గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

38 – వరప్రదానం

వ్యాసుడు:

“ఓ పద్మసంభవా! ఆ తరువాత జరిగిన గృత్సమదుని వృత్తాంతమును తెలుసుకొన గోరుతున్నాను. నాకు చెప్పవలసింది!”

బ్రహ్మ:

“ఓ వ్యాసమునీంద్రా! అప్పుడు సకల మునిగణాలు గృత్సమదుని గౌరవించి నమస్కరించారు. అప్పటినుంచీ సకల కార్యారంభములలోనూ చేసే గణపతి పూజలో ముందుగా ఆ మునికే నమస్కరించసాగారు. ఈరీతిగా ఎంతో ప్రఖ్యాతిని గాంచిన గృత్సమదుడు సునిశ్చితభక్తితో ఏకాగ్రచిత్తంతో గణేశునే ధ్యానిస్తూ ఉత్కృష్ట భక్తిని పొందాడు! ఇలా ఉండగా ఒకానొక సమయంలో పెద్దధ్వని అయేలా ఆ ముని తుమ్మినాడు. ఆ తుమ్ముధ్వనికి పర్వతగుహలు అదిరిపడ్డాయి క్షణంలో తన ఎదుట ఒక బాలకుడు కనిపించాడు. ఎఱ్ఱని దేహకాంతిని కలిగి పెద్ద ధ్వనినిచేస్తూ తేజోరాశితో కళ్ళు మిరుమిట్లు గొల్పుతూన్న ఆ బాలకుని చూసి భయంతో గృత్సమదముని గడగడావణికాడు.

‘ఆహా! ఇదియేమి విపత్తు? ఈ పుత్రుడు గజాననునిచే యివ్వబడినాడా ఏమి?’ అనుకుంటూ తిరిగి తేరిపారా ఆ పిల్లవానివంక చూడగా, సౌందర్యోపేతమైన ముఖారవిందంతో, పద్మరేకులవంటి విశాలనేత్రాలను కలిగి, బంగారు భుజకీర్తులతో, బాహుపురులు, దివ్యకిరీటము, పాదాలంకారాలను కలిగి, కటిప్రదేశంలో బంగారు మొలత్రాటిని ధరించి, నవమన్మదుడిలా ఉన్న ఆ బాలకుణ్ణి చూసిన ముని యిలా ప్రశ్నించాడు.

గృత్సమదముని:

“ఓ బాలకా! నీవెవరు? ఎవ్వరివాడవు? ఏంచేయడానికి వచ్చావు? నీ తల్లిదండ్రులెక్కడుoటారు?”

బాలకుడు:

“త్రికాలజ్ఞానివైన ఓ గృత్సమదమునీంద్రా! అన్నీ యెఱిగివుండీ, నన్నెందుకు యిలా ప్రశ్నిస్తున్నావు? ఐనా నీ ఆజ్ఞననుసరించి చెబుతాను విను! నేను నీ క్షుతము (తుమ్ము) నుండి జనించాను. కనుక నాకు తల్లివీ, తండ్రివీ యిక నీవే! నన్ను దయతో కొన్నాళ్ళు సంరక్షించు! ఇంద్రునితోసహా ముల్లోకాలనూ ఆక్రమించగల బలపరాక్రమం కలవాడిని! కొద్దికాలంలోనే నా అప్రమేయపౌరుషాన్ని నీవు చూడగలవు!”

ఆ మాటలకు ముగ్ధులైన ఆముని తనలో ‘ఆహా! ఈ బాలకుడెవరో పుట్టీ పుట్టగానే తాను ముల్లోకాలనూ గెలువగల సమర్థుణ్ణoటూబ్రకటించుకున్నాడే? వీడెవరోగాని అసాధ్యుడిలా ఉన్నాడు! కనుక వీడి శక్తియుక్తులు మరింతగా ఇనుమడింపచేయగలందులకు నా మంత్రాన్ని యితడికి ఉపదేశిస్తాను! ఆ మంత్రప్రభావంతో వరదుడైన గణేశుడీతనికి సకల వాంచితములను ప్రసాదించగలడు! వీడివల్ల నాకూ ఘనకీర్తి లభించగలదు” అని సంకల్పించి ఆ బాలునికి తన ‘గణానాoత్వా’ అన్న ఋగ్మంత్రాన్ని ఉపదేశించాడు. అలా ఉపదేశించి తరువాత ఇలా అనుగ్రహవచనాలతో అతడినిలా ఆశీర్వదించాడు.

