గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

30 – అహల్యాధర్షణం

నారదుడు:

“నాయనా! రుక్మాoగదా! నేనోసారి త్రిలోకాధిపతియైన ఇంద్రుణ్ణి చూడటానికి అమరావతీ నగరానికి వెళ్ళాను. అప్పుడు ఇంద్రుడు నన్ను మూడు లోకాలలోనూ సంతోషం కలిగించే ఆనందకరమై విషయం ఏమిటో ఆ వివరం త్రిలోక సంచారిని గనుక నన్ను చెప్పమని, ఉచిత సత్కారాలనందించి, ప్రశ్నించాడు.

‘భూలోకంలో అత్యంత రమణీయకమైన ప్రకృతి పరిసరాలతో అనేక వృక్షాలతోనూ, లతలతోనూ, పక్షుల కుహూరవాలతో నయనానందకరంగా విలసిల్లుతూ గౌతమముని ఆశ్రమం! ఆ ప్రశాంత ఆశ్రమంలో అపూర్వ సౌందర్యరాశియైన అహల్యతో కూడిన గౌతమమునిని దర్శించాననీ, ఆమె సౌందర్యం లోకోత్తరమైనదనీ వర్ణాతాతీతమైనదనీ ఇంద్రుడెరిగున్న అప్సరసలకన్నా, లక్ష్మీ, పార్వతివంటి దేవతామూర్తులకన్నా అరుంధతి అనసూయలవంటి మహాపతీవ్రతల సౌందర్యంకన్నా మిన్నయై, సూర్యుని పత్నులైన ఛాయ, సౌoజ్ఞలకన్నా, చివరికి కశ్యపప్రజాపతి భార్యయైన అదితికన్నా కూడా సౌoదర్యవంతురాలనీ, అందచందాలాలో ఆమెకు సాటిరారనీ’ దేవరాజైన ఇంద్రుడికి చెప్పాను.

‘అటువంటి దివ్యసౌందర్యవంతురాలిని చూడగానే అఖండ బ్రహ్మచారినైన నాకుసైతం మనసు చలించిందనీ, ఇక గానము, భోజనపానాదులేవీ నాకు రుచిoచలేదనీ, నిద్రకూడా పట్టలేదనీ చివరికి బ్రహ్మచర్యవ్రతం భంగమౌతుoదేమోనన్న భయంకలిగి వెంటనే అక్కడినుండి ఎకాయికి స్వర్గానికి వచ్చాననీ, అందుచేత ఆమెలేని స్వర్గం అలంకారంలేని అతివలా వుoటుందనీ’ చెప్పి అంతర్హితుడనైనాను!

ఓ రుక్మాంగదా! అలా నేను ప్రేరేపించి అంతర్హితుడనైనాక ఇంద్రుడు అహల్యను ఆమె రూపలావణ్యాలనూ పదేపదే తన మనస్సులో తలపోస్తూ మదనబాధ భరించలేనంత ఎక్కువకాగా తట్టుకోలేక మూర్ఛిల్లాడు. కొంతతడవాగాక లేచి

‘మహర్షి వివరించిన ఆ అందాలరాశియైన గౌతముని పత్నిని ఎప్పుడు చూడగలనోకదా? ఆమె పొందును శీఘ్రంగా ఏ ఉపాయంచేత పొందగలను? నాకు కలిగే ఈ భరించరాని మధనతాపాన్ని ఎలా ఉపశమింప చేసుకోగలను? ఆమె ఆధరాలు చిలికించే సుధారసాన్ని ఎప్పుడు గ్రోలగలను? ఆమెను బిగియార తనివితీర ఎలా కౌగిలించుకోగలను? ఆమె లేని ఈ జీవితం నిరర్ధకమైనదే!’ అని భావిస్తూ ఆమెనే హృదయాన స్మరిస్తూ కామరూపుడవటంచేత గౌతమముని రూపాన్ని ధరించి ఆయన ఆశ్రమాన్ని చేరుకున్నాడు! మహర్షి స్నాన అనూష్టానాదులకనీ స్నానపానాదులకై వెళ్ళేదాకా అనువైన సమయం కోసం వేచివుండి ఆయన వెళ్ళిన తరువాత కొంతసేపటికి కపటబుద్ధితో గౌతమముని రూపుదాల్చిన శచీపతి – గౌతమముని ఆశ్రమంలో ప్రవేశించి అహల్యను సమీపించి తనకు “మృదుశయ్యను ఏర్పరచ” మంటూ ఋషిపత్నియైన అహల్యను కోరాడు.

