గణేశ పురాణము - ఉపాసనా ఖండము
62 – దూర్వోపాఖ్యానం
ఆ తరువాత పై కదాకధనాన్ని బ్రహ్మ ముఖకమలమ్నుంచి మకరందంలా గ్రోలి ఆస్వాదిస్తూన్న కృతవీర్యుని తండ్రి – ఆ చాతురాస్యునితో యిలాఅన్నాడు.
‘ఓ చతురాననా! కృష్ణపక్ష చతుర్ధినాడు చంద్రోదయ సమయంలో గజాననుని ఆరాధించి ప్రసాదమును భుజించుటవలన అనంతఫలం కల్గుతుందనీ,అది సకలార్ధప్రదమనీ చెప్పావు! ఐతే ఆనాడు గజాననునికి ప్రీతిపాత్రమైన దూర్వాoకుర సమర్పణవల్ల ఎలాంటి ఫలితం కల్గుతుందో అదిగూడా దయతో వివరించు! గణనాధునికి దూర్వాంకురము ఎందువల్ల అత్యంత ప్రీతిపాత్రమైనది? ఆ వివరం కరుణతో తెలియజేయి!”
జిజ్ఞాసువైన అతడి మాటలకు బ్రహ్మ ఎంతో సంతసించి యిలా మధురంగా జవాబిచ్చాడు.
బ్రహ్మ:
‘ఓరాజా! దూర్వాంకురం గణేశునికి ఏల ప్రియమో, అలా సమర్పిస్తే కలిగే ఫలమేమిటో చెబుతాను విను! పూర్వం దక్షిణదేశంలో ‘అవంతి’ అనుపేరుగల నగరం ఉండేది! సులభుడనే పేరుగల రాజు ఆనగరాన్ని పరిపాలించేవాడు! అమిత పరాక్రమోపేతుడూ, సకల సద్గుణసంపన్నుడూయైన ఆ రాజు సకలశాస్త్రాలకు నిధివంటివాడై వేదార్ధమంతటినీ తెలుసుకున్నవాడై, ప్రజానురంజకంగా పాలించేవాడు! ఈతడు గజాననుని పట్ల అమితమైన భక్తితో అనునిత్యం పూజాదికాలు సల్పేవాడు. సుముద్ర అన్నపేరుగల ఆ రాజు పత్ని అత్యంత సౌందర్యంతోపాటూ రాజుకు అన్నివిధాలా తగినదై, పతివ్రతాధర్మం నెఱపుతూ దేవ, బ్రాహ్మణ, అతిధిపూజా తత్త్పరురాలై ఉండేది!
ఒకనాడు ఆ రాజదంపతులిరువురూ పురాణశ్రవణాసక్తులై తమ మందిరములో కూర్చునివుండగా అక్కడికి మధుసూదనుడనే పేరుగల బ్రాహ్మణుడు వచ్చాడు! ఆ బ్రాహ్మణుడు నిరంతర దైవచింతా పరాయణుడూ, దరిద్రుడూ కావటంచేత చిరిగిన వస్త్రం ధరించి, బట్ట ధరించినా ధరించనట్లు ఉన్నాడు. అట్టి బ్రాహ్మణుడు భిక్షార్ధమై వచ్చివుండగా, రాజు అతనికి నమస్కరించి. గట్టిగా పరిహసించాడు. దానికా బ్రాహ్మణుడు కోపంతో మండిపడి ‘ఓరాజా! మదాంధుడవై, అర్ధినైవచ్చిన నన్నుచూసి పరిహసించావు గనుక ఎల్లప్పుడూ నాగలిచాలుకు కట్టబడ్డ వృశాభానివై భూమి దున్నుతూ దుఃఖిస్తూoదువుగాక!’ అంటూ శపించాడు.
