భాగవత మహా పురాణము
39 - అక్రూరుడు బలరామ కృష్ణులను గోకులము తీసుకువెళ్లుట
శ్రీశుక ఉవాచ ।
సుఖోపవిష్టః పర్యంకే రామకృష్ణోరుమానితః । లేభే మనోరథాన్ సర్వాన్ పథి యాన్ స చకార హ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- అక్రూరుడు ఆసనముపై సుఖముగా కూర్చుండెను. ఆయనను బలరామకృష్ణులు గొప్పగా సత్కరించిరి. ఆయన దారిలో మనసులో సంకల్పించిన కోరికలన్నీ తీరిపోయెను.
కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే । తథాఽపి తత్పరా రాజన్న హి వాంఛంతి కించన ॥
ఓ పరీక్షిస్మహారాజా! లక్ష్మీదేవికి నివాసస్థానమగు శ్రీకృష్ణ భగవానుడే ప్రసన్న మైనప్పుడు లభించనిది ఏమి ఉండును? (ఉండదు). అయిననూ, ఆయనయే పరమలక్ష్యముగా గల భక్తులు దేనినైననూ కోరనే కోరరు.
సాయంతనాశనం కృత్వా భగవాన్ దేవకీసుతః । సుహృత్సు వృత్తం కంసస్య పప్రచ్ఛాన్యచ్చి కీర్షితమ్ ॥
దేవకీనందనుడగు శ్రీకృష్ణ భగవానుడు సాయంకాల భోజసమును చేసి, కంసుడు తమ హితైషుల యెడల ప్రవర్తించే తీరును, కంసుడు చేయదలచిన ఇతర కార్యములను గురించి అక్రూరుని ప్రశ్నించెను.
శ్రీభగవానువాచ ।
తాత సౌమ్యాగతః కచ్చిత్స్వాగతం భద్రమస్తు వః । అపి స్వజ్ఞాతిబంధూనామనమీవమనామయమ్ ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- తండ్రీ! తమరిని చూచుటచే ప్రీతి కలిగినది. తమరి రాక సుఖముగా జరిగినదా? మీకు మంగళమగు గాక! మా జాతులు, బంధువుల యెడల కంసుడు పాపమును చేయలేదు గదా? వారు క్షేమమేనా?
కిం ను నః కుశలం పృచ్ఛే ఏధమానే కులామయే । కం సే మాతులనామ్న్యంగ స్వానాం నస్తత్ర్పజాసు చ ॥
అయ్యా! వంశములో మేనమామ అనే పేరుతో వ్యాధి పెరుగుచున్నది. అట్టిచో, మాకు, మా బంధువులకు, కంసునిచే పాలించబడే ప్రజలకు క్షేమమును గురించి ఏమని ప్రశ్నించెదను?
అహో అస్మదభూధ్భూరి పిత్రోర్వృజినమార్యయోః । యద్ధేతోః పుత్ర మరణం యద్ధేతోర్బంధనం తయోః ॥
అయ్యో। నా కారణముగా పూజనీయులైన మా తల్లిదండ్రులకు దుఃఖము కలిగినది. నా కారణముగానే వారిద్దరికీ పుత్రుల మరణము, చెరసాల కలిగినవి.
దిష్ట్యాఽద్య దర్శనం స్వానాం మహ్యం వస్సౌమ్య కాంక్షితమ్ । సంజాతం వర్ణ్యతాం తాత తవాగమనకారణమ్ ॥
ఓ ప్రియదర్శనా! తండ్రీ! నా వారి దర్శనమును నేను కోరుచుంటిని.ఈనాడు నాకు మీ దర్శనము కలిగినది. ఆనందము. తమరి రాకకు కారణమును చెప్పుడు.
శ్రీశుక ఉవాచ ।
పృష్టో భగవతా సర్వం వర్ణయామాస మాధవః । వైరానుబంధం యదుషు వసుదేవవధోద్యమమ్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను. శ్రీకృష్ణ భగవానుడిట్లు ప్రశ్నించగా,మధువంశోద్భవుడగు అక్రూరుడు -- యాదవుల యెడల కంసుడు కత్తి కట్టుట, వసుదేవుని వధించే ప్రయత్నమును చేయుట -- అనే సర్వమును వర్ణించి చెప్పెను.
