గణేశ పురాణము - ఉపాసనా ఖండము
83 – తారకోపాఖ్యానం
వ్యాసుడు:
“ఓ చతురాననా! జమదగ్నినందనుడైన పరశురాముడు అద్భుతమైన తన తపస్సును ఎక్కడ ఎలా ఆచరించాడో, చివరకు గణేశుని ఎలా ప్రసన్నుని చేసుకోగాలిగాడో ఆ వృత్తాంతమును నాకు విస్తారంగా చెప్పవలసింది!”
బ్రహ్మ:
“ఓ వ్యాసమునీoద్రా! పరశువును సాధించుకున్న ఆ రాముడు తన తపశ్చర్యను మయూరేశ్వరంలో చేశాడు. మయూరేశ్వరుడు ఈ క్షేత్రానికధిపతి! ఈ మయూరేశ్వరంలోనే ఆతడు కమలాసురుడనే రాక్షసునికూడా వధించాడు. అక్కడ మయూరాన్ని వాహనంగా అధీష్టించాడు. ఆ కార్యం దిగ్విజయంగా పూర్తిచేసుకుని దేవతాగణములచేత మునులచేతా కొనియాడబడినాడు. ఆ మయూరక్షేత్రంలోనే అనుష్టానంచేసి రేణుకాతనయుడు గణేశానుగ్రహాన్నీ తద్వారా పరశువునూ ఆయుధంగానూ పొందాడు. ఆనాటినుంచీ ఆతడు ‘పరశు రాము’డన్న పేరుతో ఖ్యాతిగాంచాడు.
ఈ విషయమై నీకో ఇతిహాసాన్ని చెబుతాను విను! పూర్వం తారకుడనే మహాబలసంపన్నుడైన రాక్షసుడుండేవాడు. వాడు రెండువేల దివ్య సంవత్సరాలు ఘోరతపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై “ఓ తారకా! నీకు దేవర్షి, యక్ష, గందర్వ జాతులవల్లకాని, సర్పములవల్లకాని, రాక్షసులవల్లగాని వారి శస్త్రాస్తములవల్లగాని మృత్యువు లేకుండుగాక!” అంటూ వరాన్నిచ్చాడు. ఇలా బ్రహ్మనుండి పొందిన వరముచేత గర్వితుడై ఆ తారకుడు మూడులోకాలవారినీ పీడించసాగాడు. సాధువులను వేదధ్యయనపరులను, తపోనిష్టాగరిష్టులైన మహర్షులను వేధించసాగాడు. వారిని తన కారాగృహములో బంధించి హింసించసాగాడు. పాతాళ, నాగాలోకాలనూ, మర్త్యలోకాన్నీ బలంతో స్వాధీనంచేసుకుని స్వర్గలోకానికి కూడా దాడికివెళ్ళాడు. వాడకి భయపడి శచీపతి మొదలైన దేవతలు స్వర్గంనుండి పారిపోయి హిమవత్పర్వత గుహలలో తలదాచుకున్నారు.
ఆ తారకుడికి భీతిల్లి సర్వత్రా యజ్ఞయాగాదులు, దేవతాపూజలు నిలిపివేశారు. ఆ తారకుడు సైతం అహంకరించి “నేనే బ్రాహ్మణులకు అర్చనీయుడిని! నేనే పూజనీయుడను! సకల జనులచేత నమస్కరిoపబడ తగినవాణ్ణి! ఇంకెవరినైనా పూజించినా, అర్చించినా అలా అర్చించి పూజించినవారు దండిoపబడతారు!” అంటూ సకల లోకాలలోనూ ప్రకటిoపచేశాడు.
అప్పట్నుంచీ అంతటా జనుల స్వాధ్యాయాన్ని, యజ్ఞయాగాదికాలను వర్జించి, వ్యర్దులైపోయారు. కులధర్మములన్నీ విచ్చిన్నమైనాయి. సాంప్రదాయాన్ని వదులుకోలేని సదాచారపరాయణులు, మునులు, సాధువులు పర్వతగుహలలో దాగికొని యిలా దేవతాప్రార్ధనలు చేయసాగారు.