అహల్య:

అప్పుడా మునిపత్ని ఆశ్చర్యపోతూ “ఓనాధా! తమరు సంధ్యా అనుష్టానాలకని ఇప్పుడేకదా నదీతీరానికి వెళ్ళారు. తిరిగి ఇంతలో వచ్చేశారేమి? ఎన్నడూలేనిదీ, తపస్వులకత్యంత గార్హనీయమైన ఈ అకాల కామవాంఛ మీలో ఎలా పొడసూపింది? నిషిద్దమైన దివారతిని కోరుతున్నారెందుకు?” అంటూ ప్రశ్నించింది

కపట గౌతమముని (ఇంద్రుడు):

“ఓ ప్రియురాలా! స్నానార్ధమై వెళ్ళిన నేను ఒక అప్సరసను చూశాను. దిగంబరిగా సరస్సులో స్నానంచేస్తున్న ఆమెను చూడగానే నాకూ కోరిక, సంగమేచ్ఛ కలిగింది. ఇక ఉండబట్టలేక వచ్చేశాను! కోరికతో ప్రజ్వరిల్లుతున్న నన్ను నీదరికి చేర్చుకొని నాకు రతిసౌఖ్యాన్నివ్వు! అలా కాకపోతే కామాగ్నికి దగ్ధుడనై నేను మరణిoచగలను! లేదా నిన్ను శపిస్తాను” అంటూ ఆమెను సమీపించబోయాడు.

అహల్య:

“ఓ మునివర్యా! స్వాధ్యాయనంలోను, జపతపానుష్టానములతోనూ, దేవతాపూజలతోనూ గడపవల్సిన ఈ ప్రాతఃసమయంలో ఈవిధంగా జంతువుల్లాగా రమింప బూనడం మీకు ఉచితంకాదు. అయినా మీ పట్టు వీడకపోతే - మీ ఆజ్ఞను పాలిస్తాను! భర్తృ అజ్ఞాపాలనను మించిన ధర్మం సతుల కెక్కడున్నది?”

“ఓ రుక్మాంగద మహారాజా! ఈవిధంగా రూపంలోనూ, కంఠధ్వనిలోనూ, స్వభావ, సంభాషణలలో ముమ్మూర్తులా గౌతమమునిలా ఉన్న అతనిని తన భార్తగానే భావించి, ఆతని కోరిక తీర్చటానికై శయ్యను చేరింది! అప్పుడు ఇంద్రుడు యధేచ్చగా చుంబన, ఆలింగనాదికములతో రమించాడు. అతని దేహంనుంచి వస్తున్న దివ్య సుగంధానికి చకితురాలైన అహల్య తనలో తానిలా అనుకుంది! ‘ఇతడు నాభర్తయేనా? లేక ఎవరైనా కపటరూపందాల్చి నన్ను వంచించారా? అలాగైతే తీరని కళంకంగా మాయనిమచ్చ నా జీవితంపై పడుతుంది! ఈ దుష్టునిసాంగత్యంవల్ల అటు పుట్టింటికీ యిటు మెట్టినింటికీ అపకీర్తి తెచ్చినదాననౌతాను!’ అని మధనపడుతూ, కోపంతో యిలా అంది

“ఓయీ ! నీవేవరో కపటరూపంలో నాభర్త రూపుదాల్చి నన్ను వంచించావు! నీవెవరైనదీ నిజంచెప్పు! లేదా నిన్ను శపించగలను!”

ఆమె శాపానికి భయంచెందిన ఇంద్రుడు తన నిజరూపుదాల్చి ఆమె ఎదుట ప్రత్యక్షమైనాడు.

ఇంద్రుడు:

‘ఓ అహల్యా! నన్ను శచీపతియైన ఇంద్రుడిగా తెలుసుకో! నీ రూపలావణ్యము, సౌoదర్యములను చూచి నిగ్రహించుకొనలేక ఇలా చేశాను! త్రైలోక్యాధిపతియైన నన్నే యికపైన సేవించుకో!” అన్న ఇంద్రుని మాటలకు క్రోధంతో బుసలుకొట్టే మిన్నాగులా తీక్ష్ణవీక్షణలతో యిలాఅంది

అహల్య:

“ఓ మూఢా! తపస్వియైన నాభర్త యిప్పుడు యింటికివస్తే నీగతేమౌతుందో చెప్పలేను. మహాపాపివైన నీవు నా పాతివ్రత్యాన్ని చెరచినావు! ఇక ఆ మహర్షి శాపంతో నేనెలాంటి అవస్థ పొందుతానోకదా!”

Chapter 30 complete