గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

89 – అనంగోపాఖ్యానము – 2

అనంగనుకి గజానన వరప్రసాదం

గణేశుడు:

“ఓ మన్మధా! నీవు కోరిన కోరికలన్నీ ఈడేరగలవు! నీవు రమాదేవి గర్భావాసాన జన్మించి సశరీరుడవవుతావు! సౌందర్యంతో అందరిచేతా కొనియాడబడ తగినవాడవు. త్రైలోక్యవిజేతవూ కాగలవు! ఇక నీకు నీ కార్యసాధనలో సహకరించేందుకుగాను పుష్పములు, ఫలములు, లేచిగుళ్ళూ, కామినుల అవయవాలు, మలయమారుతములూ, వెన్నెలా, చందనమూ, పద్మములు, హంసధ్వనులు సహకరిస్తాయి! ఈ సామాగ్రితో నీవు ఈశ్వరాదులనైనాసరే జయించగలవు! వీటి దర్శనస్పర్శనాదికములచేత మనస్సులో జనిస్తావు!”

“నీకు లోకంలో మనోభవుడని, స్మృతిభవుడవని ప్రసిద్ధనామములు కలుగుతాయి! నా చరణారవిందస్మృతీ, దృడభక్తీ నీకు కలుగగలవు! మహత్కార్యముసంభవించినపుడు నన్ను స్మరించినంతనే నీకు దర్శనమిస్తాను!” అంటూ వరాలను గుప్పిoచి ఆ అనుగ్రహమూర్తి అంతర్ధానం చెందాడు!

బ్రహ్మ:

“ఓ వ్యాసమునీంద్రా! ఈ విధంగా అభీష్టసిద్ధిని పొందిన కాముడు అక్కడనే మహాగణపతియొక్క మూర్తిని స్థాపించి ఎనలేని భక్తితో పూజించాడు! అప్పుడాతని పత్నియైన రతీదేవి లడ్లు, మోదకములు మొదలైన నానావిధ పక్వాన్నములను ఆ గణేశునకు మహానైవేద్యంగా భక్తితో సమర్పించింది. తేజోసంపన్నుడైనట్టి ఆ గజాననునికి “మహోత్కటుడు” అన్న నామకరణంచేసి రత్నస్థంభ విరాజితమైన ఆలయప్రసాదాన్ని నిర్మించాడు.

ఆ తరువాత ఆనతికాలానికే అనంగుడు శ్రీకృష్ణపత్నియైన రుక్మిణీదేవియొక్క గర్భావాసాన జన్మించి సముద్రంలో శంబాసురునిచే పారవేయబడ్డాడు. అప్పుడతడు చేపతో మ్రింగబడినాడు. ఆ చేపనే జాలరులు శంబాసురునికి సమర్పించగా అతని భార్యయైన మాయాదేవి దగ్గర పెరిగి పెద్దవాడైనాడు. నారదునిచేత ప్రేరేపితురాలైన ఆ మాయాదేవి మన్మథునికి మాయలన్నీ చక్కగా ఉపదేశించింది.

ఆ మాయాబలంతోనే ఆ ప్రద్యుమ్నుడు శంబాసురుని వధించాడు! గణేశుని అనుగ్రహవిశేషంచేత ఒక్కడైనప్పటికీ ఆ బాలుడు అనేకమంది శత్రువులను నిర్జించి, ప్రద్నుమ్యుడన్న నామధేయం ధరించి సారస్వతపురానికి వెళ్ళాడు. అప్పటినుండీ సర్వదేవతామాన్యుడై, త్రైలోక్యవిజేతయై, గజానన అనుగ్రహంచేత మాహదానందాన్ని పొందాడు!

రుక్మిణీ మొదలైన వారందరూ అతణ్ణిచూసి కృష్ణుడేమోనని పొరబడినా నారదునిద్వారా అతడు తమ కుమారుడేనని ఎరిగి పరమానందభరితులైనారు. అప్పుడు రతీదేవీకూడా అతని చెంతచేరి భక్తితో ప్రణమిల్లింది!

