46 - ఉద్ధవుడు గోకులమునకు వెళ్లుట

శ్రీశుక ఉవాచ

వృష్ణీనాం ప్రవరో మంత్రీ కృష్ణస్య దయితస్సఖా

శిష్యో బృహస్పతేస్సాక్షాదుద్ధవో బుద్ధి సత్తమః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- యాదవులలో శ్రేష్ఠుడగు ఉద్ధవుడు సాక్షాత్తు బృహస్పతి శిష్యుడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు. ఆయన శ్రీకృష్ణునకు మంత్రి మరియు ప్రియమిత్రుడు.

తమాహ భగవాన్ ప్రేష్ఠం భక్తమేకాంతినం క్వచిత్

గృహీత్వా పాణినా పాణిం ప్రపన్నార్తిహరో హరిః

శ్రీకృష్ణ భగవానుడు శరణాగతుల పీడలను, పాపములను పోగొట్టును. ఆయనకు ఉద్ధవుడు మిక్కిలి ప్రియుడు మరియు అనన్యభక్తుడు. ఆయన ఒకనాడు ఉద్ధవుని చేతిని చేతితో పట్టుకొని ఇట్లు పలికెను.

గచ్ఛోద్ధవ ప్రజం సౌమ్య పిత్రోర్నౌ ప్రీతి మావహ

గోపీనాం మద్వియోగాధిం మత్సందేశైర్విమోచయ

ఓ ఉద్ధవా! నీవు ప్రియదర్శనుడవు. నీవు గోకులమునకు వెళ్లి మా ఇద్దరి తల్లిదండ్రులకు ప్రీతిని కలిగించుము. నా సందేశములతో గోపికలకు వియోగదుఃఖమునుండి విముక్తిని కలిగించుము.

తా మన్మనస్కా మత్ర్పాణా మదర్థే త్యక్త దైహికాః

మామేవ దయితం ప్రేష్ఠమాత్మానం మనసా గతాః

యే త్యక్తలోకధర్మాశ్చ మదర్థే తాత తాన్ బిభర్మ్యహమ్

నాయనా! ఆ గోపికల మనస్సు నామీదే గలదు. వారికి నేనే ప్రాణము. వారు నా కొరకై దేహముతో సంబంధము గల బంధువులను కూడ విడిచి పెట్టినారు. వారు నన్నే ప్రియునిగా, ప్రియతమునిగా, ఆత్మనుగా మనస్సు చే పొందినవారు. ఎవరైతే నా అనుగ్రహము కొరకై ఇహపర సుఖములను, ధర్మములను కూడ వీడి చెదరో, వారిని నేను పాలించెదను.

మయి తాః ప్రేయసాం ప్రేష్ఠే దూరస్థే గోకులస్త్రియః

స్మరంత్యోంఽగ విముహ్యంతి విరహౌత్కంఠ్యవిహ్వలాః

ఓయీ! గోపికలకు ప్రియతముడనైన నేను వారికి దూరము కాగా, ఆ విరహముచే వారు ఉత్కంఠతో వ్యాకులపడెదరు. వారు నన్ను గుర్తు చేసుకొని అధికమగు మోహమును పొందెదరు.

ధారయంత్యతికృచ్ఛ్రేణ ప్రాయః ప్రాణాన్ కథంచన

ప్రత్యాగమనసందే శైర్వల్లవ్యో మే మదాత్మికాః

గోపికలు నాతో అభేదమును పొందిరి. బహుశా వారు నేను తిరిగి రాగలననే సందేశములచే చాల కష్టముతో ఏదో విధముగా ప్రాణములను నిలబెట్టుకొని యుందురు.

శ్రీశుక ఉవాచ

ఇత్యుక్త ఉద్ధవో రాజన్ సందేశం భర్తురాదృతః

ఆదాయ రథమారుహ్య ప్రయయౌ నందగోకులమ్

 శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- మహారాజా! శ్రీకృష్ణుడిట్లు చెప్పగా, ఉద్ధవుడు ఆదరముతో ఆ ప్రభుని సందేశమును తీసుకొని, రథమునెక్కి నందుని గోకులమునకు వెళ్లెను.

