గణేశ పురాణము - ఉపాసనా ఖండము
66 – దూర్వామహాత్మ్యం – 3
ఆ ఇంటియందు చివరికి కూర్చునేందుకు కనీసం పీటయైనా లేనందున విరోచన త్రిరోచనులు ఇరువురూ నేలపైనే కూర్చున్నారు. ధరించేందుకు సరైన వస్త్రాభరణములు కూడా లేనివారవటంచేత దిగంబరులై ఉండిరి. అయాచితంగా లభించినదానిని మాత్రమే భుజించే నియమం కలవారవటంచేత తమకు భుజించేందుకు ఆహారం లభించని రోజులలో కేవలం నీటితోనే తమ అవసరాలు తీర్చుకునేవారు. ఇల్లంతా ఈగలచేత, దోమలచేత నిండి ఎంతో ఆశుభ్రంగా ఉండినది. నానారకాల పత్రిచేత అర్చించిన వినాయకమూర్తి, నీరుతప్ప మరింకేమీలేని వారియింటిలో ప్రవేశించిన ఆ కపటబ్రాహ్మణుడు వారలతో ఇలా అన్నాడు.
కపట బ్రాహ్మ:ణుడు:
“ఓ పుణ్యదంపతులారా! ఈదేశపు రాజైన జనకుని కీర్తినివిని ఆకలిగా వున్నదికదా! కడుపారా భోజనంచేద్దామని వచ్చిన నాఆశ అడియాసే అయింది! అతడు చేసేదంతా దంభముతోటి తనగొప్ప చాటుకునేందుకే చేస్తున్నాడు కనుక నాకు తృప్తికలిగేలా మీ యింట ఏమివున్నా పెట్టండి!”
ఆ మాటలకు నిర్ఘాంతపోయిన ఆదంపతులిలా అన్నారు.
దంపతులు:
“ఓ బ్రాహ్మణోత్తమా! చక్రవర్తియైన రాజుసైతం నీకు తృప్తికలిగించలేకపోయినాడే? దరిద్రులమైన మేము నీకెలా తృప్తినొదించగలము? నదీనదములచేత నిండని సముద్రము కేవలము బిందువుతో నిండుతుందా?”
కపటబ్రాహ్మ:ణుడు:
“ఓ దంపతులారా! భక్తితో సమర్పించినది కొంచమైనా అది నాకు అనంతతృప్తిని కలిగిస్తుంది! అలాకాక దంభముతో నాకు ఎంతయిచ్చినా అది వృథాయే అవుతుంది!”
దంపతులు:
‘ఓ బ్రాహ్మణోత్తమా! నీకు యివ్వటానికి మాఇంట ఏమీలేవు! నిజమే చెబుతున్నాము. ఉదయాన్నే గణనాథుని పూజించటానికి సేకరించిన దూర్వాంకురాలలో ఒక్కటి మిగిలివున్నది’
కపటబ్రాహ్మ:ణుడు:
‘ఓ దంపతులారా! మీరు భక్తిభావముతో ఆ ఒక్క దూర్వాoకురాన్నే సమర్పించినా నేను సంతుష్టుడనౌతాను. కనుక నాకు మీరు దానిని నిస్సందేహంగా యివ్వండి!’
‘ఓ ఆశ్రయా! ఆ విధంగా బ్రాహ్మణుడినుండి ఆదేశించబడ్డ విరోచన అనే ఆ ఇంటి ఇల్లాలు ఆ ఒక్క దుర్వాంకురమును తెచ్చి సమర్పించింది. దానితో ఆ బ్రాహ్మణుడు సంతుష్టుడైనాడు. ఆమె షడ్రసోపేతమైన భక్షభోజ్యాదులతోకూడిన విందుభోజనం సమర్పిస్తున్నట్లు భావించి ఆ ఒక్క దూర్వాంకురమునే భక్తిశ్రద్ధలతో ఆ బ్రాహ్మణుడికి సమర్పించటంచేత ఆ దూర్వాంకురంచేత ఆ మాయాబ్రాహ్మణుడి జఠరాగ్ని ఉపశమించింది. అతడు పరమతృప్తిని చెందాడు. అప్పుడా బ్రాహ్మణుడు ప్రేమతో త్రిశిరసుని ఆలింగనంచేసుకుని తన మాయా రూపాన్ని త్యజించి, తన నిజరూపంతో ప్రత్యక్షమైనాడు.
