88 - వృకాసురుని వృత్తాంతము

రాజోవాచ !

దేవాసురమను ష్యేషు యే భజంత్యశివం శివమ్

ప్రాయస్తే ధనినో భోజా న తు లక్ష్మ్యాః పతిం హరిమ్

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- దేవతలు, రాక్షసులు, మానవులలో ఎవరైతే అమంగళ వేషధారి (విరాగి) యగు శివుని భజింతురో, వారు తరుచుగా ధనవంతులు, భోగపరాయణులు అగుచున్నారు. కానీ, దీనికి భిన్నముగా, లక్ష్మీపతియగు శ్రీహరిని సేవించువారు అట్లు లేరు.

ఏతద్వేదితుమిచ్ఛామస్సందేహోఽత్ర మహాన్ హి నః

విరుద్ధశీలయోః ప్రభ్వోర్విరుద్ధా భజతాం గతిః

ఈ విషయమును మేము తెలియగోరుచున్నాము. ఎందుకంటే, ఈ విషయములో మాకు పెద్ద సందేహము గలదు. విరుద్ధమగు స్వభావములు (త్యాగభోగములు) గల ప్రభువులిద్దరి భక్తులకు లభించే ఫలము (భోగత్యాగములు) విరుద్ధముగా ఉండుటకు కారణమేమి?

శ్రీశుక ఉవాచ

శివశ్శక్తియుతశ్శశ్వత్తిలింగో గుణసంవృతః

వైకారిక స్తైజసశ్చ తామస శ్చేత్యహం త్రిధా

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను ---- శివుడు సర్వదా శక్తి (త్రిగుణాత్మకము) తో కూడి సమష్టి-అహంకారరూపుడై యుండును. ఆ మూడు గుణములు ఆయనకు ఉపాధులు. అవి ఆయన యథార్థస్వరూపమును కప్పివేయును. ఆ అహంకారము వైకారికము, తైజసము, తామసము అని మూడు రకములు.

తతో వికారా అభవన్ షోడశామీషు కంచన

ఉపధావన్ విభూతీనాం సర్వాసామశ్నుతే గతిమ్

వైకారిక (సాత్త్విక) అహంకారమునుండి మనస్సు, తైజస (రాజస) అహంకారమునుండి పది ఇంద్రియములు (కర్మేంద్రియములు ఐదు, జ్ఞానేంద్రియములు ఐదు), తామసాహంకారమునుండి పంచభూతములు, వెరసి పదహారు కార్యములు పుట్టినవి. సాధకుడు వీటిలో ఏ అధిష్ఠానదేవతను ఉపాసించినా, సకలసంపదలను ఫలముగా పొందును.

హరిర్హి నిర్గుణస్సాక్షాత్పురుషః ప్రకృతేః పరః

స సర్వదృగుపద్రష్టా తం భజన్నిర్గుణో భవేత్

శ్రీహరియైతే నిర్గుణుడు, సాక్షాత్తు పూర్ణ బ్రహ్మ. ప్రకృతికి అతీతుడగు ఆయన సర్వజ్ఞుడు, సాక్షి. ఆయనను భజించువాడు ముక్తుడగును.

నివృత్తేష్వశ్వమేధేషు రాజా యుష్మత్పితామహః

శృణ్వన్ భగవతో ధర్మానపృచ్ఛదిదమచ్యుతమ్

అశ్వమేధయాగములు పూర్తి అయిన పిదప మీ తాతగారు ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునినుండి ధర్మములను వినుచుండెను. ఆయన ఆ అచ్యుతుని ఇట్లు ప్రశ్నించెను.

స ఆహ భగవాంస్త స్మై ప్రీతశుశ్రూష వే ప్రభుః

 నృణాం నిశ్శ్రేయసార్థాయ యోఽవతీర్ణో యదోః కులే

మానవులకు మోక్షధర్మమునుపదేశించుటకై యదువంశములో అవతరించిన సర్వసమర్థుడగు ఆ శ్రీకృష్ణ భగవానునకు ధర్మములను వినగోరిన ధర్మరాజు పై ప్రీతి కలిగి ఇట్లు పలికెను.

శ్రీభగవానువాచ

యస్యాహమనుగృహ్ణామి హరి ష్యే తద్దనం శనైః

తతోఽధనం త్యజంత్యస్య స్వజనా దుఃఖదుఃఖితమ్

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- నేను ఎవనిని అనుగ్రహించెదనో, వాని ధనమును మెల్లగా హరించెదను. ఆతడు నిర్దనుడై దుఃఖముల పరంపరతో పీడితుడగును. అప్పుడు వీనిని బంధువులు విడిచి పెట్టెదరు.

