గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

20 – దక్ష స్తుతి

బ్రహ్మ:

ఓ వ్యాస మునీంద్ర!

అలా సకల వైకల్యములతోనూ జన్మించిన కుమారుడికి జాతకర్మను నిర్వర్తించి, జ్యోతిష్యవేత్తలను, వేదవేదాంగ పారంగతులైన సద్బ్రాహ్మణులను రావించి, వారిని యదావిధిగా పూజించి తగు విధములైన అమూల్య రత్నరాసులతోను ధనధాన్యాదికములతోనూ సత్కరించాడు భీముడనే ఆ మహారాజు! వేదవిదులైన వారి అనుమతితో తన కుమారుడికి ‘దక్షుడు’ అన్న నామకరణం వైభవోపేతంగా చేశాడు.

ఆ తరువాత తన కుమారుడి యొక్క రోగనివృత్తి నిమిత్తమై జప, మంత్రం ప్రయోగాలను. ఓషధీహోమాలను, ఔషధసేవనూ చేయించి, బాధానివారణకై తానే స్వయంగా పన్నెండు సంవత్సరాలు దీక్ష వహించి కఠినమైన తపస్సు ఆచరించాడు. ఐనా ఏమాత్రం ప్రయోజనం లేకపోవటంతో విరక్తి చెందాడు. చివరికి అతనికి భార్యా పుత్రులపైన యెనలేని క్రోధం కలిగింది. భార్యాబిడ్డలను తన భవనంనుంచి ‘మీ ముఖం నాకు చూపించకండి” అంటూ వెళ్ళగొట్టాడు. అలా భర్త చేత తిరస్కరించబడిన కమల అన్న ఆ రాజపత్ని వేరే గత్యంతరం లేక తన కుమారునితో కలిసి అరణ్యాలకు వెళ్ళిపోవటానికి ప్రయాణమైంది.

తన కుమారుణ్ణి వీపుకు కట్టుకుని ఎంతో దుఃఖపడుతూ వెంట తీసుకుని వెళ్ళసాగింది. ఆకలిదప్పులకు కృశించి, ఒక గ్రామాన్నుంచి మరో గ్రామానికి భిక్షిస్తూ పోసాగింది. మార్గమధ్యంలో ఆమెవద్దనున్న విలువైన ఆభరణాలను, చీనిచీనాంబరాలను కూడా దొంగలపహరించారు. ప్రతి గ్రామంలోను తన కుమారుణ్ణి ఒక ఆలయంలో ఉంచి, తానూ మటుకూ భిక్షచేసి తీసుకువచ్చేది. ఒక్కోసారి కుమారుణ్ణి కూడా తనవెంటే భిక్షకు తీసుకెళ్ళేది ఇలా తన కుమారుడితో భిక్షాటనం కోసం తిరుగుతూండగా ఒకనాడు ఒకానొక గ్రామంలో ఒక గజానన భక్తుడైన శ్రోతీయ బ్రాహ్మణుడు తటస్థపడతాడు. అతి పవిత్రుడు, భగవదనుగ్రహాన్ని పూర్తిగా సిద్ధించుకున్న ఆ బ్రాహ్మణోత్తముని మీదనుంచి వీచినగాలి సోకగానే ఆ రాజపత్ని వెంటనున్న దక్షుడికి కన్నులకు దృష్టి, చెవులకు శబ్దగ్రాహకత్వము కలిగి, మాటకూడా – వచ్చింది. అతని శరీరానికి కూడా స్వస్థతకలిగి దివ్యసున్దరమైన దేహం కలవాడైనాడు.

అలా స్వస్థుడైన తన కుమారుడు మృదుమధురంగా మాట్లాడనారంభించటం చూసిన ఆమె సంతోషానికి మేరలేకపోయింది. ఎంతగానో ఎదురు చూచిన శుభఘడియ అలా ఎదురవటం ఆమెకు ఊహించని వరమే అయింది. “మణి మంత్రౌషధాలవల్ల, జపహోమాధికాలవల్ల, సిద్ధించని ఆరోగ్యం, కేవలం ఆ బ్రాహ్మణుని శరీరంపైనుండి వీచిన గాలి స్పృశించటంవల్లనే – సిద్ధించిందికదా! ఇట్టి తీవ్రదుష్కర్మను నశింపచేసిన ఈ మహనీయుని మహత్తును నేనేమని పొగడగలను?” అనుకుంటూ తన తనయుడిని అక్కున చేర్చుకొని తనివితీర ముద్దాడి ఎంతో ఆనందభరితురాలైంది.

