గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

78 – కార్తవీర్యోపాఖ్యానం – 2

జమదగ్ని - కార్తవీర్య సంవాదం

నదీతీరంలో విడిదిచేసిన పరివారాన్నంతటినీ ఆహ్వానించి, ఆ శిష్యులు జమదగ్ని చెప్పిన మాటలను ఆ రాజుతో యిలా విన్నవించారు.

జమదగ్ని శిష్యులు:

“ఓ రాజా! ససైన్యంతో మీరు బోజనానికి విచ్చేసి, తమకు అన్నివిధాల తగినట్టి విందును ఆరగించగలరు!” అప్పుడు ఆ రాజు స్నానపానాదులు పూర్తిచేసుకుని భోజనానికి సైనికులతోసహా బయలుదేరాడు.

అంతకు ముందెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో నిర్మితమైన భవనసముదాయాన్ని చూసి చకితుడై, తన పరివారమంతటితోనూ ఆ భవంతిలోకి ప్రవేశించాడు. ఆ భవంతి మధ్యలోకి చేరుకొని ఆ వైభవాన్నిచూసి నిర్ఘాంతపోయి తనలో తానిలా అనుకున్నాడు.

‘ఆహా! ఈ మునియొక్క అపూర్వవైభవం యింతకుముందెన్నడూ కనీవినీ ఎరుగను! హరిహరాదులకుగాని, సృష్టికర్తయైన బ్రహ్మదేవునికిగాని, లోకపాలకులకుకూడా ఇట్టి ఐశ్వర్యమూ,యిటువంటి సంపద ఉన్నట్లు వినలేదు! ఒక తాపసికింతటి భోగమా?”

అనుకుంటూవుండగా ముని వారిని ఎదుర్కొని వారందరిని వారివారి అర్హతలనుసరించి కూర్చుండచేసి, అంతటా మంగళతూర్యాలు మ్రోగుతుండగా వారందరినీ తృప్తులయ్యేలా భుజింపచేశాడు. ఆ పదార్దముల రుచి, సువాసనలు చూచేవారికి నోరూరేలాఉండి, సైనికులు తనివితీరా భుజిస్తూ ‘ఒక యామమాత్రంలో ఈ ఏర్పాట్లన్నీ ముని ఒక్కడే ఎలా చేయగలిగాడా? అని ఆశ్చర్యం చెందసాగాడు.

భుక్తాయసంతో భుజించినవారు తమ చేతులను కూడా ఆ ప్రక్కనే కడుగుకునే ఏర్పాట్లను ప్రక్షాలనలకై పాత్రలను సమకూర్చడం ద్వారా చేశారు ఆముని శిష్యులు.

ఇక పరివారంతోపాటూ విచ్చేసిన ఏనుగులు, అశ్వములు, వృషభములకు శేషాన్నము, గుగ్గిళ్ళుపెట్టి, వాటినీ తృప్తిపరచారు. అలా బోజనాదికములు ముగించి వారందరూ వేరొక భవంతిలోకి తీసుకువేళ్ళబడ్డారు. అక్కడ చెఱకు, ద్రాక్ష, పనస, దానిమ్మ మొదలైన ఫలాలను భక్షించి, ఆ తరువాత మునిచే సమర్పించబడిన ఏలకులు, లవంగపువ్వు పచ్చకర్పూరంతోనూ మిశ్రితమైన తాంబూలాదులను సేవించారు. ఆ తరువాత జమదగ్నిముని అందరికీ నానావిధములైన అలంకారములనూ, నూతన వస్త్రాలనూ యిచ్చి గౌరవించాడు. ఆ రాజుకు కూడా ఎంతో విలువైన వలువలను కానుకగా యిచ్చి ఘనంగా సత్కరించాడు. అప్పుడా ముని రాజుతో యిలా అన్నాడు.

జమదగ్ని:

‘ఓ రాజా! ‘నా విష్ణుః పృధివీపతి’ అన్న సూక్తిప్రకారం విష్ణువుయొక్క అంశచేతనే రాజు పరిపాలన చేయగల్గుతున్నాడు. సకలమూ నీ పాదాల చెంతకు తమంత తామే వచ్చి చేరే నీకు, అడవిలో ఒకమూల తపస్సు చేసుకునే నేను ఏoభోజనం పెట్టగలను? ఐనా నా మాటను తీసివేయకుండా వచ్చి నా ఆతిధ్యాన్ని అంగీకరించి నాకు తృప్తినీ, అజరామరమైన కీర్తినీ ఒనగూడేలా చేశావు! నీ ఈ మహోదారకార్యంచేత మూడులోకాలలోనూ నా కీర్తి వ్యాపించింది. నాకు నీవు కల్గించిన తృప్తికి ప్రతిగా నేటితో నీ సకలా అరిష్టములు తొలగిపోతాయి!’ అన్న జమదగ్ని మాటలకు

