గణేశ పురాణము - ఉపాసనా ఖండము
50 – చతుర్థీవ్రత కథనం
బ్రహ్మ:
ఓ వ్యాసమునీoద్ర! ఆ విధంగా తన తండ్రియైన హిమవంతుడు చెప్పిన ‘గణేశ పార్ధివ పూజా’విదానాన్నంతనీ శ్రద్ధగావిన్న గిరినందనయైన పార్వతి తిరిగి యిలా తన తండ్రిని ప్రశ్నించింది!
పార్వతి:
“ఓతండ్రీ! పూజకు చివర మంత్రజపం చేయవలెనని చెప్పావు! ఆ మంత్రమేమిటో దాని వివరమేమిటో ఎట్టి మహాప్రభావయుత మంత్రజపంవల్ల నా భర్తయైన పరమేశ్వరుడిని కూడి సుఖిoచగలనో ఆ మంత్రమును నాకుపదేశించవలసింది!”
హిమవంతుడు:
“ఓదేవీ! గణేశుని దివ్యమంత్రాలనేకం వున్నాయి! అవి సకల సిద్ధులనూ కలుగజేస్తాయి! నీకు తగిన మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఇంద్రియాలను పరిపరివిధాల పోనివ్వకుండా నియమించి, గణేశుని దివ్యమంత్రాన్ని న్యాసం చేసుకొని ఏకాగ్రచిత్తంతో జపించి, ధ్యానించాలి!
ఏకాక్షరమంత్రాన్ని లక్షసంఖ్యకు తక్కువకాకుండా జపించాలి. షడక్షరమంత్రాన్ని లక్షగాని, ధషక్షరీ, అష్టాక్షరీ మహామంత్రాలనుకూడా అదేసంఖ్యలో జపించాలి! నివు ఏకాక్షర, షడక్షర మంత్రాలను నానుంచి స్వీకరించి మంత్రజపాన్ని శ్రావణశుద్ధ చతుర్ధిరోజున ఆరంభించు! ఈ వ్రతాన్ని ఒక మాసంరోజులు నిష్టగా చేసినట్లైతే నీవు తప్పక పరమశివుని పొందగలవు! ఇంకా యితరములైన నీ సకల కోరికలు కూడా నెరవేరతాయి!”
స్త్రీగాని, పురుషుడుగాని ఒక్క పార్ధివగణపతిముర్తిని స్థాపించి పూజించినట్లితే ధన, పుత్ర, పశు సమృద్ధిని పొందగలరు. రెండుమూర్తులను స్థాపించితే అసాధ్యమైనవికూడా సుసాధ్యమౌతాయి. మూడు మూర్తులను పూజించితే రాజ్యప్రాప్తి, రత్నాది సర్వసంపదలూ కలుగుతాయి!
ఐదు మూర్తులను పూజించాటంచేత సార్వభౌమత్వాన్ని సిద్ధింప చేసుకోవచ్చు. ఆరింటిని పూజించితే సృష్టిస్థితిలయకారకత్వం వస్తుంది! ఏడు, ఎనిమిది, తొమ్మిది విగ్రహాలను పూజిస్తే సర్వజ్ఞత్వం కలుగుతుంది! పదిమూర్తుల నర్చిస్తే సకల దేవతా, మునిగణములచేత పూజత్వం వస్తుంది. పదకొండు మూర్తుల పూజవల్ల దశరుద్రులకధిపతి కాగలడు. పన్నెండుమూర్తులను శ్రద్ధతో అర్చిస్తే ద్వాదశాదిత్యుల రాజ్యం సంప్రాప్తిస్తుంది. అతి సంకష్టసంయాలలో యింకా ఎక్కువ మూర్తులను పూజించాలి!నూటఎనిమిది మూర్తులవరకూ పూజిస్తే సమస్త కామనలూ నెరవేరతాయి! ప్రతిదినమూ లక్షమూర్తులను అర్చించటంచేత మహాముక్తిని పొందగలరు. అలాగే కారాగృహ విమోచనం కోరేవారూ ప్రతినిత్యం ఐదుగురు మృత్తికాగణేశమూర్తులను పూజించాలి! అలాచేస్తే ఇరవైఒక్క రోజులలో విముక్తి కల్గుతుంది. అలాగే ఏడుమూర్తుల చొప్పున ఐదు సంవత్సరాకాలం పూజిస్తే గణేశానుగ్రహాన్నిపొంది మహాపాపములనుండి విడువబడుతారు. జన్మించినప్పటినుండి ఆమరణాంతం ఒకే పార్ధివమూర్తిని పూజిస్తే వాడు సాక్షాత్తూ గజాననుడే అవుతాడు. అట్టివాని దర్శనంవల్లనే సమస్త విఘ్నాలూ నశిస్తాయి. అట్టి భక్తుని పూజించటంవల్ల గణేశుడు తృప్తుడైనట్లు, స్వయంగా తననే అర్చించినా అంత ప్రసన్నుడు కాడు.
మూడు గణేశమూర్తులను 9 రోజులకాలం పూజిస్తే రోగాది సకల పీడలు నశిస్తాయి. అలాగే బంగారము, వెండి, రాగి మొదలైన మూర్తులు సహితం అటువంటి ఉత్కృష్ట ఫలితాన్నే యిస్తాయి.
అమ్మా! పార్వతీ! నీవు ఈ వ్రతాన్ని చేయటంవలన సకల అభీష్టాలనూ పొందగలవు! చివరికి భాద్రపద శుక్ల చతుర్ధిరోజున మాత్రము శక్తికొలది మహోత్సవము చేయాలి! మర్నాడు ఉదయాన్నే స్నానసంధ్యాదికములు ముగించుకొని పూర్వంలాగానే గణేశుని మూర్తిని పూజించవలసింది! ఆతరువాత జపసంఖ్యలో పదోవంతు హోమం చేయాలి! అందులో పదోవంతు తర్పణం యివ్వాలి! ఆతరువాత బలి, దానపురస్సరంగా పూర్ణాహుతి చేయాలి! తరువాత ఆచార్యుని భూ, వాసో, ధనాదికములచేత పూజించాలి! బ్రాహ్మణులకు భోజన సమారాధన జరిపి వారిని సంతుష్టులను చేసి, వేదవేత్తలు భార్యాసహితులైన బ్రాహ్మణులను దక్షినాదికములతో సత్కరించి, సువాసినులకు అలంకారములు, రవికెలగుడ్డలు యివ్వాలి!
ఈ ప్రకారం విధివత్తుగా అర్చిస్తే సిద్ద్ధిబుద్ధియుతుడైన గజాననుడు సంతుష్టుడౌతాడు. ఆతరువాత బంధుమిత్రులతో కలిసి తానూ భుజించాలి! ఆ మరునాడు ఆ మూర్తిని జలములో నిమజ్జనం చేసి తన ఇంటికి మరలాలి! వాద్యగీత ధ్వనులతో ఇల్లు చేరుకోవాలి! ఓపార్వతీ! ఇది పార్ధివ గణేశవ్రత విధానం! దీన్ని నీవాచారిస్తే నీ భర్త సాన్నిధ్యమును తిరిగి పొందగలవు!” అంటూ హిమవంతుడు తన కుమార్తెకు ఉపదేశించాడు.
Chapter 50 complete
