భాగవత మహా పురాణము
42 - శ్రీకృష్ణుడు కుబ్జను అనుగ్రహించి ధనుర్భంగమును చేయుట
శ్రీశుక ఉవాచ।
అథ వ్రజన్ రాజపథేన మాధవః స్త్రియం గృహీతాంగవి లేపభాజనామ్। విలోక్య కుబ్జాం యుపతీం వరాననాం పప్రచ్ఛ యాంతు ప్రహసన్ రసప్రదః ॥
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- సుదాముని అనుగ్రహించిన పిదప శ్రీకృష్ణ భగవానుడు రాజమార్గము గుండా వెళ్లుచుండెను. ప్రేమునిచ్చే ఆయనకు చందననిలేపనమున్న పాత్రను పట్టుకొని వెళ్తూ ఒక యువతి కనబడెను. ఆమె అందమైన ముఖము కలదియే అయినా గూనిది. ఆయన నవ్వుతూ ఆమెనిట్లడిగెను.
కా త్వం వరోర్వేతదు హానులేపనం కస్యాంగనే వా కథయస్వ సాధు నః । దేహ్యావ యోరంగవిలేపముత్తమం శ్రేయస్తతస్తే న చిరాద్భవిష్యతి ॥
ఓ సుందరీ! నీవెవ తెవు? యువతీ! ఈ చందన లేపనమెవనికి చెప్పుమా! మాకు సత్యమును చెప్పుము. మా ఇద్దరికి ఉత్తమమగు అంగ లేపమునిమ్ము. ఆ ఇచ్చుట వలన నీకు తొందరలో హితము కలుగగలదు.
సైరంధ్యువాచ ।
దాస్యస్మ్యహం సుందర కంససమ్మతా త్రివక్రనామా హ్యనులేపకర్మణి మద్భావితం భోజపతేరతిప్రియం వినా యువాం కోఽన్యతమస్తదర్హతి
సైరంధీ ఇట్లు పలికెను --- ఓ సుందరుడా! నేను త్రివక్ర (మూడు వంకరలు గలది) అనే సార్థక నామము గల దాసీని. కంసుడు నన్ను అంగలేపమును చేసే పనియందు స్వీకరించినాడు. నేను చేసిన అంగలేపము ఆ భోజప్రభునకు ఇష్టము. మీ ఇద్దరిని మినహాయిస్తే దీనికి తగవాడు మరియొకడెవడు గలడు? (ఎవడూ లేడు).
రూప పేశలమాధుర్యహసితాలాపవీక్షి తైః । ధర్షితాత్మా దదౌ సాంద్రముభయోరనులేపనమ్ ॥
శ్రీకృష్ణుని సౌందర్యము, సౌకుమార్యము, సహృదయత, నవ్వు, పలుకులచే సైగండ్రి మనస్సు మోహమును పొందెను. ఆమె వారిద్దరికి అంగరాగపు ముద్దను ఇచ్చెను.
తతస్తావంగరాగేణ స్వవర్ణేతరశోభినా । సంప్రాప్తాపరభాగేన శుశుభాతేఽనురంజితౌ ॥
తరువాత వారిద్దరు తమ దేహము యొక్క రంగుకంటే భిన్నమైన అంగలేపనమును తీసుకొని నాభికి పైభాగమునందు అలదుకొనిరి. దానిచే వారిద్దరు శోభిల్లిరి.
ప్రసన్నో భగవాన్ కుబ్జాం త్రివక్రాం రుచిరాననామ్ ! ఋజ్వీం కర్తుం మనశ్చక్రే దర్శయన్ దర్శనే ఫలమ్ ॥
ప్రసన్నుడైన శ్రీకృష్ణ భగవానుడు తనను దర్శించినందులకు ఫలమును ఆమెకు చూపదలచెను. గూనిదే, అయిననూ, అందమైన మోము గల ఆమెను తిన్నని వ్యక్తిగా చేయాలని ఆయన సంకల్పించెను.
పద్భ్యామాక్రమ్య ప్రపదే ద్వ్యంగుల్యుత్తానపాణినా ! ప్రగృహ్య చిబుకేఽధ్యాత్మముదనీనమదచ్యుతః ॥
శ్రీకృష్ణ భగవానుడు ఆ రెండు పాదముల కొనలపై తన పాదములను వేసి నొక్కి పెట్టెను. రెండు వేళ్లను ఎత్తుగా పెట్టి చేతితో ఆమె గెడ్డమును పట్టుకొని శరీరమును పైకి యెత్తెను.
