గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

55 – శివపార్వతీ సంయోగం

హిమవంతుడు:

“ఓ పార్వతీ! ఈవిధంగా వ్రతపరిసమాప్తి అయిన తరువాత గణేశుని అనుగ్రహంచేత పాతాళలోకంలోని నాగకన్యకల బుద్ధిమారింది. వెంటనే వారు చంద్రాoగదమహారాజుని బంధననుంచి విడిపించి యథావిధిగా పూజించి నూతనవస్త్రాలనూ, అలంకారాలనూ, వివిధ భూషణాలను ఇచ్చి సంతోషపరచి, మనస్సంత వేగంగా పరిగెత్తగల గుఱ్ఱన్నిచ్చి అతడిని విడిచివేశారు. అప్పుడు ఆ రాజు సరోవరంనుంచి బయటికి వచ్చి తన అశ్వాన్ని చెంతనేఉన్న ఒక వృక్షానికి బంధించి స్నానం చేస్తుండగా అక్కడి ప్రజలు కొందరు చూసి కుశలప్రశ్నలు వేశారు. వారివల్ల ఇందుమతి మరియు తన కుమారుల క్షేమాన్ని తెలుసుకుని మానసికచింత తొలుగగా ఆరాజు స్వాంతన చెందాడు. కొందరు ప్రజలు అతనిని గుర్తించి, ‘ఓ ప్రభూ! కొద్దిసేపటిక్రితమే మహారాణి ఇందుమతీదేవి ఈసరోవరంలో స్నానం చేసి వెళ్ళింది. ఆమె ధర్మనిరతురాలై ఉపవాసవ్రతంతో కృశించివున్నది. కుమారునియందే తన ప్రాణాలనుoచుకుని జీవమాత్ర శేషితురాలై ఉంది!’ అని చెప్పారు. కొందరు పరిగెత్తుకువెళ్ళి రాజనగరిలో మహారాజు తిరిగివచ్చారన్న శుభవార్త పట్టణమంతా చాటారు. ఈ విషయాన్ని తెలుసుకుని రాణి మనస్సు ఆనందంలో ఓలలాడింది.

ఆమె తనవెంట మంత్రులనూ, సైనికప్రముఖులనూ తీసుకుని నగరమంతా శోభాయమానంగా అలంకరింపజేసి తాను సర్వాంగసుందరంగా అలంకరించుకుని, భూసురులైన బ్రాహ్మణులను గోహిరణ్యాదులచే సంతోషపరచి, సువాసినులైన ముత్తైదువులకు మంగళహారతిద్రవ్యాలను ఇచ్చి, సన్నాయివంటి మంగళవాయిద్యాలతో కూడి సరోవరతీరానికి బయలుదేరి వెళ్ళింది. అప్పుడు ఆ చంద్రాంగదమహారాజు అందరియొక్క కుశలప్రశ్నలు అడిగి, ప్రముఖులందరినీ తాంబూలాదులతో గౌరవించి తాను స్వయంగా మహారాణి ఇందుమతి విడిదిచేసిన శిబిరానికి వెళ్ళాడు. అలా 12 సంవత్సరాలకాలం భార్యాభర్తలిరువురూ ఒకరినొకరు చూసుకోని కారణంచేత, శాస్త్ర విధిప్రకారంగా ప్రాయశ్చిత్యాది కర్మలను బ్రాహ్మణుల చేత జరిపించి, పుణ్యాహవచన మంత్రపటనంతో, రుద్రాభిషేకాలను చేయించి బ్రాహ్మణులకు దక్షిణాదికములను ఇచ్చి, నరదృష్టి తోలిగేందుకు గుమ్మడికాయను పగులగొట్టి, ఆ తరువాత ముందుకినడిచి కృష్ణపక్ష చతుర్ధశినాటి చంద్రకళలావున్న భార్య ఇందుమతిని చూశాడు.