“ఓ వ్యాసమునీంద్రా! ఈ రీతిగా అనంగుడిచేత ప్రతిష్టితమైన జనస్థానగతుడైనట్టి గణేశమహాత్యం యావత్తూ నీకు తెలిపాను! ఇక్కడనే పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు శూర్పణఖను తిరస్కరించగా, లక్ష్మణుడామె నాసికను, చెవులను కోయడంచేత ‘నాసిక’ అను పేరుతో ప్రసిద్ధి చెందింది.

ఈ ప్రదేశంలో ఈనాటికీ రాళ్లుసైతం మోదకములలా కనబడతాయి! ఈ రకంగా కామునిచేత ఆరాధింపబడిన గణేశుడు అతడిని కృతకృత్యుడిని గావించాడు. ఇక్కడనే రతీమన్మదులు తిరిగి సాంగముగా కలిసి ఆనందించారు. షడక్షరమంత్రంతో శేషుడు ఆరాధించినట్లుగానే మదనుడైన మన్మధుడుకూడా మంత్రానుష్టానంచేసి గణేశానుగ్రహాన్ని పొందాడు!” అంటూ చెప్పాడు చతురాస్యుడు.

వ్యాసమునీంద్రుడు:

“ఓ చతురాననా! శేషుడేలాగ గజాననుని ఆరాధించాడు? ఎందుకని ఆరాధించాడు? ఏయే వరాలను పొందాడు? ఈ యావద్వృత్తాంతాన్ని విస్తారంగా వినిపించి నన్ను ధన్యుడిని గావించు!”

శేషుడు గజాననుని ఆరాధించి వరాలను పొందుట

బ్రహ్మ:

“ఓ వ్యాసమునీంద్రా! నీవడిగిన ప్రశ్న చాలా సమంజసమైనది! సావధానమనస్కుడవై విను!”

ఒకానొకప్పుడు శంకరుడు పార్వతీసమేతుడై, కైలాసశిఖరంపై కొలువుతీరి వుండగా సమస్త దేవతాగణాలు వారి సందర్శనార్థమై విచ్చేశారు. సాష్టాంగ దండప్రమాణాలను ఆచరించి, అద్భుతమైన తమ గానకళా కౌశలంతో శంకరునికి ప్రీతిగావించారు గంధర్వులు! అప్సరసలు లయబద్ధంగా నాట్యంచేశారు. కొందరుమునులు నేత్రములు మూసుకుని ధ్యానించసాగారు. కొందరా గౌరీవల్లభుడిని మానసికోపచారములతో పూజించారు. వశిష్ట, వామదేవ, జమదగ్ని, అత్రి, కణ్వ, భరద్వాజ, గౌతామాది మునీశ్వరులంతా వివిధ స్తోత్రాలతో స్తుతించసాగారు! శేషునకు “మూడులోకాలలోనూ నేనే శ్రేష్టుడిని! అందువల్లనే శంభుని శిరస్సుపైన వున్నాను. భూధారణ సామర్థ్యం నాకుకాక యితరులెవ్వరికీ లేదుకదా! నా కులానికే చెందిన వాసుకిని కవ్వపుత్రాటిగా చేసుకొనే దేవతలు అమృతాన్ని సిద్ధింపచేసుకుని అమరులైనారు! గనుక నాకంటే ఉత్కృష్టమైన వారెవరూలేరు!” అన్న తలంపు కలిగింది.

శివుడాతని మనోగర్వమును తెలుసుకుని అందుకు ఆగ్రహావేశుడై తలపైనున్న శేషుని నేలపైకి విసిరికొట్టాడు! శేషునియొక్క ఒక్కొక్క శిరస్సూ పదేసి భాగాలై మూర్చిల్లి మరణించినవానివలె పడియున్నాడు.

ఇలా ప్రాణమాత్రావశిష్టుడైన శేషుడు దుఃఖిస్తూ తనలో తానిలా అనుకున్నాడు.

‘ఆహా! త్రైలోక్యేశ్వరుడైనట్టి శివునికే శిరోలంకారాన్నైనప్పటికి ఇటువంటి దురవస్థను ఏ దుష్కర్మ కారణంచేత పొందానోకదా! ఇప్పుడు రెక్కలు విరిగిన పక్షిలా ఎటూ కదలలేకుండా వున్నాను.