సా తదర్జుసమానాంగీ బృహచ్ఛ్రోణిపయోధరా । ముకుందస్పర్శనాత్సద్యో బభూవ ప్రమదోత్తమా ॥
ఆమె దేహము శ్రీకృష్ణ భగవానుని స్పర్శచే అప్పుడు వెంటనే తిన్నగా సమానముగా ఆయెను. ఆమె విశాలమైన కటిభాగము, వక్షఃస్థలముతో అందమైన యువతులలో ఉత్తమురాలు ఆయెను.
తతో రూపగుణౌదార్యసంపన్నా ప్రాహ కేశవమ్ । ఉత్తరీయాంతమాకృష్య స్మయంతీ జాతహృచ్ఛయా ॥
అప్పుడు రూపము, సద్గుణములు, ఔదార్యములతో నిండియున్న ఆ సైరంధ్రికి హృదయములో ప్రేమ కలిగెను. ఆమె చిరునవ్వుతో శ్రీకృష్ణ భగవానుని ఉత్తరీయపు కొంగును లాగి ఇట్లు పలికెను.
ఏహి వీర గృహం యామో న త్వాం త్యక్తుమిహోత్స హే । త్వయోన్మథితచిత్తాయాః ప్రసీద పురుషర్షభ ॥
ఓ వీరుడా! రమ్ము, ఇంటికి వెళ్లేదము. నిన్ను ఇక్కడనే విడిచి పెట్టుట నా వల్ల కాదు. నీవు నా మనస్సును కలిచివేసితివి. ఓ పురుష శ్రేష్ఠా! నా పై అనుగ్రహమును చూపుము.
ఏవం స్త్రియా యాచ్యమానః కృష్ణో రామస్య పశ్యతః । ముఖం వీక్ష్యానుగానాం చ ప్రహసంస్తామువాచ హ ॥
ఆ యువతి ఈ విధముగా కోరుచుండ బలరాముడు చూచుచుండెను. శ్రీకృష్ణుడు అనుచరుల ముఖమును చూచి నవ్వుతూ ఆమెతో నిట్లనెను.
ఏష్యామి తే గృహం సుభ్రూః పుంసామాధివికర్శనమ్ । సాధితార్థోఽగృహాణాం నః పాంథానాం త్వం పరాయణమ్ ॥
ఓ సుందరీ! నేను వచ్చిన పని పూర్తి చేసుకొని నీ ఇంటికి వచ్చేదను. వ్యక్తి యొక్క మనోవ్యాధిని నీ యిల్లు కృశింపజేయును. మేము ఇల్లు బాటసారులము. మాకు నీవు గొప్ప ఆశ్రయము.
విసృజ్య మాధ్వ్యా వాణ్యా తాం ప్రజన్మార్గో వణిక్ప థైః । నానోపాయనతాంబూల స్రగ్ధం ధైస్సాగ్రజోకర్చితః ॥
శ్రీకృష్ణుడు తియ్యని మాటను చెప్పి ఆమెను పంపివేసెను. మార్గములో వెళ్లుచున్న ఆయనను, అన్నగారిని బజారు వీథిలోని వర్తకులు బహుమతులు, తాంబూలము, మాలలు, గంధములతో పూజించిరి.
తద్దర్శనస్మరక్షోభాదాత్మానం నావిదన్ స్త్రియః । విగ్రస్తవాసఃకబరవలయాలేఖ్యమూర్తయః ॥
ఆదున దర్శనము వలన స్త్రీలకు హృదయములో అనురాగావేశముచే దేహస్పృహ లేకుండెను. వారి వస్త్రములు, జుట్టుముడులు, కంకణములు జారిపోయెను. వారు చిత్రపటమునందలి బొమ్మలవలె నిలబడిరి.
తతః పౌరాన్ పృచ్ఛమానో ధనుషః స్థానమచ్యుతః । తస్మిస్ ప్రవిష్టో దదృశే ధనురైం ద్రమివాద్భుతమ్ ॥
తరువాత శ్రీకృష్ణ భగవానుడు ధనుర్యాగము జరుగుచున్న చోటును గురించి పురజనులను అడుగుతూ ఆ చోటికి చేరెను. అచట ఆయనకు ఇంద్రధనుస్సు వలె అచ్చెరువును గొలిపే ధనుస్సు కనబడెను.
