గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

56 – శూరసేనోపాఖ్యానం

భృగువు:

“ఓ సోమకాంత మహారాజా! గణేశమహాత్యాన్నంతా వివరించి చెప్పాను. అంతేకాదు! బ్రహ్మ ముఖంనుంచి వ్యాసుడువిన్న చరిత్రనంతా చెప్పాను.” అనగానే ఆ సోమకాంతుడిలా అన్నాడు.

సోమకాంతుడు:

“ఓ ఋషివర్యా! ఆ తరువాత బ్రహ్మనుంచి వ్యాసమహర్షి యింకా ఏమేమి విన్నాడు? ఆ వివరం కూడా దయచేసి చెప్పండి. అమృతోపమైన ఈ విషయాన్ని ఎంతవిన్నా తనివి తీరడం లేదు. అనగా భృగువిలా చెప్పసాగాడు.

భృగువు:

“నాయనా! నీలాగే వ్యాసమహర్షి కూడా బ్రహ్మని ప్రశ్నించగా బ్రహ్మచెప్పిన సమాధానమే నీకూ చెబుతాను. నీవూ విను!” అంటూ చెప్పసాగాడు. మధ్యదేశంలో శూరసేనుడు అనే మహారాజు సహస్రాఖ్యపురాన్ని పరిపాలించేవాడు. అతడు సకల సద్గుణవంతుడు, అమిత పరాక్రమోపేతుడు. ఇంద్రుని రాజధాని వంటి తన నగరాన్ని సద్గుణవంతుడై, ధర్మబద్ధమైన పరిపాలనను చేయసాగాడు. అతనికి మహాపతివ్రతయైన, అతిలోకసౌందర్యంగల, సుగుణవతియైన భార్యవుండేది. ఇలావుండగా ఒకనాడు ఆ రాజు కొలువుతీరి ఉండగా, ఆకాశంలో వెళ్ళే దివ్యవిమానాన్ని చూశాడు. జ్వలించే జ్వాలలా కన్నులు మిరుమిట్లుగొలిపే కాంతికలిగిన ఆ దివ్యవిమానంలో నుంచి మృదుమధురంగా దివ్యగానం వినబడసాగింది. ఆ విశేషాన్ని కనుక్కొనిరమ్మని రాజు తన దూతలను పంపించారు. ఇంతలో ఒకానొక కుష్టువ్యాదిగ్రస్తుడైన వైశ్యపుత్రుడైనట్టి రాజదూతయొక్క దృష్టివల్ల సూర్యునితో సమానమైన ఆ విమానం నేలకూలింది! ఆ విషయాన్ని రాజువద్దకు వెళ్ళి అతడి దూతలు తెలియజేసారు. అప్పుడారాజు తన ఇరువురుమంత్రులనూ వెంటపెట్టుకుని, అశ్వాన్ని అధిరోహించి ఆ విమానం చూడ్డానికి వెళ్ళాడు. ఆ విమానంలో దేవతలరాజైన ఇంద్రుడు తన పరివారంతోసహా ఉండడంచూసి, రాజు తన వాహనంనుంచి దిగి వినయంగా చేతులుమోడ్చి, దేవరాజైనటువంటి ఆ ఇంద్రునితో ఇలా ప్రశ్నించాడు.

శూరసేనుడు:

“ఓ దేవేంద్రా! మనుష్యలోకంలో ఎవరివల్లా కూడా మీ దివ్యదర్శనం పొందడం సులభమేమీ కాదు. నీయొక్క దర్శనంచేత నా సంపదలు, పితరులు సర్వమూ, ధన్యమైనాయి. ఎంతో పుణ్యం చేసిన వారికిదప్ప దివ్యమైన నీ తేజోరూపం చూడడం సాధ్యంకాదు. ఇటువంటి మహాద్భాగ్యం పొందటానికి మేము ఏం పుణ్యం చేసుకున్నామో? ఓ ప్రభూ! మీ విమానం క్రిందపడటానికి కారణమేమిటి? మీరు ఎటు వెళ్తూవున్నారు? ఆ వివరాలన్నీ దయచేసి నాకు చెప్పండి?

ఇంద్రుడు:

“ఓ శూరసేనమహారాజా! నారదునిచేత ప్రేరేపించబడిన నేను, మానవలోకంలోగల భృశుoడి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను. ఆ మహర్షి గజాననుడిని నిరంతరభక్తితో అర్చిస్తూ ఆ దేవతాస్వారూప్యాన్ని పొందినవాడు! అందుకని ఆ మహనీయుని దర్శించుకుని, పూజించి, ఆయనవద్ద ఆదర సత్కారాలను, పొంది తిరిగి నా నగరికిపోతూ నా విమానం నీరాజ్య పరిసరాలను చేరుకోగానే నీ పరివారంలోని కుష్టువ్యాధిగ్రస్థుడు, పాపియైనటువంటి ఒక భటుని దృష్టిచేత నా విమానం కూలింది!” అని చెప్పాడు. అప్పుడు శూరసేన మహారాజు ఇలా ప్రశ్నించాడు. “ఓ ఇంద్రా! ఏ తపోమహిమవల్ల ఆ భృశుoడిమహర్షికి దివ్యమైన గజానన సారూప్యం సంభవించింది? ఆ వివరాన్ని దయతో కుతూహలుడనైన నాకు వినిపించు!” అంటూ ప్రార్థించాడు.

Chapter 56 complete