స యదా వితథోద్యోగో నిర్విణ్ణస్స్యాద్దనేహయా

మత్పరైః కృతమైత్రస్య కరిష్యే మదనుగ్రహమ్

ఎప్పుడైతే ఆతని ప్రయత్నములు విఫలమై ధనమును పొందుటకై చేసే ప్రయత్నమునుండి విరక్తుడగునో, అప్పడాతడు నా ఏకాంత భక్తులతో మైత్రిని నెరపును. అప్పుడు నేనాతనిని అనుగ్రహించెదను.

తద్బ్రహ్మ పరమం సూక్ష్మం చిన్మాత్రం సదనంతకమ్

అతో మాం సుదురారాధ్యం హిత్వాఽన్యాన్ భజతే జనః

వేదములయందు ప్రసిద్ధమైనది, ప్రకృతికి అతీతమైనది, ఇంద్రియగోచరము కానిది, చిదనము, సదనము, దేశకాలపరిచ్ఛేదములు లేనిది అగు బ్రహ్మను ఆతడు ఆత్మరూపముగా తెలుసుకొని విముక్తుడగును. ఈ విధముగా నన్ను ఆరాధించుట చాల కష్టము. కావుననే, మానవులు నన్ను విడిచి ఇతరదేవతలనారాధించుచుందురు.

తతస్త ఆశుతో షేభ్యో లబ్దరాజ్యశ్రీయోద్దతాః

మత్తాః ప్రమత్తా వరదాన్ విస్మరంత్యవజానతే

ఆ విధముగా ఆరాధించిన తరువాత వారు తొందరగా సంతోషించే ఆ దేవతలనుండి రాజ్యము ఇత్యాది సంపదలను పొంది ధర్మమును తప్పెదరు. వారు అసావధానులై గర్వించి వరములనిచ్చినవారినే మరిచేదరు, లేదా అవమానించెదరు.

శ్రీశుక ఉవాచ

శాపప్రసాదయోరీశా బ్రహ్మవిష్ణుశీవాదయః

సద్యశ్శాపప్రసాదోఽoగ శివో బ్రహ్మా న చాచ్యుతః

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- ఓ పరీక్షిన్మహారాజా! బ్రహ్మదేవుడు, శ్రీహరి, శివుడు, ఇంద్రుడు మొదలగువారు శపించుటకు, వరములనిచ్చుటకు సమర్థులు. బ్రహ్మదేవుడు, శివుడు వెంట వెంటనే శాపములను, వరములను ఈయగా, శ్రీహరి మాత్రము అట్లు కాదు.

అత్ర చోదాహరంతీమమితిహాసం పురాతనమ్

వృకాసురాయ గిరిశో వరం దత్త్వాఽఽప సంకటమ్

ఈ సందర్భములో మహాత్ములు ఈ ప్రాచీనమగు వృత్తాంతమునుటంకించెదరు. కైలాసవాసియగు శివుడు వృకాసురునకు వరమునిచ్చి ఆపదలో పడెను.

వృకో నామాసురః పుత్రశ్శకునేః పథి నారదమ్

దృష్ట్వాఽఽశుతోషం పప్రచ్ఛ దేవేషు త్రిషు దుర్మతిః

వృకుడని ప్రసిద్ది చెందిన రాక్షసుడు, శకుని పుత్రుడు ఉండెను. ఆ దుర్బుద్ధి మార్గములో నారదుని ఇట్లు ప్రశ్నించెను --- త్రిమూర్తులలో శీఘ్రముగా ప్రసన్నమయ్యే దేవుడు యెవరు ?

స ఆహ దేవం గిరిశముపాధావాశు సిద్ద్యసి

యోఽల్పాభ్యాం గుణదోషాభ్యామాశు తుష్యతి కుప్యతి

ఆ నారదుడిట్లు చెప్పెను ... నీవు కైలాసవాసియగు దేవుని ఆరాధించుము. శీఘ్రముగా సిద్దిని బడయగలవు. ఆ దేవుడు తక్కువ గుణముచే శీఘ్రముగా ప్రీతుడగును, చిన్న తప్పుచే వెంటనే కోపించును.

దశాస్యబాణయోస్తుష్టః స్తువతోర్వందినోరివ

ఐశ్వర్యమతులం దత్త్వా తత ఆప సుసంకటమ్

రావణాసుర బాణాసురులు స్తోత్రపాఠకుల వలె స్తుతించగా శివుడు సంతోషించి, వారికి సాటిలేని సంపదనిచ్చి, పెద్ద ఆపదలను (కైలాసమును రావణుడు పెల్లగించుట, బాణుని నగరమునకు శివుడు కాపలా కాయుట) కొని తెచ్చుకొనెను.

