1 - శ్రీకృష్ణావతారము - ఉపక్రమము

రాజోవాచ

కథితో వంశవిస్తారో భవతా సోమసూర్యయోః

 రాజ్ఞాం చోభయవంశ్యానాం చరితం పరమాద్భుతమ్

యదోశ్చ ధర్మశీలస్య నితరాం మునిసత్తమ

తత్రాం శేనావతీర్ణస్య విష్ణోర్వీర్యాణి శంస నః

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను -- మహర్షీ! మీరు సూర్యచంద్రవంశముల విస్తారమున చెప్పితిరి. ఆ రెండు వంశములకు చెందిన మహారా జుల చరితముమ కూడ వర్ణించితిరి. ఆ చరితము మిక్కిలి ఆశ్చర్యమును గొల్పునది. అతిశయించిన ధర్మస్వభావము గల యదు మహారాజు వంశముయొక్క విస్తారమును కూడ తమరు చెప్పితీరి, ఆ వంశమునందు శ్రీహరి తన అంశయగు బలరామునితో గూడి అవతరించి, గొప్ప ప్రభావ ముతో గూడిన కర్మలను చేసేను. ఆ వివరములను మాకు చెప్పుము.

అవతీర్య యదోర్వం శే భగవాన్ భూతభావనః

కృతవాన్ యాని విశ్వాత్మా తాని నో వద విస్తరాత్

సర్వమునకు ఆత్మయై సకలప్రాణులను పాలించే శ్రీహరి భగవానుడు యదువుయొక్క వంశమునందవతరించి ఏ లీలలను చే సెనో, వాటిని గురించి మాకు విస్తారముగా చెప్పుడు.

నివృత్తతర్షైరుపగీయమానాద్బహౌషధాచ్ఛ్రోత్రమనోఽభిరామాత్

క ఉత్తమశ్లోకగుణానువాదాత్పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్

తొలగిపోయిన వాసనలు మరియు భోగతృష్ణ గల జీవన్ముక్తులు కూడ పవిత్రకీర్తియగు శ్రీహరియొక్క గుణములను వర్ణించెదరు. ఇట్టి గుణవర్ణ నము సంసారమనే రోగమునకు మందు అగుటయే గాక, చేవులకు మరియు మనస్సునకు సుఖమును, ప్రీతిని కలిగించును. పశువులను చంపే కిరాతుడువంటివానికి అట్టి గుణవర్ణనమునందు ప్రీతి లేకుండవచ్చు ను. అట్టివానిని మినహాయిస్తే, శ్రీహరి గుణవర్ణనమునందు ఎవడు ప్రీతి జేయకుండును? (అందరు ప్రీతిని జేయుదురు).

పితామహా మే సమరేఽకమరంజయైః

దేవవ్రతాద్యాతిరథైస్తిమింగిలైః

దురత్యయం కౌరవ సైన్యసాగరం

కృత్వాఽతరన్ వత్సపదం స్మ యత్ప్లవాః

కౌరవుల సైన్యమే ఒక సముద్రము కాగా, దేవతలను సైతము జయించిన భీష్ముడు మొదలగు అతిరథులు ఆ సముద్రమునందలి తిమిం గిలములు. సముద్రమువంటీ ఆ సైన్యమును యుద్ధములో అతిక్రమించుట (జయించుట) సంభవమే కాదు. అయిననూ, నా తాతలగు పాండవులు ఆ శ్రీకృష్ణుడే నావ కాగా, నేలపై పడిన దూడ గిట్ల గురుతును నడుస్తూ దాటి నంత తేలికగా, దాటివేసిరి (విజయమును పొందిరి).

ద్రౌణ్యస్త్రవిప్లుష్టమిదం మదంగం సంతానబీజం కురుపాండవానామ్

జుగోప కుక్షిం గత ఆత్తచక్రో మాతుశ్చ మే యశ్శరణం గతాయాః

ఈ నా శరీరము కౌరవ పాండవ వంశములు రెండింటికీ బీజము. దానిని ద్రోణపుత్రుడగు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము దహించి వేయగా, నా తల్లియగు ఉత్తర ఈ శ్రీకృష్ణుని శరణు వేడెను. అపుడాయన. చక్రాయుధము (గీరగిర త్రిప్పబడిన గద) ను చేతబట్టి ఆమె ఉదరమును ప్రవేశించి ఈ నా దేహమును రక్షించెను.  

వీర్యాణి తస్యాఖీలదేహభాజా -

మంతర్బహిః పూరుషకాలరూపైః,

ప్రయచ్ఛతో మృత్యుముతామృతం చ  

మాయామనుష్యస్య వదస్వ విద్వన్

ఓ మహర్షీ! నీవు జ్ఞానివి. సకల దేహధారుల లోపల శ్రీహరి ఆత్మరూపుడై దేహేంద్రియాదులకు స్ఫూర్తిని, సత్తను అనుగ్రహిస్తూ ఆ విధముగా దర్శించువారికి మోక్షమునిచ్చుచున్నాడు. ఆ శ్రీహరియే సకలప్రాణులకు బయట కాలావయవముల రూపముగా నున్నవాడై . బహిర్ముఖులకు మృత్యువునే ఇచ్చుచున్నాడు. తన మాయాశక్తిచే మానవుడై అవతరించి ఆ శ్రీహరి వెలయించిన మహిమో పేతములైన చరితములను చెప్పడు.

