గణేశ పురాణము - ఉపాసనా ఖండము
44 – నారదాగమనం – గణేశదర్శనం
వ్యాసుడు:
“త్రిపురాసురునిచేత పరాజితుడైన శివుడు ఆ తరువాతేమి చేశాడు? పరక్రమంతోనూ, వరబలగర్వంతోనూ మత్తుడైన, ఆ రక్కసుని ఎలా చిత్తుచేశాడు? ఆ వివరం దయతో నాకు, తాము తెలుపవలిసింది” అంటూ ప్రార్థించిన పరాశరనందనునితో చతుర్ముఖుడిలా బదులిచ్చాడు.
బ్రహ్మ:
“నాయనా! ఆ రకంగా త్రిపురునిచేత ఓడించబడి కొండగుహలో తలదాల్చుకోవాల్సి వచ్చినందుకు శంకరుడు ఎంతగానో నొచ్చుకుని, ‘తిరిగి భూలోకంలో దేవతలకై ధర్మస్వరూపాలైన యజ్ఞాలు ఎప్పుడు నిర్వహించబడతాయో? నా చెవులకు ‘స్వాహా’, ‘స్వధా’ మంత్రాలెప్పుడు వినబడగలవోకదా? తిరిగి దేవతాగణాలకు తమతమ స్వస్థానాలు లభించెదెన్నడో కదా? ఈ రాక్షసుణ్ణి చూస్తే అజేయుడై వున్నాడే? ఎలా ఇతన్ని ఓడించడం?’ అనుకుంటూ మదనపడుతుండగా అక్కడికి యాదృచ్ఛికంగా దేవర్షియైన నారదమహర్షి రావడం జరిగింది! అందుకు పరమానందభరితుడై ఆ యోగీశ్వరుడైన శంకరుడు నారదునికి ఎదురేగి ఆహ్వానించి ఉచితాసనమిచ్చి, అతనిని యధావిధిగా సత్కరించి, ఎంతో ఆదరంతో ఆలింగనం చేసుకున్నాడు.
శివుడు:
“ఓ దేవర్షీ! త్రిపురునితో జరిగిన ఘోరసంగ్రామంలో దేవతలు పరాజితులై పారిపోయారు! ఎంతో శక్తివంతాలైన నా దివ్యాస్త్రాలన్ని ఆ అసురుని ధాటికి వమ్మైపోయాయి! ఎందువలన నా ప్రతాపం కొరగాకుండా పోయింది? దీనికేదైనా ఉపాయం సూచించవలసింది!” అంటూ అర్థించిన శంకరునితో బ్రహ్మమానసపుత్రుడూ త్రిలోకసంచారీ దేవర్షియైన నారదుడు యిలా అన్నాడు.
శివ వరదానం
నారదుడు:
“ఓ సదాశివా! నీవు సర్వమూ ఎరిగినవాడివి, సకల విధ్యలకూ అధిపతివీ, అందరినీ రక్షించేదీ, చివరకు హరుడవై సర్వాన్ని లయం చేసేవాడవూ, అన్నిటికీ సమర్దుడవూ, ఐశ్వర్యప్రదుడవూ, అందరకూ అన్నీ ఉపదేశించగలవాడవూ అయిన నీకు చెప్పగలిగినంతవాడను కాకపోయినా, నీ ఆజ్ఞమేరకు నాకు తోచిన సలహానిస్తాను.” అంటూ క్షణకాలం ధ్యానమగ్నుడై శివునితో యిలాన్నాడు.
నారదుడు:
“ఓ శంకరా! నీవు మూడోకంటితో మన్మధుడంతటి వాడిపై అగ్నినే వర్షించగలవాడవైన, ‘పినాక’మనే దివ్యధనుస్సును నీచేత పూనినప్పటికీ, యింకా నిన్ను విజయం వరించలేదంటే, అందుకు కారణం ఒక్కటే కనబడుతుంది. యుద్ధసన్నద్ధుడవై నీవు రణరంగానికి తరలివెళ్ళే ముందు సకలార్ధప్రదుడూ, సకల విఘ్న వివారకుడూ ఐన గణేశుని ప్రార్థించి, పూజించి ఆయనయొక్క అనుగ్రహాన్ని బడయలేదు! అందువల్లనే విజయం నిన్ను వంచించింది! ఇప్పటికైనా నీవు చేసిన తప్పిదనాన్ని గుర్తెరిగి, ఆ గజాననుని మనసా, వాచా, కర్మణా అర్చించి, ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకో! అప్పుడు నీకు గెలుపు సుగమమౌతుంది.
