గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

59 – కృతవీర్యుని పూర్వచరిత్ర

అ తరువాత దేవేంద్రునితో ఆ శూరసేనమహారాజు తన సందేహాన్ని గూర్చి యిలా ప్రశ్నించాడు.

శూరసేనుడు:

“ఓ ఇంద్రా! ఆ ప్రకారంగా భ్రుశుండిమహర్షి యొక్క పితరులు కుంభీపాక నరకంనుండి విముక్తులై స్వర్గాన్ని చేరుకున్నాక, కృతవీర్యుని తండ్రి ఏం చేశాడు? ఆ వివరాన్ని దయతో నాకు తెలియచేయవలసింది!” అన్న అతడి మాటలకు శచీపతియైన ఇంద్రుడు చిరునవ్వుతో యిలా బదులిచ్చాడు.

ఇంద్ర:

“ఓ రాజా! నారదమహర్షివల్ల తన వంశవిచ్ఛేదం గురించి తెలుసుకొని కడు దుఃఖితుడైన ఆ కృతవీర్యుని తండ్రి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కమలాసనుడైన చతుర్ముఖుడికి సాష్టాంగనమస్కార మాచరించి, తన వంశవిచ్ఛేదమునకు కారణం తెలుపమంటూ ప్రార్ధించాడు.

“ఓకమలాసనా! అన్ని సుగుణాలకూ ఆలవాలమై, సకల శుభలక్షణ సమన్వితుడై అనేక యజ్ఞ, దాన, తపః కర్మలను త్రికరణశుద్ధిగా ఆచరించి, దేవతలను అతిధులనూ పూజించి, అందరికీ తలలో నాల్కలా ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేసే నా కుమారునికి పుత్రసంతానం కలుగకపోవడానికి కారణమేమి? అతడు ఆ బాధచేత వివశుడై, చివరికి తన యావత్ రాజ్యభారాన్నీ మంత్రుల భుజస్కంధాలపై ఉంచి తాను ఘోరారణ్యములో కేవలం వాయుభక్షణ మొనరిస్తూ ఎముకలగూడుగామారి నేడోరేపో మరణించటానికి సంసిద్ధుడై వున్నాడు! ఏ పాపంవల్ల వానికి సంతానప్రాప్తి కలుగలేదు? ఆ పాప ప్రక్షాళన ఏ ఉపాయంవల్ల జరుగుతుంది? ఆ వివరం నాకు తాము దయతో తెలిపితే నేను నా కుమారునికి తెలియజేస్తాను!” అన్న ఆతడి మాటలకు బ్రహ్మ ఆతనితో వాని కుమారునియొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని యిలా తెలియచేసాడు.

బ్రహ్మ:

“పూర్వం ఈనగరంలోనే సాముడు అనే పేరుగల పంచముడు ఉండేవాడు. అత్యంత దుర్మార్గుడవటంచేత - కేవలం వాడిని చూస్తేనే ఎవరికైనా తమ సకల సత్కర్మలూ నశిస్తాయి! ఇలాఉండగా ఒకనాడు ఆ ఛండాలుడు ధనంమీదగల కాంక్షచేత సత్పురులైన పన్నెండుగురు విప్రులను సంహరించి వారిని దోచుకున్నాడు. అలా వారివద్దనున్న సకల సంపదలూ దోచుకుని ఆరాత్రి తన యిల్లు చేరుకున్నాడు. ఆనాడు మాఘబహుళ చవితి! సాయంసంధ్య గడిచి చంద్రుడు ఉదయించే సమయంలో ఆ తస్కరుడు తన కుమారుడిని “గణేశా! గణేశ! వెంటనే రా!” అంటూ పిలిచాడు.

