గణేశ పురాణము - ఉపాసనా ఖండము
23 – కళ్యాణ వైశ్య – భవిష్యకధనం
భృగు మహర్షి:
భృగు మహర్షి సోమకాంత మహరాజుకు ఆతరువాత జరిగిన వృత్తాంతాన్నిలా చెప్పసాగాడు.
"ఓ రాజా! కళ్యాణాసంజ్ఞకుడిగా దక్షుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని విశ్వామిత్ర మహర్షి యొక్క అమ్రుతోపమైన మృదుమధుర వాక్కులతో తెలుసుకున్న తెలుసుకున్న భీముడన్న ఆ రాజు - దక్షుని చరిత్రలో ఆ తరువాత జరిగిన కధను తెలుసుకొనగోరి విశ్వామిత్రుడిని యింకా సవినయంగా ఇలా ప్రార్ధించాడు.
" ఓ మహర్షీ! నీవు చెప్పిన దక్షుని చరిత్ర అంతా విన్నాక నా మనస్సుకు ఒక అనిర్వచనీయమైన ప్రశాంతి కల్గింది! ఆ తరువాత కళ్యాణ సంజ్ఞకుని గతి ఏమైందో ఆ వివరం దయతో తెలియజేయి!"
అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆ తరువాత జరిగిన కళ్యాణసంజ్ఞికుని గాధను ఇలావివరించాడు. నీవుకూడా శ్రద్ధాళువై విను!" అంటూ సోమకాంతుడితో ఇలా చెప్పసాగాడు.
"ఓ భీమరాజా! ఇలా భల్లాలుని శాపంవల్ల కళ్యాణవైశ్యునికి శరీరమంతా రోగభూయిష్టమై, అనేక గాయాలతో రక్తం స్రవించసాగింది! భరించరాని దుర్వాసనతోపాటూ అతడికి మూగత్వం, చెముడు కూడా కలిగాయి. అతని భార్యయైన ఇందుమతి తన భర్తకు సంప్రాప్తించిన ఈ దుస్థితికి ఎంతో దుఃఖించింది ఏ పాపకర్మ ఫలంగా నా భర్త యింతటి దురవస్థ పాలైనాడో కదా! స్వాభావితంగా ధర్మపరుడు, దేవ బ్రాహ్మణ పూజలయందనురక్తికలవాడు, ధర్మ శాస్త్రర్ధమునంతటినీ క్షుణ్ణంగా ఎరిగినవాడు, కేవలం స్వభార్యనైన నా యందే అనురక్తి కలవాడు, అట్టి ఈతనికి ఈ దుస్థితి ఎట్లువచ్చిందో?' అని పలువిధాలుగా విచారిస్తూ, మాటిమాటికీ దుఃఖపుభారంతో నిట్టూరుస్తూ, ఆ ఈరి జనంవల్ల తన కుమారుడైన భల్లాలుడు అడవిలో అతడి తండ్రిచేత బంధించబడటం, హింసించబడ్డాడని తెలుసుకున్నది. ఇక ఉండబట్టలేక తన కుమారుణ్ణి వెతుక్కుంటూ, అతడు బందించబడ్డ చోటుకి అరణ్యానికి వెళ్ళింది.
తీరా, ఆమె ఆ ఆలయానికి వెళ్ళి చూస్తే, అక్కడ బంగారువర్ణ దేహంతో పరిపూర్ణ ఆరోగ్యంతో నవయవ్వనవంతుడైన ఒక యువకుని చూసి తనకళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆశ్చర్యంతో అది కలకాదు కదా అని కళ్ళు నులుముకుని మరీ చూసింది!
అక్కడ ఉన్న దేవాలయంలో ఏకాగ్రచిత్తంతో గజాననుని చతుర్బాహువులు, మూడు నేత్రాలు గలవానిని, సింధూరవర్ణ దేహంతో ప్రకాశిస్తున్న వక్రతుండముగల గణేశుని ఏకమనస్కుడై అర్చిస్తున్న కుమారుణ్ణి చూసి, 'ఈ ఊళ్ళోవాళ్ళు తిన్నమైన వాళ్ళు కాదు! లేకపోతే ఏ బాధాలేకుండా ప్రశాంతచిత్తంతో గణేశుని అర్చించుకుంటూన్న నా ముద్దుకుమారుడి గురించి లేనిపోనివివన్నీ కల్పించిచెప్పారు. వాళ్ళమాట పట్టుకుని యిక్కడికివచ్చాను! తీరా చూద్దును కదా - వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ ప్రత్యక్షమైన దానికీ పూర్తి వ్యతిరేకంగా వున్నదే?' అనుకుంటూ ఆ అనందంతో తన మనస్సు ఉప్పొంగగా తన కుమారుని సమీపించి, ఆప్యాయంగా అతనిని తనకు అక్కునచేర్చుకుని, తలనిమిరి ప్రేమతో ముద్దాడింది.
