గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

42 – యుద్ధవర్ణనం

వ్యాసుడు:

“ఓ కమలసంభావా! కలాధరుడనే ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాక ఆ దైత్యుడైన త్రిపురుడు ఆ చింతామణి గణేశుని మూర్తిని ఎలా తెచ్చిచ్చాడు? ఆ వివరం నాకు తెలియజేయి! భక్తాభీష్టప్రదుడైన గజాననుని లీలల్ని ఎంతగా విన్నా తనివితీరడంలేదు!” అన్న వ్యాసుని వచనాలకు బ్రహ్మ మనోహరంగా చిరునవ్వులు చిందిస్తూ

బ్రహ్మ:

“ఓ కృష్ణధ్వైపాయనా! అనంతరం ఆ త్రిపురుడు ఏమిచేశాడో ఆ వివరాన్నంతా చెబుతాను. సావధానమనస్కుడవై విను!”

“అలా ఆ కలాధరుడిచేత ఉత్తేజితుడైన త్రిపురుడు మందరాద్రి పైన ఉన్న శంకరుడివద్దకు తన దూతల్ని ఇరువురుని సందేశంతో పంపించాడు. ‘నీవద్ద అత్యంత శుభకరమూ, సకలార్ధప్రదమూ యైన చింతామణి గణేశుని మూర్తి ఉన్నదట! దాన్ని మా దైత్యరాజైన త్రిపురునికి సామపూర్వకంగా సమర్పించు! అంతేకాదు త్రైలోక్య ప్రభువైన అతని వద్దకు ముల్లోకాలలోనూ శ్రేష్టములైన వస్తువులన్నీ చేరాయి. నీ శ్రేయస్సును కోరుకునేవాడవైతే వెంటనే మాకది తెచ్చివ్వు! లేదా నీవు మా దైత్యేంద్రుని ఆగ్రహజ్వాలలకు గురికాగాలవు!”

ఆ మాటలు విన్న శంకరుడు భగ్గున మండిపడ్డాడు. ‘ఓ దూతలారా! కేవలం మీరు దూతలైనందుననే బ్రతికిపోయారు. లేకపోతే ఈపాటికి మీరూ మన్మధుడిలా నా క్రోధాగ్నికి ఆహుతై భస్మీభూతులయ్యేవారు! మీ ప్రభువు నాకొక గడ్డిపోచతో సమానం! అతనితో నాకేమి ప్రసక్తి? మృత్యువును కోరుకునేటట్లయితే నాతో తలపడమనండి!’ ప్రళయ కాలగ్నిని తుమ్మెద ఆర్పలేనట్లు, మూషికం మేరువును క్రింద పదతోయలేనట్లు మీరాజు యింకా వెయ్యి జన్మలెత్తినాసరే ఆ గణేశమూర్తిని నావద్ద నుండి పొందడం అసాధ్యం! ఈ మాటని వెళ్ళి మీ ప్రభువుతో చెప్పండి!”

“ఓ వ్యాసమునీంద్రా! శంకరుని ఈ ప్రతివచనాలను, త్రిపురుని దూతలు ఆఘమేఘాలమీద అతనివద్దకు వినిపించారు! వ్యాక్యార్థములను గ్రహించడంలో ప్రవీణుడైన త్రిపురుడు అగ్గిమీద గుగ్గిలంలా మండిపోయాడు, ఈ ప్రత్యుత్తరాన్ని విని! అంతే! తన సర్వసేనల్ని యుద్ధానికి సమాయత్తపరిచాడు. చతురంగబలాలనూ వెంట తీసుకుని మందరపర్వతం వద్దకు శివునిపై యుద్దానికి తరలివెళ్ళాడు.

సకల శస్త్రాస్త్ర సమన్వితులైన సేనలతో కామగమనంగల తన మూడు పురాలనూ అధిరోహించి మనోవేగంతో శంకరుడిపైకి తలపడటానికే నిశ్చయించుకుని దీపంవద్దకు వెళ్ళే శలభంలా వెళ్ళాడు. రత్నకిరీటాన్ని, ఖడ్గఖేటకాలనూ, ధనుర్బాణాలనూ ధరించి, హరుని మనస్సునే భయంతో కంపి౦పచేసేలా సింహగర్జనలనుచేస్తూ తానూ బయలుదేరి వెళ్ళాడు. ఆ అపురూప సంగ్రామాన్ని కనులారా తిలకించాలని దేవతలు ఉవిళ్ళూరసాగారు. త్రిపురుడు యుద్ధసన్నద్ధుడై వచ్చాడన్న వార్తను విన్న శంకరుడు గజాననుని అర్చించి ప్రదక్షిణ నమస్కారాదులను సమర్పించి క్రోధాగ్నిజ్వాలలను నేత్రాలలోంచి క్రక్కుతూ బైలుదేరాడు.

ఆ సేనావాహిని పదఘట్టనలకు భూమి యావత్తూ అదిరింది. పైకి ధూళిలేచి నా పర భేదాలు తెలియని స్థితిలో యిరుసేనలూ సకుల సమరానికి దిగారు! అలా జరిగిన భీకర సంగ్రామంలో తెగిపడ్డ ఏనుగుల, గుఱ్ఱాల తలలతోనూ, పారుతున్న రక్తం ఏరులై ప్రవహించింది. ఆ రక్తప్రవాహంలో కొట్టుకొనిపోయే శిరస్సులూ, మొండెములను చూసిన శంకరుడు రోషపరవశుడై ఒకపెట్టున ఆ రాక్షసుడిపైకి ఉరికాడు.

ఆ త్రిపురుడు కూడా తన పురముల నధిరోహించి శివునెదుర్కోగా ఇరు సైన్యాలలోని ప్రధానులూ ఒకరితో నొకరు ద్వంద్వయుద్దానికి పూనుకున్నారు. శాస్త్రాస్త్రాలతోనూ, పెరికిన చెట్లతోనూ ఒకరినొకరు మోదుకోసాగారు.

Chapter 42 complete