రోహిణ్యాస్తనయః ప్రోక్తో రామస్సంకర్షణస్త్వయా

దేవక్యా గర్భసంబంధః కుతో దేహాంతరం వినా

దేవకీదేవి పుత్రులలో సంకర్షణదేవుడు పరిగణించబడినాడు. మరియు. సంకర్షణదేవుడు రోహిణీదేవి పుత్రుడగు బలరాముడైనాడని తమరు చెప్పి తీరి. సంకర్షణునకు మరియొక దేహమును స్వీకరించకుండా దేవకీగర్భముతో సంబంధము. (ఒకే దేహముతో, ఇద్దరు తల్లుల పుత్రుడగుట ఎట్లు పొసగును?

కస్మాన్ముకుందో భగవాన్ పితుర్గేహాద్వ్రజం గతః

క్వ వాసం జ్ఞాతిభిస్సార్ధం కృతవాన్ సాత్వతాం పతిః

మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణ భగవానుడు తన తండ్రియగు వసుదేవుని (మథురానగరమునందల్ని ఇంటిని విడిచి గోకులమునకు వెళ్లుటకు కారణ మేమి? భక్తపాలకుడగు. ఆయన నందుడు మొదలగు బంధుజనముతో గూడి ఎక్కడ నివసించెను?

వ్రజే వసన్ కిమకరోన్మధువుర్యాం చ కేశవః

భ్రాతరం చావధీత్కంసం మాతురద్ధాఽతదర్హణమ్

శ్రీకృష్ణుడు గోకులమునందు, మథురా నగరమునందు కూడ నివసించి. నప్పుడు ఏమి చేసెను? ఆయన స్వయానా తన తల్లి పోదరుడగు కంసుని సంహరించుటకు కారణమేమి? తల్లి సోదరుడు వధకు తగినవాడు కాడు గదా!

దేహం మానుషమాశ్రిత్య కతి వర్షాణి వృష్టిభిః

యదుపుర్యాం సహావాత్సీత్పత్న్యః కత్యభవన్ ప్రభోః

శ్రీహరి మానవ దేహమును దాల్చి యదువంశీయులతో గూడి యాద వుల నగరమగు ద్వారకయందు ఎన్ని సంవత్సరములు నివసించేను? ఆ ప్రభువునకు ఎందరు భార్యలు ఉండిరి?

ఏతదన్యచ్చ సర్వం మే మునే కృష్ణవిచేష్టితమ్

వక్తుమర్హసి సర్వజ్ఞ శ్రద్దధానాయ విస్తృతమ్

ఓ మహర్షీ! నీవు సర్వము దెలిసినవాడవు. శ్రీకృష్ణుని లీలలను నేను అడిగినవాటిని, అడగనివాటిని కూడ సర్వమును నాకు తమరు విస్తార ముగా చెప్పదగుదురు. ఎందుకంటే, నేను శ్రద్ద గలవాడను.

నైషాతిదుస్సహా క్షున్మాం త్యక్తాదమపి బాధతే

పిబంతం త్వన్ముఖాంభోజచ్యుతం హరికథామృతమ్

నేను నీటిని కూడ విడిచి పెట్టిననూ, నీ ముఖపద్మమునుండి జాలువారే శ్రీహరిగాథలు అనే అమృతమునాస్వాదించుచున్నాను. కావునే, ఈ ఆకలి మిక్కిలి సహించ శక్యము కానిదే అయిననూ, నన్ను పీడించుట లేదు.

సూత ఉవాచ

ఏవం నిశమ్య భృగునందన సాధువాదం

వైయాసకిస్స భగవానథ విష్ణురాతమ్

ప్రత్యర్చ్య కృష్ణ చరితం కలికల్మషఘ్నం

వ్యాహర్తుమారభత భాగవతప్రధానః

ఓ శౌనకా! నీవు భృగువంశీయులలో శ్రేష్ఠుడవు. వ్యాసపుత్రుడగు శుక మహర్షి పూజనీయుడు, భగవద్బక్తులలో ప్రముఖుడు. పరీక్షిత్తు వేసిన ఈ చక్కని ప్రశ్నను విని ఆయన పరీక్షిత్తును ముందుగా కొనియాడి, తరువా తనే శ్రీకృష్ణుని చరితమును చెప్పుటకు ఉపక్రమించేను. శ్రీకృష్ణుని గాథ కలిదోషములను నశింప జేయును.

శ్రీశుక ఉవాచ

సమ్యగ్వ్యవసీతా బుద్ధిస్తవ రాజర్షిసత్తమ

వాసుదేవకఠాయాం తే యజ్జాతా నైష్ఠికీ రతిః  

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను - రాజర్షులలో శ్రేష్టుడవగు ఓ పరీక్షిన్మహారాజా! నీ బుద్ధి యోగ్యమైన విశ్చయమును కలిగియున్నది. ఏలయనగా, నీకు శ్రీకృష్ణుని గాథలయందు అచంచలమైన ప్రీతి కలిగినది.