ఇత్యాదిష్టస్తమసుర ఉపాధావత్స్వగాత్రతః

కేదార ఆత్మక్రవ్యేణ జుహ్వానోఽగ్నిముఖం హరమ్

నారదుడీ విధముగా ఉపదేశించెను. అప్పుడా రాక్షసుడు కేదార క్షేత్రమునందు తన దేహమునుండి మాంసమును కోసి హోమము చేస్తూ అగ్నియే ముఖముగా గల శివుని ఆరాధించెను.

దేవోపలబ్దిమప్రాప్య నిర్వేదా  త్సప్తమేఽహని

శిరోఽవృశ్చత్స్వధితినా తత్తీర్థ క్లిన్నమూర్ధజమ్

ఆతనికి దేవదర్శనము కాలేదు. ఏడవ నాడు ఆతడు నిస్పృహ చెంది, ఆ కేదారతీర్థములో స్నానము చేసి, కత్తితో తడి జుట్టుతోనున్న తలను నరికి హోమము చేయబోయెను.

తదా మహాకారుణికస్స ధూర్జటిః

యథా వయం చాగ్నిరివోత్థితోఽనలాత్

నిగృహ్య దోర్భ్యాం భుజయోర్న్యవారయత్

తత్స్పర్శనాద్భూయ ఉపస్కృతాకృతిః

అప్పుడు గొప్ప దయామయుడగు శివుడు అగ్నిహోత్రమునుండి అగ్నిదేవుడు వలె పైకి లేచి, చేతులతో వాని భుజములను గట్టిగా పట్టుకొని (తలను నరికే ప్రయత్నమునుండి) నివారించేను. ఎవరైనా ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే, మనము కూడ అట్లే చేసి ఉందుము. ఆయనయొక్క స్పర్శచే వృకుని గాయములన్నీ మానిపోయెను.

తమాహ చాంగాలమలం వృణీష్వ మే

యథాఽభికామం వితరామి తే వరమ్

ప్రీయేయ తోయేన నృణాం ప్రపద్యతాం

అహో త్వయాఽఽత్మా భృశమర్ద్యతే వృథా

వానితో శివుడిట్లనెను --- ఓయీ! చాలు, చాలు. నీ కోరికకు తగ్గట్లుగా వరమును కోరుకొనుము. నీకు వరమునిచ్చెదను. శరణాగతి చేసే మానవులు సమర్పించే నీటితో నేను ప్రీతి జెందెదను. నీవు వ్యర్థముగా దేహమునకు అధికమగు పీడను కలిగించుకొనుచున్నావు.

దేవం స వవ్రే పాపీయాన్ వరం భూతభయావహమ్

యస్య యస్య కరం శీర్ ష్ణి ధాస్యే స మ్రియతామితి

ఆ మహాపాపి శివునినుండి సకలప్రాణులకు భయమును కలిగించే వరమును కోరెను. నేను ఏయే వ్యక్తుల తలపై నా చేతిని పెడతానో, ఆయా వ్యక్తులు మరణించెదరు గాక! అని కోరెను.

తచ్ఛ్రుత్వా భగవాన్ రుద్రో దుర్మనా ఇవ భారత

ఓమితి ప్రహసంస్తస్మై దదేఽహేరమృతం యథా

ఆ మాటను విని శివ భగవానునకు మనస్సు చెడిపోయినదా అన్నట్లు ఆయెను. ఆయన నవ్వుతూ సరే అని, పామునకు పాలను వలే, వానికి వరమునిచ్చెను.

ఇత్యుక్తస్సోఽసురో నూనం గౌరీహరణలాలసః

స తద్వరపరీక్షాఽర్థం శంభోర్మూర్ధ్ని కిలాసురః

స్వహస్తం ధాతుమారేభే సోఽబిభ్యత్స్వకృతాచ్ఛివః

శివుడిట్లు పలుకగా, ఆ రాక్షసునకు గౌరీదేవిని అపహరించవలెననే అభిలాష కలిగెను. ఆ రాక్షసుడా వరమును పరీక్షించుటకై శివుని తలపై చేతిని పెట్టుటకు కూడ సంసిద్దుడాయెను. శివునకు తాను చేసిన పని వలన భయము సంప్రాప్తమయ్యెను.