ఆమాటలకు ప్రక్కనేఉన్న రాజపత్నియైన సుముద్ర క్రోధపరవశురాలై ‘ఓయీ! బ్రాహ్మణోత్తమా! నీవు అవివేకంతో రాజనికూడా చూడకుండా నాభర్తను శపించావు గనుక నీవుకూడా ఉచితానుచితాలను మరచి సర్వమూ భక్షించే కంచరగాడిదవై జన్మింతువుగాక!’ అంటూ ప్రతిశాపమిచ్చింది. అప్పుడా మధుసూధనుడా మాటలు విని యిలామండిపడ్డాడు:
మధుసూదనుడు:(పేదబ్రహ్మ:ణుడు:)
‘ఓసీ! స్త్రీవైన నీవు శపింపబడరానిదానవైనా ఛoడాలురాలవై, దారిద్ర్యబాధతో అభక్ష్యములను భక్షిస్తూ దౌర్భాగ్యురాలవవుదువుగాక!’ అంటూ ఆ సుముద్ర అనే రాజపత్నికి కూడా శాపమిచ్చాడు.
ఇలా ఒకరికొకరు శాపప్రతిశాపాలను యిచ్చుకుని దుర్లభమైనట్టి మానవదేహాలను త్యజించివైచారు. సులభుడు తక్షణమే నాగలిదున్నుఎద్దుగా మారాడు. విప్రశాపంచేత వానికి క్షణకాలమైనా విశ్రాoతిలేక దుఃఖించసాగాడు. ఇక మధుసూదనుడు కంచరగాడిదయై పుట్టాడు. రాజపత్నియైన సుముద్ర దుష్టురాలూ, ప్రాణిహింసకురాలై చండాలస్త్రీయై దరిద్రం ఓలలాడేచోట జన్మించింది.
ఇలాఉండగా చండాలస్త్రీయైన ఆమె ఒకనాడు తానుండే గ్రామానికి దక్షిణదిక్కుగా సంచారంచేస్తూ అక్కడ ఉన్న ఒక అద్భుతమైన గణేశుని ఆలయాన్ని చూసింది. ఆ ప్రదేశము అనేకరకాలైన వృక్షాలతోనూ, లతలతోనూ రకరకాల పక్షిగణములచేతా విరాజితయై ఉన్నది. ఆ గణేశ మందిరంలోకి అనేకమంది మహామహులైన యోగిపుoగవులు నియమబద్ధులై గణేశమంత్రానుష్టానానికై విచ్చేసేవారు. ఇలాఉండగా ఒకానొకప్పుడు భాద్రపద శుక్లచతుర్ధి సంప్రాప్తమైంది! ఆ రోజు ప్రతి యింటిలోనూ గణేశమందిరాలను నిర్మించి అత్యంత శ్రద్ధాభక్తులతో ప్రజలంతా గనేశుని అర్చించసాగారు. ఆ రోజు ప్రళయకాలంలోవలే భీకరమైన వాన కురియసాగింది! ఆ వర్షపుధాటికి తట్టుకోలేని ఆ ఛoడాలి ఏయింటిలోకి వెళ్ళినా ఆ యింట్లోవాళ్ళు తరిమివేయసాగారు. చివరికి చేసేదిలేక చేతిలో అగ్గిపుచ్చుకొని ఆమె ఆ గణేశ దేవాలయం చెంతకు చేరుకున్నది! అక్కడివారు కూడా ఆమెను తరిమికొట్టబోగా కొందరు సాధుపుంగవులు అక్కడివారిని నివారించారు. చలిభాదకోర్వలేక గడ్డితో చలిమంటవేసుకొని ఆమె చలి కాచుకోనసాగింది! అలా చేస్తూండగా ఒక దూర్వాంకురము గాలికెగిరి గజాననుని మూర్తిపై పడింది! ఆ కంచరగాడిదకూడా వర్షపుబాధకోర్వలేక గుడిని చేరుకున్నది. వృషభముకూడా నాగాలినుండి విడివడి దైవవశాత్తూ గుడికి చేరుకున్నది.ఆ గాడిద,వృషభమూ కూడా ఆ ఛoడాలి మంట వేసుకోవడానికి తెచ్చుకున్న గరికను తినసాగాయి! ఇంతలో జనులంతా విశ్రాంతిగా పడుకున్నాక వాటిమధ్య పోరు మొదలైంది! అలా పెనుగులాడుతూన్న వాటి నోటినుండికూడా దూర్వాంకురములు ఎగిరి గజాననుని మూర్తిపై పడినవి! అందుచేత ఆ గజాననుడు సంతుష్టుడైనాడు. అప్పుడా ఛoడాలి దేవతాసన్నిధిన పోట్లాడుతున్న ఆ రెండు జంతువులనూ తానొక దండాన్ని చేతబూని చావమోదింది! అక్కడఉన్న ప్రసాదాన్ని తాను పూర్తిగా తినేసింది.