వాసుదేవకథాప్రశ్నః పురుషాంహ్రీన్ పునాతి హి

వక్తారం పృచ్ఛకం శ్రోతౄంపత్పాదసలిలం యథా

శ్రీకృష్ణ భగవానుని గాథలకు సంబంధించిన ప్రశ్న -- చెప్పువాడు, వినే ప్రతి వ్యక్తి, ప్రశ్నించువాడు -- అనే ముగ్గురిని, ఆయన పాదములనుండి పుట్టిన గంగ వలే, ఆయన పాదములనభి షేకించిన తీర్థము వలే, నిశ్చయ ముగా పావనము చేయును.

భూమిర్దృప్తనృపవ్యాజదైత్యానీకశతాయుతైః

ఆక్రాంతి భూరిభారేణ బ్రహ్మాణం శరణం యయౌ  

పదుల లక్షల సైన్యములు గల రాక్షసులు గర్వించిన రాజుల రూపములో రాజ్యమును చేయుచుండిరి. ఆ విధముగా భూమి మోయలేని బరు వును మోయుచుండెను. అపుడా భూదేవి బ్రహ్మదేవుని శరణు వేడెను.

గౌర్భూత్వాఽశ్రుముఖీ ఖన్నాక్రందంతీ కరుణం విభోః

ఆ భూదేవి గోరూపమును దాల్చి బ్రహ్మదేవుని వద్దకు వచ్చెను. ఆమె కన్నీరు నిండిన ముఖముతో జాలి కలిగే విధముగా రోదిస్తూ ఖేదమును పొందియుండెను. ఆమె బ్రహ్మదేవునకు తన ఆపదను వివరించెను.

బ్రహ్మా తదుపధార్యాథ సహ దేవైస్తయా సహ

జగామ సత్రినయనస్తీరం క్షీరపయోనిధేః

బ్రహ్మదేవుడు భూదేవియొక్క ఆపదను గురించి తెలుసుకొని, అప్పుడు ఆ భూదేవిని, దేవతలను వెంట బెట్టుకొని పాల సముద్రపు తీర మునకు వెళ్లాను. ముక్కంటి దేవుడు కూడ ఆయన వెంట వెళ్లెను.

తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిమ్

పురుషం పురుష సూక్తీన ఉపతస్థే సమాహితః

అచటకు వెళ్లి బ్రహ్మదేవుడు ఏకాగ్రమగు చిత్తములో నిలబడి పురుష పకమును పఠించి పగుముని సుతించెను. జగములను పాలించే ఆ శ్రీహరి భక్తులకు కోరికలను వర్షించి కష్టములను పారద్రోలును. ఆయనను దేవతలు కూడ ఆరాధించెదరు.

గిరం సమాధౌ గగనే సమీరితాం

నీశమ్య వేధాస్త్రిదశానువాచ హ

గాం పౌరుషీం మే శృణుతాఽమరాః పునః

విధీయతామాశు తథైవ మా చిరమ్

సమాధిలో తన హృదయాకాశమునందు పలుకబడిన వాక్కును బ్రహ్మదేవుడు వినెను. ఆయన అప్పుడు దేవతలనుద్దేశించి ఇట్లు పలికెను -- ఓ దేవతలారా! పురుషోత్తముడు నాకు చెప్పిన వచనమును నేను మీకు చేప్పెదను, వినుడు. వినిన తరువాత వెంటనే సరిగ్గా అదే విధముగా విలం బము లేకుండా అనుష్ఠించుడు.

పురైవ పుంసాఽవధృతో ధరాజ్వరో

భవద్బిరం శైర్యదుషూపజన్యతామ్

స యావదుర్వ్యా భరమీశ్వరేశ్వరః

స్వకాలశక్త్యా క్షపయంశ్చ రేద్భువి

భూదేవికి వచ్చిన ఆపద మనము విన్నవించుటకు ముందే శ్రీహరికి నిశ్చితముగా తెలియును. ఆయన భూలోకమునందు సంచరించి తన కాలము అనే శక్తి ద్వారా భూమియొక్క భారమును నశింప జేయగలడు. ఈశ్వరులకు కూడ ఈశ్వరుడగు ఆ శ్రీహరి ఆ పని చేసే లోపులో మీరు మీ మీ అంశలతో యదువంశీయులయందు జన్మించుడు.

వసుదేవగృహే సాక్షాద్భగవాన్ పురుషః పరః

జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రీయః

స్వయముగా పురుషోత్తమ భగవానుడే వసుదేవుని గృహములో (భా ర్యయందు) అవతరించ గలడు. ఆయనకు సేవను చేసి ప్రీతిని కలిగించుట కొరకై దేవతాస్త్రీలు జన్మించవలెను.

