గణేశ పురాణము - ఉపాసనా ఖండము
92 – గజానన మహిమా నిరూపణం
బ్రహ్మ:
“ఓ వ్యాసమునీంద్రా! ఈ విధంగా సృష్టించబడిన చరాచర జగత్తులోని వారందరూ దేవదేవుడైనట్టి గజాననునికి స్త్రోత్రంచేసి తిరిగి ఆ గణాధ్యక్షునితో యిలా అన్నారు. ఓ దేవా! మేమిప్పుడు ధన్యులమైనాము. మీ సందర్శన భాగ్యంచేత మా నేత్రములు పావనమైనాయి!”
ఇట్టి వినయాన్వితములైన వారి వాక్కులను విని సంతసించిన గజాననుడిలా అన్నారు.
గజాననుడు:
“ఓ జీవులారా! నా ఈ రూపాన్ని బ్రహ్మరుద్రాదులు సహితం దర్శించజాలరు. నిర్గుణస్వరూపుడనైన నేను మీయందుగల వాత్సల్యంచేతనే నా ఈ సుగుణమూర్తిని దర్శింపజేసాను. మీ ఈ స్తుతికి సంతసించి వరములీయవచ్చాను! మీరు మీ ఇచ్చానుసారం వరాలను కోరుకోండి!”
బ్రహ్మ:
“ఓ వ్యాసమునీంద్రా! వారంతా తమకు కావలసిన వరాలను కోరుకున్నారు. అసంఖ్యాకములైన ఆ వరాలను వర్ణించటం నాతరముకాదు! ఆ వరాలన్నీ అనుగ్రహించి, గజాననుడిలా అన్నాడు”
గజాననుడు:
“నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ స్త్రోత్రాన్ని త్రిసంధ్యలలోనూ పఠించినవాడు పుత్రవంతుడు, ఆయురారోగ్య ఐశ్వర్యవంతుడూ కాగలడు! కీర్తీ జయము రెండూ సంప్రాప్తమవుతాయి! వాంఛితార్థములన్నీ పొంది అంత్యమున మోక్షాన్ని కూడా పొందగలడు!”
“త్రిసంధ్యలలోనూ ఈ స్త్రోత్రాన్ని ముమ్మారు భక్తితో పఠిస్తే సర్వకార్యాలూ సిద్ధిస్తాయి! ఎనిమిదిరోజులపాటు పఠించి, చతుర్థితిధియందు కూడా ఎనమిది సార్లు పఠిస్తే అష్టసిద్ధులూ కలుగుతాయి!”
“రోజు పదిసార్లు చొప్పున ఈ స్త్రోత్రాన్ని మాసదినములు పఠిస్తే రాజుయొక్క బంధనములనుండి విముక్తుడౌతాడు!”
“ఇరవైఒక్కసార్లు జపించితే విద్యాకాముడికి విద్య, ధనం కోరినట్టివారికి ధనమూ, పుత్రులను కోరినవారికి పుత్రులూ ఇలా ఎవరేమికోరితే వారికి అది లభిస్తుంది!” అంటూ గజాననుడు అంతర్థానం చెందాడు!
అప్పుడు సమస్త పరివారమూ ఎవరికివారు తమకు వేరువేరుగా ప్రత్యేకమైన గణేశుని వివిధమూర్తులను స్థాపించి పూజించారు.
దేవతలు తమ మూర్తిని “సుముఖుడ”నీ, మునులు తాము స్థాపించిన మూర్తికి “ఏకదంతుడ”నీ కీర్తించారు. గంధర్వలూ, కిన్నరులూ “కపిలుడ”న్న నామంతో అర్చించారు. గుహ్యకులూ, చారణులూ, సిద్ధులూ మహాప్రాసాదాన్ని నిర్మించి అందులోని మూర్తికి “గజకర్ణుడ”ని నామముంచి పూజించారు.
