81 - కుచేలోపాఖ్యానము - కుచేలుడు ఐశ్వర్యమును పొందుట

శ్రీశుక ఉవాచ

 స ఇత్థం ద్విజముఖ్యేన సహ సంకథయన్ హరిః

 సర్వభూతమనోభిజ్ఞస్స్మయమాన ఉవాచ తమ్

శ్రీ శుక మహర్షి ఇట్లు పలికేను --- శ్రీకృష్ణ భగవానునకు సకలప్రాణుల అంతరంగము విదితమే. ఆయన ఈ విధముగా బ్రాహ్మణశ్రేష్ఠుడగు సుదామునితో కబుర్లాడుతూ చిరునవ్వుతో ఆయనతో నిట్లనెను.

బ్రహ్మణ్యో బ్రాహ్మణం కృష్ణో భగవాన్ ప్రహసన్ ప్రియమ్

ప్రేమ్ణా నిరీక్షణేనైవ పేక్షన్ ఖలు సతాం గతిః

సత్పురుషులకు ఆశ్రయమగు శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణభక్తుడు. ఆయన నవ్వుతూ ప్రేమ నిండిన కన్నులతో బ్రాహ్మణుడగు సుదాముని చూస్తూ ఇట్లు పలికెను.

శ్రీభగపోనుపోచ

కిమప్యుపాయనమానీతం బ్రహ్మన్ మే భవతా గృహాత్

 అణ్వప్యుపాహృతం భక్తైః ప్రేమ్ణా భూర్యేవ మే భవేత్

 భూర్యప్యభక్తాపహృతం న మే తోషాయ కల్పతే

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ మహాత్మా! నీవు ఇంటినుండి నాకై ఏదేని ఉపహారమును తెచ్చితివా? భక్తులు ప్రేమతో సమర్పించేది అల్పమే అయినా, నాకు అదే అధికము. భక్తి లేనివాడు సమర్పించేది అధికమే అయినా, నాకు ప్రీతిని కలిగించలేదు.

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి

తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః

విశుద్ధమగు అంతఃకరణము గల ఏ భక్తుడైతే ప్రేమతో నాకు పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, నీటిని గాని సమర్పించునో, భక్తితో సమర్పించబడిన దానిని నేను ప్రేమతో స్వీకరించెదను.

ఇత్యుక్తాఽపి ద్విజస్తస్మై వీడితః పతయే శ్రియః

పృథుకప్రసృతిం రాజన్ న ప్రాయచ్ఛదవాజ్ముఖః

ఓ పరీక్షిన్మహారాజా! లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుడిట్లు చెప్పిననూ, ఆ బ్రాహ్మణుడు సిగ్గుతో తల వంచుకొని, గుప్పెడు మాత్రమే ఉన్న అటుకులను ఆయనకు ఈయలేదు.

సర్వభూతాత్మదృక్ సాక్షాత్తస్యాగమనకారణమ్

విజ్ఞాయాచింతయన్నాయం శ్రీకామో మాఽభజత్పురా

            సకలప్రాణుల అంతఃకరణసాక్షియగు శ్రీకృష్ణ భగవానునకు ఆతడు వచ్చిన కారణము ఎరుకయే. ఆయన ఇట్లు తలపోసెను -- ఈయన ఇదివరలో ఎన్నడూ సంపదను కోరి నాయందు భక్తిని చేయలేదు.

పత్న్యాః పతివ్రతాయాస్తు సఖా ప్రియచికీర్షియా

 ప్రాప్తో మామస్య దాస్యామి సంపదోకమర్త్యదుర్లభాః

నా మిత్రుడైతే పతివ్రతయగు తన భార్యకు ప్రియమును చేయగోరి నా వద్దకు వచ్చినాడు. నేనీయనకు దేవతల కైనా దొరకని సంపదలనిచ్చెదను.

ఇత్థం వీచింత్య వసనాచ్చీరబద్దాన్ ద్విజన్మనః

 స్వయం జహార కిమిదమితి పృథుకతండులాన్

ఆయనీ విధముగా తలపోసి, ఆ బ్రాహ్మణుని ఉత్తరీయమునుండి గుడ్డలో కట్టిన అటుకుల మూటను, ఇదేమిటి? అంటూ తానే పైకి తీసెను.

నన్వేతదుపనీతం మే పరమపీణనం సఖీ

తర్పయంత్యంగ మాం విశ్వమేతే పృథుకతండులాః

అరే! మిత్రమా! ఇది నా కొరకు తెచ్చినదే. ఈ అటుకులంటే నాకు పరమప్రీతి. ఓయీ! ఇవి నాకు, జగత్తునకు (జగద్రూపుడనగు నాకు) తృప్తిని కలిగించును.