పురు షైర్బహుభిర్గుప్త మర్చితం పరమర్ ద్ధిమత్ । వార్యమాణో నృభిః కృష్ణః ప్రసహ్య ధనురాదదే ॥
పూజించబడిన ఆ ధనుస్సును అనేకరక్షకభటులు కాపలా కాయుచుండిరి. బంగరు ఆభరణములచే అలంకరించబడిన ఆ ధనుస్సు గొప్ప సమృద్ధి, బరువు గలది. శ్రీకృష్ణుడు, రక్షకభటులు అడ్డుకున్నా బలాత్కారముగా దానిని చేతిలో దీనికి తీసుకొనెను.
కరేణ నామేన సలీల ముద్ధృతం సజ్యం చ కృత్వా నిమిషేణ పశ్యతామ్ ।
నృణాం వికృష్య ప్రబభంజ మధ్యతో యథేక్షుదండం మదకర్యురుక్రమః ॥
గొప్ప పరాక్రమము గల శ్రీకృష్ణుడు ఎడమ చేతితో ఆ ధనుస్సును అవలీలగా పైకెత్తి నారిత్రాడును తగిల్చెను. భటులు చూస్తుండగానే రెప్పపాటు కాలములో ఆయన దానిని లాగి, మదించిన ఏనుగు చెరుకు గడను వలె, మధ్యలో విరిచెను.
ధనుషో భజ్యమానస్య శబ్దః ఖం రోదసీ దిశః । పూరయామాస యం శ్రుత్వా కంసస్త్రాసముపాగమత్ ॥
ఆ ధనుస్సును విరుచుచుండగా బయలుదేరిస శబ్దము ఆకాశమును, ద్యులోకభూలోకములను, దిక్కులను నింపివేసెను. ఆ ధ్వనిని విని కంసుడు హడలిపోయెను.
తద్రక్షిణస్సాసుచరాః కుపితా ఆతతాయినః । గ్రహీతుకామా ఆవవ్రుర్గృహ్యతాం బధ్యతామితి ॥
ఆ ధనుస్సును రక్షించే భటులకు, వారి అనుచరులకు కోపము వచ్చెను. వారు ఆయనను పట్టుకొనగోరి ఆయుధములను పట్టుకొని, పట్టుకొనుడు, బంధించుడు, అంటూ ఆయనను చుట్టుముట్టిరి.
అథ తాన్ దురభిప్రాయాన్ విలోక్య బల కేశవౌ ! క్రుద్ధౌ ధన్వస ఆదాయ శకలే తాంశ్చ జఘ్నతుః ॥
అప్పుడు వారి దుష్టమైన అభిప్రాయమును గ్రహించిన బలరాముడు, శ్రీకృష్ణ భగవానుడు కోపించి ధనుస్సు యొక్క ముక్కలను తీసుకొని, వారిని కూడ జాదిరి.
బలం చ కంసప్రహితం హత్వా శాలాముఖాత్తతః ! నిష్క్రమ్య చేరతుర్హృష్టౌ నిరీక్ష్య పురసంపదః ॥
వారు కంసునిచే పంపబడిన సైన్యమును కూడ మట్టుబెట్టిరి. తరువాత అందరు కలిసి యజ్ఞశాల ముఖద్వారమునుండి బయటకు వచ్చి నగరము యొక్క సంపదలను చూసి ఆనందిస్తూ విహరించిరి.
తయోస్తదద్భుతం వీర్యం నిశామ్య పురవాసినః । తేజః ప్రాగల్భ్యం రూపం చ మేనిరే విబుధోత్తమౌ ॥
వారిద్దరి ఆ అద్భుతమగు పరాక్రమమును, తేజస్సును, సాహసమును, రూపమును కూడ చూచి నగరప్రజలు వారిని దేవతా శ్రేష్ఠులని తలపోసిరి.
తయోర్విచరతో స్స్వైరమాదిత్యోఽస్తము పేయివాన్ । కృష్ణ రామౌ వృతౌ గోపైః పురాచ్ఛకటమీయతుః ॥
బలరామకృష్ణులీ విధముగా గోపాలకులతో కలిసి యథేచ్ఛగా సూర్యుడు అస్తమించెను. అపుడు నగరమునుండి బళ్లను ఆపుకున్న ఉద్యానమునకు చేరుకొనిరి.