ప్రోద్దుటినుంచి అన్నపాదులు లేనివాడవటంచేత తన కుమారుని చేరపిలిచి అతనితోకలిసి కడుపారా భుజించాడు. తరువాత కొంతకాలానికి అతని కుమారుడు మరణించాడు. అలా మాఘబహుళ చవితినాడు చంద్రోదయం సమయంలో అన్యాపదేశంగా తనకే తెలియకుండా ఉపవాసంతో ఉండి గణేశస్మరణను కావించి ప్రసాదాన్ని భుజించినందువల్ల, సంకష్టచతుర్థీవ్రత సంభవమైన అనంతమైన పుణ్యంయొక్క ప్రభావంచేత, ఆ బాలకుడు పరమ ఆనందమయమైన వైనాయకలోకానికి దివ్యవిమానారూఢుడై పుణ్యశాలులందరూ అర్చిస్తుండగా వెళ్ళాడు. ఆ పుణ్యంయొక్క విశేషంవల్లనే కృతవీర్యుడనే పేరిట రాజై మరుజన్మలో నీకు కుమారునిగా జన్మించాడు! పూర్వజన్మకృతమైన ఆ పాపం నశించిన వెంటనే అతడికి పుత్రసంతతి కలుగుతుంది! ఈ మాటలు వింటున్న కృతవీర్యుని తండ్రి భయంతో గడగడా వణికి, “అతి హ్యేయమైన బ్రహ్మహత్యాపాతకంనుంచి తన కుమారునికి ఎలా విమోచన కలుగగలదో దయాసముద్రులైన బ్రహ్మదేవుడు ఎంత కష్టతరమైనదైనా ఆ ఉపాయాన్ని దయతో సెలవీయవలె”నంటూ ప్రార్ధించాడు.

బ్రహ్మ:

“ఓయీ! నీకుమారుడు “సంకష్టచతుర్ధీవ్రత”మనే పేరుగల వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో, నియమనిష్టలతో ఆచరించినట్లైతే ఆ మహాపాతకాన్నుంచి విముక్తుడు కాగలడు!” రాజు యిలా తిరిగి ప్రశ్నించాడు.

“ఓ కమలాసనా! ఐతే ఆవ్రతవిధానమెలాగ? అది ఎప్పుడు ఏ మాసములో ఆచరించాలి? అటువంటి మంగళప్రదము అమోఘఫలప్రదమైన వ్రతవిదానాన్ని దయతో నాకెరిగించు!” అంటూ ప్రార్ధించగా,

బ్రహ్మ:

“ఓయీ! మాఘమాసపు బహుళపక్షములో మంగళవారంతో కలిసి వచ్చే చతుర్ధి(చవితి) నాడు శుభాముహుర్తంలో – చంద్రుడు ఉదయించేవేళ ఈ వ్రతాన్ని ప్రారంభించాలి! దంతధావనతోపాటు ఇరవైఒక్కమార్లు స్నానంచేసి, నిత్యకర్మలను నిర్వర్తించుకొని, గణేశమహామంత్రజపం చేయాలి! ఆ రోజు ఆహారాన్ని వదిలి, తాంబూలము వాటిని వర్జించి, మౌనంవహించి, యితరులను నిందించటం పిశునత్వం(పీనాసితనం), ఇతరులపట్ల ద్రోహచింతన వంటివి విడనాడి నియమంగా గడపాలి!

ఆనాటి సాయంత్రం తిలామలకచూర్ణం (తెల్లనువ్వులు, ఉసిరికాయలు కలిపి నూరినది) తో నలుగుపెట్టుకొని స్నానంచేయాలి! తన శక్తికొలది ఏకాక్షరి, షడక్షరి లేదా వైదికమంత్రము (గణానాo త్వా ) ను జపించి ఆ గజాననుని మూర్తిని స్థిరమనస్కుడై ధ్యానించాలి. ఒక ముహూర్తకాలం గడిచాక భక్తవరప్రదుడైన ఆ గణేశుని షోడశోపచారములతో పూజించాలి! ఇక నివేదనకై మోదుకములు(ఉండ్రాళ్ళు), లడ్లు, అరిసెలు, జంతికలు, పాయసము మొదలైన పిండివంటలతో షడ్రసోపేతములైన ఆధరవులతో అన్నము, పులిహారలను సమర్పించాలి! రకరకాల ఫలములను, తాంబూలమును(సదక్షిణకంగా), ఇరవైఒక్క దూర్వాంకురము (గరికె) లనుకూడా గణేశునికి భక్తితో సమర్పించాలి. వివిధములైన సుగంధపుష్పాలతోనూ, దీపములతోనూ ఆ దేవదేవుని అలంకరించాలి! చంద్రోదయ సమయానికి చతుర్దీతిధికి, గజాననునికీ ఆ తరువాత చంద్రునికీ అర్ఘ్యం యివ్వాలి!