‘ఓ చిరంజీవీ! ‘గణానాంత్వా’ అన్న ఈ మంత్రాన్ని నీవు నిశ్చలమైన మనస్సుతో జపించు! ఆ గజాననుని అనుగ్రహాన్ని పొందిననాడు నీ సకలాభీష్టములూ నెరవేరతాయి!’ ఇలా గృత్సమదుడినుంచి మంత్రోపదేశాన్నీ, అనుగ్రహాశీస్సులనూ బడసిన ఆ బాలకుడు వెంటనే ఒక నిర్జన అరణ్యానికి వెళ్ళి, అక్కడ ఇంద్రియాలను నియమించి, తదేకదీక్షతో, కాలిబొటనవేలుపై నిలిచి, ఐదువేల సంవత్సరాలకాలం నిరాఘాటంగా తండ్రి ఉపదేశించిన ఆ మంత్రాన్ని జపించాడు! అప్పుడాతడి ముఖంలోనుంచి వెంటనే తపోగ్నిజ్వాలలు వెలువడి దిక్కులనంతా ప్రజ్వరిల్లచేస్తూ దేవగణాలకూ, పాతాళంలోని రాక్షసులకూసైతం భయోత్పాతాన్ని కలిగించాయి! అప్పుడు ఆ బాలుని తపస్సుకు సంతుష్టుడైన గజాననుడు అతడి ఎదుట సాక్షాత్కరించాడు.

దిక్కులనెల్లా ప్రజ్వరిల్లచేస్తూ, సూర్యకాంతిని ధిక్కరించే తేజఃప్రకాశంతో తొండమును అలవోకగా అటూయిటూ ఆడిస్తున్న ఆ గజాననుని ఘీంకారం విన్న ఆ బాలకుడు భయంతో వివశుడై నేత్రాలను విప్పి ఎదురుగా నిలచిన ఆ దేవదేవుని చూచాడు.

నాలుగు బాహువులతోనూ, పెద్ద ఉదారంతోనూ, నానాలంకారములతో అలంకరించబడి, పరశువు, పద్మము, జపమాల, మొదకములను నాల్గుచేతులలోనూ దాల్చివున్న ఆ దివ్యతేజోమూర్తియొక్క ప్రకాశానికి ముందు నిర్ఘాంతపోయి, ఆ తరువాత క్రొద్దిగా తడబడి, తిరిగి ధైర్యాన్ని పుంజుకుని ఆ ప్రభువునిలా ప్రార్థిoచసాగాడు.

‘ఓ దేవా! నీకు అనన్య భక్తుడను, శరణాగతుడనూ ఐన నన్ను యిలా భయపెట్టడం నీకు భావ్యమా? సౌమ్యరూపాన్ని దాల్చి నా వాంచితార్థములను ప్రసాదించి, నన్ను అనుగ్రహించవే!’

బ్రహ్మ:

ఓ వ్యాసమునీంద్రా! అప్పుడు ఆ భక్తవరదుడైన గణాధిపుడు అతడి ప్రార్థనతో తన భయంకర రూపాన్ని ఉపసంహరించి, ఎంతో ప్రీతితో సౌమ్యరూపందాల్చి ఆ బాలకున్ని పిలిచి