ఆ మర్నాడు రోజూలాగే భిక్షాటనకని వెళ్ళిన కమల అన్న ఆ రాజపత్నికి ఎంతో సాదరమైన ఆహ్వానంతోపాటూ షడ్రసోపేతమైన విందు భోజనంకూడా ఒకరింట లభించింది. అది మొదలు, ప్రతీరోజు అలాగే నానారకములైన పిండివంటలతో ఆ తల్లికొడుకులకు ఆ ఊరిలోవారు ఆదరణ పూర్వకంగా ఆహారమునిచ్చేవారు. ఇలా కొన్నాలు గడిచాక ఒక పురజనుడు దక్షుడి యొక్క పుట్టుపూర్వోత్తరాలగురించి ప్రశ్నించాడు. ఆ బాలకుడు ఇంటికివచ్చి తన తల్లినడిగి తన తండ్రి, నగరము మొదలైన వివరాలన్నీ తెలుసుకొని వెళ్లి తిరిగి పురజనులతో ఇలా అన్నాడు.

“కర్ణాటకదేశంలోని భానునగారానికి రాజైన వల్లభుడనేవాడు నాకు తండ్రి! క్షత్రియులము మేము! మహాబలపరాక్రమోపేతుడు, కీర్తిమంతుడు కూడా! కమల అన్న పేరుగల ఈమె నన్ను కన్నతల్లి! ఇక నా పేరు దక్షుడు. నేను పుట్టుకతోనే మూగ, చెవిటి, అంధత్వం మొదలైన వికారాలతో జన్మించాను. ఇక నాఈ శరీరం యావత్తూ వృణాళతాలూకు రాసిఓడుతూ, చీమునెత్తుర్లు కారుతూ, దుర్గంధపూరితంగా ఉండేది. నా తల్లి నన్ను పుట్టగానే ఏవగించుకున్నా – తండ్రి ఆమెకు నచ్చచెప్పి తాను పన్నెండు సంవత్సరాలకాలం నా ఆరోగ్యనిమిత్తం శతవిధాల ప్రయత్నించి, విఫలుడై, చివికి ఆగ్రహోదగ్రుడై మమ్మల్ని ఇద్దరినీ ‘ముఖము చూపించవద్దంటు’ పురంనుంచి వెళ్ళగొట్టాడు. అరణ్యాల లోను, గ్రామాలలోను అలమటిస్తూ మాకున్న సంపద యావత్తూ పోగొట్టుకొని, ఈ ఊరు చేరుకున్నాము. ఇక్కడికి రాగానే ఒకానొక మహా పురుషుని శరీరంపైనుండి వీచినగాలి సోకటంవల్ల నేను పరిపూర్ణ ఆరోగ్యవంతుడినైనాను! ఇలా ఈ దివ్యదేహం పొంది విరాజిల్లసాగాను.” ఈ విధంగా దక్షుని నోట ఆశ్చర్యకరమైన అతని యావద్వృతాంతమూ విని తమ యిళ్ళకు వెళ్ళిపోయారు.

ఆ తరువాత తల్లీకొడుకులిద్దరూ ఆ మహిమోపేతుడైన బ్రాహ్మణోత్తముని. ఆశ్రయించి శ్రీ గణేశ ఆరాధనా విధానమును ఉపదేశoగా పొందారు. అత్యంత శ్రద్ధాభక్తులతో వారిద్దరూ నిరాహారులై గణేశ అష్టాక్షరీ మంత్రాన్ని తదేక దీక్షతో అనుష్టించారు. శరీరం శల్యావశిష్టమైనా ఏమాత్రం సంశయం లేకుండా పాదనఖాంగుష్టమై జపించినవారి భక్తికి సంతుష్టుడైన గాజా ననుడు అనుగ్రహించి వారికి సాక్షాత్కరించాడు. 

కమలా దక్షులకు గజాననుడు సాక్షాత్కరించుట

ఆ గజాననుని మూర్తి దివ్యమంగళ స్వరూపుడై, పెద్ద శరీరముతోనూ ఏనుగుముఖాన్నీ ధరించి కోటిసూర్యులతో సమానమైన తేజస్సుతో ప్రకాశిస్తూ, ఎఱ్ఱటి వస్త్రమునిదాల్చి ఉన్నాడు. బంగారు భుజకీర్తులను, బాహుపురూలూ ధరించి, శిరస్సుపై రత్నమణిఖచితమైన కిరీటం ధగధగాయమానంగా, అలంకరించగా, తన ఒకపాదం సింహాసనం కింద వున్న పాదపీఠంపై జాపి మరో పాదాన్ని మోకాలుకు తాకించి ఏకదంతముతో బంగారు మొలత్రాటితోనూ, శేషుని తన ఉదరమునకు చుట్టుకొని, వ్రేళ్ళకు ఉంగరాలతో కరుణావృష్టిని కురిపించే నేత్రాలతో ప్రసన్నుడై దర్శనమిచ్చాడు.     