ప్రాప్తో నందప్రజం శ్రీమాన్ నిమ్లోచతి విభావసౌ

ఛన్నయానః ప్రవిశత్రం పశూనాం ఖుర రేణుభిః

శోభాయుక్తుడగు ఉద్ధవుడు సూర్యుడస్తమించు సరికి నందుని గోకులమును చేరెను. ఇళ్లకు తిరిగి వెళ్లే పశువుల డెక్కల ధూళిచే ఆయన రథము కప్పివేయబడెను.

వాసితార్థేఽభియుధ్యద్భర్నాదితం శుష్మిభిర్వృషైః

ధావంతీ భిశ్చ వాస్రాభిరూధోభా రైస్స్వవత్సకాన్

పశువుల మందలోని మదించిన ఎద్దులు ఆవులకై పోటీ పడుతూ నాదములను చేయుచుండెను. బరువెక్కిన పొదుగులతో ఆవులు తమ దూడల కొరకు పరుగులు తీయుచుండెను.

ఇతస్తతో విలంఘద్భిర్గోవత్ఫైర్మండితం సితైః

గోదోహశబ్దాభిరవం వేణూనాం నిస్స్వనేన చ

ఇటునటు గెంతులు వేయుచున్న ఆవు దూడలు గోకులమునకు అలంకారమాయెను. గోకులమంతా పాలను పితికే శబ్దములతో మరియు పిల్లన గ్రోవుల ధ్వనులతో నినదించెను.

గాయంతీభిశ్చ కర్మాణి శుభాని బలకృష్ణయోః

స్వలంకృతాభిర్గోపీ భిర్గో పైశ్చ సువిరాజితమ్

గోపికలు చక్కగా బలరామ శ్రీకృష్ణుల మంగళకరమైన లీలలను గానము చేయుచుండిరి. వారు, గోపాలకులు గోకులము యొక్క శోభను ఇనుమడింప జేసిరి.

అగ్న్యర్కాతిథిగోవి ప్రపితృదేవార్చనాన్వితైః

ధూపదీ పైశ్చ మాల్యైశ్చ గోపావా సైర్మనోరమమ్

అగ్నులు, సూర్యుడు, అతిథులు, గోవులు, వేదవేత్తలు, పితృదేవతలు, దేవతలను ఆరాధించే గోపాలకుల ఇళ్లతో, ధూపదీపములతో, మరియు పుష్పమాలలతో గోకులము శోభిల్లెను.

సర్వతః పుష్పితవనం ద్విజాలికులనాదితమ్

హంసకారండవాకీర్ణైః పద్మషండైశ్చ మండితమ్

గోకులమునందు అంతటా పుష్పించిన అడవులలో పక్షులు, శుమ్మెదలు గుంపులు నినదించుచుండెను. పద్మములతో నిండిన సరస్సులు హంసలతో, కారండవ (టర్కీ) పక్షులతో వ్యాప్త మై శోభిల్లెను.

తమాగతం సమాగమ్య కృష్ణస్యానుచరం ప్రియమ్

నందః ప్రీతః పరిష్వజ్య వాసుదేవధియాకర్చయత్

వచ్చిన ఉద్ధవుడు శ్రీకృష్ణునకు ప్రియమైన అనుచరుడు. నందుడు ఆయనను కలిసి ప్రీతిని పొందెను. నందుడు ఆయనను కౌగిలించుకొని, ఈతడు శ్రీకృష్ణుడే అనే భావనతో సత్కారములను చేసెను.