ఆ పూజాప్రభావంచేత వారంతా దివ్యవిమానాలను అధిరోహించి స్వర్గారోహణం చేశారు. ఆ తరువాత మానవులంతా “లంబోదరు”డన్న నామధేయంతో మూర్తిని స్థాపించి పూజించారు! పక్షులన్నీ తమ గణేశమూర్తిని వికడున్న పేరుతో పూజించి వనాలలోకి ఎగిరిపోయాయి.
పక్షిగణాలు ఒకమూర్తిని స్థాపించి గణాధిపుడన్న నామముంచాయి. విషధరజీవులన్నీ “ధూమకేతు” వన్న పేరుతోనూ జలాశయాలన్ని “గణాధ్యక్షుడ”న్న పేరుతోనూ పూజించాయి.
క్రిమికీటకాదులన్నీ ఓషధీగణాలతోకూడినవై తాము స్థాపించిన గణేశమూర్తికి “ఫాలచంద్రు”డన్న నామంతో పూజించాయి. ఇంకా ఇతర చేతనములన్నీ అనేక గణేశమూర్తులను స్థాపించి భక్తిభావంతో పూజించాయి.
“గజానను”డనే పేరుగల మూర్తి అందరకూ సకల కోరికలనూ ప్రసాదించునటువంటిది! ఇలా సమస్త లోకాలలోనివారూ గజాననుని అనుగ్రహవిశేషంచేతనే తమ తమ కార్యాలను నెరవేర్చుకోవటంలో దక్షులై విలసిల్లారు. ఆ దేవదేవునికి గల అనంతనామములయొక్క ఫలమింతని చెప్పటానికి శక్యముకాదు. వాటిలోని సారమునే గ్రహించి సహస్రనామములను చెప్పాను. అట్టివాటిలోకెల్లా సారభూతమైనట్టివి పన్నెండు నామములు! సముద్రమధనంచేత పధ్నాలుగురత్నాలు లభించినట్లుగా, సహస్రనామములనూ మధించుటచేత గణేశ ద్వాదశనామాలు లభించాయి!
బ్రహ్మ:
ఓ వ్యాసమునీంద్రా! ఈ విధంగా సంక్షేపంగా గజాననుని మహిమను నీకు వర్ణిoచాను! విస్తారంగా చెప్పటానికి త్రిమూర్తులకుగాని ఆదిశేషునికిగని తరంకాదు! ఇక ఇతరులెoతటివారు? అందుచేత సర్వకార్యములయందూ గజాననుడు తప్పక పూజించతగినట్టి మహానీయుడు! ఎవరు ఆ దేవదేవుని పూజించక అలక్ష్యం చేస్తారో అట్టి దురాత్ముల కెన్నడూ కార్యసిద్ధి కలుగనేరదు!
వ్యాసమునీంద్రుడు:
“ఓ చతురాననా! ఆ ప్రసిద్ధమైనట్టి, అనంతఫలప్రదములైనట్టి ద్వాదశనామాలను చెప్పు! వేటిని పఠించడంవల్ల, వినటంవల్ల నిర్విఘ్నతను సులభంగా పొందగాలరో?”
బ్రహ్మ:
“(1) సుముఖుడు (2)ఏకదంతుడు (3)కపిలుడు (4)గజకర్ణుడు (5)లంభోదరుడు (6)వికటుడు (7) విఘ్ననాశనుడు (8) గణాధిపుడు (9) దూమ్రకేతుడు (10) గణాధ్యక్షుడు (11) ఫాలచంద్రుడు (12) గజాననుడు”
ఈ పన్నెండు విశేషప్రభావంగల గణేశుని ద్వాదశనామాలు! ఈ నామాలను విద్యారంభములోనూ, కార్యప్రవేశములోనూ, ప్రయాణ సమయంలోనూ, సంగ్రామ సమయంలోనూ, ఆపత్సమయాలలోనూ దీనిని విన్నా, పఠించినా విఘ్నములన్నీ సమూలంగా నశిస్తాయి!
