గణేశ పురాణము - ఉపాసనా ఖండము
88 – అనంగోపాఖ్యానము – 1
వ్యాసమునీంద్రుడు:
“ఓ చతురాననా! సకలార్ధప్రదములైన గజాననుని వ్రతమునూ, దాని సంబంధిత యితర గాధలను వినిపించి నాకు పరమ సంతోషాన్ని కల్గిoచావు. ఐనా నాకో సందేహం మిగిలివున్నది. అదేమిటంటే, మన్మధుడు శంకరునియొక్క క్రోధాగ్నిచే దగ్దుడైనాడుకదా! మరలా లోకములో ఎలాగున గోచరుడౌతున్నాడు? ఆతనివల్లనే ఈ సృష్టివిలాసం కొనసాగుతున్నదికదా? దయతో నా ఈ సందేహాన్ని నివారించు!
బ్రహ్మ:
“శంకరుడు రోషంతో ఆగ్రహపరవశుడై తన మూడవకన్ను తెరవగానే అతడి క్రోధాగ్నికి భస్మీపటలమైన మదనుడి విషయాన్ని తెలుసుకుని అతడి పత్నియైన రతి తన భర్త అపరాధాన్ని తెలుసుకుని ఆ మదనారి శివుని పాదాలనంటి సాష్టాంగ దండప్రమాణాలు ఆచరించి ఈవిధంగా స్తుతించింది.
రతీదేవి:
“ఓ మహాదేవా! నీవే త్రిగుణాలకాదారభూతుడవూ, అతీతుడవూ! సత్త్వగుణంచేత లోకపాలననూ, రజోగుణంచేత సృష్టికార్య నిర్వహణనూ, చివరకు తమోగుణం ఆధారంగా సకల లోకాలనూ హరిస్తున్న నీకిదే నా శరణాగతి! ముక్కంటివీ, వృషభవాహనుడవూ గిరిజా సహాయుడవైన నీకివే నా నమస్కృతులు!”
“చేతిలో కపాలధారివై నిత్యభిక్షువువైనా భక్తుల మనోరధాలనన్నిటినీ నెరవేర్చుతూ, దీనులయెడ అపారమైన దయను వర్షించే దీనజనార్తిహరణా! నా పతివియోగాన్ని నేను సైపలేకున్నాను! నీవుతప్ప మరినాకు వేరేదిక్కులేదు! నీ క్రోధాగ్నిచే దగ్దుడైన నాభార్తకు ప్రాణాలను దానంచేసి నాకు సౌభాగ్యభిక్షను ప్రసాదించు! అలాకాకపోతే నేను ప్రాణత్యాగంచేసి అతడిని చేరుకుంటాను. అది నీకు అపకీర్తికాదా ప్రభూ! నీ కరుణయే నాకిక ఆధారం!” అంటూ దీనంగా ప్రార్థించిన రతీదేవి స్తుతికి శంకరుడు ప్రసన్నుడై ఆమెతో యిలా అన్నాడు.
శంకరుడు:
“ఓ రతీ! నీ స్తుతికి నేను సంతసించాను! నీకేం వరం కావాలో కోరుకో!”
రతీదేవి:
“ఓ పరమేశ్వరా! ముల్లోకాలలోనూ కాంతలకు పతితోడిదే జీవితంకదా! భార్తృరహితమైన మగువ జీవితం వ్యర్థం! శక్రాదులను సైతం మోహింపచేయగల సౌందర్యం, నా శరీరలావణ్యం యివన్నీ నిరర్థకములైనవి! కనుక ఓ దయానిధీ! నాకు భర్తృదానంచేసి నన్ను బ్రతికించు! రతి విధవ అనే అపకీర్తి తొలగించు!” అంటూ దీనయై రతిచేసిన ప్రార్థనకు శంకరుడు ఆమెను ఊరడిస్తూ, తన మృదుమధుర వాక్యాలతో అనునయంగా యిలా అన్నాడు.