యత్సందేశో యదర్థం వా దూతస్సంప్రేషితస్స్వయమ్ । యదుక్తం నారదేనాస్య స్వజన్మాఽఽనకదుందుభేః ॥
కంసుడు తనను ఏ సందేశముతో ఏ ప్రయోజనము కొరకు దూతగా పంపెనో, వసుదేవుని వలన తాను (శ్రీకృష్ణుడు) జన్మించినాడని నారదుడీ కంసునకు ఏమి చెప్పెనో, (ఆ సర్వమును వర్ణించి చెప్పెను).
శ్రుత్వాఽక్రూరవచః కృష్ణో బలశ్చ పరవీరహా । ప్రహస్య నందం పితరం రాజ్ఞాఽఽదిష్టం విజజ్ఞతుః ॥
శత్రువీరులను సంహరించే బలరామకృష్ణులు అక్రూరుని మాటను విని నవ్విరి. వారు కంసుని ఆదేశము (వారిద్దరికి ధనుర్యాగమునకు ఆహ్వానము) ను తండ్రియగు నందునకు విన్నవించిరి.
గోపాన్ సమాదిశత్సోఽపి గృహ్యతాం సర్వగోరసః । ఉపాయనాని గృహ్ణీధ్వం యుజ్యంతాం శకటాని చ ॥
ఆ నందుడు కూడ గోపాలకులను ఆదేశించెను -- సకల గోరసము (పాలు, వెన్న ఇత్యాది) ను తీసుకురండు. బహుమతులను కూడ తీసుకు రండు. బళ్లను కట్టుడు.
యాస్యామశ్శ్వో మధుపురీం దాస్యామో నృపతే రసాన్ ।
ద్రక్ష్యామస్సుమహత్పర్వ యాంతి జానపదాః కిల । ఏవమా ఘోషయత్ క్షత్త్రా నందగోపస్స్వగోకులే ॥
రేపు మథురా నగరమునకు వెళ్లి మహారాజునకు పాలు, పెరుగు మొదలగు వాటిని సమర్పించి, గొప్ప ధనుర్యాగోత్సవమును చూచెదము. దేశవాసులు వెళ్లుచున్నారు అని -- నందుడు గోకులాధిపతిచే అంతటా చాటింపు వేయించెను.
గోప్యస్తాస్తదుపశ్రుత్య బభూవుర్వ్యథితా భృశమ్ । రామకృష్ణా పురీం నేతుమక్రూరం వ్రజమాగతమ్ ॥
అప్పుడు బలరామకృష్ణులను మథురా నగరమునకు తీసుకు వెళ్లుటకై అక్రూరుడు గోకులమునకు వచ్చినాడని విని గోపికలు దుఃఖమును పొందిరి.
కాశ్చిత్తత్కృతహృత్తాపశ్వాసమ్లానముఖశ్రియః । స్రంసద్దుకూలవలయ కేశగ్రంథ్యశ్చ కాశ్చన ॥
ఆ వార్త విని కొందరు గోపికలకు హృదయతాపము కలిగి దాని వలన కలిగిన వేడి నిట్టూర్పులకు ముఖకాంతి వాడిపోయెను. మరికొందరు గోపికలకు వస్త్రములు, కంకణములు, జుట్టు ముడులు జారిపోయెను.
ఆన్యాశ్చ తదనుధ్యాననివృత్తాశేషవృత్తయః । నాభ్యజానన్నిమం లోకమాత్మలోకం గతా ఇవ ॥
ఆ శ్రీకృష్ణుని ధ్యానముచే మరి కొందరు గోపికలకు ఇంద్రియ వ్యాపారములన్నీ తొలగిపోయెను. వారికి ఆత్మసాక్షాత్కారమును పొందిన యోగులకు వలె దేహస్పృహ, ఈ లోకము యొక్క జ్ఞానము లేకుండెను.
స్మరంత్యశ్చాపరాశ్శౌరేరనురాగస్మి తేరితాః । హృదిస్పృశశ్చిత్రపదా గీరస్సంముముహుః స్త్రియః ॥
మరి కొందరు గోపికలు శ్రీకృష్ణుడు ప్రేమతో కూడిన చిరునవ్వుతో పలికిన పలుకులను గుర్తు చేసుకొని మోహమును పొందిరి. చిత్రమగు (అబ్బురపరచే) పదములు గల ఆ పలుకులు వారి హృదయములను స్పృశించినవి.