తేనోపసృష్టస్సంత్రస్తః పరాధావన్ సవేపథుః

యావదంతం దీవో భూమేః కాష్ఠానాముదగాదుదక్

శివుడు అధికమగు భయముతో వణికిపోయెను. ఆయన ఆ రాక్షసుడు తరుముచుండగా వెనుదిరిగి, ద్యులోక భూలోకముల అంతము వరకు, ఉత్తరదిక్కు వైపు పరుగెత్తేను.

అజానంతః ప్రతినిధిం తూష్ణీ మాసన్ సురేశ్వరాః

తతో వైకుంఠమగమద్భాస్వరం తమసః పరమ్

ఈ ఆపదను నివారించే ఉపాయము తెలియక దేవనాయకులు మిన్నకుండిరి. అప్పుడు శివుడు చీకటికి ఆవల ఉజ్జ్వలముగా ప్రకాశించే వైకుంఠమునకు వెళ్లాను.

యత్ర నారాయణస్సాక్షాన్న్యాసీనాం పరమా గతిః

శాంతానాం న్యస్తదండానాం యతో నావర్తతే గతః

ప్రాణిహింసను విడిచి మనస్సును నిగ్రహించి సర్వసంగపరిత్యాగులైన మహాత్ములు పొందే పరమఫలము నారాయణుడు. సాక్షాత్తు ఆయనయే అక్కడనుండును. అక్కడకు చేరినవారికి మరల జన్మ ఉండదు.

తం తథావ్యసనం దృష్ట్వా భగవాన్ వృజినార్దనః

దూరాత్ప్రత్యుదియాద్భూత్వా వటుకో యోగమాయయా

భయములను పోగొట్టే నారాయణ భగవానుడు ఆ విధముగా కష్టము పాలైన శివుని చూచి. యోగమాయచే బ్రహ్మచారియై దూరమునుండి యెదురేగెను.

మేఖలాఽజీనదండాక్షై స్తేజసాఽగ్నిరివ జ్వలన్

అభివాదయామాస చ తం కుశపాణిర్వినీతవత్

మేఖల, కృష్ణమృగచర్మ, దండము, జపమాలలతో కూడిన ఆ బ్రహ్మచారి తేజస్సుతో అగ్ని వలె గొప్పగా ప్రకాశించెను. ఆతడు వినయముతో ఆ రాక్షసునకు నమస్కరించెను.

శ్రీభగవానువాచ !

శాకునేయ భవాన్ వ్యక్తం శ్రాంతః కిం దూరమాగతః

క్షణం విశ్రమ్యతాం పుంస ఆత్మాఽయం సర్వకామధుక్

నారాయణ భగవానుడిట్లు పలి కెను - శకునిపుత్రా! నిన్ను చూస్తే అలిసి నావని తెలుస్తూనే ఉంది. దూరమునుండి వచ్చినావా యేమి? క్షణకాలము విశ్రమించుము. వ్యక్తికి ఈ దేహము సకలకామనలను తీర్చే కామధేనువు.

యది నశ్శ్రవణాయాలం యుష్మద్వ్యవసితం విభో

భణ్యతాం ప్రాయశః పుంభిర్ధృతైస్స్వార్థాన్ సమీహతే

ఓ ప్రభూ! నేను వినుటకు యోగ్యమైనచో మీరు చేయదలచుకున్న పనిని గురించి చెప్పడు. వ్యక్తి తరుచుగా ఇతరులను సహాయులుగా కలుపుకుని తన ప్రయోజనమును సాధించగల్గును.

శ్రీశుక ఉవాచ

ఏవం భగవతా పృష్టో వచసాఽమృతవర్షిణా

గతక్లమోఽబ్రవీత్త స్మై యథాపూర్వమనుష్ఠితమ్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- భగవానుడు అమృతమును వర్షించే వాక్కుతో ఇట్లు ప్రశ్నించగా, ఆతడు / జరిగిన వృత్తాంతమును ముందునుండి క్రమమును తప్పకుండా చెప్పెను.

శ్రీభగవానువాచ

ఏవం చేత్తర్హి తద్వాక్యం న వయం శ్రద్దధీమహి

యో దక్షశాపాత్ర్పేశాచ్యం ప్రాప్తః ప్రేతపిశాచరాట్

శివుడు నీకు వరములిచ్చినాడా? అటైనచో, మేము ఆయన మాటను నమ్ముటలేదు. ఆయనకు దక్షుని శాపముచే పిశాచభావము వచ్చి, పిశాచములకు ప్రేతములకు రాజైనాడు.