తెల్లని వస్త్రమును ధరించి, చంద్రుని వర్ణముతోకూడినట్టివాడూ నాల్గుచేతులు కల్గిన అనుగ్రహమూర్తిగా ఆ దేవదేవుని ధ్యానిస్తే సకల విఘ్నములనూ హరిస్తాడు!
కోటియజ్ఞముల ఫలంకానీ, కోటివ్రతాచరణవల్ల కల్గిన ఫలంగాని, తపస్సుగాని యిందులో నూరోవంతు ఫలాన్నికూడా యివ్వలేవు!
ఉదయాన్నే ఈ నామములు ఎవరు శ్రద్ధతో పఠిస్తారో అట్టివారికెన్నడూ కార్యవిఘ్నములు కలుగవు! అట్టివారియొక్క సకల కార్యములూ సిద్ధిస్తాయి! అట్టివారిని దర్శించినంతనే లోకాలన్నీ పవిత్రమౌతాయి. అందుచేతనే ఓ వ్యాసమునీoద్రా! సౌర, శైవ, శాక్త, వైష్ణవ సాంప్రదాయికులంతా ఈ గణేశ ద్వాదశనామాలను ఉచ్చరించి, ఆ తరువాతనే తమ స్వకర్మలను నిర్వర్తిస్తున్నారు. ఈ పవిత్ర నమోచ్చరణవలన కార్యసిద్ధి తప్పక కలుగుతుంది!
“ఓ వ్యాసమునీoద్రా! ఈ విధంగా ద్వాదశానామముల మహిమనూ నీకు పూర్తిగా వివరించాను. పావనుడైన గణేశుని ఉపాసించుటవల్ల కలిగే ఫలితాన్ని నాకు వీలైనంతమేర వర్ణించాను. ఈ గణేశోపాసనయొక్క అంత్యముగురించి సాక్షాత్తూ శ్రీమహావిష్ణువుగూడా ఎరుగాజాలడు!”
భృగుమహర్షి:
“ఓ సోమకాంతమహారాజా! ఈ విధంగా గజాననునియొక్క ఆద్భుతమైన అనంతమహిమలనన్నిటినీ నీకు సోదాహరణపూర్వకంగా వివరించాను! దీన్ని గతంలో చతురాస్యుడైన బ్రహ్మ వ్యాసమునీంద్రునికి ఉపదేశించాడు!”
అలా ఈ గణేశపురాణాన్ని శ్రద్ధతో ఆలకిన్చినట్టి సోమకాంతమహారాజుయొక్క పూర్వజన్మ తాలూకు దుష్కర్మయావత్తూ నశించి అతడికి శరీర స్వస్థతను చేకూర్చింది!
సూతమహర్షి:
“ఓ మహర్షులారా! గణేశుని ఉపాసనఖండమును యావత్తూ నానావిధ వ్యాఖ్యానాలతో వర్ణించిచెప్పాను! నా గురుదేవుడైన వేదవ్యాసునుకి బ్రహ్మ ఏవిధంగా ఉపదేశించాడో, అలాగే యావత్ వృత్తాంతాన్ని మీకు వివరించాను.
ఈ గణేశపురాణాన్ని ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో, వింటారో, అట్టివారు తమ సర్వసంకటములనుండీ ఆపదలనుండీ విముక్తులై ఇహలోకంలో పుత్రపౌత్రాద్యభివృద్ధినీ (వంశవృద్ధినీ) ఆయురారోగ్యైశ్వర్యాలనూ బడసి, జ్ఞానవంతులై పునరావృత్తిరహితమైనట్టి మోక్షాన్ని పొందుతారు!
ఈ కథను పరమ ఆదరంతో విననట్టి సోమకాంత మహారాజెట్టి శుభములు పొందాడో, అట్టి శుభ ఫలితాలనూ గణేశుని పరమానుగ్రహాన్నీ పొందగలరు!
Chapter 92 complete
శ్రీ గణేశ పురాణము నందు
ఉపాసనా ఖండము సర్వమూ సమాప్తము