ఇతి ముష్టిం సకృష్ణోగ్ధ్వ ద్వితీయాం జగ్ధుమాదదే

తావచ్ఛీర్జగృహే హస్తం తత్పరా పరమేష్ఠినః

అని పలికి ఆ పరమేశ్వరుడు ఒక గుప్పెడు అటుకులను ఒకేసారి తిని, రెండవ గుప్పెడును తినుటకై తీసుకొనెను. అంతలో లక్ష్మీదేవి చేతిని పట్టుకొనెను. ఆమెకు ఆయనయే సర్వస్వము.

ఏతావతాకలం విశ్వాత్మన్ సర్వసంపత్సమృద్దయే

 అస్మిల్లోకేథవాకముష్మిన్ పుంస్త్వత్తోషకారణమ్

జగత్తునకు ఆత్మ యైన ఓ దేవా! నీ సంతోషమునకు కారణమై ఇహపరములయందు వ్యక్తికి సకలసంపదల సమృద్ధి కలుగుటకు నీవు ఇంతమాత్రము తీసుకున్నచో చాలును.

బ్రాహ్మణస్తాం తు రజనీముషిత్వాఽచ్యుతమంది రే

 భుక్త్వా పీత్వా సుఖం మేనే ఆత్మానం స్వర్గతం యథా

ఆ బ్రాహ్మణుడు భుజించి నీటిని త్రాగి ఆ రాత్రి శ్రీకృష్ణ భగవానుని మందిరములో నివసించెను. ఆయనకు స్వర్గములో ఉన్నట్లుగా తోచెను.

శ్వోభూతే విశ్వభావేన స్వసుఖేనాభివందితః

 జగామ స్వాలయం తాత పథ్యనుప్రజ్య నందితః  

జగత్తును పాలించే స్వాత్మారాముడైన శ్రీకృష్ణ భగవానుడు మరునాడు ఆయనకు నమస్కరించి మార్గములో కొంత దూరము వెంట నడిచి ఆనంద మును కలిగించెను. అప్పుడు సుదాముడు తన గృహమును చేరెను.

స చాలబ్ధ్వ ధనం కృష్ణాన్న తు యాచితవాన్ స్వయమ్

 స్వగృహాన్ బ్రీడితోఽగచ్ఛన్మహద్దర్శననిర్వృతః

ఆ సుదాముడైతే సిగ్గుపడి తానైతే శ్రీకృష్ణుని ధనమును కోరలేదు; ఆయన ధనమునీయలేదు. భగవానుని దర్శనముచే ఆనందించి ఆయన తన యింటికి వెళ్లెను.

అహో బ్రహ్మణ్య దేవస్య దృష్టా బ్రహ్మణ్యతా మయా

యద్దరిద్రతమో లక్ష్మీమాశ్లిష్ణో బిభ్రతోరసి

ఆహా! బ్రాహ్మణులను ఇష్ట దైవముగా భావించే శ్రీకృష్ణుని బ్రాహ్మణభక్తిని నేను చూచితిని. ఎందుకంటే, వక్షఃస్థలము పై లక్ష్మీదేవిని ధరించే ఆయన పరమదరిద్రుడనగు నన్ను కౌగిలించుకొనెను.

క్వాహం దరిద్రః పాపియాన్ క్వ కృష్ణశీని కేతనః

 బ్రహ్మబంధురితి స్మాహం బాహుభ్యాం పరిరంభితః  

దరిద్రుడను, అధికపాపిని అగు నేనెక్కడ? లక్ష్మీదేవికి నివాసమగు శ్రీకృష్ణ భగవానుడెక్కడ ? బ్రాహ్మణుల వంశములో పుట్టినవాడనగుటచే ఆయన నన్ను రెండు చేతులతో కౌగిలించుకొనినాడు.

నివాసితః ప్రియాజుష్టే పర్యంకే భ్రాతరో యథా

మహిష్యా వీజితశ్శ్రాంతో వాలవ్యజనహస్తయా

ప్రియురాలు సేవించే శయ్య పై తన సోదరుడా యన్నట్లు ఆయన నన్ను విశ్రమింప జేసినాడు. అలసిన నాకు ఆయన భార్య వింజామరతో వీచినది.

