గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

16 – దేవీప్రార్థనం

పై కథాక్రమాన్ని భృగుమహర్షి చెప్పగా అత్యంత శ్రద్ధాభక్తులతో వింటున్న సోమకాంతమహారాజు ఇలా అన్నాడు

సోమకాంతుడు:

“ఓ ఋషీశ్వరా! గణేశుని దివ్యావిర్భావమూ, అనుగ్రహమూ గాధవింటుంటే నాకెంతో సంతోషం కలిగింది. నాకు ఈ మధురమైన దివ్యకథామృతాన్ని ఎంతవిన్నా యింకా యింకా వినాలనే అనిపిస్తుంది కాని తనివి తీరటంలేదు. ఆ రకంగా గణేశుని దివ్యవరాలను పొందిన బ్రహ్మ సృష్టిని ఎలా చేశాడు? అలాగే తనని ప్రశ్నించిన వ్యాసమహర్షికి యింకా ఏమేమి విశేషాలు తెలియచేశాడో ఆవివరం తెలియచేయి!” ఆ మాటలకు భృగుమహర్షి యిలా బదులిచ్చాడు.

భృగువు:

“ఓ సోమకాంత మహారాజా! బ్రహ్మ ‘సిద్ధక్షేత్రం’ యొక్క మహత్యమును వ్యాసునికి తెలియజేసాడు. అలాగే నీవడిగిన బ్రహ్మ చేసిన సృష్టిక్రమాన్ని కూడా తెలియజేస్తాను! ఆ పివరాలు విను!”

మొదట బ్రహ్మ తనయొక్క మన సంకల్పశక్తితో ఏడుగురు మానసపుత్రులను సృష్టించి వారందరినీ కూడా తనతో సృష్టికార్యక్రమంలో సహకరించమని ఆదేశించాడు. ఆ మాటలు విన్న ఆ బ్రహ్మమానస పుత్రులు తపస్సు చేయాలని నిశ్చయించుకుని అఖండ తపోదీక్షలో మగ్నులై బ్రాహ్మీభూతులైనారు.

వాళ్ళు అలా తపోమగ్నులు అవటం చూచి తన కార్యనిర్వహనకై బ్రహ్మ మరో ఏడుగురు పుత్రుల్ని సృష్టించాడు. వాళ్ళుకూడా అత్యంత జ్ఞానసంపన్నులై ఈ సృష్టిలోకి రావటానికి నిరాకరించారు. ఇలా తన మానసపుత్రులంతా సృష్టికి విముఖులవడం చూసి, చివరకి తానే సృష్టి చేయాలని ప్రారంభించాడు. మొట్టమొదటగా బ్రాహ్మణులను, అగ్నినీ తన ముఖంనుంచి సృష్టించాడు. తన చేతులనుండి, ఊరువులనుండి, పాదములనుండి వరుసగా క్షత్రియ వైశ్య శూద్రులనే ఇతర వర్ణాలవారిని – ఆ తరువాత సృష్టిచేశాడు.

చంద్రున్ని హృదయంనుంచీ, నేత్రాల్లోంచి సూర్యుణ్ణీ, ముఖంలోంచి వాయువునూ, ప్రాణాన్నీ, నాభిలోంచి అంతరిక్షాన్నీ, తలలోంచి “ద్యు” లోకాన్నీ, అలాగే సముద్రాలు, పర్వతాలు, నదీనదాలు, అరణ్యాలు సకల వృక్షలతా సమూహాలు వీటన్నిటినీ కూడా ఆ చతుర్ముఖుడు క్రమంగా సృష్టిచేశాడు.