ఆ తరువాత మహానివేదననిచ్చి, అపరాధక్షమాపణకై గణేశుని వేడుకుని నమస్కరించి, తన శక్తికొలదీ ఇరవైఒక్క మందికి తక్కువ కాకుండా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి! ఆ తరువాత వ్రతకధను విని మౌనంగా తాను భుజించాలి! మిగతా రాత్రిభాగాన్నియావత్తూ సంకీర్తనతో గడపాలి! ఈ విధంగా ఒక సంవత్సరకాలం నియమపూర్వకంగా ఈవ్రతాన్ని ఆచరించినట్లైతే – సర్వపాపక్షయమై, ఆతడు పుత్రసంతానమును పొందటంతోపాటూ యింకా ఏ యితర కోరికలున్నప్పటికీ అవన్నీ కూడా ఆవశ్యం నెరవేరతాయి! ఈ వ్రతంయొక్క ప్రభావంవల్ల సర్వసంకటములూ నశించి, శత్రుపీడకూడా తొలగుతుంది. ఈ వ్రతాన్ని శమీ (జమ్మి) వృక్షముయొక్క మూలములో (మొదట్లో)కూర్చుని ఉపవాసదీక్షలో మరునాటి ఉదయం చంద్రోదయమయ్యే వరకూ నిష్టతో గణేశమంత్రాన్ని జపిస్తూ ఈవ్రతాన్ని ఆచరించాలి! అలా చేయడంచేత పుట్టుగుడ్డి, మూగ, చెవిటి వారైనప్పటికీ తప్పక తమ సకలాభీష్టములను పొందుతారు! రాజులు రాజ్యవైభోగాలను బహుళీకృతంగా పొందుతారు.

ఐతే ఆహార నియమాలుకూడా పాటిస్తూ ఈ వ్రతాన్ని  ఆచరిస్తే సకలసిద్ధులూ వశమౌతాయి! ప్రతీ మాసంలోనూ చతుర్ధినాడు విధిగా కొన్ని ఆహారనియమాలు పాటించాలి అవేమిటంటే : || 1) శ్రావణమాసంలో నేయి, లడ్లు విడివిడిగా భుజించాలి! ||2) భాద్రపదమాసంలో పెరుగును భుజించాలి! || 3) ఆశ్వయుజమాసంలో ఉపవాసం చేయాలి 4) కార్తీకమాసంలో పాలు, పానకములను ఆహారంగా స్వీకరించాలి! || 5) మార్గశిరమాసంలో నిరాహారిగా ఉండాలి! || 6) పుష్యమాసంలో గోమూత్రము, పానకమును సేవించాలి! || 7) మాఘమాసములో నువ్వులను || 8) ఫాల్గుణమాసంలో చెక్కెర – నేయిలను || 9) చైత్రమాసంలో పంచగవ్యములను || 10) వైశాఖమాసంలో పుష్కరబీజములను || 11) జ్యేష్ఠమాసంలో నేయితోతడిపిన భోజనాన్ని || 12) ఆషాఢమాసంలో తేనెనూ భుజించాలి!

ఈ విధంగా ప్రతిమాసంలోనూ ఆహారనియమాన్ని పాటిస్తూ ఈ చతుర్దీవ్రతాన్ని విధివత్తుగా ఆచరించినట్లయితే సకలసిద్ధులూ సిద్ధిస్తాయి” అన్న బ్రహ్మదేవుడితో కృతవీర్యుని తండ్రి తిరిగి యిలా ప్రశ్నించాడు “ఓ చతురాననా! అన్ని మాసముల చతుర్ధీలలోనూ అంగారకచతుర్థి (మంగళవారంతో కూడివచ్చిన బహుళ చతుర్ధి) కి విశేషాధిక్యత ఎందుచేత చెప్పబడింది? ఆ విషయాన్ని కూడా దయతో నాకు తెలుపవలసింది. మంగళకరములు, శుభప్రదములైన గజాననుని కధలను ఎంతవిన్నా నాకు తనివితీరటం లేదు!”

chapter 59 complete