గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

54 – ఇందుమతీ – నారద సంవాదం

పార్వతి:

“ఓ తండ్రీ! మహారాణియైన ఇందుమతి ఆ విశాదవార్తకు నిర్ఘాంతపోయి మూర్చిల్లిన తరువాత ఏం జరిగిందో, ఆ రాజ్య ప్రజలేమి చేశారో ఆ వివరాన్నంతటినీ దయతో నాకు తెలియచేయి!”

హిమవంతుడు:

“అమ్మాయీ! అప్పుడు కొందరు ప్రజలు ముందుగా తెప్పరిల్లి తమ కన్నీళ్ళు తుడుచుకొని ఆ మహారాణివద్దకు వచ్చి ఆమెను యిలా ఊరడించారు. ‘ఓ దేవీ! నీవు దుఃఖించవద్దు! నీకింకా పసితనం వీడని పుత్రుడున్నాడుకదా! వాడియందు నీ అపేక్ష ఉంచుకో! ఐనా మరణించిన వ్యక్తి ప్రేతాత్మను బంధువుల కన్నీళ్ళు కాల్చివేస్తాయి! అందుచేత నీ భర్తయొక్క శ్రేయస్సును ఆపేక్షించి, దుఃఖాన్ని విరమించుకుని నీ భర్తకు ఉత్తరగతులను చేకూర్చుకో! ఎందుకంటే, ఎంతటివారైనా ఎనాటికైనాసరే జన్మించిన ప్రతీవారూ మరణించకా తప్పదు. జీర్ణమైన వస్త్రాన్నివీడి, మనమెలా కొత్తవస్త్రాన్ని ధరిస్తామో, అలానే ప్రతీ జీవుడుకూడా తన పాతబడ్డ దేహాన్ని వీడి, మరో నూతన దేహాన్ని ధరిస్తుంటాడు!

అన్నిటికన్నా అమితంగా ఆశ్చర్యంగోలిపే విషయమేమంటే, ఇలా మానవులు నిరంతరం మృత్యుముఖంలో ఉండి, మరణధర్మము కలవారై ఉండికూడా, అల మరణించినవారిని గురించి దుఃఖిస్తారు. ప్రతి జీవికీ దేహధారణా, దేహం నుంచి విముక్తి అత్యంత సహజమైనవి! దైవసంకల్పానుసారమే ఈ చరాచర జగత్తంతా వర్తిస్తుందన్న నిత్యసత్యాన్ని విస్మరించి, సర్వమూ తానేనన్న అహంకారంతో, భ్రాంతుడై జీవి చరిస్తుంటాడు. కేవలం భగవదనుగ్రహమే భమప్రమాదములైన వీటినుంచి, ఈ అజ్ఞానపు అంధాకారంనుండీ అతడిని ఉద్ధరించగలది! కనుక నీవు అశాశ్వతమైన వాటికై దుఃఖశోకాలను వీడు! మహారాజు పుణ్యశీలి! ధర్మవంతుడు గనుక శాశ్వతముక్తిని పొందియున్నాడు!

మానవుడిచ్చట ఒనర్చిన పుణ్యకర్మలు అతనికి స్వర్గవాసమును తాత్కాలికంగా కల్గించినా, ఆ పుణ్యమంతా అతడనుభవించాక తిరిగి భూలోకంలో జన్మించక తప్పదు! ఇక్కడికి ఒక మహాత్ముడైన ఋషి వచ్చియున్నాడు. ఆయననడిగి మనం సదేహం నివృత్తిచేసుకొని నీ కర్తవ్యభోధను కూడా ఉపదేశంగా పొందుదాము!

ఆ తరువాత జరుగవలసిన కార్యక్రమాలు నేరవేర్చవచ్చు!” అంటూ ఊరడించారు. ఆతరువాత జరిగిన కథని హిమవంతుడిలా చెప్పాడు.

“ఓ పార్వతీ! ఈవిధంగా ప్రజానీకంచేత మహారాణి ఊరడించబడి క్షణకాలం దైర్యంతెచ్చుకుని కన్నీళ్ళు తుడుచుకొని ప్రజానికాన్నందరినీ పంపించివేసి, తన సౌభాగ్యచిహ్నాలను వదిలి, క్రమంగా క్రుశించసాగింది. ఇట్లా భర్తృవియోగానికై అనుక్షణం దుఃఖిస్తూ, నిట్టూర్పులు విడుస్తూ నామమాత్రంగా తాను రాజుకు ప్రతినిధియై, పరిపాలన నిర్వహించసాగింది. ఈ రీతిగా పన్నెండుసంవత్సరాలు గడిచాయి. ఒకనాడు యాదృచ్చికంగా అక్కడికి నారదమహర్షి విచ్చేశాడు. ఆ ఇందుమతి దుఃఖిస్తూ తన భర్త వియోగాన్ని గురించీ, అందుకు తాను పడిన పరితాపాన్నంతటినీ ఆ మహర్షికి వివరించింది. అప్పుడు నారదమునీంద్రుడు ఆమె దుఃఖకారణం తెలుసుకుని ఆమెను ఉత్సాహపరుస్తూ ఇలా అన్నాడు.