ఆ దివ్యమంగళరూపం ఎలావున్నదంటే నాలుగుచేతులలో కమలము, పరశువు, పద్మమాల, దంతములను ధరించి కమలాల వంటి నేత్రాలతో అనేకమైన దివ్యాభరణాలను ధరించి దివ్యసుగంధ లేపనాల పరిమళం గుభాలించాగా ప్రత్యక్షమై అనుగ్రహమూర్తిగా యిలా అన్నాడు.
‘ఓ పుణ్యదంపతులారా! మీ నిరతిశయమైన భక్తికీ నేను ముగ్ధుడినైనాను. మీ మనోభీష్టములన్నీ తప్పక నెరవేరుస్తాను. కోరుకోండి!’ అంటూ అభయమిస్తూ చిరుదరహాసచంద్రికలు వెదచల్లుతూ ప్రసన్నవదనంతో గజాననుడు అనుగ్రహపూర్వకంగా అన్నాడు.
‘ఓ ప్రభూ! మేమెక్కడ జన్మించినప్పటికీ నీ చరణకమలాలపైన యెడ బాటులేని భక్తిని ప్రసాదించు. లేదా ఈ ఘోర సంసారసాగరంనుండి మమ్ములను విముక్తుల్నిచేయి! ఇంతకంటే వేరేమీ కోరము!’ అన్న ఆ దంపతులతో ‘తధాభవతు’ (‘అలాగే జరుగుగాక!’) అంటూ ఆ త్రిశిరుని మరోసారి ప్రేమమీర ఆలింగనం చేసుకుని అంతర్థానం చెందాడు.
కౌండిన్య:
“ఓ ఆశ్రయా! అసంఖ్యాకములైన భక్ష్యభోజ్యాదులను ఎన్ని సమర్పించినా తృప్తిచెందని ఆ భగవంతుడైన గజాననుడు కేవలం ఒక్క దూర్వాంకురంవల్లనే అఖండతృప్తిని చెందాడు. కనుక ఓ ఆశ్రయా! దూర్వాంకుర మహిమను దాని సమర్పణ ఫలమును నీకు వర్ణించి చెప్పాను!”
“ఈ దూర్వామహిమను పాఠించుటవలన, వినుటవలన సకల శుభాలూ ఒనగూరుతాయి! ఈ పవిత్రమైన మహిమను చదివినవారు ధనధాన్య పుత్రపౌత్రాది సంపదలను కలిగి ఇహలోకములో అనంత భోగాలను అనుభవించి గజాననునియందు భక్తికలిగి, కోరికలన్నీ నశించి ముక్తిపొందుతారు” అంటూ తన ధర్మపత్నియైన ఆశ్రయకు కౌండిన్యుడు వివరించాడు.
ఇదంతా విన్న ఆశ్రయకు ఇంకా సందేహం తోలగానందున ఆమెను పిలిచి కౌండిన్యుడు ‘ఓ ఆశ్రయా! నీ సందేహనివారణకై ఒకవాక్యం చెబుతావిను! నీవు ఒక దూర్వాంకురము తీసుకుని ఇంద్రుని వద్దకు వెళ్ళి మొదట ఆశీర్వదించి తరువాత ఈ దూర్వాకురంఎత్తు బంగారము యిమ్మని యాచించు! అది తీసుకుని శ్రీఘ్రముగా రమ్ము!’ అంతకు ఎక్కువకాని, తక్కువకాని గ్రహించావలదు!’ అన్నాడు.
ఈరకంగా భర్తృ ఆదేశాన్ని విన్న ఆశ్రయ అతనివద్దనుండి దూర్వాoకురమును గ్రహించి అజ్ఞానుసారము ఇంద్రునివద్దకు వెళ్ళింది.
Chapter 66 complete