గతిం సులలితాం చేష్టాం స్నిగ్ధహాసావలోకనమ్ । శోకాపహాని నర్మాణి ప్రోద్దామచరితాని చ ॥
చింతయంత్యో ముకుందస్య భీతా విరహకాతరాః । సమేతాస్సంఘశః ప్రోచురశ్రుముఖ్యోఽచ్యుతాశయాః ॥
మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని మిక్కిలి అందమైన నడకను, చేష్టను,ప్రేమ నిండిన చిరునవ్వుతో కూడిన చూపును, దుఃఖమును బాపే పరిహాస వచనములను, చాల గొప్ప లీలలను కూడ ధ్యానించే గోపికలు ఆయన దూరమగునేమో అనే భయముతో విరహముతో వ్యాకులపడిరి.
ముఖముపై కన్నీళ్లు, హృదయములో శ్రీకృష్ణ భగవానుడు గల గోపికలు గుంపుగా గుమిగూడి ఇట్లు పలికిరి.
గోప్య ఊచుః ।
అహో విధాతస్తవ న క్వచిద్దయా సంయోజ్య మైత్యా ప్రణయేన దేహినః । తాంశ్చాకృతార్థాన్ వియునంక్ష్య పార్థకం విక్రీడితం తేఽర్భకచేష్టితం యథా ॥
గోపికలిట్లు పలికిరి --- అయ్యో! ఓ బ్రహ్మదేవుడా। నీకు ఏ కాలమునందైననూ దయ లేదు. నీవు ప్రాణులను మైత్రితో, ప్రేమతో కలిపి వారి మనోరథములు సిద్ధించ కుండగనే వారిని విడదీ సెదవు. నీ చేష్ట పిల్లవాని చేష్ట, వలె నిరర్ధకము.
యస్త్వం ప్రదర్శ్యాసితకుంతలావృతం ముకుందవక్త్రం సుకపోలమున్నసమ్ । శోకాపనోదస్మితలేశసుందరం కరోషి పారోక్ష్యమసాధు తే కృతమ్ ॥
ఏలయన, నీవు మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణ భగవానుని ముఖమును చూపించి మరల కనబడకుండా చేయుచున్నావు. నల్లని ముంగురులతో ఆవరించబడియుండే ఆయన ముఖము చక్కని చెక్కిళ్లతో, ఎత్తైన ముక్కుతో, అందమైన చిరునవ్వుతో శోకమును పోగొట్టును. నీవు దుష్టులు చేసే పనిని చేయుచున్నావు.
క్రూరస్త్వమక్రూరసమాఖ్యయా స్మ నశ్చక్షుర్హి దత్తం హరసే బతాజ్ఞవత్, యేనైక దేశేఽఖిలసర్గసౌష్ఠవం త్వదీయమద్రాక్ష్మ వయం మధుద్విషః ।
అయ్యో। నీవు అక్రూరుడనే పేరుతోనున్న క్రూరుడవు. ఎందుకంటే, చూపును ఇచ్చిన నీవే చూపును అపహరించుచున్నావు. మేష చూపుతో నీ సకలసృష్టి నైపుణ్యమును మధువనే రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణ భగవానుని ముఖము, కన్ను మొదలైన ఒకే అవయవములో చూచెడివారము.
న నందసూనుః క్షణభంగసౌహృదస్సమీక్షతే నస్స్వకృతాతురా బత, విహాయ గేహాన్ స్వజనాన్ సుతాన్పతీంస్తద్దాస్యమద్ధోపగతా నవప్రియః.
ఇళ్లు, బంధువులు, పుత్రులు, భర్తలను విడిచి పెట్టి మేము సాక్షాత్తుగా శ్రీకృష్ణుని దాస్యమును స్వీకరించితిమి. అయ్యో! కొత్త వారిపై ప్రేమ గల ఆ నందుని పుత్రుడు తన చేష్టలతో మమ్ములను పరవశులను చేసి ఆపై మా కేసి చూచుట మానివేసినాడు. ఆతని ప్రేమ క్షణభంగురము.
సుఖంప్రభాతా రజనీయమాశిషః సత్యా బభూవుః పురయోషితాం ధ్రువమ్ । యాస్సంప్రవిష్టస్య ముఖం వ్రజస్పతేః పాస్యంత్యపాంగోత్కలితస్మితాసవమ్ ॥
మధురానగర యువతులకీ రాత్రి శుభోదయమగును. మనోరథములు యథార్థములైనవి. ఎందుకంటే, గోకులప్రభుడగు శ్రీకృష్ణుడు వారి నగరములో ప్రవేశించును. వారు కనుకొలుకులచే ఉజ్జ్వలముగా చేయబడిన చిరునవ్వు అనే మద్యము గల గల ఆతని ముఖమును (కన్నులతో) పానము చేయబోవుచున్నారు.
