గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

53 – చంద్రాంగనోపాఖ్యానం

హిమవంతుడు:

“అమ్మాయీ! పార్వతీ! నలుడేకాక యింకా చంద్రాంగదుడనే రాజు చేతా, యింక అతని భార్య ఇందుమతిచేతా కూడా ఈ గణేశవ్రతం అనుష్టించబడింది. ఆ విశేషాన్ని చెబుతాను విను!”

మాలవదేశంలో కర్ణనగరమనే పట్టణం ఉన్నది. ఆ దేశాన్ని అష్టైశ్వర్యసంపన్నుడూ, సకలశాస్త్రార్థ తత్వజ్ఞుడూ, యజ్ఞయాగాది క్రతువులు చేసిన ధార్మికుడూ, దాత, వేదవేదాంగ పారంగతుడైన చంద్రాంగదుడనే మహారాజు పరిపాలించాడు.

సకలైశ్వర్యాలతోనూ వైభవంగా అలరారే ఆ రాజు కొలువుకూటం స్వర్గాధిపతియైన ఇంద్రుడి సభను మరిపించేదిగా ఉండేది. ఆ రాజుకు ఇందుమతి అన్న పేరుగల సర్వాంగసుందరియైన మహాపతివ్రత ధర్మపత్నిగా ఉండేది. ఆమె దేవతాతిది పూజాతత్పరురాలూ, ధర్మశీలీ, అత్తమామలను సేవించేదీయైన సుగుణాలరాశిగా ఉండేది.

ఆ చంద్రాoగద మహారాజుకు వేట అంటే చాల మక్కువగా ఉండేది. ‘హింసాయుతమైన వేటను విడనాడoడి మహారాజా’ అంటూ మంత్రులు ఆయనకు ఎంతగానో హితవు చెప్పారు. ఇలావుండగా ఒకనాడు అతడు వేటకై కొంత పరివారాన్ని వెంటగొని, నల్లటి చొక్కా, నల్లటి తలపాగా, కండువా మొదలైనవి ధరించి, ఖడ్గాన్ని, దనుస్సునూ చేతబూని ఆశ్వారూఢుడై వెళ్ళాడు!

ఘోరారణ్యంలో అనేక క్రురమృగాలను వేటాడి, వాటిని నగరికి పంపుతూ, అశ్వాన్ని అధిరోహించి అరణ్యంలో తిరుగుతూ కొందరు రాక్షసుల కంటబడ్డాడు. భీకరాకారూలైన ఆ రాక్షసులు గుహలవంటి నోళ్ళుకలిగి, అతిభయంకరంగా కన్పించారు. వారిని చూడగానే భీతావహులైన సేన నలుదిక్కులకూ పారిపోయారు. మన్మధుడో, నలకుభేరుడో అన్నంత అందంగావున్న ఆ చంద్రాంగదుణ్ణి చూసి మోహించిన ఒక రాక్షసవనిత ముద్దుపెట్టుకుంది. అతడి వెంటనున్న సేనల్ని కకావికలు చేస్తూ, ఆ రాజును వెంబడించింది. ఎలాగో ఆమె బారినుంచి తప్పించుకున్న చంద్రాంగదుడు, ఆమెవెంట తరముతూ రాగా, దారిలోవున్న ఒక సరోవరంలోపడి మునిగిపోయాడు! అప్పుడు ఆ సరస్సులోంచి నాగకన్యకలు బైటికివచ్చి, ఆ రాజును తమవెంట పాతాళానికి తీసుకెళ్ళి, అతడిని నానాలంకారములతోనూ అలంకరించి, అతడిని యిలా ప్రశ్నించారు.

‘నీవెవరవు? ఎక్కడినుండి వచ్చావు? ఎవరికుమారుడవు?’ అన్న వారి మాటలకు ఆరాజు యిలా బదులిచ్చాడు.

చంద్రాంగదుడు:

“ఓ నాగాకన్యలారా! నేను హేమాంగదుడి కుమారుడను! నాపేరు చంద్రాంగదుడు! మాది మాళవదేశం. అందులోని కర్ణనగరం నా నివాసస్థలం! వేటకని వచ్చిన నేను ఒక క్రూరరక్కసి బారినుండి తప్పించుకొనివస్తూ ఈ జలాశయంలో ప్రవేశించాను. మీవల్ల ఇక్కడకు కొని తేబడ్డాను! ఇదీ నాచరిత్ర! వేటకని వచ్చిన నా పరివారమంతా రాక్షసి పాలబడ్డారు. నేను మాత్రం ఈ సరోవర జలాలలో ప్రవేశించటంవల్ల బ్రతికాను!”