"నాయనా! మనం యిక మనయింటికి వెడదాం! పద! నీతండ్రి గొప్ప అస్వస్థతకు లోనై, శరీరమంతా వ్రణాలతోనూ, గాయాలతోనూ, బాధపడుతూన్నాడు. మాట మారుపలుకలేడు, చెవులు ఏమాత్రం వినబడవు కూడా! అతని బాధానివారణకై ప్రయత్నించి కొడుకుగా నీధర్మము నెరవేర్చుదువుగాని! నీ వంటి యోగ్యుడు, గుణవంతుడూ మాయింట్లో పుట్టడంవల్ల నా కడుపు పండింది! మన వంశం యావత్తూ చరితార్ధమైంది! మీ తండ్రి ఆవేశంలో ఆచరించింది తండ్రిగా తన కర్తవ్యాన్నేగాని నీకు ఏమాత్రం అపకారం తలపెట్టాలన్న ఉద్దేశ్యంతో ఎంతమాత్రం కాదు! కనుక నీవూ నాతో వచ్చి, నీ తండ్రియొక్క బాధా నివారణకై కుమారుడిగా నీ కర్తవ్యం నెరవేర్చు!" అంటూ అనునయ వాక్యాలు పలికింది.
వికలమైన మనస్సుతో తీవ్రమైన నిర్లిప్తత చోటుచేసుకునగా భల్లాలుడు ఇలా బదులిచ్చాడు.
'తల్లి ఎవరు? తండ్రి ఎవరు? పుత్రుడెవరు? ఈ ప్రకృతీ దాని స్వాభావిక లక్షణాల వల్ల కలిగే సకల సంకల్పవికల్పాలన్నీకూడా - భగవంతుడైన గజానుని సంకల్పానుసారమే జరుగుతాయి! జీవులమధ్య పరస్పరం కలిగే రాగద్వేషాలన్నీకూడా వారివారి కర్మానుసారమే సంభవిస్తాయి. అందుకనే ఎట్టివానికైనా వాడు చేసిన కర్మయొక్క ఫలం అనుభవించక తప్పదు. కనుక ఓ మంగళప్రదురాలా! యిక నాకు తల్లీ, తండ్రీ, గురువూ, దైవం సమస్తమూ వినాయకుడే! అతని దివ్య చరణాలవద్దే నా సర్వస్వమూ సమర్పించాను. ఆయన యొక్క అనుగ్రహ విశేషం చేతనే ఈనాడు నాశరీరానికి జవజీవాలు, ఆత్మ జ్ఞానము లభించినాయి. పవిత్రమైన గణేశుని ఆలయాన్ని ధ్వంసం చేయటం, దైవాపచారం చేయటమే! అందలి మూర్తిని విసిరివేయటం, దురహంకారంతో గజాననునికి భక్తిచేస్తున్న నన్ను చావమోదటం వంటి దుష్కార్యాల వల్లనే దేవతానుగ్రహంతో అతనికి ఇట్టి దారుణమైన స్థితి సంప్రాప్తమైంది! జాగ్రత్తగా తత్త్వవిచారణా చేసినట్లయితే ఓ మంగళప్రదురాలా, నిజానికి నీవు తల్లివీ కావు! అతడు నా తండ్రీకాదు! సకల జగాలకూ కూడా తల్లీతండ్రీ ఆ దేవదేవుడైన గజాననుడే! ఆయనే జన్మ మృత్యువుల కతీతమైన ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. సృష్టి, స్థితి, లయాలు మూడూ అతని లీలాకృత్యములే! ఆ ప్రభువే సకల దేవతాస్వరూపుడూ, త్రిమూర్తి స్వరూపుడూకూడా! ఎట్టి అపరాధము లేకుండానే బాలుడనైన నన్ను దారుణంగా హింసించాడు! అంతేకాదు నీభర్త దైవ దూషణనూ, ఘోరమైన దైవాపరాధాన్నీ ఏమాత్రం జకూగొంకూ లేకుండా నిర్వర్తించాడు.
అందుకుతగ్గ ప్రతిఫలాన్నే అతడు అనుభవిస్తున్నాడు. ఇక అటువంటి మహాపాపిని నేను దర్శించను. ఎందుకంటే పతితుడైనవాడిని దర్శించటం వల్లనే అనేక దోషాలు సంప్రాప్తమౌతాయి! కనుక నీవు నాయందు మమకారాన్ని వీడి, నీకు తగినె సతీ ధర్మాన్ని అనుసరించి అతనిని శ్రద్ధగా సేవించుకో!"
ఈ మాటలు విన్న ఇందుమతి దీనంగా ఇలా ప్రార్ధించింది.
"నాయనా! కరుణను వహించీ, బంధుత్వమును అనుసరించీ, దయతో అనుగ్రహంతో నీ తండ్రికిచ్చిన శాపాన్ని ఉపసంహరించు !" అంటూ వేడుకోగా అప్పుడు శాంతచిత్తుడైన భల్లాలుడిలా ఆమెకు బదులిచ్చాడు.
ఓ రాజా! ఈవిధంగా భల్లాలునిచే అతని తల్లి నిరాకరించబడి, మనస్సు దఃఖంతోనూ, సంతోషంతోనూ సమ్మిళితమై ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు దివ్యసుందరమైన విమానం వచ్చింది. ఆ విమానాన్ని అధిరోహించి భల్లాలుడు వైనాయకలోకాన్ని చేరుకున్నాడు. ఓ భీమరాజా! కల్యాణవైశ్యుని వృత్తాంతాన్నతటినీ నీ కొరిక మేర వివరించాను. భల్లాలుడు చెప్పినట్లుగానే అక్షరంకూడా పొల్లుపోకుండా తరువాతి జన్మలో జరిగింది. ఆమె కమల అన్న పేరుతోనూ జన్మించి అతను వల్లభుడు అన్న పేరుతో జన్మించగా - ఆ రాజును వరించి దక్షుడిని కుమారుడిగా ప్రసవించింది." అంటూ ముగించాడు మహర్షి!
Chapter - 23 Complete
