీయచికీర్ధయా

 అగ్నయే ఖాండవం దాతుమర్జునస్యాస సారథిః

శ్రీకృష్ణ భగవానుడు తన ' వారైన పాండవులకు ఆనందమును కలిగించుటకై అక్కడ నివసిస్తూ, అగ్నికి ఖాండవమనే (ఇంద్రుని) అడవిని ఇచ్చుటకై అర్జునుని సారథి ఆయెను. "

సోఽగ్నిస్తుష్టో ధనురదాద్దయాఞ్చ్ఛ్వే తాన్ రథం నృప

అర్జునాయాక్షయౌ తూణౌ వర్మ చాభేద్యమస్త్రీభిః

ఓ పరీక్షిన్మహారాజా! సంతోషించిన అగ్నిదేవుడు అర్జునునకు ధనుస్సు, తెల్లని గుర్రములు, రథము, తరిగిపోని అంబుల పొదులు, ఆయుధ ధారులగు వీరులు పగులగొట్ట లేని కవచము అనువాటిని యిచ్చెను.

మయశ్చ మోచితో వ హ్నేస్సభాం సఖ్య ఉపాహరత్

యస్మిన్ దుర్యోధనస్యాసీజ్జలస్థలదృశిభ్రమః

ఖాండవవనములోని దావాగ్నినుండి అర్జునుడు మయుని విడిపించేను. అప్పుడు మయుడు అర్జునునితో స్నేహము చేసి ఆతనికి సభను బహుమానముగా నిచ్చెను. ఆ సభయందే దుర్యోధనుడు నీటిని చూచి నేలయని, నేలను నీరుగను భ్రమపడెను.

స తేన సమనుజ్ఞాతస్సుహృద్బిశ్చానుమోదితః

 ఆయమౌ ద్వారకాం భూయస్సాత్యకిప్రముఖైర్వృతః

అర్జునుని, ఇతరమిత్రుల (ధర్మరాజాదుల) అనుమతిని పొంది ఆ శ్రీకృష్ణుడు సాత్యకి మొదలగువారితో గూడి మరల ద్వారకకు వచ్చెను.

అథోప యేమే కాలిందీం సుపుణ్య ర్త్వృక్ష ఊర్జితే

వితన్వన్ పరమానందం స్వానాం పరమమంగలమ్

పరమమంగళస్వరూపుడగు శ్రీకృష్ణుడు తరువాత మిక్కిలి పవిత్రమగు ఋతువు, నక్షత్రము, గ్రహబలము గల ముహూర్తమునందు కాలిందిని వివాహమాడి తన వారలకు గొప్ప ఆనందమును విస్తరిల్ల జేసెను.

విందానువిందావావంత్వౌ దుర్యోధనవశానుగౌ

 స్వయంవరే స్వభగినీం కృష్ణే సక్తాం న్య షేధతామ్

అవంతీదేశప్రభువులగు విందుడు, అనువిందుడు దుర్యోధనుని వశములో నుండే అనుచరులు. వారి సోదరి మిత్రవింద స్వయంవరములో శ్రీకృష్ణుని ప్రేమించగా, వారు అడ్డు పడిరి.

రాజాధిదేవ్యాస్తనయాం మిత్రవిందాం పితృష్వసుః

ప్రసహ్య హృతవాన్ కృష్ణో రాజన్ రాజ్ఞాం ప్రపశ్యతామ్

ఓ పరీక్షిన్మహారాజా! మిత్రవింద వసుదేవుని సోదరియగు రాజాధిదేవీ కుమార్తె. శ్రీకృష్ణుడు రాజులందరు చూచుచుండగా లెక్క చేయకుండా, ఆమెను బలాత్కారముగా తీసుకొని వెళ్లాను.

నగ్నజిన్నామ కౌసల్య ఆసీద్రాజాఽతిధార్మికః

తస్య సత్యాఽభవత్కన్యా దేవీ నాగ్నజితీ నృప

ఓ పరీక్షిన్మహారాజా! నగ్నజిత్తు అని ప్రసిద్ది గాంచిన గొప్ప ధార్మికుడు కోసలదేశమునకు ప్రభువుగా నుండెను. ఆయనకు నాగ్నజితి అని ప్రసిద్ది గాంచిన సత్యాదేవి అనే కుమార్తె ఉండెను.

