గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

47 – శంకర విజయం

వ్యాసుడు:

“ఓ చతురాననా! అలా ప్రసన్నుడైన గణపతి ప్రపన్నుడైన శంకరుని విజయసంసిద్ధికై నామసహాస్రాన్ని స్వయంగా ఉపదేశించాక, శంకరుడేమిచేశాడో ఆ వివరం నాకు తెలుపవలసింది!”

బ్రహ్మ:

“పేదకు దొరికిన పెన్నిధిలా, కింకర్త వ్యతామూఢుడై ఖిన్నుడైవున్న ఉమాపతికి, గణేశుని వరప్రదానం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆ సంతోషంతో పరమ ఉత్సాహవంతుడై ఆనంద తాండవం చేస్తూ దిక్కులు పిక్కటిల్లేలా బిగ్గరగా గర్జించాడు శంకరుడు! వెంటనే దేవతాసైన్యాల నన్నిటినీ తిరిగి సమీకరిoచుకుని వారందర్నీ యుద్ధసన్నద్ధులవమంటూ ఆజ్ఞాపించాడు. ద్విగుణీకృత ఉత్సాహంతో పునరుజ్జీవితులైన దిక్పాలకులూ, బ్రహ్మాది దేవతలూ శివునకు నమస్కరించి తమ ఆపన్నివారకుడైన పినాకపాణినిలా స్తుతించసాగారు:

దేవతలు:                  

“ఓ మహాదేవా! జగదానందకారక! నీవల్లనే నిర్జిoచబడవలసినట్టి ఘోరదైత్యుడైన త్రిపురుని అంతాన్ని,మా ఉల్లములు రంజిల్లగా ఎన్నడు కన్నులారా చూస్తామోగదా? విశ్వానికే విఘాతకుడై వాడుచేసిన ఆకృత్యాల వల్లనేకదా మాకు మా నిజస్థానాలనుంచి స్థానభ్రష్టత సంప్రాప్తమైంది?”

దేవతల దైన్యమైన ఈ పలుకులకు ఉత్తేజితుడై కర్తవ్యోన్ముఖుడైన గిరిజాపతి అత్యంత సంతోషముతో గజాననుని ధ్యానించి, యుద్ధోన్ముఖుడై బయలుదేరాడు. శివుడు యుద్ధసన్నద్ధుడై వస్తున్నాడన్న వార్త ముందుగానే చారులవల్ల తెలుసుకున్న త్రిపురుడు తన దివ్యమైన కవచకుండలాలను ధరించి, అసుర సైనికులందరినీ తగు పారితోషికాలతో సంతోషపరిచి, వివిధ వాహనాలపై అధిరోహించిన సైన్యమంతా వెంటరాగా తాను స్వయంగా త్రిపురాన్నధిరోహించి, నలుదెసలా మారుమ్రోగే ధ్వనిని చేస్తూ బయలుదేరాడు.

వెంటనే ఇరుసైన్యాలూ సంకుల సమరానికి తలపడ్డాయి! తమ తమ శస్త్రాస్త్రాలతో, శరములతో, ఖడ్గములతో ఇరుపక్షాల వీరులమధ్య భీకరమైన యుద్ధము సాగుతుండగా వారి రక్తం నదులుకట్టి ప్రవహించ సాగింది!

బ్రహ్మ:

ఓ మునీoద్రా! అలా వైరి శస్త్రాల దేబ్బలచే గాయపడ్డ ఇరుపక్షాల సైనికులూ ఎఱ్ఱగా, పుష్పించిన మోదుగవృక్షాల్లా కన్పించసాగారు. ఆ గందరగోళంలో యిరు పక్షాలలోనూ స్వపరభేదము తెలుసుకోలేనంత ఘోరంగా పోరు కొనసాగింది. ఇదిలాఉండగా వాయువుచేత పెనుగాలి దుమారంలా చెలరేగి ఆ ధూళి ముఖమంతా కొట్టపడ్డ దేవతాసైన్యం అధికంగా పడిపోయి, మిగిలినవారు పారిపోసాగారు. అప్పుడు దేవరాజైన ఇంద్రుడు విజృంభించి తన వజ్రప్రహారములతో దైత్యసైన్యాలను చూర్ణము చేయసాగాడు! ఆ భయానికి కొందరు చచ్చినవారిలా పడుకున్నారు. ఆ భీకరయుద్ధంలో దైత్యుల కాళ్ళుచేతులూ, శిరస్సులు తెగిపడి రక్తం కాలువలై ప్రవహిoచసాగింది!

ఈ దృశ్యాన్ని చూసిన త్రిపురుడు మండిపడి, సింహనాదములు చేస్తూ ముందుకు చొచ్చుకువచ్చి ఇంద్రుడితో తలపడ్డాడు.

‘నీకు ప్రాణాలమీద ఏమైనా తీపివుంటే వెంటనే పారిపో! రణభూమినుంచి వెన్నిచ్చి పారిపోయేవాడిని నేనేమీ చేయను! అంటూ కవ్వించిన త్రిపురుడి మాటలకు రోషాన్వితుడై శచీపతియైన ఇంద్రుడు నిలచి శౌర్యంతో యుద్ధంచేశాడు. ఒక్కోబాణాన్ని త్రిపురుడు అభిమంత్రించి ప్రయోగించగా అది వెంటనే అనేక బాణాలుగా రూపొంది ఆకాశాన్నంతటిని కప్పివేస్తూ దేవతాసైన్యాలను బాధించాసాగింది. వెనువెంటనే ప్రయోగించిన ఆ దైత్యుని మరో శరానికి ఇంద్రుడు మూర్చిల్లాడు. ఆ అద్భుత పరాక్రమానికి అచ్చెరువొందిన శంకరునికి నారదుడు దర్శనమిచ్చి ఆతనికి రాక్షసవదోపాయాన్నిలా చెప్పసాగాడు.

