గణేశ పురాణము - ఉపాసనా ఖండము
65 – దూర్వామహాత్మ్యం – 2
ఆ తరువాత కౌండిన్యుడు తన పత్నియైన ఆశ్రయతో దూర్వామహాత్మ్యగాధను యిలా కొనసాగించాడు.
కౌండిన్యుడు:
“ఓ ప్రియపత్నీ! ఒకనాడు గజాననుడు సుఖాసీనుడైవుండగా త్రైలోక్యసంచారీ బ్రహ్మమానసపుత్రుడైన నారదమహర్షి ఆయనను దర్శించి సాష్టాంగ దండప్రణామంచేసి, ‘ఓదేవా! తమ దర్శనవిశేషంచేత నాజన్మ సార్థకమైంది. అనేక జన్మార్జిత పుణ్యఫలంవల్లకాని తమదర్శనం కలుగదు!’ అంటూ వినయంగా అంజలిఘటించి నిలిచాడు. అప్పుడు భక్తవత్సలుడైన గజాననుడు ఎంతో ఆదరంతో నారదుని చేయిపట్టుకుని అతడిని ఉచితాసనంపై కూర్చుండపెట్టాడు. నారదుడా ప్రేమకు ఆనందపరవశుడై గజాననునితో యిలా అన్నాడు.
‘ఓ దేవా! నాకు మార్గమధ్యంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం తటష్టించింది. దానిని తమకు విన్నవిoచాలన్న కుతూహలంతో వచ్చాను. అది చెప్పి వెళతాను!’ అప్పుడు భక్తజనమందారుడైన గణేశుడు చిరునవ్వుతో ‘ఆ వివరం చెప్పి వెళ్ళమని’ అనుజ్ఞనిచ్చాడు. అందుకు నారదుడిలా చెప్పసాగాడు.
నారదుడు:
“ఓ ప్రభూ! మిథిలానగరాన్ని జనకుడు అనేరాజు ప్రజారంజకంగా ప్రజలను తన కన్నబిడ్డలకన్నా మిన్నగా ప్రేమిస్తూ పాలిస్తున్నాడు. అతడు సకల శుభగుణోపెతుడవటమేకాక గొప్పదాత! నిత్యం అడిగినవారికి లేదనకుండా దానమివ్వటమేకాక నిరతాన్నదానంతో ప్రజల ఆకలికూడా తీర్చే గుణవంతుడు. దేవతలను, బ్రాహ్మణులను అనునిత్యం పూజిస్తూ ధర్మబద్ధుడై జీవిస్తున్నాడు. ఆ కారణంచేతనే కాబోలు – లేక తమ అనుగ్రహంవల్లనో ఇంతగా ద్రవ్యమును వెచ్చిస్తున్నా అతడి సంపద తరగక బహుముఖంగా పెరుగుతూనే ఉన్నది. ఈ ఆశ్చర్యాన్నంతటినీ అతడి గృహానికి స్వయంగా వెళ్ళిచూచాను! అతడు బ్రహ్మజ్ఞానాభిమానంతో నన్ను కొంచెం అపహసించాడు. అతడిని అభినందిస్తూ యిలా అన్నాను.
‘ఓ రాజా! నీవు ధన్యుడవయ్యావు! నీకు అక్షయమైన సంపదలను సర్వసమృద్ధినీ ఆ గజాననుడే నీభాక్తికి ప్రతిఫలంగా అనుగ్రహిస్తున్నాడు!’. నా మాటలు విన్న జనకుడు గర్వంతో యిలాఅన్నాడు. ‘నేనే ముల్లోకాలకూ ప్రభువును! మహాదాతను! భోగిని! సర్వరక్షకుడనూ నేనే! నాకన్నా యితర మార్గమేమీ ముల్లోకాలలోనూ లేదు! సర్వమూ నా ప్రమేయం వల్లనే జరుగుతున్నది. కర్త, కార్యము, కారణమూ యివన్నీ కూడా నేనే!’ అంటూన్న ఆ గర్విష్టితో కినుకవహించి ఆగ్రహంతో యిలా అన్నాను.
‘ఓ రాజా! ఈ జగత్కర్త, భర్త, హర్తా ఈ మూడుకూడా ఆ ఈశ్వరుడే! ఇంకెవరూ ఆ పనిని నిర్వర్తిoచజాలరు! నీవే సత్కార్యములన్నీ చేస్తున్నానంటున్నావే? దంభముతో నీ గొప్పతనాన్ని చాటుకునే నిమిత్తమే వాటిని చేస్తున్నట్లు సృష్టమైoది. నీ పొరపాటు నీకర్థమయ్యేరోజు అతిసమీపంలోనే ఉన్నది!” అని అక్కడినుండి మీసన్నిధికి వచ్చాను’ అంటూ నారదుడు విఘ్నేశ్వరునికి భక్తితో నమస్కరించి సెలవుపుచ్చుకున్నాడు. అక్కడినుండి నారదుడు విష్ణుదర్శనార్దమై వైకుంఠం చేరుకున్నాడు.
‘ఓ ఆశ్రయా! నారదమహర్షి అలా సెలవుతీసుకున్నాక గజాననుడు రాజభక్తిని పరీక్షించటానికై మిథిలానగరాన్ని చేరుకున్నాడు. శరీరమంతా వ్రణాలు రసిఓడుతూ శరీరంపై ఈగలు ముసురుతుండగా చిరిగిన, మాసినవస్త్రం ధరించి ఓ బీదబ్రాహ్మణ వేషధారియై పడుతూ, లేస్తూ రాజమందిరంవద్దకు చేరాడు మాయారూపంలో ఆ గజాననుడు! ద్వారంవద్దనున్న ద్వారపాలకులతో
కపటబ్రాహ్మ:ణుడు:
“ఓ దూతలారా! అతిథియై ఒక బ్రాహ్మణుడు వచ్చాడని మీ రాజుతో తెలపండి. కడువృద్దుణ్ణి. బాగా ఆకలిగొని ఉన్నాను. మృష్టాన్న భోజనాన్ని మాత్రమే ఆశించివచ్చాను” అన్నాడు.