భోజితం పరమాన్నేన సంవిష్టం కశిపౌ సుఖమ్

గతశ్రమం పర్యపృచ్ఛత్పాదసంవాహనాదిభిః

ఉద్ధవుడు శ్రేష్ఠమైన ఆహారమును భుజించి సుఖముగా ఆసనము పై కూర్చుండెను. కాళ్లను నొక్కుట, వీచుట మొదలైన (సేవకుల) సపర్యలచే ఆయన శ్రమ దూరమయ్యెను. అప్పుడు నందుడిట్లు ప్రశ్నించెను.

కచ్చిదంగ మహాభాగ సఖా నశ్శూరనందనః

ఆస్తే కుశల్యపత్యా ద్యైర్యుక్తో ముక్తస్సుహృద్వృతః

ఓయీ ఉద్ధవా! నీవు గొప్ప భాగ్యశాలివి. శూరుని పుత్రుడగు వసుదేవుడు మా మిత్రుడు. ఆయన కారాగారమునుండి విడుదల ఆయెను. ఆయన సంతానము, మిత్రులు, బంధువులు మొదలగువారితో కలిసి కుశలముగా నున్నాడా?

దిష్ట్యా కంసో హతః పాపస్సానుగ స్స్వేన పాప్మనా

సాధూనాం ధర్మశీలానాం యదూనాం ద్వేష్టి యస్సదా

పాపియగు కంసుడు తన అనుచరులతో దైవానుగ్రహముచే తన పాపము చేతనే సంహరించబడినాడు. ఆతడు సజ్జనులు, ధర్మశీలురు అగు యాదవులను సర్వకాలములయందు ద్వేషించెడివాడు.

అపి స్మరతి నః కృష్ణో మాతరం సుహృదస్సఖీన్

గోపాస్ వ్రజం చాత్మనాథం గావో బృందావనం గిరిమ్

శ్రీ కృష్ణుడు మమ్ములను, తల్లిని, బంధువులను, మిత్రులను, గోపాలకులను, తానే రక్షకుడుగా గోకులమును, గోవులను, బృందావనమును, గోవర్ధన పర్వతమును స్మరించుచున్నాడా?

ఆప్యాయాస్యతి గోవిందస్స్వజనాన్ సకృదీక్షితుమ్

తర్హి ద్రక్ష్యామ తద్వక్త్రం సునసం సుస్మితేక్షణమ్

గోవిందుడు తనవారిని చూచుటకు ఒక్కసారి వచ్చునా? వచ్చినచో, అందమైన ముక్కు, చక్కని చిరునవ్వుతో కూడిన చూపులు గల ఆతని ముఖమును అప్పుడు చూచెదము.

దావాగ్నేర్వాతవర్షాచ్చ వృషసర్పాచ్చ రక్షితాః

దురత్యయేభ్యో మృత్యుభ్యః కృష్ణేన సుమహాత్మనా

శ్రీకృష్ణుడు గొప్ప మహాత్ముడు. ఆయన మమ్ములను కార్చిచ్చు, గాలివాన, వృషభాసురుడు, అఘాసురుడు మొదలైన అతిక్రమించ శక్యము కాని మృత్యువులనుండి రక్షించినాడు.

స్మరతాం కృష్ణవీర్యాణి లీలాఽపాంగనిరీక్షితమ్

హసితం భాషితం చాంగ సర్వా నశ్శిథిలాః క్రియాః

ఓయీ! మేము చేసుకుంటూండగా, శ్రీకృష్ణుని పరాక్రమములు, విలాసతోడి ఓరచూపు, నవ్వు, పలుకు గుర్తుకు వచ్చి పనులు చెడిపోవుచున్నవి.

 సరిచ్ఛైలవనోద్దేశాన్ముకుందపదభూషితాన్

ఆక్రీడానీక్షమాణానాం మనో యాతీ తదాత్మతామ్

మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని పాదముల గుర్తులచే అలంకరించబడిన నదీతీరములను, పర్వతసానువులను, అడవులను, ఆట స్థలములను చూస్తూంటే మా మనస్సు ఆయనతో ఐక్యమును పొందుచున్నది.

మన్యే కృష్ణం చ రామం చ ప్రాప్తావిహ సురోత్తమౌ !