ఓ శంకరా! భక్తవశంకరా! ఈ ఘోరరాక్షసుడివల్ల ఈ భాధలేమిటి ప్రభూ? వీడు యిలా విచ్చలవిడిగా అడ్డూఆపూ లేకుండా ప్రాణికోటిని క్షోభింపచేస్తున్న చూస్తూ ఉరుకున్నవేమి స్వామీ! నీకన్నా మరిమాకు దిక్కెవరు? ఎవరని మేము శరణువేడము? నీకు మాపై సంహరేచ్చకలిగితే అలాగేకానీ! లేదా సర్వులనూ పీడిస్తున్న ఈ తరకుడిని సంహరించి వాడి పీడనుండి మాకు విముక్తి కలిగించు!” అంటూ దేవతాగణాలు ఆర్తితో ప్రార్ధిస్తూ దుష్కరమైనట్టి ఘోరతపస్సును చేయసాగారు. కేవలము గాలినే భక్షిస్తూ తపస్సు చేస్తుండగా, ఆ తారకుడు మళ్ళీ వారిపై విజృంభించి అమరావతిపై దండెత్తి ఇంద్రపదాన్ని ఆక్రమించాడు. బ్రహ్మలోకంపైకి దండెత్తివెళ్లి బ్రహ్మనూ చావమోదాడు. వైకుంఠానికి దాడికేల్లగా శ్రీమహావిష్ణువు క్షీరసాగారంలోకి నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు కైలాసంపైకికూడా దండెత్తగా శంకరుడుశాతం కైలాసంవీడి గుహాoతరములో తలదాచుకున్నాడు. దిక్పాలకులు దిగ్గజములు కూడా స్థానభ్రష్టులై పర్వతగుహల నాశ్రయించారు, వారి స్థానాలలో దైత్యులను నియమించాడు తారకాసురుడు! భూమండలాన్ని యావత్తూ నిష్కంటకంగా పరిపాలించసాగాడు. ఇంద్రాది సకలదేవతలు గంభీరంగా గుహలలో నుండే ఉమానాధుని స్తుతించసాగారు.
దేవతాగానముల శివస్తుతి
దేవతాగణాలు:
“ఓ గిరిజారమణా! భూమ్యాకాశములూ, సూర్యచంద్రులు, ఆపస్సు అగ్ని, వాయువు, యజమానుడు అనే ఎనిమిదిరూపాల్లో విస్తరించిన అష్టమూర్తి స్వరూపుడవు!
స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తునకు సృష్టి స్థితి లయకర్తవూ నీవే! ఓ పరాత్పరా! భక్తిపరాధీనుడవు, భక్తార్తిహరుడవన్న నీ చిరకీర్తి అపహసించబడరాదు! కనుక నీవే పూనుకొని ఈ దుష్టదానవుడి వినాశనం కావించు! మా ఆర్తిని తొలగించు. దుఃఖంతో వికలచిత్తులమైన మాకు స్వస్థచిత్తాన్ని కలిగేలా మమ్ములను రక్షించు! అన్యధాశరణం నాస్తి! త్వమేవ శరణం మమా!” అంటూ పరిపరి విధాల ప్రార్ధించినా ఫలితం లేకపోవటంతో తమ ఎదుటేఉన్న మూలప్రకృతి స్వరూపిణియైన జగన్మాతతో తమ కష్టాలను విన్నవించుకున్నారు.
దేవీస్తుతి
దేవగణాలు:
“ఓ జగన్మాతా! భక్త ఆపన్నివారిణీ! జ్ఞానప్రదాయినీ! భావతారిణీ! ఈ దుష్టతారకుని బారినుండి మమ్ములను కాపాడు! దేవాతలపాలిట శాపంవలే సంప్రాప్తమైన ఈ పీడాకారునివల్ల పదవీభ్రష్టులమై అరణ్యాల పాలయ్యము. ఓకరుణామయీ! జగజ్జననీ! త్రైలోక్యరక్షాకరీ! శర్వాణీ! చిత్కళారూపిణీ! నీకు నమస్కారము! బ్రహ్మాది దేవతలచే నిత్యం కొనియాడబడే దానవు! వేదాలకు సైతం కనుగోనజాలని ఉన్నతస్థితి యందుండే ఓ ఈశ్వర ప్రియపత్నీ! దివ్యమoగళరూపిణివీ అసురసంహారిణివీ నీవే దయతో పూనుకొని జగత్తుకు అభయాన్ననుగ్రహించు. జగత్కళ్యాణాన్ని చేయి.” అంటూ చేసిన దేవతల ప్రార్ధనను ఆలకించి జగన్మాతయైన పరాశక్తి యిలా పలికింది!