తాసాం ముకుందో మధుమంజుభాషి తైః గృహీతచిత్తః పరవాన్మనస్వ్యపి । కథం పునర్నః ప్రతియాస్యతేఽబలా గ్రామ్యాస్సలజ్జస్మితవిభ్రమైర్భ్రమన్ ॥
ఓ అబలలారా! శ్రీకృష్ణుడు ధీరుడే అయినా ఇతరుల అధీనములో నుండును. ఆ నగరయువతుల తేనె వంటి తియ్యని పలుకులకు ఆతని మనస్సు ఆకర్షించబడును. వారి సిగ్గుతో కూడిన చిరునవ్వు యొక్క విలాసలచే ఆతడు అంతా మరచి పోవును. అట్టివాడు మరల తిరిగి మనవద్దకు ఎట్లు వచ్చును? మనము పల్లెటూరివారము గదా!
అద్య ధ్రువం తత్ర దృశో భవిష్యతే దాశార్హభోజాంధకవృష్ణి సాత్వతామ్ । మహోత్సవశ్శ్రీరమణం గుణాస్పదం ద్రక్ష్యంతి యే చాధ్వని దేవకీసుతమ్ ॥
ఈనాడు ఆ మథురానగరములోని దాశార్హ భోజ అంధక వృష్టి సాత్వత వంశీయుల కన్నులకు గొప్ప ఉత్సవమే కలుగగలదు. వారు లక్ష్మిని రమింపజేసే శ్రీకృష్ణుని చూడగలరు. దారిలోనున్న జనులు కూడ సద్గుణనిధానమగు ఆ దేవకీనందనుని చూడగలరు.
మైతద్విధస్యాకరుణస్య నామ భూత్ అక్రూర ఇత్యేతదతీవ దారుణః । యోఽసావనాశ్వాస్య సుదుఃఖితం జనం ప్రియాత్ప్రియం నేష్యతి పారమధ్వనః ॥
ఇటువంటి చేష్ట కలిగి దయ లేని ఈ వ్యక్తికి అక్రూరుడనే ఈ పేరు ఉండరాదు. ఈతడు మిక్కిలి క్రూరుడు. ఎందుకంటే, ఈతడు దుఃఖించుచున్న మనలను ఓదార్చకుండా, ప్రాణములకంటె ప్రియుడగు శ్రీకృష్ణుని మార్గము యొక్క అంతము వరకు తీసుకొని పోవును.
అనార్ద్రధీ రేష సమాస్థితో రథం తమన్వమీ చ త్వరయంతి దుర్మదాః,
గోపా అనోభిః స్థవిరైరు పేక్షితం దైవం చ నోఽద్య ప్రతికూలమీహతే
ఈ శ్రీకృష్ణుని మనస్సులో ప్రేమ లేదు. అప్పుడే రథమునెక్కి కూర్చున్నాడు. పొగరెక్కిన ఈ గోపాలకులు కూడ బళ్లను సిద్ధం చేసుకొని ఆతని వెంటబడి తొందర పెట్టుచున్నారు. పెద్దలు పట్టనట్లు మిన్నకున్నారు.
ఈనాడు దైవము కూడ మనకు విరుద్ధముగా ఆచరించుచున్నది.
నివారయామస్సము పేత్య మాధవం కిం నోఽకరిష్యన్ కులవృద్ధబాంధవాః । ముకుందసంగాన్నిమిషార్ధదుస్త్యజాత్ దైవేన విధ్వంసితదీన చేతసామ్ ॥
మనము కట్టు కట్టుకొని లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుడు వెళ్లకుండా అడ్డుకొనెదము. మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణ భగవానుని సంగమును అర నిముషమైననూ విడిచి పెట్టుట దుర్ఘటము. కాని, దైవము మనలకు, మనకట్టి వియోగమును కలిగించినది. దీనమైన మనస్సులు గల మనలను కులములోని పెద్దలు, బంధువులు ఏమి చేయుదురు?