వాసుదేవకలాఽన్నంతస్సహస్రవదనస్స్వరాట్

అగ్రతో భవితా దేవో హరేః ప్రియచికీర్షయా

శ్రీహరి సర్వజగన్నివాసుడు, స్వయంప్రకాశ స్వరూపుడు. ఆయన అంశయగు అనంత భగవానుడు కూడ అట్టివాడే. ఆ వేయి పడగల దేముడు శ్రీహరికి ప్రీయమును చేయగోరి ఆయనకంటే ముందుగనే అవత రించగలడు.

విష్ణోర్మాయా భగవతీ యయా సమ్మోహితం జగత్

ఆదిష్టా ప్రభుణాంఽశేన కార్యార్థే సంభవిష్యతి

పూజనీయురాలైన విష్ణువు యొక్క మాయాశక్తిచే జగత్తు వ్యామోహిత మగుచున్నది. ఆ దేవి శ్రీహరిచే ఆదేశించబడి దేవ (అవతార) కార్యమును సాధించుట కొరకై అంశచే జన్మించగలదు.

శ్రీశుక ఉవాచ

ఇత్యాదిశ్యామరగణాన్ ప్రజాపతిపతీర్విభుః

ఆశ్వాస్య చ మహీం గీర్బిస్స్వధామ పరమం యయౌ

మరీచ్యాది . ప్రజాపతులకు ప్రభువగు బ్రహ్మదేవుడు దేవతల గణములనీ విధముగా ఆదేశించి, భూదేవిని కూడ మంచి మాటలతో ఓదార్చి, తన ధామమును గురించి వెళ్లేమ, ఆయన ధామము భూరాది. లోకములకంటె ఉత్కృష్టమైనది.

శూరసేనో యదుపతిర్మథురామావసన్ పురీమ్

మాథురాణ్చూర సేవాంశ్చ విషయాన్ బుభుజే పురా

పూర్వము యాదవప్రభువగు శూర సేనమహారాజు మథురా నగరమునందు నివసిస్తూ మథురామండలమును, శూర సేన మండలమును కూడ పాలించెను..

రాజధానీ తతస్పాఽభూత్పర్వయాదవభూభుజామ్

మథురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరిః

ఆ శూరసేనుని కాలమునుండీ ఆ మథురయే యాదవరాజులందరికీ రాజధాని ఆయెను. అక్కడ శ్రీహరి భగవానుని నిత్యసన్నిధి ఉండును.

తస్యాం తు కర్హిచిచ్చౌరిర్వసుదేవః కృతోద్వహః

దేవక్యా సూర్యయా సార్ధం ప్రయాణే రథమారుహత్

ఆ మథురమందైతే ఒకానొకప్పుడు శూరుని పుత్రుడగు వసుదేవుడు దేవకిని పెళ్లాడి, కొత్త పెళ్లికూతురుతో కూడి ప్రయాణము కొరకై రథమునెక్కెను.

ఉగ్రసేనసుతః కంపప్ప్వసుః ప్రియచికీర్షయా

రశ్మీవ్ హయాహం జగ్రాహ రౌక్మై రథశతైర్వృతః

కంసుడు ఉగ్రసేనుని కొడుకు. ఆతడు తన చెల్లెలు (పినతండ్రి కుమార్తె) అగు దేవకికి ప్రీతిని కలిగించగోరి స్వయముగా గుర్రముల కళైమును పట్టీ రథమును నడి పెను. ఆతని వెంట బంగరు రథములు వందల సంఖ్యలో నడిచెను.

చతుశ్శతం పారిబర్హం గజానాం హేమమాలినామ్

అశ్వానామయుతం సార్ధం రథానాం చ త్రిషట్చతమ్

దాసీనాం సుకుమారాణాం ద్వే శతే సమలంకృతే

దుహిత్రే దేవకః ప్రాదాద్యనే దుహితృవత్సలః

దేవకునకు (ఉగ్రసేనుని సోదరుడు) కుమార్తెయందు ప్రీతి మెండు. ఆమె అత్తవారింటికి వెళ్లే సమయములో ఆయన బంగరు మాలలు గల నాల్గు వందల ఏనుగులను, పదిహేను వేల గుర్రములను, పద్దెనిమిది వందల రథములను, చక్కగా అలంకరించుకున్న సుకుమారలైన రెండు వందలమంది దాసీలను కూడ పెళ్లికానుకగా ఇచ్చెను.

శంఖతర్యమృదంగాశ్చ నేదుర్దుందుభయస్సమమ్

ప్రయాణప్రక్రమే తావద్వరవధ్వోస్సుమంగలమ్

కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రయాణమునారంభించగా మొట్టమొదటనే శంఖములు, తూర్యములు, మద్దెళ్లు, భేరీలు కూడ మంగళమును సూచిస్తూ ఒక్కసారిగా మ్రోగినవి.

పథి ప్రగ్రహిణం కంసమాభాష్యాహాశరీరవాక్

అస్యాస్త్వామష్ఠ మో గర్భో హంతా యాం వహ సేఽబుధ

కళ్లెములను పట్టి రథమును నడుపుతూ ఉన్న కంసుని ఉద్దేశించి మార్గమధ్యములో ఆకాశవాణి ఇట్లు పలికెను - ఓరీ అవివేకీ! నీవు రథముపై ఏ దేవకిని తీసుకొని వెళ్లుచున్నావో, ఈమె ఎనిమిదవ సంతానము నిన్ను సంహరించును..