దేవి:
“ఓ దేవతలారా! ఈ విషయమై ఆకాశవాణి చెప్పినది నేనెరుగుదును. మీకు భక్తార్తిహరుడైన శoకరుడే సుఖాన్ని కలుగజేయగలడు! ప్రస్తుతం విరాగియై యోగంలో నిర్వికల్పసమాధిస్థితుడై ఉన్నాడు. మనమందరమూ ఆయన సన్నిధికి తరలి వెళదామురండి!” అంటూ ఆ జగన్మాత పరమసుoదరమైనట్టి ‘భిల్లి’ వేషమును దాల్చింది! శంకరుడినే మోహింప చేయదలచి, పరమ సుందరరూపాన్ని దాల్చిన ఆ శర్వాణి అందానికి అప్సరసలు సిగ్గుచెందారు.
ఓ వ్యాసమునీoద్రా! ఈ విధంగా దేవతలందరూ ఆ జగన్మాతతో కలిసి శివసన్నిధిని చేరుకున్నారు. నిశ్చలoగా స్థాణువై పరబ్రహ్మను ధ్యానిస్తున్న యోగీశ్వరుడైన శంకరుడిని చూచారు. అప్పుడా దేవతలనుద్దేశించి
దేవి:
“ఓ దేవతలారా! దేహాతీతస్థితిలో నిర్వికల్ప సమాధిస్థితుడై ఉన్న ఈ శంకరుడిని దేహభావం కల్గిస్తేనే మీకార్యం నెరవేరుతుంది. అందుకు గాను మీకో ఉపాయం చెబుతాను!
పంచశరుడైన మన్మధుడిని ముందుగా మీరు ఆశ్రయించండి! అతని శరముతో కొట్టబడి వికల్పం చెందితేనే శివుడు దేహభావాన్ని పొందుతాడు. అప్పుడే మీకార్యం నెరవేరుతుంది!” అనగానే దేవతలు
దేవతలు:
“ఓ మన్మధా! ఈ సృష్టినంతటినీ నిర్విఘ్నంగా నడిపిస్తున్నది నీవే! నీవే ఈ జగత్తంతాకూడా వ్యాపించివున్నావు! నీయొక్క ప్రభావంచేతనే స్త్రీలు, కామినులు బలవత్తరులౌతున్నారు. నీవులేనిదే స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తంతా వృధా! కనుక నీవే మాకార్యాన్ని నేరవేర్చగల సమర్ధుడవు! దేవకార్యాన్ని నీవే పూనుకొని నిర్వహించు!” అంటూ ప్రార్ధించారు.
మన్మధుడు:
“ఓ దేవతలారా! నావద్ద ఈకార్యాన్ని సాధించటానికి ఏరకమైన సాధనాసంపత్తీ లేదు! ఐనప్పటికీ ‘మీ అనుగ్రహంమేరకు, నాశరీరం ఉన్నంతవరకూ మీకార్యసాధనకై పాటుపడతాను. పుష్పధనుస్సు, మరాళములనే నారి , స్త్రీల క్రీగంటిచూపులనే బాణాలతో శంకరునేకాదు సమస్త దేవతలనీకూడా వసంతుని సహాయంతో గైకొని సర్వమునూ జయింపగలను.”
బ్రహ్మ:
అంటూ ఓ వ్యాసమునీంద్రా! ఈ రకంగా శంకరుని మోహింపజేయ సంకల్పించిన మన్మధుడు దేవతాకార్యసిద్దికై శంకరుడు తపస్సు చేసుకుంటున్న తపోవనాన్ని చేరుకున్నాడు.
Chapter 83 Complete