అప్పుడు ఇందుమతీదేవి సువాసినీ స్త్రీసమూహంతో రాజుకు ఎదురేగి, మంగళహారతినిచ్చి, మహారాజుపై పుష్పవర్షాన్ని కురిపించింది! ఆ దంపతులు ఆనందభాష్పాలను తుడుచుకుని హర్షంతోనూ, శోకంతోనూ ఇంతకాలం తాముపడ్డ కష్టసుఖాలను పరస్పరం చెప్పుకుని కాసేపు విచారించారు. ఆ తరువాత మంత్రులతో పరివృతుడైన రాజు తాను పట్టపుటేనుగుపై కూర్చుండి పదాతిదళాలు ముందు నడుస్తుండగా, ఇరుప్రక్కలా ఖడ్గములు ధరించి, ఆశ్వారూడులైన సైన్యంతో నగరిలోకి ప్రవేశించాడు. ఇరుప్రక్కలా ఏనుగులు ముందు నడుస్తుండగా, వందిమాగాదులు కైవారంచేస్తుండగా, నర్తకీమణులు నృత్యంచేస్తూ వాయిద్యఘోషలతో ముందు నడుస్తుండగా, ఆ సమూహం అంతా రాజుతోసహా నగరిలో ప్రవేశించారు. అలా ఊరేగింపుగా వెళ్ళినవారు రాజభవనంవరకూ వెళ్ళి, రాజువద్ద అనుమతి గైకొని, తమతమ గృహాలకు మరలి వెళ్ళారు. ఆ తరువాత వేదపండితులైన బ్రాహ్మణోత్తములచేత షడ్రసోపేతమైన విందుచేయించి, తానుకూడా సోదరులతోకూడి భుజించాడు! ఆరాత్రి దంపదులిరువురు హంసతూలికా తల్పంపై పరుండి, తమతమ కష్టాలను పరస్పరం చెప్పుకుని, పురోహితుడి చేత ఊరడించబడి, సుఖంగా నిద్రించారు.

రాణివద్దనుంచి వినాయకవ్రత మహిమను గురించి విని చంద్రాoగదుడు ఆ వ్రతాన్ని తాను చేయాలని సంకల్పించాడు. ఆ తరువాత కొన్నాళ్ళకు శ్రావణశుద్ధ చతుర్దిరాగా, మహోత్సాహంతో ఆ వ్రతాన్ని ఆచరించాడు! అంటూ ఈ వృత్తాంతాన్ని తన తనయయైన పార్వతికి వివరించాడు హిమవంతుడు.

అప్పుడు పార్వతీదేవి సంతోషంతో పులకాంకితురాలై శ్రావణమాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి, మృతికతో గణపతిమూర్తిని తయారుచేసి, అమిత భక్తితో, షోడశోపచారములతో పూజించింది. గణేషుని తన హృదయకమలంలో నిరంతరం ధ్యానిస్తూ, కేవలం నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ, నియమపూర్వకంగా అలా వ్రతంచేయగా ఆ వ్రత ఫలితంగా శంకరుని మనస్సు పార్వతివైపుకు మరలింది! అప్పుడు అతడు స్వయంగా నందివాహనాన్ని ఎక్కి ఆమెవున్నట్టి ప్రదేశానికి వచ్చాడు. ఆ దినము పార్వతీదేవి యొక్క వ్రతసమాప్తి అయ్యేరోజు. కనుక ఆ వ్రతఫలితంగా పార్వతీదేవి తన నాథుడైన పరమశివుని తన ఆశ్రమమంలోనే దర్శించుకో గలిగింది! అప్పుడు ఆమె యధావిధిగా శంకరుని పూజించి తన వియోగాన్ని గురించి, అతనితో తను పడిన విరహాన్ని గురించీ, తెలియజేసి ఓ ప్రభూ! నా తండ్రియైన హిమవంతునిచేత ఉపదేశించబడిన గణేశవ్రతం ఆచరించి, వరదుడైన విఘ్నేశుని యొక్క అనుగ్రహంవల్ల ఈనాటికి మిమ్మల్ని తిరిగి ధర్శించగలిగాను! అంటూ సాష్టాంగoగా ప్రణమిల్లింది. అప్పుడు అక్కడికి హిమవంతుడు విచ్చేసి ఆమె హస్తాన్ని శంకరుని చేతిలోపెట్టి “ఓ పరమశివా! ఈమె నీభార్యయైన పార్వతియే సుమా!” అని ప్రకటించాడు. అక్కడ చేరినటువంటి సమస్త దేవతలూ ఎంతో ఆదరంగా వరప్రదుడైన గణపతిని పూజించి, లోకమంగళకరులైన ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరులను పూజించారు! ఆ దివ్యసమయంలో దేవధుoధుభులు మ్రోగాయి! పూలవర్షం కురిసింది. అందరూ గజాననుడి నమస్కరించి స్తుతించారు. అప్పుడు శంకరుడు జయజయధ్వానాలతో గణేశుని అభినందించారు. పార్వతికి అర్థాంగిగా, తన శరీరంలో సగభాగాన్ని ఒసగి ఆమెతోకూడి కైలాసానికి వెళ్ళాడు. అప్పుడు దేవతలంతా తమతమ స్థానాలకు వెళ్ళారు!’ అంటూ బ్రహ్మ ఇలా అన్నాడు. ఓ వ్యాసమునీంద్రా! నీకోరికమేరకు గణనాధుని వ్రత మహాత్యాన్న్నంతా వివరించాను. ఇప్పుడు నీకింకో కథ చెబుతాను! ఆ కథను వినడంవల్ల మానవుడు సర్వ పాపములనుండి విముక్తుడై సర్వాభీష్టములనూ పొందగలడు!” అన్నాడు.

Chapter 55 complete