గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

73 – చతుర్థీవ్రత మహాత్మ్యం – 1

దేవేంద్రుడు ఆ తరువాతి కథాక్రమాన్ని శూరసేనుడితో యిలా చెప్పసాగాడు.

దేవేంద్రుడు:

“ఓ శూరసేనమహారాజా! అప్పుడు కార్తవీర్యుడు లోకగురువైన దత్తాత్రేయుడు ఉపదేశించిన రీతిలో నిరాహారుడై, కేవలము వాయువును మాత్రం భక్షిస్తూ నిశ్చలమైన మనస్సుతో, తదేకదీక్షతో గజాననుని ధ్యానంచేస్తూ స్థాణువులానిలచి తపస్సు ఒనరించాడు.”

ఆ ఘోరమైన తపస్సుకి అమిత ప్రసన్నుడైన గజాననుడు అతడు తపస్సుచేస్తున్న ప్రదేశానికి ఎదురుగాఉన్న తటాకములోనుంచి ఆవిర్భవించాడు. ఎఱ్ఱటి పగడపువర్ణములో ప్రత్యక్షమై ఆ భక్తాభీష్టప్రదుడైన కరివదనుడు మేఘగంభీర్యముతో యిలా పలికాడు.

గణేశుడు:

“ఓ బాలకా! కఠోరమైన నీ నియమనిష్టలకు సంతుష్టుడనైనాను. ఘోరమైన క్రూరమృగాలు విచ్చలవిడిగా చరించే ఈ ఘోరారణ్యంలో పన్నెండు సంవత్సరాలకాలం అఖండమైన తపోనిష్టనుపూని నన్ను అనన్యభక్తితో ధ్యానించావు! కనుక సంతుష్టుడనై నీకు వరములివ్వదలిచి వచ్చాను. నీ మనోభీష్టాన్ని తప్పక నెరవేర్చగలను. నీ మనోవాంఛితాన్ని కోరుకో!”

ఈ మాటలకు గాడమైన ధ్యానసమాధిలో నిష్టుడైవున్న కార్తవీర్యుడు దేహభావాన్నిపొంది గజాననుని చరణకమలాలకు సాష్టాంగవందన మాచరించి, సిద్ధసాధ్య దేవతాగణాలు తమతమ దివ్యవిమానాలలోంచి వినుచుండగా యిలా పలికాడు.

కార్తవీర్యుడు:

“ఓ దేవా! మంగళప్రదములైన నీ పాదపద్మములయందు నిరూఢమైన భక్తిని నాకనుగ్రహించు! నాకింకే యితర కోరికాలేదు! ఐనప్పటికీ నీ ఆదేశంమేరకు నా తల్లిదండ్రుల సంతోషంకోసం ఒకటి కోరదలిచాను. అదేమిటంటే సర్వులకూ ఆహ్లాదం కలిగించేటటువంటి దేహసౌందర్యాన్ని నాకు అనుగ్రహించు!” అని వేడుకొనగా గజాననుడు తన మాయా విభవముచేత సూక్ష్మరూపాన్నిదాల్చి కార్తవీర్యుని ఉదరంలో ప్రవేశించాడు. ఏ క్షణాన్నైతే విఘ్నేశ్వరుడు కార్తవీర్యుని శరీరంలోకి ప్రవేశించాడో అప్పుడే ఆ బాలకుడు దివ్యదేహాన్ని దాల్చాడు. అతనికి వేయిబాహువులు సంప్రాప్తమైనాయి. చక్కటి పాదద్వయంకూడా అమరింది. పర్వతాకారుడై నిలచిన ఆ కార్తవీర్యునిపైన దేవతలు, దేవఋషులు పుష్పవర్షాన్ని కురిపించారు. గంధర్వులు తమ అద్భుతగానంతోనూ, అప్సరసలు తమ మంజులనాట్యoతోనూ గజాననుని, కార్తవీర్యుడిని అలరించారు. సహస్రబాహువులతో అనంతమైన బలసమన్వితుడైన కార్తవీర్యుడు దిక్కులన్నీ పిక్కటిల్లేలా సింహగర్జనం చేశాడు!

ఆ ధ్వనికి సమస్త దేశాల రాజులూ భీతిచెoది గడగడా వణికారు! ఒక్కసారిగా అయిదువందల బాణాలను యుద్ధభూమిలో సంధించి వదలగల సామర్థ్యం అతడిని శత్రుదుర్భేద్యుడిగా, అపరాజితుడిగా చేసింది!