యది వస్తత్ర విశ్రంభో దానవేంద్ర జగద్గురౌ

తర్హ్యంగాశు స్వశిరసి హస్తం న్యస్య ప్రతీయతామ్

ఓ రాక్షసరాజా! ఆ శివుడు జగద్గురువని ఆయన మాట సత్యమని నీకు నమ్మకమున్నదా? ఓయీ వెంటనే చేతిని నీ తలపై పెట్టి పరీక్షించుము.

యద్యసత్యం వచశ్శంభోః కథంచిద్దానవర్షభ

తదైనం జహ్యసద్వాచం న యద్వ క్తాఽనృతం పునః

ఓ రాక్షసశ్రేష్ఠా! శివుని మాట అసత్యమని తేలినచో, అసత్యమును పలికే ఈయనను ఏ విధముగానైననూ సంహరించుము. అప్పుడు మరల అసత్యమును చెప్పబోడు.

ఇత్థం భగవతశ్చిత్రైర్వచోభిస్స సు పేశలైః

భిన్నధీర్విస్మృతశ్శీర్ ష్ణి స్వహస్తం కుమతీర్వ్యధాత్

ఈ విధముగా నారాయణ భగవానుని మిక్కిలి మధురములై భ్రమను కలిగించే మాటలచే బుద్ధి జారిపోయి, ఆతడు వరము యొక్క అర్థమును మరిచెను. ఆ దుర్బుద్ధి తన చేతిని తలపై పెట్టుకొనెను.

అథాపతద్భిన్నశిరా వజ్రాహత ఇవ క్షణాత్

జయశబ్దో నమశ్శబ్దస్సాధుశబ్దోఽభవద్దివి

అప్పుడాతని తల వెంటనే పగిలి, వజ్రపు దెబ్బ తిన్నవాడు వలె నేల గూలెను. స్వర్గమునందు జయధ్వానములు, నమస్కారశబ్దములు, బాగు బాగు అనే శబ్దములు బయలుదేరినవి.

ముముచుః పుష్పవర్షిణి హతే పాపే వృకాసురే

దేవర్షిపితృగంధర్వా మోచితస్సంకటాచ్ఛివః

పాపియగు వృకాసురుడు వధించబడగా దేవతలు, మహర్షులు, పితరులు, గంధర్వులు పూల వానలను కురిపించిరి. శివుడు ఆపదనుండి గట్టెక్కించబడెను.

ముక్తం గిరిశమభ్యాహ భగవాన్ పురుషోత్తమః

అహో దేవ మహాదేవ పాపోఽయం స్వేన పాప్మనా

హతః కో ను మహత్స్వీశ జంతుర్వై కృతకిల్బిషః

క్షేమీ స్యాత్కిము విశ్వేశే కృతాగస్కో జగద్గురౌ

విముక్తు డైన కైలాసవాసియగు శివునితో పురుషోత్తమ భగవానుడిట్లు పలికెను --- ఆహా! ఓ దేవా! మహాదేవా! ఈ పాపిని తన పాపమే మట్టుబెట్టినది. ఓ ఈశ్వరా! మహాత్ముల యెడల పాపమును చేసిన ఏ ప్రాణి క్షేమముగా నుండును? (ఏదీ ఉండదు). నీవు జగత్తునకు తండ్రివి, సర్వేశ్వరుడవు. నీయందు పాపము చేసినవాడు క్షేమముగా నుండలేడని వేరుగా చెప్పవలెనా? (అక్కరలేదు).

య ఏవమవ్యాకృతశక్త్యుదన్వతః పరస్య సాక్షాత్పరమాత్మనో హరేః

గిరిత్రమోక్షం కథయేచ్ఛృణోతి వా విముచ్యతే సంసృతిభిస్తథాఽరిభిః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

ఉత్తరార్ధే అష్టాశీతితమోఽధ్యాయః

ప్రకృతికి అతీతుడగు శ్రీహరి ఇంద్రియగోచరము కాని శక్తులకు సముద్రమువంటి వాడు. ఆయన ప్రాణులలో ఆత్మరూపుడై ఉన్నాడు. ఆయన సాక్షాత్తు కైలాసపాలకుడగు శివుని విముక్తుని చేసిన వృత్తాంతమును ఎవడు ప్రవచించునో, లేదా వినునో అట్టివాడు సంసారబంధములనుండి, మరియు శత్రుబాధనుండి విముక్తుడగును.

పదవ స్కంధము ఉత్తరార్ధములో భస్మాసురుని వృత్తాంతమును వర్ణించే

ఎనుబది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది.