గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

58 – సంకష్టచతుర్దీ వ్రతకధనం

“ఓ వ్యాసమునీoద్రా! ఆ శూరసేనుడు ఇంద్రుని వచనాలను విని తిరిగి ఆ గణేశ కధామృతాన్ని వినగోరి ఆ శచీపతి యిలా ప్రశ్నించాడు” అంటూ కధాగమనాన్ని కొనసాగించాడు చతుర్ముఖుడు.

“ఓ ఇంద్రా! క్రిందకు దిగిపోయినట్టి నీ ఈ దివ్యవిమానము తిరిగి ఏ ఉపాయంచే నింగికెగరగలదు? ఆ ఉపాయంచేయి! లేదా అట్టి ఉపాయాన్ని నాకు చెప్పు!” అంటూ పదేపదే తనని అర్ధిస్తున్న ఆ శూరసేనుడితో శచీపతియైన దేవేంద్రుడిలా అన్నాడు.

ఇంద్ర:

“ఓ శూరసేనమహారాజా! నీపట్టణoలో ‘సంకష్టచతుర్ది వ్రతము’ను ఆచరించిన బ్రాహ్మణులుగాని క్షత్రీయులుగాని ఎవరైనా ఉన్నట్లైతే అట్టివారు తాము ఒకసంవత్సరంపాటు ఆచరించిన వ్రతఫలాన్ని ధారపోసినట్లైతే ఈ దివ్యవిమానం అప్పుడు యధావిధిగా నింగికెగురగల్గుతుంది! అలాకాక పదివేలమంది బలాఢ్యులు పైకెత్తబూనినా ఏమీ ప్రయోజనముండబోదు!

శూరసేనుడు:

“ఓ ఇంద్రా! ఇంతటి ప్రభావయుతమైన ఆ సంకష్టచతుర్దీవ్రత విధానమెలాగ ఆచరించాలి? అదిచేస్తే ఎలాంటి పుణ్యం లభిస్తుంది? అందులో పూజించబడే దేవుడెవరు? ఇంతకుపూర్వం ఎవరా వ్రతమాచరించారు? వారు ఎలాంటి ఫలితాన్ని పొందారు? ఓ ఇంద్రా! ఆ వివరాలన్నీ దయతో నాకు విస్తరించి వివరించు!”

ఇంద్ర:

“ ఓ రాజా! ఈ విషయమై ఒక ప్రాచీనమైన ఇతిహాసాన్నొకదానిని నీకు చెబుతాను! ఇది కృతవీర్యుడనే రాజుకూ, దేవర్శియైన నారదుని మధ్య జరిగిన సంవాదం!”

పూర్వం కృతవీర్యుడనే మహాబలపరాక్రమ సంపన్నుడైన రాజు ఒకడుండేవాడు. అతడు సకల సద్గుణోపేతుడు! అనేక యజ్ఞాలుచేసి భూరిగా దానధర్మాలు చేసినవాడు సత్యవాది! ఇంద్రియములనన్నింటినీ తన వశం చేసుకున్నట్టి జితేoద్రియుడుకూడా!

దేవతలన్నా అతిధులన్నా అతనికిగల ప్రీతిమెండు! అసంఖ్యాకమైన చతురంగబలాలు ఆరాజు సేనావాహినిలో ఉండేవి! ప్రతినిత్యం పన్నెoడు వేలమంది బ్రాహ్మణులను సహపంక్తిలో నుంచుకునిగాని భుజించేవాడుకాడాతడు! అట్టి కృతవీర్యునికి సుగంధియనేపేరుగల మహాపతివ్రతా, అతిలోక సౌందర్యవతీయైన భార్యఉండేది! ఆమె ద్విజ, దేవ, అతిధి పూజాపరురాలు. ఆమె సుగుణవతి సౌశీల్యవతీ! ఇంత అపూర్వ గుణసంపత్తి కలిగివున్న ఆ దంపతులకు పుత్రసంతతి మాత్రం కరువైంది. సంతానంకోసం వారు చేయని వ్రతంలేదు! ఇవ్వని దానమూలేదు. అనేక క్రతువులనూ యజ్ఞయాగాదికాలనూ కూడా నిర్వహించినా ఫలితం మాత్రం శూన్యo! అనేక పుణ్యతీర్దాలనుకూడా సందర్శించారు. ఎన్ని చేసినప్పటికి జన్మాంతర పాపకర్మ ఫలితంగా సంతతిమాత్రం కలుగలేదు!