న తాం శేకుర్నృపా వోడుమజిత్వా సప్త గోవృషాన్

తీక్ష్ణశృంగాన్ సుదుర్ధర్షాన్ వీరగంధాసహాన్ ఖలాన్  

నగ్నజిత్తు వద్ద ఏడు పొగరుబోతు ఎద్దులు గలవు. వాడి కొమ్ములు గల ఆ ఎద్దులు వీరపురుషుల గంధమునైననూ సహించకుండెడివి. వాటిని లొంగదీయుట సుతరాము శక్యము కాకుండెను. వాటిని జయించి సత్యను వివాహమాడవలెను. రాజులకు ఆ పని శక్యము కాలేదు.

తాం శ్రుత్వా వృషజిల్లభ్యాం భగవాన్ సాత్వతాం పతిః

 జగామ కౌసల్యపురం సైన్యేన మహతా వృతః

ఎద్దులను లొంగదీసినవానిని మాత్రమే సత్య వివాహమాడునని భక్తపాలకుడు, యాదవప్రభుడు అగు శ్రీకృష్ణ భగవానుడు వినెను. ఆయన " పెద్ద సైన్యముతో కూడి కోసలరాజధానియగు అయోధ్యకు వెళ్లాను.

స కోసలపతిః ప్రీతః ప్రత్యుత్థానాసనాదిభిః

అర్హణేనాపి గురుణా పూజయన్ ప్రతినందితః

కోసలదేశప్రభుడగు ఆ నగ్నజిత్తు సంతోషముతో శ్రీకృష్ణునకు ఎదు రేగి తీసుకువచ్చి ఆసనము, అర్ఘ్యము మొదలగువాటితో పెద్ద సత్కారమును చేసెను. శ్రీకృష్ణుడు కూడ ఆయనను అభినందించేను.

వరం విలోక్యాభిమతం సమాగతం

నరేంద్రకన్యా చకమే రమాపతిమ్

 భూయాదయం మే పతీరాశీషోఽమలాః

కరోతు సత్యా యది మే ధృతో వ్రతైః

లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుని రాకను చూచి సత్య ఆయనను ప్రేమించెను. ఆమెకు నచ్చిన వరుడాయనయే. నేను నియమనిష్టలతో ఈయనను నా హృదయములో నిల్పి యున్నచో, ఈయన నాకు భర్త యై నా గొప్ప మనోరథములను యథార్థము చేయుగాక!(అని తలచెను).

యత్పాదపంకజరజశ్శిరసా బిభర్తి

 శ్రీరజ్జజస్సగిరిశస్సహ లోకపాలైః

 లీలాతనస్వకృత సేతుపరీప్పయేశః

కాలే దధత్స భగవాన్మమ కేన తు ష్యేత్

శ్రీకృష్ణ భగవానుని పద్మములవంటి పాదముల ధూళిని లక్ష్మీదేవి, పద్మసంభవుడగు బ్రహ్మదేవుడు, కైలాసవాసియగు శివుడు, లోకపాలకులతో సహా తలపై దాల్చెదరు. ఆయన తాను సృష్టించిన ధర్మమర్యాదలను కాపాడుటకై లీలావతారములను దాల్చుచుండును. ఏ వ్రతము చే ఆయనకు నాపై ప్రీతి కలుగును?(ఊహించుట శక్యము కాదు).

అర్చితం పునరిత్యాహ నారాయణ జగత్పతే

 ఆత్మానం దేన పూర్ణస్య కరవాణి కిమల్పకః

శ్రీకృష్ణుని పూజించి నగ్నజిత్తిట్లనెను: ఓ నారాయణా! నీవు జగన్నాథుడవు. ఆత్మానందముతో పూర్ణుడవు అగు నీకు అల్పుడనగు "నేనేమి చేయుదును?

శ్రీశుక ఉవాచ

తమహ భగవాన్ హృష్ణః కృతాసనపరిగ్రహః

 మేఘగంభీరయా వాచా సస్మితం కురునందన

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కురువంశనందనుడవగు ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ భగవానుడు ఆనందముతో ఆసనమును స్వీకరించెను. ఆయన చిరునవ్వుతో మేఘగర్జనవంటి స్వరముతో ఆ రాజును ఉద్దేశించి ఇట్లు పలికెను. "

శ్రీభగవానువాచ

నరేంద్ర యాచ్ఞా కవిభిర్విగర్హీతా రాజన్యబంధోర్నిజధర్మవర్తినః

 తథాఽపి యాచే తవ సౌహృదేచ్చయా

కన్యాం త్వదీయాం న హి శుల్కదా వయమ్  

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ మహారాజా! స్వధర్మమును పాలించే అధమక్షత్రియునకు కూడ యాచన విద్వాంసులచే నిందించబడినది. అయినా నీతో బంధుత్వమునందలి ఇచ్చచే నేను నీ కుమార్తెను యాచించుచున్నాను. మేము కన్యాశుల్కమునిచ్చువారము కానే కాము.