ఇప్పుడు నేనేమి చేయను? ఎటుపోను? నన్ను రక్షించి సేదతీర్చే వారెవ్వరు? తిరిగి నా స్వస్థానమును పొందగల ఉపాయం చెప్పే వారెవ్వరు? అనుకుంటూ విచారిస్తుండగా అతనికి మార్గమధ్యంలో వస్తున్న నారదుడు దైవవశాన కనిపించాడు.

నిర్ధనునికి స్వప్నంలో నిధి లభించినంత ఆనందాన్ని పొందాడు శేషుడు.

Chapter 89 complete


 

స్కందుడు వరదుడిని ఆరాధించుట

అనంతరం ప్రశాంతమైనట్టి తపోవనానికి తరలిపోయి అక్కడ ఒంటికాలిమీద నిలబడి స్కందుడు ఘోరమైన తపస్సును ఆచరించి, శివుడు చెప్పిన విధానంలో వరదగణేశ వ్రతాన్నికూడా చేశాడు.

అప్పుడు ఆ వ్రతప్రభావంవల్లా, మంత్రానుష్టానంచేతా సంతుష్టుడైన గజాననుడు, యోగిజనులకు సైతం దుర్లభమైన తన దివ్యరూపంతో స్కందునికి సాక్షాత్కరించాడు.

చతుర్భుజుడై, నుదట చంద్రకళతో, దివ్యమైన రత్నఖచిత కిరీటాన్ని ధరించి, కుండలముల శోభతో చెక్కిళ్ళు కాంతులీనుతుండగా పరశువు, అంకుశము, పాశము, దంతములను తన నాల్గుహస్తాలలోనూ ధరించి కంటమున ముత్యాలహారాలతో ఒప్పుతూ, నాగయజ్ఞోపవీతాన్ని ధరించి, దివ్యాలంకరములనూ దేవతావస్త్రాలతోనూ భూషితుడై, దివ్యగంధానులేపనం గావించుకుని, కోటిసూర్యసమాన తేజుడై ఆ గజాననుడు భాసించాడు. ఆ దివ్యదర్శనానికి చకితుడైన స్కందుడు ‘ఇదియేమి విపరీతమా?’ అనుకొని తాను నిత్యం భక్తితో ఆరాధించే దేవతాస్వరూపియేనా ఇతడు? అనుకొని ధైర్యం కూడగట్టుకొని ‘ఓయీ! నీవెవరు? నీపేరేమి?’ అంటూ ప్రశ్నించాడు.

అప్పుడా గజాననుడు చిరునవ్వు తళుక్కుమణి మెరవగా యిలా అన్నాడు. “ఓ స్కందా! అహర్నిశలూ నీవు ఎవరి అనుగ్రహాన్ని ఆపేక్షించి అత్యంత నిష్ఠతో ఏకాగ్రచిత్తుడవై ధ్యానిస్తున్నవో ఆ మంత్రమూర్తిని నేనే! నీ తపస్సుకు చాలా సంతుష్టుడైనాను. నీకభీష్టప్రదానం చేయడానికి స్వయంగా యిలా అనుగ్రహించాను! నీ అభీష్టాలను వేడుకో! వాటినన్నిటినీ తప్పక తీర్చగలను!” అంటూ ఉరుము ఉరిమినట్లుగాపలికాడు భక్తానుగ్రహ మూర్తియైన గజాననుడు!

స్కందుడు:

“ఓ దేవదేవా! నీ ఈ దివ్యస్వరూపాన్ని హరిహరబ్రహ్మాదులుగాని, ఇంద్రాదిదేవతలుగాని, వేయినాల్కలుగల ఆదిశేషుడుగాని కనుగొనలేరు. అట్టి నీ దివ్యమంగళరూపాన్ని అనుగ్రహంతో నాకు దర్శనమిచ్చావు. నీ దర్శనమాత్రంచేతనే నా సకలాభీష్టసిద్ధి అయింది. ఐనా మీ అజ్ఞానుసారం వరమును అర్థిస్తాను. అదేమంటే, యుద్ధంలో నాకెన్నడూ పరాజయమన్నది లేకుండా అనుగ్రహించు! ఎన్నటికీ నీ పాదపద్మములపై విస్మృతి కలుగకుoడుగాక! నేను స్మరించినంతనే నాకు సాక్షాత్కరించు!”

