భాగవత మహా పురాణము
30 - గోపికలు అంతర్షితుడైన శ్రీకృష్ణుని వెదుకుట
శ్రీశుక ఉవాచ ।
ఆంతర్హితే భగవతి సహసైవ ప్రజాంగనాః । ఆతప్యంసమచక్షాణాః కరిణ్య ఇవ యూథపమ్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీభగవానుడు అకస్మాత్తుగా అంతర్ధానము కాగా, ఆ గోపికలు ఆయస కానరాక, దండు నాయకుని కానరాని ఆడు యేనుగులు వలె, పీడను పొందిరి.
గత్యాఽను రాగస్మితవిభ్రమేక్షి తైర్మనోరమాలాపవిహారవిభ్రమైః।
ఆక్షిప్తచిత్తాః ప్రమదా రమాపతేస్తాస్తా విచేష్టా జగృహుస్తదాత్మికాః ॥
లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుని నడక, ప్రేమ, చిరునవ్వు, విలాసపు చూపులు, మనోహరములైన కబుర్లు, విహారములు, మోహమును కలిగించే ఇతర చేష్టలు ప్రేమావేశము గల ఆ గోపికల చిత్తములను విశేషముగా ఆకర్షించినవి. వారాయనతో అభేదమును భావన చేస్తూ ఆయనయందే మనస్సు గలవారై ఆయన చేసిన ఆయా లీలలను అనుకరించిరి.
గతి స్మిత ప్రేక్షణ భాషణాదిషు ప్రియాః ప్రియస్య ప్రతిరూఢమూర్తయః! అసావహం త్విత్య బలాస్త దాత్మికా స్యవేదిషుః కృష్ణ విహారవిభ్రమాః ॥
శ్రీకృష్ణునియందు ప్రేమ గల గోపికలు ప్రియుడగు ఆయనయొక్క నడక, చిరునవ్వు, చూపులు, మాటలు మొదలగువాటియందు ఆయనతో అంభేదమునే సొందిరి. వారి దేహములయందు కూడ అవే లక్షణములు ప్రకటమాయెను. వారు శ్రీకృష్ణుని విహారము యొక్క విలాససనుకరిస్తూ, ఇదిగో! శ్రీకృష్ణుడను నేనే, అని ప్రకటించుకొనిరి.
గాయంత్య ఉచ్చైరముమేవ సంహతా విచిక్యురున్మత్తకవద్వనాద్వనమ్ । పప్రచ్ఛురాకాశవదంతరం బహిః భూతేషు సంతం పురుషం వనస్పతీన్ ॥
వారు గుమిగూడి బిగ్గరగా గానము చేస్తూ పిచ్చివారు వలె ఒక అడవినుండి మరియొక అడవికి వెళ్తూ ఈ శ్రీకృష్ణునే వెదికిరి. ఆయన ఆకాశము వల ప్రాణుల లోపల బయట కూడ ఉండే పూర్ణపరబ్రహ్మ. వారాయనను గురించి చటము అడిగిరి.
దృష్టో వః కచ్చిదశ్వత్థ ప్లక్ష న్యగ్రోధ నో మనః ! నందసూ నుర్గతో హృత్వా ప్రేమహాసావలోకనైః ॥
ఓ గావీ! జువ్వా! మర్రీ! నందుని పుత్రుడు శ్రీకృష్ణుడు ప్రేమతో మరియు చిరు నవ్వుతో కూడిన చూపులతో మా మనస్సును అపహరించి వెళ్లిపోయినాడు. మీకు కనబడినాడా?
కచ్చిత్కురపకాశోకనాగపున్నాగ చంపకాః । రామానుజో మానినీ నామితో దర్పహర స్మితః ॥
ఓ ఎర్ర చామంతీ! కంకేళీ! పొన్నా! సురపొన్నా! సంపెంగా! బలరాముని తమ్ముడగు శ్రీకృష్ణుడు, మేము సుందరులమనే గర్వము గల యువతుల గర్వమునడంచే చిరునవ్వు గలవాడు. ఆయన ఇటు వచ్చెనా?