ఇంకో ముఖ్యవిషయం, ఆ త్రిపురుడు కూడా సామాన్యుడు కాదు! వినాయకుని ఘోరతపస్సుతో పసన్నున్ని చేసుకుని వరాలను పొందాడు. అన్యులెవరికీ అతడిని వధించడం సాధ్యం కాదు. అది నీవలనే జరగాల్సివుంది. వినాయకుని దివ్య అనుగ్రహం పొందడంచేత, అతడు కేవలం నీ శరముచేతనే, అదీ నీవు ఒకే శరంతో అతడి మూడుపురాలను నీవు భేదించినప్పుడే, ఆనాడే వధింపబడతాడని గణనాథుడు అతడిని ఆశీర్వదించాడు. అందువల్ల నీవా విఘ్నహరుని ప్రసన్నుని చేసుకుని మరలా ప్రయత్నించు. విజయం నీకు అవశ్యం సిద్ధించగలదు!.”
అప్పుడు ఆ మాటలతో తన అంతరంగానికి స్వాంతన కలుగగా శంకరుడు, తనకు లోగడ గణేశునిచేత ఉపదిష్టములైన ఏకాక్షరీ, షడక్షరీ గణేశమంత్రాలు గుర్తుకువచ్చాయని, ఆ మంత్రానుష్టానం సర్వ సంకష్టాలనుంచీ విముక్తిని ప్రసాదిస్తుందన్న విషయం నారదమహర్షితో చెప్పి, ఆ ప్రకారంగా తపస్సు చేయడానికి ఉద్యుక్తుడై, దండకారణ్యమే అందుకు తగిన స్థలమని భావించి వెంటనే అక్కడకు చేరుకున్నాడు.
పద్మాసనంలో కూర్చుని, ఇంద్రియములన్నింటినీ వశపర్చుకుని, ఏకాగ్రతతో నిశ్చలధ్యానతత్పరుడై, నూరుసంవత్సరాల కాలం ఘోర తపస్సు ఆచరించాడు. అలా చిరకాలం మహోగ్రతపస్సును ఆచరించిన పరమశివుని ఎదుట మరోశివుడా? అన్న భ్రాంతికలిగేలా గణేశుడు తన దివ్యదర్శనాన్ని ప్రసాదించాడు. ఐదుముఖాలతోనూ, పది బాహువులతో శిరస్సున చంద్రకళను ధరించి మెడలో పుర్రెలమాల, సర్పాలంకారాలతో, కిరీట కుండలాలతో, సూర్యచంద్రుల కాంతినే తలదన్నేటటువంటి దివ్యకాంతితో విరజిమ్మే ఆయుధాలు ధరించి, మహాతేజస్సుతో, మహోగ్రరూపుడై సాక్షాత్కరించాడు.
ఆ హఠాత్సంఘటనకు విభ్రమచెందిన శంకరుడు ఇది కలయా? నిజమా? లేక ఇతడు మరో శంకరుడా? ఐతే ఈయనకు ఐదు శిరస్సులేలా సంభవించాయి? నేను తపస్సు చేస్తున్నదెవరికోసమో అట్టి ఆ విఘ్నేశుడితడు కాదుకదా? అనుకుంటూ తర్కించుకు౦టూ౦డగా, సర్వజ్ఞుడైన ఆ గజాననుడిలా అన్నాడు
గణేశుడు:
“ఓ శంకరా! నీ హృదయకమలంలో ఎవర్ని నీవు అనన్యచిత్తంతో ధ్యానిస్తున్నవో, అట్టి గజాననుడనే నేను! నా అనుగ్రహంతో తప్ప నా ఈ స్వరూపాన్ని బ్రహ్మాదులు సైతం గుర్తించలేరు! అంతెందుకు? వేదాలు, వేదశిరస్సులూ కూడా నా స్వరూపాన్ని వివరించలేక మౌనమే వహించాయి! ఇక మానవులసంగతి వేరే చెప్పాలా? ఓ శంకరా! ఈ సకల జగత్తుకూ, యింకా వీటికావలగల అనేక కోట్లబ్రహ్మాండాలకూ సృష్టి, స్థితి, లయ కారకుడను నేనే సుమా! సమస్త జగత్తులకూ నేనే ప్రభువును! ఓ మహాదేవా! నీ మనోభీష్టాన్ని అది ఎటువంటిదైనాసరే, అనుగ్రహిస్తాను! నీకేమేం వరాలు కావాలో కోరుకో!”
Chapter 44 complete