సురాణాం మహదర్థాయ గర్గస్య వచనం తథా

శ్రీకృష్ణ బలరాములు దేవతల యొక్క గొప్ప ప్రయోజనమును సిద్ధింప జేయుటకై ఇచటకు వచ్చిన దేవనాయకులని నేను తలచెదను. గర్గాచార్యుడు అటులనే చెప్పినారు.

కంసం నాగాయుత ప్రాణం మల్లౌ గజపతిం తథా

అవధిష్టౌం లీలయైవ పశూనివ మృగాధిపః

వారిద్దరు పదివేల ఏనుగుల బలము గల కంసుని, చాణూరముష్టికులనే ఇద్దరు మల్లులను, గజరాజును అవలీలగానే, మృగేంద్రుడగు సింహము పశువులను వలె, సంహరించిరి.

తాలత్రయం మహాసారం ధనుర్యష్టిమివేభరాట్

బభంజైకేన హస్తేన సప్తాహమదధాద్గిరిమ్

మూడు తాటి చెట్ల పొడవు కలిగి మిక్కిలి దృఢమైన ధనుస్సును శ్రీకృష్ణుడు ఒక్క చేతితో, గజేంద్రుడు కట్టెను వలె, విరుగగొట్టెను. ఆయన ఏడు రోజులు నిరంతరముగా గోవర్ధన పర్వతమును పట్టుకొని నిలబడెను.

ప్రలంబో ధేనుకోఽరిష్టస్తృణావర్తో బకాదయః

దైత్యాస్సురాసురజితో హతా యేనేహ లీలయా

శ్రీకృష్ణుడు ఈ బృందావనములో ప్రలంబుడు, ధేనుకుడు, అరిష్టాసురుడు, తృణావర్తుడు, బకుడు, అఘాసురుడు మొదలైన రాక్షసులను అవలీలగా పరిమార్చెను. వారందరు దేవతలపై మరియు రాక్షసులపై ఇదివరలో విజయమును సాధించినవారే.

శ్రీశుక ఉవాచ

ఇతి సంస్మృత్య సంస్కృత్య నందః కృష్ణానురక్తధీః

అత్యుత్కంఠోఽభవత్తూష్ణీం ప్రేమప్రసరవిహ్వలః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- మనస్సులో శ్రీకృష్ణునిపై అధికమగు అనురాగము గల నందుడి విధముగా పలు మార్లు స్మరించి, ప్రేమ యొక్క ప్రవాహముచే వ్యాకులుడాయెను. శ్రీకృష్ణుని చూడాలనే అతిశయించిన ఉత్కంఠ గల ఆయన మిన్నకుండెను.

యశోదా వర్ణ్యమానాని పుత్రస్య చరితాని చ

శృణ్వంత్యక్రూణ్యవాస్రాక్షీత్ స్నేహస్నుతపయోధరా

శ్రీకృష్ణునియందలి ప్రేనుచే యశోద పాలిండ్లు పాలను స్రవించెను. ఆమె పుత్రుని లీలలు వర్ణించబడుతూంటే వింటూ కన్నీళ్లను వర్షించెను.

తయోరిత్థం భగవతీ కృష్ణే నందయశోదయోః

వీక్ష్యానురాగం పరమం నందమాహోద్ధవో ముదా

యశోదానందులకు శ్రీకృష్ణ భగవానుని పై ఇటువంటి అతిశయించిన ప్రేమ గలదు. దానిని చూచి ఉద్ధవుడు ఆనందముతో నందునితో నిట్లనెను.

ఉద్ధవ ఉవాచ

యువాం శ్లాఘ్యతమౌ నూనం దేహినామిహ మానద

నారాయణేఽఖిలగురౌ యత్కృతా మతిరీదృశీ

ఉద్ధవుడిట్లు పలికెను --- సమ్మానమునిచ్చే ఓ నందా! ఈ లోకములోని ప్రాణులలో మీరిద్దరు అత్యధికముగా కొనియాడ దగినవారు. ఏలయన, సకల ప్రాణులకు తండ్రియగు నారాయణునిపై మీరు ఇటువంటి ప్రేమను కలిగియున్నారు.