కచ్చిత్తులసి కల్యాణి గోవిందచరణ ప్రియే । సహ త్వాఽలికులైర్బిభ్రద్దృష్ట స్తేఽతి ప్రియోఽచ్యుతః ॥
ఓ తులసీ! నీవు మంగళకరురాలవు. నీకు గోవిందుని పాదములపై ప్రీతి మెండు. నీకు మిక్కిలి ప్రియుడగు ఆ శ్రీకృష్ణ భగవానుడు తుమ్మెదల గుంపులతో కూడిన నిన్ను దాల్చును. ఆయన కనబడినాడా?
మాలత్యదర్శి వః కచ్చిన్మల్లికే జాతి యూథికే । ప్రీతిం వో జనయన్ యాతః కరస్పర్శేన మాధవః ॥
ఓ జాజీ! మల్లీ! ఉసిరీ! ఓ అడవి మొల్లా! లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుడు చేతితో తాకీ మీకు ఆనందమును కలిగిస్తూ వెళ్లినాడు. మీకు కనబడినాడా?
చూతప్రియాలపనసాసనకోవిదార జంబ్వర్కబిల్వబకులామ్రకదంబనీపాః ।
యేఽన్యే పరార్థభవకా యమునోపకూలాః శంసంతు కృష్ణ పదవీం రహితాత్మనాం నః ॥
ఓ రసాల మామిడీ! మోరటీ! పనసా! వేగిసా! రక్తకాంచనమా! నేరేడూ! జిల్లేడూ! మారేడూ! పొగడా! మామిడీ! కడిమీ! మంకెనా! మీరు, మరియు యమునానదీ తీరమునందు పెరిగే ఇతరములగు చెట్లు ఏవి గలవో అవి మాకు శ్రీకృష్ణుని మార్గమును చెప్పుగాక! ఏలయన, పరోపకారము కొరకే మీరు జన్మించితిరి. శ్రీకృష్ణుడు లేక మా మనస్సు శూన్యముగా నున్నది.
కిం తే కృతం క్షితి తపో బత కేశవాంఘ్రి - స్పర్మోత్సవోత్పులకితాంగరు హైర్విభాసి ! అవ్యంఘ్రిసంభవ ఉరుక్రమవిక్రమాద్వా ఆహో పరాహపపుషః పరిరంభణేన ॥
ఆశ్చర్యము! ఓ పృథివీ! శ్రీకృష్ణ భగవానుని పాదములు స్పర్శచే ఉత్సవము గల నీవేమి తపస్సును చేసితివి? పైభాగమునందు మొలచిన చెట్టుచేమలే రోమాంచము కాగా నీవు విశేషముగా ప్రకాశించుచున్నావు. ఈ శోభ శ్రీకృష్ణుని పాదస్పర్శ వలనా? లేక, (అంతకుముందు) వామనుడై పెద్ద అడుగులను వేసిన శ్రీహరి నీపై వేసిన అడుగు వలనా? లేక, (ఇంకా ముందు) వరాహమూర్తియై నిన్ను కౌగిలించినందులకా?
అప్యేణపత్న్యుపగతః ప్రియయేహ గాత్రైః తన్వన్ దృశాం సఖి సునిర్వృతిమచ్యుతో వః । కాంతాంగ సంగకుచకుంకుమరంజితాయాః కుందస్రజః కులపతేరిహ వాతి గంధః ॥
ఓ ఆడు లేడీ! నీవు నాకు చెలికత్తెవు. శ్రీకృష్ణ భగవానుని దేహావయవ ములను చూచుటచే మీకు గొప్ప ఆనందము విస్తరించును సుమా! ఆయన ప్రియురాలితో కలిసి వచ్చి నీ కంట బడినాడా? ఎందుకంటే, గోకులప్రభువగు ఆయన దాల్చిన మల్లెల మాల యొక్క పరిమళమును గాలి మోసుకువచ్చుచున్నది. ఆతడు ఆమెను కౌగిలించినప్పుడు ఆమె వక్షఃస్థలమునందలి కుంకుమచే ఆ మాల ఎర్రనై యుండును.