ఈరకంగా నిరాశకు గురైన ఆరాజు ఒకనాడు తన మంత్రులను పిలిచి వారికి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యానికి వెళ్ళాడు. నారబట్టలను ధరించి తపోదీక్షను ప్రారంభించాడు – ఇంద్రియాలను వశపరచుకొని, ఆహారాన్ని పూర్తిగా వర్జించి, పైనుంచి రాలిపడ్డ ఆకులనే భుజిస్తూ, కేవలం వాయువునే ఆహారంగా స్వీకరిస్తూ, కాలం గడుపుతూన్న ఆ దంపతులకు రాజు శల్యావశిష్టుడైవుండగా దేవర్షియైన నారదమహర్షి యొక్క సంధర్శనభాగ్యం కలిగింది!

ఆతరువాత ఆ నారదుడు పితృలోకానికి వెళ్ళి అక్కడ కృతవీర్యుని తండ్రిని కలిసి, ఆతని కుమారుడు సంతతికోసం పడే ఆరాటాన్నీ బాధనూ వివరించి అక్కడినుండి వెళ్ళిపోయాడు.

ఇలా వెళ్ళిన దేవర్షి నారదుడు ఊర్ధ్వలోకలగుండా పోతూ భ్రుశుండిమహర్షి తల్లిదండ్రులూ, కన్యకాసహితయైన ఆతనిభార్య అందరూ కుంభీపాక నరకంలో విపరీతయాతనలు అనుభావిoచడాన్ని గమనించి వారి దుస్థితికి జాలిపడి వేగంగా భ్రుశుండిమహర్షియోక్క ఆశ్రమానికి చేరుకున్నాడు.

నారదుడు:

“ఓయీ భ్రుశుండా! నీవు సమస్త దేవతలచే వంద్యనీయుడవైనప్పటికీ అక్కడ నీ తలిదండ్రులూ, భార్యాకుమార్తే సకలురూ కుంభీపాక నరకంలో లెక్కలేని నరకయాతనలు అనుభవిస్తున్నారు. గనుక నీవు నీ పూర్వులను ఉద్ధరించే ప్రయత్నం తప్పక సలుపవలసింది! అది సర్వులకూ శ్రేయస్కరము”.

అన్న నారడుముని పలుకులకు భ్రుశుండమహర్షి ఎంతో ఖిన్నుడై వారి దుఃఖనివారణకు తప్పక ప్రయత్నించాలని పూనుకుని సమాదినిష్ఠలో ఏకాగ్రచిత్తంతో గణేశుని ధ్యానిస్తూ అందుకు పరిష్కారమార్గం తెలుసుకుని తనచేతిలోకి పరిశుద్ధమైన మంత్రోదకాన్ని తీసుకుని తనచే ఆచరించబడిన సంకష్ఠ చతుర్ధీవ్రతంచే సముపార్జించబడిన పుణ్యం యావత్తూ తన పితరుల ఉద్ధరణకై ధారపోయసంకల్పించి

భ్రుశుండిమహర్షి:

“ఓ గజాననా! నీ వ్రతాన్ని నేను భక్తిభావముతో చేజేసినట్లైతే దానియొక్క మహత్తర ప్రభావంచేత నా పితరులు తక్షణమే ఉద్ధరించబడుదురు గాక!” అంటూ గజాననుని స్మరిస్తూ చేతిలోని మంత్రజలాన్ని విడిచిపెట్టగానే ఆ గజాననుని దివ్యానుగ్రహంచేత భ్రుశుండుని పూర్వీకులందరూ దేవరూపులై, శ్రేష్టములైన దివ్యవిమానాలను అధిరోహించి అప్సరలచే సేవించబడుతూ, చారణులచేత కీర్తించబడుతూ, గంధర్వులచేత గానం చేయబడుతూ గణేశ లోకాన్ని పొందారు.”

‘ఓ శూరసేన మహారాజ! ఇట్టి అనంతఫలప్రధమైన సంకష్టచతుర్దీ వ్రతాచరణవల్ల ఒకరోజుకే కల్గిన మహాప్రభావ మిలాంటిది! ఇక జన్మప్రభ్రుతి ఈ వ్రతాచరణ చేసినవారి పుణ్యం లెక్కించటం ఆదిశేషునికి కూడా వీలుకాదు. కనుక అట్టి మహత్తర పుణ్యంచేతనే నావిమానంకూడా పైకెగెయగలదు” అన్నాడు ఇంద్రుడు .

Chapter 58 complete