శుశ్రూషయా పరమయా పాదసంవాహనాదిభిః

 పూజితో దేవదేవేన విప్రదేవేన దేవవత్

దేవాధిదేవుడగు శ్రీకృష్ణ భగవానునకు బ్రాహ్మణులే దైవము. ఆయన కాళ్లను నొక్కుట, వీచుట మొదలగు గొప్ప సేవలతో నన్ను దేవతను వలే పూజించేను.

స్వర్గాపవర్గయోః పుంసాం రసాయాం భువి సంపదామ్

సర్వాసామపి సిధీనాం మూలం తచ్చరణార్చనమ్

మానవులకు స్వర్గమోక్షములు, భూలో కరసాతలములయందలి సంప దలు, సకల సిద్ధులు కలుగుటకు ఆయన పాదముల పూజయే హేతువు.

అధనోఽయం ధనం ప్రాప్య మాద్యన్నుచ్చైర్న మాం స్మరేత్

 ఇతి కారుణికో నూనం ధనం మేకభూరి నాదదాత్  

ధనము లేని ఈతడు ధనమును పొంది అధికముగా గర్వించి నన్ను స్మరించకుండునని తలచి ఆ దయామయుడు నాకు కొంచెమైననూ ధనమునీయలేదు. ఇదియే నిశ్చయము.

ఇతి తచ్చింతయన్నంతః ప్రాప్తో నిజగృహాంతికమ్

 సూర్యానలేందుసంకాశ్వైమానైస్సర్వతో వృతమ్

ఈ విధముగా ఆయన ఆ విషయమునే తన మదిలో తలపోస్తూ తన ఇంటి వద్దకు చేరెను. ఆ ప్రదేశము అన్ని వైపులా సూర్యుడు, చంద్రుడు, అగ్నులవలె ప్రకాశించే సౌధములచే చుట్టువారబడియుండెను.

విచిత్రోపవనోద్యానైః కూజద్ద్విజకులాకులైః

ప్రోత్ఫుల్లకుముదాంభోజకహ్లరోత్పలవారిభిః

 జుష్టం స్వలంకృతైః పుంభిః స్త్రీభిశ్చ హరిణాక్షిభిః

ఆ స్థానమునందు కూసే పక్షుల గుంపులచే వ్యాపించబడిన రంగు రంగుల ఉపవనములు, ఉద్యానములు ఉండెను. అచటి సరస్సులలో ఎర్ర దామరలు, పద్మములు, సౌగంధికపుష్పములు, కలువలు బాగా వికసించి ఉండెను. అచట బాగా అలంకరించుకున్న పురుషులు, లేడి కన్నులవంటి కన్నులు గల యువతులు ఉండిరి.

కిమిదం కస్య వా స్థానం కథం తదిదమిత్యభూత్

 ఏవం మీమాంసమానం తం నర నార్యోకమరప్రభాః

ప్రత్యగృహ్ణన్ మహాభాగం గీతవాద్యేన భూయసా

ఇది యేమిటి? ఇది ఎవని చోటు? అది (ఇదివరకటి స్థానము) ఇదియై ఈ రూపముగా ఎట్లైనది? అని ఆ మహాభాగ్యవంతుడు విచారము చేయు చుండెను. ఇంతలో దేవతల కాంతివంటి కాంతి గల స్త్రీలు, పురుషులు ఆయనను పాటలతో, వాద్యములతో సాదరముగా దోడ్కొని వెళ్లిరి.

పతిమాగతమాకర్ణ్య పత్న్యుద్దర్షాతిసంభ్రమా

నిశ్చక్రామ గృహాత్తూర్ణం రూపిణీ శ్రీరివాలయాత్

భర్త వచ్చినాడని విని ఆయన భార్య మహానందముతో వేగిరపడుతూ వెంటనే, పద్మముల వనమునుండి త్రిలోకసుందరియగు లక్ష్మీదేవి వలె, ఇంటినుండి బయటకు వచ్చెను.

పతివ్రతా పతిం దృష్ట్వా ప్రేమోత్కంఠాశ్రులోచనా

మీలితాక్ష్యనమద్బుద్ధ్యా మనసా పరిషస్వజే

ఆ పతివ్రతకు ప్రేమచే వేగిరపాటుతో బాటు కళ్లు నీటితో నిండెను. ఆమె భర్తను చూచి కన్నులు మూసుకొని బుద్ధితో ఆయనకు నమస్కరించి, మనస్సుతో కౌగిలించుకొనెను.