ఇత్యుక్తస్స ఖలః పాపో భోజానాం కులపాంసనః

భగినీం హంతుమారబ్దః ఖడ్గపాణిః కచేఽగ్రహీత్

దుష్టుడు, పాపి అయిన కంసుడు భోజవంశమునందు చెడబుట్టినాడు. ఈ విధముగా ఆకాశవాణి పలుకగా పాడు చేత కత్తిబట్టి చెల్లెలి కొప్పును పట్టుకొని ఆమెను సంహరించుటకు ఉద్యుక్తుడాయెను.

తం జుగుప్సితకర్మాణం నృశంసం నిరపత్రవమ్

వసుదేవో మహాభాగ ఉవాచ   పరిసాంత్వయన్

క్రూరుడైన కంసుడు సిగ్గు లేకుండా జనులు ఏవగించుకొనే పనిని చేయబోవుచుండగా, గొప్ప భాగ్యశాలియగు వసుదేవుడు మంచి మాటలతో బోధిస్తూ ఆతనితో నిట్లనెను.  

వసుదేవ ఉవాచ   

శ్లాఘనీయగుణశ్శూరైర్భవాన్ భోజయశస్కరః

స కథం భగినీం హన్యాత్ స్త్రీయముద్వాహపర్వణి

వసుదేవుడిట్లు పలికెను --- భోజవంశమునకు కీర్తిని కలిగించిన తమరి గుణములను శూరులు పొగిడెదరు. అట్టివాడు వివాహశుభవేళ చెల్లెలినట్లు చంపును? (చంపడు).

మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహ జాయతే

అద్య వాఽబ్దశతాంతే వా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః

వీరుడవగు ఓ కంసా! (వీరుడు మృత్యువుకు భయపడడు, స్త్రీని సంహరించడు) పుట్టుక గల జనులకు దేహముతో బాటే మరణము కూడ పుట్టును. ఈ నాడు గాని, వంద యేళ్ల తరువాత గాని, ప్రాణులకు మరణము నిశ్చితము గదా!

దే హే పంచత్వమాపన్నే దేహీ కర్మానుగోఽవశః

దేహాంతరమనుప్రాప్య ప్రాక్తనం త్యజతే వపుః

అస్వతంత్రుడగు జీవుడు - కర్మానుసారముగా ఒక దేహమునుండి మరియొక దేహమునకు పయనించుచుండును. ఈ దేహము పంచభూతములలో కలిసిపోవుటకు కాలము రాగా జీవుడు మరియొక దేహమును పొంది ముందటి (ఈ) దేహమును విడిచి పెట్టును.

ప్రజంస్తిష్ఠన్ పదైకేన యథేవైకేన గచ్చతి

యథా తృణజలూ కైవం దేహీ కర్మగతం గతః

నడిచే వ్యక్తి ఒక కాలితో నేల పై నిలిచి మరియొక కాలితో ముందుకు సాగును. గడ్డి పురుగు ఒక గడ్డిపోచను పట్టుకొని వెనుకటి. పోచను వదిలి పెట్టును. కర్మమార్గమునందు పయనించే జీవుడు కూడ అదే విధముగా చేయును.

స్వప్నే యథా పశ్యతి దేహమీదృశం

మనోరథేనాభినివిష్ట చేతనః

దృష్టశ్రుతాభ్యాం మనసాఽనుచింతయన్

ప్రపద్యతే తతిమపి హ్యపస్మృతిః

మానవుని మనస్సులో కామనలు గట్టిగా నాటుకొనియుండును. తాను చూచిన మరియు విన్న భోగసంస్కారములు ఆతని మనస్సులో ఉండును. ఆతడు నిద్రించీ ఆ మనస్సుతో కల గనును. ఆ కలలో జాగ్రద్దేహమును పోలిన ఒకానొక (ఈ విధంగా ఉండునని చెప్ప వీలుగాని) దేహమును చూచును. అతనికి అప్పుడు జాగ్రదవస్థయొక్క స్మరణము ఉండదు గనుక, ఆ దేహమే తానని భావించును. అదే విధముగా జీవుడు మరణించి ఈ దేహమును విడిచి సర్వమును విస్మరించి మరియొక దేహమునందు ఆత్మాభిమానమును పొందును.

యతో యతో ధావతి దైవచోదితం మనో వికారాత్మకమాప పంచసు,

గుణేషు మాయారచితేషు దేహ్యసౌ ప్రపద్యమానస్సహ తేన జాయతే.

వాసనాత్మకమైన మనస్సు దైవము (జన్మనిచ్చే కర్మ) చే ప్రేరితమై ఏయే దేహమువైపు పయనించునో, ఈ జీవుడు కూడ ఆ మనస్సుతో బాటే ఆ దేహమునే పొంది . జన్మించి దానియందు ఆత్మాభిమానమును కలిగియుండును. పంచభూతములతో తయారయ్యే ఈ దేహములన్నియు మాయాశక్తిచే నిర్మించబడినవే.

