గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

39 – ఇంద్రపరాజయం

వ్యాసుడు:

“ఓ పద్మసంభవా! ఈ రకంగా గణేశానుగ్రహాన్నీ, వరసంపదనూ ఆశీస్సుగా పొందిన త్రిపురుడు వరగర్వంతో ఏం చేశాడు? ఆ తరువాతి కథా విధానమంతా నాకు వినిపించగోర్తాను!”

బ్రహ్మ:

“ఓ వ్యాసమునీంద్రా! ఈవిధంగా ప్రధముడైన గణపతియొక్క విశేషానుగ్రహాన్ని పొందిన త్రిపురుడు, ముందుగా కాశ్మీరసంభవమైన నల్లటిరాయితో గజాననునిమూర్తిని తయారుచేయించి, మంత్రకోవిదులైన ఆగమపండితులతో యథావిధిగా ఆలయంలో ప్రతిష్టించాడు. మణిమాణిక్యాలతో అలంకృతమైన ఒక బంగారుభవనాన్ని నిర్మించి, ఆ గజాననుని అందులోనుంచి షోడశోపచారాలతో పూజించాడు. స్తోత్రములతో గణేశుని సన్నుతించి, యథావిధిగా పూజలను సమర్పించి భూసురులకు భూరిదానాలనిచ్చాడు. (గణేశపురంగా ప్రసిద్ధిచెందిన ఆ పట్టణము బెంగాల్ లో ఉన్నది!) గణేశానుగ్రహంగా తనకు సిద్ధించిన శక్తులచేత తన బలగర్వంతో ఆ త్రిపురాసురుడు భూమండలాన్నంతటినీ ఆక్రమించాడు! అలా భూమినంతటినీ ఏకచ్ఛత్రాదిపతిగా పరిపాలిస్తూ, నలుదిక్కులనుంచీ చతురంగబలాలనూ సమీకరించుకొని, దేవలోకంపై కూడా దండయాత్రకు సన్నద్ధుడయ్యాడు. అమరావతిపై దండెత్తివెళ్ళిన త్రిపురుని ఎదుర్కోవటానికి దేవేంద్రుడు తన సమస్త సైన్యాలతోనూ ఐరావతాన్ని ఎక్కి యుద్ధానికి వెళ్ళాడు!

యుద్ధరంగంలో, ప్యూహరచనలో నిపుణుడైన ఆ త్రిపురుడు తన సేననంతటినీ మూడుభాగాలుగా చేశాడు. ఒకభాగానికి ధనుర్విద్యలోనూ, గదాయుద్ధంలోనూ శస్త్రాస్తకోవిదుడైన వజ్రదంష్టుని నాయకునిగా నియమించి అతనికి మనుష్యలోకాధిపత్యానిచ్చాడు.

మూడోవంతు సేనతో కాలకూటుడనేవాడిని రసాతలానికి పంపి శేషముఖ్యులైన మహానాగులందరినీ వశులను చేసుకొమ్మని ఆ సేనను ఆదేశించాడు.

ఇక మిగిలిన మూడవభాగాన్ని తాను స్వయంగా వెంటపెట్టుకుని వెళ్ళి చతురంగ బలసమేతుడై స్వర్గంలోని నందనవనంపైకి దాడికై వెళ్ళాడు.

అక్కడ తనసేనల్ని విధ్వంసానికి పురికొల్పి, ఆ నందనవనంలోని దివ్యవృక్షాల నెన్నిటినో అతడు భగ్నంచేశాడు. అలా త్రిపురుడు నందనోద్యానంలో నిలిచివుండి అమరాధిపతి ఇంద్రునికి తన దూతద్వారా యిలా సందేశం పంపాడు.

“నీవీ అమరావతి నగరాన్ని నాకు సమర్పించి మనుష్యలోకం లోకి వెళ్లి నాకు వశుడవై ఉండు! లేదా నీకు చేవఉంటే, యుద్ధం చేయగల సత్తాఉoటే సన్నద్దుడవైరా!”