ఈ సృష్టిరచనయంతా నిర్వహించాక బ్రహ్మదేవునికి ఒక గొప్ప విపత్తు కలిగింది. అదేమిటంటే సమస్త జగత్పాలకుడైన విష్ణువు యోగ నిద్రావశువై ఉండగా ఆయన చెవి గులుమిలోంచి ఇద్దరు మహారాక్షసులు ఉద్భవించారు. వారు భయంకరరూపులై భయంకొలిపెలా వికటాట్టహాసం చేస్తూ మహాబలపరాక్రంతో, గర్వోన్నత్తులై సమస్త లోకాలకూ ఒక పీడలాగా దాపురించి జీవులందరినీ బాధించసాగారు. భూసురులైన బ్రాహ్మణులను, సురులైన దేవతలనూ, సాదుసత్పురుషులనూ, తపోదీక్షలో ఉండి తపమాచారించుకుంటున్న ఋషులనూ, హింసిస్తూ, వేదశాస్త్రాలనూ వేళాకోళంచేసి దూషిస్తూ, పరిహసించసాగారు! వారి భీకర గర్జనలకి ముల్లోకాలు భయంతో గడగడ వణికాయి. ఆ మధు కైటభులిద్దరూ కూడా బ్రహ్మను అమాంతం మ్రింగివేయాలని ప్రయత్నించారు.

బ్రహ్మ నిద్రాదేవిని స్తుతించటం

ఆ క్రూర రాక్షసుల వికటాట్టహాసాలకు బ్రహ్మ భీతిచెంది, దిక్కుగానక ఇక తనను రక్షించగలవాడు లోకపాలకుడైన విష్ణువేనని, పారిపోయి వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడచూస్తే ఆయన యోగనిద్రలో మగ్నుడై ఉన్నాడు. అప్పుడు తనకు గాజాననుడిచ్చిన వరం స్మరించుకుని, ఆ గజాననుని ప్రేరణచేత – శ్రీమహావిష్ణువు నేత్రాలపై నాట్యంచేసే యోగమాయను ఆ రాక్షసులను సంహరింపచేయమని ఇలా స్తుతించసాగాడు.

బ్రహ్మ:

“ఓ పరమపావనీ! ‘స్వాహా’ ‘స్వదా’ రూపాలను ధరించి యజ్ఞాలు చేసేవారిని అనుగ్రహిస్తున్న కరుణామయివి నీవే! సృష్టి, స్థితి, లయాలను లీలగానూ విలాసంగా చేస్తూ ఉండేదీ నీవే! వేదములు, కాలము, సప్తస్వరాలూ ఇవన్నీ నీరూపమే! సమస్త ప్రాణికోటియందూ ప్రజ్ఞారూపిణివిగా, త్రిసంధ్యలలోనూ గాయత్రీ, సావిత్రీ, సరస్వతీ, రూపిణివిగా ప్రాణులలో ‘ప్రాణశక్తి’ స్వరూపంగా ఉన్నదీ నీవే!

కరుణామయివైన ఓ మాతా! నీయొక్క ప్రేరణవల్లనే మహావిష్ణువు అవతారాలనెత్తి దుష్టరాక్షసులను సంహరించి, లోకపాలనను నిర్వహిస్తున్నాడు. అట్టివాడు ప్రస్తుతం నీ ప్రభావానికి వశుడై యోగనిద్రలో మునిగివున్నాడు. అమ్మా! దురాత్ములైన ఈ రాక్షసులను సమ్మోహనపరిచి వారి వధకు మార్గాన్ని సుగమంచేయి! వీరిరువురూ కూడా ఘోరమైన తపస్సును ఆచరించి నావల్ల అమోఘమైన వరాలను పొందివున్నారు. కనుక వీళ్ళు నాచేత అవధ్యులు (చంపబడనివారు). నీవే ఆ శ్రీమహావిష్ణువుకు తగిన ప్రేరణనిచ్చి ఉద్యుక్తుణ్ణిచేసి అతడి చేతిలో వీరు అంతమయ్యేలా అనుగ్రహించు! లోకకంటకులైన ఈ దురాత్ముల బారి నుండి నన్ను కాపాడు!” అంటూ దీనంగా ప్రార్థించసాగాడు.

Chapter 16 complete