ఆ పశువుల డెక్కల చప్పుళ్ళు విన్నవారు నిద్రనుంచి మేల్కొని పిడిగుద్దులతోనూ, మోచేతిపోట్లతోనూ వాటిని వెలుపలకు తరిమారు. ఆ ఛoడాలినికూడా రాళ్ళతోకొట్టి తరిమారు!
అక్కడి అర్చకులు ఛoడాలియొక్క, గాడిదయొక్క, ఎద్దుయొక్క స్పర్శవల్ల దేవతామూర్తి అపవిత్రమైందని అందువల్ల తిరిగి మంత్రోదకంతో సంప్రోక్షణచేసి, నానావిధ పూజాద్రవ్యాలతో ఎంతో భక్తిగా ఆ గణేశునిమూర్తిని ఆరాధించారు.
ఆ తరువాత అక్కడి ప్రజలు ఆ ఛoడాలిస్త్రీని, కంచరగాడిదను, ఎద్దునూ గుడిప్రాకారం తలుపులు మూసేసి కర్రలతో, మోచేతిపోట్లతో తాపులతో చావమోదారు. తలుపులు మూసివుండటంచేత బైటకు వెళ్ళేదారిలేక పెద్దగా అరుస్తూ, అవి గుడిచుట్టూ పరుగేత్తసాగాయి.
వాటి ఆక్రందనలకు దీనవనుడైన గజాననుడు కరుణించాడు. ‘వీటి ప్రదక్షిణాదికములచేత, అరపులచేత మరలా పూజించబడ్డాను! ఇంతకుముందే వీటిచే సమర్పితములైన దూర్వాoకురములచేత అర్చించబడ్డాను! ఈ ముగ్గురు నాకత్యంత ప్రీతిపాత్రమైన భాద్రపద శుక్లచతుర్ధినాడు నాకు ప్రియమైన దూర్వాంకురాలను నాకు సమర్పించారు. ఎట్టివారైనప్పటికీ ఈరకంగా నా అనుగ్రహానికి పాత్రులైనారు! కనుక వీరికి ముక్తిని అనుగ్రహించావలసిందే!’ అనుకోని తన వినాయకలోకాన్నుంచి దివ్యవిమానాన్ని తెప్పించాడు. అప్పుడు ఆ మువ్వురూ దివ్యమైన దేహాలను పొందినవారై గణేశలోకానికి వెళ్ళారు.
ఈ మహోత్తమమైన దివ్యలీలను చూస్తున్న యోగులు మొదలైన అనుష్టానపరులు కూడా ఆశ్చర్యచకితులై ‘ఎట్టి పూర్వపుణ్యంచేత వీరికీ ఉత్తమగతి సంప్రాప్తమైంది?’ అంటూ విస్తుపోయారు. అందులోని కొందరైతే తమ అనుష్టానాన్ని వదలి ఎలుగెత్తి ‘ఓ దేవతలారా! ఎంతోకాలాన్నుంచి అనుష్టానం చేస్తున్నా మాకెవరికీ లభించని దివ్యానుగ్రహం వీరికెలా ఇంతత్వరగా ప్రాప్తమైంది? అదేమిటో మాకూ సెలవియ్యండి. విరక్తులమై, నిరాహారులమై అనుష్టానమోనరిస్తున్న మాకు గణేశానుగ్రహం ఎలా సంప్రాప్తమౌతుందో దయచేసి చెప్పండి!’ అంటూ ఆ గణేశ దూతలను అర్ధించారు.
Chapter 62 complete