మళ్ళీ అంతలోనే తిరిగి బ్రాహ్మణరూపంలో కనబడ్డాడు. అప్పుడు ఆ బ్రాహ్మణశ్రేష్టుడు ఆ తల్లీకొడుకులను ఉద్దేశించి ఇలా పలికాడు.

“ మీ తపోనిష్ఠకు సంతసించాను! మీ మనోభీష్టం నేరవేర్చదలచాను! మీకు కావలసిన వరాలను నిస్సంకోచంగా కొరుకోండి!”

విశ్వామిత్రుడు:

“ఓ భీమరాజా! అలా ప్రత్యక్షమైన గజాననుని చరణాలకు సాష్టాంగనమస్కారంచేసి తల్లీ తనయలిద్దరూ ఇలా స్తుతించారు!”

దక్షుడు:

“ఓ బ్రాహ్మణోత్తమా! మాపూర్వ పుణ్యము ఈనాటికి ఫలించింది! రెండురకాలుగాగల నీ మహత్తర స్వరూపాన్ని (వైనాయకమును, బ్రాహ్మణ రూపాన్నీ) చూడటంచేత నా జన్మ సఫలమయింది!

ఓదేవా! నీవు కారణములకే కారణమైనవాడివి! వేదాలకు సైతం కారణభూతుడైనవాడివి! సర్వయోగిశ్రేష్టులకు జ్ఞానంతో చేరవల్సిని గమ్యమే నీవు! అంతర్ బహిర్విశ్వం యావత్తుకూ సాక్షీభూతుడవు! సాకారము నిరాకారము నీరెండు రూపాలే! త్రిమూర్త్యాత్మకుడవు! సృష్టికర్తవైన బ్రహ్మవు, పాలనచేసే విష్ణుస్వరూపుడవూ, ప్రళయసంహారకుడవైన రుద్రా మూర్తివీ నీవే!

పంచభూతాలైన భూమి, జలము, అగ్ని, వాయువూ, ఆకాశమూ ఈ ఐదు నీలోనివే! సూర్యచంద్రులూ, నీ స్వరూపమే! జ్ఞానవిజ్ఞాన సంపన్నుడవు, కాల స్వరూపుడవూ! ఇంద్రియాధిష్టాన దేవతలంతా నీ అంశలే! సకల శాస్త్రములు, వేదములు, పురాణముల సారమూ నీవే! చతుషష్టి కళలూ నీ రూపమే! సకల లోకాలోనూ నీవుకానిదేదిలేదు! అన్ని పుణ్యక్షేత్రాలలో తీర్ధయాత్రా ఫలమెంతటిదో, నీ పాదములయందు భక్తిచేయ్యటం అటువంటి దివ్యఫలాన్నిస్తుంది. అనాదివీ, విభజించబడని వాడివీ ప్రమాణాలన్నిటికీ అతీతుడవు కేవలం జ్ఞానంవల్లనే గోచరమయ్యే వాడివి నీవే! చతుర్విధ జీవరాసులుగానూ ఉన్నది నీవే! నీ అనుగ్రహానికి ప్రాప్యులైన వారికి ఇక అసాధ్య మేదిలేదు! అంటూ తనను స్తుతించిన దక్షుడితో వినాయకుడిలా అన్నాడు.

 వినాయకుడు:

“ఓ బాలకా! నీ ఈ స్తుతికి ఏంతో ప్రసన్నుడినైనాను! నీ కోరిక ఎత్తిదైనా సరే తీర్చగలను! ఐనా నీకిప్పుడు వరం మాత్రం నేను యివ్వను! నీకు అలా వరాన్నిస్తే నాభక్తుని (నీకు ఈ రూపం ఎవరి స్పర్శవాళ్ళ లభించిందో) చిన్నబుచ్చినట్లవుతుంది! ఆ నా ప్రియభక్తునిపేరు ముద్గలుడు. నీవు అతన్ని స్మరించిన వెంటనే నీ ఎదుట నిలిచి నీ కోరికలన్నీ నెరవేర్చగలడు! నీకు శుభమౌగాక!” అంటూ అంతర్ధానం చెందాడు.

పేదకు దొరికిన పెన్నిధిలా క్షణంలో సాక్షాత్కరించి, మరుక్షణమే అంతర్ధానమైన తన తపఃఫలం కన్నులకు దూరమౌటంతో నిర్ఘాంతపోయిన దక్షుడు మూర్ఛిల్లాడు. ఆతరువాత కొంతసేపటికి తేరుకుని ‘వినాయకుడేటుపోయాడా?’ అంటూ పరిపరివిధాల చింతించసాగాడు.

Chapter 20 complete