కార్తవీర్యుడు:

“ఓ మునివర్యా! నేనింతకు పూర్వం వచ్చినప్పుడు ఈ భవనాలు కాని, భోజనపదార్ధాలుకాని ఏవీ కనబడలేదే? ఇవన్నీ నీ మాయవల్ల కల్పించావా ఏమి? లేక ఇదంతా నీ అమోఘమైన తపఃశక్తి ప్రభావమా? నిజంచెప్పు!” అని వేడగా

జమదగ్ని:

“ఓ రాజా! నేన్నడూ చివరికి పరిహాసానికైనా సరే అసత్యమాడను! అందుకని నీవడిగావు గనుక సత్యమునే వచిస్తాను! ఇదంతా కామధేనువు యొక్క అనుగ్రహంవల్ల కల్పించబడింది!’ అనిచెప్పాడు.

రాజు ససైన్యంగా భుజించి, తీరిన ఆకలిచేత తృప్తుడైనప్పటికీ దురాశచెంది, ఆ కామధేనువును తనవెంట తీసుకొనిపోదలిచాడు. ఎవనిపట్ల దైవానికి దయాదాక్షిణ్యాలు కోరవడతాయో అట్టివానికే బుద్ధిపెడత్రోవ పట్టడం జరుగుతుంది! దుష్కర్మవైపు మనస్సు ప్రకోపింపబడి, అది భవిష్యత్తులో వాడికి అరిష్టాన్ని కొనితెస్తుంది. ఆ కార్తవీర్యునికికూడా ఆ సమయంలో అటువంటి దుర్బుద్ధే పొడమింది! అప్పుడాతడు శాంతచిత్తుడైన జమదగ్నితో

కార్తవీర్యుడు:

“ఓ తపసోత్తమా! సకల మనోవృత్తులు ఉడిగి, కోరికలన్నీ నశించినవారు, కేవలం కందమూలాదులను భక్షించి కాలంగడిపేవారూ, నివృత్తిమార్గంలో మనోవాసనలన్నీ లయమై, కేవలం సంకల్పమత్రంచేతనే సృష్టిని సంహరించగలిగినట్టి ప్రతిభాశాలురూ, ఇంద్రియాలన్నీ నిగ్రహించి విజ్ఞానఘనులైన మీవంటివారికి కామధేనువుతో పనిఏమి? ఈ ఐశ్వర్యాలూ ఆడంబరాలు మీకు నిష్ప్రయోజనములూ, అవి రాజోచితములూ! ఇట్టిది నావద్ద ఉంటే అనేక మహత్తర కార్యములకు ఉపకరిస్తుంది. ఇది శ్రేష్టమైన వస్తువు కాబట్టి శ్రేష్టుడనైన నావద్ద ఉండటమే ఉచితం! అరణ్యములో నివసించే నీవద్ద ఇటువంటి విలువైన మహాద్రత్నము ఉండతగదు! కనుక ఓమునిశ్రేష్టా! నీవు సంతోశాపూర్వకంగా ఈ ధేనువును నాకు సమర్పించుకో! నా దగ్గర ఉంటే నీవద్ద ఉన్నట్లే అని భావించి సరిపెట్టుకో. నా మాటలు మన్నించి, నీ గౌరవాన్ని కాపాడుకో! లేదా అతులిత బలపరాక్రమ సంపన్నుడనైన నాకు అసాధ్యమేమున్నది?”

“నాయనా, సత్యవతీనందనా! ఈవిధంగా భయపెడుతున్నట్లుగా పలికిన ఆ మాటలకు జమదగ్నిముని మండిపడుతూ కన్నుల్లో నిప్పులు కురవగా

జమదగ్ని:

“ఓయీ! రాజా! నీవు సత్పురుషుడవని, పరిశుద్ధమనస్సు కలవాడవన్న ఉద్దేశ్యంతో నిన్ను భోజనానికి అతిధిగా ఆహ్వానించాను. కోoగలా నీవు కపటివైనావు. నీమనస్సులోని కపటాన్ని గ్రహించలేకపోయాను!

ఈ లోకంలో కోకిలా, కాకి రెండూ నల్లగానే కనబడతాయి! కోకిల తనపిల్లగా కాకిపిల్లను భావించి అమాయకంగా తన ఆహారాన్ని పెట్టి పోషిస్తుంది. ఐనా ఆ కాకికి జన్మనైజంవల్ల ఇది భక్ష్యము(తినదగినది) అన్న విచక్షణ లేకుండా అన్నిటియందు ఆసక్తి కలిగినట్లుగా, నేను నీవు సత్పురుషుడవన్న భ్రాంతితో నీవంటి రాజుతో స్నేహము గడిపాను. ఇటువంటి దుర్భుద్ధిగల మిత్రుడిని ఎవ్వరూ కనీవినీ ఉండలేదు!” అంటూ పరుషంగా నిందించాడు.

Chapter 78 complete