నాగకన్యలు:

“ఓ రాజా! నీవు మమ్మల్ని వరించి మాకు భర్తవుకా! నీకు సకల సుఖభోగాలనూ సమకూరుస్తాము! మాతో భోగము నరులకు దుర్లభం!”

ఆ మాటలకు తన చెవులను రెండుచేతులా మూసుకుంటూ రాజిలా బదులుచెప్పాడు.

చంద్రాంగదుడు:

“ఓ తల్లులారా! నేను ఏకపత్నీవ్రతుడను! ఆ వ్రతాన్ని నేను యిప్పుడెలా వీడగలను? మేము సోమవంశానికి చెందిన సుక్షత్రియులం! మా వంశీయులు పరద్రవ్యాన్నీ, పరదారలనూ కలలోనైనా ఆశించనివారు. పరద్రోహ, పరనిందలు మాచే సర్వదా వర్జితములు. సౌమ్యత, సాధుత్వం, సుస్వభావమూ, యజ్ఞ, దాన, తపో వ్రతాడులందు అనురక్తీ, ఇవి మాకు వెన్నెతోపెటిన విద్యలు! శరణాగతుడైన వానిని తప్పక రక్షించాలన్న నియమమూ, నిషిద్ధకర కర్మలను వర్జించాలన్న నియమమూ కలవారము! విధివత్తుగా చేయాల్సిన కర్మలను ఏమరుపాటుగా తప్పక ఆచరించే నియమపరులం! ఎటువంటి వారికైనా అతిదిసత్కారమనేది ముఖ్యనియమం! కాబట్టి మీకు ఆదరణీయులం!” ఆ మాటలు విన్న నాగకన్యకలు క్రోధపరవశులై తమను తిరస్కరించిన చంద్రాంగదుడిని ‘నీకు స్వస్త్రీవియోగము కలుగుగాక!’ అని శపించి అతడిని కారాగ్రుహబద్ధుణ్ణి చేశారు.

హిమవంతుడు:

ఈకథ ఇలాఉండగా, ఓ పార్వతీ! చంద్రాంగదుడిని వెంబడిస్తూ తరుముకు వచ్చిన ఆ రక్కసి అతడివెంట తానూ ఆ జలాశయంలోకి దూకి, దానిలోని నీటిని యావత్తూ త్రాగివేసి, జలచారాలనన్నింటినీ భక్షించి, ఆ రాజు జాడ తెలియక ఎంతో అసహనంగా వెతకసాగింది.

‘ఓ పార్వతీ! జరిగిన ఈ వృత్తాంతాన్నంతటినీ పారిపోయి నగరును చేరుకున్న సైనికులు మహారాణియైన ఇందుమతికి చెప్పారు. రాజు సరోవరంలో బడినాడన్న వార్త చెవినబడగానే ఆమె భరింపలేని దుఃఖంతో మూర్చిల్లింది! కొద్దిసేపటికి శైత్యోపచారములచేత తేరుకుని భర్త ఎడబాటును తట్టుకొనలేక గుండెలనూ, నెత్తినీ మోదుకుంటూ దుఃఖించసాగింది!’

“ఓ నాదా! పరిపూర్ణ యవ్వనంలో ఉన్న నన్ను వీడి, దేవతాతిధి పూజాపరురాలనైన నాకు కంటికే కనిపించకుండా, పతివ్రతనైన నన్ను వీడి ఎక్కడికి వెళ్ళవు? రాజోచితమైన షడ్రసోపేతమైన భోజనాన్ని వీడి ఏమి భుజిస్తున్నావోకదా? బంగారు హంసతూలికాతల్పం వీడి ఎక్కడ నిద్రిస్తున్నావోకదా! సుగంధతైలాదికాలతో అభ్యంగనంచేసే నీవు ఇప్పుడు ఎలా స్నానంచేస్తున్నావో? నీవు లేని ఈ రాజ్యానికీ, ప్రజలకూ దిక్కెవరు? వారంతా యిప్పుడు అనాదలైనారే? ఇక వీరిని పాలించాగలవారేవ్వారు? నీవు లేని నాకు శూన్యంగా జీవితమే అంధకారబందురంగా తోస్తుంది! కులస్త్రీలను రక్షించడానికి, పోషించటానికి, ఇహపరసుఖాలకూ భర్తయేకదా జీవనాధారం!” అంటూ అనేకవిధాలుగా విలపిస్తూ తన ఆభరణాలన్నీ విసర్జించి, దుఃఖంతో, బాధతో మూర్చిల్లింది!

Chapter 53 complete