యస్యానురాగలలితస్మితవల్గుమంత్ర - లీలావలోకపరిరంభణ రాసగోష్ఠ్యామ్ । నీతాస్స్మ నః క్షణమివ క్షణదా వినా తం గోప్యః కథం స్వతిత రేమ తమో దురంతమ్ ॥
ఓ గోపికలారా! రాసక్రీడయందు శ్రీకృష్ణుడు ప్రేమతో కూడిన సుందరమైన చిరునవ్వు నవ్వుతూ విలాసముగా చూస్తూ మనోహరమైన రహస్య సంభాషణములను చేస్తూ కౌగిలించెడివాడు. మనమెన్నో రాత్రులను క్షణము వలె గడిపి వేసితిమి. అట్టి కృష్ణుడు లేకుండా అంతులేని విరహదుఃఖమును మనమెట్లు అతిక్రమించవలెను?
య్యోహ్నః క్షయే వ్రజమనంతసఖః పరీతో గో పైర్విశన్ ఖురరజ శ్ఛురీతాలకస్రక్ । వేణుం క్వణన్ స్మితకటాక్ష నిరీక్షణేన చిత్తం క్షిణాత్యముమృతే ను కథం భవేమ ॥
శ్రీకృష్ణుడు బలరాముడు గోపు బాలకులు చుట్టువారియుండ సాయంకాలమునందు వేణువును వాయిస్తూ గోకులమును ప్రవేశించును. ఆయన ముంగురులు, వనమాల గోవుల గిట్టలనుండి లేచే దుమ్ముతో బూడిద రంగును కలిగియుండును. ఆయన చిరునవ్వుతో ఓరచూపులు చూస్తూ మన మనస్సును దోచివేయును. అట్టి ఈ శ్రీకృష్ణుడు లేకుండా మనమెట్లు మనగల్గుదుము ?
శ్రీశుక ఉవాచ ।
ఏవం బ్రువాణా విరహాతురా భృశం వ్రజస్త్రియః కృష్ణ విషక్తమానసాః, విసృజ్య లజ్జాం రురుదుస్స్మ సుస్వరం గోవింద దామోదర మాధవేతి.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- గోకులమునందలి గోపికలు శ్రీకృష్ణుని (కలుగబోయే) విరహముచే అధికమగు పీడను పొందిరి. వారి మనస్సు శ్రీకృష్ణునియందే విశేషముగా లగ్నమై యుండెను. వారు సిగ్గును విడిచి ఈ విధముగా పలుకుతూ, ఓ గోవిందా! ఓ దామోదరా! ఓ మాధవా! అంటూ మధురమైన స్వరముతో ఏడ్చిరి.
స్త్రీణా మేవం రుదంతీనాముదితే సవితర్యథ । అక్రూరశ్చోదయామాస కృతమైత్రాదికో రథమ్ ॥
గోపికలే విధముగా ఏడ్చుచుండగనే సూర్యుడు ఉదయించెను. తరువాత అక్రూరుడు మిత్రదేవతాకమైన ప్రాతస్సంధ్యను చేసుకొని, రథమును ముందుకు నడి పెను.
గోపాస్తమన్వసజ్జంత నందాద్యాశ్శకటైస్తతః । ఆదాయోపాయనం భూరి కుంభాన్ గోరస సంభృతాన్ ॥
తరువాత (ఆ గోకులమునుండి) ఆ శ్రీకృష్ణుని వెనుక నందుడు, సునందుడు మొదలగు గోపాలకులు బళ్లపై వెళ్లిరి. వారు అనేక బహుమతులను, ఆవు పాలు మొదలగువాటిని నింపిన కడవలను తీసుకు వెళ్లిరి.
గోప్యశ్చ దయితం కృష్ణమనువ్రజ్యానురంజితాః । ప్రత్యాదేశం భగవతః కాంక్షంత్యశ్చావతస్థిరే ॥
అనురాగవతులగు గోపికలు కూడ ప్రియుడగు శ్రీకృష్ణుని వెనుక వెళ్లిరి. ఆయనచే వారించబడి వారు ఆయన సందేశము కొరకు ఎదురు చూస్తూ ఉండిపోయిరి.
తాస్తథా తప్యతీర్వీక్ష్య స్వప్రస్థానే యదూత్తమః । సాంత్వయామాస సప్రేమైరాయాస్య ఇతి దౌత్య కైః ॥
తన ప్రయాణము విషయములో ఆ విధముగా దుఃఖించుచున్న గోపికలను యదువంశశిరోమణియగు శ్రీకృష్ణుడు చూచెను. నేను తిరిగి వచ్చెదను, ఆని ఆయన దూత ద్వారా ప్రేమ సందేశమును పంపి వారిని ఓదార్చెను.