నారదుడు త్రిపురాసుర వధోపాయం చెప్పుట

నారదుడు:

“ఓ శంకరా! ఈ రాక్షసుడు గతంలో గణేశుడిని గురించి ఘోరతపస్సుచేసి మూడు అభేద్యమైన పురాలను, అశేషవరాలనూ పొందాడు. అప్పుడు గజాననుడే ‘ఎన్నడైతే ఒకే బాణంతో ఈ మూడు పురాలు భేదించబడతాయో, అప్పుడే, అలా భేదించిన వెంటనే అతని చేతిలో నీకు మృత్యువు సంభవిస్తుంది! అంటూ వరమిచ్చాడు! కనుక నీవు ఆ ప్రకారమే చేయవలసింది!” అంటూ దేవరహస్యం తెలిపి నారదమహర్షి అంతర్ధానం చెందాడు.

శంకరుడు ఆనందంతో, మూర్ఛిల్లిన దేవసేన్యాలను స్వస్థపరచి, గజాననుని వాక్యమును స్మరించి ధైత్యవధకు మహాప్రయత్నాన్ని చేసాడు.

మహాప్రభావశాలియైన ఆ గరళకంఠుడు భూమిని రధంగానూ, సుర్యచంద్రులనే రధచక్రాలుగానూ, బ్రహ్మదేవుని రధసారధిగా చేసుకున్నాడు.

మేరువును ధనుస్సుగానూ, అచ్యుతుని అస్త్రంగానూ, అశ్వినీ దేవతలనే రాధాశ్వాలుగాచేసి, ఆచమించిన శంకరుడు గజాననుని తన హృదయంలో ధ్యానించి, ఆయన ఉపదేశించిన సహస్రనామాలనూ ఉచ్ఛరించి, ఏకాక్షర గణపతిమంత్రంతో తన బాణాన్ని అభిమంత్రించాడు.

ఆ ఉధృతానికి భూమి శేషుడూ, పర్వత శిఖరాలతో నధీవనాలతోసహా గడగడా వణికింది!

ఆ ప్రభావవంతమైన బాణాన్ని శంకరుడు వింటినారి సారించి విడువగానే ఆకాశమంతా దగ్ధమైంది! భూ పాతాలలోకాల్లో కూడ మంటలు వ్యాపించసాగినాయి! త్రిపురాధిష్టితుడైన ఆ రాక్షసుడు ఆ బాణాన్ని చూడటంతోటే వెలవెల బోయాడు! అప్పుడా ఆ అఘోరాస్త్రము మహావేగంతో వచ్చి త్రిపురాలనూ భస్మంచేసి, దానవశ్రేష్టుడైన అసురుని కూడా భస్మం చేసింది! అప్పుడు అందరు చూస్తుండగా ఆ రాక్షస్సుని శరీరంలోంచి తేజస్సు వచ్చి శంకరుని శరీరంలో లయిoచింది!

“శివునిచేత హతుడైన లోకకంటకుడైన రాక్షసుడు ముక్తిని పొందాడు!” అంటూ ఆకాశవాణి పలికింది!

దేవతలూ, మునులూ విజయుడైన శంభుని స్తుతించారు. గంధర్వులు గానం చేశారు! అప్సరలు ఆనందంతో నాట్యం చేశారు. కిన్నెరలు వాద్యములను వాయించారు. నారదాది దేవర్షులు ఆనందంతో పుష్పవృష్టి కురిపించారు! దేవతలంతా శివుని అనుజ్ఞ గైకొని నిర్భయంగా తమతమ నెలవులకు వెళ్ళారు. త్రిపురాంతకుడైన ఈశ్వరునికి నమస్కరించి మునీశ్వరులు సైతం తమ అనుష్టానాదులను చేసుకోడానికి తరలి వెళ్ళారు. అప్పటినుంచి వేదవిదులైన బ్రాహ్మణులు అగ్నిహోత్రాది కర్మలను నిరాటంకంగా కొనసాగించారు.

అప్పుడు స్కందుడు మొదలైన శివగణాలు అభివాదం చేయగా శంకరుడు తిరిగి ఆ రధాన్ని విభాగం చేసివేశాడు. జయజయ ధ్వానాలతోనూ దుందుభి ధ్వనులచేత మారుమ్రోగుతూ. సర్వాలంకృతమైన కైలాసము చేరాడు!

అప్పటినుంచి శంకరునికి ‘త్రిపురాంతకుడు’ అన్న ప్రఖ్యాతి లోకంలో కలిగింది! ఈవిధంగా మహాగణపతి మంత్రసామర్ధ్యము, సహస్రనామ ప్రాశస్త్యమూ వివరించబడింది! ఓ వ్యాసమునీoద్రా! ఈ విషయం నేను తప్ప ఇంకెవ్వరూ ఎరుగరు! నేనూ ఈ మహాత్మ్యాన్ని ఎవ్వరికీ యింత వరకూ చెప్పియుండలేదు! దీన్ని చదవటంవల్లా, వినటంవల్ల సర్వకామనలూ సిద్ధిస్తాయి!

Chapter 47 complete