ఏతౌ హి విశ్వస్య చ బీజయోనీ రామో ముకుందః పురుషః ప్రధానమ్,

అన్వీయ భూతేషు విలక్షణస్య జ్ఞానస్య చేశాత ఇమౌ పురాణౌ

మోక్ష ప్రదాత, పూర్ణ బ్రహ్మ అగు శ్రీకృష్ణుడు జగత్తు యొక్క నిమిత్తకారణము మాయాశక్తియగు బలరాముడు ఉపాదాన కారణము. కాలాతీతులగు వీరిద్దరు ప్రాణులలో ప్రవేశించి, వివిధములైన అంతఃకరణములను అంతర్యాములై నియంత్రించుచున్నారు.

 యస్మిఞ్జనః ప్రాణవియోగకాలే క్షణం సమావేశ్య మనో విశుద్ధమ్,

నిర్ఘృత్య కర్మాశయమాశు యాతి పరాం గతిం బ్రహ్మమయోఽర్కవర్ణః

మానవుడు ప్రాణము పోయే సమయములో మనస్సును పరమాత్మ పై ఏకాగ్రము చేసినచో, వాని కర్మరాశి వెంటనే దగ్ధమగును. అట్టివాడు సర్వోత్కృష్టపురుషార్థమగు మోక్షమును పొంది స్వయంప్రకాశపరబ్రహ్మయందు విలీనమగును.

తస్మిన్ భవంతావఖిలాత్మ హేతౌ

నారాయణే కారణమర్త్యమూర్తౌ

భావం విధత్తాం నితరాం మహాత్మన్

కిం వాఽవశిష్టం యువ యోస్సుకృత్యమ్

ఆ నారాయణుడే సకలజగత్తునకు ఉపాదాననిమిత్తములగుచున్నాడు. ఆయన దేవకార్యమును చక్కబెట్టుటకై మానవరూపమును దాల్చిన సర్వవ్యాపకుడు. ఆయనయందు మీరిద్దరు నిరతిశయమైన అనురాగమును చేసిరి. మీరింకనూ చేయవలసిన పుణ్యకర్మ మిగిలియున్నదా? (లేదు).

ఆగమిష్యత్యదీర్ఘేణ కాలేన వ్రజమచ్యుతః

ప్రియం విధాస్యతే పిత్రోర్భగవాన్ సాత్వతాం పతిః

యాదవప్రభుడు (భక్తపాలకుడు) శ్రీకృష్ణ భగవానుడు తొందరలోనే గోకులమునకు వచ్చి తల్లిదండ్రులకు ప్రీతిని కలిగించగలడు.

హత్వా కంసం రంగమధ్యే ప్రతీవం సర్వసాత్వతామ్

యదాహ వస్సమాగత్య కృష్ణస్సత్యం కరోతి తత్

శ్రీకృష్ణుడు సకలయాదవులకు (భక్తులకు) శత్రువగు కంపని మల్లరంగము మధ్యలో వధించిన వెంటనే మీ వద్దకు వచ్చి ఏ మాటను చెప్పెనో, దానిని ఆయన తప్పక నిలబెట్టుకొనును.

మా ఖిద్యతం మహాభాగౌ ద్రక్ష్యథః కృష్ణ మంతికే

అంతర్హృది స భూతానామాస్తే జ్యోతిరి వైధసి

ఓ యశోదానందులారా! మీరు మహాభాగ్యశాలురు. మీరు ఖేదపడకుడు. మీరు తొందరలో శ్రీకృష్ణుని చూచెదరు. కట్టెలయందు అగ్ని వలె, ఆయన ప్రాణుల హృదయము లోపల ఉన్నాడు.