“నాయనా! నీవు స్వస్థచిత్తుడివికా! అహోరాత్రాలు ఎవరి నుద్దేశించి ధ్యానంచేశావో, ఆ నీ ధ్యానమూర్తిని నేనే! నీయందు పూర్తి ప్రసన్నతను కలిగి, నీకు వరాలను అనుగ్రహించదలిచి వచ్చాను! ఈ నా రూపం స్వప్రకాశామైనదీ, జగన్మయమైన నా పరరూపమును బ్రహ్మరుద్రాదులు కూడా తెలుసుకోలేరు! దేవతలు, మునులు, గంధర్వులు, అసురులు వీరెవ్వరికీ కూడా ఇది గ్రహింపనలవికానట్టిది! అటువంటి నేను, నీ శ్రద్ధతోకూడిన తపస్సుకు బద్ధుడనై నిన్ను అనుగ్రహించదలచాను. కోరిన వరమివ్వటానికై వచ్చాను! కనుక నావల్ల నీకేమేమి వరములు కావాలో అవన్నీ కోరుకో!” అన్నాడు.

బాలకుడు:

“ఓ దేవా! నీ దివ్యమంగళ తేజోమయ రూపాన్ని దర్శించటంతో నా జన్మ నేటికి చరితార్థమైంది! నా తపస్సు, నా జననీజనకులూ ధన్యులైనారు. బాలుడనైన కారణంచేత నీ మహిమా విశేషాన్ని వర్ణించలేకపోయాను. సకల జగత్తుకూ నీవే ఆధారభూతుడవు! సూర్యాది గ్రహగోళాలు నీ భావనవల్లనే ప్రకాశిస్తున్నాయి. నీ మహిమావిశేషంచేతనే జగత్తంతా చలిస్తున్నది. అట్టి నీ మహిమావిశేషాన్ని త్రిమూర్తులైనా పూర్తిగా గ్రహింపలేరు! ఐనా నీవు దయతో వరాన్ననుగ్రహించగోరితే ఈనాటినుంచి ‘మూడు లోకాలలోనూ ఎక్కడా నాకు తిరుగుండరాదు! దేవఅసుర గణాలందరూ నాకు వశ్యులై ఉండాలి! దేన్ని సంకల్పించినా తక్షణమే అది సిద్ధించేలా సంకల్పసిద్ధినీ ప్రసాదించు! ఇహలోకంలో సకలభోగాలను అనుభవించాక అంత్యమున మోక్షాన్నిపొందేలా అనుగ్రహించు!”

“ఓ భక్తవరదా! నేను తపస్సు ఆచరించిన ఈ ప్రదేశము ఇకనుంచీ ‘గణేశపురము’ అన్నపేరిట లోకవిఖ్యాతినిగాంచుగాక!”

అంటూ వేడిన ఆ బాలునితో గజాననుడిలా ప్రసన్నుడై, అనుగ్రహవచనాలు పలికాడు.

గజాననుడు:

 “ఓ బాలకా! నీవు కోరినట్లే నీకు త్రైలోక్యాకర్షణశక్తి కలుగగలదు! నీకేవరివల్లా ఎటువంటి భయమూ కలుగదు! మూడు పురములు బంగారంతో, వెండితో, ఇనుముతో నిర్మించియిస్తాను! కోరుకున్న స్థలానికి వెళ్ళే కామగమన శక్తిని అవి కలిగివుంటాయి. ఒక్క లయకారకుడైన శంకరుడి చేతతప్ప అవి భేదింపబడనివి! ఈలోకంలో నీవు త్రిపురాసురుడన్న ఖ్యాతిగాoచెదవు! ఏనాడైతే శంకరుడు తన ఏకైక బాణంతో ఈ మూడింటినీ భేదిస్తాడో అనాడే నీవు ముక్తి పొందగలవు! ఇది ముమ్మాటికీ సత్యము! ఇంకా నీవడిగిన ఇతర వాంఛితములన్నీ తప్పక ఈడేరగలవు!”

వ్యాసమునీంద్రా! ఈ విధంగా అతనికి వరాలను అనుగ్రహించి గజాననుడు అంతర్హితుడైనాడు. ఆ దైవవియోగానికి ఆ బాలకుడు ఖిన్నుడైకూడా ఆ వరముల లబ్ధికి సంతోషయుక్తుడైనాడు. అనంతరం తన వరబలగర్వముతో ముల్లోకాలను అక్రమిoప ప్రయత్నించాడు.

Chapter 38 complete