బాహుం ప్రియాంఽస ఉపధాయ గృహీతపద్మో రామానుజస్తులసికాఽలికులైర్మదాంధైః ! అన్వీయమాన ఇహ వస్తరవః ప్రణామం కిం వాఽభినందతి చరన్ ప్రణయావలోకైః ॥
ఓ వృక్షములారా! బలరాముని సోదరుడగు శ్రీకృష్ణుడు ఒక చేతిని ప్రియురాలి భుజము పై వేసి మరో చేతితో పద్మమును పట్టుకొని ఇక్కడ సంచరించి యుండును. ఆయన ధరించిన తులసి మాల చుట్టూ మత్తుతో గ్రుడ్డివైన తుమ్మెదల గుంపులు ఆయనను వెంటాడును. మీరు వంగి చేసిన అభివాచమును ఆయన ప్రేమతో కూడిన చూపులతో అభినందించినాడా?
పృచ్ఛతేమా లతా బాహూనప్యాశ్లిష్టా వనస్పతేః ।
మానం తత్కరజస్సృష్టా బిభ్రత్యుత్పులకాన్యహో ॥
ఓ చెలికత్తెలారా! చెట్టు కొమ్మలను కౌగిలించియున్న ఈ తీగలను కూడ అడుగురు. ఆతడు తన చేతి గోళ్లతో వీటిని నిశ్చయముగా స్పృశించి యుండును. ఇవి రోమాంచములను (చిగుళ్లు) కలిగి యున్నవి సుమా!
ఇత్యున్మత్తవచోగోష్యః కృష్ణాన్వేషణకాతరాః । లీలా భగవతస్తాస్తా హ్యనుచక్రుస్తదాత్మికాః ॥
ఈ విధముగా శ్రీకృష్ణుని వెదుకుటలో వ్యాకులు రైన గోపికలు పిచ్చి మాటలను పలుకుచుండిరి. వారు నిశ్చయముగా భగవానునితో భావాత్మక ఐక్యమును పొంది ఆయనయొక్క ఆయా లీలలను అనుకరించిరి.
కస్యాశ్చిత్పూతనాయంత్యాః కృష్ణాయంత్య పిబత్ స్తనమ్ ।
తోకాయిత్వా రుదత్యన్యా పదాఽహఞ్ఛకటాయతీమ్ ॥
దైత్యాయిత్వా జహారాన్యామేకా కృష్ణార్భభావనామ్ । రింగయామాస కాఽప్యంఘ్రీ కర్షంతీ ఘోషనిస్స్వనైః ॥
ఒక గోపిక తృణావర్తుని అనుకరిస్తూ బాలకృష్ణుని అనుకరించే ఎత్తుకుపోయేను. ఒక గోపిక కాలియందెలు ధ్వనించునట్లుగా రెండు కాళ్లను (బాలకృష్ణుని వలె) లాగుతూ పాకెను.
కృష్ణ రామాయితే ద్వే తు గోపాయంత్యశ్చ కాశ్చన । వత్సాయతీం హంతి చాన్యా తత్రైకా తు బకాయతీమ్ ॥
ఇద్దరు గోపికలు బలరామకృష్ణులను, కొందరు గోపాలకులను అను కరించిరి. ఒకామె కృష్ణుని అనుకరిస్తూ వత్సాసురుని అనుకరించే గోపికను, ఇంకో గోపిక బకాసురుని అనుకరించే గోపికను సంహరించినట్లు నటించిరి.
ఆహూయ దూరగా యద్వత్కృష్ణస్తమనుకుర్వతీమ్ । వేణుం క్వణంతీం క్రీడంతీమన్యాశృంసంతి సాధ్వితి ॥
ఒక గోపిక శ్రీకృష్ణుని అనుకరించి వేణువును వాయించి దూరమునందలి గోవులను పిలుస్తూ క్రీడించగా, ఆమెను బాగు అంటూ ఇతర గోపికలు కొనియాడుచుండిరి.