జ్యోతిర్య థైవోదకపార్థివేష్వదస్సమీరవేగానుగతం విభావ్యతే,

ఏవం స్వమాయారచితేష్వసౌ పుమాన్షుణేషు రాగానుగతో విముహ్యతి

ఒకే సూర్య (చంద్ర) బింబము వేర్వేరు నీటి పడియలలో ప్రతిఫలిస్తూ, గాలి వీచి ఆ నీరు కదిలినప్పుడు తాను కూడ కదులుతున్నట్లు కానవచ్చును. ఇదే విధముగా ఒకే పూర్ణ-ఆత్మ తన మాయాశక్తిచే నిర్మితములైన వేర్వేరు దేహములయందు ప్రవేశించి ఆయా దేహమునందు ఆసక్తిని కలిగి దేహతాదాత్మ్యముచే జీవభ్రాంతిని పొందియుండును.

తస్మాన్న కస్యచిద్ద్రోహమాచరేత్స తథావిధః

 ఆత్మనః క్షేమమన్విచ్ఛశోగ్ధుర్వై పరతో భయమ్

అందువలన ఈ విధముగా (దేహాభిమానముతో) మోహితుడైయున్న జీవుడు తనకు. (ఇహపరములలో) క్షేమమును కోరువాడైనచో, ఎవనికైననూ కీడు చేయరాదు. ఇతరులకు కీడు చేయు వానికి ఇహములో ఇతరుని వలన, పరములో యముని వలన భయము తప్పదు.

ఏషా తవానుజా బాలా కృపణా పుత్రికోపమా

హంతుం నార్హసి కల్యాణీమిమాం త్వం దీనవత్సలః

ఈ నీ చెల్లెలు అమాయకురాలు, నీకు కుమార్తెతో సమానము. మంగళప్రదురాలైన ఈమెను సంహరించుట దీనులయందు ప్రేమను చూపే నీకు తగదు.

శ్రీశుక ఉవాచ

ఏవం స సామభిర్బేధైర్బోధ్యమానోఽపి దారుణః

న న్యవర్తత కౌరవ్య పురుషాదాననువ్రతః

కురువంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! కంసుడు నరమాంసభక్షకులైన రాక్షసులను పట్టుదలతో అనుసరించే క్రూరుడు. వసుదేవుడు ఆతనికి సాంత్వవచనములతో మరియు పాపభీతిని కలిగించే మాటలతో ఉపదేశించిననూ, ఆతడు (పాపకర్మనుండి) వెనుదిరగలేదు.

నిర్బంధం తస్య తం జ్ఞాత్వా విచింత్యానకదుందుభిః

ప్రాప్తం కాలం ప్రతివ్యోడుమిదం తత్రాన్వపద్యత

వసుదేవుడు వాని ఆ హఠమును గుర్తించి ఆలోచించి వచ్చిపడిన మృత్యువును తప్పించుటకై ఆ సమయములో ఈ క్రింది) ఉపాయమును నిశ్చయించెను.

మృత్యుర్బుద్ధిమతాఽపోహ్యో యావద్బుద్ధిబలోదయమ్

యద్యసౌ న నివర్తేత నాపరాధోఽస్తి దేహినః

బుద్దిమంతుడగు వ్యక్తి తన బుద్దిని మరియు శక్తిని ఎంతవరకు అవకాశము ఉంటే అంతవరకు వినియోగించి మరణమునుండి తప్పించుకొనవలెను. ప్రయత్నించినా మరణము తప్పనిసరి యైనచో, అది వాని తప్పు కాదు.

ప్రదాయ మృత్యవే పుత్రాన్మోచయే కృపణామితమ్

సుతా మే యది జాయేరన్మృత్యుర్వా న మ్రియేత చేత్

చంపుటకు పుత్రులను వీనికి అప్పజెప్పి (మాట యిచ్చి) ఈ దీనురాలిని విడిపించేదను. నాకు పుత్రులు కలిగినప్పుడు గదా! ఈ లోపులో మృత్యురూపుడగు ఈ కంసుడే మృత్యువు వాత పడునేమో!

విపర్యయో వా కిం న స్యాద్గతీర్థాతుర్దురత్యయా

ఉపస్థితో నీవర్తేత నివృత్తః పునరాపతేత్

నాకు పుట్టబోయే బుడతడు ఈ కంసుని చంపుట అనే తల్లక్రిందులు కూడ కారాదా? (కావచ్చును), విధాతయొక్క సంకల్పము అతిక్రమించ శక్యము కానిది. మా ముందున్న మృత్యువు దూరమై, కంసునికే మృత్యువు రావచ్చును.