న హ్యస్యాస్తి ప్రియః కశ్చిన్నా ప్రియో వ్యాస్త్యమానినః

నోత్తమో నాధమో నాపి సమానస్యాసమోకపి వా

శ్రీకృష్ణుడు దేహాభిమానము లేనివాడు, సమదృష్టి ఆయనకు ఎవడైననూ ప్రియుడు గాని, ప్రియము కానివాడు గాని, ఎక్కువ వాడు గాని, తక్కువ వాడు గాని లేదు. ఆయనకు అన్ని విధములుగా సమానమైనవాడు, అనగా ఉపేక్షించదగినవాడైననూ లేడు.

న మాతా న పితా తస్య న భార్యా న సుతాదయః

నాత్మీయో న పరశ్చాపి న దేహో జన్మ ఏవ చ

ఆయనకు తల్లి, తండ్రీ , భార్య, పుత్రుడు, సోదరుడు మొదలగువారు, తన వాడు, పరాయి వాడు, దేహము, పుట్టుక అనేవి లేనే లేవు.

న చాస్య కర్మ వా లోకే సదసన్మిశ్రయోనిషు

క్రీడార్థస్సోఽపి సాధూనాం పరిత్రాణాయ కల్పతే

ఈ లోకములో ఈయనకు కర్మబంధము లేదు. ఐనా, లీల కొరకు సత్పురుషులను రక్షించుటకై ఆయన దేవాది. సద్యోనులలో, పశ్వాది అసద్యోనులలో, మానవుడనే మిశ్రయోనియందు స్వేచ్ఛచే ప్రకటమగును.

సత్త్వం రజస్తమ ఇతి భజతే నిర్గుణో గుణాన్ !

క్రీడన్నతీతోఽత్ర గుణైస్సృజత్యవతీ హంత్యజః

ఆ మంమాత్మ గుణములకతీతుడు, పుట్టుక లేనివాడు. ఐననూ, ఆయన సత్త్వరజస్తమోగుణములను సేవించును. ఆయన ఈ లోకమునందు క్రీడించును. ఈ లోకమును ఆయన గుణములతో సృష్టించి, పాలించి, తనలో విలీనము చేసుకొనును.

 యథా భ్రమరికాదృష్ట్యా భ్రామ్యతీవ మహీయతే

చిత్తే కర్తరి తత్రాఽఽత్మా కర్తేవాహంధియా స్మృతః

గిర గిర తిరిగే చక్రము పై కూర్చుని తిరిగినప్పుడు భూమియే తిరుగుచున్నట్లు కొనవచ్చును. అదే విధముగా, చిత్తము పనులను చేయుచుండ, దానియందు నేననే తాదాత్మ్యబుద్ధిచే ఆత్మ (తాను) యే కర్తవలె అనుభవమునకు వచ్చును. (ఈశ్వరునియందు కర్తృత్వము లేదు).

యువయో రేవ నైవాయమాత్మజో భగవాన్ హరిః !

సర్వేషామాత్మజో హ్యాత్మా పితా మాతా స ఈశ్వరః

ఈ శ్రీకృష్ణ భగవానుడు మీ ఇద్దరికి మాత్రమే పుత్రుడు కానే కాదు. ఎందుకంటే, ఆ ఈశ్వరుడు అందరికీ పుత్రుడు మాత్రమే గాక, ఆత్మ తండ్రి, తల్లి కూడ అగును.

దృష్టం శ్రుతం భూతభపద్భవిష్యత్ స్థాస్నుశ్చరిష్ణుర్మహదల్పకం చ,

వినాఽచ్యుతాద్వస్తు తరాం న వాచ్యం స ఏవ సర్వం పరమార్దభూతః

చూచినది, విన్నది, గడచిపోయినది. ఇప్పటిది, భవిష్యత్తులోనిది, పెద్దది, చిన్నది, వస్తువు ఏదైనా ఆ పరమాత్మ లేకుండా దానికి వస్తువుగా మనుగడయే లేదు. సర్వము పరమార్థసద్రూపుడగు పరమాత్మయే.