కస్యాంచిత్స్వభుజం న్యస్య చలంత్యాహాపరా నను । కృష్ణోఽహం పశ్యత గతం లలితామితి తన్మనాః ॥
శ్రీకృష్ణునియందు లగ్న మైన మనస్సు గల మరియొక గోపిక ఇంకో గోపికపై తన చేతిని వేసి నడుస్తూ, నేను శ్రీకృష్ణుడను, నా అందమైన నడకను చూడుడు, అని పలికెను.
మా భైష్ట వాతవర్షాభ్యాం తత్త్రాణం విహితం మయా ।
ఇత్యు క్ర్వైకేన హస్తేన యతంత్యున్నిదధేంఽబరమ్ ॥
గాలికి, వర్షమునకు భయపడకుడు. వాటినుండి రక్షణ వ్యవస్థను నేను చేసేను, అంటూ ఒక గోపిక ఒకే చేతితో ప్రయత్నపూర్వకముగా చీర కొంగును పైకి ఎత్తి పట్టుకొనెను.
ఆరు హ్యైకా పదాఽఽక్రష్యు శీతస్యాహాపరాం నృప । దుష్టాహే గచ్ఛ జాతోఽహం ఖలానాం నసు దండధృక్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఒక గోపిక మరియొక గోపిక యొక్క తల పైకెక్కి కాలితో తొక్కి, ఓ పాడు సర్పమా! పొమ్ము, దుష్టులను నిశ్చయముగా శిక్షించుటకై నేను అవతరించితిని, అని పలికెను.
తత్రైకోవాచ హే గోపా దావాగ్నిం పశ్యతోల్బణమ్ । చక్షూంష్యాశ్వపిదధ్వం వో విధాస్యే క్షేమమంజసా ॥
వారిలో ఒకామె ఇల్లు పలికెను గోపాలకులారా! భయంకరమగు కార్చిచ్చును. కనుడు. వెంటనే కళ్లను మూసుకొనుడు. మీకు నేసు తేలికగా క్షేమమును కలిగించెదను.
బద్ధాఽన్యయా ప్రజా కాచిత్తన్వీ తత్ర ఉలూఖలే । భీతా సుదృక్ పిధాయాస్యం భేజే భీతివిడంబనమ్ ॥
వారిలో ఒక సుందరి మరియొక గోపికను రోటికి మాలతో కట్టివేసెను. అపుడా గోపిక భయపడుతూ అందమైన కళ్లు గల ముఖమును చేతులతో కప్పుకొని, భయపడే శ్రీకృష్ణుని అనుకరించెను.
ఏవం కృష్ణం పృచ్ఛమానా బృందావనలతాస్తరూన్ । వ్యచక్షత వనోద్దేశే పదాని పరమాత్మనః ॥
ఈ విధముగా గోపికలు బృందావనమునందలి చెట్లను, లతలను శ్రీకృష్ణ పరమాత్మ గురించి ప్రశ్నించుచుండిరి. ఇంతలో వారికి అడవి ప్రదేశమునందు ఆయన కాలి గుర్తులు కనబడెను.
పదాని వ్యక్తమేతాని నందసూనోర్మహాత్మనః । లక్ష్యంతే హి ధ్వజాంభోజవజ్రాంకుశయవాదిభిః ॥
ఇవి స్పష్టముగా దొడ్డ మనసు గల శ్రీకృష్ణుని కాలి గురుతులే. ఏలయన, జెండా, పద్మము, వజ్రము, అంకుశము, ధాన్యపు గింజ, చక్రము మొదలగువాటిచే నందపుత్రుని సందపుత్రుని కాలి ముద్రలను గుర్తు పట్టవచ్చును.