యావదాలక్ష్యతే కేతుర్యావద్రేణూ రథస్య చ । అనుప్రస్థాపితాత్మానో లేఖ్యానీవోపలక్షితాః ॥
ఎంతవరకైతే రథము జెండా కొంచెమైననూ కనబడెనో, రథము యొక్క ధూళి కనబడెనో, అంతవరకు గోపికలు నిలబడి చూచిరి. వారు తమ మనస్సులను శ్రీకృష్ణునితో బాటే పంపివేసి చిత్రపటముల వలె నిలబడిరి.
తా నిరాశా నివవృతుర్గోవిందవినివర్తనే । విశోకా అహనీ నిన్యుర్గాయంత్యః ప్రియచేష్టితమ్ ॥
ఆ గోపికలకు గోవిందుడు వెనుకకు మరలి వచ్చుననే ఆశ తొలగిపోయి వారు వెను దిరిగిరి. వారు రాత్రింబగళ్లు ప్రియుడగు శ్రీకృష్ణుని లీలలను గానము చేస్తూ దుఃఖమును మరచి గడిపిరి.
భగవానపి సంప్రాప్తో రామాక్రూరయుతో నృప । రథేన వాయువే గేన కాలిందీమఘనాశినీమ్ ॥
బలరాముడు, అక్రూరులతో గూడి శ్రీకృష్ణ భగవానుడు వాయు వేగముతో నడిచే రథము పై పాపములను వినాశము చేసే యమునా నదిని చేరెను.
తత్రోపస్పృశ్య పానీయం పీత్వా మృష్టం మణిప్రభమ్ । వృక్షషండముపవ్రజ్య సరామో రథమావిశత్ ॥
బలరామకృష్ణులు మణి వలె స్వచ్ఛము, తియ్యనిది అగు యమునానది యొక్క నీటితో ముఖమును, చేతులను, కాళ్లను కడుగుకొని, నీటిని త్రాగి, తిరిగి వచ్చి చెట్ల గుంపులో ఆగిన రథమునెక్కిరి.
అక్రూరస్తావుపామంత్ర్య నివేశ్య చ రథోపరి । కాలింద్యా హ్రదమాగత్య స్నానం విధివదాచరత్ ॥
అక్రూరుడు వారిరువురిని రథము పై కూర్చుండబెట్టి వారి అనుమతితో యమునానది యొక్క సరస్సునకు వచ్చి యథావిధిగా స్నానము చేసెను.
నిమజ్జ్య తస్మిన్ సలిలే జపన్ బ్రహ్మ సనాతనమ్ । తావేవ దదృశేఽక్రూరో రామకృష్ణౌ సమన్వితౌ ॥
అక్రూరుడు ఆ నీటిలో మునిగి కాలపరిచ్ఛేదము లేని గాయత్రీ మంత్రమును జపించుచుండెను. అచట ఆయనకు కలిసి ఉన్న బలరామకృష్ణులే కనబడిరి.
తౌ రథస్థౌ కథమిహ సుతావానకదుందుభేః । తర్హి స్విత్స్యందనే న స్త ఇత్యున్మజ్జ్య వ్యచష్ట సః ॥
వసుదేవుని పుత్రులగు బలరామకృష్ణులు ఇక్కడకు ఎట్లు వచ్చిరి ? అయితే రథమునందు ఉండరు, అని తలచి ఆ అక్రూరుడు నీటినుండి తలను పైకెత్తి చూచెను.
తత్రాపి చ యథాపూర్వమాసీనౌ పున రేవ సః । న్యమజ్జదర్శనం యన్మే మృషా కిం సలిలే తయోః ॥
ఆ రథమునందు కూడ వారిద్దరు ముందులో వలెనే కూర్చుని యుండిరి. ఐతే నేను నీటిలో వారిని చూచినది మిథ్యయా? అనుకుంటూ ఆ అక్రూరుడు మరల నీటిలో మునిగెను.
భూయస్తత్రాపి సోఽద్రాక్షీత్ స్తూయమానమహీశ్వరమ్ ! సిద్ధచారణగంధర్వైరసురైర్నతకంధరైః ॥
ఆ అక్రూరునకు మరల అచట నీటిలో నాగనాయకుడగు ఆదిశేషుడు కనబడెను. ఆయనను సిద్ధులు, చారణులు, గంధర్వులు, అసురులు (ప్రహ్లాదుడు మొదలగువారు) మెడలు వంచి స్తుతించుచుండిరి.