పత్నీం వీక్ష్య విస్పురంతీం దేవీం వైమానికీమివ

దాసీనాం నిష్కకంఠీనాం మధ్యే భాంతీం స విస్మితః

ఆయన భార్య విమానమువధిష్ఠించిన దేవతాస్త్రీ వలె అధికముగా వెలిగిపోవుచుండెను. ఆమె కంఠములయందు హారములు గల పరిచారికల మధ్యలో ప్రకాశించేను. ఆమెను చూచి ఆయన ఆశ్చర్యపోయెను.

ప్రీతస్స్వయం తయా యుక్తః ప్రవిష్టో నిజమందిరమ్

మణిస్తంభశతో పేతం మ హేంద్రభవనం యథా

ఆయన లోను కూడ చాల సంతోషించి ఆమెతో గూడి తన భవనములోనికి ప్రవేశించేను. ఆ భవనము మణులు పొదిగిన వంద స్తంభములతో మ హేంద్రునీ భవనమును పోలియుండెను.

పయః ఫేననిభాశ్శయ్యా దాంతో రుక్మపరిచ్చదాః

 పర్యంకా హేమదండాని చామరవ్యజనాని చ

ఆ భవనమునందు దంతముతో చేసి వెండితో చేసిన పంకా మొదలైన పరికరములనమర్చిన మంచములపై పాలనురుగువంటి పరుపులు ఉండెను. వింజామరలకు బంగరు కడ్డీలు ఉండెను.

ఆసనాని చ హైమాని మృదూపస్తరణాని చ

ముక్తాదామవిలంబీని వితానాని ద్యుమంతి చ

ఆ భవనములో బంగరు కుర్చీలు, మెత్తని శయ్యలు, వ్రేలాడే ముత్యాల సరులతో ప్రకాశించే మేలుకట్టులు ఉండెను.

 స్వచ్చప్పటికకుడ్యేషు మహామారకతేషు చ

రత్నదీపా భ్రాజమానా లలనారత్నసంయుతాః  

ఆ భవనములలోని స్వచ్చమగు గోడలయందు గొప్ప మరకతమణులను, స్పటికములను పొదిగి, రత్నములనే దీపములుగా అమర్చిరి. ఆ భవనములలో గొప్ప యువతులు ఉండిరి.

విలోక్య బ్రాహ్మణస్తత్ర సమృద్ధిస్సర్వసంపదామ్

 తర్కయామాస నిర్వగ్రస్స్వసమృద్ధిమ హైతుకీమ్

ఆ బాపడు అచట సకలసంపదల సమృద్ధులను చూచెను. ఆయన సావ ధానచిత్తు డై ఆకస్మికముగా ప్రాప్తమైన సంపదను గురించి ఆలోచించేను.

నూనం బతైతన్మమ దుర్భగస్య శశ్వద్దరిద్రస్య సమృద్ధి హేతుః మహావీభూతేరవలోకతోఽన్యో నైవోపపద్యేత యదూత్తమస్య

ఆశ్చర్యము! నేను నిశ్చయముగా సర్వకాలదరిద్రుడను, దురదృష్టవంతుడను. నాకు ఈ విధమైన ఆకస్మిక సంపదకు హేతువు యాదవశ్రేష్ఠుడగు శ్రీకృష్ణ భగవానుని కృపాదృష్టికంటే మరియొకటి అని ఊహించుటయైననూ సంభవము కాదు. ఆయన మహిమ చాల గొప్పది.

నన్వబ్రువాణో దిశతే సమక్షం యాచిష్ణవే భూర్యపి భూరిభోజః

పర్జన్యవత్తత్స్వయమీక్షమాణో దాశార్హకాణామృషభస్సఖా మే

దశార్హవంశీయులలో శ్రేష్ఠుడగు నా మిత్రుడు గొప్ప భోగములు గలవాడు. ఎదుట ఏమీ చెప్పకున్నా ఆయన యాచకునకు అధికమునే ఇచ్చును. మేఘము ఎంత వర్షించినా, తాను చాల వర్షించేనని అనుకోదు. అదే విధముగా, ఆయన కూడ తాను ఇచ్చినది అల్పమేనని భావించును.

 కించిత్కరోత్యుర్వపి యత్స్వదత్తం సుహృత్కృతం ఫల్గపి భూరికారీ,

 మయోపనీతాం పృథు కైకముష్టిం ప్రత్యగ్రహీతీతియుతో మహాత్మా

తానిచ్చినది ఎక్కువే అయినా కొంచెమా అన్నట్లు చేయును. మిత్రుడి చ్చినది కొంచెమే ఐనా, ఎక్కువా యన్నట్లు చేయును. నేను ఒకే గుప్పెడు అటుకులను సమర్పించగా, ఆ మహాత్ముడు ప్రేమతో స్వీకరించెను.