నారదుడు:

“ఓ ఇందుమతీ! నీభర్త ఒకానొకచోట జీవించియే ఉన్నాడు. కనుక నీవు మంగళకరమైన ఆభరణాలు ధరించి సుమంగళిగా సుశోభితురాలివై ఉండు!” అని ఆమెకు ధైర్యం చెప్పాడు.

“ఓ పార్వతీ! ఆ రాణి ఇందుమతి మహర్షి వాక్కులను విశ్వసించి తన ఆభారణాలన్నింటినీ తెప్పించి సంతోషంగా వాటిని తిరిగి అలంకరించుకుంది. భూసురులైన బ్రాహ్మణోత్తములను పిలిపించి వారికి శక్తికొలది దానాదులను చేసి తృప్తులను కావించింది. ఆ తరువాత దేవమునియైన నారదునికి నమస్కరించి, తన భర్తను తిరిగిపొందే ఉపాయాన్ని తెలుపమని ఇలా ప్రార్థించింది. ‘ఓ మహర్షీ! నా భర్త ఎచ్చట ఉన్నాడు, ఎలా ఉన్నడో? ఏ ఉపాయంవల్ల అతడి దర్శనం, సమాగమం నాకు కల్గుతుంది? నన్ను అనుగ్రహించి అందుకు అనువైన వ్రతముగానీ, దానముగానీ, తపస్సుగానీ, ఎంతటి దుష్కరమైనదైనాసరే నాకు తెలియచేయండి! దాన్ని నిర్వహించి భగవదనుగ్రహాన్ని పొంది తిరిగి నా భర్తను చేరుకుంటాను!’ అంటూ వేడగా, ఆ నారదమహర్షి ఆమెతో ఇలా అన్నాడు.

“ఓ సాధ్వీమణీ! ఇందుమతీ! నీ మనోభీష్టాన్ని పొందటానికై నీకొక వ్రతాన్ని ఉపదేశిస్తాను! దాన్ని అనిష్టించటంవల్ల నీ కోరికలీడేరి నీభర్తను తిరిగి పొందగలవు! ఆ వ్రతవిధానం ఎలాంటిదంటే శ్రావణశుద్ధ చతుర్థినాడు ఆ వ్రతాన్ని ప్రారంభించాలి! ఆ రోజు ఉదయాన్నే నదీతీరానికి వెళ్ళి సమంత్రకంగా స్నానాదులను పూర్తిచేసుకుని గణేశవ్రతాన్ని చేస్తాను అనుకుని సంకల్పించుకోవాలి. అనంతరం తెల్లటి వస్త్రాలను ధరించి, మట్టితో నాలుగు బాహువులతోకూడిన వినాయకుడి మూర్తిని తయారుచేసి నిశ్చలబుద్ధితో, షోడశోపచారములతో ఆ మూర్తిని పూజించాలి. హవిష్యఅన్నాన్నిమాత్రం ఏకభుక్తంగా భుజించాలి, లేదా శక్తివుంటే ఉపవాసమైనా చేయవచ్చు! ఈవిధంగా ఒకమాసంరోజులు అనగా భాద్రపద శుద్ధ చవితివరకూ నిష్టగా వ్రతంచేసిన తరువాత, ఆనాడు సంగీత నృత్యాదికములతో, బ్రాహ్మణ భోజనములతో, బీదలకు అన్న సమారాధన చేయాలి. ఈవిధంగా ఆచరించినట్లయితే ఓ మహారాణీ! నీవు నీభర్తను తిరిగి కలుసుగొన గలుగుతావు. నీభర్త సజీవుడే! పాతాళంలో నాగకన్యకల చేత బంధితుడై ఉన్నాడు. నేను చెప్పినదంతా నిజమేసుమా! ఇందులో అక్షరంకూడా అసత్యం లేదు. నీవారకంగా ఆచరించి శుభాన్ని పొందు! అంటూ ఆశీర్వదించి ఆ ముని వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకు శ్రావణశుద్ధ చతుర్థితిథి రాగా మహారాణియైన ఇందుమతి నారదముని చెప్పిన ప్రకారం మట్టితో గణేశమూర్తిని తయారుచేసి యథావిదిగా పూజించి, దివ్యగంధంతోనూ, దివ్యపుష్పాలతోనూ, నానావిధ నైవేద్యాలతోనూ, ఫలములూ, బంగారమూ మొదలైన దక్షిణలతోనూ, నీరాజన, మంత్రపుష్ప, ప్రదక్షిణ, సాష్టాంగనమస్కారాలనుచేసి, ఆ వరదగణేశుని సంతృప్తిపరిచింది. ఆ తరువాత సంగీత నృత్యాలతోనూ, బ్రాహ్మణభోజనంతోనూ ఆ దేవదేవుని సంతోషపరిచి, తాను కొన్ని పాలు మాత్రం ఆహారంగా తీసుకుని, ఉత్తమమైన ఈ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించింది. ఓ పార్వతీ! ఈవిధంగా ఆ ఇందుమతి నారదవాక్యానుసారం శ్రావణ శుద్ధ చతుర్థినుంచి భాద్రపద శుద్ధ చతుర్థివరకూ భక్తిశ్రద్ధలతో ఆచరించింది.

Chapter 54 complete