గోప్యో ముకుందవిగమే విరహాతురా యా ఆశాసతాశిష ఋతా మధుపుర్యభూవన్ ।
సంపశ్యతాం పురుష భూషణగాత్రలక్ష్మీం హిత్వేతరాన్ ను భజతశ్చకమేఽయనం శ్రీః ॥
శ్రీకృష్ణుడు ప్రయాణము చేసిన సమయములో చేసిన సమయములో గోకులములోని గోపికలు ఆయన విరహము వలన పీడను పొంది మథురానగరవాసులను గురించి ఆశీస్సులను పలికిరి. మానవులకే అలంకారమైన శ్రీకృష్ణుని దేహశోభను చూచిన మధురా నగరవాసులకు ఆశీస్సులు సత్యములైనవి. లక్ష్మీదేవి తనను సేవించే ఇంద్రాదులను విడిచి పెట్టి శ్రీకృష్ణుని దేహమునే ఆశ్రయమునుగా కోరెను గదా!
అవనిక్తాంఘియుగలౌ భుక్త్వా క్షీరోప సేచనమ్ । ఊషతుస్తాం సుఖం రాత్రిం జ్ఞాత్వా కంసచికీర్షితమ్ ॥
వారు రెండు కాళ్లను. కడుగుకొని పాలను కలిపిన అన్నమును తినిరి. మరునాడు కంసుడు చేయగోరిన ఉద్యమము గురించి వారికి తెలియును. వారిద్దరు ఆ రాత్రి సుఖముగా విశ్రమించిరి.
కుసస్తు ధనుషో భంగం రక్షిణాం స్వబలస్య చ । వధం నిశమ్య గోవిందరామవిక్రీడితం పరమ్ ॥
గోవింద బలరాములు ధనుస్సును విరుచుటను, రక్షకభటులను తాను పంపిన సైన్యమును కూడ సంహరించుటను, ఈ పనినంతనూ వారు ఒక ఆటవలె చేయుటను గురించి కంసుడైతే వినెను.
దీర్ఘ ప్రజాగరో భీతో దుర్నిమిత్తాని దుర్మతిః । బహూన్యచష్టోభయథా మృత్యోర్దౌత్యకరాణి చ ॥
కంసుడు భయముతో నిద్ర పట్టక చాల సేపు తెలివిగా నుండెను. వానికి తెలివిలో మరియు నిద్రలోని కలలో కూడ అనేకములగు అపశకునములు కనబడి రాబోయే మృత్యువును సూచించెను.
అదర్శనం స్వశిరసః ప్రతిరూపే చ సత్యపి । అసత్యపి ద్వితీయే చ ద్వైరూప్యం జ్యోతిషాం తథా ॥
ఆతడు అద్దములో చూచినప్పుడు ప్రతిబింబము కనబడునే గాని తన తల కనపడదు. మరియు, వస్తువులు రెండుగా కనబడుటకు కారణమైన కళ్లలోని నీరు మొదలైనవి లేకుండానే, చంద్రుడు మొదలగు జ్యోతిర్మండలములు రెండుగా కనబడెను. (జాగ్రదవస్థలోని అపశకునము).
ఛిద్రప్రతీతిశ్ఛాయాయాం ప్రాణ ఘోషానుపశ్రుతిః । స్వర్ణ ప్రతీతిర్వృక్షేషు స్వపదానామదర్శనమ్ ॥
నీడయందు చిల్లు కనబడుట, చెవులను మూసిననూ ప్రాణము యొక్క ఘోష వినబడకపోవుట, చెట్లు బంగరు వర్ణముతో కనబడుట, తన కాళ్లు తనకు కనబడకుండుట (అనే అపశకునములు ఆతనికి జాగ్రదవస్థలో కలిగెను).
స్వప్నే ప్రేతపరిష్వంగః ఖరయానం విషాదనమ్ । యూయాన్నలదమాల్యేక స్తైలాభ్య క్తో దిగంబరః ॥
ఆతనికి కలలో శవమును కౌగిలించుకున్నట్లు విషమును తిన్నట్లు కనబడెను. ఆతడు కలలో వట్టివేళ్ల మాలను ధరించి దేహమునకు నూనె రాసుకొని వస్త్రములు లేకుండా ఒంటరిగా గాడిదపై పయనించెను.
అన్యాని చేత్థంభూతాని స్వప్నజాగరితాని చ । పశ్యన్మరణసంత్రస్తో నిద్రాం లేభే న చింతయా ।
ఈ నిధముగా జాగ్రదవస్థలో మరియు కలలలో కంసునకు ఇటువంటి అపశకునములు కనబడెను. ఆతనికి తాను మరణిస్తాననే భయము పట్టుకొనెను. బెంగతో ఆతనికి నిద్ర కరువయ్యెను.