అప్పుడు బ్రహ్మాది దేవతలు తమ దివ్యవిమానాలనుంచి దిగి ‘ఓయీ! కేవలం నిన్ను స్మరించినంతమాత్రానే దేవతలకు నష్టవస్తుప్రాప్తి కల్గుతుంది! సర్వలోకాలలోని ప్రజల హృదయాలలోగల బాధను తొలగించగల సామర్థ్యం నీకు సంప్రాప్తిస్తుంది!

ఈ కల్పాంతంవరకూ మూడులోకాలలోనూ చిరకీర్తివై వర్దిల్లగలవు! శరణువేడినవారికి అభయప్రదాతవై, శత్రువులకు సింహస్వప్నమువై అజరామరమైన ఘనకీర్తి గడించగలవు!” అంటూ అతడిని దీవించి తమతమ లోకాలకు వెళ్ళిపోయారు!

అప్పుడు సమస్త దేశాల ప్రభువులు అతడిని చక్రవర్తిగా అంగీకరించి అనేక అమూల్య వస్తువులను కానుకలుగా సమర్పించారు. ఆ తరువాత కార్తవీర్యుడు ఒక మహాప్రసాదాన్ని నిర్మించి, అక్కడ పగడపు వినాయకమూర్తిని స్థాపించి సకల బ్రాహ్మణలోకమూ వేదఘోషలు సల్పుతుండగా ఆ మూర్తికి ‘ప్రవాళగణపతి’ అన్న నామకరణంచేసి, ఆ కార్యక్రమంలో పాల్గొన్న విప్రోత్తములకు అనేక గ్రామాలను బహుకరించి వారి ఆశీర్వచనాన్ని పొందాడు.

ఆనాటినుంచి ఆ క్షేత్రము ప్రవాళక్షేత్రమన్న పేరుతో ప్రసిద్ధిచెందింది. ఈ క్షేత్రమున సలిపే తపశ్చర్య సకల సిద్ధులను ప్రసాదించగలదు. ఈ క్షేత్రంలోనే సహస్రఫణుడైన ఆదిశేషుడు భూభారమును మ్రోయగల సామర్థ్యంకోసమని తపస్సుచేసి గణేశానుగ్రహంవల్ల అనేక వరాలను పొందాడు. అక్కడే సర్వజ్ఞత్వాన్నీ, వేయిశిరస్సులనూ, నవనాగులలో ఆధిక్యమునూ సర్వులలో శ్రేష్టత్వాన్ని పొందాడు.

ఈ క్షేత్రములో తనకు లభించిన ఇష్టసిద్ధిచేత సంతుష్టుడైన శేషుడు కూడా ఒక గణేశమూర్తిని స్థాపించి ఆ మూర్తికి ‘ధరణీధరుడు’ అన్ననామం ఉంచాడు. ఈ ధరణీధరమూర్తిని స్మరించేవారికి సర్వకామ్యసిద్ధి కలుగుతుంది!

ఆ తరువాత కార్తవీర్యుడు తన సామంతులందరినీ రావించి, వారిని యధోచితంగా గౌరవించి బ్రాహ్మణులకు భూరిగా సమస్తదానాలనూచేసి అందరి ఆశీస్సులనూ పొంది తన తల్లిదండ్రులను దర్శించడానికై తన సహస్ర బాహువులతోనూ పురమునకు తరలివెళ్ళాడు! అతడిని చూచినా అతడి తల్లిదండ్రులు, పురజనులు అమిత సంతోషం పొందారు. అప్పుడా కార్తవీర్యుడికి సకల బ్రాహ్మణాశీర్వచనం లభించింది!

దేవేంద్రుడు:

“ఓ శూరసేనమహారాజా! సంకష్టచతుర్థీవ్రతమహిమను నీకోరికమేరకు వర్ణించి చెప్పాను. ఈ వ్రతం కృతవీర్యునికి సంతానప్రాప్తి నిమిత్తమై ఈ భూలోకానికి తేబడింది. దీని ఫలితాన్ని ఇదివరలో దేవతాగణములు, చంద్రసేనుడు మొదలైన రాజులు అనుభవించారు. ఈ వ్రతం అతిపావనమైనది. కేవలం ఈ వ్రతాన్ని స్మరించినంతమాత్రాన్నే సకలసిద్ధులూ సప్రాప్తమౌతాయి! ఈ వ్రతప్రభావంచేత రావణుడు సర్వమూ ఎరిగినవాడైనాడు. ఈ వ్రతంయొక్క ప్రభావంచేతనే పాండవులు తాము కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందారు!

Chapter 73 complete