అగ్నేర్యథా దారువియోగయోగయోరదృష్టతోఽన్యత్ర నిమిత్తమస్తి

ఏవం స్త్రీ జంతోరపి దుర్విభావ్యశ్శరీరసంయోగవియోగ హేతుః

అడవిలో కార్చిచ్చు పుట్టినప్పుడు ఒక చెట్టు తగులబడగా, మరియొకటి క్షేమముగా నుండును. ఈ ఘటనలకు కారణము ఆయా జీవుల పుణ్యపాపములే తప్ప మరియొకటి కాదు. ఇదే విధముగా, జీవునకు ఒక శరీరముతోడి సంయోగము గాని, మరియొక దేహముతోడి వియోగము గాని, ఊహించ శక్యము కాని అదృష్టము పైననే ఆధారపడి

యుండును.

ఏవం విమృశ్య తం పాపం యావదాత్మనిదర్శనమ్

పూజయామాస వై శారిర్బహుమానపురస్సరమ్

శూరపుత్రుడగు వసుదేవుడు తన బుద్దికి తోచిన మేరకు ఈ విధముగా పూర్వాపరములనాలోచించుకొని, పాపియగు ఆ కంసుని పెద్ద ఆదరముతో ప్రశంసించెను.

ప్రసన్నవదనాంభోజో నృశంసం నిరపత్రపమ్

మనసా దూయమానేన విహసన్నిదమబ్రవీత్

వసుదేవుని మనస్సు సంతాపముతో నిండియున్ననూ ఆయన ముఖము ప్రసన్నముగా పద్మమును పోలియుండెను. ఆయన నవ్వుతూ, సిగ్గు లేకుండా క్రూరమగు పనికి పాల్పడ్డ కంసునితో ఇట్లు పలికెను.

వసుదేవ ఉవాచ  

న హ్యస్యాస్తే భయం సౌమ్య యద్వారాహాశరీరిణీ

పుత్రాన్సమర్పయి ష్యేఽస్యా యతస్తే భయముత్థితమ్

వసుదేవుడిట్లు పలికెను --- ప్రియదర్శనుడవగు ఓ కంసా! ఆకాశవాణి చెప్పిన ప్రాణభయము నీకు ఈమె వలన కలుగనే కలుగదు. ఈమె పుత్రుల వలన నీకు భయము గదా! ఆ పుత్రులను నేను నీకు సమర్పించెదను.

శ్రీశుక ఉవాచ

స్వసుర్వధాన్నివవృతే కంసస్తద్వాక్యసారవిత్

వసుదేవోఽపి తం ప్రీతః ప్రశస్య ప్రావిశద్గృహమ్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- వసుదేవుని మాటలలోని ఔచిత్యమును గుర్తించిన కంసుడు చెల్లెలిని చంపుట అనే క్రౌర్యమునుండి విరమించుకొనెను. వసుదేవుడు కూడ ప్రీతిని జెంది కంసుని ప్రశంసించి తన ఇంటికి చేరుకొనెను.

అథ కాల ఉపావృత్తే దేవకీ సర్వదేవతా

పుత్రానసుషువే చాష్ట్రా కన్యాం చైవానువత్సరమ్

తరువాత కాలము గడుచుచుండెను. అందరియందు పరబ్రహ్మను దర్శించే దేవకి సర్వులకు పూజనీయురాలు. ఆమె ప్రతి సంవత్సరము ఒక్కరిని చొప్పున ఎనమండుగురు పుత్రులను, ఒక కన్యను కూడ కనెను.

కీర్తిమంతం ప్రథమజం కంసాయానకదుందుభిః

అర్పయామాస కృచ్ఛ్రేణ సోకనృతాదతివిహ్వలః

వసుదేవుడు పుట్టినప్పుడు దేవతలు నగారాలను మ్రోగించిరి. ఆయనకు అసత్యమంటే భయము మెండు. ఆయన మొదటి సంతానమైన కీర్తిమంతుని, బాధ పడుతూనే కంసునికి సమర్పించెను.

కిం దుస్సహం ను సాధూనాం విదుషాం కీమ పేక్షితమ్

కిమకార్యం కదర్యాణాం దుస్త్యజం కీం ధృతాత్మనామ్

సత్పురుషులు సహించలేనిది ఏమి గలదు? (వారెంతటి కష్టమునైననూ సహించేదరు). జ్ఞానులు దేనిని కోరెదరు? (దేనినైననూ కోరరు), నీచులు చేయలేని పని యేది గలదు? (వారెంతటి క్రూరమైన పనినైననూ చేసేదరు). దేహమును, ఇంద్రియములను, మనస్సును నిగ్రహించిన మహాత్ములు విడువలేనిది ఏది గలదు? (వారు సర్వమును త్యజించెదరు).

దృష్ట్వా సమత్వం తచ్చౌరేస్సత్యే చైవ వ్యవస్థితిమ్

కంసస్తుష్టమనా రాజన్ ప్రహసన్నిదమబ్రవీత్

ఓ పరీక్షిన్మహారాజా! వసుదేవుడు సుఖదుఃఖముల యెడల సమమైన స్పందన కలవాడు. పైగా, ఆయన సత్యమునకు గట్టిగా కట్టుబడినవాడు. ఆయనయొక్క ఈ లక్షణములను గని కంసునకు మనస్సులో సంతోషము కలిగెను. ఆతడు నవ్వుతూ ఇట్లు పలికెను.

