గణేశ పురాణము - ఉపాసనా ఖండము
75 – చతుర్థీవ్రత మహాత్మ్యం – 3
బ్రహ్మ:
“ఓ వ్యాసమునీంద్రా! ఈ విధంగా సంకష్టచతుర్థీ వ్రతమహాత్మ్యాన్ని కన్నులారా గాంచిన శూరసేనమహారాజు ఆ తరువాత ఏoచేశాడో ఆ వృత్తాంతాన్ని యావత్తూ తెలియజేస్తాను విను!”
కన్నులరమోడ్పులవగా భక్తివినమ్రభావాలు మదిని ముప్పిరిగొనగా శ్రద్ధగా ఆలకిస్తున్న కృష్ణద్వైపాయనుడితో చతుర్ముఖుడిలా కధనాన్ని కొనసాగించాడు. ఈ వ్రతవైభవాన్ని, మహిమనూ కళ్ళారా చూసిన ఆ శూరసేనమహారాజు వశిష్టమహామునిని యిలా ప్రార్థించాడు.
శూరసేనమహారాజు:
“ఓ మహానుభావా! ఈ మంగళప్రదమైన సకలాభీష్టప్రదమూ, సకలారిష్ట నివారకమూయైన సంకష్టచతుర్థీవ్రతాన్ని అనుష్టించడానికి తగిన ముహూర్తాన్ని నిర్ణయించండి! సద్యఃఫలితాన్నివ్వగల ఈ మహోత్కృష్టవ్రతాన్ని ఆచరించాలని నిశ్చయించుకున్నాను! తమ అనుజ్ఞను ఆశీస్సులనూ అర్థిస్తున్నాను!” అంటూ చేతులుమోడ్చి ప్రార్థించిన శూరసేనుడితో చిరుదరహాసం మోమున విరియగా వశిష్టమహర్షి తన ప్రశాంత గంభీర స్వరంతో
వశిష్టమహర్షి:
“ఓ శూరసేనా! మాఘమాసంలోని బహుళపక్షంలో మంగళవారంనాడు వచ్చే చతుర్థీతిధి ఈ వ్రతానుష్టానానికి అత్యంత అనువైన సమయం! ఆ రోజున ఆచరించిన వ్రతం సర్వసిద్ధికరమూ సర్వకామప్రదమూను! అందుచేత ఆనాడు నీవీవ్రతాన్ని అనుష్టించు!” అంటూ శుభముహుర్తం నిర్ణయించగా ఆ శూరసేనుడు వ్రతాన్ని ఆచరించడానికి సంబారాలన్ని సమకూర్చుకుని భార్యాసమేతుడై, అత్యంత భక్తిశ్రద్ధలతో వశిష్టుని అనుజ్ఞను గైకొని సంకష్టచతుర్థీవ్రతాన్ని ఆచరించాడు.
ఆ తరువాత భక్తాభీష్టప్రదుడైన గణేశునియందు తన మనస్సును లగ్నంచేసి, తన ఎడమకాలి బొటనవ్రేలుపైన నిలిచి గణేశుని దివ్యమంత్రాన్ని సూర్యాస్తమయమయ్యేంతవరకూ జపించాడు. ఆ సాయంత్రం తిరిగి స్నానసంధ్యానుష్టానములను నిర్వర్తించుకొని, పురోహితులు కూడిరాగా వ్రతాన్ని చేయనారంభించాడు.
ఒక దివ్యమైన మంటపాన్ని అరటిస్థంభాలతో అలంకరింపచేసి శుభ్రమైన వస్త్రాలంకారములతోనూ ఛత్రచామరాలతోనూ పుష్పమాలలతోనూ, దీపమాలలతోనూ దానిని అలంకరింపచేసి, మణికాంతులతో విలసిల్లుతూన్న ఆ మంటపంలో సర్వకలశద్వయాన్ని ఉంచి, వాటిపై సర్వావయవ సంపూర్ణమైన బంగారు గణేశ ప్రతిమను ఉంచి, ఆ ప్రతిమనుకూడా అలంకరించి బ్రాహ్మణుల స్వస్తివచనాలతోనూ, గాయకుల గాత్రంతోనూ మారుమ్రోగుతూండగా మంగళతూర్యారవములు మ్రోగుతుండగా, భోగంవారు నృత్యంచేస్తుండగా, వైదిక పౌరాణిక మంత్రాలతో ఆ మూర్తిని చక్కగా పూజించినాడు.