దూతలు ఇంద్రుని సముఖానికి వెళ్ళి అతనికి త్రిపురుని సందేశం యావత్తూ వినిపించారు. ఆమాటలు చెవిన పడగానే పిడుగుపాటుకు తల్లడిల్లిన పర్వతంలా ఆగ్రహంతో, అవమానంతో గడగడా వణికి, దిగ్భ్రాంతి చెందాడు. తిరిగి అంతలోనే తాను కోలుకుని, అవమానాగ్నితో దహించుకుపోతూ ‘ఆ దూతలతో తాను యుద్ధమే చేయగోర్తున్నానని’ బదులు పంపించాడు. దేవసేనలనన్నిటినీ యుద్ధ సమాయత్తంచేసి ఐరావతాన్ని అధిరోహించిన ఇంద్రుడు ప్రళయకాల మేఘంలా గర్జించాడు! ఆ శబ్దానికి ముల్లోకాలూ క్షోభించాయి! త్రిపురుని దూతలు ఇంద్రుని సమాధానం త్రిపురునికి తెలియజేశారు! సమస్త దేవతాసైన్యమూ శాస్త్రాస్త్రములను ధరించి తన వెంటరాగా దేవరాజైన ఇంద్రుడు పోరుకు సిద్ధమయ్యాడు.

త్రిపురాసుర యుద్ధం

ఇలా ఇంద్రుడు నానా వాద్యఘోషములతోనూ, బ్రాహ్మణ స్వస్తిపుణ్యాహవచనములతో యుద్ధసన్నద్ధుడై బయల్వెడలాడు. అప్పుడు దూతలద్వారా ఇంద్రుడు యుద్ధసమాయత్తుడైనట్లు తెలుసుకున్న త్రిపురుడు తన సేనల్నికూడా ఉత్సాహపరుస్తూ, తాను ఒక ఉత్తమాశ్వాన్ని అధిరోహించి, చతురంగ బలాలతోటీ యుద్ధానికి బయల్దేరాడు.

అప్పుడు జరుగబోయే భీకర యుద్దారంభానికి సూచనగా, శంఖారావాలూ, భేరీనాదాలూ యుద్ధరంగంలో ఇరుపక్షాలలో మింటినంటాయి! త్రిపురుడు సేనల్ని పురిగొల్పుతూ హూంకారాన్ని చేయగానే వారంతా భీకరంగా యుద్ధానికి తలపడ్డారు. ఇరుసైన్యాలు స్వ, పర భేదంలేకుండా సంకులసమరం చేయసాగారు. అసంఖ్యాకంగా దానవవీరులూ, దానవశాస్త్రాలచేత పీడింపబడ్డ దేవతలు కూడా కొందరు నేలకూలారు.

ఆ రక్తపు ధారాలకు తడిసిన యిరువర్గాల సైనికులూ పుష్పించిన మోదుగుచెట్లలా కనిపించసాగారు. కొందరు దానవులు నేలకూలారు. మరికొందరు క్షతగాత్రులైనారు. అలాగే లోట్టిపిట్టలనూ, ఏనుగులనూ, గుఱ్ఱాలనూ అధిరోహించిన సైనికులు విశేషంగా ఆ యుద్ధభూమిలో నేలకూలారు. అప్పుడు సింహాన్ని చూచి బెదిరిన లేళ్ళగుంపులా యుద్ధరంగంనుంచి నలుదిక్కులకూ పారిపోయారు!

అప్పుడు త్రిపురుడు ప్రళయాగ్నిలా మండిపోతూ, తన సేనలను యుద్ధానికి పురిగొల్పుతూ, ప్రళయకాలమేఘంలా గర్జిస్తూ, తాను స్వయంగా ఇంద్రునితో పోరుకి తలపడ్డాడు.