తైస్తైః పదైస్తత్పదవీమన్విచ్ఛంత్యోఽగ్రతోఽబలాః । వధ్వాః పదైస్సుపృక్తాని విలోక్యార్తాస్సమబ్రువన్ ॥
ఆయా కాలి ముద్రలతో ఆ శ్రీకృష్ణుని మార్గమునా గోపికలు వెదుకు చుండిరి. ఇంతలో వారికి ఆయన కాలి గురుతులతో బాగా కలిసి ఉన్న స్త్రీ కాలి ముద్రలు కనబడెను. వారు మనోవ్యథను పొంది ఇట్లు పలికిరి.
కస్యాః పదాని చైతాని యాతాయా నందసూనునా ! అంసన్యస్తప్రకోష్ఠాయాః కరేణోః కరిణా యథా ॥
నందపుత్రుడగు శ్రీకృష్ణుడు ఒక యువతి భుజముపై తస ముంజేతిని, మగ ఏనుగు తుండమును ఆడు ఏనుగుపై వలె ఉంచి కలిసి నడచినట్లు ఈ కాలి గురుతులను బట్టి తెలియుచున్నది. ఆమె ఎవరై యుండును?
అనయాఽఽరాధితో మానం భగవాన్ హరిరీశ్వరః । యన్నో విహాయ గోవిందః ప్రీతో యామసయద్రహః ॥
ఈమె నిశ్చయముగా జగన్నాథుడగు శ్రీకృష్ణ భగవానుని ఆరాధించి ప్రేతుని చేసినది. ఎందుకంటే, ఆ గోవిందుడు మనలను ప్రక్కనబెట్టి ఏకాంతముగా ఆమెతో కలిసి నడచి వెళ్ళెను.
ధన్యా అహో అమీ ఆల్యో గోవిందాంఘ్ర్యబ్జరేణవః । యాన్ బ్రహ్మేశో రమా దేవీ దధుర్మూర్ధ్న్య ఘనుత్తయే ॥
ఆహా! చెలికత్తేలారా! ఈ గోవిందుని పాదపద్మముల ధూలికణములు పరమపవిత్రములు. ఎందుకంటే బ్రహ్మదేవుడు, శివుడు, లక్ష్మీదేవి దోష నివారణకై వాటిని తమ తలపై దాల్చిరి.
తస్యా ఆమూని నః క్షోభం కుర్వంత్యుచ్చైః పదాని యత్ । యైకాఽపహృత్య గోపీనాం రహో భుంక్తేఽచ్యుతాధరమ్ ॥
ఆ యువతి గోపికల సొత్తనదగిన శ్రీకృష్ణ భగవానుని ఎత్తుకుపోయి ఆయన అధరముననుభవించుచున్నది. ఆమెయొక్క ఈ కాలి గురుతులు మనకు అధికముగా మానసికక్షోభను కలిగించుచున్నవి.
న లక్ష్యంతే పదాన్యత్ర తస్యా మానం తృణాంకు రైః । ఖిద్యత్సుజాతాంఘ్రితలామున్నిన్యే ప్రేయసీం ప్రియః ॥
ఇచట ఆమె కాలి గురుతులు కనబడుట లేదు. ప్రియుడగు గోవిందుడు ప్రియురాలి సుకుమారమైన అరికాళ్లకు గడ్డి కొనలచే నొప్పి కలుగగా ఎత్తుకొని తీసుకువెళ్లి యుండును. ఇది నిశ్చయము.
ఇమాన్యధికమగ్నాని పదాని వహతో వధూమ్ ! గోప్యః పశ్యత కృష్ణస్య భారాక్రాంతస్య కామినః ॥
ఓ గోపికలారా! ఇక్కడి కాలి గురుతులను చూడుడు. ఇవి బాగా లోతుగా నున్నవి. కాముకుడగు శ్రీకృష్ణుడు ప్రియురాలిని మోసినప్పుడు ఆ బరువుచే కాళ్లు దిగబడియుండును.