 తస్యైవ మే సౌహృదసఖ్య మైత్రీ దాస్యం పునర్జన్మని జన్మని స్యాత్

మహానుభావేన గుణాలయేన విషజ్జతస్తత్పురుష ప్రసంగః

శ్రీకృష్ణుడు గొప్ప మహిమ గల గుణనిధి. ఆయనతో నాకు విశిష్టమగు చెలిమి కలిగినది. నాకు మరల ప్రతి జన్మయందు ఆయనతో మాత్రమే ప్రేమ, ఆయన నాకు హీతకారి యగుట, నాకు ఉపకారము చేయుట, నేనాయనకు సేవ చేయుట, ఆయన భక్తుల తోడి సత్సంగము కలుగుగాక!

భక్తాయ చిత్రా భగవాన్ హీ సంపదో

రాజ్యం విభూతీర్న సమర్థయత్యజః

 ఆదీర్ఘబోధాయ విచక్షణస్స్వయం

పశ్యన్నిపాతం ధనినాం మదోద్భవమ్

పుట్టుక లేని శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా సంపదలలోని దోషము తెలిసినవాడు. ధనికులు గర్వము వలన పతనమగుటను ఆయన యెరుగును. కావుననే, ఆయన దూరదృష్టి లేని భక్తునకు పలు రకముల సంపదలను, రాజ్యాధికారమును, ఐశ్వర్యములను ఈయడు.

ఇత్థం వ్యవసితో బుద్ద్యా భక్త్వాఽతీవ జనార్గనే

 విషయాజ్ఞయయా త్యక్ష్యన్ బుభుజే నాతిలంపటః  

ఆ సుదాముడు బుద్దితో ఈ విధముగా నిశ్చయించుకొని దుష్టజనశిక్షకుడగు శ్రీకృష్ణ భగవానునిపై ఓ అధికమగు భక్తిని కలిగియుండెను. ఆయన మెల్లమెల్లగా త్యాగమునభ్యసిస్తూనే ఆసక్తి లేకుండా భార్యతో గూడి ఇంద్రియభోగములననుభవించెను.

తస్య వై దేవదేవస్య హరేర్యజ్ఞపతేః ప్రభోః

 బ్రాహ్మణాః ప్రభవో దైవం న తేభ్యో విద్యతే పరమ్

దేవాధిదేవుడు, యజ్ఞములకు ప్రభువు, సర్వశక్తిమంతుడు అగు ఆ శ్రీకృష్ణ భగవానుడు దుఃఖములను హరించును. ఆయనకు ప్రభువులు నిశ్చయముగా బ్రాహ్మణులే. ఆయనకు వారిని మించిన దైవము లేదు.

ఏవం స విప్రో భగవత్సుహృత్తదా

దృష్ట్వా స్వభృత్యైరజితం పరాజితమ్

తద్ద్యానవేగోద్గ్రతాత్మబంధనః

తద్ధామ లేఖేఽచిరతస్సతాం గతిమ్

శ్రీకృష్ణ భగవానుడు పరాజయము లేనివాడే అయినా భక్తులకు వశమగును. ఈ సత్యమును ఆయన మిత్రుడగు . ఆ సుదాముడు కనుగొనెను. అపుడాతడు ఆయనను తీవ్రముగా ధ్యానించి అహంకారబంధమును తొలగించుకొనెను. ఆతడు శీఘ్రముగనే సత్పురుషులచే పొందబడే ఆ పరమాత్మస్వరూపమును పొందెను.

ఏతద్బ్రహ్మణ్య దేవస్య శ్రుత్వా బ్రహ్మణ్యతాం నరః

లబ్ధభావో భగవతి కర్మబంధాద్విముచ్యతే

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

ఉత్తరార్థే ఏకాశీతితమోఽధ్యాయః

శ్రీకృష్ణ భగవానునకు బ్రాహ్మణులే దైవము. ఆయనయొక్క ఈ వృత్తాంతమును, బ్రాహ్మణేభక్తిని వినే మానవునకు ఆ భగవానునియందు భక్తి ఉదయించి సంసారబంధమునుండి విముక్తి లభించును.

శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో కుచేలోపాఖ్యానములో సుదామునకు సకలైశ్వర్యములు లభించుటను వర్ణించే ఎనుబది ఒకటవ అధ్యాయము ముగిసినది (81).