గణేశ పురాణము - ఉపాసనా ఖండము
87 – తారకవధోపాఖ్యానం
వరదగణపతి పూజావిధానం
శివుడు:
“ఓ కుమారా! నీవు కోరినట్లుగా సకల పాపక్షయకరము, సర్వసిద్ధికరమైన ‘వరదగణపతివ్రతం’ గురించి తెలియజేస్తాను! ఈ వ్రతాన్ని శ్రావణమాసములోని శుక్లచతుర్దినాడు ఆరంభించాలి! ఆ వ్రతవిధాన మెలాంటిదంటే, ఆనాడు ఉదయాన్నే నువ్వులపిండితో నలుగుపెట్టుకొని అభ్యంగస్నానం చేయాలి. ఆ తరువాత నిత్యనైమిత్తికకర్మలను నెరవేర్చి, కోపాన్ని దరిజేరనీయకుండా సంయమనం పాటించాలి.
ఒక నలుచదరమైన ప్రదేశాన్ని గోమయంతో అలికి పరిశుద్ధం చేసి అక్కడ ఒక మంటపాన్ని నిర్మించి, దానికి నాలుగువైపులా అరటిస్థంబాలను అమర్చి ఆ మంటపాన్ని పుష్పమాలలతోనూ, మామిడి ఆకుల తోరణాలతోనూ, అద్దములనూ, చామరములనూ సమకూర్చి అలంకరించాలి.
ఆ మంటపం మధ్యగా శ్రీగంధంతో ఒక అష్టదళపద్మాన్ని గీసి దానిపై ధ్యానాన్ని పోయాలి! దానిపైన వస్త్రద్వయాలపైన అమర్చినట్టి ఒక కలశాన్ని స్థాపించాలి! ఆచార్యుని అనుజ్ఞను తీసుకొని, పూజాద్రవ్యాలను శుద్ధిచేసుకొని ఆ తరువాత గజాననుని మూర్తిని ప్రాణప్రతిష్టచేసి, షోడశోపచారములతో పూజించాలి! ఆ గజాననుని ప్రతిమ వెండితోగాని బంగారుదిగాని వినియోగించాలి!
నైవేద్యానికై ఇరవైఒక్క రకాల పిండివంటల్ని తయారుచేయాలి. ఆ తరువాత అరవైఒక్క ముద్రల్ని (బంగారువికాని లేదా వెండివికాని) దక్షిణగా యివ్వాలి! తెలుపువి లేదా పచ్చటివి ఇరవైఒక్క దూర్వాంకురాలను సమర్పించాలి! ఇలా సమంత్రకంగా పూజావిధి యావత్తూ ముగుసిన తరువాత మంత్రపుష్పాన్ని సమర్పించి, ఇరవైఒక్కమంది బ్రాహ్మణులను పూజించి వారికి అన్నసమారాధనం చేయాలి! ఇరవైఒక్క విధములైన దానాలను చేయాలి! ఆ తరువాత గజాననుకి అపరాధక్షమాపణ చెప్పి సాష్టాంగ నమస్కారంచేసి “వ్రతంసంపూర్ణ ఫలప్రదమౌనుగాక” అంటూ వేడుకుని, పార్దీవగణేశపూజను యథావిధిగా ఈ గణేశుని మూర్తికి సమర్పించి, ఆ కథాశ్రవణం చేయాలి! విఘ్నహరుడైనట్టి గజవదనుని హృదయంలో ధ్యానిస్తూ మౌనంగా భుజించాలి. ఈ విధంగా ఒక మాసంరోజులు అంటే శ్రావణశుక్ల చతుర్ధినుండి భాద్రపద శుక్ల చతుర్ధివరకూ చేయాలి! చివరినాడైన భాద్రపద శుక్ల చతుర్ధినాడు పూర్వం చెప్పినమాదిరిగానే విఘ్నేశ్వరుని పూజించి, వినాయకచవితి ఉత్సవాన్ని గావించాలి! ఆ రాత్రి జాగారణచేసి నృత్యగీతాది నాట్యాయుతమైన సపర్యలను వినాయకునికి సమర్పించాలి! గణేశపురాణాన్ని, అందుగల ఉపాఖ్యానములను శ్రద్ధగా ఆలకించి గజాననుని సహస్రనామాలతో పూజించాలి!
ఆ మర్నాడైన ఋషిపంచమినాడు ప్రాతఃకాలాన్నే సంధ్యావందనాదికములు ముగించుకొని గజాననుని యథావిధిగా పూజించాలి! ఆ తరువాత వందమంది లేదా కనీసం ఇరవైఒక్కమంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనాదికములు ఏర్పాటుచేసి వారిని గౌరవించాలి!
అర్చనసల్పినట్టి బంగారు లేదా రజతమైన మూర్తిని బ్రాహ్మణునకు దానంచేయాలి. మృత్తికతో చేసినట్టి మూర్తినిమాత్రం మంగళవాయిద్యాలతో ఊరేగింపచేసి తటాకంలోగాని, నదిలోగాని నిమజ్జనం చేయాలి!
ఓ షడాసనా! ఈ వరదగణపతీ వ్రతాన్ని ఒకపర్యాయం శ్రద్ధాభక్తులతో ఆచరించితే తమయొక్క సకలాభీష్టాలనూ సిద్ధింపచేసుకున్నవారై అంత్యమున గణేశధామాన్ని పొందగలరు.
ఓ స్కందా! ఇదివరలో సృష్టి ఆరంభంలో చతుర్ముఖుడీ వ్రతాన్ని సల్పి సృష్టిరచనా సామర్థ్యాన్ని అనుగ్రహంగా పొందాడు. అలాగే లోకపాలకుడైనట్టి విష్ణువు ఈ వ్రత అనుష్టానంవల్లనే పాలనశక్తిని పొందాడు. అంతేకాదు స్వేచ్ఛగా అవతారాలేత్తే శక్తిని ఈ గణేశషడక్షరీ మంత్రానుష్టానంవల్ల పొందగలిగాడు. అంతెందుకు నిత్యం అష్టాక్షరీ మహామంత్రాన్ని అనుష్టించే నేనుకూడా ఈ గణేశ షడక్షరీమంత్రం వలననే జగత్రయాన్ని లయం చెందించగల్గుతున్నాను.
అంతేకాదు సర్వసిద్ధిప్రదమైనట్టి ఈ వ్రతాన్ని యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుషులూ, రాక్షసులూ కూడా తమతమ అభీష్టప్రాప్తికై అనుష్టించారు. నాయనా! నీవుకూడా ఇట్టి విశేషఫలప్రదమైనట్టి వ్రతాన్ని ఆచరించి యుద్ధములో జయప్రాప్తినీ ముల్లోకాలలోనూ అంతులేని ఖ్యాతినీ పొందు!” అంటూ ఓ వ్యాసమునీంద్రా! ఒకానొక శుభముహూర్తంలో శంకరుడు తన కుమారునికి గణేశమంత్రదీక్షను అనుగ్రహించాడు.