షోడశోపచారములు సమర్పించి, పంచామృతములనూ, గణేశునికి అత్యంత ప్రీతిపాత్రములైన మోదకములు (ఉండ్రాళ్ళు), అప్పాలు, లడ్లు, శర్కరతో కూడిన పాయసము, అనేకరకాల పచ్చళ్ళనూ నైవేద్యంగా ఆ దేవదేవునికి సమర్పించి, ఆచమనానికి చల్లటి పరిమళభరిత పానీయాలను, గజాననుని సంతుష్టికై ఫలతాంబూలాలను సమర్పించాడు. ఆ తరువాత సువర్ణ మంత్రపుష్పాన్నీ, దుర్వాంకురములనూ సమర్పించి, నీరాజనమిచ్చి, తిధికి, గజాననునికీ, చంద్రునికీ అర్ఘ్యప్రదానం చేశాడు.
బ్రాహ్మణభోజనాదికములు ముగిశాక వారిని శాస్త్రోక్తరీతిన సత్కరించి, అప్పుడు తానుకూడా భుజించాడు. బ్రాహ్మణులకు పదివేల గోవులను దానమిచ్చి వస్త్రాలంకరణాదులతో తృప్తిపరచాడు. ఆ రాత్రి శేషకాలమంతా, నృత్యగీత వాద్యాదికములతో జాగరణసలిపాడు. ప్రాతఃకాలాన్నే స్నానసంధ్యాదుల అనంతరం గణేశుని మరలా పూజించి, ఆ మూర్తిని పరికరములన్నిటితోసహా వశిష్టమునికి వాయనముగా సమర్పించాడు.
అప్పుడు గజాననుడు సంతుష్టుడై తక్షణమే అతడికై దివ్యవిమానాన్ని పంపించాడు. ఆ విమానాన్ని అధిరోహించిన శూరసేనుడు వినాయకుడితో సారూప్యాన్ని పొంది ప్రజలందరూ ఆనందంతో వీక్షిస్తుండగా తన పుణ్యప్రభావంచేత గణేశధామాన్ని చేరుకున్నాడు.
అక్కడికి చేరుకున్న శూరసేనుడితో ఆ గణేశదూతలిలా అన్నారు. “ఓ రాజా! నీ భక్తిశ్రద్ధలకు సంతుష్టుడైన వినాయకుడు నిన్ను చూడగోరి వెంట తీసుకురమ్మని మమ్మల్ని పంపించాడు.” ఈ మాటలకు రాజు విచలితుడై ఆనందబాష్పములు కన్నులు వెంటరాలగా, గద్గద స్వరముతో యిలా అన్నాడు.
శూరసేనుడు:
“ఓ దూతలారా! నిర్గుణ పరబ్రహ్మయూ, అవ్యక్తరూపుడు, అపరిచ్చిన్నుడు, నిత్యుడు, అవాజ్మాసన గోచరుండును ఐన ఆపరమాత్మునికి నా దర్శనంవల్ల కలిగే ప్రయోజనమేమిటి? వేదాలు సహితం ఎవరిని వర్ణించలేక మౌనం వహించాయో, సకల దేవతాగణములచే ఆరాధ్యుడైన ఆ దేవదేవుడైన ఆ గజాననునిచేత అనుగ్రహపూర్వకంగా నేను స్మరిoచబడినట్లైయితే, నా జన్మ ధన్యమైనది!” అంటూ పరవశించిపోయాడు.
గణేశదూతలు:
“ఓ రాజా! భక్తియొక్క ప్రభావమెంతైనదీ, ఆ భక్తులయొక్క మహిమలనూ వర్ణించడం మాతరం కాదు. ఆ భక్తియొక్క విశిష్టతవల్లనే నిర్గుణ నిరాకారుడైన పరమాత్మ సుగుణత్వమును పొందాడు. అదంతా భక్తుల మహిమయే!”