రాజోవాచ

కొఽన్య స్తేఽభ్యధికో నాథ కన్యావర ఇ హేప్సితః

గుణైకధామ్నో యస్యాంగే శ్రీర్వసత్యనపాయినీ

నగ్నజిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! ఈ లోకములో కన్యకు వరుడు నీకంటే గొప్పవానిని మరియొకనిని ఎవడు కోరును?.(ఎవ్వడూ కోరడు). సకలకల్యాణగుణములకు ఏకైకనిధానము నీవే. నీ దేహమునందు లక్ష్మీదేవి తొలగిపోకుండా నిత్యనివాసము చేయుచున్నది.

కిం త్వస్మాభిః కృతః పూర్వం సమయస్సాత్వతర్షభ

పుంసాం వీర్యపరీక్షాఽర్థం కన్యావరపరీప్సయా

యదువంశీయులలో శ్రేష్ఠుడవగు ఓ శ్రీకృష్ణా! కానైతే కన్యకు వరుని పొందే కోరికతో పురుషుల పరాక్రమమును పరీక్షించుటకై మేము ఇదివరలో ఒక నియమమును పెట్టితిమి.

సప్తైతే గోవృషా వీర దుర్దాంతా దురవగ్రహాః

ఏతైర్భగ్నాస్సుబహవో భిన్నగాత్రా నృపాత్మజాః

ఓ వీరా! ఈ ఏడు ఎద్దులను లొంగదీసి వశములోనికి తెచ్చుట చాల కష్టము. చాలమంది రాజకుమారులు అవయవములను విరుగకొట్టుకొని వీటిచే భంగపాటు చెందిరి.

యదీమే నిగృహీతాస్స్యుస్త్వయైవ యదునందన

వరో భవానభిమతో దుహితుర్మే శ్రియః పతే

యదువంశమునానందింప జేస్తున్న ఓ లక్ష్మీపతీ! ఈ ఎద్దులను నీవు నిగ్రహించినచో, నీవే నిశ్చయముగా నా కుమార్తెకు ప్రియమగు వరుడవు.

ఏవం సమయమాకర్ణ్య బద్ధ్వా పరికరం ప్రభుః

ఆత్మానం సప్తధా కృత్వా న్యగృహ్ణాల్లీలయైవ తాన్

ఈ విధమైన నియమమును గురించి విన్న శ్రీకృష్ణ ప్రభుడు నడుము కట్టును బిగించెను. ఆయన తనను తాను ఏడు రూపములుగా మలుచుకొని, ఆ ఎద్దులను అవలీలగా వశము చేసుకొనెను.

బద్ద్వా తాన్ దామభిశ్శౌరిర్బగ్నదర్పాన్ హజసః

 వ్యకర్షల్లీలయా బద్ధాన్ బాలో దారుమయాన్ యథా

శూరవంశీయుడగు శ్రీకృష్ణుడు ఆ ఎద్దుల పొగరునడంచి త్రాళ్లతో కట్టి, పిల్లవాడు చెక్కతో చేసిన బొమ్మలను వలె, సునాయాసముగా లాగేను.

తతః ప్రీతస్సుతాం రాజా దదౌ కృష్ణాయ విస్మితః

 తాం ప్రత్యగృహ్ణాద్భగవాన్ విధివత్సదృశీం ప్రభుః

తరువాత ఆ రాజు ఆనందాశ్చర్యములను పొంది శ్రీకృష్ణునకు కుమార్తెనిచ్చి వివాహము చేసెను. సర్వసమర్థుడగు శ్రీకృష్ణ భగవానుడు తనకు తగియున్న ఆమెను యథావిధిగా పాణిగ్రహణము చే సెను.

రాజపత్న్యశ్చ దుహితుః కృష్ణం లబ్ద్వా ప్రియం పతిమ్

 లేభిరే పరమానందం జాతశ్చ పరమోత్సవః

రాజకుమార్తెకు శ్రీకృష్ణుడు ప్రియుడైన భర్తగా లభించినందులకు రాజపత్నులు కూడ మహానందముతో గొప్ప ఉత్సవమును కూడ చేసిరి.

శంఖ భేర్యానకా నేదుర్గీతవాద్యద్విజాశిషః

నరా నార్యః ప్రముదితాస్సువాసస్స్రగలంకృతాః

శంఖములు, భేరీలు, తప్పెటలు, వాద్యములతో బాటుగా పాటలు, వేద వేత్తల ఆశీస్సులు మారు మ్రోగినవి. మంచి వస్త్రములను, మాలలను ధరించిన స్త్రీలు, పురుషులు మహానందమును పొందిరి.