సహస్రశిరసం దేవం సహస్రఫణమౌలినమ్ । నీలాంబరం బిస శ్వేతం శృంగైశ్శ్వేతమివ స్థితమ్ ॥
ఆ శేషదేవుడు వేయి పడగలను కలిగియుండెను. ప్రతి పడగపై బంగరు కిరీటమును ధరించి బంగరు శిఖరములు గల మేరు పర్వతము వలె నుండెను. తామరతూడువలె తెల్లని ఆయన నల్లని వస్త్రమును ధరించెను.
తస్యోత్సంగే ఘనశ్యామం పీతకౌశేయవాససమ్ । పురుషం చతుర్భుజం శాంతం పద్మపత్రారుణేక్షణమ్ ॥
అక్రూరుడు ఆ శేషుని కుండలాకారపు అర్ధదేహము పై పద్మపత్రము వలె ఎర్రనైన కన్నులు గల శ్రీమహావిష్ణువును చూచెను. మేఘము వలె నల్లని ఆయన పచ్చని పట్టు వస్త్రమును దాల్చెను. నాలుగు చేతులు గల ఆయన ప్రసన్నముగా నుండెను.
చారు ప్రసన్నవదనం చారుహాసనిరీక్షణమ్ । సుభ్రూన్నసం చారుకర్ణం సుకపోలారుణాధరమ్ ॥
ఆ పురుషోత్తముడు ప్రసన్నసుందరమగు ముఖమును, అందమైన నవ్వుతో కూడిన చూపును, అందమైన కనుబొమలను, ఎత్తైన ముక్కును, అందమైన చెవులను, అందమైన చెక్కిళ్లను, ఎర్రని క్రింది పెదవిని కలిగియుండెను.
ప్రలంబపీ వరభుజం తుంగాంసోరఃస్థలశ్రియమ్ । కంబుకంఠం నిమ్ననాభిం వలిమత్పల్లవోదరమ్ ॥
ఆయన చేతులు పొడవుగా బలముగా నుండెను. ఎత్తైన భుజస్కంధములతో శోభిల్లే వక్షఃస్థలము పై ఆయన లక్ష్మి (రేఖ) ని కలిగియుండెను. శంఖము వంటి కంఠముతో, లోతైన నాభితో, మూడు ముడుతలు కలిగి రావియాకుని పోలిన ఉదరముతో ఆయన శోభిల్లెను.
బృహత్కటితట శ్రోణికర భోరుద్వయాన్వితమ్ చారుజానుయుగం చారుజంఘాయుగలసంయుతమ్ ॥
ఆయన విశాలమైన నడుమును, పిరుదులను, ఏనుగు తొండము వంటి తొడలను, అందమైన మోకాళ్లను, అందమైన పిక్కలను కలిగియుండెను.
తుంగగుల్ఫారుణనఖ వ్రాత దీధితిభిర్వృతమ్ । నవాంగుల్యంగుష్ఠదలైర్విలసత్పాదపంకజమ్ ॥
ఆయన చీలమండలు ఎత్తుగనుండెను. గోటి వేళ్ల సమూహము కాంతులను విరజిమ్మెను. పాదములు పద్మములను, కోమలమైన వ్రేళ్లు బొటనవ్రేళ్లు పద్మపత్రములను పోలి ప్రకాశించెను.
సుమహార్హమణి వ్రాత కిరీటకటకాంగదైః । కటిసూత్రబ్రహ్మసూత్రహారనూపురకుండలైః ॥
భ్రాజమానం పద్మకరం శంఖచక్రగదాధరమ్ । శ్రీవత్సవక్షసం భ్రాజత్కౌస్తుభం వనమాలినమ్ ॥
ఆయన మిక్కిలి విలువైన మణుల సమూహములు పొదిగిన కిరీటమును, కంకణములను, భుజపురులను ధరించెను. ఆయన ప్రకాశించే మొలనూలును, యజోపవీతమును, కాలి యందెలను, కుండలములను కలిగియుండెను. ఆయన చేతులలో పద్మమును, శంఖమును, చక్రమును, గదను ధరించెను. ఆయన వక్షఃస్థలము పై శ్రీవత్సమనే పుట్టుమచ్చ, మెడలో కౌస్తుభమాణిక్యము, వనమాల ప్రకాశించుచుండెను.