ఏవం నిశా సా బ్రువతోర్వ్యతీతా నందస్య కృష్ణా నుచరస్య రాజన్,

గోప్యస్సముత్థాయ నిరూప్య దీపాన్వాస్తూన్సమభ్యర్చ్య దధీన్యమథ్నన్

ఓ పరీక్షిన్మహారాజా! నందుడు, శ్రీకృష్ణుని అనుచరుడగు ఉద్ధవుడు మాటలాడుచుండగనే ఆ రాత్రి గడిచిపోయెను. ఇంతలో గోపికలు (తెల్లవారు జామున) నిద్ర లేచి దీపములను వెలిగించి, ముంగిట వాకిటి మొదలగు వాటిని ముగ్గులతో అలంకరించి, పెరుగులను చిలికిరి.

తా దీపదీ ప్తైర్మణిభిర్వి రేజూ రజ్జూర్వికర్షద్భుజ కంకణ ప్రజః చలన్నితంబస్తనహారకుండలత్విషత్కపోలారుణ కుంకుమాననాః

ఆ గోపికలు కంకణముల వరుసలు గల భుజములతో (పెరుగును చిలికే) త్రాళ్లను లాగుతూ ఉంటే నితంబములు, స్తనములు, హారములు కదలాడుచుండెను. వారి చెక్కిళ్లు కుండలముల కాంతులతో, ముఖములు ఎర్రని కుంకుమతో శోభిల్లెను. ఆభరణములయందలి మణులు దీపకాంతులలో ధగధగలాడుచుండ వారు అధికముగా ప్రకాశించిరి.

ఉద్గాయతీ నామరవిందలోచనం ప్రజాంగనానాం దివమస్పృశద్ధ్వనిః

దద్ధ్నశ్చ నిర్మంథసశబ్దమిశ్రితో నిరస్యతే యేన దిశామమంగలమ్

గోపికలు పద్మములవంటి కన్నులు గల శ్రీకృష్ణుని కీర్తిని బిగ్గరగా గానము చేయుచుండిరి. ఆ ధ్వని పెరుగును చిలికే ధ్వనితో కలిసి అంతరిక్షమును తాకి, దిక్కులయందు వ్యాపించి వాటియందలి అమంగళమును పారద్రోలును.

భగవత్యుదితే సూర్యే నందద్వారి వ్రజౌకసః

దృష్ట్వా రథం శాతకౌంభం కస్యాయమితీ చాబ్రువన్

సూర్యభగవానుడుదయించెను. గోకులవాసులు నందుని ఇంటి వద్ద బంగరు రథమును చూచి, ఇది యెవరిది? అని ప్రశ్నించుకొనిరి.

అక్రూర ఆగతః కిం వా యః కంసస్యార్థసాధకః

యేన నీతో మధుపురీం కృష్ణః కమలలోచనః

కంసునకు పనులను చేసి పెట్టే అక్రూరుడు వచ్చినాడా యేమి ? ఈతడు పద్మములవంటి కన్నులు గల కృష్ణుని మథురకు కొనిపోయినాడు.

కిం సాధయిష్యత్యస్మాభిర్భర్తుః ప్రేతస్య నిష్కృతిమ్

ఇతి స్త్రీణాం వదంతీనాముద్ధవోఽగాత్కృతాహ్నికః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

పూర్వార్ధే షట్చత్వారింశోకధ్యాయః

మరణించిన తన ప్రభువగు కంసునకు మనతో పిండములను చేసి సమర్పించునా యేమి? అని స్త్రీలు పలుకుచుండిరి. ఇంతలో ఉద్ధవుడు స్నానాదికమును పూర్తి చేసుకొని వారి వద్దకు వెళ్లెను.

శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో

ఉద్ధవుడు గోకులమునకు వెళ్లుటను వర్ణించే

నలుబది ఆరవ అధ్యాయము ముగిసినది (46).