దూతలీవార్తను జనక మహారాజుకు ఎరిగించగానే ‘ఓ దూతలారా! ఆ వృద్దుణ్ణి వెంటనే లోనికి తీసుకురండి!’ అని ఆజ్ఞాపించాడు. దూతలుకూడా అతడిని వెంటనే ప్రవేశపెట్టారు. ఆరాజు దూరాన్నుంచే మలినదేహంతో వంటిమీద వ్రణాలతోనూ వాటినుంచి స్రవిస్తూన్న నెత్తుటిపై మూగే ఈగలతో జుగుప్సాకరంగా ఉన్న ఆ వృద్ధుడిని చూసి
‘ఆహా! నన్ను పరీక్షించటానికి ఈశ్వరుడేమైనా ఈ రూపందాల్చి వచ్చాడో ఏమో? ఏదేమైనప్పటికీ ఈతడి క్షుద్బాధను తొలగించి మనస్సును సమాధానపరుస్తాను!’ అనుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు రాజు దగ్గరకు వచ్చి
కపటబ్రాహ్మ:ణుడు:
“ఓ రాజా! చంద్రునికాంతివంటి తెల్లనిదైన నీ కీర్తిచంద్రికను గూర్చి విని నీ సన్నిధికి వచ్చాను! చిరకాలంనుండి ఆకలిబాధతో తల్లడిల్లుతున్నాను. కనుక నాకు కడుపునిండా భోజనం పెట్టు! అలాగాని చేస్తివా నీకు నూరుయాగాలు చేసినoతటి పుణ్యం వస్తుంది!” అన్నాడు.
కౌండిన్యుడు:
‘ఓ ఆశ్రయా! ఆ జనకమహారాజు బ్రాహ్మణుని పలుకులువిని కూడా వెంటబెట్టుకుని తన మందిరంలోకి తీసుకువెళ్ళి అతనికి సకల రుచులతో కూడిన భోజనం పెట్టించగా అదంతా ఒక గడ్డిపరకలా తినేశాడు ఆ మాయారూపి! ఇంకా ఆకలిగావున్నదంటే ఒక పర్వతమంత అన్నపురాశిని వండించి పెట్టాడు. అదంతాకూడా ఒక ముద్దను తిన్నట్లుగా మ్రింగేశాడు.
ఈ విధంగా పదివేలమందికి సిద్ధంచేసిన ఆహారపదార్థాలన్నీ తినేసి, ‘యింకా అన్నంకావాలి!’ అనగానే గాడిపోయ్యిలు త్రవ్వించి యింకా అన్నం వoడిoచి వడ్డింపచేశాడు. వoడింది వండినట్లుగా వడ్డించినా అదంతా ఖాళీచేసేయసాగాడు. అప్పుడు ప్రజలంతా రాజువద్దకు వెళ్ళి
‘ప్రభూ! వీడెవరో రాక్షసునిలా ఉన్నాడు. వీనికెందుకింత ఆహారం పెడతారు? ఇటువంటి రాక్షసులకు భోజనం పెట్టడంవల్ల ఏమి ప్రయోజనంలేదు! వీడు ముల్లోకాలూ మ్రింగించినా తృప్తిచెందునా? అన్నారు. ఉన్నబియ్యం అన్నీ నిండుకున్నవి! ధాన్యమైనాసరే కడుపునిoడేoదుకు తెచ్చి యివ్వమన్నాడు! అప్పుడు ప్రజలoదరి యిళ్ళలోనివీ, గ్రామాలలోనూ పల్లెలలోని ధాన్యపురాశులన్నీకూడా తెచ్చిపెట్టారు. అవి అన్నీకూడా భక్షించినా అతనికి తృప్తి కలుగలేదు! అప్పుడు దూతలు రాజసన్నిధికి వెళ్ళి ‘ప్రభూ! ఇంక ధాన్యముకూడా ఎక్కడాలేదు!’ అని చెప్పగా జనకుడామాటలు విని తలవంచుకు సిగ్గుపడ్డాడు. ఆ బ్రాహ్మణుడు
‘ఓ రాజా! నస్తితేస్తు!’ అనిపలికి గ్రామములో యింటింటికీ భిక్షాటనకై వెళ్ళగా
‘ఓ బ్రాహ్మణోత్తమా! మా ఇళ్ళలోని సమస్త దాన్యమునూ రాజు ఎప్పుడో తీసుకెళ్ళిపోయాడు, నీకిప్పుడు అన్నంపెట్టుట ఎలాగ? కనుక వేరేచోటుకి వెళ్ళు!’ అనసాగారు!
కపటబ్రాహ్మణుడు:
‘ఓ జనులారా! జనకమహారాజు నిరతాన్నప్రదాత అన్న కీర్తివిని తృప్తిని పొందగోరి వచ్చాను. ఆ తృప్తి కలుగకుండా ఎక్కడికి వెళ్ళగలను!’ అనగానే మారుమాట్లాడలేక ప్రజలు మౌనం వహించారు. ఆ మాయాబ్రాహ్మణుడు అలా తిరుగుతూ విరోచన, త్రిలోచనుల యింటిలో ప్రవేశించాడు. ఆ ఇంట్లో ఏరకమైన వస్తుసామాగ్రి, పాత్రలు కనుపించలేదు.
Chapter 65 complete