వెంటనే ఒక్కసారిగా ఇంద్రుడి మీదకురుకి, వజ్రాయుధాన్ని పట్టిన అతడి చేతిని తన వాడి ఖడ్గంతో ఒక్కవేటున నరికాడు. ఆ అదురుకు ఇంద్రుని చేతనున్న వజ్రాయుధం క్రిందపడింది. ఆ వజ్రాయుధంతో ఐరావతాన్ని తలపై కొట్టాడు. ఆ దెబ్బతిన్న ఐరావతం భయంతో పారిపోయింది! క్షణంలో ఇంద్రుడి ఆ ముష్టిఘాతానికి మూర్చిల్లిన త్రిపురుడు కోలుకొని ఇంద్రుణ్ణి తన చేతితో చరిచాడు. కొంతసేపటికి లేచిన ఇంద్రుడుకూడా తిరిగి ఆ త్రిపురాసురుడిని తనతో మల్లయుద్ధానికి ఆహ్వానించాడు.

త్రిపురుడు:

“ఓ అమరేంద్రా! నీవెందుకు యిలా నీ ప్రాణాలపై నిర్ధయుడవైనావు? క్రిమికీటకాదులకు సైతం తమ ప్రాణాలంటే తీపేకదా! నామాట విని నీవు భూలోకానికి పారిపో! నీకు అయితే అక్కడ తలదాచుకునేందుకు నీకో స్థానం కల్పిస్తాను!”

బ్రహ్మ:

“ఓ మునీంద్రా! ఈవిధంగా త్రిపురునిచేత రెచ్చగొట్టబడ్డ శచీపతి మండిపడుతూ”

ఇంద్రుడు:

‘ఓ దానవాధమా! నాబొందిలో ప్రాణమున్నoతవరకు నిన్ను వదలను! నీచేత చిక్కిననాడు నీ అజ్ఞానుసారమే భూలోకానికి వెడతాను!’

ఇంద్రపరాజయం

ఇలా అవేశపూరితుడై ఇంద్రుడు నిప్పులు క్రక్కుతుండగా, అతడి వక్షస్థలాన్ని త్రిపురుడు తన పిడికిలితో మోదాడు. ఆదెబ్బకు ఇంద్రుడూ అమిత క్రోధోద్రిక్తుడైనాడు. ఇరువురూ కొదమసింహాల్లాగా, చాణూరకృష్ణుల్లాగా, ఒకరితో ఒకరు భీకరంగా పోరాడారు. గుండె, గుండే రాపాడిస్తూ, తలను తలతోనూ, వీపును వీపుతోనూ, పాదాలతో మరొకరి పాదాలను తన్నుకుంటూ చాలాసేపు వీరోచితంగా పోరాడారు.

అప్పుడా దైత్యుడు శచీపతి కాలుపట్టుకొని పైకెత్తి గిరగిరా త్రిప్పి విసిరివైచాడు. తాను స్వయంగా ఐరావతాన్ని అధిరోహించాడు! దేవగణాలు తమ ప్రభువు జాడతెలియక, దిక్కుతోచనివారై ఇంద్రుని అన్వేషిస్తూ హిమవత్పర్వత గుహలవైపుకు పారిపోయారు.

‘ఇక మన రాజైన ఇంద్రుని ఎలా కలువగలము?’ అనుకుంటూ తమలోతాము తర్కించుకుంటూ, వెడుతున్న దేవగణాలకు దూరాన్నుంచి సిగ్గుతో తలవంచుకు వస్తున్న ఇంద్రుడు కనిపించాడు. దేవతలకు కొనప్రాణం లేచివచ్చినట్లై తమ ప్రభువును అత్యంత ఆదరంతో సేవించుకుని హిమవత్పర్వత గుహలలో ప్రాణాలను కడచేతిలో బెట్టుకుని తల దాచుకున్నారు.

త్రిపురుడు మాత్రం విజయగర్వంతో ఐరావతాన్నెక్కి అమరావతిని చేరుకొని, తన అనుచరులనే అష్టదిక్కులకూ దిక్పాలకులుగా నియమించి, తాను మాత్రం ఇంద్రుడి స్థానాన్ని అధిరోహించి దివ్యవాయిద్యాల ఘోషలో, గాంధర్వగానం వీనులకింపు చేయగా, అప్సరసల నాట్యసల్లాపాలను వీక్షిస్తూ, వారితో క్రీడిస్తూ, ఉల్లాసంగా కాలం గడపసాగాడు.

Chapter 39 complete