శివుడు:
“ఓ మంగళప్రదురాలా! దుఖించకు! లజ్జనొందకు! నీవు స్మరించినంతనే నీభర్త నీకు కనబడగలడు! నీ కోరికలను తీర్చగలడు. నీవు మాననీయురాలవవుతావు! మనసారా స్మరించటంతో సంప్రాప్త మౌతాడు గనుగ నీభర్త మనోభవుడన్న పేరుతో విఖ్యాతుడౌతాడు.”
“మళ్ళా ఈతడు శ్రీకృష్ణునకు పుత్రుడై రుఖ్మిణీదేవీ గర్భాన ప్రద్యుమ్నుడన్న పేరుతో జన్మించినప్పుడు తిరిగి నీకు భర్తవుతాడు. నీవు దిగులుచెందకు!” అన్న శివుని అజ్ఞానుసారియై ఆమె తన యింటికి వెళ్ళి తన భర్తను స్మరించగానే అనంగుడామె ఎదుట సాక్షాత్కరించాడు. ఆమె ఆశ్చర్యానందాలకు అవధేలేకపోయింది. ఆ తరువాత అనంగుడు శంకరుని సన్నిధికి వెళ్ళి నమస్కరించి యిలాపలికాడు.
అనంగుడు:
“ఓ దేవా! అపరాధము లేకుండానే నాకు శరీరం లేకుండా చేశావే! తారకాసురుని బాధలకు తట్టుకోలేక ఇంద్రాదిదేవతలు వేడుకొనగా విశాఖుడైన కుమారస్వామి జననం నీవలన జరగవలసినందున నీ నిష్టను భంగపరచటానికి కేవలం లోకోపకారం నిమిత్తమే పూనుకున్నాను. ఎవరైనా తమకు అయాచితంగా ఉపకారంచేస్తే ఎంతో ఆనందిస్తారు. కానీ అది నా విషయంలో విపరీత ఫలితాన్నిచ్చింది. గతంలో ముప్పైమూడుకోట్ల దేవతలందరిలోనూ అత్యంత సుందరుడనై ఒప్పాను. ఇంద్రుడు, జయంతుడు, వసంతుడు, నలకూబరుడు వీరంతా నన్ను చూసి సిగ్గుతో తమ తలదించుకునేవారు! ఇప్పుడు అంగహీనుడనై ప్రేతలా ఎలా ఉండగలను? కనుక ఓ మహాదేవా! దయచేసి నన్ననుగ్రహించు!” అంటూ వేడుకొనగా ‘ఓ వ్యాసమునీంద్రా! శంకరుడు ఏకాక్షర గణపతి మహామంత్రాన్ని అనంగుడికి ఉపదేశించాడు. అప్పుడా మన్మథుడు కడు సుందరమైనట్టి జనస్థానానికి వెళ్ళి సుప్రసిద్ధమైన ఆ ఏకాంత ప్రదేశంలో శివుని అనుజ్ఞమేరకు అనుష్టానం చేయసాగాడు.
గజానన సాక్షాత్కారం
కేవలం వాయువునే ఆహారంగా భక్షిస్తూ రతీసమేతుడై అనంగడు నూరు సంవత్సరాలు మహత్తరమైన తపస్సును గణేశ ఏకాక్షరీమంత్రాన్ని జపిస్తూ నిష్టగా చేశాడు.
ఆ కఠోర తపస్సుకు ప్రసన్నుడైన గజాననుడు పదిబాహువులతో దివ్యకిరీటాన్ని దాల్చి, ప్రకాశిస్తున్న రత్నకుండలాలను దాల్చి, కోటిసూర్యులను ధిక్కరించే తేజస్సుతో, మెడలో ముత్యాలహారములు ధరించి, దివ్యమైన పుష్పమాలలను అలంకరించుకుని, సింధూరముతో అలదబడినట్టి ఎఱ్ఱటి దేహఛాయతో, పదిబాహువులలోనూ దివ్యమైన దశాయుధాలనూ ధరించి శేషునిచేత కట్టబడిన నాభిస్థానం కలవాడై తన ఘీంకార ధ్వనితో లోకములనెల్ల భయకంపితులను చేస్తూ అనంగుడికి గణేశుడు సాక్షాత్కరించాడు.