అత్రావరోపితా కాంతా పుష్ప హేతోర్మహాత్మనా ! అత్ర ప్రసూనావచయః ప్రియార్థే ప్రేయసా కృతః । ప్రవదాక్రమణే ఏతే పశ్యతాసకలే పదే ॥
ఇచట చూడుడు. మట్టిలో కాలి అగ్రభాగముల గుర్తులు మాత్రమే పడినవి. పూర్తి కాలి గుర్తులు పడలేదు. దీనిని బట్టి, శ్రీకృష్ణుడు ప్రియురాలినిక్కడ క్రింద దింపి ఆమె కొరకు (ఎత్తున ఉన్న) పూలను కోసి యుండును. ఆయన దొడ్డ మనసు గల ప్రియుడే.
కేశప్రసాధనం త్వత్ర కామిన్యాః కామినా కృతమ్ । తాని చూడయతా కాంతాము పవిష్టమిహ ధ్రువమ్ ॥
ప్రియుడగు శ్రీకృష్ణుడు నిశ్చయముగా ఇక్కడనైతే కూర్చుండి ప్రియురాలి జుట్టు సరిచేసి ముడివేసి సరిచేసి ముడి వేసి ఆ పూలను ముడిలో తురిమియుండును.
రేమే తయా చాత్మరత ఆత్మారామోఽప్యఖండితః। కామినాం దర్శయన్ దైన్యం స్త్రీణాం చైవ దురాత్మతామ్।
శ్రీకృష్ణుడు తనయందే రమించి క్రీడించే పూర్ణుడు. కాముకులు దైన్యమును పొందెదరనియు, కాముకులు యెడల కామినులు దౌర్జన్యమును చూ పెదరనియు లోకమునకు నిరూపించువాడై ఆయన ఆమెతో విహరించెను (ఇది శుకుని వచనము).
ఇత్యేవం దర్శయంత్యస్తాశ్చేరుర్గోప్యో విచేతసః । యాం గోపీమనయత్కృష్ణో విహాయాన్యాః స్త్రియో పనే ॥ సా చ మేనే తదాఽఽత్మానం వరిష్ఠం సర్వయోషితామ్ । హిత్వా గోపీః కామయానా మాఘసౌ భజతే ప్రియః ॥
ఈ విధముగా మతి పోయినట్లున్న ఆ గోపికలు శ్రీకృష్ణుని కాలి గుర్తులను చూపిస్తూ సంచరించిరి. అడవిలో ఇతరయువతులను విడిచిపెట్టి శ్రీకృష్ణుడు ఏ గోపికను తీసుకువెళ్లినో, ఆమె తాను యువతులందరిలో గొప్పదాననని తలపోసెను. ప్రియుడైన శ్రీకృష్ణుడు తనను కోరే ఇతరగోపికలను కాదని నన్ను సేవించుచున్నాడని ఆమె తలంపు.
తతో గత్వా వనోద్దేశం దృప్తా కేశవమబ్రవీత్ । న పారయేఽహం చలితుం నయ మాం యత్ర తే మనః ॥
గర్వించిన ఆ గోపిక తరువాత అడవిలోని ఒక స్థానమును చేరి శ్రీకృష్ణ భగవామనితో నిట్లనెను నేను నడవ లేకున్నాను. ఎక్కడకు వెళ్లాలని నీవు. తలచెడవో, అచటకు నన్ను మోసుకొని పొమ్ము.
ఏవముక్తః ప్రియామాహ స్కంధ ఆరుహ్యతామితి । తతశ్చాంతర్దధే కృష్ణస్సా వధూరన్వతష్యత ॥
అనురాగవతియగు ఆ గోపిక ఇల్లు పలుకగా శ్రీకృష్ణుడు భుజము నెక్కుము అని చెప్పి అంతర్ధాసమాయెను. ఆ యువతి (అట్లు అన్నందుకు) పశ్చాత్తాపపడెను.
హా నాథ రమణ ప్రేష్ఠ క్వాసీ క్వాసి మహాభుజ । దాస్యాస్తే కృపణాయా మే సఖే దర్శయ సన్నిధిమ్ ॥
ఓ ప్రభూ! ఆహ్లాదమును కలిగించువాడా! నీవు ప్రియతముడవు, గొప్ప భుజశక్తి గలవాడవు. ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? నేను దీనురాలను, నీ దాసిని. నాకు నీ సాన్నిధ్యమును కలిగించుము.