“దేవతలలోకెల్లా శ్రేష్టత్వాన్ని ప్రసాదించు! లక్ష్యరూపంలో నాకిక్కడ సాక్షాత్కరించావుగనుక “లక్ష్య వినాయకుడన్న” పేరిట యిట వెలసి భక్తులపాలిట కల్పవృక్షమువై అనుగ్రహించు!”

ఆ మాటలకు విఘ్నేశుడు “తథాస్తు” (అట్లే అగుగాక) అంటూ ఆ దేవసేనాని కోరిన సకలవరాలనూ ప్రసాదించి, వాటితోపాటు తన వాహనమైనట్టి మయూరాన్ని అతనికి బహూకరించాడు. అది మొదలుగా స్కందుడికి మయూరధ్వజుడన్న ఖ్యాతి గలిగింది!

వినాయకుడు:

“ఓ స్కందా! తారకాది రాక్షసులు నీచే వధింపబడతారు! నీ వాక్యానుసారమే నేను ఈ క్షేత్రములో లక్ష్య వినాయకుడన్న పేరుతొ భక్తవరదుడనై వెలసియుంటాను!” అంటూ అంతర్థానం చెందాడు.

అప్పుడు స్కందుడు బ్రాహ్మణ ఆశీర్వచనాలతోనూ వేదమంత్ర పురస్సరంగానూ మహామూర్తిని స్థాపించి ఆ మూర్తికి లక్ష్యవినాయకుడని నామకరణం చేశాడు. లక్షసంఖ్యలో మోదుకము (ఉండ్రాళ్ళనూ) దూర్వాంకురములనూ సమర్పించి పుష్పాలతో ఆ మూర్తిని అర్చించాడు. లక్షమంది విప్రులకు భోజనం ఏర్పాటుచేసి ఆ తరువాత గణేశునికి స్తుతులను ప్రణామాలను సమర్పించి మయూరవాహనారూఢుడై కైలాసంలోని శివుని సన్నిధికి వెళ్ళి అతనికి జరిగిన యావద్వృత్తాంతమునూ వివరించాడు.

అప్పుడు దేవర్షులంతా స్కందుడికి దేవసైన్యాధ్యక్షునిగా పట్టాభిషిక్తుని గావించారు. గజాననుని స్మరించుకొని, శివుని ఆశీస్సులను పొంది, తారకాసురునిపై యుద్ధానికి వెళ్ళి అతనిపై లక్షసంవత్సరాలు ఘోరమైన పోరుసల్పి అతడిని వధించాడు.

ఈ మహత్తర విజయానికి అతడిని మహర్షులు, దేవతలు సిద్ధ సాధ్య యక్ష కిన్నర కిoపురుషాది గంధర్వగణాలు అతడిని వేనోళ్ళ కీర్తించారు. సమస్త లోకాలలోనూ యధాపూర్వకంగా దేవతాపితృకార్యాలు జరుగసాగాయి.

బ్రహ్మ:

“ఓ వ్యాసమునీంద్రా! గజాననునియొక్క మహాప్రభావమంతటిది! వ్రతప్రభావాన్ని కూడా నీకు నిరూపించి చెప్పాను. ముప్పైమూడుకోట్ల దేవతలచేత వధింపబడని ఆ తారకుడు, ఆ గజాననుని వ్రతప్రభావంచేత స్కందునిచే సంహరించబడ్డాడు. అందువల్లనే ఇంద్రాది దేవతలకు కూడా పూజ్యుడైనాడు షణ్ముఖుడు!” అన్న చతుర్ముఖునితో వ్యాసుడిలా ప్రశ్నించాడు.

వ్యాసుడు:

“ఓ చతురాననా! స్కందుడు సమాధినిష్టుడై ఏస్థానంలో తపస్సును ఆచరించాడు? ఆ వివరం నాకు చెప్పవలసింది!”

బ్రహ్మ:

“ఓ వ్యాసమునీంద్రా! స్కందుడు ఘృష్ణేశ్వరుడు వెలిసిన ప్రదేశంలో అనుష్టానం చేశాడు! అక్కడే లక్షవినాయకుడు ప్రసిద్ధమై వెలిశాడు. ఘృసృణేశ్వరుడు అనేరాజు పాలించిన నగరం అక్కడికి పశ్చిమానఉంది. అందుకనే ఆ నగరాన్ని ఘృష్ణేశ్వరనగరమన్న పేరు కల్గింది.”

Chapter 89 complete