ప్రతియాతు కుమారోఽయం న హ్యస్మాదస్తీ మే భయమ్

అష్టమాద్యువయోర్గర్భాన్మృత్యురే విహితః కిల

ఈ పిల్లవానిని ఇంటికి తీసుకు పొమ్ము. ఎందుకంటే, నాకు ఈ పిల్లవాని వలన భయము లేదు. ఆకాశవాణి చెప్పినది నాకు మీ ఇద్దరి ఎనిమిదవ సంతానము వలన మరణము కలుగునని గదా!

తథేతి సుతమాదాయ యయావానకదుందుభిః

నాభ్యనందత తద్వాక్యమసతోఽవిజితాత్మనః

సరే అని పలికి వసుదేవుడు పుత్రుని తీసుకొని వెళ్లాను. కంసుడు దుష్టుడు, మనోనిగ్రహము స్థిరచిత్తము లేనివాడు. వాని ఆ మాటను ఆయన నమ్మలేదు.

నందాద్యా యే వ్రజే గోపా యాశ్చామీషాం చ యోషితః

వృష్ణయో వసుదేవాద్యా దేవక్యాద్యా యదుస్త్రియః

సర్వే వై దేవతాప్రాయా ఉభయోరపి భారత

జ్ఞాతయో బంధుసుహృదో యే చ కంసమనువ్రతాః

గోకులమునందు నందుడు మొదలుగా గల ఏ గోపాలకులు గలరో వారు, వీరి స్త్రీలు (యశోద మొదలగువారు), వసుదేవుడు మొదలుగా గల వృష్టివంశీయులు, దేవకి మొదలైన యాదవస్త్రీలు, నందవసుదేవులిద్దరి జ్ఞాతులు, బంధువులు, మిత్రులు, మరియు కంసుని అనుచరులెవరు గలరో వారు కూడ నిశ్చయముగా ఇంచుమించు అందరు దేవతలే.

ఏతత్కంసాయ భగవాన్ శశంసాభ్యేత్య నారదః

భూమేర్భారాయమాణానాం దైత్యానాం చ వధోద్యమమ్

పూజనీయుడగు నారద మహర్షి కంసుని వద్దకు వచ్చి ఈ విషయమును వివరించి చెప్పెను. ఇంతేగాక, రాక్షసుల సంహారమునకై జరుగుచున్న ఉద్యమమును గురించి కూడ చెప్పెను.

ఋషేర్వనిర్గమే కంసో యదూత్మత్వా సురానితి

దేవక్యా గర్భసంభూతం విష్ణుం చ స్వవధం ప్రతి

దేవకీం వసుదేవం చ నిగృహ్య నిగడైర్గృహే

జాతం జాతమహన్ పుత్రం తయోరజనశంకయా

నారదుడు నిషమించేను. యాదవులు దేవతలనియు, శ్రీహరి తనను చంపుటకై దేవకి గర్భమునందు ఆవిర్భవించినట్లేనని కంసునకు తెలిసెను. ఆతడు దేవకీ వసుదేవులను కారాగృహమునందు సంకెళ్లతో బంధించెను. వారికి పుట్టిన ప్రతి పుత్రుడు పుట్టుకయే లేని శ్రీహరియేననే శంకతో ఆతడు ఆ పిల్లలను చం పెను.

మాతరం పితరం భ్రాతౄన్ సర్వాంశ్చ సుహృదస్తథా

ఘ్నంతి హ్యసుతృపో లుబ్ధా రాజానః ప్రాయశో భువి

ఈ లోకములో భోగపరాయణులై లోభులైన (ఇతరులను చంపి తమ పొట్ట పోసుకోనే) పాలకులు తరుచుగా తల్లిని, తండ్రిని, సోదరులను, మిత్రులనందరినీ కూడ చంపెదరు గదా!

ఆత్మానమిహ సంజాతం జానన్ ప్రాగ్విష్ణునా హతమ్

మహాసురం కాలనేమిం యదుభిప్స వ్యరుధ్యత

తాను పూర్వజన్మలో కాలనేమి అనే పెద్ద రాక్షసుడననియు, ఆ జన్మలో శ్రీహరి సంహరించగా ఈ జన్మలో కంసునిగా జన్మించినాననియు తెలుసుకున్న కంసుడు యాదవులతో విరోధము పెట్టుకొనెను.

ఉగ్రసేనం చ పితరం యదుభోజాంధకాధిపమ్

స్వయం నిగృహ్య బుభుజే శూర సేనాన్మహాబలః

ఇతి శ్రీమద్బాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్ధే ప్రథమోఽధ్యాయః

ఉగ్రసేన మహారాజు మహాబలశాలియగు కంసుని తండ్రి. పైగా ఆయన యాదవ-భోజ-అంధకవంశీయులకు ప్రభువు. ఆయనను కూడ కంసుడు స్వయముగా బంధించి శూర సేన దేశమును పాలించెను.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో శ్రీకృష్ణావతారము-ఉపక్రమమును వర్ణించే మొదటి అధ్యాయము ముగిసీనది (1).