శూరసేనుడు:
“ఓ దూతలారా! ఆ గజాననుడూ, మీరు ఉభయులూ సంతుష్టులైతే నాకో కోరికయున్నది. దాన్ని నెరవేర్చగోర్తాను. నా కన్నబిడ్డల పైకన్నా ప్రజలయందు నాకెంతో వాత్సల్యం! నేను లేకుండా నా ప్రజలు కనీసం భోజనం కూడా చేయరు! ప్రేమతో నేను హాలాహలం భుజించమన్నా నామాట జవదాటక యిట్టే స్వీకరిస్తారు. అటువంటివారిని విడిచి నేను ఒక్కడినే స్వార్థపూరితుడనై ఆనందాన్నెలా పొందగలను?
గణేశదూతలు:
“ఓ శూరసేనమహారాజా! సరే, అయితే నీ అభీష్టప్రకారమే నీవాంఛ పరిపూర్తి చేస్తాము! లేకపోతే మా ప్రభువు మాపై ఆగ్రహించగలడు!” అంటూ “ఓ వ్యాసమునీoద్రా! ఆ గణేశదూతలు రాజుయొక్క అభీష్టంమేరకు ప్రజలందరినీకూడా విమానంపైకి ఎక్కించారు!”
ఆ దివ్యవిమానం అధిరోహించగానే దాని దివ్య ప్రభావంచేత ప్రజలందరూ దివ్యమైన వస్త్రాలనూ, అలంకారాలనూ పొందారు! ‘ఆహా! ఏమి మన భాగ్యం! ఇంతటి దివ్యానుగ్రహాన్ని మనమేమి పుణ్యం చేసుకున్నామో! కాదుకాదు! ఇదంతా మనరాజు యొక్క పుణ్యవిశేషమే! సాధువుల సాంగత్యం అతిదుర్మాత్ములనైనా పునీతులను చేసినట్లు, పరశువేదిసోకిన ఇనుముకూడా బంగారంగా మారినట్లు, అతని రాజ్యంలో ఉన్న కారణంచేత, ఆ మహానీయుడి పుణ్యవిశేషంచేత మన అదృష్టం పండింది!’ యిలా అనుకుంటూ ఉండగా గణేశదూతలచేత ఆ విమానం పైకేగిర్చేoదుకు ప్రయత్నించారు. విమానం మాత్రం ఏమాత్రం భూమిపైనుంచి ఒక్క అంగుళం ఎత్తుకుకూడా లేవలేదు. అప్పుడు ఆ విమానం ఎక్కికూర్చున్న ప్రజలు అందుకు కారణమేమిటా? అని అన్వేషించగా అందులో ఒక కుష్టురోగి కనిపించాడు. ఆ ప్రజలు ఆ కుష్టురోగిని విమానంలోనుండి దింపివేయమని అలా చేస్తే నిరాటంకంగా ఆ దివ్యవిమానం పైకెగరగలదనీ రాజును అభ్యర్థించారు. దూతలుకూడా అలాగే అతడిని దింపివేయబోగా రాజువారితో యిలా అన్నాడు.
శూరసేనుడు:
“ఈ దీనున్ని వదిలి మీతో స్వర్గలోకానికి రావడం నాకెంత మాత్రమూ అంగీకారయోగ్యo కాదు! అందుకని నన్ను వదిలి మిగతా ప్రజలందరినీ మీతో కొనిపొండి! అలా వీలుపడదంటే, ఈ కుష్టురోగియొక్క పూర్వజన్మ కర్మవృత్తాంతాన్ని నాకు తెలిపి, అట్టి దుష్కర్మకు నివారణోపాయాన్నికూడా చెప్పండి!”
గణేశదూతలు:
‘ఓ శూరసేనమహారాజా! నీవు విచారించకు! నీకు ఈ కుష్టురోగియొక్క పూర్వజన్మ కృతకర్మనూ ఆ పాపపరిహారానికి సరైన ఉపాయాన్నీ చెబుతాము!’
Chapter 75 complete