దశ ధేనుసహస్రాణి పారిబర్హమదాద్విభుః

యువతీనాం త్రిసాహస్రం నిష్కగ్రీవసువాససామ్

మహారాజు పది వేల పొడి ఆవులను, మెడలో హారములను మంచి వస్త్రములను దాల్చిన మూడు వేల చెలికత్తెలను కట్నము యిచ్చెను.

నవనాగసహస్రాణి నాగాచ్ఛతగుణాన్ రథాన్

రథాచ్ఛతగుణానశ్వానశ్వాచ్ఛతగుణాన్నరాన్

ఆ రాజు తొమ్మిది వేల ఏనుగులను, వాటికి వంద రెట్లు రథములను, వాటికీ వంద రెట్లు గుర్రములను, వాటికి వంద రెట్లు సైనికులను ఇచ్చెను.

దంపతీ రథమార్యో మహత్యా సేనయా వృతౌ

స్నేహప్రక్లిన్నహృదయో యాపయామాస కోసలః

కోసల దేశప్రభుడగు నగ్నజిత్తు ప్రేమతో ఆర్ద్రమైన హృదయము గలవాడై కొత్త దంపతులను రథమెక్కించి పెద్ద సేనతో బాటు పంపించెను.

శ్రుత్వైతద్రురుడుర్భూపా నయంతం పథి కన్యకామ్

భగ్నవీర్యాస్సుదుర్మర్షా యదుభిర్గోవృషైః పురా

పూర్వము యాదవులచే మరియు ఎద్దులచే భగ్నము చేయబడిన పరాక్రమము గల రాజులీ వృత్తాంతమును విని అధికమగు కోపముతో, పెళ్లి కూతురును దోడ్కొని వెళ్లుచున్న శ్రీకృష్ణుని దారిలో నిలువరించిరి.

తానస్యతశ్శరవ్రాతాన్ బంధుప్రియకృదర్జునః

గాండీవీ కాలయామాస సింహః క్షుద్రమృగానివ

బాణముల గుంపులను ప్రయోగిస్తున్న ఆ రాజులను గాండీవధారియగు అర్జునుడు, సింహము అల్పజంతువులను వలె, పారద్రోలి బంధువులకు ప్రీతిని కలిగించెను.

పారిబర్హముపాగృహ్య ద్వారకామేత్య సత్యయా

రేమే యదూనామృషభో భగవాన్ దేవకీసుతః

యదువంశశిరోమణి, దేవకీనందనుడు అగు శ్రీకృష్ణ భగవానుడు సత్యతో బాటుగా కట్నమును తీసుకొని ద్వారకకు వచ్చి రమించెను.

శ్రుతకీర్తేస్సుతాం భద్రాముపయేమే పితృష్వసుః

కైకేయీం భ్రాతృభిర్దత్తాం కృష్ణస్సంతర్దనాదిభిః

శ్రీకృష్ణుని తండ్రి సోదరియగు శ్రుతకీర్తి కేకయదేశపు రాణి. ఆమె కుమార్తెయగు భద్రను సోదరులగు సంతర్థనుడు మొదలగువారు సమర్పించగా శ్రీకృష్ణుడు వివాహమాడెను.

సుతాం చ మద్రాధిపతేర్లక్ష్మణాం లక్షణైర్యుతామ్

స్వయంవరే జహారైకస్స సుపర్ణస్సుధామివ

మద్రదేశపు రాజు బృహత్సేనుడు. ఆయన కుమార్తెయగు లక్ష్మణ మంచి లక్షణములు గలది. ఆ శ్రీకృష్ణుడొక్కడే ఆమెను స్వయంవరములో, గరుడుడు అమృతమును వలె, తీసుకు వెళ్లి వివాహమాడెను.

అన్యాశ్చైవంవిధా భార్యాః కృష్ణస్యాసన్ సహస్రశః

భౌమం హత్వా తన్నిరోధాదాహృతాశ్చారుదర్శనాః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే ఉత్తరార్ధే అష్టపంచాశత్తమోఽధ్యాయః

కృష్ణుడు భౌమాసురుని సంహరించి వాని అంతఃపురమునుండి సుందరమైన రూపము గల యువతులను వేలాదిమందిని తీసుకువచ్చి వివాహమాడెను. ఆ విధముగా ఆయనకు ఎందరో భార్యలు ఉండిరి.

శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో

శ్రీకృష్ణుడు కాళింది మొదలగువారిని వివాహమాడుటను వర్ణించే

ఏబది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (58).