ఈ విధంగా ఆవిర్భవించిన గజాననుని ఆరాధించేందుకుగాను ఇంద్రాది సమస్త దేవతలూ, అప్సర, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషగణాలు అక్కడికి విచ్చేశారు. షోడశోపచారములతో భక్తియుతులై అతడికి దివ్యంగా పూజలను సలిపారు.
అప్పుడా రతీపతి దేవతలకూ, మునులకూ నమస్కరించి, దయామయుడై గణపతిని యిలా స్తుతించాడు.
మన్మథుడు:
“ఓ దేవా! దేవతలందరిలోకీ ధన్యుడవైనప్పటికీ నీవు కేవల పరబ్రహ్మ స్వరూపుడవే! నిరాకారుడవైనప్పటికి భక్తజనులయందలి వాత్సల్యంచేత సాకారమూర్తివిగా సాక్షాత్కరించావు. నీ దివ్యసందర్శనంచేత నాజన్మా తపస్సూ ధన్యమైనాయి! నీ దివ్యచరణారవింద దర్శనం సమస్త సిద్ధులకూ ఆలవాలం! చతుర్విధ పురుషార్థప్రదమైనట్టి, సర్వదుఃఖ విమోచకమైనట్టి నీ పాదయుగళం దర్శించిన నా నేత్రములు పావనమై, పునీతములైనాయి!”
“ఓ కరుణాoతరంగా! వేదాలచేత, శాస్త్రప్రమాణాదులచేత యిట్టిదని నిర్వచించరానట్టి అనిర్వచనీయ స్వరూపంగల్గిన మహామహిమాన్వితుడవు! నిన్ను వర్ణింపశక్యంకాక వేదాలే మౌనంవహించినాయి! నీలోని ప్రత్యణువు అనేకకోట్ల బ్రహ్మండాలకు నెలవైన, నీవు అఖిలేశ్వరుడవు! భక్తుల మనోహరుడవూ, కల్పవృక్షమువంటివాడవు! నీ దర్శనాన్ని నాకు ప్రసాదించిన ఆ మంత్రముసహితం అత్యంత ప్రభావవంతమైనది! నాపై నీ దయను ప్రసరించు!”
గజాననుడు:
“ఓ మన్మధా! నీవు పలికినదంతా అక్షరసత్యం! బ్రహ్మరుద్రాదులు సైతం నా నిజతత్వాన్ని తెలుసుకునేందుకు సమర్ధులుకారు! వారైనా నా సాకారరూపాన్ని మాత్రమే ఎరుగగలరు! కేవలం నీయందలి అనుగ్రహవిశేషంచేత నీకు నా నిజస్వరూపదర్శనాన్ని ప్రసాదించాను!”
“నీ తపమునకు నేను కడుసంతుష్టుడనైనాను! ఓ రతీపతి! నీ మనోభీష్టములన్నీ తప్పక అనుగ్రహిస్తాను! కోరుకో!”
అప్పుడా మదనుడు ఆ గజాననుని అనుగ్రహవచనాలను విని శివుని ఆగ్రహానికి తను దగ్ధుడవటమూ, తన భార్య రాతీవిలాపమూ, ఏకాక్షర మంత్రోపదేశము మొదలైన వివరాలను ఆ గజాననునికి విన్నవించి “ఓ దేవా! నీకు నాయందు అనుగ్రహం కలిగినట్లయితే, నాకు సదేహత్వాన్ని ఒసంగుము! సర్వదేవతా మాన్యత్వమునూ, పూర్వలోవలే శరీరలావణ్యాన్నీ, నీ చరణారవిందాలపై చెదరని ధృడభక్తినీ మూడులోకాలపైనా విజయాన్నీ కలుగచేయి!” అంటూ ప్రార్థించాడు.
Chapter 88 complete