సునందనందప్రముఖైః పార్షదైస్సనకాదిభిః । సురేశైర్బ్రహ్మరుద్రాద్యైర్నవభిశ్చ ద్విజోత్త మైః ॥
ప్రహోదనారదవసుప్రముఖైర్భాగవతోత్త మైః । స్తూయమానం పృథగ్భా వైర్వచోభిరమలాత్మభిః ॥
నిర్మలమైన అంతః కరణములు గల సునందుడు, నందుడు మొదలుగా గల అనుచరులు ప్రభుభావముతో హరిని స్తుతించుచుండిరి. సనకుడు, సనందనుడు మొదలగు యోగులు పరబ్రహ్మభావముతో స్తుతించుచుండిరి. బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలుగా గల దేవనాయుకులు సర్వేశ్వరుడనే భావముతో స్తుతించిరి, మరీచి, అత్రి, అంగిరసుడు. పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వసిష్ఠుడు, దక్షుడు అనే తొమ్మండుగురు ప్రజాపతులు మరియు ప్రహ్లాదుడు, నారదుడు, ఉపరిచరవసువు మొదలగు భగవానుని భక్తశిఖామణులు ఆత్మబంధువునుగను, ఈ విధముగా వేర్వేరు భావములను ప్రకటించే వచనములతో స్తుతించుచుండిరి.
శ్రియా పుష్ట్యా గిరా కాంత్యా కీర్త్యా తుష్ట్యేలయోర్జయా । విద్యయాఽవిద్యయా శక్త్యా మాయయా చ నిషేవితమ్ ॥
సంపద, పుష్టి, వాక్కు, కాంతి, కీర్తి, తుష్టి, భూమి, ఊర్జ (సామర్థ్యము), విద్య, అవిద్య, చిచ్ఛక్తి, మాయాశక్తి కూడ రూపు దాల్చి అ శ్రీహరిని సేవించుచుండెను.
విలోక్య సుభృశం ప్రీతో భక్త్యా పరమయా యుతః । హృష్యత్తనూరుహో భావపరిక్లిన్నాత్మలోచనః ॥
శ్రీహరిని చూచిన అక్రూరునకు అతిశయమగు ప్రీతి, ఉత్కృష్టమగు (నిష్కామ) భక్తి కలిగెను. ఆయనకు రోమాంచము కలిగెను. హృదయము భక్తిభావముతో ఆర్ద్రము కాగా, కన్నులయందు నీరు తీరిగెను.
గిరా గద్గదయాఽస్తౌషీత్సత్త్వమాలంబ్య సాత్వతః । ప్రణమ్య మూర్ధ్నాఽవహితః కృతాంజలిపుటశ్శనైః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే
పూర్వార్ధే ఏకోసచత్వారింశోఽధ్యాయః ॥
యదువంశీయుడు, సత్త్వగుణ ప్రధానుడు అగు అక్రూరుడు ధైర్యము తెచ్చుకొని తల వంచి దోసిలి యొగ్గి సమస్కరించెను. ఆయన ఏకాగ్రమగు చిత్తముతో బొంగురు వోయిన వాక్కుతో మెల్లగా శ్రీకృష్ణ భగవానుని స్తుతించెను.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో అక్రూరుడు
బలరామకృష్ణులను గోకులమునుండి తీసుకు వెళ్లుటను వర్ణించే
ముప్పది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (39).
Summary of chapter 39 of the Bhāgavata Mahā Purana is as follows:
Kṛshṇa and Balarāma welcomed Akrūra with warm hospitality, washing his feet and serving him a feast. Akrūra disclosed Kaṁsa's evil plot, the imprisonment of Vasudeva and Devakī, and the invitation to the bow sacrifice. Kṛshṇa agreed to travel to Mathurā the next morning. Hearing of Kṛshṇa's imminent departure, the gopīs of Vṛndāvana were plunged into catastrophic grief (*Viraha*), weeping bitterly and cursing Lord Brahmā for creating eyes that blink and separation that cuts their hearts. As Akrūra's chariot departed at dawn, Kṛshṇa sent a message promising the weeping gopīs that He would return. Stopping at the Yamunā River to perform afternoon prayers, Akrūra submerged himself in the water and was astonished to behold Kṛshṇa and Balarāma sitting underwater, manifested as four-armed Vishṇu and Ananta Śesha worshipped by all the devatās.