వ్యుష్టాయాం నిశి కౌరవ్య సూర్యే చాద్భ్యస్సముత్థితే । కారయామాస వై కంసో మల్లక్రీడామహోత్సవమ్ ॥
కురువంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! రాత్రి తెల్లవారెను. సూర్యుడు తూర్పు సముద్రమునుండీ పైకి వచ్చెను. ఆనాడు కంసుడు మల్లయుద్ధక్రీడల పెద్ద ఉత్సవమును నడిపించెను.
ఆనర్చుః పురుషా రంగం తూర్యభేర్యశ్చ జఘ్నిరే ! మంచాశ్చాలంకృతాసగ్భిః పతాకాచైలతోరణైః ॥
రాజపురుషులు క్రీడారంగమునలంకరించిరి. వాద్యములను, దుందుభులను మ్రోగించిరి. పుష్పమాలలు, జెండాలు, వస్త్రములు, మామిడాకుల తోరణములతో కూర్చునే ఆసనములను అలంకరించిరి.
తేషు పౌరా జానపదా బ్రహ్మక్షత్రపురోగమాః । యథోపజోషం వివిశూ రాజానశ్చ కృతాసనాః ॥
వాటిపై నాగరికులు, పల్లెలనుండి వచ్చిన జనులు బ్రాహ్మణులు క్షత్రియులు మొదలైనవారు హాయిగా కూర్చుండిరి. రాజవంశీయులు కూడ ఆసనములను స్వీకరించిరి.
కంసః పరివృతోఽమాత్యై రాజమంచ ఉపావిశత్ । మండలేశ్వరమధ్యస్థో హృదయేన విదూయతా ॥
కంసుడు తాపముతో నిండిన హృదయముతో రాజసింహాసనముపై కూర్చుండెను. ఆతని చుట్టూ అమాత్యులు, మండలాధిపతులు ఉండిరి.
వాద్యమానేషు తూర్యేషు మల్లతాలోత్త రేషు చ । మల్లాస్స్వలంకృతా దృప్తాస్సోపాధ్యాయాస్సమావిశన్ ॥
వాద్యములు మ్రోగించబడుచుండెను. కాని, మల్లుల చరుపులే బిగ్గరగా వినబడుచుండెను. గర్వించిన మల్లులు బాగా అలంకరించుకొని తమ గురువులతో బాటు విచ్చేసిరి.
చాణూరో ముష్టికః కూటశ్శలస్తోశల ఏవ చ । తే ఆసేదురుపస్థానం వల్గువాద్యప్రహర్షితాః ॥
చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోశలుడు మొదలైన 'మల్లులకు వాద్యముల ధ్వని మనోహరముగానుండి ఉత్సాహమును వర్ధిల్లజేసెను. వారు మల్లరంగమును చేరిరి.
నందగోపాదయో గోపా భోజరాజసమాహుతాః । నివేదితోపాయనాస్తే ఏకస్మిన్మంచ ఆవిశన్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్ధే ద్విచత్వారింశోఽధ్యాయః ॥
నందగోపుడు, సునందుడు మొదలగు గోపాలకులు భోజరాజగు కంసుని ఆహ్వానము పై వచ్చిరి. వారు తాము తెచ్చిన బహుమానములను కంసునకు సమర్పించిరి. వారందరు ఒకే పెద్ద ఆసనముపై కూర్చుండిరి.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో
శ్రీకృష్ణుడు కుబ్జను అనుగ్రహించి ధనుర్భంగమును చేయుటను వర్ణించే
నలుబది రెండవ అధ్యాయము ముగిసినది (42).
Summary of chapter 42 of the Bhāgavata Mahā Purana is as follows:
While walking through Mathurā, Kṛshṇa encountered Trivakrā (Kubjā), a young hunchbacked woman carrying fragrant sandalwood paste for King Kaṁsa. Charmed by Kṛshṇa's beauty, Kubjā joyfully anointed Kṛshṇa and Balarāma with her finest unguents. Pleased by her devotion, Śrī Kṛshṇa stepped on her toes with His lotus feet, placed two fingers under her chin, and straightened her body instantly, transforming her into an exceptionally beautiful, erect maiden. Continuing to the sacrificial arena, Kṛshṇa located the massive, heavy bow of Mahādeva Śiva worshipped by Kaṁsa. Overpowering the royal guards, seven-year-old Kṛshṇa lifted the bow with ease, strung it, and snapped it in two with a deafening roar that reverberated through the city, striking terror into Kaṁsa's heart as he realized his impending doom.