అన్విచ్ఛంత్యో భగవతో మార్గం గోప్యోఽవిదూరతః । దదృశుః ప్రియవిశ్లేషమోహితాం దుఃఖితాం సఖీమ్ ॥
శ్రీకృష్ణ భగవానుని మార్గమును వెదుకుచున్న గోపికలకు వారి చెలికత్తె కనిపించెను. ఆమె ప్రియుడగు శ్రీకృష్ణుని విరహముచే దుఃఖితురాలై మోహమును పొంది యుండెను.
తయా కథితమాకర్ణ్య మానప్రాప్తిం చ మాధవాత్ । అవమానం చ దౌరాత్మ్యాద్విస్మయం పరమం యయుః ॥
లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుడు తనను సమ్మానించుటను, తాను దౌర్జన్యము చేసి ఆయనను అవమానించుటను (ఆయన అంతర్ధానమై తనను అవమానించుటను) గురించి కూడ ఆమె చెప్పెను. ఆ వృత్తాంతమును విన్న గోపికలకు చాల ఆశ్చర్యము కలిగెను.
తతోఽవిశన్ వనం చంద్రజ్యోత్స్నా యావద్విభావ్యతే । తమః ప్రవిష్ట మాలక్ష్య తతో నివవృతుః స్త్రియః ॥
తరువాత చంద్రుని వెన్నెలలో అడవి కనబడుచున్నంతవరకు వారా ఆడవిలో శ్రీకృష్ణుని వెదికిరి. తరువాత అంతటా చీకటి వచ్చుటను గాంచి ఆ గోపికలు వెనుదిరిగిరి.
తన్మనస్కాస్తదాలాపాస్తద్విచేష్టాస్త దాత్మికాః । తద్గుణానేన గాయంత్యో నాత్మాగారాణి సస్మరుః ॥
ఆ గోపికల మనస్సు శ్రీకృష్ణునియందు మాత్రమే లగ్నమై యుండెను. వారు ఆయన గురించియే మాటలాడుతూ ఆయన చేష్టలనే అనుకరిస్తూ ఆయనతో అభేదమును పొందిరి. ఆయన గుణములనే చేయుచున్న ఆ గోపికలకు తమ దేహముల స్పృహ గాని, ఇళ్ల గురించి గుర్తు గాని లేకుండెను.
పునః పులినమాగత్య కాలింద్యాః కృష్ణ భావనాః । సమవేతా జగుః కృష్ణం తదాగమనకాంక్షితాః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్ధే త్రింశోఽధ్యాయః ॥
శ్రీకృష్ణుని రాకను ఆకాంక్షించే ఆ గోపికలు శ్రీకృష్ణునే ధ్యానిస్తూ మరల యమునానది యొక్క ఇసుకతిన్నె వద్దకు వచ్చిరి. వారందరు కలిసి ఆయన గురించి గానము చేసిరి.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము
పూర్వార్ధములో గోపికలు అంతర్హితుడైన శ్రీకృష్ణుని వెదుకుటను
వర్ణించే ముప్పదియవ అధ్యాయము ముగిసినది (30).
Summary of chapter 30 of the Bhāgavata Mahā Purana is as follows:
Plunged into intense pangs of separation (*Viraha*), the gopīs wandered frantically through the night-darkened forest of Vṛndāvana searching for Kṛshṇa. In their ecstatic madness, they addressed the trees, vines, deer, and earth, asking if they had seen their beloved. They began imitating Kṛshṇa's pastimes—one acting out the killing of Pūtanā, another lifting a imaginary Govardhana, and another subduing Kāliya. Deep in the forest, they discovered Kṛshṇa's footprints alongside the delicate footprints of a special gopī (Śrīmatī Rādhārāṇī), whom Kṛshṇa had taken away in solitude. When that special gopī also experienced pride, Kṛshṇa disappeared from her as well, leaving all the gopīs united in crying out for His return.